29
సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఏప్రిల్ 1, 2013 నాడు “అలా మొదలయింది” అనే వ్యాసంతో మొదలుపెట్టి గత ఏడాది జనవరి 2017 దాకా అప్పుడప్పుడు ‘నెలతప్పినా’ మొత్తం 28 వ్యాసాలు “వంగూరి జీవిత కాలమ్” పేరిట సారంగ అంతర్జాల పత్రిక వారు ప్రచురించి నాకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం చేశారు. విశేషం ఏమిటంటే ఈ వ్యాసాలు నా ‘బాణీ’ ‘అమెరికాలక్షేపాలు’ లాంటివి కాదు. అనగా అవి కేవలం హాస్యం, అపహాస్యం కోసం వ్రాసిన కథలూ, కమామీషులూ కాదు. ఒక విధంగా నా స్వీయ చరిత్ర.
అదేదో నా లాంటి గొప్పవాడి జీవిత ప్రస్థానం గురించి అందరూ తెలుసేసుకుని ఆనందపడిపోడానికి వ్రాశాను అని అబద్దాలు, అతిశయోక్తులు చెప్పను. ఈ వ్యాసాలు కేవలం ఇంచు మించు అన్నీ నాకోసం నేను వ్రాసుకున్న నా జీవిత విశేషాలు. అయినా వాటిని స్వీకరించి సారంగ వారు ప్రచురించడం వారు నా పట్ల చూపించిన వ్యక్తిగత గౌరవం కాక మరేమిటి? అయితే నేను అనుకోని మరొక విశేషం ఏమిటంటే ఈ వ్యాసాలకి వారి కామెంట్స్ రూపంలోనూ, e మెయిల్స్ ద్వారానూ, వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడూ వచ్చిన పాఠకుల స్పందన – ముఖ్యంగా మా బంధువుల గురించీ, పెరిగిన వాతావరణం, ఆత్మీయతల గురించీ చదువుతూ వారు కూడా తమ జీవితాలని నెమరు వేసుకుంటున్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగించింది. అందుకే ఒక ఏడాది పాటు తాత్కాలికంగా పత్రిక వెలువరించక పోయినా, ఇప్పుడు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పున:ప్రారంభం అవుతున్న సందర్భంగా ఇప్పుడు ఆ వ్యాస పరంపర మళ్ళీ మొదలుపెడుతున్నాను. ఈ విడత కూడా పాఠకుల ఆదరాభిమానాలు లభిస్తాయి అనీ, అంతకంటే ముఖ్యంగా ఈ వ్యాసాల ద్వారా మీ జీవితం లో ఏమైనా మరచిపోయిన వ్యక్తులు కానీ సంఘటనలు కానీ గుర్తుకు వస్తే మా ధ్యేయం నెరవేరినట్టే.
గత 28 వ్యాసాలలో ఇంత వరకు జరిగిన వంగూరి జీవిత కాలమ్: అక్కడ జర్మనీ లో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న రోజున – (ఈ ఏప్రిల్ నెలలోనే నా పుట్టిన రోజు) – ఇక్కడ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో ఉన్న – తూ.గో. జిల్లా లో కాకినాడలో పుట్టి, బుద్దిగా చదువుకుని, స్థానిక కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ – ఇప్పుడు JNTU- నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో జూన్, 1966 లో డిగ్రీ తీసుకున్నాను. ఆ తరువాత ఎవరూ ఊహించని విధంగా తూర్పు తీరాన బంగాళా ఖాతం ఒడ్డున ఉన్న కాకినాడ నుంచి అటు పశ్చిమ తీరాన అరేబియా సముద్రం ఒడ్డున బొంబాయి లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్జ్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ లో చేరిన మొదటి వాడిని బహుశా నేనే. ఇక చదవండి)
అది 1966 జూలై నెలాఖరో, ఆగస్ట్ మొదటి వారమో. కాకినాడ నుంచి నేనూ, ఎన్. గోవిందరాజులూ బొంబాయి వెళ్లి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ లో ప్రవేశానికి పరీక్షలు, ఇంటర్వ్యూ లు చెయ్యగా నాకు ఫ్లూయిడ్ పవర్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో సీటు వచ్చింది. గోవింద రాజులు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్కైన్స్ లో చేరడానికి అటునుంచి అటే బెంగుళూరు వెళ్లి పోయాడు. IIT లో మొదటి రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం చేరిన కొత్త విద్యార్ధులు మొత్తం ముఫై మందినీ ఓ గదిలో కూచోబెట్టారు. అంటే మెషీన్ టూల్స్, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్స్, ఫ్లూయిడ్ పవర్, క్రయోజెనిక్స్ వగైరా ఆరేడు బ్రాంచిలు కలిపి ఒక్కో దాంట్లో ఐదారుగురు మాత్రమే యావత్ భారత దేశం నుంచి ఎంపిక అయిన విద్యార్ధులు. ఆ మొదటి రోజు నేను కాస్త నిశితంగా గమనించగా ఆ మ్పుఫై మందిలో నా ఒక్కడిదే కొంచెం బైతు వాలకం. ఎందుకంటే నా ఒక్కడిదే కాకినాడలో అల్లా ఉద్దీనో తమ్మయ లింగమో చేతులతో కుట్టిన పంట్లాం చొక్కా, లాగూ వేసుకున్న వాడిని. మిగిలిన వాళ్లందరూ సొగసైన కాలర్లతో మడత నలగని రెడీ మేడ్ బట్టలతో ఉన్న వాళ్ళే. ఇంకా తరచి చూస్తే…ఐదారుగురు బొంబాయిలోనే ఉన్న విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్ స్టిట్యూట్ ..విజెటీఐ ..అనే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని సులభంగానే గుర్తు పట్టాను.
ఎందుకంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళే ధైర్యంగా బొంబాయి ఇంగ్లీషులో కాస్త ఎత్తులో ఉండి మాట్లాడేసుకుంటున్నారు. ఎంతయినా లోకల్స్ కదా. మరి కొంత మంది హిందీ లోనో, మరాఠీ లోనో పలకరించు కుంటున్నారు. నాకు అప్పటికి ఆ రెండు భాషలకీ తేడా తెలియదు. ఉత్తర భారతం లో మాట్లాడేది అంతా తురకమే! ఇక ఈ రెండు రకాలు తప్ప మిగిలిన వాళ్ళు కొంచెం భయం, భయం గా దిక్కులు చూస్తూ కూచోడమో, మహా అయితే నాలుగు పొడి పొడి ఇంగ్లీషు ముక్కలతో పరిచయాలు చేసుకునే కార్యక్రమం లో ఉండగా హాల్ లోకి ఇద్దరు పెద్ద వాళ్ళు వచ్చారు. టై కట్టుకుని కోటు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రొఫెసర్లు అని తెలిసిపోయి అందరం బెంచీ లలో సద్దుకుని కూచున్నాం. అప్పుడు ఒకాయన అందరికీ స్వాగతం చెప్పి, తమ పరిచయాలు చేసుకుని మాకు డిపార్ట్ మెంట్ లో అన్ని విభాగాలూ చూపించే ముందు ఒక్కొక్కరినీ పేరు పిలిచి అటెండెన్స్ తీసుకున్నారు.
ఆ అటెండెన్స్ తీసుకునే కార్యక్రమంలో అద్వానీ -విజేటిఐ- హీట్ ట్రాన్స్ ఫర్ బ్రాంచ్, కనిట్కర్ – పూనా – రిఫ్రిజిరేషన్ బ్రాంచ్ అని ఇలా పిలుస్తూ వి.సి. రాజు – ఆంధ్రా యూనివర్సిటీ – ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ అనగానే నేను లేచి నుంచుని చెయ్యి ఎత్తాను. వెంటనే ఒక ఒక మూల నుంచి రెండు కళ్ళూ, మరో మూల నుంచి మరో రెండు కళ్ళూ నా కేసి తిరిగి ఆసక్తి కరంగా చూశాయి. ఆ తరవాత భగవతుల్లా -మణిపాల్ – ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ అని పిలవగానే కాస్సేపు ఎవరూ లేవ లేదు. ఆ లెక్చరర్ గారు మళ్ళీ భగవతుల్లా మూర్తి అని పిలవగానే ఇందాకా నన్ను చూసిన నాలుగు కళ్ళలో ఒక రెండు కళ్ళ కుర్రాడు లేచి సన్నటి గొంతుకతో యస్ సర్, ప్రెజెంట్ సార్ అన్నాడు. ఈ భగవతుల్లా మూర్తి అనే వాడు ఏ మతానికి చెందిన వాడా అని నాలో భలే కుతూహలం చెలరేగింది. పైగా నా బ్రాంచే కూడాను. ఆ తరువాత పి.ఆర్.కె. రావు – ఇండోర్ -ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్స్ అని పిలవగానే ఆ రెండో రెండు కళ్ళ కుర్రాడు పొడుగ్గా లేచి నుంచుని ఇంకా సన్నటి గొంతుక తో హియర్ సర్ అన్నాడు. రావు అనే పేరు వినగానే నేను అతని వేపు కుతూహలంగా చూశాను కానీ ఇండోర్ లాంటి చోట్ల రావు లు ఉంటారా అని కాస్త అనుమానం వేసింది. మొత్తానికి ఈ తతంగం అయ్యాక ముగ్గురం సహజంగా పక్క పక్కలకి చేరుకున్నాం. ముందుగా ఆ రావు ని “ఆర్యూ ఫ్రం అంధ్రా?” అనగానే “యస్” అన్నాడు. మళ్ళీ ఎందుకైనా మంచిది అని “మీకు తెలుగు వచ్చునా?” అనగానే “ఏం మాట్లాడి వినిపించ మంటారా?” అన్నాడు రావు నవ్వుతూ. ఇక ఆ భగవతుల్లా అసలు పేరు భాగవతుల యజ్ఞ నారాయణ మూర్తి. ఆ భాగవతుల అనే మాటకి ఆ లెక్చరర్ పడిన పాట్లే ఆ భగవతుల్లా.
అంతే….ఆ క్షణం నుంచీ మేం ముగ్గురం అర క్షణం కూడా విడదీయలేని ప్రాణ స్నేహితులం అయిపోయాం. ఆశ్చర్యం ఏమిటంటే అతని ఈ మూర్తి అన్నయ్య డా. సూరి, మా అన్నయ్య డా. సుబ్రమణ్యం మణిపాల్ లో మెడికల్ కాలేజ్ లో సహాధ్యాయులే కాక ఆప్త మిత్రులు. మూర్తి కూడా మణిపాల్ లోనే ఇంజనీరింగ్ చదుకువుకున్నాడు కాబట్టి మా అన్నయ్య బాగా తెలుసు. ఆ విధంగా మాకు పరోక్ష పరిచయం ఉంది. వాళ్ళది తెనాలి దగ్గర కొల్లూరు. ఈ కొల్లూరు భాగవతుల కుటుంబం వారి నిర్వహణ లో అక్కడి హైస్కూల్ లోనే సినిమాలలోకి వెళ్ళక ముందు వేటూరి సుందర రామ మూర్తి గారు తెలుగు ఉపాధ్యాయులుగా పని చేసేవారు.
ఇక రావు గురించి ఒక చిన్న ఉదంతం చెప్తే చాలు…మా స్నేహం కుదిరిన ఐదారు నెలలకి అనుకుంటాను. ఓ ఆదివారం మేం ముగ్గురం మా హాస్టల్ 1 – మావి పక్క పక్క గదులే అని వేరే చెప్పక్కర లేదు – ఆలిండియా రేడియో లో వివిధ భారతి కార్యక్రమం వింటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆ రోజు ఆ హిందీ పాటల కార్యక్రమం నిర్వహిస్తున్నది సుప్రసిద్ధ గాయని పి. సుశీల. ఆవిడ హిందీ ఉచ్చారణ తెలుగు లాగానే ఉంటుంది. అది విని నేను “ఈవిడ హాయిగా తనకి వచ్చిన తెలుగో తమిళమో కాకుండా ఈ లేని పోని హిందీ ఎందుకో?” అన్నాను వేళాకోళంగా. అది విని రావు “ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా?” అన్నాడు కాస్త చికాకుగా. “ఏం. ఆవిడ పి. సుశీల కదా.” అన్నాను. “అవును సుశీలే. ఆవిడ మా అక్క” అన్నాడు రావు. అప్పటికి ఆరు నెలలుగా మేం ప్రతి క్షణం కలిసి మెలిసి ముగ్గురికీ సరి కొత్త ప్రదేశం అయిన బొంబాయిలోదగ్గర స్నేహితులుగా తిరుగుతున్నా, అతను బాగా పాడతాడు అని తెలిసినా, ఈ పి.ఆర్. కె. రావు ఇంటి పేరు పులపాక అని కానీ, అతను పి. సుశీల తమ్ముడు అని గానీ నాకు, మూర్తి కీ తెలియదు. రావు అంత నిగర్వి. వాళ్ళది విజయ నగరం. అతడిని కుటుంబంలో కిష్టప్ప అని పిలుస్తారు. అతని అన్నయ్య నానప్ప మద్రాసు లో మా చిన్నన్నయ్య చదువుకునే తప్పుడు పరిచయం ఉండేది. ఇండోర్ లో బి.యి. చేశాడు.
ఇలా నేనూ, మూర్తీ, రావూ 1966 నుంచి రెండేళ్ళు మాస్టర్స్ డిగ్రీ, తర్వాత డాక్టరేట్, తర్వాత అక్కడే I I T లోనే లెక్చరర్స్ గా, తర్వాత ముగ్గురం ఇంజనీరింగ్ సంస్థ వ్యవస్థాపకులిగా, అందులో ఒక దాంట్లో భాగస్వాములుగా నేను అమెరికా వచ్చిన తర్వాత కూడా కలిసి మెలిసే ఉన్నాం. వ్యాపార రీత్యా కాలం వేసిన కాసిన్ని గాయాల వలలో అప్పుడప్పుడు చిక్కినా, మా స్నేహాన్ని అలాగే నిలుపుకు వస్తున్న జీవిత కాల స్నేహానుబంధాలు మావి. ఇప్పటికీ వీలున్నప్పుడల్లా కలుస్తూనే ఉంటాం. ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం.
ఇందుతో జతపరిచిన బీచ్ ఫోటోలో ఎడం వేపు నుంచి బి.వై. మూర్తి, పి.ఆర్.కె. రావు, చివుకుల కృష్ణ, జొన్నలగడ్డ చంద్ర శేఖర్ (చందూ), నేనూ…ఇక బొంబాయి I I T లో తెలుగు సాంస్కృతిక వ్యాపకాల గురించీ, ఇతర ఆత్మీయ మిత్రుల గురించీ, మా గురువు “గండర గండడు” గారి గురించీ ….వచ్చే నెల లో
*
చాలా బాగున్నవి సార్ మీ జ్ఞాపకాలు
ధన్యవాదాలు శంకర్ ప్రసాద్ గారూ. ప్రతీ నెలా 15 నాటికి ధారావాహికగా వ్రాద్దాం అని ప్రయత్నం…
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు