(చట్టానికి న్యాయానికి రాజ్యాంగం కాళ్ళుచేతులు ఇచ్చి అన్యాయాన్ని అణచివేతని రూపుమాపుతదనే వాస్తవo ఆచరణలో విఫలమవుతున్నప్పుడు జరిగిన అన్యాయాన్ని,దోపిడిని,విధి తలరాత అనుకోని దళితబహుజనులు భావించుకుంటున్న సందర్భంలో ..ఈ ఘటన గండికోట రహాస్యంలా మాఊరి నేలలో కలిసిపోయింది)
కొన్ని,కొన్నింటిని కొంతకొంతగా,కొత్తగా కొత్తగా,సరికొత్తగా కప్పువిప్పి నొక్కిచెప్తూ నొప్పిరప్పించి హృదయ కొవ్వొత్తి మీద వెలిగివెలిగి కరిగికరిగి ముద్దయి గడ్డకడతాయి.మబ్బులు ఆకాశనదిన మునకవేస్తూ మేఘఒడ్డున తేలియాడుతున్న సమయాసమయానా,వేపచెట్లు వొళ్ళు విరుచుకొని కొంగల రెక్కలచాటున నిశ్శబ్దంగా బతుకు కథల్ని వింటున్న కాలానా,రోడ్లకి వీపంతా పుండ్లుపడి ఈగలు వాళుతున్న సహజ దృశ్య కరుణా సందర్భాన..యడ్లబండ్ల సాక్షిగా,వరిగడ్డి వామిసాక్షిగా ఇది జీవితం చెప్పిన గాధ.ముత్యాలు జీవితం.ముత్యాలు బతుకుతోముడివేసుకుపోయిన సుబ్బాలు జీవితం.
“తెల్లతాచు నల్లనాగు,పింజరగొడ్డు ఏదయినా పట్టేత్తనండి”ఈ బూరుంది చూస్నారు దీని శబ్దము పాము చెవిన పడిందనుకోండి ఆరు మూరల పామైనా పుట్లోంచి ఇట్టే వొచ్చేద్ధి.మాయoతా ఈ బుర్రలోనే ఉంది.బుర్ర శబదం పాముకి గిట్టదు.పాలందని పిల్లోడిలా ఎర్రెక్కిపొద్ధి.పాములోడ్ని బాబయ్య పాము మనస్తోత్వం ఇట్ఠానే పట్టుకుంటా..యాబయెల్ల అనుభవమొ”.అంటాడు నాటు సారా నాలుగిద్దెలు కొట్టి సొరుక్కుంటూ ఇంటికిపోయే పాముల ముత్యాలు.
సన్నగా నల్లతాచుకు మాదిరి పొడవుగా ఉండేవాడు ముత్యాలు తెల్లపంచె కట్టేవోడు.వానాకాలంలో ఎదిగిన ఈత చెట్టుకుమల్లే గుబురుగా ఒంకిడీలు తిరిగిన మీసాలు.నెత్తికి ఎర్రగుడ్డ.చేతిలో పొడవాటి ముళ్ళుగర్ర.భుజానికి వ్రేలాడిన తోలు సంచిలో పాముల ముందు ఊదే నాగశ్వర బుర్ర.ఇదతని శారీరక భౌగోళక ఆకారం.
ఇద్దరు కొడుకులు.ఒక కూతురు.జయ్యిన దూసుకుపోయే పాదాలు.తాటిబద్దల్లాంటి చేతులు.కుబుసం విడిచిన తాచు పోకడలాంటి నడక.దట్టమైన పచ్చిక బయళ్లలోంచి అడవిపందిని పట్టుకోడానికి చూసే వేటకుక్క కళ్లలాంటి చూపు.పుట్టను చూసి అందులో పాముందో లేదో చెప్పేయగల దృష్టి చిత్తoగల వృత్తినైపుణ్యం.పైగా బుడబుక్కలోడు.
ఒకప్పుడు అతను ఒట్టి ముత్యాలు.అతని తండ్రి అతనికి పాముల్ని పట్టడాన్ని కులవృతిగా నేర్పినప్పటినుండి అతను పాముల ముత్యాలు అయ్యాడు.పాములు పట్టడంతోపాటు అతనికి పందుల సంత ఉండేది.గూచ్..గూచ్.. మంటూ..అంగిలితో ద్వని పలికిస్తూ పందుల్ని కాయటం అతను చేసే మరోపని.ఈత సువ్వలు తెచ్చి గంపలు తట్టలు చాట్లు తడికెలు అల్లేవాడు.ఇంటింటికి తిరిగి వాటిని అమ్మకొచ్చేవాడు.
ఇదికాక ఊల్లో ఎవరిని పురుగు ముట్టినా మంత్రం వేసేవూడు.తేలుకుట్టినా పాము కరిసినా..అడవి పందులవేటలో పంది కొట్టినా ఆకుతోనో వేరుతోనో మందుని ఉండల్లా తయారుచేసి గొంతులో వేసేవాడు.”ముత్యాలుగా మంత్రం పెట్రా”..అనేవోరు అందరూ”.సరే బాబయ్య..”అనేవాడు.మంత్రం ఫలిస్తే “గుక్కెడు సుక్క పోపియ్యి దొర” అని అడుక్కునేవాడు.జోలెపట్టి బువ్వపెట్టమ్మా..అని యాచించేవాడు.బుడబుక్కలోడా?పందులు కాసే నాకోడకా?అప్పుడప్పుడూ ముత్యాల్ని ఇలా పిలిచేవారు కొందరు.
ఉడతల్ని పట్టొకొచ్చి తినేవాడు.పంటలు దున్నేటప్పుడు పొలాలమీద పురుగులకోసం వాలే కొంగల్ని కొట్టుకొచ్చి కాల్చుకు తినేవాడు.ఉడుముల్ని తెచ్చుకొని ఇంటిల్లపాదితో సంబరం కట్టేవాడు.ఏమీ లేకపోతే గాలం పట్టుకోపోయి నాలుగిన్ని చాపలు పట్టుకొచ్చి పులుసు పెట్టుకుతింటాడు.నీసు లేకుండా బువ్వ ముట్టడు.చిన్న గుడిసె.ఒక ఈతాకు చాప.గుక్కెడు సారా.నాలుగు ముక్కల మాంసం.ఇది ముత్యాలు జీవితం.
ముత్యాలు కూతురి పేరు సుబ్బాలు.దొండపండులాగుండేది.ఉదయంపూట ఎండలా లేతగా తళుక్కుమనేది కళ్ళకి.తెలియని వాళ్ళు బుడబుక్కల పిల్లని అనుకోరు.బేపనోళ్ళ పిల్ల మాదిరి కుదురుగా ఉండేది.తండ్రి ముత్యాలు అన్నలు అందుబాటులో లేనప్పుడు సుబ్బాలు పందులుకాసేది.చిన్న చిన్న పంది పిల్లల్ని అప్పుడప్పుడు సంకనేసుకునేది.ముత్యాలు ఊరి చివర రెండు గుడిసెలు వేసుకున్నాడు.ఒకటి కుటుంబానికి. ఇంకొకటి పందులకి.గుడిసెలకు కొద్ధి దూరంలో ఒక కోమటి పెంకుల భవంతి.కోమటి భవంతికి అనుకోని కొన్ని కమ్మ కుటుంబాలు.వాటి తరువాత రెడ్డోళ్ల ఇళ్లు.ముత్యాలు గుడిసెలు చుట్టురా బాగా బలిసిన చింతచెట్లు.గుడిసెలకు అనుకోని చిన్న కాలువ.ఎంగిలి కంచాలు కడిగిన నీళ్ళని ఆ కాలువలో పోస్తారు.
గుడిసెకు ఇంకో పక్క లోతైన పాడుబడ్డ బావి.బావి లోపలినుండి గోడలమీదుగా అల్లుకొని ఉన్న పచ్చని తీగ.తీగమీద కనకాంబరం పువ్వులలాంటి ఎర్రనిపూలు.పచ్చని కాయలు.వాకిలినిండా పందుల పాదముద్రలు.కంపకి ఆనుకొని ఒకతొట్టి.నడవడానికి తల్లో పాపిడ లాంటి చిన్న దారి తప్ప గుడిసె చుట్టూ సహజంగా పెరిగిన మొక్కలు. ప్రకృతి పుట్టించే కాంతితప్ప,కృత్రిమoగా పెట్టిన విద్యుత్తు వెలుగులేని గుడిసెలు.పందుల శబ్ధాలు చేస్తేతప్ప అక్కడ గుడిసెలున్నాయని తెలియదు.ముత్యాలు రాత్రిపూట పందుల శబ్దానికి అప్పుడప్పుడు నిద్రలేచి చుట్టోకటి పీల్చి గుడిసెలో తవుడు నూకలు పెట్టి పందుల్ని గద్దించి వెళ్లి పడుకునేవాడు
గుడిసెకి పది పర్లాoగుల దూరంలో పీతిరిడొంక.దానికి అనుకోని ఒక చిన్న వంతెన.ఓరోజు ముత్యాలు అడవిపందుల వేటకు పోయాడు.ముత్యాలు భార్య తిరిపి చింతచెట్టు ఎక్కి చిగురుకొస్తుంది.కొడుకులిద్దరు కూలి పనికి పోయారు.
సుబ్బాలు పందుల్ని తొలుకొని పీతిరి డొంకకు వాటిని కాయడానికి వొచ్చింది.పందులు నేలకేసి వాసనచుస్తూ పోతున్నాయి.ఆకలి మీదున్న పందులు డొంక లోపలికి ఆవురావురుమంటూ పోతున్నాయి. గూచ్..గూచ్..అంటూ కంపమీద కర్రతో కొట్టుకుంటూ డొంకకు రెండుపక్కల దట్టంగా పెరిగున్న సర్కారి పొదల్లోకి పోతుంది సుబ్బాలు.నాలుగయిదు పందులు ఒకటిరెండు పంది పిల్లలు తప్ప మిగిలినవన్నీ ఏటేటుపోయాయో తెలియలేదు సుబ్బాలుకి.కనిపించిన పందులు మాత్రం డొంకలో అప్పుడే ఏరిగిన తాజా పీతిరిని తింటూ కనిపిస్తున్నాయి.
డొంకకి అటుపక్కచింత చెట్టు కనిపిస్తే అటేపుగా వెళ్లి పందుల్ని అదిలిస్తూ ఆచింత చెట్టుకిందున్న రాయిమీద కూర్చుంది.కొద్దిసేపటి తరువాత సుబ్బాలుకి పందుల ఆచూకీ తెలియలేదు.పొడవుగా ఉన్న డొంక లోపలికి పందులు పోతాయేమోనని చెట్టుకింద నుంచిలేచి డొంకలోనికి గుచ్..గుచ్..అనుకుంటూ లోపలికి వొచ్చింది.కొద్దిదూరాన కొన్ని పందులు కనిపిస్తే..వాటి దగ్గరికి వొచ్చింది సుబ్బాలు.పందుల్ని అదిలించుకుంటూ వాటికి చేరువయింది.డొంక నిండా కొన్ని పచ్చిపచ్చి పీతిరి కుప్పలు.మరికొన్ని ఎండి పొడిగా మారుతున్న కుప్పలు.వాటిని తొక్కకుండా జాగర్తగా అడుగులేస్తూ అరిచినా వినబడనoత లోనికి పోయింది సుబ్బాలు.డొంకలో దొడ్డికి కూర్చుoటున్న కమ్మ యువకుడు సుబ్బాల్ని చూసి ఆదరబాధరగా ముడ్డి కడుక్కోని చెంబు పడేసి తనని ఎవరైన చూసారోలేదో అని చుట్టూ చూసి పక్కనే ఉన్న పొదచాటున దాక్కున్నాడు.పందులు ఇంకా లోనికి పోతున్నాయి.వెంబడిస్తూ సుబ్బాలు కూడా లోపలికి పోతుంది.కమ్మ కుర్రాడు దాక్కున్న పొదకి సమీపంగా వొచ్చిన సుబ్బాలకి అడ్డo తిరిగాడు కుర్రాడు.ఉలిక్కిపడి వెనక్కి అడుగేసింది సుబ్బాలు.పందులకోసం అటూఇటూ చూస్తూ “అబ్బాయి గారు పందులిటు వొచ్చాయా” అడిగింది సుబ్బాలు.”రాలేదు సుబ్బే”..అన్నాడు కుర్రాడు దొంగ చూపులాంటి చూపు చూసి.
“స్సర్లే.. బాబాయ్య”అని చేతిలో కర్రని త్రిప్పుకుంటూ ఒకడుగు ముందుకు వేసింది సుబ్బాలు. దొండపండులా ఉండే సుబ్బాల్ని చూసి ఉండబట్టలేక “సుబ్బాలు”అని పిలిచి సుబ్బాలుకి సమీపంగా వొచ్చాడు కుర్రాడు.”ఏంటి బాబుగారు”అన్నది సుబ్బాలు.కిందకి పైకి చూసి అమాంతం భుజాలమీద చెయ్యేసాడు కుర్రాడు.”వదలండి బాబుగారు.వదలండి.పందులు కాసేదాన్ని. పితిరి కంపు కొట్టే దాన్ని.బుడబుక్కల పిల్లని”.విడిపించుకు చూస్తుంది సుబ్బాలు.కుర్రాడు బలాన్ని పెంచాడు.సుబ్బాలు ప్రాధేయపడింది వదలండి”బాబుగారు మా అయ్యా వొచ్చే పొద్దు వొస్తుంది.పందులెటో పోయాయి.
పందుల్ని తొలుకొనిపోకపోతే మాఅయ్య ముత్యాలు కోపంజేస్తాడు.పందులేటేల్లాయో ఏమో..గుడిసెకు పోవాలి”అడుక్కుంటుంది సుబ్బాలు.కమ్మ కుర్రాడు వదల్లేదు.సుబ్బాలు వదిలించుకోలేకపోయిoది.సుబ్బాలు అరుపుకి ఒకట్రెండు పందిపిల్లలు వెనక్కి తిరిగి చూశాయి.నిశ్శబ్దంగా డొంక.డొంకలో ఎవరూ లేరు.కుర్రాడు వెళ్ళిపోయాడు.సుబ్బాలు పందుల్ని తొలుకొని గుడిసెకు వొచ్చింది.ఒంటినిండా మట్టి.చేతికున్న గాజులు చిట్లాయి.మూతులకి చుట్టూ అంటుకున్న పియ్యితో పందులు గుడిసెలోకి చేరాయి.డొంకలో పియ్యిని హృదయానికి రాసుకొని ఇంటికి పోయాడు కుర్రాడు
అమ్మ తిరిపి చింతచిగురు పులుసు కంచంలోవేసి బువ్వపెట్టింది సుబ్బాలుకి.సుబ్బాలు తినలేదు.తినబుద్దికాలేదు.ముత్యాలు మధ్యానానికి వేటలో దొరికిన అడవి పందిలోని వాటాను పట్టొకొచ్చాడు.ఈత సువ్వలు నరికే పొడవాటి కొడవలితెచ్చి అడవి పంది మాంసాన్ని ముక్కలు కోస్తున్నాడు ముత్యాలు గుడిసె ముందు కూర్చొని”సుబ్బాలు ఇట్రాఏ..గాబులో నీళ్లు కొన్ని తీసుకురా”.అన్నాడు ముత్యాలు.గుడిసెలోసోయిలేకుండా నిద్రపోతున్న సుబ్బాలుకి ఇనిపియ్యలేదు.”సుబ్బాలుకి నిద్ర ఎక్కినట్టుంది ఎటైనా ఇవ్వల్న అన్నది తిరిపి గుడిసె లోనుండి”
“డబ్బా నీళ్లు అందుకురా మాసం కడగాలే “అన్నాడు ముత్యాలు.తిరిపి నీళ్లు తెచ్చి మాసం మీద పోసి కడుగుతుంది.”సుబ్బాలుకి ఏమైనాది.ఈయేలప్పుడు ఎప్పుడూ నిద్రపోదే..” అన్నాడు ముత్యాలు.’ఏమో అబ్బి పందుల్ని డొంక నుండి తోలుకొచ్చినప్పటినుండి ఇట్లానే నలతగా ఉన్నాది. ఏమైనాదో”‘సరీ.. పడుకోనీ..నువ్వు కూరజేయే.రాత్రికి బువ్వతింటాదిలే”అంజెప్పి కొట్టుకుపోయాడు ముత్యాలు.
చిగురు వేసి పందికూర వొండింది తిరిపి.నీళ్లొసుకొని వొచ్చింది సుబ్బాలు.నీరసంగా వుంది.సుక్కేసుకొచ్చినాడు ముత్యాలు.బువ్వతిని చాపలేసుకున్నారు.ఈతాకు చాపమీద సుబ్బాల్ని వేసుకుపడుకుంది తిరిపి.కొద్దీ యడంగా ముత్యాలు.ముత్యాలికి ఆనుకొని కొడుకులిద్దరు నిద్రపోతున్నారు.మధ్యలో కిరసనాయిల్ దీపం వొనుకుతుంది అటిటు.నీడలు లేని దేహాలు.నిద్రలో మునిగాయి.సుబ్బాలు నిద్రలేచింది.అమ్మాఅయ్య లేస్తారని సప్పుడు కాకుండా లేచింది.నిద్రపోలేదు సుబ్బాలు.అమ్మ అయ్యా అన్నలు నిద్రపోయేదాకా కళ్ళుమూసుకుంది.గుడిసెకున్న మొత్తకి అడ్డుపెట్టి ఉన్న తాటాకు తడెకని శబ్దం రాకుండా తీసి గుడిసె బయటికి వొచ్చింది సుబ్బాలు.తీసిన తడికెని మళ్ళి ఏ ధ్వని పుట్టకుండా దగ్గరికి వేసింది.వేస్తూ వేస్తూ బుడ్డి వెలుతురులో కనిపిస్తున్న నీడల్లాంటి అమ్మ అయ్యని అన్నల్ని చూసి గూడేసేకి దూరంగా వొచ్చింది.ఎలాబడితే అలా పెరిగిన పిచ్చిపిచ్చి ముక్కల్ని తొక్కుంటూ బావివేపు నడిచింది.సన్నగా కురుస్తున్న వెలుగులోంచి బావివేపు చూసింది.లోతైన బావి.తీగలు పెరిగిన బావి.బావి ఒడ్డుమీద కాసేపు నిలబడి గూడేసేవేపు చూసింది.ఏ అలికిడిలేదు.పీతిరిడొంకలో జరిగిన సంఘటన కళ్ళముందు కదిలింది.గట్టిగా కళ్ళు మూసుకొని పాడుపడ్డ బావిలో దూకింది సుబ్బాలు.గుడిసెలో పందులు ఒక్కసారిగా నిద్రలేచి అరుస్తున్నాయి.టైమ్ మూడుకి నాలుగుకి..మద్య లో ఉంది.పందుల అరుపుకి ముత్యాలు నిద్రకళ్ళతో లేచి పందులకి తవుడు నూకలు వేసి పడుకున్నాడు.తవుడు నూకలు వేసినా పందుల అరుపు ఆగలేదు.ముత్యాలు మళ్ళీ నిద్రలేచి బుడ్డితో పందులు గుడిసె లోపల తొంగి చూసాడు.గుడిసె లోపల పురుగు బుట్రా.. ఏమీ లేదని నిర్ధారించుకొని తిరిగొచ్చి పడుకున్నాడు.
తెల్లారింది.పందుల అరుపు తగ్గలేదు.తిరిపి పక్కన సుబ్బాలు లేదు.వెతకడం మొదలయ్యింది.నలుగురు నాలుగుదిక్కులూ వెతికారు.సుబ్బాలు దొరకలేదు.కనిపించలేదుఏడుపు.ముత్యాల కళ్ళలో సుడితిరుగుతున్న కన్నీటి పాయలు.పాడుబడ్డ బావికాడికి వొచ్చాడు ముత్యాలు.భయంభయంగా భావిలోపలికి తొంగి చూసాడు.పచ్చని ఆకులు మొలిచిన తీగల మద్యన నిర్జీవంగా పడున్న సుబ్బాల్ని చూసి కళ్ళురాలి గుండెచిట్లింది.మోకులు వేసుకొని బావిలోకి దిగి అన్నలు సుబ్బాలు దేహాన్ని ఒడ్డుకు తెచ్చారు.కొన్నితీగలు సుబ్బాలు దేహానికి చుట్టుకున్నాయి.కొన్ని ఎర్రఎర్రని పూలు సుబ్బాలు ఒంటికి అంటుకున్నాయి.ఊరికి తెలిసింది.జనం గుమ్మిగూడారు.పాపం అన్నారు.మంచిపిల్ల అని ఏడ్చారు.ముత్యాలు ముత్యం అన్నారు.దహనాలు అయ్యాయి.పాడుబడ్డ బావికి వేలాడుతున్న ఎర్రని పువ్వులాంటి లేత సుబ్బాలుని మట్టిజేసీ సమాధి మీద బంతిపువ్వు పెట్టి గొంతు పగిలేలా ఏడ్చాడు ముత్యాలు.
అయ్యో..పట్టీలు ఎప్పుడు తెత్తవే?”అన్న సుబ్బాలు మాట ముత్యాలకి గుర్తొచ్చి ఏడ్చాడు.సుబ్బాలు ఎందుకు బావిలో దూకిందో ఊరిలో ఎవరికి తెలియదు.సుబ్బాలు బావిలో దూకడానికి కారకుడైన కమ్మ కుర్రాడు ప్రతిరోజు పీతిరి డొంకకి పోతూనే ఉన్నాడు.డొంక అలానే ఉంది.వంతెన అలానే ఉంది.మనుషులు అలానే ఉన్నారు.ముత్యాలు మాత్రం సుబ్బాల్ని తలుచుకుని కుంగిపోతూనే ఉన్నాడు.
తిరిపి చెప్పింది ముత్యాలుకి సుబ్బాలుకి జరిగింది.పాములు పట్టి పొట్టనింపుకునే ముత్యాలుకి అన్యాయం కుడితే న్యాయం అనేమందు ఒకటి ఉందని తెలియని ముత్యాలు ఒకానొక రోజు ఉదయాన పందుల్ని పీతిరి డొంకకు తొలుకుపోయి కాస్తుండగా దొడ్డికి కూకుంటున్న కమ్మ కుర్రాడి మీద జరిగిన పందుల దాడిలో అతడ్ని మట్టుబెట్టాడు.అందరూ పందుల దాడి అని నమ్మారు.ఆపందులకు యజమాని అయినందుకు ఎదో శిక్ష పడ్డది.ముత్యాలు నవ్వాడు లోలోపల.
ఆరడుగుల తాచుపాముల్ని,భయంకర రక్తపుపింజర్లని ఒట్టి చేత్తో పట్టగల ముత్యాలు,పురుగు ముట్టితే మంత్రమేసి నయం చేయగల బుడబుక్కల ముత్యాలు.అడవిపందులతో పోరాడి వాటితలలు విరిచి కూర వండగల మీసాల ముత్యాలు.విధేయుడైన ముత్యాలు.రెండుకాళ్ళు,రెండుచేతులు ఉండి పీతిరిడొంక లోముడ్డి కడుకుంటున్న కామపోతుని చంపి ఖైది అయ్యాడు.అసలు సిసల మానవ పాముని ఇన్నాళ్లకుపట్టానని నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు ముత్యాలు.
*
[15/07, 10:46 AM] Poet Anandachary Kmm: పెద్దన్నా మీ కథ చదివాను.really wonderful.మీకధనం చాలా బాగుంది. ఆ వాతావరణం లోకి తీసుకెళ్ళింది. వర్ణన సన్నవేశపు భవిష్యత్ ఇండికేషన్ బాగాచేశారు.మీరు కథను నడిపిన తీరు బాగా నచ్చింది. పందులపెంచే వాళ్ళజీవితాన్ని పట్టిఇచ్చారు.నాకూ పందులు పెంచేవారిజీవితంతెలుసు.అయితే వాళ్ళు పరదేశీలు.
ఇక సుబ్బాలు ఆత్మహత్య చేసుకునేంతతప్పుగా తనకుతాను ఆలోచించే ఎదుగుదల ,అఃతటి ఆత్మన్యూనతకుగురికాగలచైతన్యమూ ఆమెకు ఉన్నాయని క్యారెక్టర్ నుఎస్టబ్లిష్ చేయలేదు.చాలా ఆటుపోట్లను ఎదుర్కోగల ఎదిరించగల భరించగల శ్రామికసమూహపుజీవితం వాళ్ళది.పోనీ సబ్బాలులో ఒక అంతర్ఘోషనైనా చిత్రించలేదు.ఇది నాకనిపించిన అభిప్రాయం. మిగతాదంతాబాగుంది.అభినందనలు.
[15/07, 10:47 AM]
Thank you sir….
జీవితాన్ని సమర్ధంగా ఎర్కోగల సామర్ధ్యలు ఉన్నా
జరిగిన దారుణాన్ని అవమానాన్ని ఎలా ఎదుర్కువాలో తెలియని అమాయకత్వంలోంచి వొచ్చిన అసమర్ధనీయ ఆలోచన సుబ్బాలు చేసింది…
వర్ణ వ్యవస్థలో దళిత బహుజనులకి నేటికి ఇలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి….కథ చదువుతున్నప్పుడు ఈ రియల్ స్టోర్టీ ఇక్కడే నేటికి జరుగుతున్నాయి అనిపిస్తుంది…..వాస్తవాన్ని కండ్లకు కట్టినట్టుంది పెద్దన్న….హ్యాట్సాఫ్
థాంక్ యూ ఓబు…మీ స్పందన మూల్యమైనది…
Baaga rasav annaya… Ilanti pamulanti manushulu inka unnaru alanti varandariki buddi vachela muthyal lanti vallu vundali..
పెద్దన్న గారి కథలో కొత్తదనం లేకపోయినా, యదార్థ సంఘటనగా కథనం బాగుంది. తన తండ్రి ముత్యాలు లో వున్న కరకు తనం పోరాడే తత్వం సుబ్బాలుకు అబ్బి వుంటే కథ ముగింపు మరోలా వుండేది. కాక పోతే ముత్యాలుకు బదులు సుబ్బాలు జైల్లో వుండేది కాని జీవించి వుండేది, తనలాంటి వారికి ఒక ఉదాహరణగా వుండేది అనిపిస్తుంది. పందులు పెంచే వారి జీవన విధానం వారి భాష అన్నీ సహజంగా రాశాడు రచయిత. పెద్దన్న గారికి అభినందనలు !
ప్రసాదు గారు….థాంక్ యూ..
కులం ఆధారం గా అరాచకాలు అన్యాయాలు వుండవు… దానికి ప్రేరేపించేది.. వెనక మంది బలం… చట్టం నుంచి తప్పించుకోవచ్చుననే ధైర్యం… మా పక్కూరి లో ఒక మాల యువకుడు.. అగ్రవర్ణ స్థ్రీ చెరుకు తోటలో ఆవుల కోసం కసువు పెరుకుతుండగా అత్యాచారం చేసాడు… ఆ వూరిలో మాలలు నూరిల్లు, అగ్రవర్ణం 5 కుటుంబాలు.. చివరికి అవమానం భరించలేక ఇద్దరు చిన్నపిల్లలున్న ఆ స్త్రీత్ ఆత్మహత్య చేసుకొంది.. కులం మీద కాదు గుణం మీద కథ రాయండి
పెద్దన్నా….మిగిలిన అన్ని పాత్రలకూ నామవాచకం ఇచ్చి ఒక్క కమ్మ యువకుడని సర్వనామం ఇవ్వడం లో నీ ఆంతర్యం ఏమిటి… నీ ద్రిష్తి లో ఆ సర్వనామం అందరు కమ్మయువకులనూ ఉద్దేసించిందేనా… నేను కూడా కమ్మ యువకుడినే…. నీ సంకుచిత ద్రిష్తి కోణం లో నేను కూడా నిందితుడినేనా… నీకులం ఏదో కానీ… నీ కులస్తులందరూ పాలలాంటి స్వచ్చమైనా వాల్లేనా… నీ కులం లో అత్యాచారం చేసినోల్లు… వ్యబిచారులు… హంతకులూ ఒక్కరూ లేరా..
ఎడిటర్ గారూ….
ఒక కులాన్ని ఉద్దేసిస్తూ సర్వనామం తో రాసిన ఈ కథ ను ఎలా ప్రచురిస్తారు…
నా కులం మీద కథ రాసినందుకు నాకు అభ్యం తరం లేదు.. సర్వనామం ఎలా వుపయోగిస్తారు… అతని పేరు రాయచ్చు… అతనిది కమ్మ కులం అని చెప్పచ్చు…. కమ్మవారికి మనోభావాలు వుండవా…. అవి దెబ్బతినవా…
ఏడిటర్ గారూ… కమ్మకులం మీద విషం చిమ్మడం లో మీ పాత్ర వున్నట్టుంది.
Sudheer గారికి,మీరడిగిన/లేదా అడగాలనుకున్న అంశాలలో ముక్యముగా కనిపించేది కమ్మ కులస్తులు అందరూ అలానే ఉంటారా అనే సందేహం అనుమానం.కమ్మ కులంలో పుట్టిన ప్రతి వ్యక్తి అలానే ఉంటారు అని కథలో ఏ పాత్రా చెప్పలేదు.అది మీకు మీరే ఆపాదించుకుంటున్నారు.ఇంకొకటి గుణం ఆధారంగా కధరాయమన్నారు.కధ నిండా గుణాలు ఉన్నాయి.భౌతికంగా కులం కనిపించింది అంతే.మీకు తెలిసి మాల కులస్థుడు మరో కుల స్త్రీని హత్యాచారం చేశారు అన్నారు.ఆ సంఘటనని కధగానో కవితగానో రాయండి.కేవలం కమ్మ కులస్తులు లేదా మరో అగ్రకులస్థుల వారు ఇలా తక్కువ కులం వారిని హత్యాచారం చేస్తారు అని కథలో ఎక్కడా లేదు.దయచేసి గమనించండి.హత్యాచారం ఎవరికి ఏకుల అమ్మాయికి జరిగిన అది హత్యాచారమే.దానిని ఏ కులంవారైనా సమర్దించకూడదు.వ్యతిరేకించాలి.
కధ యొక్క కాలం కూడా ఈ కధలో చూస్తే ఇది ఇప్పటి కధ కాదు.80ల్లోది. అప్పటి అగ్రకుల తీరితెన్నులు అలాఉంటాయనేది.అందరికి తెలిసిందే.majority ని మనసులో పెట్టుకొని మాట్లాడాలి.నేనే ఒక బ్రాహ్మణుడు గురించి కధ రాసాను.అదీ సారంగలోనే అచ్చయింది.వీలయితే అది చదవండి.థాంక్ యూ…