నా పేరు కె.ఎ. మునిసురేష్ పిళ్లె. జర్నలిస్టును. సాహిత్యంలో కూడా సాధన చేస్తుంటాను.
చాలా కాలం నుంచి ఒక సంగతి నా మనసులో నిత్యం మెదలుతూ ఉండేది. ఊర్లో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా.. వాటి గురించి చెప్పడానికి, వాటిని నలుగురి దృష్టికి తీసుకువెళ్లడానికి జర్నలిస్టు తన పత్రికలో రాస్తాడు. ఆ సమస్య తీరడానికి తన వంతు తోడ్పాటు అందిస్తాడు. మరి జర్నలిస్టులకు కష్టం వస్తే ఎవరు రాస్తారు? అనే మధనం అది! మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం ‘సొంత డప్పు’ అని ఎలాగైతే అంటామో.. మన కష్టాల గురించి మనమే చెప్పుకోవడం కూడా అలాంటి ‘సొంత ఏడుపు’ అవుతుందేమో, స్వార్థం అనిపించుకుంటుందేమో అని అపోహపడే కాలం కూడా ఉండేది. అందువల్ల ఇలాంటి జర్నలిస్టు వెతల గురించి ఎవరూ రాసేవాళ్లు కాదు. జర్నలిస్టుల కష్టాల గురించి రాస్తే, ఆ కష్టాలను ప్రచురించి వెలుగులోకి తెచ్చే పత్రికాయాజమాన్యాలు కూడా సాధారణంగా ఉండవు.
నా బతుకులో జర్నలిస్టుగా వేస్తున్న అడుగులకు, సమాంతరంగా సాహిత్యంలో సాధన చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి వేదన మళ్లీ నన్ను మెలిపెడుతుండేది. అస్తిత్వవాద సాహిత్యం చూసినప్పుడెల్లా ఈ వేదన నన్ను ముల్లులా గుచ్చుతుంది. సాహిత్యంలో అస్తిత్వవాదం అనేది ఒక విడదీయగరాని బలమైన పెద్దభాగంగా నిలబడింది. కుల మత లింగ ప్రాంతీయ భాషా పరమైన అసమానతల నుంచి, అణచివేతల నుంచి, అవహేళనలనుంచి పుట్టిన అస్తిత్వరచనలు ఆయావర్గాల వేదనల్ని, ఉద్వేగాల్ని అద్భుతంగా ప్రతిఫలిస్తుంటాయి. ఆయా వర్గాల గురించి సరైన దృక్పథాన్ని, అవగాహనను మిగిలిన ప్రపంచానికి కలిగించే ప్రయత్నం చేస్తుంటాయి. ఒక వ్యక్తిని వేదనకు గురించేసి, మధనపెట్టి అక్షరాల్లో వ్యక్తీకరించేస్తే తప్ప ఉపశమించలేని బాధను కలిగించే ఇలాంటి ‘ములుగర్ర’లను నేను కూడా ఎరుగుదును. కులపరమైన హేళనలు, మతపరమైన నిందలు, భాషాపరమైన ఎకసెక్కేలు, ప్రాంతీయతా జాడ్యాలు అన్నీ చూశాను. కానీ, ఈ వర్గీకరణలకు లొంగని ‘షష్ఠముడి’గా నన్ను నేను సూత్రీకరించుకున్న కారణాన.. అవేమీ నన్ను బాధించలేదు. అస్తిత్వవాదంతో నేను రచనలు రాయలేదు. అలాగని, వాటిపట్ల నాకు వైనమస్యం లేదు. కానీ నన్ను మెలిపెట్టి, కుదురుగా ఉండనివ్వకుండా నాతో కథో కవితో రాయించే ఒక మనిషి యొక్క వేదన, పరితాపం ఈ వర్గీకరణలు అన్నింటికీ అతీతమైనదని నేను నమ్ముతాను.
‘ఎవ్వనిచే జనించు అక్షరమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందుడిందు వేదనారూపుండెవ్వడు మూలకారణం
బెవ్వడు కర్తయు కర్మయు క్రియయూయైన వాడెవ్వడు సర్వము దానయైన వా
డెవ్వడు వానిని బీజరూపుడౌ మనిషిని నే శరణంబు వేడెదన్’
అంటూ నేను నా సాహిత్య ప్రయత్నాలకు మూలకారకుడైన సగటు మనిషి జీవితాన్ని నిర్వచించగలను. నేను రాసే వాటికి ప్రేరణలు ఈ అస్తిత్వ వర్గీకరణలు అన్నింటిలోనూ ఇమడతాయి.. అన్నింటికీ అతీతంగానూ ఉంటాయి. ఆయా మూలబీజాలను బట్టి నేను కథో, కవితో, నవలో, వ్యంగ్యమో, వ్యాసమో, కార్టూనో రాస్తుంటాను.
కానీ జర్నలిజం అనేది నా డీఎన్ఏలో, జీవనక్రియలో ఒక భాగం. నానుంచి దానిని వేరు చేస్తే నా అస్తిత్వం లేదు. దేనిని నీ నుంచి వేరు చేస్తే నీకసలు రూపురేఖావిలాసాలే ఉండవో అదే కదా అస్తిత్వం అంటే! ఆ రకంగా చూసినప్పుడు ఈ ‘మీడియా కథలు’ అనేవి నేను చేస్తున్న అస్తిత్వవాద కథల ప్రయత్నం! రచయితల్లో ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు. కానీ జర్నలిస్టుల వెతలు కథాంశాలుగా వచ్చినవి తక్కువ. అలాగని, ఆ వృత్తిగతమైన జీవితాల్లో ఉండే బాధలు, కన్నీళ్లు కథాంశాలుగా తూకానికి నిలబడేవి కాదు అని చెప్పడానికి వీల్లేదు. ముందే చెప్పుకున్నట్టు– మన డప్పు మనం కొట్టుకోవాలంటే మొహమాటపడేవాళ్లు కొందరున్నట్టే.. మన ఏడుపు మనం ఏడవాలంటే సిగ్గుపడేవాళ్లు కొందరుంటారు. అలాంటి సిగ్గు విడిచి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. పైగా పత్రికా రచయితల జీవితాల్లో ఉండే చీకటి వెలుగుల పార్శ్వాలను పరామర్శించే ప్రయత్నాలు బయల్పడేందుకు వేదిక ఎక్కడ ఉంటుంది? జర్నలిస్టుల కష్టాలు రాస్తే ప్రచురించే పత్రికలు ఉంటాయా? అనే భయం కూడా నా ముందుతరం జర్నలిస్టు రచయితల చేతులు కట్టేసి ఉండొచ్చు.
జర్నలిజం జీవితాలు బండబారిపోవడం గురించి నేను రాసిన ‘రాతితయారీ’ కథకు ఇప్పుడు పాతికేళ్లు నిండాయి. ఇప్పటికీ కొందరు నన్ను ‘రాతితయారీ’ రచయితగానే గుర్తిస్తుంటారు. సిగ్గుపడాలో గర్వించాలో తెలియని మనఃస్థితిలోకి నన్ను నెడుతుంటారు. ఈ పాతికేళ్లలో జర్నలిజంలోని వ్యథల గురించే ‘గడ్డిబొగ్గులు’, ‘స్కోర్ ఐటెమ్’ అనే రెండు కథలు సారంగలోనే రాశాను. కానీ ఇవి చాలవు. అస్పృశ్యంగా ఉండిపోయిన ఈ వర్గంలో ఇంకా తోడుకోవలసినవి చాలా ఉన్నాయి. అనుభవాల లోతులు నావీ, నాబోటి అనేకమందివీ! వాటన్నింటికీ కూడా అక్షరం కట్టాలి! ఆ ఆలోచనతో ‘మీడియా కథలు’ సిరీస్ రాయాలనే ఆలోచన పంచుకున్నప్పుడు.. సారంగ సంపాదకులు అఫ్సర్ ఎంతగానో ప్రోత్సహించారు.
ఎందరో దిగ్దంతులు ఉన్న రంగంలో.. ‘మీడియా కథలు’ రాయడానికి నాకున్న అర్హత గురించి రెండు మాటలు చెప్పుకుంటాను.
ప్రింట్ మీడియా మూడు తరాలలో..
తెలుగు జర్నలిజం రంగంలో మూడు తరాలకు నేను ప్రతినిధిని. ఈ తరాల అంతరం పత్రికా, మీడియా రంగంలో వచ్చిన మార్పులకు సంబంధించినది. అలాగే ప్రస్తుత జర్నలిజంలోని మూడు విభాగాలకు కూడా నేను ప్రతినిధిని. ఈ విభాగాలు ప్రింట్, టీవీ, వెబ్ గా పేర్కొనదగినవి.
‘ప్రింట్’ మీడియాకు ముందు రాతపత్రికలు కూడా ఉండేవి. మా నాన్న ఆరంబాకం ఎల్లయ్య ఫుల్‌స్కేప్ పేపర్ల మీద కార్బను కాపీలు రాస్తూ రాతపత్రికను నడిపారు. తరువాత ‘ప్రింట్’ మీడియాలోకి వచ్చారు. కొన్ని వేర్వేరు ప్రయత్నాల తర్వాత 1970లో ‘ఆదర్శిని’ అనే వారపత్రికను స్థాపించారు. 1972లో నేను పుట్టాను. అప్పుడే ఆయన సొంత ప్రింటింగ్ ప్రెస్ కూడా ఏర్పాటుచేసుకున్నారు. నా విద్యాభ్యాసం పలకమీద ‘అ ఆ’లు దిద్దడంతో పాటు, కేసుల్లో ‘క గ చ’లు చదవడంతో ప్రారంభం అయింది.
ప్రింట్ మీడియాలో అక్షరాలు చిన్న చిన్న సీసపు దిమ్మెల రూపంలో ‘కేసు’ల్లో ఉంటే వాటన్నింటినీ ‘హ్యాండ్ కంపోజింగ్’ ద్వారా ‘స్టిక్’ అనే పరికరంలో కాలమ్ విడ్త్ కు సరిపడేలా కూర్చుకుని, ‘గేలీ’లో పేజీ మేకప్ చేసుకుని, ‘రోలర్’ ప్రూఫ్ తీసుకుని, ‘చెస్’ లో బిగించి, గూటెన్‌బర్గ్ కనుగొన్న ‘ట్రెడిల్’ మెషీన్ లో చేత్తో ఒక్కొక్క కాగితమూ ‘బెడ్’ మీద పెట్టి ప్రింట్ చేసే వ్యవస్థ ఉండేది. ఇదంతా కలిపి ‘లెటర్ ప్రెస్’ టెక్నాలజీతో కూడిన ముద్రణ వ్యవస్థ. సుప్రసిద్ధ రచయిత రావూరి భరద్వాజ కూడా తొలుత లెటర్ ప్రెస్ లో కంపోజిటర్ గా పనిచేసేవారు.
ఇది ఒకటోతరం! ఇదంతా చిన్న పత్రికలకు పరిమితమైన ముద్రణ సాంకేతిక వ్యవస్థ. అప్పటికే మెయిన్ స్ట్రీమ్ పత్రికల ముద్రణ వ్యవస్థ ఇంకోరూపంలో ఉండేది.
వార్తలు ‘టీపీ’ (టెలిప్రింటర్) మీద గానీ, ఇతర ప్రాంతాలనుంచి బస్సుల్లో కవర్ల రూపంలో గానీ వస్తాయి. వాటిని దిద్దడం, తిరగరాయడం జరుగుతుంది. కంప్యూటరు మీద ‘కంపోజ్’ అవుతాయి. అవి ‘బ్రోమైడ్’ రూపంలో మనం వాడదలచుకున్న ‘కాలమ్ విడ్త్’ తో కాగితం చుట్టలుగా బయటకు వస్తాయి. (అప్పట్లో ఫోటోలను అయొడైడ్ పేపర్ మీద ముద్రించే వారు. అలాంటిదే ప్రింటింగ్ ఇండస్ట్రీలో వార్తలను మేకప్ కు వాడుకునే బ్రోమైడ్ పేపర్ కూడా!) ఆ బ్రోమైడ్ ను మనం వాడదలచుకున్న ‘కాలమ్ హైట్’ కు సరిపడే ముక్కలుగా కత్తిరించుకుని, స్టాండ్ మీద ఉండే అద్దం పలకపై వెనుక వెలిగే ట్యూబ్ లైటు ‘కీషీట్’ గీతలను స్పష్టంగా చూపిస్తుండగా.. ఓ తెల్లకాగితం మీద సెల్లో టేపు ముక్కలతో అంటిస్తూ మేకప్ చేస్తారు. తర్వాత తీసుకెళ్లి ‘డార్క్ రూమ్’లో ‘కెమెరా’లో పెట్టి ఫిలిం నెగటివ్ తీస్తారు. ఆ నెగటివ్ మీద ఎక్కడైనా వైట్ డాట్స్ వస్తే ‘ఒపెక్’ పెట్టి.. రెడ్ టేప్ అంటించి రెడీ చేస్తారు. తర్వాత ‘ప్లేట్’ మీద పెట్టి ‘ఎక్స్‌పోజ్’ చేస్తారు. నెగటివ్ మీద ఉన్న అక్షరాలు, డిజైన్లు, ఫోటోలు అన్నీ యథాతథంగా ప్లేట్ మీదికి తిరగేసి వస్తాయి. లెటర్ ప్రెస్ ముద్రణ వ్యవస్థలో అక్షరాలు సీసపు (లెడ్) ముద్దలు. వెబ్ ఆఫ్ సెట్ ముద్రణ వ్యవస్థలో అక్షరాలు జింక్ ప్లేట్ మీదికి వస్తాయి. ఈ రెండు ముద్రణ రంగాల్లో ఈ రెండు లోహాలు కీలకంగా ఉండడానికి కారణం ఉంది. వీటి మెల్టింగ్ పాయింట్ తక్కువ.
లెటర్ ప్రెస్ లో అక్షరాలు పోతపోసి వాడుకోవాలి కాబట్టి.. అత్యల్ప మెల్టింగ్ పాయింట్ 327 సెల్సియస్ ఉండే సీసం (లెడ్) ఎంచుకున్నారు. కానీ లెడ్ చేత్తో వంచినా వంగిపోతుంది.. మెత్తటి లోహం. కాబట్టి, వెబ్ ఆఫ్‌సెట్ ముద్రణలో ఆ తర్వాతి మెల్టింగ్ పాయింట్ 419 సెల్సియస్ ఉండే జింక్ ను ఎంచుకున్నారు. జింక్ ప్లేట్ కొంచెం దృఢంగా ఉంటుంది. దాని మీది అక్షరాలు ఎక్స్‌పోజ్ అవుతాయి. ఆ ప్లేట్ ను వెబ్ ఆఫ్ సెట్ మెషిన్ లో పెట్టిన తర్వాత ప్రింటింగ్ జరుగుతుంది. కలర్ పేజీ అయితే నాలుగు రంగుల కోసం నాలుగు ప్లేట్‌లు వేయాలి. cmyk (సయాన్ మెజెంతా యెల్లో కీ) రంగుల ప్లేట్‌లు వాడితే.. ప్రింటింగ్ తర్వాత సమస్త రంగులు ఆ నాలుగింటిలోంచే తయారవుతాయి. సయాన్ అంటే లేత నీలం, మెజెంతా అంటే గులాబీ, యెల్లో పసుపు, కీ అంటే నలుపు రంగులు ముద్రణ రంగానికి మూలమైనవి. కలర్ పేజీ కోసం నాలుగు ఫిలింలను ప్లేట్ కు సిద్ధం చేయడం నిపుణుల పని. నాలుగు రంగుల కలర్ రిజిస్ట్రేషన్ మిల్లిమీటరులో పదోవంతు కూడా తేడా రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా జరగాలి. అందుకే ఆ విభాగంలో కలర్ పేజీలు నిపుణుల పని!
ఇది రెండోతరం! ఇదంతా మెయిన్ స్ట్రీమ్ పెద్దపత్రికలకు సంబంధించిన ముద్రణ వ్యవస్థ. సాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతుండగా ఈ వ్యవస్థలోని కొన్ని విభాగాలు పూర్తిగా ముద్రణ రంగం నుంచి అదృశ్యం అయిపోయాయి.
దూరపు వార్తలు తీసుకువచ్చే టెలిప్రింటర్లు, స్థానిక వార్తలూ ఫోటోలూ తెచ్చే బస్సు కవర్లూ ఇవన్నీ మాయమయ్యాయి. బ్రోమైడ్‌లు, మేకప్ స్టాండులు, పేజీ ఫిలిం కెమెరాలు, రెడ్ టేపులూ, ప్లేట్ మేకింగ్ మెషిన్లూ అన్నీ అంతరించిపోయాయి. కంప్యూటరులో వార్తలు వస్తాయి.. కంప్యూటరులోనే ఎడిటింగ్ జరుగుతుంది.. కంప్యూటరులోనే మేకప్ జరుగుతుంది.. కంప్యూటరు నుంచి ప్రింట్ కొడితే నేరుగా ప్లేట్ వచ్చేస్తుంది. ప్రింటింగ్ వ్యవస్థలో కొన్ని విభాగాలే మాయం అయిపోయాయి. పనిలో వేగం, నాణ్యత పెరిగాయి. పత్రికల రూపురేఖా లావణ్యాలు మెరుగుపడ్డాయి.
ఇదంతా మూడోతరం! ప్రస్తుతం నడుస్తున్న ఆధునిక ప్రింట్ మీడియా వ్యవస్థ తీరుతెన్నులు ఇవి. ఏఐ అనే సాంకేతిక విప్లవం.. ఏయే రంగాలను ఏయే రీతుల్లో ప్రభావితం చేసేయగలదో.. ప్రస్తుతం ఊహకు కూడా అందకుండా పోతున్న వర్తమానంలో.. ఇప్పటి సాంకేతికత ఎంత త్వరగా ఎలాంటి మార్పు చేర్పులకు లోనవుతుందో చెప్పలేకపోతున్నాను.
ప్రింట్ మీడియాలో ఈ మూడు తరాలకు నేను ప్రతినిధిని.
1980వ దశకం తొలినాళ్లలో ఈ లెటర్ ప్రెస్ రంగంలోకి నా ప్రమేయం ఏమీ లేకుండానే నాన్ వర్కింగ్ జర్నలిస్టుగా నా వృత్తి ప్రస్థానం ‘కంపోజిటర్, ప్రింటర్’ రూపాల్లో ప్రారంభం అయింది. ఆ దశకపు మలినాళ్లలోనే జర్నలిస్టుగా కూడా మా నాన్న సంపాదకత్వంలో వెలువడే ఆదర్శిని వారపత్రికలో చిన్న చిన్న వ్యాసాలు, కవితలు రాయడంతో ప్రారంభం అయింది. జర్నలిజంలో నాకు అక్షరాభ్యాసం చేయించిన, విద్య నేర్పిన తొలిగురువు మా నాన్న ఆదర్శిని ఎల్లయ్య!
1990వ దశకం తొలినాళ్లలో అంటే 1991 ఫిబ్రవరి 4న ఈ మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ మీడియాలోకి ఉత్సాహం కొద్దీ ప్రవేశించాను. ఉదయం దినపత్రికలో ఎన్నెమ్మార్ సబ్ ఎడిటర్. అప్పటికి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీ పూర్తయ్యాక 1993లో ఈనాడులో ఎన్నెమ్మార్‌గా చేరాను. ఉదయంలో పొదలకూరు మధుకుమార్ ప్రోత్సహిస్తే, ఈనాడులో వట్టికూటి శ్రీనివాసరావు నన్ను దిద్దారు. ఈనాడు జర్నలిజం స్కూలులో ప్రిన్సిపల్ బూదరాజు రాధాకృష్ణ, తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి ల శిష్యరికం రాటుదేల్చింది. ఈ జర్నలిజం అభ్యాసానికి సమాంతరంగా ఈ రంగంలో బ్రోమైడ్ పేజ్ మేకప్, ఫిలిం తీయడం, ప్రాసెస్ డిపార్టుమెంట్ లో రెడ్ టేపులు అంటించి రెడీ చేయడం, ప్లేట్ మేకింగ్ ఈ పనులన్నీ నేర్చుకున్నాను. సబ్ ఎడిటర్ గా నాకు సంబంధించినవి కాకపోయినప్పటికీ నా ముచ్చటకోసం నేర్చుకున్నాను. నా పేజీ బ్రోమైడ్ లతో నేనే మేకప్ చేసేసి, ఫిలిం తీసి, ప్లేట్ వేసేసి ఆ ప్లేట్ ను మెషిన్ సెక్షన్ లో అప్పజెప్పేసి ఇంటికెళ్లిపోయేవాడిని. వెబ్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ మెషిన్ ఆపరేట్ చేయడం మాత్రం నా చేతుల మీదుగా జరగలేదు!
2000 వ దశకం తొలినాళ్లలోనే మూడో తరం మార్పు చేర్పులన్నీ చోటు చేసుకున్నాయి. అంతకు ముందే మొదలై, అప్పటికి స్థిరపడి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ కొత్త సాంకేతిక విప్లవాలన్నింటినీ అందిపుచ్చుకోవడంలో తొలిఅడుగులు వేసిన వాళ్లలో నేనూ ఒకడిని. నన్ను దిద్దిన గురువులు మారారు. వీరందరూ నాన్ జర్నలిస్టిక్ గురువులు. డినారె, హేమచంద్రారెడ్డి, బలరాం, మధు, నాగేశ్వర్రావు లాంటి వాళ్లున్నారు. ఈనాడులో కంప్యూటరు మీద కంపోజింగ్, క్వార్క్ ఎక్స్‌ప్రెస్ లో పేజీ మేకప్, ఫోటోషాప్‌లో డిజైనింగ్ తదితరాలు అన్నీ అబ్బాయి.
లెటర్ ప్రెస్ కేసులు, ట్రెడిల్ ప్రింటింగ్ మెషిన్లు, బ్రోమైడ్‌లు, పేజీ మేకప్ స్టాండులు, నెగటివ్ కెమెరాలు, ప్రాసెస్ టేబుళ్లు ఇవన్నీ కాలక్రమంలో అంతరించిపోయాయి. టీపీ మెసేజీల కాగితపు ముక్కలు, డాట్ మేట్రిక్స్ ప్రింటవుట్లు, వార్తలు తిరగరాసే రఫ్ ప్యాడ్‌లు, రాసేసిన వార్తలను కొన్నాళ్లు భద్రపరచడానికి గుచ్చే ‘స్పైక్’లు, ఫోటోల కట్టలు, ఫోటోల యొక్క నెగటివ్/పాజిటివ్ కట్టలు అన్నీ అంతరించిపోయాయి.
సాక్షీభూతుడిగా నేను మిగిలాను.
వ్యవస్థలు రూపు మార్చుకుంటూ ఉంటాయి. కొత్తవి వస్తుంటాయి. పాతవి పోతుంటాయి. కానీ ఆయా వ్యవస్థలతో విభాగాలతో ముడిపడిన జీవితాల్లోని సంక్లిష్టతలు, వెతలు ఎప్పటికీ సజీవమైనవే. కనీసం స్మరణార్హమైనవి. అప్పటినుంచి ఇప్పటిదాకా నా అనుభవంలోని, నా ఎరుకలోని అలాంటి కొన్నింటిని రికార్డు చేసే ప్రయత్నం ఈ ‘మీడియా కథలు’.
జర్నలిజం త్రిముఖ స్వరూపాలలో..
జర్నలిజం ఇవాళ త్రిముఖాత్మకంగా వర్ధిల్లుతోంది. ప్రింట్, టీవీ, వెబ్ విభాగాలుగా ఉంది. ఈ మూడు విభాగాల్లో నాకు ప్రవేశం ఉంది. ప్రింట్ మీడియాలో మూడు తరాల ప్రాతినిధ్య ప్రస్తావన ముందే చెప్పాను. టీవీ రంగంలో ఎన్ టీవీ ప్రారంభించినప్పుడే అందులో కొన్ని ఫీచర్ కార్యక్రమాలు రూపకల్పన చేసి నిర్వహించాను. అలవాటు ప్రకారం– అక్కడ పనిచేస్తున్న కాలంలో, ఆ తరువాత వీడియో– ఆడియో ఎడిటింగ్, వీడియో గ్రాఫిక్స్ తదితర నైపుణ్య సంపత్తిని సమకూర్చుకున్నాను.
‘వెబ్’ లో చిక్కుకుపోవడం అనేది 2001లో జరిగింది. వెబ్ అంటే సాలెగూడు అనే నిర్వచనం కరక్టే. 2001లో ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ ప్రారంభం అయినప్పుడు దానికి ఇన్ఛార్జిగా వచ్చాను. రోజుకోసారి పత్రికలోని వార్తలు మాత్రమే పోస్టు అయ్యే వెబ్ సైట్లో పగటిపూట కూడా వార్తల లైవ్ అప్ డేట్స్ ప్రారంభించడం ఆరోజుల్లో ఒక విప్లవం. వెబ్ రంగం కూడా html పేజీల నుంచి .net, php, wordpress తదితర రూపాల్లోకి మారింది. అయితే ఈ మార్పులన్నీ చాలా త్వరత్వరగా జరిగాయి. WordPress ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఇందులోనూ టెక్నికల్ డిజైనింగ్, అంతో ఇంతో ప్రోగ్రామింగ్ పనులు నేర్చుకుని ముందుకు సాగుతున్నాను. ఎడిటింగ్ లో కిరణ్, వర్డ్ ప్రెస్ లో బలరాం గురువులుగా తొలిపాఠాలు నేర్పారు.
ఇలా ఇవాళ జర్నలిజం వర్ధిల్లుతున్న త్రిముఖ స్వరూపాలలోనూ నా అస్తిత్వం ఎన్నదగిన మోతాదులో ఉండిపోయింది.
నా కులమూ, మతమూ, గోత్రమూ, వంశమూ, బతుకుతెరువూ, అభిరుచీ సమస్తమూ జర్నలిజమే. ప్రింట్ మీడియాలో ఈ మూడు తరాలు, జర్నలిజంలో ఈ మూడు విభాగాలలో ప్రాతినిధ్యం ఉన్న వ్యక్తిగా నాకు ప్రాథమిక అర్హత ఉందనుకుంటున్నాను. అలాగే మూడు కథాసంపుటాలు ‘పూర్ణమూ నిరంతరమూ’, ‘రాతితయారీ’, ‘గారడీవాడు’, రెండు నవలలు ‘సుపుత్రికా ప్తాప్తిరస్తు’, ‘పుత్రికాశత్రుః’, ఒక కవిత్వ సంపుటి ‘షష్ఠముడు’, ఒక సంపాదకీయ కథనాల సంపుటి ‘మునివాక్యం’ వెలువరించిన రచయిత అనుభవం కూడా అదనపు అర్హత కాగలదని నమ్ముతున్నాను. అలా కలిగిన ధైర్యాన్ని చిక్కబరుచుకుని ‘మీడియా కథలు’ మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పొప్పులు చెప్పి, దిద్ది ప్రోత్సహించండి.
ప్రేమతో మీ,
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
ఇప్పటి తరం విలేఖరులకు ఇవన్నీ తెలియదు. మీరు మూడు తరాల ముద్రణతో పని చేయడం విస్తృతానుభవాన్ని అందించింది.
మీరు మీడియా కథలు రాయడం మొదలుపెడితే, నాలాంటి చాలా మందికి స్ఫూర్తి కలుగుతుంది. మిమ్మల్ని గురువు స్థానంలో ఉంచుకుని నేనూ రాయడం మొదలుపెడతాను.
థాంక్యూ అశోక్..
గురు స్థానానికి అర్హత ఉన్నదో లేదో తెలియదు గానీ.. మీడియా కథలు మాత్రం తప్పకుండా చదవండి. ఆ రంగం లోని వివిధ పార్శ్వాలు నా దృక్కోణంలో మీకు తెలుస్తాయి. మీరు సొంతంగా ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకోవచ్చు.
మీరు రాయడం ప్రారంభిస్తే మా అందరి ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.
😊
జర్నలిజం రంగంలో ఇంత సుదీర్ఘ అనుభవం… అదో అద్భుతం. చిన్న వయసులోనే తండ్రికి చేదోడుగా నిలవాలన్న తాపత్రయం ఈ రచయితకు అదనపు ఆస్తిని సమకూర్చింది.
సురేష్ పిళ్లెతో కొద్ది కాలం కలసి పని చేశాను. అప్పుడు ప్రత్యక్షంగా చూశాను, అతని బహుముఖ ప్రతిభ. కథనాలు రాయటానికే నేను సతమతమవుతూ ఉంటే, తను పేజీ మేకప్ చూసేవాడు. బ్రౌజ్ చేసి, అవసరమైన బొమ్మలు డౌన్లోడ్ చేసేవాడు. దొరక్కపోతే, తనే గీసేవాడు.
ఇంకా బోలెడు వ్యవహారాల్లో సమర్థంగా కాలూ చెయ్యీ దూర్చేవాడు. నిస్సందేహంగా అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు.
“దేనిని నీ నుంచి వేరు చేస్తే నీకసలు రూపురేఖావిలాసాలే ఉండవో అదే కదా అస్తిత్వం అంటే!”
చాలా బాగా చెప్పావు మిత్రమా. ఇప్పుడీ కథలు చెప్పటానికి నీకు సంపూర్ణ అర్హత ఉంది. నీ కథల్లో నా కథా రావొచ్చు. మన మిత్రులందరి బతుకులూ కనిపించొచ్చు.
ఎన్నో బతుకుల అనివార్య నగ్నత్వాన్ని నువ్వు దగ్గర్నుంచి దర్శించావు. అదే నీ అర్హత.
నీ సంకల్పానికి వేదికను సమకూర్చిన సారంగ సారథులకు అభివందనం.
– ఎమ్వీ రామిరెడ్డి
రామన్నా ..
నీ ప్రోత్సాహానికి చాలా థాంక్స్.
చాలామంది మిత్రుల కథలు ఈ సిరీస్ లో రావాలి నిజమే.
అందరి మిత్రుల కథలు సిరీస్ లోకి ఇమడగలవో లేదో గానీ.. ప్రతి కథ కూడా చాలా మంది మిత్రుల అనుభవాలను, జీవితాలను అద్దంలాగా చూపించగలదనే నమ్మకంతో ప్రయత్నిస్తున్నాను.
ప్రింట్ మీడియా మార్పులు బాగా చిత్రికపట్టి చూపారు..
కథకుడిగా మీ ప్రయాణం కూడా వైవిధ్యమే
థాంక్యూ రాంబాబు గారూ..
ఒక వర్గం విస్మృతికి గురికాకుండా చేస్తున్న ప్రయత్నం ఇది.