ముక్కుపుడకై ఆ ముత్యపు చినుకు..

ఎమ్ ఎస్ ముక్కున…ముక్కుపుడకలు సూర్యచంద్రుల్లా మెరిసిపోతూ ఉండేవి. ఆవిడ వర్చస్సులో అవీ ఒక భాగమే అనిపించేది.

తొలకరి చినుకు ఒకటి రాలుతూ…ఆ పువ్వుపై నుంచి…గాలికి ఆకుమీదుగా జారుతూ లేలేత ఎండ తాకి తళుక్కున మెరిసిపోతూంటే అది చూస్తూన్న చిన్నదాని ముక్కుని చూసి ముచ్చట పడి ఆ ముక్కును హత్తుకుని మెరిసీ మురిపించిందేమో…ముక్కుపుడకై ఆ ముత్యపు చినుకు.

నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది…ముక్కున మెరుస్తూ కనిపించే ముక్కుపుడకను చూడగానే. అదేంటో కానీ ఏ ఆడవారిని చూసినా నా ధ్యాస ముందుగా ముక్కు పుడక ఉందా లేదా అనే దాని మీదే ఉండేది చాలా ఏళ్ళు. వాళ్ళు ఎలా తయారయ్యారు, ఏ చీర కట్టుకున్నారు వగైరాలకన్నా. మొహం కూడా గుర్తుండేది కాదు…కానీ ముక్కు మీది ముక్కుపుడక ఏ డిజైన్ లో ఉందాని చూసేదాన్ని.

నిన్న ఉదయాన్నే ఓ ఫోటోలో తళుక్కున మెరిసిన ముక్కుపుడక పెట్టుకున్న ముగ్ధను చూసి ఎన్నెన్నో గుర్తుకొచ్చాయి.

మా అమ్మమ్మకీ , బామ్మకీ ఉన్నవే నేను ముందుగా చూసిన ముక్కుపుడకలు. మా అమ్మమ్మ ముక్కెర కూడా పెట్టుకునేది…అది ముక్కు చివర మధ్య భాగానికి తెల్లటి రాళ్ళతో మెరుస్తూ ఉండేది. ఓ వైపు గుండ్రటి బంగారపు పువ్వు తో చేసిందీ ఎడమ వైపు ఎర్రరాయి చుట్టూ తెల్లరాళ్లతో చేసింది ఉండేవి. మా బామ్మ కూడా ముక్కుకు రెండువైపులా ఒక వైపు అచ్చు బంగారంది మరో వైపు ఎర్ర, పచ్చ, తెల్లరాళ్లతో ఉన్నవి పెట్టుకునేది. మా అమ్మకి మటుకే కుట్టించలేదుట. ఏడుగురి తరువాత పుట్టింది పిల్ల అర్భకం నెప్పి చేస్తుంది అని మా తాతయ్య వీల్లేదని హుకుం జారీ చేశాట్ట. దానితో ఇంట్లో ఆడవాళ్ళంతా ఇక ఎదురు చెప్పలేక ఊరుకున్నారుట. ఏడేళ్లు వచ్చేటప్పటికి అప్పుడు ఆడపిల్లలు అందరికీ ముక్కు కుట్టించేవారుట.

ఈ ముక్కుపుడకల గురించి ముఖ్యంగా మా అమ్మమ్మే చెప్పేది. ఆవిడ ముక్కు చాలా సన్నగా అందంగా ఉండేది కూడా. వాళ్ళు బెజవాడలో ఉండగా తనకు ఆరేడేళ్ళప్పుడు ఇంటికి పిలిపించి తనకూ మా అమ్మమ్మ చెల్లెలికీ ఇద్దరికీ ఒకేసారి కుట్టించారుట. ఆ రోజు చుట్టుపక్కలవాళ్ళకు భోజనాలు కూడా పెట్టించారుట. నెప్పిగా ఉన్నా ఆ తర్వాత పోయే గొప్పలు తలుచుకుని ఓర్చుకున్నారుట. ఆ పెట్టిన చిల్లు పూడుకు పోకుండా కొన్ని రోజులు తెల్లగడ్డి చీపురు పుల్లను దూర్చుకునేవారుట. అది నా చిన్నప్పుడూ చేశారు చెవి రింగులు మార్చేటప్పుడు…దూరకపోయినా, నెప్పి వేసినా ఆ పుల్లలు దూర్చి ఉంచేవాళ్లు.

రకరకాల ముక్కుపుడకలను చూశాను నేను.మనుషుల కులాలను, వారి వారి ఆర్ధికస్థితిని బట్టీ, చేసే వృత్తులను బట్టి కూడా చాలా తేడాలు ఉండేవి. మాకు పాలు పోసే అమ్మాయి రెండు వైపులా ఇత్తడి ముక్కుపుడకలు పెట్టుకునేది. ముక్కు కిందుగా అడ్డబాస పెట్టుకునేది. అది రింగులా ఉంటుంది.చాలామంది ఈ మూడూ పెట్టుకునేవాళ్లూ. ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళు. కూరలమ్మాయి తట్ట దింపుతూ ఉంటే నా కళ్ళు ఆ ముక్కున మెరిసే తెల్లరాళ్ళ ముక్కుపుడకనే చూస్తూ ఉండేవి. చాలా అందంగా ఉండేది కూడా ఆ అమ్మాయి. మా అమ్మా వాళ్ళ చిన్నప్పటి టైలర్ బుజ్జా అని ఉండేవాడు…ఇంటికే వచ్చి కొలతలు తీసుకువెళ్ళేవాడుట.మేము ఊరికి వెళ్ళినప్పుడల్లా చూడటానికి వచ్చి ఎండాకాలం వేసుకునే గౌన్లు, తమ్ముళ్లకు జుబ్బాలు కుట్టి ఇచ్చేవాడు. ఓసారి వాళ్ళింట్లో పెళ్ళికి వెళ్లాము.పెళ్లి కూతురుని తెరచాటుగా వేరే ఎక్కడో గదిలో కూర్చోబెట్టారు. పెళ్లికూతురుని చూడగానే ఎంత బావుందో అనిపించింది. మిఠాయిరంగు బట్టల్లో ముక్కుకు పెద్ద రింగులాంటి ముక్కుపుడక పెట్టుకుని దాన్ని చెవిదాకా వేలాడ దీసింది ముత్యాల గొలుసుతో. భలే అనిపించింది చూడగానే. దాన్ని బులాకీ అంటారని అప్పుడే తెలిసింది. ఆ తర్వాత చాలా మూవీస్ లో చూసా. కానీ మొదటిసారి చూసింది ఇప్పటికీ జ్ఞాపకమే. అలాంటి బులాకీలు ఇప్పటికీ ఉత్తరాదివారి పెళ్ళిళ్ళల్లో పెట్టుకోవడం చూస్తాము కానీ దక్షిణాది వాళ్ళు అస్సలు ముక్కుపుడక ఊసే మరిచారు దాదాపుగా.

మా అప్పుడు చిన్న చుక్కలాంటివి ఫ్యాషన్ అయ్యాయి. ఓ నలకంత బంగారంగుండు లేదా అతి చిన్నరాయి. ఐనా బావుండేవి చూడటానికి.

శ్రీదేవి ముక్కుమీద మెరిసినంతగా ఆ ముక్కుపుడక ఇంకెవరిమీదా మెరవలేదు. అంతగా ఎవరికీ నప్పలేదు అనిపిస్తుంది నాకైతే. ఏదో మోహం శ్రీదేవి ముక్కుని చూస్తే…ముక్కుపుడకతో.

ఎమ్ ఎస్ సుబ్బులక్ష్మిగారి ముక్కున…ముక్కుపుడకలు సూర్యచంద్రుల్లా మెరిసిపోతూ ఉండేవి. ఆవిడ వర్చస్సులో అవీ ఒక భాగమే అనిపించేది.

ఆ తర్వాత మెల్లిగా తగ్గిపోయింది. ముక్కు కుట్టించుకున్నవాళ్లూ తీసేశారు. పల్లెటూళ్ళల్లో కూడా అక్కడక్కడానే కనిపిస్తున్నారు. అది సాంప్రదాయంగానే కాకుండా వాళ్ళకు ఒంటిమీద బంగారంతో పోవాలనే నమ్మకం కూడా అవి ధరించడానికి ఓ కారణం అనుకుంటా. చెవులవైనా అమ్ముకునేవారు కానీ ముక్కుకి తీయగా చూడలేదు మా ఊళ్ళో. తమలో ఒక భాగంగా అనుకునేవాళ్ళు.

చెవులకి ఎన్నెన్నో చిల్లులు పెట్టుకుని తగిలించుకున్నారు కూడా కానీ … మన భారతదేశానికే ప్రత్యేకం ఐన ముక్కుపుడకను పట్టించుకోవడం మానేశారు. అతి తక్కువగా చూస్తూ ఉంటా ఎక్కడన్నా వేడుకలకు వెళ్లినప్పుడు వెతుక్కుంటా ఎవరన్నా పెట్టుకున్నారా అని…అలా టైం పాస్ కూడా అవుతుంది…ఓ సంతోషమూ దక్కుతుందని.

ఇప్పుడు చెప్తాను. ఇంత ఇష్టం ఎందుకనీ అంటే…నాకు లేకనే. మా నాన్న మటుకు నాకు రెండేళ్లప్పుడే చెప్పేశాట్ట. చెవులకు అంటే ఊరుకున్నా కానీ ముక్కు కుట్టించడానికి వీల్లేదు అది ఏడవకూడదు అని. దానితో రెండుతరాలైపోయింది ముక్కు పుడక ఊసెత్తక. కాస్త పెద్ద అయ్యాక అనుకున్నాను కానీ నా ముక్కు మా నాన్న ముక్కులా లావు. అమ్మదిలా సన్నగా పొడుగ్గా ఉండదు. దానితో ఆ ఆలోచన మానుకున్నా. ఇప్పటికీ ఆడపిల్ల పుడితే ఎవరన్నా ముక్కు కుట్టిస్తే చూడాలని ఉంది …నెప్పి ఉంటుందేమో గన్ షాట్ తో చేసినా, కానీ జీవితాంతం ఆ అందం ఆమె సొంతం అవుతుంది కదా.
ఇన్నేళ్లకు ఇవన్నీ గుర్తొచ్చాయి మీ ముక్కుపుడకను చూడగానే…దానికో ముద్దు.

*

నిత్యా

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఒక తరపు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ,ఇంకో తరం లో సంప్రదాయాలుగా, మరో తరంలో వ్యవహారాలుగా ఆ పై మళ్ళీ బోర్డం డోర్ కొట్టినప్పుడు, కొన్నాళ్ళు అటక లెక్కి ఆ పై మరో తరంలోనో ,ఇంకో ప్రాంతంలోనో  మళ్ళీ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అవ్వడం హ్యూమన్ వెబ్ లో చాలా సహజం .అయితే , ముస్తాబు అవ్వడం ఆడవాళ్ళ సహజ హక్కు లాంటి తీర్మానాలు చేసి బలవంతంగా ఫిమేల్ పై మగవాడికి సంతోషాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన అనవసరపు బాధ్యతలు మోపి లేదా బంగారం లాంటి నగలు పెట్టేసుకోడం (ఇపుడు కొత్తగా ప్లాటినం కాబోలు) వగైరాలు ఆస్తులతో సమానం కాబట్టి అవేవీ వాడం అంటూనే, అందంగా ఉండటం మా హక్కు అనుకునే లాంటి  సబ్జెక్ట్ నాకు ఈ జన్మకి అర్థం కాదు ఒక పక్క బ్లాక్  ఇజ్ బ్యూటిఫుల్ లాంటి కాన్సెప్ట్స్ తెస్తూ ఇంకో పక్క అదే మగాడిని లేదా కొత్త తరాలు కాబట్టి ఇంకో పార్టనర్ నో  అట్రాక్ట్ చెయ్యడానికి ఎత్నిక్ వేర్ వాడే వాళ్ళు అదుగో ఆపై లైన్ లో ఇంకొరికి సంతోషాన్ని ఇవ్వడానికి అది కూడా మన కాలాల్లో అందునా మన ఆలోచనల్లో మగాడే అయి ఉండటం ఒక జోక్ బాక్స్ . ఇక్కడ మళ్ళా మా సంతోషం కోసం మేము తయారు అవుతాం అనేవాళ్ళు కూడా అన్నేసి తెలిసి, తయారు అవ్వడం నగలు అలంకరించుకోవడం లాంటివి లేకుండా సంతోషాలు వెతికే బాపతు ఎందుకు కాలేరు ఇంకా పెద్ద డౌట్ . 

    ఇప్పుడు ఇంతకీ ఈ గోల అంతా ఎందుకు అంటే ముక్కుపుడక లు బాగుంటాయి . లేదా అలా ఉండటం భలే గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ మన బుర్రలో ఇరుక్కుపోయింది . ఈ రెండు హ్యాండ్ ఇన్ gloves లాంటివి . మనుష్యులు ఎలా ఉంటే బాగుంటుంది? ఎలాంటివి రాస్తే బాగుంటుంది? ఎలాంటి మ్యూజిక్ గొప్పది ? ఏది యజ్ఞం?  ఏది సత్యం  ? బతికున్న రొయ్య ను అమాంతగా అలా పట్టుకొని ఐస్ క్యూబ్ గా ఫ్రీజ్ చేసినట్లు సమాజం సెట్ ఐడియాస్ సెట్ లైఫ్స్టైల్ , మొత్తం అలా సెట్టింగ్ వేసి పెట్టిన జిందగీ లోకి ఇలా ఊడిపడి అలా మన డైలాగ్స్ చెప్పి , ముక్కు పుల్ల లో , పట్టు పరికిణీ లో ఎక్కడో  ఒక ఎక్స్ప్రెషన్ పారేసుకొని ఇలా మాయం అవ్వడం అన్నమాట . 

    నిత్య రచయితగా మీకో పెద్ద muaaha , బ్యాఖ్రౌండ్ లో “ఎన్నాళ్ళో వేచిన ఉదయం “కన్ఫర్మ్ గా మోగుతుంది కూడాన్ను పరంతూ సబ్జెక్ట్ వైజ్ హమ్మ్మ్ . బహుశ ఒక పదేళ్ళ క్రితం ముత్యాల ముగ్గు , పెళ్లి పుస్తకం లాంటి సినిమాలు చూసి వాహ్ వాహ్ అనుకునే కాలంలో చదివి ఉంటే హబ్బో హెంత కఃహమ్మగా రాశారో అచ్చం చినుకుల్లో విరగబుసిన నంది వర్ధనం లా అని తెగ ముచ్చట పడిపోయే దాన్ని. ప్చ్ ఇపుడు మాత్రం  ముద్దులన్నీ మీలో రైటర్ కే. 

    ఇంకా మీరు బోల్డు రాయాలి, బోల్డ్ ( bold) గా కూడా రాయాలని. త్వరలో ఇంకా ఇంకా మీ రాతలు దాన్ని చదివి మారే మా తలరాతలకి జేజేలు చెప్తూ , మొత్తానికి స్త్రీ స్వాత్రంత్యం డైమండ్ తళుకుల నుండి ఎత్నిక్ వేర్ మెరుపుల దాకా అయినా వచ్చినందుకు సంతోషిస్తూ ..

    నిశీ !!

    PS : ఎలాగు కరోనా పుణ్యమా అని అందరికీ Netflix గట్రా అలవడ్డాయి కాబట్టి , మాంఛి రంజైన డించాక్ ఇంగ్లీష్ series లు కొన్ని చూస్తే బడా బడా మ్యాన్లీ మ్యాన్ అనుకునే అబ్బాయిలు కూడా ముక్కుపుల్ల తో కనబడటం  అందునా వాళ్ళెవరూ మన స్టీరియో టిపికల్ ట్రాన్స్ జెండర్ లేదా gays కాకపోవడం కొత్త ఫ్యాషన్ ట్రెండ్ . ఉదాహరణకి Good girls series లో Manny montenna ( Rio) looks efffffing HOT oooops . వీలుంటే ఒకసారి ఆ కోణం కూడా రాయండి . 

  • భలే!
    ప్రకృతి…ని…కాంతగా అనుకున్నంత కాలమూ…ఎన్నెన్నో అందాలు … ఆరాధిస్తూనే ఉంటాము. అవే చిన్ని చిన్ని సంతోషాలు. జీవితంలో దొర్లిపోతూ ఉంటామా ఇలా…కొన్ని కొన్ని జ్ఞాపకాలను ఆపలేము. ఇక్కడ ప్రకృతి లో కొన్ని చూడగానే స్పందించినట్టే…దీనికీ. అంతవరకే నా ఆలోచన.
    అందుకే మీరు నిశీ నేను నిత్యా అయ్యాను.
    అర్ధం అయ్యింది. ప్రయత్నిస్తాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు