మా నాన్న-కిర్లోస్కర్ డీజిల్ యింజన్

ఈ కిర్లోస్కర్ డీజల్ యింజను ఒక్కోసారి నాపాలిట యముడయ్యేది. హ్యాండిల్ వేసి ఎన్నిసార్లు తిప్పి గేరు వేసినా స్టార్ట్ అయ్యేది కాదు. కడుపులో తిన్నది అరిగిపోయినా, చేతులు నొప్పెట్టినా..స్టార్ట్ అవడానికి ససేమిరా అనేది. అప్పుడు మానాన్న మెకానికల్ ఇంజనీరు అవతారం ఎత్తేవాడు.

1975ల ప్రాంతంలో, గుడ్డిచుక్క మొలవక ముందే మా నాన్న కాడెద్దుల మెడపై కాడిమాను పెట్టి, దానికి మోకునూ, దాపతాడుని, బొక్కెననీ కట్టి; నోట్లో నీళ్ళయినా పోయకుండా చెర్నాకోళు పట్టుకొని కపిల తోలడానికి మా గదగుండ్ల బాయికి పోయేవాడు. అక్కడపోయి ఏం చేసేవాడో ఆ తర్వాత ఎప్పుడో నిద్రలేచి, కాలకృత్యాలన్నీ తీర్చుకొని అమ్మ సద్ది ఇచ్చిరమ్మంటే బావి దగ్గరకి పోయినప్పుడు తెలిసేది. అదొక గానుగెద్దు వ్యవహారం. పదేపదే అదే దారిలో నడుస్తూ, అదే పని చేస్తూ గంటలు గంటలు. అలాగని ఏకాగ్రత తప్పినా.. మోకు మీద కూర్చుని ఎద్దులను అదిలించినప్పుడు ఏమరుపాటుగా వున్నా.. అంతే సంగతులు. కాడి నుంచి మోకును తప్పించి, బొక్కెనను బావిలోకి వదులుతూ మళ్ళీ కాడికి తగిలించేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా, మనిషికీ, ఎద్దులకూ ప్రమాదమే! కాలు జారినా, చెయ్యి జారినా బరువైన బొక్కెన మనిషిని బావిలోకి విసిరేస్తుంది. ఆ వేగానికి బావిలో పడ్డా ఫర్వాలేదేమొ గానీ అంతకుముదే కపిల దూలాలకు తగిలి దేహం ముక్కలవడం ఖాయం.

కానీ పసివాడికి నాకేం తెలుసు అదంతా అప్పుడు! బొక్కెన పైకి వచ్చినప్పుడల్లా దాని తొండం లాఘవంగా కపిల దూలాలకింద వున్న తూములోకి వెళ్ళడం, బొక్కెన పైకి లేచి అందులోని నీళ్ళన్నీ ఒక్కసారిగా తొండంలోనుండి కాలువలోకి చేరడం…చూడ్డానికి భలే సరదాగా వుండేది. ఆ చల్లని నీళ్లలో ఆ కాలువలో కాళ్ళాడిస్తూ తిరగడమే మహానుభూతి!

ఎప్పుడో తెల్లవారుఝామున మూడింటికో, నాలుగింటికో మొదలయ్యే కపిల వుదయం పదింటికి గానీ అయిపోయేది కాదు. అప్పటికైనా ఎద్దులకూ, మనిషికీ అలుపై వదిలెయ్యడమే. ఆ బావిలో నీళ్ళు కపిలకు అయిపోయేరకం కాదు. అలాగని ఆ నీళ్ళతో ఎకరాలు తడపొచ్చా అంటే అదీ లేదు. బొక్కెన తొండం దూరే కాలువ ఎంత ఎత్తులో వుందో, సాగు అయ్యే కయ్యలన్నీ కూడా అంతకంటే దిగువనే వుండాలి. అందుకనే ఆ కాలంలో బావులు సాగుమడికి కాస్తా ఎత్తులో తవ్వేవాళ్ళు. ఆ కాలువకు ఒక అరడుగు ఎత్తులో వున్న కయ్యకైనా నీళ్ళు పారవంటే పారవు.

అదిగో…అప్పుడు వచ్చింది సేద్యపునీటిని తోడే విప్లవం. అదే కిర్లోస్కర్ ఆయిల్ యింజన్. నాకు గుర్తున్న వరకూ అది 5 హార్స్ పవర్ ఇంజన్ అనుకుంటా. ఇంజనూ, నీళ్ళు తోడే టర్బైనూ అంతా కలిసి ఒకే ప్లాట్‌ఫాం మీద వుండేవి. (బొమ్మ చూడండి). ఆ ప్లాట్‌ఫాం అంతా నాలుగు చక్రాల మీద వుండి ఒకచోటినుండి మరోచోటికి తీసుకెళ్ళడానికి సులభంగా వుండేది. అది మా యింట్లో విప్లవం తీసుకువచ్చింది. తెల్లవారుఝామునే నిద్రలేచి కష్టతరమైన, అపాయకరమైన కపిల తోలాల్సిన అవసరాన్ని దూరం చేసింది. అంతకంటే పెద్ద విప్లవం, అంతవరకు ఆ బావి నీళ్ళ రుచి ఎరుగని మెట్ట ప్రాంతాలనూ సాగులోకి తేవడం. నీటిపైపుకు పైపు తొడగడం ద్వారా కాసింత ఎత్తైన పొలాలకూ నీటిని తీసుకెళ్ళడం సాధ్యమయింది. అది మానాన్న వినూత్న ప్రయోగాలకు తావిచ్చింది. అప్పటివరకూ వర్షాన్ని ఆధారం చేసుకొని పంటలు వేసే చోట, ఎండాకాలంలో మానాన్న వేరుశనగ పండించాడు. టమాటా సాగు చేశాడు. ఒక్కసారిగా సాగు విస్తీర్ణం రెండింతలూ, మూడింతలూ అయ్యింది.

కిర్లోస్కర్ యింజన్ ఇచ్చిన మరో వెసులుబాటు, ఒక బావినుండి మరో బావికి కాడెద్దులకు దాన్ని కట్టుకొని సులభంగా తీసుకెళ్ళడం. ఆ విధంగా ఒకే యింజనుతో వేర్వెరు బావుల కింద సాగుచేయడం మొదలు పెట్టాడు. ఒకసారి నాకు బాగా గుర్తు. అప్పట్లో మా చెరువు కింద మాకు కేవలం అర ఎకరా మాత్రమే వుండేది. అది కూడా చెరువులో సమృద్దిగా నీరు చేరినప్పుడే వరి పండేది. చెరువు అరకొరగా నిండి తగినన్ని నీళ్ళు లేకపోతే వరి సాగుచేయడానికి ఎవరూ సాహసించేవాళ్ళు కాదు. చెరువులో నీళ్ళు సరిపోకున్నా పండించుకోవడానికి కొందరి పొలాలకు నీటిబావులుండేవి. అయితే ఆ సంవత్సరం నీటీబావుల వసతి వుండేవాళ్ళే నీళ్ళు సరిపోవని వరి వేయలేదు. కానీ బావి వసతి మాకు లేకపోయినా ఆ అర ఎకరంలో మా నాన్న వరి వేశాడు. వరి బాగా వెన్ను పట్టాక, చెరువులో నీళ్ళు తూముకు అందకుండా పోయాయి. మరొకరయితే ఆశ వదిలేద్దురేమో. మా నాన్న కిర్లోస్కర్‌ను నమ్ముకున్నాడు. దాన్ని చెరువులో నీళ్ళున్న చోట ఏర్పాటు చేసి చివరి బొట్టును పీల్చేవరకు అందులో నీళ్ళతో మడి పారించాడు. అయినా వరి పండడానికి ఇంకా నీళ్ళు కావల్సి వచ్చాయి. మా మడి చుట్టుపక్కల బావులున్నోళ్ళను అడిగి ఒక్కో బావికీ, యింజన్ తిప్పుతూ ఒక్కోరోజు ఒక్కోబావినుండి నీళ్ళు తోడాడు. ఆ యింజనుకు బావిలోకి దింపే నీళ్ళ పైపు పాతిక-ముప్పై అడుగుల పొడవుండేది. మా నాన్న యింజనును ఎద్దులకు కట్టి తోలుతూ వుంటే, ఆ వెనుక మా అన్న, అమ్మ, నేనూ ఆ పొడవాటి పైపును మోస్తూ వెళ్ళేవాళ్ళం. జీళగోళ్ళ బావి, సుబ్బరాయుడోళ్ళ బావి అయిపోయాయి. ఇంకా తడులు అవసరమైతే.. చెరువు పైనున్న బాలయ్యగారి బావికి యింజను బిగించి అక్కడినుండి సరికొత్త కాలువ తవ్వించి కూడా నీళ్ళు కట్టాడు.

అయితే ఈ కిర్లోస్కర్ డీజల్ యింజను ఒక్కోసారి నాపాలిట యముడయ్యేది. హ్యాండిల్ వేసి ఎన్నిసార్లు తిప్పి గేరు వేసినా స్టార్ట్ అయ్యేది కాదు. కడుపులో తిన్నది అరిగిపోయినా, చేతులు నొప్పెట్టినా..స్టార్ట్ అవడానికి ససేమిరా అనేది. అప్పుడు మానాన్న మెకానికల్ ఇంజనీరు అవతారం ఎత్తేవాడు. ఓ గోనెపట్ట కిందపరచి, స్పానర్ల సంచీ విప్పి, ఆ యింజను ఒక్కోపార్టునూ విప్పి కిరసనాయిల్‌తో కడిగి ఆరబెడతాడు. ఆ విప్పడంలో ఎప్పుడూ ఏదో ఒక నంబరు స్పానరు కనపడదు. వూర్లోకెళ్ళి దాన్నెలాగో సంపాదించి మళ్ళీ బాయి దగ్గరికి పరుగెట్టాలి. తీరా అక్కడదాకా వెళ్ళాకా, నాయనా స్క్రూడ్రైవర్ లేదే ఇంటికెళ్ళి తీసుకురాపోమ్మంటాడు. మళ్ళీ పరుగే పరుగు. తీరా అది పట్టుకొని వస్తానా… అరె బిడీలు అయిపోయాయే, చెప్పడం మరచిపోయా..గభాలున వెళ్ళి తీసుకొచ్చెయ్ అంటాడు. అప్పుడు వాకీటాకీలు వుంటాయని తెలియకపోయినా అలాంటివి వుంటే ఎంత బావుండునో అని కలగనేవాడిని. ఒక్కోసారి ఆయనెంత కష్టపడినా అది బాగయ్యేది కాదు. అప్పుడు మరో విన్నపం/ఆదేశం.. వెంటనే పర్వతరెడ్డిగారిపల్లెకు పోయి మెకానిక్కును పిలుచుకురా అని. ఇలా అప్పట్లో నాకు అదొక పీడకలలా వుండేది.

తీరా అన్నీ చేసి స్టార్ట్ అయ్యిందా.. పంపులోంచి నీళ్ళు వచ్చేవి కావు. నీళ్ళు రావాలంటే పంపు వరకూ పైపులో నీళ్ళు వుండాలి. ఆ పైపు ఫుట్‌బాల్‌లో ఏదో చిక్కుకొనో మరొకందుకో నీళ్ళు లీక్ అయిపొయ్యేవి. అప్పుడు ఎక్కెడెక్కడో వెతికి పచ్చి పేడను తెచ్చి పైపులో పోసి ఆ తర్వాత నీళ్ళు నింపి యింజను స్టార్ట్ చేసేవాళ్ళం.

ఎన్ని కష్టాలు పెట్టినా ఇప్పుడు తలుచుకుంటే అది నిజంగా మమ్మల్ని ఓ మెట్టు ఎక్కించిన సాధనం. టెక్నాలజీని అందిపుచ్చుకొన్న మా నాన్న సాహసం మాకు కొండంత వరం.

*

 

ప్రసాద్ చరసాల

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంజన్ హాండిల్ తిప్పి స్టార్ట్ అయిన తరువాత ఒడుపుగా లాగాలి , ఒక సారి లాగక ముందే ఇంజన్ వేగమందుకొంది .. అది ఆవిసురుకి ఎవరి తలమీద పడ్తుంతో అని అందరం పరార్ ! .. ఇప్పటికి గోదావరిలో నీళ్లు ఒడ్డుకు తేవాలి అంటే ఇదే మార్గం

    • తొంబైల్లో వచ్చిన కరెంటు మోటార్లు వీటి వునికి లేకుండా చేశాయి మా వైపు.

  • 1975 నాటికే కిర్లోస్కర్ ఇంజన్ ను ఒక పల్లె రైతు కొనటం అంటే కాలానికి ముందున్నట్లే. రచయిత నాయన అభినందనీయుడు. ఇంజన్ లో సమస్య వస్తే పెట్టే తిప్పలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అయినా సామాన్య రైతుల వెతలకు దూరం చేసింది కిర్లోస్కర్ ఇంజన్.

    • అవును రావు గారూ,
      మా నాన్న మావూరి రైతుల కంటే కొంత ముందే వుండేవారు. కొత్త ప్రయోగాలు అనేకం చేశారు.

  • నా చిన్న నాటి అనుభూతులు గుర్తొచ్చాయి. బాగుంది సర్.

  • చక్కటి memoir పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రసాద్ గారు.

  • ఇంజరం ఊళ్ళోనుంచి… రాజుగారి చెరువుదాకా ఇంజనాయిల డబ్బాలు సైకిలుక్కట్టుకుని, అదీ పెడల్ కూడా అందకుండా వున్న వయసులో అడ్డగర్రమీద కాళ్లు లాగేలా తొక్కిన అనుభవమంతా గుర్తొచ్చేసింది. చెబితే లిస్ట్ పెద్దదైపోద్దిగానీ, నాన్నల సాహసం మన ఉనికనడంలో సందేహం లేదనుకుంటాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు