మీది మీదే! మాది మాదే!!

సాహిత్యంలో ‘తెలుగు’ పేరుతో ‘ఆంధ్రా’ ఆధిపత్యం ఇకపై చెల్లదు!

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసమే కాదు, భాషా, సాహిత్య రంగాల్లో ఆంధ్రాధిపత్య వివక్షకు వ్యతిరేకంగా కూడా జరిగింది. సంస్కృతి పరిరక్షణ కోసం, అన్ని రంగాల్లో హక్కుగా దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం ఈ పోరాటం సాగింది. 60 యేండ్ల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అయినప్పటికీ ఇప్పటికీ  ‘తెలుగు భాష’, ‘తెలుగుదనం’, ‘తెలుగు సంస్కృతి’ ‘ఉమ్మడి వారసత్వం’ ఇలా పలు పేర్లతో ఆంధ్రాధిపత్యం, పెత్తనం, దాష్టీకం, వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ కమిటీల నియామకాల్లోనూ, నిర్వహణలోనూ, తెలుగులో రాసే సాహిత్యకారులకు ఇచ్చే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుల్లోనూ, ఆంధ్రా సాహిత్యకారులు ‘తెలుగు’ పేరిట వెలువరించే సంకలనాల్లోనూ, నిర్వహించే రైటర్స్‌ మీట్‌లు, లిటరరీ ఫెస్టివల్స్‌, సంస్థల సభలు, కళాశాలల సదస్సులు, సమావేశాల్లోనూ, కొన్ని ప్రచురణా సంస్థలు ముద్రించే పుస్తకాల విషయంలోనూ ఈ వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. తెలుగు పత్రికల్లోని సాహిత్య పేజీల్లో అచ్చయ్యే కవిత్వం, విమర్శ, పరామర్శ, పరిచయాలు, సమీక్షలు అన్నీ కూడా ఒక ప్రాంతానికి అధిక ప్రాధాన్యత నిచ్చి మరొక ప్రాంతానికి కనీస ప్రాతినిధ్యాన్ని నిరాకరిస్తున్నాయి. ఒక పద్ధతి ప్రకారం తెలంగాణవారిని, వారి ప్రతిభను ద్వితీయ శ్రేణిదిగా నిర్ధారిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఆత్మగౌరవ నినాదం ప్రధానమైంది. 90 ఏండ్ల కింద ‘తెలంగాణలో కవులు పూజ్యం’ అని విమర్శ వస్తే, ‘తెలంగాణలో కవులు పూజ్యం కాదు. పూజనీయులు’ అని సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ కవుల సంచిక’ను 369 కవులతో వెలువరించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు ఇబ్బడి ముబ్బడిగా సాహితీ సృజన చేసిండ్రు. లెక్కకు మించి సంకలనాలు వెలువరించిండ్రు. ప్రపంచంలో మరే ఉద్యమంలో రానన్ని పాటలు, కవితలు, విమర్శ, వ్యాసాలు, చారిత్రక వ్యాసాలు ఈ ఉద్యమ సందర్భంగా వచ్చాయి. అయినా ఆంధ్రాధిపత్యం తమ వివక్షాపూరిత దృష్టితో ఈ సాహిత్యానికి విలువ కట్టడానికి నిరాకరించింది.

అయితే మొన్నటి జూన్‌ 2, (2024) వరకు అధికారికంగా హైదరాబాద్‌ నగరం ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండిరది. దానివల్ల తెలంగాణవాదులు తమ హక్కులను గట్టిగా చాటి చెప్పడానికి కొంత ప్రతిబంధకాలుండేవి. అదే సమయంలో ఆంధ్రాధిపత్యం, లాబియింగ్‌ విస్తరించింది. ఈ ఆధిపత్యం నిత్యం రెండిరతలవుతున్నందుకే మరోసారి ‘నీళ్ళు, నిధులు, నియామకాలు మాదిరిగానే సాహిత్యం’లోనూ సమానమైన వాటా దక్కాలని నినదిస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్‌ కేవలం తెలంగాణ ప్రజల ఆస్తి. ఇక్కడ జరిగే ప్రతి ప్రభుత్వ సాహిత్య కార్యక్రమాల్లో పూర్తిగా తెలంగాణ వారికే ప్రాతినిధ్యముండాలి. ఆంధ్రా ప్రాంతములో ఎక్కడ సభలు నిర్వహించినా కేవలం ఆ ప్రాంతం వారినే కేంద్ర సాహిత్య అకాడెమీ అతిథులుగా, వక్తలుగా అవకాశం కల్పిస్తున్నది. హైదరాబాద్‌లో సభలు జరిపినా కూడా అదే ఆంధ్రా వారినే ప్రధానంగా ఆహ్వానిస్తున్నారు. దీనివల్ల అక్కడ, ఇక్కడ రెండు ప్రాంతాల్లోనూ ఆంధ్రావారి పెత్తనమే సాగుతున్నది.

కేంద్ర సాహిత్య అకాడెమీ ఇచ్చే అవార్డుల్లోనూ ఇదే వివక్ష కొనసాగుతున్నది. 2014 నుంచి 2023 వరకు మొత్తం 11 మందికి తెలుగులో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు ప్రకటిస్తే అందులో కేవలం నిఖిలేశ్వర్‌, గోరటి వెంకన్నలు మాత్రమే తెలంగాణ వాళ్లు. మిగతా తొమ్మిది మంది ఆంధ్రా, రాయలసీమ వాళ్లున్నారు. అంటే తెలుగు పేరిట తెలంగాణ వారిని ఎలాంటి దగా చేస్తున్నారో అర్థమవుతున్నది. ‘కవి సంధి’లో కూడా ఇలాంటి వివక్షే జరుగుతున్నది. అకాడెమీ నిర్వహించే అన్ని సభలు ఇట్లాగే మిగులుతున్నాయి. అవార్డుల గురించి గట్టిగా నిలదీస్తే ఇది ‘తెలుగు’ సాహిత్యంలో ప్రతిభ చూపించేవారికి ఇస్తారు అని చెబుతున్నారు. పరోక్షంగా తెలంగాణలో అవార్డుకు యోగ్యులైన సాహితీవేత్తలు లేరు అని తేల్చి చెబుతున్నారు.

‘తెలుగు కథలు’, ‘కవిత్వం’, ‘యువ కథకులు’ (విమర్శ) పేరిట ఆంధ్రా సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నారు. తద్వారా తెలంగాణలో సాహిత్యం లేదు అని సంకేతిస్తున్నారు. వాళ్ల సంకలనాలు వాళ్ళిష్టమొచ్చినట్లు వేసుకోవచ్చు. అభ్యంతరమేమీ లేదు. కాకపోతే ఆ సాహిత్యాన్ని ‘తెలుగు’ పేరిట గాకుండా ‘ఆంధ్రా’ పేరుతో వేసుకున్నట్లయితే సంతోషం. అట్లా గాకుండా ఏ ఒక్కరో, ఇద్దరో తెలంగాణ వారికి ప్రాతినిధ్యం కల్పించి అది మొత్తం తెలుగువారి ప్రాతినిధ్య సంకలనం, సభ, ఫెస్టివల్‌, అవార్డు అంటే ఇక ముందు చెల్లదు. మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి గత పదేండ్ల అనుభవాలు నేర్పిన గుణపాఠాలే కారణం. కుట్రలు, మోసాలు, అన్యాయాలను ఎన్నో ఎదుర్కొన్నాము. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సాహితీ లబ్దప్రతిష్టులు ఒక పథకం ప్రకారం తమ వారికి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. అది సంకలనాల కూర్పులో కావచ్చు, విమర్శ పేరిట వెలువరించే వ్యాస సంపుటాలు కావొచ్చు, అవార్డులు కావొచ్చు, నిర్వహించే సభలు, సదస్సులు, లిటరరీ మీట్స్‌, ఫెస్టివల్స్‌ కావొచ్చు. ప్రచురణలు కావచ్చు. వీటిలో వేటిలోనూ తెలంగాణ వారికి న్యాయమైన ప్రాతినిధ్యం లేకుండా, అసలు తెలంగాణలో సాహితీవేత్తలే లేరు అనే అభిప్రాయం పాదులూనుకునేలా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ ధిక్కారం.

మీది ఆంధ్రా సాహిత్యం. మీరు ఆంధ్రా సాహిత్య చరిత్ర నిర్మించుకుంటున్నారు. సంతోషం. మీ సాహిత్యం క్యారెక్టర్‌ వేరు. నేచర్‌ వేరు. ఫంక్షన్‌ వేరు. బిహేవియర్‌ వేరు. లక్ష్యం వేరు. కాబట్టి మీరు వేరు. మేం వేరు. మా సాహిత్యం మాది. మా ఆత్మగౌరవం మాది. ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. అయినా మేం ఇలాగే చేస్తాం అంటూ సిగ్గు విడిచి అవే పనులు పదే పదే చేస్తున్నారు.

కాబట్టి మీ కథలు, కవిత్వాన్ని ‘ఆంధ్రా’ పేరిట అచ్చేసుకుంటే మాకేమి అభ్యంతరం ఉండదు. ఇదొక్కటే ఆంధ్రాధిపత్యాన్ని నిలువరించగలదని విశ్వసిస్తున్నాము.

రాష్ట్రాలు విడిపోయిన పదేళ్ల సమయం తరువాత ఒక విస్పష్ట ప్రకటన చేస్తున్నాం. ఎందులోనైనా ఆంధ్రా రిప్రజెంటేషన్‌, తెలంగాణ రిప్రజెంటేషన్‌ విడిగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలకు, సంస్థలకు, కేంద్ర సాహిత్య అకాడమీ వారికి చెప్పేదేమిటంటే తెలుగు అనే భాషా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రాల ప్రాతిపదికన రిప్రజెంటేషన్‌ ఇవ్వండి. తెలుగు సాహిత్యం అనే చర్చ పెట్టినా కూడా, తెలంగాణ సాహిత్యం, ఆంధ్రా సాహిత్యం వేరుగా పెట్టవలసిందే. ఎందుకంటే అవి వేరు వేరు కాబట్టి. తెలంగాణకు సెపరేటుగా ఇన్విటేషన్‌ ఉండాల్సిందే.
అట్లాగే కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు కన్వీనర్‌లు ఒకసారి ఆంధ్రావారుంటే మరోసారి తెలంగాణ వారుండాలి. రొటేషన్‌ పద్ధతిలో మారాలి. అంతేగాకుండా అవార్డులు సైతం ఒక సంవత్సరం తెలంగాణ వారికి ఇస్తే, మరుసటి సంవత్సరం ఆంధ్రా/రాయలసీమ వారికి ఇవ్వాలి.

కేంద్ర ప్రభుత్వం తెలుగు వారందరికీ కలిపి ఏర్పాటు చేసిన ‘‘ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం’’ కార్యక్రమాల్లో తెలంగాణ ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉంటున్నది. తగిన ప్రాతినిధ్యం ఉండాలి. అసలు తెలంగాణ సాహిత్య ప్రాచీనత వల్లే తెలుగుకు ప్రాచీన హోదా లభించిందన్న విషయం గుర్తుంచుకోవాలి.

తెలంగాణలో ఉన్న వాగ్గేయకారులు, చిందు, డక్కలి, బైండ్ల తదితర కళలు వేరు. గొప్పనైన ఈ కళారూపాలను కూడా సాహిత్యంలో భాగంగా చూడాలి. ఆ కళల్లోనే బతుకుతున్న ఆ ఫోక్‌ ఆర్టిస్టులను గుర్తించి వారిని గౌరవించుకోవడం, వారికి డయాస్‌ ఇవ్వడం, అతిథులుగా పిలవడం ఆంధ్రావారి వల్ల కాదు. అది తెలంగాణవారు మాత్రమే చేసుకోగలరు.

కాబట్టి ‘తెలుగు’ పేరిట మొత్తంగా కొనసాగుతున్న ఆంధ్రాధిపత్యానికి ఇక తెరదించాల్సిందే! ఇప్పటి నుంచి మా ప్రాతినిధ్యాన్ని లాక్కుంటే సహించేది లేదు. ఇక మీది మీదే! మాది మాదే!! ఇక మీ సభలు, మీ కార్యక్రమాలు కావాలంటే ఆంధ్రాలో చేసుకోండి. ఇక చాలు మీరు చేసిన నిర్వాకం. మా సాహిత్యం మేం ప్రచురించుకుంటాం. మా సభలు మేం చేసుకుంటాం. ఇక చాలు అని తేల్చి చెబుతున్నాం.
సోదరభావం ఉంటే గింటే మా రచయితలను మీరు, మీ రచయితలను మేం అతిథులుగా పిలుచుకుందాం. దానికెవరూ అడ్డు చెప్పరు. ఈ వివక్షలకు, ఆధిపత్య పోకడలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగేదాకా లాగవద్దని కోరుతున్నాం.

– డా.సంగిశెట్టి శ్రీనివాస్‌, వఝల శివకుమార్‌, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, జూలూరి గౌరీశంకర్‌, అఫ్సర్‌, అన్నవరం దేవేందర్‌, డా.జిలుకర శ్రీనివాస్‌, స్కైబాబ, డా.పసునూరి రవీందర్‌, డా.నాళేశ్వరం శంకరం, పెద్దింటి అశోక్‌ కుమార్‌, డా.ఉదారి నారాయణ, ప్రొ.పులికొండ సుబ్బాచారి, అన్వర్‌, దాసోజు లలిత, గుడిపల్లి నిరంజన్‌, కుంజ కళ్యాణి, బిల్లా మహేందర్‌, పొట్లపల్లి శ్రీనివాసరావు, వనపట్ల సుబ్బయ్య, నరేష్కుమార్‌ సూఫీ, తైదల అంజయ్య, గాజోజు నాగభూషణం, కూకట్ల తిరుపతి, డా.పొన్నాల బాలయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, విలాసాగరం రవీందర్‌, కందుకూరి శ్రీరాములు, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, వేముగంటి మురళి, దాసోజు కృష్ణమాచారి, ఘనపురం దేవేందర్‌, రేడియం, కాంచనపల్లి గోవర్ధన్‌ రాజు, పెనుగొండ బసవేశ్వర్‌, డా.భీంపల్లి శ్రీకాంత్‌, ఎదిరెపల్లి కాశన్న, అవనిశ్రీ, నాగవరం బాల్‌ రాం, బైరెడ్డి కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న, డా.గాదె వెంకటేష్‌, డా.కటుకోజ్వల రమేష్‌, రూపా రుక్మిణి, తోకల రాజేశం, బోల యాదయ్య, మోత్కూరు శ్రీనివాస్‌, గోవింద్‌ గోవర్ధన్‌, విఠలాపురం పుష్పలత, పెరుమాండ్ల రాము, డా.వెల్దండి శ్రీధర్‌, శ్రీశైల్‌ రెడ్డి పంజుగుల, తండు కృష్ణ కౌండిన్య, పరిమళ్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌, వి.శంకర్‌, దాస్యం సేనాపతి, తూర్పు మల్లారెడ్డి, రాజు దుర్గాని, జి.ఎన్‌.స్వామి, మద్దెర్ల రమేష్‌, గండ్ర లక్ష్మణరావు, కె.వీరయ్య

చిత్రం: ఏలే లక్ష్మణ్

తెలంగాణ రచయితలు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలుగు పేరుతో తెలంగాణ సాహిత్యంపై ఆంధ్రా ఆధిపత్యం ఇక చెల్లదు అంటూ 60 మందికి పైగా తెలంగాణ రచయితలు చాలా స్పష్టంగా ప్రకటన చేయడం విశేషమే!
    ఇకనైనా కళ్ళు మూసుకొని తమను ఎవరూ చూడడం లేదని అనుకుంటూ లేదా అనుకుంటే మాకేం అని అదే పోకడ పోతూ తమ అకృత్యాలు కొనసాగిస్తున్న ఆ పిల్లులు జర సోయి లోకి రావాలి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు