మా నాయిన చెప్పిన పీర్ల క‌త‌లు!

ఇవాళ గూగూడు పెద్ద సరిగెత్తు ముగిసింది!

‘ ఒనా.. క‌రోనా వ‌చ్చింద‌ని గూగూడు కుళ్లాయ‌సోమి కాడికి పోకుండా గూగూడి చుట్టు గుంత‌లు తొగినారంట‌. ఉండూరోళ్ల‌కే పండ‌గంట‌. మిగ‌తా వోళ్లంతా ఇంటికాడ‌నే కులాయ‌సోమి పేరు సెప్పి చ‌దింపులు సేసుకుంటానారంట‌. కోళ్లు, పొట్లిలు అట్ల‌నే కోసుకుంటానారంట‌..నీకు తెల్చా?’.
‘ ఔ  ఏరేవాళ్లు అన్రి.పాడుకాలం’ అన్యాడు మానాయిన‌.

‘ న్నా…. అమ్మ పీర్ల క‌త‌  చెప్తాండ. మ‌ర్సిపోయినా న్యాయ‌‌ముండే మంచ‌ల‌ను చంపాల‌ని చానామంది పోయినారంట‌. మంచోళ్లు ఓ బాయిలో ఉన్యారంట‌. దావుంటి క‌త్తులు తీసుకోని పోతాంటే తొండాగాడు త‌ల‌కాయ ఇట్టిట్ట పిల్చిన‌ట్లు కిందికి అన్యాదంట‌. వాళ్లు బాయికాడికి పోతే ధ‌ర్మాత్ములు దొరికిరంట‌. ఆడ‌నే అంద‌రి గొంతులు కోసినారంట‌. అందుకే తొండాబిక్కిని తురుకోళ్లు సంపుతారు. ఏందోబ్బా.. బీబీ నాంచార‌మ్మ అని అంట‌. గొంతులు  కోసింటే న‌త్త‌ర పాన‌కాలు అయినాయంట‌. పేగులు లాడీలు అయినాయంట‌. వాళ్ల నాయిన దొర్జుక‌ట్టె, వాళ్ల‌మ్మ గుండ‌ము అయింద‌ని మీయ‌మ్మ బ‌లే  చెప్తాండ్య మీయ‌మ్మ‌. పాట‌లు పాడేది. అయ్యి నాకు పెద్ద‌గా తెల్దు.

పీర్ల‌పండ‌గ ఎట్ల సేచ్చారో నీకు తెల్దా నాయినా?
ఎట్టేమి అమాస క‌నిపిచ్చానే మూన్నాళ్ల‌కు గుద్దిలి ఏచ్చారు.శాత్రం ప్ర‌కారం ట‌ప్పెట్లతో పీర్ల‌సావిడి కాడికి పాన‌కాలు తీసుకోని పోయి స‌దింపులు చేసి పాత గుండంకాడ‌నే అయిదారేట్లేసి రోంత తొగుతారు.మ‌ల్లామ‌ర్స‌నాడు గుండం బాగా తొగుతారు. చిన్న సెరిగిత్తు, పెద్ద స‌రిగిత్తు జ‌రుగుతాది.మెర‌వ‌ను చేసి ఏటికి తీస‌క‌పోతారు. మ‌ళ్లా సావిట్లో ఇర్సిపెడ‌తారు.

గూగూడులో మ‌న దూదేకలోళ్లు ఎక్కువుండారా నా అని అడిగితి.
త‌లారోళ్లు ఆడ ఎక్కువ‌, మ‌నోళ్లు ఉండారు. ఒక్కో కులానికి ఒక్కో పీరు ఉంటాది. అప్పుడంతా ధ‌ర్మ‌కాలం. అందురూ క‌ల్చిమెల్చి ఉంటాన్యారు. అస‌లు మేం పిల్ల‌ప్పుడు- గూగూడులో ఇడ‌ప్పుడు గువ్వ‌లు కూచ్చాంటాయి. ఎవ‌రూ ప‌ట్టించుకోరు అంటాన్యారు అనె మా నాయిన‌.

పీర్ల పండ‌గ బాగ జ‌రుగుతాండ‌నా?
*ఏమి జ‌రుగుతాన్యాదో. అలివిగాని జ‌నం. అప్పుటి వాళ్లు ఎర్రోళ్లు. పీర్ల‌పండ‌క్కే పోతాన్యారు. న‌డిచి పోయేవాళ్లు ఉంటాన్యారు. నేను, మీ గూడూరు మామ ఒక‌పారి రెండు మేక‌పోతులు ప‌ట్టుకోని మ‌న ఊరికాడ‌నుంచి ఎల్దండ్ల మీద పార్న‌ప‌ల్లెకు పోయి దార్తోట దావుంటి గూగూడుకు పోయినాం. మా పెద్దోళ్లు బండ్లో మాకంటే ముందుపోయినారు. మేము మైటాల ఇంటికాడ‌నుంచి ఎల్ల‌వారి పోయి ఏ అర్ధ‌రాత్తిరికో గూగూడుకు పోయినాం. తిక్క‌కాలం అది, అంత దూరం న‌డ్చి ఎట్ట‌పోయినామో త‌ల్చుకుంటేనే భ‌య‌మేచ్చాది.

నాకు అవ్వ‌చెప్పింది నాయినా. అమ్మ‌వాళ్లు అంద‌రూ ఎన్నెల‌కు దిద్దెకుంట కాడ‌నుంచి న‌డుచుకుంటా గూగూటికి పోయేవాళ్లంట‌. ఇన్ని తిండి గింజ‌లు, త‌ప‌లాలు తీస‌క‌పోతాన్యారంట‌. యాడ ఆక‌ల‌యితే ఆడ వొండుకోని పోయేవాళ్లంట క‌దా అన్యా.

“ఎన్ని బాధ‌లు ప‌డ‌తా పోతాన్యారో గూగూడికి. అది స‌త్య‌కాలం. ధ‌ర్మ‌ముంటాండ‌. అన్నికులాలోళ్లు గూగూటికి బండ్లు క‌ట్టుకోని, టాక్ట‌ర్లు ఏసుకోని వ‌చ్చాండ్రి. రెడ్లు కూడా కులాయ‌సోమిని ఎక్క‌వ కొలుచ్చారు. చానామంది న‌డిచొచ్చేవాళ్లు. పెద్ద స‌రిగెత్తు ముందురోజు వ‌చ్చి ఊరికి నాలుగుదిక్కుల యా ఊరు దావోళ్లు ఆడ చేరుకుంటాంటిరి. ఊర్లో చెట్ల‌కింద‌, ఊరిబ‌య‌ట తావు చేసుకుంటాన్యారు. ఊరిబ‌య‌ట ప‌ట్ట‌లు క‌ప్పుకోని గుడిసె మాద్దిరి ఏసుకుంటాన్యారు. సిరిసాప‌లు కింద ఏసుకుంటాన్యారు. రొన్నాళ్ల‌యినాక ప‌ట్ట‌ల బ‌దులు సేమానాలు తీస‌క‌చ్చిరి. ఆడ‌నే గుట్ట‌రాళ్లు పెట్టి బువ్వ‌,కురాకు సేసుకుంటాన్యారు. ల‌చ్చ‌ల్లో జ‌నాలు వ‌చ్చాన్యారు. మీరు పిల్ల‌ప్పుడు ఓ పారి నేను బాడిక్క‌ని టాక్ట‌రు ఏసుకోని గూగూడుకు పోయినా. అర్ధ‌రాత్రి నిద్ర‌లేపి గుండం చుట్టూ టాక్ట‌రు తిప్ప‌మ‌న్యారు. టాక్ట‌రు ముందు ఇద్ద‌రు కూచ్చోమ‌ని దావుంటి చెప్తా జ‌నాల్లోకి పోయినాం. అర్ధ‌కిలోమీట‌రులేని – గుండం కాడికి పోయేత‌లికి మూడు గంట‌లు ప‌ట్నాది. గుండం చుట్టూ టాక్ట‌రు రౌండు కొట్ట‌మంటే కొట్తాంటే.. అబ్బ‌బ్బా ఆ జ‌నాలు ఏందో. ఇసికేచ్చే కింద‌ప‌ల్య‌. మూడు చుట్లు గుండం చుట్టూ తిరిగమ‌న్యారు. గుండం మండుతాంది. మూట‌లు మూట‌లు చ‌క్క‌ర‌, కొబ్బ‌రి గిన్నెలు గుండంలోకి ఏచ్చాండారు జ‌నాలు. కొంద‌రు కొట్టిన ఆ ప‌చ్చికొబ్బ‌రి గిన్నెల‌ను క‌ట్టెకు ములికి క‌ట్టి అందుకుండేవాళ్లు. రాగిమాన్లు, యాప‌మాన్లు బండ్ల‌కు, టాక్ట‌రులో ఏసుకోని వ‌చ్చి గుండంలో ఏచ్చాన్యారు ముక్కుబ‌డోళ్లు. గుండం అంతెత్తు మండితే.. దిగేవాళ్లుంటారు. కింద‌ప‌డే వాళ్లుంటారు. రాత్తిరంతా గుండం ఒక‌మైన మండుకుంటే.. మంచెత్తు బూడిద ప‌డ‌తాండ‌. ప‌ద్ద‌నిక‌ల్ల ఊర్సుకోని పోయేవాళ్లు. బూడిదంటే అంత ఇష్టం భ‌క్తుల‌కు. కులాయ‌‌సోమి కాడ చ‌క్కెర చ‌దివింపు కోస‌రం నిల‌బ‌డినోళ్లు. గుండం కాడ చుట్టూ తిరిగేవాళ్లు. కోళ్లు, యాట‌ళ్లు కోసుకుండేవాళ్లు. వాయ‌మ్మ అదెక్క‌డి గూగూడు అని మా నాయిన జ‌బ్బ‌లు ఎగ‌రేసినాడు. గూగూడికి నాలుగుప‌క్క‌ల ఉంటాన్యారు. యా ప‌క్కోళ్లు ఆ ప‌క్క‌న ఉంటాండిరి. యేరే ప‌క్క‌కు క‌నుక్కోవాలంటే అర్థ‌మే కాదు. గుట్టంతా జ‌నాలే ఉంటాన్యారు.

పెద్ద‌స‌రిగిత్తునాడే గుండంలోకి జనాలు దిగుతారా..
ఔమ‌ల్ల‌. ముందు ముజావ‌రు గుండంలోకి దిగుతాడు. త‌ర్వాత అందురూ దిగి ఎక్కుతారు. కాళ్లు కాల‌కుంటే స‌త్యం. కాలితే పాపం చేసినారు అంటాన్యారు. పెద్ద స‌రిగిత్తు రోజు గుండంకాడ‌నుంచి అర్ధ‌కిలోమీట‌రు వ‌ర‌కూ అర్ధ‌రాత్రినుండి యాట‌లు కోచ్చారు. ఊర్ల‌కాడ‌నుంచి చాక‌లోళ్ల‌ను పిల్చ‌క‌పోయేవాళ్లు చ‌ర్మం ఇడిపిచ్చార‌ని. యాట‌లుకోసినాక ఊరిబ‌య‌ట ఎవరి తావుల్లోకి వాళ్లు పోయి పొట్లికి, మేక‌కు చ‌ర్మాలు ఇడిపిచ్చుకోని సీలు కొడ‌తాండ్రి. తిర‌వాత‌బువ్వ‌, సీల‌కురాకు చేసుకుంటాన్యారు. తినేవాళ్లు, పంచిపెట్టేవాళ్లు. కొంద‌రు సీలు అమ్మి ఆ లెక్క‌తో కులాయ‌సోమి ప‌టాలు తీస‌కపోతాన్యారు. సీలు బాగాలు ఏసేట‌ప్పుడే దేవుని కోస‌రం కొత్త కుండ తీసుకోని చదింపుల‌కు ప‌క్క‌న‌బెడ‌తారు. ముక్కిరిగుండె, గుండెకాయ‌, నాలుగు మెత్త కండ‌లు ప‌క్క‌న‌బెట్నేయి మైటాల వండి ప‌లాబువ్వ‌, ఆ సీలు తీసుకోని బాయికాడికి దేవుని ఎంట పోతారు. పీర్లు ఏటికి పోయినాక  ఆ బువ్వ తిని ఎల్ల‌బారుతాన్యారు ఇంటికి.

అస‌లు గూగూడు పీరు యాడిదంట నాయినా అని అడిగితి.

ఆ ఊరోళ్ల‌దే. ఒక గొళ్లోల్లాయ‌బ్బి గొర్ల‌కు పోయిన‌పుడు బాగా ఎండ‌ప‌ద్ద‌న బాయికాడికి నీళ్లు తాగ‌ను పోయినాడంట‌. నీళ్లు తాగుతాంటే దోసిట్లోకి పీరు వ‌చ్చినాదంట‌, ఆయ‌ప్ప‌నే కులాయ‌సోమి పీరు అని గూగూడు పీర్ల‌సావిడిలో నిల‌బెట్నారంట‌. ముజావ‌ర్లు గొల్లోళ్లే ఉన్యారంట‌. మ‌ల్ల మ‌నోళ్లు మారిరి. పీర్లు ఏటికి పోయినాక అందుకే గోవింద అంటాన్యారు.

గోవింద ఏంటికి అంటారు. అమ్మ అట్ల‌నాకు అంటాన్యాదే.

గూగూడులో పీర్ల‌పండ‌గ నాపొద్దు పెద్ద స‌రిగిత్తునాపొద్దు పీర్లు ఎత్తుకుంటే అదొక పేద్ద పండ‌గే. ఒక్కో కులానికి ఒక్కో పీరు ఉంటాదంట‌. ట‌ప్పెట్లు, మేలాలు వాంచుతాన్యారు. ఒక‌మైన ఏస్కాలు ఏస్కుంటాన్యారు పెద్దోళ్లు. చూడటానికి రెండు కండ్లు చాల‌వు. ముక్కుండేవాళ్లు, వ‌క్క‌పొద్దుండేవాళ్లు అలివిగాకుండా ఉంటారు. బాయికాడికి పోయినాక పీర్ల‌కు అన్ని ఇప్పుతారు. అంద‌రూ వ‌చ్చినారా అని అడుగుతారు. వ‌చ్చినామంటానే దండ‌లు అన్ని బాయిలో ఏచ్చారు. గోవింద అంటానే ఎనిక్కి చూడ‌కుండా గ‌బ‌గ‌బా వ‌చ్చారు. ఆ జ‌నాలు, ఆ అరుపులు, ఆ భ‌క్తి చెప్ప‌టానికి అల‌వికాదు. రెడ్లు బోగ పూజిచ్చారు మ‌న దేవుళ్ల‌ను.

పీర్ల‌కు ఏమి ఏచ్చారు..

లాటీలు ఏచ్చారు. దండ‌లు ఏచ్చారు. సోమ‌తి ఉండేవాళ్లు బంగారు, వెండి గొడుగులు సేయిచ్చారు. పీర్ల గుడ్డ‌లు కుట్ట‌క‌చ్చారు చానామంది. ప‌ల్ల‌కీలో పీర్ల‌ను పెట్టి ఎత్తుకుంటారు.

పెద్ద స‌రిగిత్తు నా పొద్దు ఆంజ‌నేయ‌సోమికి టెంకాయ‌కొట్టి, సావిట్లోకి పోయి చ‌క్కెర చ‌దింపుల‌కు ఇచ్చారు. వాళ్లు రోంత చ‌క్కెర తీసుకోని మ‌న‌కు ఇచ్చారు. మొక్కుబ‌డి ఉండి ఎంటిక‌లు ఇచ్చేటోళ్లు బాయిలోకి పోయి మునిగినాక ఎంటిక‌లు తీయిచ్చుకుంటాన్యారు. బురద బాయి అయినా అట్ల‌నే మునుగుతాన్యారు. ఇప్పుడంటే కులాయిల కింద నీళ్లు పోసుకుంటానారు. కొంద‌రు పిల్లోల్లు పుడితే బ‌రువంత చ‌క్కెర ఇచ్చాము అని ముక్కుంటారు. అట్ల చానామంది చ‌క్క‌ర చ‌దివిచ్చేవాళ్లుంటారు. చ‌క్కెర చ‌దివీయ‌టానికి సందులాక గుండంలో చ‌క్కెర ఏసి రోంత తీస‌క‌చ్చుకుంటారు. కొంద‌రు పానకం తీస‌క‌చ్చి గుండంలో చ‌ల్లేవాళ్లు. గుండం చుట్టూ మూడు చుట్లు తిరుగుతాన్యారు. జ‌నంలో తిర‌గ‌ట‌మే క‌ష్ట‌మ‌యితాండ‌.

గూగూడుల కులాయ‌సోమి ధ‌ర్మ‌ము ఉన్యాదా అపుడు సోమి ద‌గ్గ‌ర స‌త్యం ఉన్యాదిప్పా. తెలీక పీర్ల‌పండ‌గ‌కే పోయేవాళ్లం. బేచ్చారం, శుక్కురారం, ఆదివారం పోతానారు ఇప్పుడు. ఇడ‌ప్పుడు పోతే మేల‌ని తెలీని ఎర్రోళ్లం. పండ‌క్కి ద‌గ్గ‌ర‌లో ఉండే ద‌ర్గాకు చెప్పేవాళ్లు. మ‌ల్లా క్యాలెండ‌రు ఇచ్చేవాళ్లు, పేప‌ర్లు కొట్టిచ్చాన్రి. ఊర్ల‌కాడ ఉండే ముజావ‌ర్ల‌కు తెల్చే అంద‌రికీ తెలియ‌జెప్పే వాళ్లు, గూగూట్లోకి పోయేవాళ్లు, సొంతూర్లో పండ‌గ ప‌ల్లెల్లో చేసుకుంటాన్యారు. ఇపుడు త‌గ్గింది.

మ‌నూర్లో జ‌రుగుతాన్యాదా నాయినా నిజ్జంగా మ‌నూర్లో బ‌లే జ‌రుగుతాన్యాది పీర్ల‌పండ‌గ‌. పీర‌మ్మ వాళ్ల‌నాయిన కాశీం ముజావ‌రు. వొడ్లోళ్ల‌ది, శిన్న‌మ్మిగారి పీర్లు వొళ్లోకి పూరా వ‌చ్చాండ‌. కాపోళ్ల పీర్లే అన్నిప‌దైదు ఉండ్య‌. మా నాయిన‌, అబ్బ‌గారు, పెద్దోళ్లు అంద‌రూ ఉర్లోని పీర్ల‌సావిడి కాడికి పెద్ద‌సెరిగెత్తు నాపొద్దు పోతాంటిమి. మ‌న అబ్బావాళ్లు ఐదుమంది అన్న‌ద‌మ్ములు. ముజావ‌రు కాశీం ఇంటింటి కాడికి పోతే గింజ‌లు పెట్టేవాళ్లు కాపోళ్లు. ఆయ‌ప్ప మ‌నోళ్ల అంద‌రికీ గింజ‌లు పంచుతాండ్య‌. పీర్లు కాడ బొరుగులు, బెళ్లం చ‌దివిచ్చేవాళ్లు. అప్పుడు చ‌క్క‌ర త‌క్క‌వ‌,

మ‌న  కుల‌స్తుల‌తో పాటు కాపోళ్లు కూడా పీర్ల‌ను ఎత్తుకుంటాంటిరి, నేను కూడా ఎత్తుకున్యా. నీళ్లు పోసుకోని నిష్ట‌గా ఉండేవాళ్లు ఎత్తుకుండేవాళ్లు. చిన్న‌గంగ‌న్న తాత‌, పీర‌న్న‌, ప‌క్క‌ర‌దీను కొడుకు ద‌చ్చిగిరి ఏష్కాలు ఏచ్చాన్యారు, చిన్న‌గంగ‌న్న తాత పులి. ఏసికం ఏసినాడంటే అట్లుండ్య‌. పోటేస్కం ఏచ్చాండ‌. ట‌ప్పెట్ల‌కు ఎగురుతా ఊరంతా పోతాన్యారు. ఇంటింటికాడ బొరుగులు, బెల్లం ఇచ్చాన్యారు, రోంత మంది చ‌క్క‌ర చ‌దివిచ్చాన్యారు. ట‌ప్పెట్లు బాగా వాంచుతాన్యారు, బ్యాండ్లు లేవు అప్పుడు. మేలాలుండ్య‌. కొంద‌రు చెత్తిరి తీసుకోని గ‌జ్జెలు కూర్సిన చెడ్డీ ఏసుకోని మ‌దెర తొక్కుతాండ్రి. దివిటీల ఎలుగు. ట‌ప్పెట్ల ముందు ఏస్కాలు, ఎగుర్లు, చిందులు ఉండ్య‌. పీర్లు ప‌ట్నేవాళ్లు ఓ క‌త‌. వొళ్లోకి వ‌చ్చాండ్య పీర్లు, ఊరంతా జ‌నాలు పీర్ల‌కాడ‌నే ఉంటాండిరి. తెల్లావార్జులు జ‌రుగుతాండ్య‌. బ‌జ్జిగాడు వాళ్ల నాయిన‌, గంగోడిగాడు వాళ్ల‌నాయిన‌, చిన్న‌బాలిగాడు, పెద్ద బాలిగాడు, పీక‌ల బాలిగాడు.. ఇట్ల ప‌దిమంది ట‌ప్పెట్లు కొడ‌తాన్యారు, అంద‌రూ మంచోళ్లు,  మాదిగోళ్ల‌కు ట‌ప్పెట్లు కొడితే లెక్కిచ్చేవాళ్లు కాదు. మంగ‌ల చ‌న్న‌ప్ప‌, మంగ‌ల న‌ల్ల‌ప్ప మేలాలు వాంచుతాన్యారు. అంద‌రికీ సారాయి పోచ్చాన్యారు. బొరుగులు, బెల్లం ఇచ్చాన్యారు అంతే. ధ‌ర్మ‌కాలం,  గుండం బూడ్సినాక గొర్లోళ్లు గొడ్డుగొర్రె ఇచ్చే ఆడ కోసుకుంటాంటిమి. అది శాస్త‌రం. ఓపారి దాస‌ప్ప‌, గొల్ల పెద్ద‌న్న ఇచ్చినారు. నాకు మ‌తికి ఉంది.

మ‌ళ్ల మ‌నూర్లో ఒక‌సారి సూసినా పీర్ల‌పండ‌గ‌. మ‌ల్ల సేయ‌ల ఎందుకు ఇర‌వై ఏండ్లెళ్లిపోతే ఇబ్బంద‌ని బ‌డికాడ మీ పిల్ల‌ప్పుడు పీర్ల‌పండ‌గ‌ చేసినాం. మేం పిల్ల‌ప్ప‌టి పీర్ల పండ‌గే పండ‌గ. ఓపారి ముజావ‌రు కాశీం తాగినాడు. పీర్లపండ‌గ నా పొద్దే ఆయ‌ప్ప బ‌ర్లెంక‌ల మింద ఎద్ద‌ల బండి పోయినాది. ఆమైన ముజావ‌రు తాగ‌కూడ‌ద‌ని ముజావ‌రును శేఖ‌రెడ్డి వాళ్ల అబ్బ కొట్నాడు. అట్ల ఆగినాది మ‌నూర్లో పండ‌గ‌. అదిగాక గుండం కాడ లెటిను క‌ట్నారు రెడ్డోళ్లు. గుండం కాల్తాంటే వాళ్లు ఆర్పాల‌ని వ‌చ్చిరి. వీళ్లు లెటిను కాలిపోవాల‌ని మంట ఎక్కువ పెట్నారు, కొట్టాట వ‌చ్చింది. అట్ల పీర్ల పండ‌గ మూల‌న ప‌డినాది. చిన్న‌మ్మిగారే పీర్ల‌చావిడి క‌ట్టించిండేది. సావిడిలో ఉండే వెండిపీర్లు ఎవ‌రో దెంక‌పోయినారు. తీస‌క‌పోయినోడు కూడా యాడ‌నో స‌చ్చిపోయినాడంట‌. మ‌నూరు అట్ల పీర్ల‌పండ‌గ‌కు దూర‌మైనాది. చెర్లోప‌ల్లె, ముస‌ల్‌రెడ్డిప‌ల్లె, సిమాప‌ల్లెకాడ బాగా జ‌రుగుతాది. మ‌న‌క‌ల్ల బీంచెర్ల‌లో చానా బాగా జ‌రుగుతాంది. ఇప్పుటికీ ఆ ఊర్ల‌కాడ బాగా పీర్ల‌పండ‌గ జ‌రుపుతారు. మ‌నూర్లో ఇంగ పీర్ల‌పండ‌గ జ‌ర‌గ‌దు. మున్నిరుడు వ‌ర‌కూ శిన్న‌మ్మిగారి పీరు ఇంట్లో ఉండాద‌ని చ‌దింపులు చేయ‌టానికి పోతాంటి. ఇంట్లో నిల‌బెట్టింటే పోతాంటి. పీరు క‌డిగి ప‌డ‌మ‌ర ప‌క్క‌బెట్టి ఊత‌క‌డ్డీలు వెలిగిచ్చి దీపారాజ‌న చేసి చ‌దింపులు సేచ్చాంటి. ఇంట్లో పెట్టుకుంటే వొమ్మిరాద‌ని అంటే వాళ్లు పీరును క‌డ‌ప‌నాప‌ల్లెకు పోయి ఇచ్చినారు మూడేండ్ల కింద‌ట‌, ఆ పీరుకు సంవ‌‌త్స‌రం సంవ‌త్స‌రం గుడ్డ‌లు పెడ‌తారు.

ఇప్పుడు న‌డిచి పోయేటోళ్లు లేరు. ఇడ‌ప్పుడే గూగూడికి ఎక్కువ పోతారు. ఇప్పుడు జ‌నాలు తెలివి. ఇడ‌ప్పుడు పోతే దేవున్ని చూడ‌చ్చ‌ని అనుకుంటానారు, పెద్ద స‌రిగిత్తు ఈ పొద్దే. ఇప్పుడు క‌రోనా వ‌చ్చినాద‌ని లోప‌లికి రాకుండా పోలీసోళ్లు ఉండారంట‌. ఆ ఊరోళ్లే చేసుకుంటానారు. మ‌న దూదేక‌లోల్లు గూగూడికి పోలేక ఈ సంవ‌త్స‌రం ఇంటికాడ‌నే చ‌క్క‌ర చ‌దింపులు చేసుకున్యారు. కులాయ‌సోమి పేరు చెప్పి ఇంటికాడ‌నే పిల్లోల్లకు పుట్టెంటిక‌లు తీసి ఎత్తిపెట్టుకున్యారు. మ‌ల్ల పోయిన‌పుడు ఆడ వేయ‌చ్చ‌ని. ఆయ‌ప్ప పేరు సెప్పే ఇంటికాడ మేక‌పోతులు కోసుకోవాల‌. కోళ్లు కోసుకోవాల‌.

ఈ సారికి గూగూడులో పిల్లోడికి ఎంటికలు తీసియ్యాల‌. అప్పుటికి క‌రోనా పోతాదిలే నాయినా అంటి.

పోదాం ప్పా. గూగూడు సోమిని కాకుండా మేం ద‌స్త‌గిరి పీరు, మాబూ పీరు, మ‌స్తాన్ పీరును పూజిచ్చాంటిమి. మీయ‌మ్మతో పెండ్ల‌యినాక‌నే గూగూటికి పోబ‌డితి. మీ అమ్మ‌కు గుండం, సావిడిలోని కులాయ‌సోమి కండ్ల‌లో క‌న‌ప‌డ‌తాంది అనేది. రోజూ గూగూడు కులాయిసోమికి దీపారాజ‌న చేసేది. సోమీ గూగూడు కులాయ‌సోమి అనేది. మీ అమ్మ వ‌ల్ల‌నే మీకు గూగూడు కులాయ‌సోమి ఇంటిదేవుడు అయినాడు.

మ‌న‌ల‌ను కాపాడే గూగూడు కులాయ‌సోమి ద‌గ్గ‌ర స‌త్యం, ధ‌ర్మం ఉండాది కాబ‌ట్టే ఆయ‌ప్ప ద‌గ్గ‌ర‌కు అంత జ‌నాలు పోతాండారు. ఈసారికి ఆటికి పోయి పిల్లోనికి ఎంటిక‌లు తీపిచ్చి మేక‌పోతు కోసి వండుకోని తిని వ‌చ్చాం. గూగూడు కులాయ‌సోమి అంటా మా నాయిన దండం పెట్టుకోని, పెద్ద స‌రిగిత్త‌ని స‌దింపులు చేసి చ‌క్క‌ర నోట్లో పోసినాడు. మాయ‌మ్మ లేని ఇంట్లో మానాయిన‌కు, నాకు చ‌క్కెర‌యినా చేదుగా ఉంటాది. మాయ‌మ్మ కొల్చే గూగూడు కులాయ‌సోమి యాడున్యా మాయ‌మ్మ‌ను బాగా చూసుకో అని దీపారాజ‌న చేసే ప‌టాల‌కు ముక్కున్యా!

*

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాయలసీమ సంస్కృతిని బయటిప్రపంచానికి తెలియప్రుస్తున్నందుకు అభినందనలు రాజావలీ!

  • మన సీమ లోని సంస్కృతి గురించి చాలా బాగా చెప్పినా వు బ్బీ

  • రాయలసీమ మాండలిక సొబగుల్ని అద్ది, చిక్కటి, చక్కని కథనాన్ని అందిస్తున్నారు…అభినందనలు.

  • Unnadi unnatu baga cheppindi vabba, gugudu tirunala baga jarugutundya , Pathakalam poyina rule bagunnay raja. Eppudu chanamandi swartham tho batukutunnaru. Nuvu Gugudu Kullaya swamy gurichi Baga cheptivi abbi

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు