గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూసుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు.
సిటీకి ఊరులెక్క.
ఊరికి సిటీలెక్క.
నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాలని చాలా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి చానా కథలున్నయి సరే, అవి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి?
ఇది నా మైండ్‌ల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట, ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. ఒక్కసారి గతాలకు పోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇవి రాస్తుంటే నన్ను నేను మళ్లా వెతుక్కుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిస్తున్నది. మీగ్గూడ అట్ల అనిపిస్తదా లేదా చెప్పలేను. చదివి మీరే చెప్పాలి.
ఈ కథలకు ఒక ఆర్డర్‌ఏం లేదు. ఎటు తీసుకపోతే అటు రాస్తున్నా.
కాకపోతే, ‘మా అమ్మ గురించి తెలుసుగా!’, ‘మా నాన్న చెప్పిన మాట వింటడా?’ అని ఏ కథలనైనా నేను చెప్తే, వాళ్లు మీకు అప్పటికే తెలిసుండాలి కాబట్టి, ఫస్టు రెండు కథలు వాళ్లని పరిచయం చేసేటివి.
*
మా నాన్న మారయ్య
మా నాన్న పేరు టైటిల్లనే చెప్పేసిన కాబట్టి, డైరెక్ట్‌గ కథ చెప్త. మొన్నామధ్య ఒక పెండ్లి పోయేటిది ఉండె. బాగా తెలిసినోళ్లది. నేను, మా నాన్న కలిసి బండి మీద పోతున్నం.
గడియారం సెంటర్‌నించి లెఫ్ట్‌కి.. అంటే హైదరాబాద్‌రోడ్డు దిక్కు పోతే వచ్చే ఫంక్షన్‌హాల్ల పెండ్లి. గడియారం సెంటరంటే నల్లగొండల ఎవ్వరన్నా చెప్తరు. నిజానికి ఆ సెంటర్ల నిలబడి, ‘ఎటుదిక్కు రావాలి?’ అని అడిగి, అవతలివాళ్లు ఎటు చెప్తే అటు పోయినమంటే వాళ్లను కలుసుకోవచ్చు.
అంత చిన్నది మా ఊరు. అంత చిన్న ఊర్లనే, అంత ఫేమస్‌ఆ గడియారం సెంటర్.
మేం హైదరాబాద్‌రోడ్డు దిక్కు పోతున్నం.
‘‘చిన్నగ.. చిన్నగ పోనియ్యి..’ అన్నడు మా నాన్న.
‘‘చిన్నగనే పోతున్నం కదనే..’’
‘‘అట్లగాదు..’’
‘‘ఆ..?’’
‘‘నువ్వైతే చిన్నగ పోనియ్యి. ఈడ్నేరా.. ఈడ్నే ఉంటడు.. ఎన్నేండ్లాయె చూసి!’’ అన్నడు.
‘‘ఎవరే?’’
నాతోటి ఏం మాట్లాడుకుంటా ఆ ఐదొందల మీటర్ల దూరమంతా, ‘ఈడ్నే.. ఈడ్నే..’ అనుకుంట మొత్తానికి దొరకబట్టిండు.
గడియారం సెంటరని చెప్పిన కదా, మా నాన్న తన జీవితకాలమంతా ఆ సెంటర్‌కి ఇటుపక్కనే బతికిండు.
మర్చిపోయి ఎప్పుడు హైదరాబాద్‌రోడ్డు దిక్కు పోవాల్సొచ్చినా, ‘‘ఒకప్పుడు ఇంత ఊరెక్కడిది? ఇదంతా అడివే..’’ అనేటోడు.
అట్ల ఇటుపక్కనే మొత్తం ఊరు, అటు పక్కంతా అడవి ఉన్న కాలంల, నల్లగొండకి పారిపోయి వచ్చిండంట మా నాన్న.
‘‘ఎన్నేండ్ల కిందటి ముచ్చట?’’ అనడిగితే, అది చెప్పలేడు.
‘‘నీకు ఎన్నేండ్లుంటయే?’’ అంటే, ‘‘డెబ్బై ఉండవా?’’ అంటడు.
‘‘ఎహెయ్.. నీకు డెబ్బై ఉంటయా?’’ అని నాన్నకంటే పెద్దోళ్లు ఎవ్వరన్న అంటే, ‘‘ఉండయే?’’ అని నవ్వుతడు.
ఆధార్‌కార్డుల డెబ్బై, మొన్న ఆరోగ్యం బాలేదంటే డాక్టర్‌దగ్గరికి పోయినప్పుడు ఆయన రాసిచ్చిన ఓపీ చిట్టీల డెబ్బై ఐదు, బస్‌పాసుల అరవై ఐదు.. ఇట్ల ఒక్కో దగ్గర ఒక్కో వయసుంటది.
చదువుకోలేదు. పైసల లెక్కలు తెల్వదు. ఈ కాయితం ఐదొందలు, ఈ కాయితం వంద, ఇది పది, ఇది యాభై అని తెలుస్తదేమో కానీ, అయన్నీ కూడి చెప్పాల్సొస్తే చెప్పలేడు.
మా పెద్దక్క పెండ్లికి, ‘‘డెబ్బై వేలంటున్నరే కట్నం’’ అని ఎవరో అంటే, ‘‘డెబ్బై ఏడ ఇస్తమే, భూమి అమ్మితే లక్ష వస్తయేమో, అంతవరకైతే ఇస్తం’’ అన్నడంట. అట్ల ఉంటది మా నాన్న కథ.
సరే, నల్లగొండకి పారిపోయి వచ్చిండని చెప్పిన కదా, అప్పుడొక పెద్ద బంగ్లాల ఆబ్కారాయన దగ్గర చేరిండు. నెలకి ఏడు రూపాయల జీతం. మూడు పూటలా అన్నం. మా నాన్న బక్కగుంటడు. చిన్నప్పట్నించీ అట్లనే ఉన్నడంట. ఇప్పటికీ అట్లనే ఉన్నడు.
‘‘గట్టిగ గాలొస్తే కొట్టుకపోతడు. ఈడేం పనిచేస్తడు’’ అన్నడంట ఆబ్కారాయన, పనికి పెట్టుకునేముందల. కానీ ఎట్లనో చేరిండు. అప్పటికి చిన్న పిల్లగాడంట.
ఊర్ల మా నాన్నకి పెద్ద బంగ్లా, భూములున్నాగూడ చూసుకుంటానికి అమ్మా నాయన.. అంటే మా తాతా నాయనమ్మలు లేరు. ఈయన చిన్నగున్నప్పుడే చచ్చిపోయిన్రంట. పెదనాన్న కథ వేరే. అది ఇక్కడ చెప్తే అయ్యేటిది కాదు.
పేదరికమాయె. గట్క, గంజి.. అదే బువ్వ.
ఇక్కడ నల్లగొండలనేమో.. మూడు పూటలా వరి అన్నమే పెడుతున్నరు. ‘అమ్మ! ఈడ రోజు వరి అన్నమే పెడుతున్నరు గదా!’ అనుకున్నడంట.
కాకపోతే, ఏదన్న పనిజెయ్యకపోతే కుక్క కొట్టుడు కొట్టేదంట ముసలామ. ఈ పని ఆ పని అని లేదు. అన్ని పనులు చేసిండంట. డెబ్బై ఏండ్ల మా నాన్న.. చెయ్యి చూపెట్టి, ‘‘ఇంత ఉంటిని. చిన్నపిల్లగాడ్ని. ఈ చేతులన్నీ కాయలు కాయంగ పనిచేసేటోడ్ని’’ అని చెప్పుకుంట అటెమ్మటే చెయ్యి మూస్తడు.
ఇగ కొన్నాండ్లు అక్కడ్నే పనిజేసిండు. నెలజీతంల వచ్చే పైసలన్నీ ఆబ్కారాయన చుట్టం ఒకాయన ఉంటే, ఆయన దగ్గర దాచిపెట్టిండంట. అయన్నీ అట్లనే ఉంటున్నయి. నల్లగొండకి పారిపోయి వచ్చిన్నప్పుడు దగ్గరచేసి, ఈ పనిల పెట్టిన అప్పయ్య తాతే, పెండ్లి సంబంధం చూసిండంట. ఇగ కూడబెట్టిన పైసలన్నీ తీస్కపోయి, పిందారకు కావాల్సిన సామాన్లు కొనుక్కొని, అప్పట్ల ఊరికి బస్సుల్లేవంట, విజయలక్ష్మి ట్రావెల్స్‌అని ఒకటి ఉంటే, అదెక్కి ఆ సామాన్లు పట్టుకపొయ్యి ఊర్ల పడ్డడు.
మంచిగ పిందార చేసిన్రు. ఆ తర్వాత ఏమున్నది? మా అమ్మని చూస్తానికి ఎక్కడ నేరలపల్లి, ఎక్కడ వింజమూరు.. అంత దూరం ఒక పెద్దాయనతోటి నడిచిండు. మా అమ్మని చూసుకున్నడు. పెండ్లయ్యింది.
పెండ్లయిన కొన్నేండ్లకు.. మా ఇంటికాడ కొండచెల్మ బావి ఉన్నది, దాంట్ల నీళ్లు తోడి ఇండ్లల్ల పోసే పని పెట్టుకున్నడు. పెద్దక్క, అన్న పుట్టిన్రు. ఆ పనిల ఉన్నప్పుడే ఓ పెద్ద కథైంది. అది తర్వాత చెప్త గానీ, అదయిపోయినంక పదినెలలు ఖాళీగా ఉన్నడు.
ఖాళీగ ఉంటే అయితదా అని సినిమా టాకీస్‌ల గేట్‌కీపర్‌గా కుదిరిండు. గేట్‌దగ్గర టికెట్లు చింపి జనాలను లోపలికి పంపిచ్చే పని ఈయనదే, ఊడ్చే పనిగూడ ఈయనదే.
టాకీస్‌ల చేస్తున్నప్పుడే చిన్నక్క, నేను పుట్టినం. నేను కొంచెం పెద్దోడినై, ఆ టాకీస్‌కూలగొట్టేదాంక అండ్లనే పనిజేసిండు.
అగో, అక్కడ, టాకీస్‌బయట జ్యూస్‌బండి దగ్గర, మా నాన్న లెక్కనే ఒక పిల్లగాడు ఊర్నించి పారిపోయొచ్చి పనికి చేరిండంట. ఎట్ల దోస్తయిండో, మా నాన్నకి దోస్తయిండు. ‘పెద్నాయన’ అని పిలిచేదంట ఆ పిల్లగాడు నాన్నని. పదేండ్లపాటు సాగింది వాళ్ల దోస్తీ.
మా నాన్నకేమో జ్యూస్‌ఫ్రీ. ఆ పిల్లగానికి సినిమా ఫ్రీ.
ఇంకెవరో మల్టీప్లెక్స్‌కడుతరని టాకీస్‌అమ్మేసి, కూలగొట్టినంక వీళ్లిద్దరు వేరయిండ్రు.
ఆ తర్వాత మా నాన్న ఇంకో టాకీస్‌ల నైట్‌వాచ్‌మ్యాన్‌గా చేరిండు. అది వదిలేసి ఒక హాస్పిటల్ల వాచ్‌మ్యాన్‌గా చేరిండు.. అట్ల ఏదో ఒక పనిచేస్తనే ఉన్నడు. ఆ పిల్లగాడేమో సొంతంగా జ్యూస్‌బండి పెట్టుకున్నడు. ఎప్పుడన్నా, ఎక్కడన్నా కలిస్తే మాట్లాడుకుంటరు. అంతే.
హైదరాబాద్‌రోడ్డు దిక్కు పోతే అతని జ్యూస్‌బండి ఉంటది. మా నాన్నకి ఆ విషయం కచ్చితంగ తెలుసు.
మేం ఫంక్షన్‌కి పోతున్నం కదా, హైదరాబాద్‌రోడ్డుల ఉన్న ఫంక్షన్‌హాల్ల, తెలిసినోళ్ల పెండ్లికని, అప్పుడు మా నాన్న వెతుక్కున్నది ఈ బండినే.
దొరకబట్టిండు.
‘‘పెద్నాయనా!’’ అన్నడతను, నాన్నను చూడంగనే.
అల్లుకున్నరు. ‘‘ఎన్నేండ్లాయెరా!’’ అన్నడు మా నాన్న.
నాకిది చిత్రంగనే అనిపిచ్చింది. రోజూ పొయ్యే దార్ల కాకుండా ఇటుదిక్కు ఒక ఐదు నిమిషాలు మా నాన్న సైకిల్‌తొక్కితే చూస్తడు కదా, అయినా వీళ్లు ఎందుకు కలవరు? అనుకున్న.
‘‘ఎవరు?’’ అని నాదిక్కు చూసిండతను.
‘‘మా చిన్నోడు’’ అన్నడు నాన్న.
‘‘జ్యూస్‌చేస్త ఉండు’’ అని అతనంటే, ‘‘ఎందుకులే, పెండ్లికే పోతున్నం’’ అన్నడు నాన్న.
‘‘చేస్త తాగవే పెద్నాయనా..’’ అని, ‘‘నాకు ఎనిమిదేంట్లుంటయి తమ్మీ. అప్పుడు టాకీస్‌ఎదురుంగ జ్యూస్‌బండి దగ్గర పనికి చేరిన. అప్పటిసంది ఇదే పని. మస్తుంటుండె అప్పుడు. టాకీస్‌కూలగొడ్తిరి. తలోదిక్కు పడ్డం. ఇటొచ్చి నేను సొంతంగ బండి పెట్టుకున్న. పెండ్లయింది. ఇద్దరు పిల్లలు’’ అని చెప్పుకుంటనే మా నాన్నను అల్లుకున్నడు. ఇద్దరి కండ్లల్ల నీళ్లు.
‘‘చానా కష్టపడ్తడు పిలగాడు..’’ అని అతన్ని నాన్న నాకు మళ్లా పరిచయం చేస్తే,
‘‘ఎంత మంచిగ మాట్లాడుతడో ఎవ్వరితోటైనా. ఎంత పనిచేసేటోడో పెద్నాయన. మంచిగ చూస్కో తమ్మీ. హైదరాబాద్‌ల ఉంటున్నవా?’’ అని చేతుల జ్యూస్‌గ్లాసు పెట్టిండు.
జ్యూస్‌తాగినంక పోతమని చెప్పి బయలుదేరినం.
‘‘ఎన్నాండ్లయిపాయెనే!’’ అనుకున్నరు ఇద్దరు.
బండి స్టార్ట్‌చేసిన. ఎక్కి కూర్చున్నడు మా నాన్న.
ఫంక్షన్‌హాల్‌దిక్కు పోతున్నం.
ఏదోకటి మాట్లాడుదమని, ‘‘ఏం పేరే ఆయనది?’’ అనడిగిన.
‘‘ఏమో పేరుండెనేరా?’’ అని చానాసేపు ఆగిండు. ‘‘ముసిలిమోల్ల పిల్లగాడురా, చానా మంచోడు, చూసినవుగా!’’ అన్నడు మా నాన్న.
*
మల్లి మల్లి మల్లి అని అంటుంటే ఎదో చెప్పమని అడుగుతునట్లు ఉంటుంది కానీ నాకైతే చిన్నప్పటి నుండి తనని మల్లి అని పేరు పెట్టి పిలిచినపుడల్లా రాబోయే తరానికి ఒక కొత్త నూతన రచయిత దొరుకుతాడాని నాకు అనిపించేది ఎందుకంటే మా 7th క్లాస్ లో తను కొత్త కథలలో నను హీరో గా పెట్టి సినిమా తీయాలని అనే అలోచనలు ఆనాటి నుండే మాట్లాడటం చూసి తన పట్టుదల తన కోరిక కచ్చితంగా తీరుతుందని అనుకున్నాను.. ఈనాటికి తను రాసిన ఇరానీ కేఫ్ మరియు ఈరోజు మా నాన్న మారయ్య కథలని అన్నిటిని చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది.. మరెన్నో కథలతో తను ఇంకా మమ్మల్ని అందరిని తన ఉహాలతో మాటలతో మైమర్పించాలని కోరుకుంటూ నీ మురళీ యాదవ్…
బాగున్నాయి జ్ఞాపకాలు… బాల్యాన్ని గుర్తు చేసి బెంగటిల్లే జ్ఞాపకాలు…
Chala bagundi 👌😊
🙂 🙂
Awesome Bro.
Superb!
Super bro , chala bagundi naku ma Nana gurthu vachadu bcz same akchalama lone undevadu akade work chese vaadu hyd road motham adavi ani chepevaadu Manam chudale kani but Ila book cheyali ani unde , and nlg paina kuda , meku nlg anna me Nana chala istam ani telustundi ♥️🙏 keep it up nice nlg vala Ansari gnapakalu nidra lepinatlu undi nice feeling
కళ్ళలో నీళ్ళొచ్చాయ్
చాలా బాగా రాశారు
చివర్ల నువ్వు ఏం పేరే అని ఆడిగినావ్ చూడు, అప్పుడు పెద్దాయన మనుషులు యాది ఉంటరు గాని పేర్ల ఎరుక ఎట్లుంటది అనుకుంటా ఉండిపోయిండే… అదిరా అబ్బాయి కతంటే.
నాయనకి మనుషులతో ని మంచిగుండుడొక్కటే ఎరక మిగతయి పట్టిచికునుడు ఆయనకి తెల్వదు…అమ్మకడ పాలుచీకే పోరగండ్లు ఎంత కల్మషం లేకుంటా ఉంటారో గట్లున్నడు…కథ శానా బాగుందన్న