మాక్సిన్ కేస్ దక్షిణ ఆఫ్రికాకి చెందిన యువ కథా , నవలా రచయిత్రి. జనవరి 17, 1976 లో కేప్ టౌన్ లో జన్మించారు. ఆమె న్యూయా ర్క్ లోని “మాక్సిన్ న్యూ స్కూల్” లో సృజనాత్మక రచనలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ సంపాదించారు. మాక్సిన్ కేస్ దక్షిణ ఆఫ్రికాతో పాటు అనేక దేశాల ప్రముఖ ప్రచురణ సంస్థలకు విరివిగా రాసింది. ఆమె రచనలు డచ్, జపనీస్, మాండరిన్ వంటి అనేక భాషలలోకి అనువదించబడ్డాయి.
ఫోర్డ్ ఫౌండేషన్ నిర్వహించే ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కార్యక్రమంలో ఒక సభ్యురాలు. అయోవా యూనివర్సిటీ లోనూ, హాంగ్ కాంగ్ బాప్టిస్ట్ యూనివర్శిటీ లోనూ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ లున్నాయి. పిట్స్ బర్గ్ నగరంలో రెసిడెన్స్ రైటర్ గా నవంబర్ ఫిబ్రవరి 2009 నుంచి ఫిబ్రవరి 2010 వరకూ గౌరవ సభ్యురాలు.
హెర్మన్ చార్లెస్ బోస్మాన్ అవార్డు( Herman Charles Bosman Prize”- 2007) కి ఉమ్మడి విజేత. ఆమె ఇటీవలి పుస్తకం” పాప్వా: గోల్ఫ్స్ లాస్ట్ లెజెండ్”( Papwa: Golf’s Lost Legend-2016)అలన్ పాటన్ అవార్డు (Alan Paton Award)కు ఎంపికయింది.
ఆమె తొలి నవల “All we have said Left Unsaid” . మరణ శయ్య మీద రోజు రోజుకీ కృoగి కృశించి పోతున్న తల్లిని నిస్సహాయంగా చూస్తూ తల్లీ -బిడ్డల ప్రేమ బంధాన్నిగుర్తు చేసుకుంటూ , చాలా హృద్యంగా సరళమైన భాషలో చిత్రీకరిస్తుంది రచయిత్రి. తండ్రి తమను వదిలి వెళ్లడాన్ని,రాజకీయంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితుల్ని కూడా ఈ నవలలో విశదీకరిస్తుంది. ఈ నవల కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ ఫర్ బెస్ట్ ఫస్ట్ బుక్ (Commonwealth Writers Prize for Best First Book) గా ఆఫ్రికా ప్రాంత అవార్డు గెల్చుకుంది. ఈ నవలని ప్రతిష్టాత్మక క్వేలా (Kwela) సంస్థ ప్రచురించింది. మరణం-ప్రేమ ల గురించి చర్చించిన ఈ పుస్తకం విశేషంగా ప్రపంచ విమర్శకుల, ప్రజల మన్నన లందుకుంది.
ఇది “మాక్సిన్ కేస్” రాసిన “Homing Pigeons”అనే కథకి నా స్వేచ్చానువాదం.
~
మిస్టర్ పీటర్సన్ శరీరం చిన్నగా, సన్నగా ఎముకల గూడులా ఉంటుంది. జనం ఆయన గురించి చాలా కోపిష్టి అనీ, సరైన పోషణ లేని కోడిపుంజులా కనిపిస్తాడని అంటారు. సరిగ్గా మా ఇంటికి ఎదురుగా ఉంటుందతని ఇల్లు. మా నాన్నమ్మ మిస్టర్ పీటర్సన్ కొన్ని సంవత్సరాలుగా పొరుగునే ఉన్నప్పటికీ వారి మద్య స్నేహం కుదరలేదు. ఒకరికొకరు ఎదురు పడినప్పుడు మాత్రం మర్యాదగా పలకరించుకుంటారు. హలో హలో అంటూ మామూలు మాటలు మాట్లాడు కుంటారు.అంతే! అంతకు మించి వారిద్దరి మద్యా సంభాషణ ముందుకి సాగదు. మిస్టర్ పీటర్సన్ మనలాగా ఉన్నత తరగతి మనిషి కాదంటుంది మా నాన్నమ్మ! అంటే ఏమిటి నాన్నమ్మా? అని నేనడిగితే నావైపు ఒక చురుక్కుమనే చూపు చూస్తుంది. మళ్ళీ ఆ మాటకొస్తే చాలామంది మన ఉన్నత తరగతి వాళ్ళు కాదని చెప్తుంది.
మిస్టర్ పీటర్సన్ చాలా సంవత్సరాలు సన్ రైజ్ బేకరీకి డెలివరీ మేన్ లాగా పని చేశారు. కోడి కూతకు ముందే నిద్ర లేచి, తయారైపోయి, ఈల వేస్తూ తన పాత, ఆకుపచ్చ డాట్సన్ బండిని నడుపు కుంటూ వెళ్ళిపోయేవారు. ఎల్సీస్ నది వరకూ వెళ్ళి, అక్కడ పెద్ద ట్రక్ నిండా పేర్చిన బ్రెడ్ ని సేకరించేవారు.
నా ముందునుంచి ఎప్పుడు బ్రెడ్ ట్రక్ వెళ్ళినా నేను మెడ తిప్పి మిస్టర్ పీటర్సన్ కనిపిస్తారేమోనని ఆశతో చూసేదాన్ని. కానీ నేనెప్పుడూ ఆయన్ని చూడలేదు, ఎందుకంటే ఆయన వెళ్ళే దారి ఎక్కడో దూరంగా టౌన్ షిప్ వైపుండేది. నేను స్కూలు నుంచి వచ్చేటప్పటికి ఆయన తన మామూలు స్థలంలో వరండాలో చెక్క బెంచ్ మీద కూర్చుని పైప్ పీలుస్తూ గోల్డ్ క్రాస్ డబ్బాపాలతో చేసిన తియ్యని టీ చప్పరిస్తూ కనిపించేవారు.
ఔను, గోల్డ్ క్రాస్ చాలా ఖరీదని మిస్టర్ పీటర్సన్ కి తెలుసు, కానీ అతను తనకోసం తాను అనుభవించ దలచుకున్న లగ్జరీ అదొక్కటే కాబట్టి అది అతనికి సంతోషమే! ప్రతి మధ్యాహ్నం నుంచి 5 గంటల వరకూ మిసెస్ పీటర్సన్ రాత్రి భోజనానికి టేబిల్ దగ్గరకి రమ్మని పిలిచేవరకూ తన వరండా నుంచి ప్రపంచాన్ని చూస్తూ కూర్చుని ఉండేవారు. శని, ఆది సెలవు దినాల్లో పెళ్ళి వారి కార్లు ముఖ్యంగా వధువులను చర్ఛ్ కి డ్రైవ్ చేసేవారు. వాటినుంచి వచ్చిన డబ్బుని మిస్టర్ పీటర్సన్ వేరే ఒక ప్రత్యేక పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ చేసుకునేవారు. ఈ పొదుపు చేసిన డబ్బుతో అతను ఏదో ఒక రోజు విదేశాలకు వెళతాడని ప్రతి ఒక్కరికీ తెలుసు.
“మిస్టర్ పీటర్సన్ కి ఎక్కువ ఖర్చులుండవు. అతనికీ ఇల్లు తన దివంగత తండ్రి నుంచి స్థిరాస్తిగా సంక్రమించింది. కానీ అతనికీ కొడుకు గాక ఇంకొక వారసుడున్నాడు”. అని నాన్నమ్మ చెప్పింది.
“అంటే ఎవరమ్మా? మీ ఉద్దేశ్యమేమిటి? అనడిగాను.
“అతని తండ్రి యుద్ధంలో పోరాడారు” నాన్నమ్మ తన చూపును ఎటో దూరంగా నిలిపి, “ఇటలీ లో ఆయన కొక మహిళతో సంబంధముందని కొందరు చెప్తారు. ఒక తెల్లజాతి మహిళ!
జాగ్రత్తగా విను, అతని తండ్రి వల్ల ఆమెకొక కుమారుడు కలిగాడని కూడా మరికొందరు చెప్తారు!
ఇలా ప్రత్యేకంగా కనిపించే వ్యక్తుల ఆంతరంగిక విషయాలంటే పడి చచ్చే నేను ఎగిరి గంతేసి “నిజంగానా అమ్మా?” అనడిగాను. కానీ ఆ తర్వాత నా కుతూహలం చూసి నాన్నమ్మ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు!
ఓహో! మిస్టర్ పీటర్సన్ అందు వల్ల తన చిన్న తమ్ముడిని చూడడానికి ఇటలీ వెళ్ళి రావడానికి డబ్బు పొదుపు చేస్తున్నాడనుకుంటా-అనే ఆలోచనల్లో నేను పరధ్యానంలో పడిపోయాను.
మిస్టర్ పీటర్సన్ ఇక్కడినుంచి ఎంతో దూరం ప్రయాణించి ఇటలీ దాకా వెళ్ళి ఆయన తమ్ముణ్ణి చూడడమంటే నాకు చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే తన పక్కింట్లోనే ఉన్న ఆయన సోదరితో ఆయనకు ఎన్నో ఏళ్ళ నుంచి మాటలు లేవు. వాళ్ళెందుకు మాట్లాడుకోరో, ఎప్పటినుంచి మాట్లాడుకోరో ఎవరికీ తెలియదు. వాళ్ళు కలిసి మాట్లాడుకున్న సమయాలెవరికీ గుర్తు లేవు. ఒక చిన్న గోడ ఆ రెండు కుటుంబాలనూ విడదీస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ గొడవ పడిన సందర్భాలు కూడా కనపడవు. మిస్టర్ పీటర్సన్ తన భార్యా,బిడ్డల్ని ఆయన చెల్లెలితో గానీ,ఆమె కుటుంబ సభ్యులతో గానీ అసలు మాట్లాడనివ్వరు. ఇది మాత్రం చాలా బాధాకర మైన విషయం. కానీ ఇప్పటికీ రెండు కుటుంబాల వారూ, వారి తలిదండ్రుల వివాహం జరిగిన, బాప్టిజం పొందిన చర్చికే ప్రార్ధనలకు హాజరవుతారని నాన్నమ్మ చెప్పింది.
మిస్టర్ పీటర్సన్ ఇంట్లో ఆయన భార్య మేవిస్, కుమార్తె లిజ్జీ, కుమారుడు ప్యాట్రిక్ ఉంటారు. వీళ్ళు కాక ఆయన అత్తగారు మిసెస్ ఆరెండ్స్ కూడా ఉంటారు. ఇంట్లో అంతా ఆడగుంపే ఉన్నందువల్ల ఎక్కువగా తన సమయాన్నంతా మిస్టర్ పీటర్సన్ బయటే గడిపి వస్తారని చెప్తుంది నాన్నమ్మ . మిసెస్ ఆరెండ్స్ నీ, మిసెస్ మేవిస్ నీ, మిస్ లిజ్జీనీ అలాగే గౌరవంగా పిలుస్తాం గానీ ప్యాట్రిక్ ని మాత్రం కేవలం ప్యాట్రిక్ అని మాత్రమే చనువుగా పిలుస్తాం. ప్యాట్రిక్, తండ్రి లాగే నల్లగా , సన్నగా, పీలగా ఉండడం వల్ల మిస్టర్ పీటర్సన్ నోట్లోంచి ఊడిపడ్డాడని జనం చెప్తారు. ప్యాట్రిక్ అతని తండ్రి లాగా ఉండనే ఉండడని నాకనిపిస్తుంది.ఎందుకంటే మిస్టర్ పీటర్సన్ ముఖంలో మచ్చలు,మొటిమ లుంటాయి. ప్యాట్రిక్ ముఖం నునుపుగా చక్కగా, అందంగా ఉంటుంది. నన్నెప్పుడు చూసినా అతను నవ్వుతూ నాపేరు పెట్టి పిలుస్తాడు. కొన్నిసార్లు అతను తన జేబులోని బాక్స్ నుంచి నాకు ఒక మింట్ ఇంపీరియల్ బయటకు తీసిస్తాడు. అతనెప్పుడూ పిప్పరమింట్స్ నములుతూనే ఉంటాడు. బయోస్కోప్ వెనక సిగరెట్లు కాలుస్తాడు.కాబట్టి ఆ వాసన ఇతరులు పసికట్టే వీల్లేకుండా పిప్పరమింట్స్ నములుతాడని చెప్తుంది నాన్నమ్మ. వాళ్ళు తమని తాము చాలా ఎక్కువ శక్తివంతమైన వారు అనుకుంటున్నప్పటి నుంచీ ఇలా జరుగుతుందట!
మిస్టర్ పీటర్సన్ కుటుంబం చాలా దైవభక్తిగల వారని మా అమ్మ ఉద్దేశ్యం. నేను కడుపున పడినప్పటినుంచి మా కుటుంబం చర్చికి వెళ్ళలేదు. ఎందుకంటే నా తల్లి నా తండ్రిని చట్టప్రకారం వివాహం చేసుకోలేదు. అందువల్ల చర్చి ఫాదర్ నాకు బాప్తీజం ఇవ్వడానికి నిరాకరించారు.
మిస్టర్ పీటర్సన్ సోదరి మిసెస్ సెప్టెంబర్. ఆమె భర్త చాలా ఏళ్ళ క్రితం ఒక కారు ప్రమాదంలో మరణించాడు. ఆమె కిద్దరు కుమార్తెలు మే, జూన్ లు ఆమెతో నివశిస్తున్నారు. వాళ్ళని మిస్ మే, మిస్ జూన్ అని పిలవాలని అమ్మ నాకు నేర్పించింది. ఏదైనా ఒక కబురు చెప్పి రమ్మని అమ్మ నన్ను వాళ్ళింటికి పంపినప్పుడు వాళ్ళు ఒక చిన్నగదిలో ఉంచిన బిస్కట్ బారెల్ నుండి నాకు మేరీ బిస్కెట్లు ఇచ్చేవారు. ఆదివారం ఉదయం చర్చికి వెళ్ళే ముందు, మిసెస్ సెప్టెంబర్ దేవుని స్తుతిస్తూ భక్తి కీర్తనలు పాడేవారు. ప్రభాత వేళ ఆమె సంగీతం మధురమైన సెలయేటి ప్రవాహంలా చెవులకింపుగా సోకి ఇరుగు పొరుగుని మేల్కొలిపేది. ఆదివారాలు మాత్రమే ఆ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉండేవి. దొంగలు, ముస్లింలు, నల్లజాతి పురుషులు మొదలైనవారు ఇళ్ళల్లో పడి బెదిరించి దోచుకుంటారని ఆమె భయం. అటువంటివేవీ జరక్కుండా ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళ ఇంటి తలుపు ట్రిపుల్ బోల్ట్ పెట్టి ఉంటుంది. ఆ ఇంటి కర్టెన్లు కూడా ఎప్పుడూ తెరుచుకోవు, ఒక్క ఆదివారం మాత్రమే సూర్యకాంతి లోపలికి ప్రవేశిస్తుంది, సువార్త గానం బయటికొస్తుంది.
ఒకసారి మా పొరుగున ఉండే ముస్లిం ఒకాయన మిసెస్ సెప్టెంబర్ గారి ఈ భక్తి శ్లోకాల శబ్దకాలుష్యం గురించి ఫిర్యాదు చేశారు. దానికి ఆమె పక్కనున్న మశీదు నుంచి ప్రతి ఉదయం చెవులు చిల్లులు పడే శబ్దాలొస్తున్నప్పుడు నా నిద్రా భంగమైనప్పుడు నేనేమైనా ఫిర్యాదు చేశానా? అని గట్టిగా, చాలా సహేతుకంగా ఎదురుదాడికి దిగింది. ఈ అభిప్రాయంతో అక్క చెల్లెళ్ళిద్దరూ మిస్ మే, మిస్ జూన్ లు ఏకీభవించారని అమ్మ నాకు చెప్పింది. తన సోదరి నిశ్శబ్ద వైరం నుంచి తప్పించుకోవడానికి మిస్టర్ పీటర్సన్ విదేశానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడని నాకనిపించింది.
మిస్టర్ పీటర్సన్ కి అచ్చం ఆయనలాగే పోలికలున్న ఇంకొక చెల్లెలుంది. ఆమె పేరు ఎస్తేర్ . అందరి కన్నా చిన్నది. ఆమె చిన్నతనంలోనే మిస్టర్ పీటర్సన్ కుటుంబాన్ని వదిలి లండన్ లో చాలా దూరంలో నివసిస్తున్నదని అమ్మ చెప్పింది. ఆ రోజుల్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళదలచుకుంటే ఓడ ద్వారా సముద్రయానంలో వెళ్ళాలి. అలా ఎస్తేర్ ఇక్కడ యూనియన్ కోట నుంచి బయలుదేరిన చివరి ఓడలో ప్రయాణించి వెళ్ళింది. దీన్నిబట్టి ఎస్తేర్ కూడా వయసులో మరీ చిన్నదేం కాదు, పెద్దదైయ్యుంటుందని నేనూహించాను!
అతి చల్లగా ఉన్నఆ ఓడ కొన్ని రోజుల తర్వాత “ఎప్పుడూ వర్షాలు కురిసే లండన్” చేరుకుంది. కొంతకాలం తర్వాత ఆమె ఒక తెల్లజాతి యువకుణ్ణి కలుసుకుంది. ఆ కలయిక వారి వివాహానికి దారితీసింది. అందుకని కూడా మిస్టర్ పీటర్సన్ లండన్ వెళ్ళి తన చెల్లెల్ని చూడాలను కుంటుండొచ్చు. ఆమె అందమైనదే కాక మంచి మనసున్న మనిషట. మిస్టర్ పీటర్సన్ తన సోదరి ఆతిధ్యాన్ని ఆస్వాదించాలని ఆశపడుతుండొచ్చు.
అతను అదొక రకమైన మనిషి. అతనిని చూసిన ప్రతిసారీ నేను సంతోషంగా ఇష్టంగా విష్ చేసేదాన్ని. మిస్టర్ పీటర్సన్ మాత్రం కొన్నిసార్లు వెనకనుంచి ఎవరో తరుముకొస్తున్నట్లు “గుడాఫ్టర్నూన్ అమ్మాయీ!” అనేవారు. కానీ ఎక్కువసార్లు కోపంగా చిర్రు బుర్రులాడుతూ గొణుక్కునేవారు. మా పొరుగు పిల్లలు కావాలనే మిస్టర్ పీటర్సన్ గార్డెన్ లోకి బంతి విసిరేవారు. నిజానికది గార్డెన్ కానే కాదు. కాస్తంత ఇసుక, మట్టితో ఉన్న కాస్త నేల. మిస్టర్ పీటర్సన్ కి మొక్కల్ని పెంచి పోషించ గల ఓపిక లేదని నాన్నమ్మ చెప్పింది.
మిస్టర్ పీటర్సన్ తండ్రి బతికున్నప్పుడు చెట్లని ప్రాణప్రదంగా పెంచేవారు. అతని తోటలో ఉన్న విన్బెర్గ్ వాడ కట్టు మొత్తంలోనే ఎత్తైన దాలియా మొక్కలు రంగు రంగుల పుష్పాలతో అందంగా ఉండేవి. అతను నాకు ఆ మొక్క దుంపలు కూడా ఇచ్చేవారు. తండ్రి మరణించిన తరువాత ఆయన కుమారుడైన ఈయన మాత్రం తోట మొత్తాన్ని నాశనం చేసేశాడు అంటూ నాన్నమ్మ తన చూపుల్ని మిస్టర్ పీటర్సన్ ఇంటి వైపు తిప్పుతూ విరక్తిగా ఒక వచ్చీ రాని నవ్వును పెదాల మీదికి తెచ్చుకుని “బహుశా అతను మొక్కలకు కావలసిన నీటి ఖర్చు కూడా వృధా అనుకుని ఉంటాడు” అన్నది.
నేను చాలా తెలివి గల దానిలాగా “ఔను”అంటూ తలాడించాను.
“మిస్టర్ పీటర్సన్ నాగరికత తెలియని మోటు మనిషి.నిరాశాజీవి. దుఃఖితుడు. బహుశా అందుకే అతను తన పద్ధతులను గానీ, అనుసరించే జీవన విధానాలను గానీ ఎవరూ తెలుసుకోకుండా ఉండాలనే విదేశీ యానం చెయ్యాలని కోరుకుంటాడనుకుంటా!” అని నాన్నమ్మ చెప్పింది.
కానీ మిస్టర్ పీటర్సన్ కి ఒక విషయలో మంచి అభిరుచి ఉంది. తన ఇంటి వెనుక భాగంలో చెక్కతో ఒక పెద్ద పావురాల పంజరాన్ని నిర్మించారు. సాయంత్రం భోజనం తర్వాత ఆయన నేరుగా పావురాల దగ్గరికే వెళ్ళి, తన సమయాన్నంతా పావురాలకు తిండి పెడుతూ, వాటి బాగోగులకే వినియోగించేవారు.
ఏదో ఒక రోజు మిస్టర్ పీటర్సన్ పావురాల రేసులో పాల్గొంటాడని అందరికీ తెలుసు. కొన్ని సాయం త్రాలు మా అంకుల్ ఎడ్గార్, మిస్టర్ పీటర్సన్ తో వరండాలో కూర్చుని ఆయన కథలు కథలుగా చెప్పే పావురాల పందేల గురించీ, చెయ్యబోతున్న విదేశీ ప్రయాణం గురించీ వింటుండేవాడు. అమ్మ పడక గదిలోని కిటికీ లేస్ కర్టెన్ గుండా నేను వాళ్ళిద్దరూ వివిధ జాతులకు చెందిన పావురాల గుణ గణాల్ని చర్చించుకుంటూ ఉల్లాసంగా సంభాషించు కోవడాన్ని తిలకించేదాన్ని. ఇక వాళ్ళ మాటల్లో విదేశీ ప్రయాణం గురించిన అపాయాలూ, విస్మయ పరిచే విషయాలెలాగూ ఉంటాయి! మాకు మిస్టర్ పీటర్సన్ గురించిన మొత్తం సమాచారం అంకుల్ ఎడ్గార్ నుండే వస్తుంది. అతను మిస్టర్ పీటర్సన్ వరండా నుంచి నేరుగా మాఇంటికి వచ్చి కూర్చుంటే మా నాన్నమ్మ పూర్తిగా విషయ సేకరణ చేసే వరకూ ప్రశ్నలు అడుగుతూనే ఉండేది.
మేము తప్ప మిగిలిన ఇరుగు పొరుగు వారికి మిస్టర్ పీటర్సన్ పట్ల కొంత వ్యతిరేక భావన ఉంది. అటువంటి వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక స్నేహపూర్వకమైన బృందంగా తయరయ్యారు. వారందరికీ పావురాలన్నా, వాటి గూడన్నా చాలా కోపం. అవి వాటి గూటి నుంచి భయంకరమైన శబ్దాలు చేస్తాయి. ఒక నిర్దిష్ట దిశలో గాలి వీచినప్పుడు ఆ చెక్క గూటి నుంచి వచ్చే వాసన భరింప రానిదిగా ఉంటుంది. ఎవరైనా మిస్టర్ పీటర్సన్ గారి వాకిలి వైపుకి రావాలంటే ఇక ఆ వాసన తప్పనిసరిగా పీల్చాల్సిందే! పైగా పావురాలు ఆ ప్రాంతానికి ఎలుకల్ని తెచ్చాయని అందరికీ తెలుసు.
పావురాల గురించి నాకు మరీ ఎక్కువగా ఆసక్తి కలిగించిన విషయం ఏమిటంటే మిస్టర్ పీటర్సన్ పావురాలను వాటి రెక్కల వ్యాయామం కోసం స్వేచ్చగా ఆకాశంలోకి ఎగరేసేవారు. మా ఇంటి ముందు నుండి నేను నిశ్శబ్దంగా, ఆత్రంగా గమనిస్తుండేదాన్ని. తర్వాత తన ప్రియమైన పావురాల కోసం మిస్టర్ పీటర్సన్ ఆకాశం మొత్తాన్ని స్కాన్ చేస్తున్నట్లే పరికించి చూస్తూ, వాటి రాకకోసం నిరీక్షిస్తుండేవారు. చివరికి అవి ఖచ్చితంగా కొంచెం కూడా హెచ్చు తగ్గులు లేకుండా “V” అక్షరాకారంలో కుదురుకొని తమ గూటికి చేరుకునే విధానం నన్ను పరమ ఆశ్చర్యానికి గురి చేసేది.
నల్లటి ఆకాశంలో యెగిరే పావురాలు కలిగించే ప్రేరణవల్ల, వాటితో పాటు తాను కూడా ఎగిరిపోతే బాగుండునని మిస్టర్ పీటర్సన్ ఆలోచిస్తున్నారా అని ఆ క్షణంలో నాకనిపించింది.
ఏళ్ళ తరబడి కూడబెట్టి చివరికి మిస్టర్ పీటర్సన్ తన విమాన టికెట్ కి సరిపడినంత డబ్బుని సమకూర్చుకున్నారు. ఇరుగుపొరుగున ఉన్న మేమంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సందర్భం వచ్చినందుకు ఉద్వేగ భరితుల మయ్యాం. ప్రతిఒక్కరి నోటి వెంటా గంటల తరబడి ఇదే టాపిక్ నడిచింది. విమానం ఎక్కడానికి ఒకరోజు ముందునుంచే మిస్టర్ పీటర్సన్ ముస్లిం గనక తీర్ధయాత్రకు మక్కా వెళ్ళేవాడిని దర్శించు కున్నట్లుగా జనం బారులు తీరారు. చివరికి మా నాన్నమ్మ కూడా ఒక రుచికరమైన వంటకాన్ని తయారు చేసి, దాన్ని ఒక ప్లేట్ నిండా తీసుకొని వెళ్ళింది.
“మిస్టర్ పీటర్సన్ ఒంటరిగా ఎలా వెళ్ళగలరు?” సజీవంగా, లక్షణంగా ఉన్న ఆయన భార్య నొదిలేసి వెళ్ళడం నాకైతే చాలా అసహజంగా అనిపించింది. అదే విషయం నాన్నమ్మ నడిగాను.
నాన్నమ్మ ఎటో చూస్తూ “ఆ వ్యక్తి గురించి మనకేం తెలుసు?” అన్నది. కానీ జాగ్రత్తగా ఆమె ముఖాన్ని పరిశీలిస్తే, ఆమె కూడా చాలా కలవరపడుతున్నట్లే అనిపించింది.
“నాన్నమ్మా! మీరు మిసెస్ పీటర్సన్ ని అడగొచ్చు కదా” అని నేను సూచించాను.
నాన్నమ్మ కళ్ళు మిటకరించింది. నాకు తెలుసు, నేనిలాంటి వ్యక్తిగత ప్రశ్నలు అడగకూడదు.ఏది ఏమైనా మిసెస్ ఆరెండ్స్ పెద్దదై పోతుందనీ, ఎవరో ఒకరు ఆమెను దగ్గరుండి చూసుకోవాలనీ అందరికి తెలుసు. బహుశా అందుకే ఆమె తన భర్త చాలా కాలంగా ఎదురుచూస్తున్న విదేశీ పర్యటనకు ఆయనకు తోడుగా ఆయన వెంట వెళ్ళడంలేదు.
మిస్టర్ పీటర్సన్ చేరుకోవలసిన గమ్యస్థానం గురించి మా నాన్నమ్మతో సహా ఇరుగు పొరుగు వారందరూ రకరకాల వ్యతిరేక భావనలతో వ్యాఖ్యానించారు. మిస్టర్ పీటర్సన్ లండన్ లో ఉన్నప్పుడు ఆయన తన ఖర్చులకి భయపడి ఎస్తేర్ ఇంట్లో ఉంటారనుకున్నారు. ఆమెకు తెలిసిన వాళ్ళందరూ బోలెడన్ని బహుమతులిచ్చారు. మిసెస్ సెప్టెంబర్ చీకట్లో వచ్చి ఎస్తేర్ పేరు రాసి ఉన్న పుచ్చకాయతో తయరు చేసిన వంటకాన్ని ఒక కూజాలో మిస్టర్ పీటర్సన్ ఇంటి గుమ్మంలో వదిలి వెళ్ళిందని కొందరంటారు. మరికొందరేమో అది జాం అంటారు. నాకైతే అదసలు మిస్టర్ పీటర్సన్ సూట్ కేస్ లో లండన్ లో ఉన్న ఎస్తేర్ కి చేరుతుందా అని ఆశ్చర్యమే!
మిస్టర్ పీటర్సన్ వెళ్ళేరోజు వాతావరణం చిన్న ఆకు కదలిక కూడా లేకుండా గాలి ఆడకుండా వేడిగా ఉంది. వేసవి వేడిమి తీవ్రంగా ఉన్నప్పటికీ ఆరోజు బాగానే ఉంది.“కేప్ టౌన్ వేడి నుంచి గడ్డ కట్టే చల్లని మంచు ప్రాంత మైన లండన్ కి వెళ్ళడాన్ని నేనింకా నమ్మలేకపోతున్నా”నని నాన్నమ్మ అన్నది. సూర్యుని ప్రచండమైన వేడిలో కూడా ఇరుగు పొరుగు వాళ్ళందరూ పూలతో వాళ్ళ వాళ్ళ వాకిళ్ళలో నిలబడి చూస్తుండగా మిస్టర్ ప్యాట్రిక్ తండ్రిని విమానాశ్రయానికి కార్ లో డ్రైవ్ చేస్తూ తీసికెళ్ళాడు. మిస్టర్ ప్యాట్రిక్ బరువైన తండ్రిసూట్ కేస్ ని పాత డాట్సన్ కార్ లో పెట్టడం మేమందరం చూశాం. మిస్టర్ పీటర్సన్ రుమాలు ఊపడం మిసెస్ సెప్టెంబర్ కర్టెన్లు చిన్నగా కదలడం, ఆమె చూడటాన్ని మేము గమనించాం. మిస్టర్ పీటర్సన్ తన కల నెరవేర్చుకో బోతున్నాడన్న సంగతి మేమందరం ఇంకా నమ్మలేకపోతున్నాం! ఉల్లాస పూరితమైన ఈలతో మిస్టర్ ప్యాట్రిక్ కార్ ని ముందుకి పోనిచ్చాడు.
రోజులు, వారాలూ గడిచేకొద్దీ ఎక్కడో దూరంగా లండన్ లో ఉన్న మిస్టర్ పీటర్సన్ ని అందరూ మర్చిపోయారు. మా దేశంలో పరిస్థితులన్నీ వేగంగా మారిపోతున్నాయి. నల్లజాతీయులకు, కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకి యైన సౌత్ ఆఫ్రికా ప్రధాన మంత్రి ఉన్న పి. డబ్ల్యూ.బోథా( PW Botha) కొన్ని నెలల ముందే రాజీనామా చేయవలసి వచ్చింది. అది మా నాన్నమ్మకి చాలా ఆనందం కలిగించింది. ఆయన స్థానంలో ఇప్పుడు ఎఫ్.డబ్ల్యూ.డి క్లెర్క్ (FW de Klerk) వచ్చారు. ఇతనేదో మంచి చేస్తాడని ఏమీ లేదు. వర్ణవివక్ష చూపడంలో తెల్లవాళ్ళందరూ ఒకటేనని నాన్నమ్మ చెప్పింది. ఇంకా, ఇప్పుడు కొత్త సంవత్సరంలో 20 సంవత్సరాలుగా జైలులో ఉన్న నెల్సన్ మండేలా విడుదల కాబోతున్నారని వార్తలొస్తున్నాయని నాన్నమ్మ తెలిపారు. మరి కొందరు మన దేశంలో ఒక అంతర్యుద్ధం రాబోతుందని చెప్పారు.
అప్పుడు అనుకోకుండా, నిప్పు లేకుండా పొగ రాదన్నట్లుగా ఏదో బలమైన కారణం లేకుండా పుకార్లు రావని తెలిసింది. ఎందుకంటే అప్పటివరకూ ఎన్నో రాజకీయపార్టీల మీద ఉన్న నిషేధాన్ని ఎత్తి వేశారు. అప్పుడు నిజంగానే మిస్టర్ మండేలా విడుదల కాబోతున్నారని ప్రజలు తెలుసుకున్నారు. దేశంలో ఇంత అద్భుతమైన మార్పులు జరుగుతుంటే మిస్టర్ పీటర్సన్ ఇక్కడ లేనందుకూ, అతనికి వీటిల్లో భాగస్వామ్యం లేనందుకూ నాన్నమ్మ చాలా బాధ పడింది. ఆయన ఈ కొత్తప్రభుత్వానికి బలమైన మద్దతునిచ్చేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్ల కోసం పొరుగున ఉన్న ప్రతి ఇంటికీ వెళ్ళి ఆయన ఓటు వెయ్యమని అందరికీ నచ్చజెప్పి ఒప్పించేవాడు. మిస్టర్ పీటర్సన్ లేకపోవడం వల్ల నాన్నమ్మ చాలా నిరాశ చెందింది.
మిస్టర్ పీటర్సన్ వచ్చేరోజు కోసం ప్రతి ఒక్కరూ ఆరాటంగా ఎదురు చూడ్డం మొదలైంది. ఆయనొచ్చే సమయానికి నేను కళాశాలలో ఉంటాను కాబట్టి ఆయన రాకను నేను చూడలేననుకున్నాను. అందుకని చాలా అశాంతిగా గుమ్మంలో కెళ్ళడం, రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం అలా నేను ఎదురు చూస్తే, నాన్నమ్మ మొక్కలకి నీళ్ళు అతి నెమ్మదిగా పెడుతూ మిస్టర్ పీటర్సన్ కోసం పొద్దుపోయేవరకూ పడిగాపులు కాసింది. మేమందరం ఆయన రాక కోసం తెగ చూశాం. ఆ రోజుల్లో విదేశీ ప్రయాణ మంటే చాలా గొప్ప అవకాశమనీ, ఆ ప్రయాణం చేసి వస్తున్న వారిని గొప్ప అదృష్టవంతులుగా, సెలబ్రిటీల్లాగా భావించేవారు.
మేమందరం బకింగ్ హాం ప్యాలెస్ గురించీ, బిగ్ బెన్ గురించీ విని మిస్టర్ పీటర్సన్ నుంచి చాలా తెలుసుకోవాలనుకున్నాం. అసలాయన మేము బాగా ప్రేమించే డయానాను చూడగలిగారా లేదా? బ్రిటీష్ ప్రజలకేమిష్టం? అందరూ చెప్పుకుంటున్నట్లుగా నిజంగా అక్కడంత చలిగా ఉంటుందా? మిస్టర్ పీటర్సన్ అసలలాంటి కథలు, కబుర్లు పొరుగు వాళ్ళతో పంచుకునే రకం కాదు కానీ ఎలాగోలా చివరికి ఆయన లండన్ పర్యటనకి సంబంధించిన అన్ని విషయాలూ బయటి కొస్తాయని మా అందరి ఆశ!.
నేను ఫోన్ కాల్ వస్తే లోపలికి వెళ్ళాను. ఇంతలో ఆయన రాకను నేను మిస్సయ్యాను. మిస్టర్ పీటర్సన్ గుమ్మాల్లో తనకోసం గుమిగూడిన మనుషుల వంక ఒక్క క్షణం ఒక్క చూపు చూశాడట. మిస్టర్ ప్యాట్రిక్ ఒక్క ఉదుటున కార్ ని లోపలకు తోశాడట, మామూలుగానైతే అతను కార్ ని వీధిలోనే పార్క్ చేస్తాడు.
“ఇదేదో ఇక్కడ చాలా చోద్యంగా ఉంది” అంది నాన్నమ్మ.
మిస్టర్ పీటర్సన్ విదేశీ యానం తర్వాత అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటుండొచ్చు అన్నాన్నేను. ఆయన రాకను చూడలేక పోయినందుకూ, నాన్నమ్మ మాటల మీదే ఆధారపడవలసి వచ్చి నందుకూ నేను చాలా అసంతృప్తితో రగిలి పోయాను.
మిస్టర్ పీటర్సన్ తిరిగొచ్చిన తర్వాత వారాల తరబడి ఆయన అంచెలంచెలుగా చెప్పిన విషయాలు అంకుల్ ఎడ్గార్ మాకు కథలు కథలుగా చెప్పారు. మిస్టర్ పీటర్సన్ ఇన్ని కష్టాల నెదుర్కొని విదేశీ ప్రయాణం చెయ్యడానికి ఒక బలమైన ఆశయం ఉంది. ఒక తెల్ల మహిళ పొందు కోసం నిరంతరం తనలో తాను తపించి పోతుండేవాడట. ఎంత ఖర్చైనా, ఏమైనా చేసి తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడట. జీవితంలో కేవలం ఒక్కసారి, ఒకే ఒక్కసారైనా తన మనసులోని గాఢమైన కాంక్షను సాధించుకోవాలనుకున్నాడట. తెలుపంటే తెలుపు కాదు మంచు లాగా తెల్లగా మెరిసిపోయే తెలుపు మహిళ కావాలని పోరు పెట్టే హృదయాన్ని సముదాయించలేక సతమత మయ్యేవాడట. ఇతను చూడబోతే కారు నలుపు. నలుపంటే నలుపు కాదు. దట్టమైన చీకటిలాంటి కారు నలుపంటుంది నాన్నమ్మ. విదేశీ తెల్లమహిళను అనుభవించాలన్న దుర్మార్గపు టాలోచన మిస్టర్ పీటర్సన్ ని నిరంతరం నిలువెల్లా దహించి వేస్తుండేది. అక్కడకెళ్ళి తన కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ చర్చి, విదేశీయత, నైతికత, మిసెస్ పీటర్సన్ మొదలైన విషయాలు మిస్టర్ పీటర్సన్ దారికి అడ్డం వచ్చాయి. అతని ఆ కోరిక చాలా చట్టవిరుద్ధ మైనదీ, అనైతికమైనదీ. అతడలాంటి ప్రయత్నం చేస్తే చట్టప్రకారం లండన్ పోలీసులు ఫ్లాష్ లైట్స్ తో ఖచ్చితంగా అతని వెంట పడతారని తెలుసుకున్నారు. ఆ విధంగా ఆయన కోరిక తీరకుండానే ముగిసింది మిస్టర్ పీటర్సన్ విదేశీ యానం!
విదేశీ తెల్లజాతి మహిళలు పురుషులు బక్కగా, బలహీనంగా, నల్లగా స్ఫోటకపు మచ్చలతో ఉన్నప్పటికీ పట్టించుకోరనీ, చాలా సులభంగా లొంగి పోతారనీ బోలెడన్ని కథలు విని ఉన్నారు మిస్టర్ పీటర్సన్. మీరు గనక విదేశీ ప్రయాణం చేయగలిగే స్థోమత కలిగి ఉంటే తెల్ల స్త్రీ పొందు మీకు దక్కినట్లేనని ఉదయమే ట్రక్ లో రొట్టెలను తీసికెళ్ళే దారిలో ఆ విషయం గురించి మాట్లాడేవారు. పావురాల రేసింగ్ వేదికల మీద ప్రసంగించేవారు. రేసింగ్ టోర్నమెంట్ల తర్వాత డార్ట్ క్లబ్ దగ్గర అదేపనిగా దాని గురించే మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. ఇక మిస్టర్ పీటర్సన్ లో పదే పదే విన్నదాన్నే వినడం వల్ల ఒక బలమైన కోరిక రోజు రోజుకీ రాజుకొని, ఎలాగైనా కష్టపడి సంపాదించి తన కోరిక తీర్చుకోవాలనే నిర్ణయానికొచ్చారు. ఈ ఆరాటం వల్లనే తెల్లవారుజామున, వారాంతాలలో ఇష్టంగా డ్రైవ్ చేసేవారు. తెల్లని ముఖసౌందర్యంతో, బంగారపు రంగులో మెరిసిపోయే జుట్టుతో అలరారే స్త్రీ తనకి సంతానాన్నవ్వబోతున్నట్లు కలలు కనేవారు. ఎగతాళి చేస్తున్నట్లుండే పొరుగుతో, ఇంట్లో ఉన్న కళా,కాంతీ లేని ముగ్గురు మహిళలతో, తీక్షణపు, తిరస్కారపు చూపులు చూసే సోదరితో విసిగిపోతున్నవాడికి అంతకంటే ఇంకేం కావాలి?
“మిస్టర్ పీటర్సన్ కోరిక తీరిందా?” నాన్నమ్మ
“ఉండండి, మొత్తం వరసగా చెప్పనివ్వండి” అన్నారు అంకుల్ ఎడ్గార్ ఒక చిరునవ్వుతో
“అలా ఏమీ జరిగి ఉండదులే” అన్నది హేళనగా నాన్నమ్మ
వాసన పట్టిన పిల్లి లాగ అంకుల్ ఎడ్గార్ ఒక నవ్వు విసిరారు. మన రాండ్ విలువ పౌండ్ విలువ కన్నా చాలా రెట్లు తక్కువ. ఇక ఇక్కడి రాండ్ లను పౌండ్లలోకి మార్చు కోవాలంటే ఆయన దగ్గరున్న మొత్తం డబ్బంతా కలిపినా వచ్చే కొన్ని పౌండ్లకు సరుకులన్నీ కూడా రావు.
“మరేం చేశాడు?” నానమ్మ డిమాండ్ చేసింది.
“ఏంచేస్తాడు?” అతని స్థోమతను బట్టి ఏ వస్తువునైనా చూడడమే గాని ఆయన దేనితోనూ సుఖపడలేదని ఖచ్చితంగా చెప్పగలను నేను అంటూ అంకుల్ ఎడ్గార్ వంకరగా మాట్లాడారు.
“ఏమిటి? అంత దూరం కేవలం చూడడానికి వెళ్ళాడా?” అంటూ నానమ్మ కీచుగొంతుతో పెద్దగా అరిచినంత పని చేసింది.
“స్పష్టంగా అంతే” అంతే, తన వేళ్ళతో మీసం మెలేస్తూ అంకుల్ ఎడ్గార్ మళ్ళీ “ముమ్మాటికీ అంతే” అన్నారు
మిస్టర్ పీటర్సన్ కి పదవీ విరమణ వయసు దాటినప్పటికీ సన్ రైజ్ బేకరీకి వెళ్ళి పని చేస్తూనే ఉన్నారు. ప్రతి ఉదయం బేకరీ రోడ్ ఆ చివర నుండి ఈ చివర వరకూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అతను ఇప్పటికీ మధ్యాహ్నాలు తన వరండాలో కూర్చుని సాసర్ నుండి తీపి టీని ఒక్కొక్క గుటక చప్పరిస్తూ, పైప్ పీలుస్తూ ఉంటారు. తెలుపు చొక్కా నౌకాదళం నీలం రంగులో సూట్ వేసుకొని వధువుల్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. తన తండ్రికి ఆర్థరైటిస్ వల్ల మోకాళ్ళ నొప్పులున్నప్పుడు మాత్రం పాట్రిక్ ఆ పని చేస్తాడు. మిస్టర్ పీటర్సన్ ఎప్పుడో అన్యమనస్కంగా ఉన్నప్పుడేమో గానీ విమానం ఆ దారినే వెళ్తున్న ప్రతిసారీ సైన్యంలో ఉన్నప్పటిలాగే లేచి నిలబడి శాల్యూట్ చేస్తారు. విమానం ఆదారి దాటి వెళ్ళినప్పుడు మాత్రమే తిరిగి కూర్చుంటారు. అది చూచిన వారందరూ ఆయనకి పిచ్చి పట్టిందనుకుంటున్నారు!
మరి పావురాలు? అవును, పావురాలు. కొన్నిటిని అమ్మేశాడు. కొన్నిటిని దూరంగా ఇచ్చేశాడు. కొన్ని మరణించాయి. మొత్తానికి పావురాల పంజరం ఖాళీగా ఉంది. అక్టోబరు మాసాంతం చల్లని గాలులకు పంజరం తలుపుల అతుకులు ఊడిపోయి చేస్తున్న వింత వింత కీచు శబ్దాలు మిస్టర్ పీటర్సన్ కన్న కలల్నీ, ఆయన పిచ్చి నమ్మకాల వల్ల చెదిరిపోయిన నిరాశామయమైన జీవితాన్నీ గుర్తుకి తెస్తాయి!
*****
Add comment