జోలె వేసుకుని
ప్రేమను పాడుకుంటూ ఇల్లిల్లూ తిరిగావు.
పువ్వుల మీద,
పువ్వులు తొడిగి విడిచిన తొడిమెబంధాల మీద
నదుల మీద, కొస్తూ నవనీతంరాస్తూ
ఏరులై పారే అనురాగాల మీద
పాడుతూనే ఉన్నావు.
నీ అరిపాదాలతో ప్రతి వాకిలీ తట్టావు
నీ చెమట చిలకరిస్తూ ఊరూరూ తిరిగావు
నీ కాళ్లని రెక్కలు చేసుకుని దేశదేశాలు ఎగిరావు
అడుక్కుంటున్నా అనుకున్నావు కానీ
అడిగిన వాళ్ళకు, అడగని వాళ్ళకు ప్రేమను తిరిగిస్తూనే వెళ్లావు.
జోలె నింపుకున్నావో, తీసిచ్చావో తెలుసుకునే లోపే ఉన్నదంతా ఇచ్చేశావు.
ఇంకేం మిగల్లేదు కదా?!
ఖాళీ జోలెను తలచుట్టచేసుకుని
ఆ గుడి మెట్టుపై కాసేపు మేను వాల్చు.
చూశావా
ఇప్పుడు
అక్కర్లేని ప్రేమంతా
అక్కడ పిట్ట గోడలెత్తు గుట్టలుగుట్టలుగా పోగుపడి ఉంది.
అర్హతలేని ఈ లోకం ప్రేమను మోయలేకపోతుంది,
అడ్డం పడుతున్న మమకారాన్ని తప్పించుకుని తిరుగుతుంది.
పైగా
నీ ప్రేమ
ఏ గుండె నొప్పినీ తగ్గించలేదు
కలతపెడుతున్న ఎవరి జ్ఞాపకాలను చెరిపేయలేదు
ఎవరి కష్టాన్నీ గట్టెక్కించే దివ్యమంత్రాన్ని ఉపదేశించలేదు
ఈ లోకపు గాయం మరకల్ని మాయం చేయనూ లేదు.
ఇక చాలు
నీమీదే నువ్వు
ప్రేమపాట పాడుకుంటూ
తిరిగే రోజొకటి వచ్చింది.
తీసుకో
దారిలేక కాదు
అవసరం పడుతుందని కాదు
చివరి రోజుల్లో నిను కాపాడుతుందనీ కాదు.
ఆత్మగౌరవం కోసమైనా తీసుకో.
నువ్వు పంచిన ఈ ప్రేమనంతా
నీకు నువ్వు బహుమతిగా వెనక్కి తీసుకో.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Add comment