మిలన్ …

సందిగ్ధ కాలాలు ఎప్పుడూ వుంటాయి. కానీ, ఆ సందిగ్ధాలకు దారి తీసే చరిత్రలే మారుతూ వుంటాయి. అప్పుడు రచయితలు ఏం చేయాలి? మరీ ముఖ్యంగా ప్రతి అనుభవాన్ని వొడిసి పట్టుకోవాలనుకునే కథకులు ఏం చెయ్యాలి? ఇది ప్రతి సమూహం తనని తాను తరచి చూసుకోవాల్సిన ప్రశ్న. ప్రస్తుతం ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కునే ప్రయత్నం ఇప్పటి ముస్లిం రచయితల నుంచి మొదలయ్యింది. ఈ నెల 8, 9 తేదీలలో హైదరాబాద్ లో జరుగుతున్న “మిలన్” అలాంటి ప్రయత్నమే! 

ముస్లిం అస్తిత్వ సాహిత్యంపై సింహావలోకనం

మూడు దశాబ్దాలుగా తెలుగులో ముస్లి అస్తిత్వ సాహిత్యం విరివిగా వచ్చింది. ఏ ఇతర భాషల్లోనూ ఈ కాలంలో ఇంత సాహిత్యం వచ్చి ఉంటుందని నేను అనుకోవడం లేదు. బాబ్రీ ఘటన తర్వాత దేశంలో జరుగుతున్న పరిణామాలు ఇక్కడి రచయితలు, కవులను ఎక్కువగా కదిలించాయి. ఆ విష రాజకీయాలు తమ ప్రాంతానికీ ఎక్కడ పాకుతాయోనని ఆందోళన చెందిన ముస్లిం ఆలోచనపరులు ముందుస్తుగా ఇక్కడి ప్రజలను జాగురూకతను చేస్తూ రచనలు చేశారు. అయినా ఇవ్వాళ చాలా వేగంగా ఉత్తరాది రాజకీయాలు దక్షిణాదికి పాకిపోయాయి. అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే అవి మనల్ని ముంచేసే స్థాయికి వచ్చేశాయి. ఆశించినంత కాకపోయినా అటు ముస్లిమేతరులు కూడా మతతత్వ రాజకీయాలను నిరసిస్తూ రచనలు చేశారు. ఈ సంధి సందర్భంలో ఒకసారైనా తెలుగులో వచ్చిన ముస్లిం అస్తిత్వ సాహిత్యంపై సింహావలోకనం చేసుకోవడం మంచిదనిపించింది. తద్వారా భవిష్యత్‌ రచనలను తగిన సవరింపులతో అవసరమున్న దిశగా నడిపించే అవకాశం ఉంటుంది.
– వేంపల్లె షరీఫ్‌

 

కలాన్ని కదలనివ్వని కాలం

అన్నాళ్లు స్నేహించిన మనిషి అనుమానంగా చూసినప్పుడు.. ప్రాణంలా ప్రేమించిన మనిషి మతం అడ్డొస్తున్నదని సందేహించినప్పుడు.. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న నమ్మకాన్ని సామూహిక అత్యాచారం చేసినప్పుడు.. ఒక రాష్ట్రం రాష్ట్రమే జైలుగా మార్చబడినప్పుడు.. దాని గురించి బహుకొద్ది మంది మాత్రమే స్పందిస్తున్నప్పుడు.. స్తంభానికి నిన్ను కట్టి చావచితక కొడుతున్నా.. నీ ఇంటినో.. దుకాణాన్నో బుల్డోజర్‌తో కూలగొడుతున్నా పెద్దగా స్పందన లేనప్పుడు.. నీ పుట్టుకనే అవమానిస్తూ పుట్టిన నేలమీదే దస్తావేజులు చూపమంటున్నప్పుడు.. నిన్ను పరదేశీగా చూపడానికి పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నప్పుడు..
నెత్తురోడుతున్న కలాన్ని భారంగా కదిలించే కోషిష్‌ చేస్తున్న రచయితలు కలిసి ఏం మాట్లాడుకుంటారు? మెజారిటీ మనిషిననిపించుకునే ప్రయత్నంలో ఉనికినే కోల్పోయేతనం భుజాలు తడుముకోవడం.. దేశభక్తిని నిరూపించుకోడానికి విశ్వప్రయత్నాలన్నీ చేయడం.. లౌకికత్వాన్ని మాట్లాడడానికి ఇక ఏ పార్టీ సిద్ధంగా లేకపోవడం.. తోచనితనం చివరికి శత్రువు పార్టీనే మేలనే బేలతనం.. ఎన్నని ఎంచగలం?
అసలు ముస్లింలపై జరుగుతున్న హింస కథలే భయానకంగా ఉంటే కథలుగా వాటిని ఎలా మలచగలం?
కలం కదలదు.. మనసు బ్లాంక్‌ అవుతూ.. బాహిర్‌ దేశీయం ఇట్లా ఉంటే.. అంతర్‌ లోకాన్ని మరింత గందరగోళంగా చేసిపెట్టారు ముస్లిం మతవాదులు. ఈ అంశాన్ని రాయడానికి ముస్లింవాద రచయితలకున్న అవాంతరాలను సాపు చేయలేకపోయారు కొందరు తొలితరం ముస్లిం రచయితలు. దాంతో తర్వాతి తరం రచయితలు ధైర్యంగా రచనలు చేసినా పెద్ద మనసు చేసుకోలేకపోయారు. ఈ అంతర్‌ సంస్కరణ వాదాన్ని, స్త్రీల స్వేచ్ఛావాదాన్ని, దూదేకుల కోణాన్ని అంగీకరించని పెద్దలు కూడా మాట్లాడాలి! వీటిపై కూడా చర్చ అత్యంత అవసరం.

-స్కైబాబ

కొత్త కథకుల అస్తిత్వ వేదనకి కొన్ని సమాధానాల కోసం….

తెలిసిన వాతావరణం నుంచే కథలు కానీ, కవితలు కానీ రాయడాన్ని సౌకర్యంగా భావిస్తారు కవులు, రచయితలు. అయితే ఇది అస్తిత్వ ప్రకటన చేయాల్సిన అవసరం లేని వారికి దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఎంతమాత్రం లేకపోవచ్చు. పైగా వారికి తెలిసిన వాతావరణం కథల్లోనూ, కవితల్లోనూ ప్రతిబింబించేలా రాసుకోవడం సౌలభ్యంగా ఉండొచ్చు. అంతమాత్రం చేత ఇతరులు కూడా వీరికి తెలిసిన వాతావరణాన్నే కథల్లో సృష్టించాలని ఒత్తిడి చేయడం, లేదా సలహా ఇవ్వడం ఎంత వరకు సబబు?
అసలే కొత్తగా రాస్తూ, ఎన్నో రకాల అనుమానాలతో ఏ మాట ఎలా రాయాలో తెలియక సతమతమవుతుంటే… ఇటువంటి సలహాలు, సూచనలు గందరగోళంలో పడేస్తాయి కదా. ఫలితంగా ఒక మంచి కలం సాహితీ లోకం నుంచి నిష్క్రమించవచ్చు. అనుభవజ్ఞులు వీటి గురించి ఎలాగూ ఆలోచిస్తారనుకోండి.
ఇక పైన చెప్పిన గందరగోళంవంటి పరిస్థితులు తెలుగులో కథలు రాస్తున్న ముస్లిం రచయితల్లో అనేకం. ‘కథకు ఎంచుకున్న ఇతివృత్తమేమిటో, ఏ అంశాన్ని కథగా మలచాలో, తెలిసిన వాతావరణంలో కథను మలచడం తేలికైనా నలుగురూ ఆ సబ్జెక్ట్ ను కథగా గుర్తిస్తారో లేదో, గుర్తించినా ‘వాళ్ళ కథ రాసుకున్నారు’ అని ఎక్కడ అంటారో, మతపిచ్చి అని ముద్ర వేయకూడదంటే ఓ ఇతర క్యారెక్టర్ కచ్చితంగా ఉండేలా చూసుకుందామనో, ఆ భయంతో కథలో అవసరం లేకపోయినా ఆ క్యారెక్టర్ ను చొప్పించే ప్రయత్నం చేయాలా?, ఇలాంటి కథలు రాస్తే స్నేహాలు దూరమవుతాయేమో’ ఇలా అనేకానేక సందేహాలు, భయాలతో సతమవుతున్నారు. ఇటువంటి సందేహాలు తీర్చుతూ, వారిని మరిన్ని కథలు రాసేలా ప్రోత్సహించేందుకు రూపొందినదే ‘మిలన్’.
-నస్రీన్‌ ఖాన్‌
 

అక్బర్ పాషా

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముస్లిం సమాజం పట్ల పూర్తి సానుభూతితో నాకున్న కొన్ని సందేహాలు ఇక్కడ అడగదలుచుకున్నా,

    1. వాళ్ళు సరే మీరు చేస్తుంది ఏమిటి, శతాబ్దాలైనా మీరు మిమ్మల్ని ప్రత్యేక సమూహం లా ఎందుకు భావిస్తున్నారు
    2. స్తానికులతో మీరు ఎంతవరకు కలిసి జీవిస్తున్నారు
    3.అక్రమ కట్టడాలనే గా వారు కూలుస్తుంది, అందులో తప్పు ఏముంది
    4.ఒక వోటు బ్యాంకు గా మిగిలిపోవడం లో మీ తప్పు ఎంత
    5.మితిమీరిన జనాభా ఎందుకు పెంచుకుంటున్నారు
    6.చదువు పోయినా పర్లేదు కానీ హిజాబ్ వదలం అనే మూర్కులమీద మెజారిటీ ప్రజలకి ఏం సానుభూతి వుంటుంది
    7.మొన్న దసరా గర్భ డ్యాన్స్ ప్రోగ్రాం మీద రాల్లు రువ్విన ముస్లిం యువకులకి మీరు ఇచ్చే సలహా ఏంటి
    8.ముస్లిం అమ్మాయిని పెల్లి చేసుకున్న పాపానికి ఒక దళితుని నరికిచంపుతారు ఇక్కడ మీకు కులం కవాలి
    9.ఉన్నత జాతివాడని ముసలి అరబ్ షేక్ కి పసిపిల్లల్ని అప్పగిస్తారు

    ఇవన్నీ మీరంటున్న మెజారిటీ వాళ్ళకున్న సందేహాలు
    జవాబు ఇవ్వం, మాఇషం, అడగడానికి నువ్వెవడివి, మాకు రెచ్చగొట్టడం మాత్రం ఇష్తం అంటే ఇక మీ ఇష్తం

    • 1. మీ ప్రశ్నలోనే ముస్లింలను విడిగా చూస్తూ, అదే ప్రశ్న వారిని అడుగుతున్నారు. రెడ్ల సంఘాలున్నాయి, కమ్మ సంఘాలున్నాయి, బ్రాహ్మణ సంఘాలున్నాయి. మీరు ఎప్పుడైనా వారితో ఈ ప్రశ్నలు వేశారా? When people are oppressed and discriminated, it is natural for likeminded people come together and fight for their rights.
      2. కొన్ని శతాబ్దాలుగా స్థానికులతో కలసి జీవిస్తూనేవున్నారు. కొద్దిగా చుట్టుపక్కల పరిశీలిస్తే తెలుస్తుంది.
      3. అన్ని అక్రమ కట్టడాలను కూలుస్తున్నారా? Selective implementation is also discriminatory
      4.ఈ దేశాన్ని కుల మత ప్రాతినిథ్యం పైన విడగొట్టి దోపిడీ చేస్తుంది రాజకీయ పార్టీలు. మీరు ఈ ప్రశ్నని వాళ్లను అడగాలి.
      5. పేదరికం, నిరక్షరాస్యత వల్ల.
      6. ఇండియాలో చాలా ముస్లిం స్త్రీలు హిజాబ్ వేసుకోరు. కొద్ది మంది హిజాబ్ వేసుకుంటే మీరు అందరికి హిజాబ్ లు వేస్తున్నారు.
      7. రాళ్లు వేసిన ముస్లిం యువకులకు తర్వాత ఏమైంది? Did police follow laws of the land?
      8.హిందువులలో కూడా ఇంకా ఎక్కువ జరుగుతుంది కదా?
      9. Yes, both Hindus and Muslims should work together to stop this atrocity. Even poor young women (non-Muslim) from Rayalaseema and Telangana are being sold to Arab sheiks.

      Please support and encourage progressive Muslims. They are the one who can and will fight with extremists within Muslim society.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు