ఈ మధ్య సారంగ నుంచి మా తమ్ముడు సుబ్బారావుతో నా అనుబంధాన్ని గురించి ఒక వ్యాసం రాయమని ఒక లేఖ వచ్చింది. వెంటనే సరే అన్నాను కానీ ఏమి రాయాలి అనే మీమాంసలో తర్జనభర్జనల మధ్య సమయం గడిపేసాను. నలభైఏళ్లు కూడా నిండకుండా అకాల మృత్యువైతే వరించింది కానీ బ్రతికిన నలభై ఏళ్లలో నాలుగు జీవితకాలాల పనిని సాధించాడేమో అనిపిస్తూవుంటుంది వాడిని తలుచుకున్నప్పుడల్లా.
1953 లో రాజమండ్రిలో మాతాతయ్య గారింట జన్మించిన సుబ్బారావు ఆ వూళ్లో పేరున్న డాక్టరైన తాతగారు మనవడికి రాసిన మొదటి ప్రిస్క్రిప్షన్ మీద పేషంట్ పేరు గర్వంగా “డాక్టర్ చెన్నాప్రగడ సుబ్బారావు” అని రాసి మనవడికి నామకరణం చేసారు. మానాన్నగారిది సర్కారీ ఉద్యోగం అవడంతో ఏడాది రెండేళ్లకీ వూరు మారేవాళ్లం. అలా తెనాలిలో వున్నప్పుడు వీధి చివర స్కూల్లో చేరాడు. ఆస్కూల్లో ఒక్కరే టీచర్- వందనం మాష్టారు. రోజూ మా ఇంటిముందు నుంచే స్కూలుకి వెళ్లేవారు. మానాన్నగారు ”ఒకరోజు “మావాడు స్కూలుకి వెళ్లనంటున్నాడు, ఏచెయ్యాలి?” అని అడిగితే మర్నాటి నుంచి ఆయన రోజూ తనతో తీసికెళ్లి అలవాటు అయ్యాక స్కూల్లో చేర్పించారు. అప్పుడు వాడికి ఏడేళ్లు. తర్వాత రెండేళ్లలో మూడు క్లాసులు డబల్ ప్రమోషన్ తో దాటుకుని లేటుగా స్కూల్లో చేరినా అయిదో క్లాస్ టైముకి పూర్తి చేశాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. తెనాలి తర్వాత రాజమండ్రి, కొవ్వురు, సూళ్లూరుపేట, విజయవాడ, విశాఖపట్నాలలో మేము ఏడాదేడాదికి మారుతూ చదివాం. దాదాపు ఏ క్లాసులెక్కడ చదివామో గుర్తుపెట్టుకోవాలంటే కష్టపడాల్సిందే!
విజయవాడలో వున్నప్పుడు విశాలాంధ్రలో ప్రతి శనివారం క్రమం తప్పకుండా సాహిత్య సమావేశాలయ్యేవి. నేను మానాన్నగారు మా తమ్ముడు వెళ్లేవాళ్లం. అక్కడే సాహిత్యాభిలాషకి వాడికి బీజాలు పడ్డాయి. శ్రీశ్రీ, ఆచంట జానకీరామ్ గారి లాంటి సాహితీదిగ్గజాలని విశాలాంధ్రలోనే మొదటిసారి చూశాం. ఇప్పటికీ నాకు గుర్తుండి పోయిన సంఘటన శ్రీశ్రీ ని చూపిస్తూ “ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి” అని పన్నేండు పదమూడేళ్ల మా బాబు చదవడం. వేళ్లమద్య సిగరెట్టు బిగించి నిర్వాణదశలో కళ్లు మూసుకుని కవిత వింటున్న కవి కళ్లుతెరిచి చూసి “ఇలారా, ఆశీర్వదిస్తాను” అనటం ఇప్పటీకీ గుర్తుంది. ఇదేకాక మా నాన్నగారు మా చిన్నప్పుడు తెలుగు కవిత్వం పెద్దగా చదువుతూ తన్మయంతో తబ్బిబ్బయిపోయేవారు. “వైతాళికులు”, “నవీనకావ్యమంజరి”లలో పద్యాలన్ని మాకు అలాగే పరిచయమయ్యాయి.
అయితే విశాఖ వచ్చి ఎమ్.జి.ఎమ్ స్కూల్లో హైస్కూలు ముగించిన తర్వాత చిన్నప్పుడు తాతగారు ఆశించినట్టు ఈ మనవడు పెద్దయ్యాక మెడిసన్ చదవనని భీష్మించాడు. అమ్మ బ్రతిమాలినా బామ్మ తాతయ్యగారి స్టెతస్కోప్ నీకిస్తానురా అని ఆశపెట్టినా ససేమిరా అనడమే కాక, ఆరోజుల్లో మొదట తన భార్యకి సీనియర్ అయి, క్లాస్మేట్ తర్వాత జూనియర్ అయి మెడిసన్ అయిదేళ్ల కోర్స్ ఏడెనిదేళ్లయినా పూర్తి చెయ్యలేక పోయి ఒక వైజాగ్ వైద్య విద్యార్థిలా అయిపోతానని బెదిరించాడు. ఆ సదరు విద్యార్థి మంచి హాస్య రచయిత ఆ రోజుల్లో – అది వేరే సంగతి అనుకోండి.
వైజాగ్ ఎ.వి.ఎన్ కాలేజీలో బి.ఎస్. సి చదివి ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఏ ఎకనామిక్స్ లో చేరాడు. అప్పుడే యూనివర్సిటీ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తో విప్లవాలు, ఉద్యమాల రాజకీయాలతో పరిచయం కలిగింది. యూనివర్సిటీలో ఆ రోజుల్లో విద్యార్థులని అత్యధికంగా ప్రభావితం చేసిన ఆచార్య తుమ్మల వేణుగోపాలరావు గారు, కృష్ణక్కగా సుపరిచితులైన వారి కృష్ణాబాయ్ గారు, చలసాని ప్రసాద్ గారి లాంటి ప్రముఖల విప్లవభావాల ఉధృతిలో కలిసిపోయి మమేకమై పనిచేశాడు. ఎమ్.ఎ ఎకనామిక్స్ లో యూనివర్సిటీలో చేరాక అనతి కాలంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యనిర్వాహకులలో ముఖ్యుడై విద్యార్థులలో గుర్తింపు, అనుచరులని పొందగలిగాడు.
అప్పుడే సుబ్బారావు జీవితం ఒక నిర్దిష్టమైన మలుపు తిరిగిందని చెప్పవచ్చును. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకత పెరుగుతున్న నేపధ్యంలో అనేక నిరసనలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. అదే సమయంలో ఆమె ఎన్నిక చెల్లదని కోర్ట్ తీర్పు, ఆమె ఎమెర్జెన్సీ ప్రకటించటం దానికి వ్యతిరేకంగా దేశమంతా జరిగిన నిరసనల సందర్భంగా ఆమె విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా యూనివర్సిటీలో ఒక ఉపన్యాసమిచ్చి అరెస్ట్ తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు సుబ్బారావు. ఎక్కడికెళ్లేడో ఏమైపోయాడో తెలియక కుటుంబమంతా తల్లడిల్లి పోయాము.
ఇప్పటినుంచీ నేను రాసే కథాకథనం దృష్టికోణం మారుతుంది. డెబ్బయ్ ల్లో భారతదేశంలో యువత స్వాతంత్ర్యం వస్తే తమకందుతున్ననుకున్న స్వర్గం జాడలు కనిపించక నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆవేశాలు ఆదర్శాల వెల్లువల్లో కొట్టుకుపోయి చదువులని పట్టించుకోకుండా తిరిగినవాళ్లు ఉద్యమాలబాట పట్టినవాళ్లు ఎంతో మంది వున్నారు. మా కుటుంబానికి సంబంధించినంత మట్టుకు సుబ్బారావు మా తల్లిదండ్రులకొక్కడే కొడుకు. కనిపించకుండా పోయే సరికి వాళ్లు, అయిదుగురు అక్కచెళ్లెళ్లం మేము నిజానికి నరకమే చూశాము. ఎటో వెళ్లిపోయాడన్న బాధ ఒకవైపు, ఎల్లా అయినా తల్లిదండ్రులు బాధ్యతగా పెంచితే పిల్లలిలా తయారవ్వరు అన్న బంధుమిత్రుల విమర్శలొకవేపు, ఎక్కడో ఏదో ఎన్కౌంటర్ జరిగిందట ఒక విద్యార్థి చనిపోయాడట అని కబుర్లు మోసుకొచ్చే శ్రేయోభిలాషులు కొందరు, ఫలానాచోట అరెస్ట్ చేశారట అని మరొక ‘ట‘ ని చేర్చే వాళ్లింకొకళ్లు, ప్రతి వారం క్రమం తప్పకుండా ఇంటికి వచ్చిఇంట్లో దాక్కున్నాడేమోస్నని వెతకడానికి అర్థరాత్రి మందీ మార్భలంతో వచ్చే పోలీసులు- ఇవన్నీ మమ్మల్ని ఊపిరాడనివ్వకుండా ఒకదాని తర్వాత ఒకటిగా తరుముకొచ్చిన సంఘటనలు. ఈ గందరగోళంలో మా అమ్మ ఎంత బాధ పడినా నిలదొక్కుకోగలిగిందంటే ఆరోజుల్లో మెడికల్ డైరెక్టర్ డా. కామేశ్వరరావుగారు వైజాగ్ కమిషనర్కి ఫోన్ చేసి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసులలో మానాన్నగారి నిజాయితీ నిబద్ధత ఎంత పేరున్నవో చెప్పి పదవీ విరమనకి దగ్గరవుతున్న వయస్సులో పోలీసు రైడ్స్ తో ఆయన్ని ఇబ్బంది పెట్టద్దని కోరారు. మునిసిపల్ కమిషనర్ గారు ఈ రిక్వెస్ట్ ని పోలీసు ఉన్నతాధికారులకి చేరవేశారు. రైడ్స్ ఆవిధంగా ఆగిపోయాయి. రాత్రిళ్లు అందరూ పడుకోగలిగారు. ఒక నమ్మకమూ ధైర్యం కూడా కలిగాయి.
దాదాపు ఏడాది తర్వాత తనకు ఆప్తులైన కొందరి మిత్రుల సహాయ సహకారాలతో సుబ్బారావు ఒక అర్థరాత్రి వైజాగ్ వచ్చి సరెండరయ్యాడు. అత్యవసర పరిస్థితి ముగిసే దాక జైల్లోనే వున్నాడు. వాళ్లు అనుమతించినప్పుడల్లా జైల్లోనే కలిసేవాళ్లం. పుస్తకాలు కావాల్సినవి తెప్పించుకుని ఎమ్.ఏ ఫైనల్ పరీక్షలు జైలునుంచే రాశాడు. డిస్టింక్షన్ తో పాస్ అయ్యాడు. వాడితో జైల్లో వున్న ప్రముఖులు చాలామంది లిఖిత పూర్వకంగా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనమని రాసి ఇచ్చి బయటికి వచ్చేసారు. సుబ్బారావు తనతో పాటు తెన్నేటి విశ్వనాథం గారనే విశాఖకి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అలా రాసి ఇవ్వలేదు. తత్ఫలితంగా ఎన్నికలు జరిగి జనతా సర్కార్ అధికారంలోకి వచ్చేదాకా జైల్లో వున్నది వీళ్లిద్దరే.
విశ్వనాధంగారు అర్థరాత్రి టీ కలిపిచ్చి వాడి చదువుకీ, తర్వాత ఇంటర్యూకి సహాయపడేవారని ఎన్నో సార్లు తలుచుకున్నాడు. వైవా కి జైలు నుంచి తీసుకొస్తే వాణ్ని చూడటానికి వచ్చే అసంఖ్యాక విద్యార్థులకి భయపడి సంకెళ్లు వేసి పొద్దున్న ఏడింటికే తీసుకొచ్చారు. అయితే అప్పటికే విద్యార్థులంతా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారట. సంకెళ్లతోనే వైవా హాల్లో కి వచ్చిన వాడిని చూసి ప్రొఫెసర్ క్రిష్ణమూర్తి గారనే డిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ ఎక్సామినర్ ” ఇతనేమీ పారిపోడు. సంకెళ్లు తియ్యండి. అప్పుడే పరిక్ష జరుపుతామ” ని కచ్చితంగా చెప్తే సంకెళ్లు తీశారట. ఈ విషయం బాబు పోయినప్పుడు కాన్సిస్ట్యూషన్ క్లబ్ లో జరిగిన సంతాప సభకి హాజరైన ప్రొఫెసర్ క్రిష్ణమూర్తి గారు స్వయంగా చెప్పారు.
ఎమెర్జెన్సీ ఎత్తేశాక, ప్రజాస్వామిక హక్కులు పరిరక్షించటానికి పౌరహక్కులసంఘాల ఏర్పాటుకు గోవింద ముఖోటే, అరుణ్ శౌరి లాంటి ప్రముఖులతో కృషి చేస్తూ దేశమంతా తిరిగి పి.యు. డి. ఆర్ (పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్) సంస్థ ఏర్పాటుకి కృషి చేశాడు. దానికి అనుబంధంగానే (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబెర్టిస్ లాంటి అనేక సంస్థలు వెలిసాయి నేను నా తర్వాత చెల్లెలు సత్యవతి కొద్దికాలం తర్వాత డిల్లీ వెళ్లిపోయాము. పెళ్లిళయి, డిల్లీ ఖాల్సా కాలేజీ లో సాయంత్రపు కాలేజీలో అధ్యాపకుడుగా సుబ్బారావు చేరాడు. అప్పటికి సిగరెట్లు తాగడం అలవాటు చేసుకున్నాడు. ఒక్కడూ వుండడం, వండుకుని తాను తింటూ తన మిత్రులందరికి వండిపెట్టడం అందుకోసం మాఇంటికి వచ్చినప్పుడల్లా తిన్న ప్రతీది ఎల్లా చెయ్యాలో నేర్చుకోవడం చేసేవాడు.
వాడొచ్చినప్పుడల్లా మాఇంట్లో తెలుగు కవిత్వం వినిపించేది. పిల్లలతో ఆడేవాడు. వాడికి గెడ్డం వుండేదని మా అక్కచెళ్లెళ్ల పిల్లలందరూ వాడిని జడా మామయ్య అని పిల్చే వాళ్లు. అందరికీ ఇష్టుడే. అయితే ఎప్పుడో గానీ కనిపించేవాడు కాదు. దాదాపు ప్రతినెలా ఎపి ఎక్స్ ప్రెస్ లో హైదరాబాదు తక్కిన ఆంధ్రా అంతా తిరిగే వాడు. దేశంలోఎక్కడ పౌరహక్కుల ఉల్లంఘనలు జరిగినా నిజ నిర్ధారణ కమిటీ లు వేసి పి.యు. డి. ఆర్ కమిటీలకి ఒక గుర్తింపు రావడానికి కారణమైన ఎన్నో నివేదికలు అప్పట్లో తయారైనవే!
భగల్పూర్లో ఖైదీలను అంధులను చెయ్యడం బీహార్ బొగ్గు గనుల కార్మికుల మీద అత్యాచారాలు ఇలా వందలాది నివేదికలు సాధికారమైన సమాచారంతోవెలువడేవి. ఈవెనింగ్ కాలేజీలో ఉద్యోగం పగలంతా ఈ సంస్థలకోసం తిరగటం, రిపోర్టులు రాయడం పౌరహక్కుల ఉల్లంఘనలు జరిగిన చోట్లకి నిజనిర్థారణ కోసం వెళ్లడం, వేళకాని వేళ తిండి నిద్రకి అలవాటు పడిపోవడం, సిగరెట్లు విపరీతంగా కాల్చటం లాంటి జీవనశైలి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నదని తెలుసుకోలేక పోవడం అకాల మరణానికి దారి తీశాయనుకుంటాను.
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో ఒక ఐ.సి.ఎస్.ఎస్. ఆర్ ప్రోజెక్ట్ చెయ్యటానికి వెళ్లి ఒకా ఏడాది పాటు ఆంధ్రాలో వున్నాడు. అడపా దడపా ఏదో పనిమీద ప్రయాణాలు తరచుగా చేసేవాడు. మాకు ఎక్కువ కనపడేవాడు కాదు. రెండు జతల బట్టలు కుట్టించటానికి ఐఐటిలో అబ్బాయిల హాస్టల్ టైలర్ దగ్గరికి తీసికెళ్లి బలవంతంగా కుట్టించి ఇస్తే తీసుకెళ్ళడానికీ ఎన్నాల్టికీ రాలేదు. నేనే వెళ్లి ఇచ్చివచ్చాను రెండుబస్సులు మారి వెళ్లి. అప్పుడు “నేను ఎప్పుడూ రెండు జతల కంటే ఎక్కువ వుంచుకోను ఇప్పుడు వున్నాయి. ఇవి చిరిగాక వేసుకుంటానులే” అంటే ఏడవాలో నవ్వాలో తెలీలేదు. అప్పటిదాక రెండుజతలే వున్న నియమం వున్నట్టే నాకు తెలియదు. నేలమీదే పడక, ఇంటి తలుపులు స్నేహితులు ఏ టైములో అయినా రావచ్చని గడియలు రాత్రుళ్లుకూడ ఎప్పుడూ వెయ్యకపోవడం సుబ్బారావు ప్రత్యేకతలని వాడింటికి వెళ్లినప్పుడే తెలిసింది.
పౌర హక్కుల వుద్యమాలకోసం సుబ్బారావు పడిన శ్రమ, నెమ్మదిగా చాపకింద నీరులా వాడి ఆరోగ్యాన్ని కబళిస్తోందని, పనిలో నిమగ్నమైన వాడికెంత తెలియలేదో ఆ పని గురించిన అవగాహన అంతగా లేని మాకూ తెలియలేదు. చెయ్యి దాటి పోయాకే వచ్చిన మొదటి గుండెపోటు తీవ్రంగా వచ్చింది కుటుంబంలో గుండెజబ్బుల వారసత్వం వుంది. అలవాటుగా మార్చుకున్న సిగరెట్లు మరో కారణం ఏదైతేనేమి నలభై ఏళ్ల వయస్సులో నూరేళ్లు నిండాయి. దేశవ్యాప్తంగా అన్ని పత్రికలు సుబ్బారావు మరణాన్ని రిపోర్ట్ చేసినప్పుడు ఎంత మమేకమై ఈ సంక్షేమ రాజకీయాలు, వామపక్ష ఉద్యమాల్లో కలిసిపోయాడో అర్థమైంది. అమ్మ ఎన్నిసార్లు అడిగినా, బంధుజనం ఎంత వాకబులు చేసినా పెళ్లి ఎందుకు వద్దన్నాడో కూడా తెలిసింది. ఇంకొకవ్యక్తి తాను తలకెత్తుకున్న బాఢ్యతల వల్ల బాధలు పడకూడదనే ఒంటరిగా తనవికాని ఎన్ని పోరాటాలో చేశాడు. ఆరోజుల్లో ఏదో సాధించెయ్యాలనే తపన, ఆవేశం కలిగించిన తొందరపాటు అన్నీ యువతలో సహజంగా వుండే లక్షణాలే అయినా వుద్యమాలు అనూహ్యంగా ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేసాయనే చెప్పాలి.
చిన్నప్పుడు తెల్లవారుఝామున లేచి వెంకటేశ్వర స్వామి పూజలు చేసిన సుబ్బారావు పెద్దయ్యాకా అంతే నిబద్ధతతో తను నమ్మిన సిద్దాంతాలకోసం పాటు పడ్డాడు. మాతాతయ్యగారిని తనని పెందరాళే లేపమని అడిగితే “నువ్వులేవవురా, అనవసరం!” అని చెప్పేవారు. “లేపటం నా ధర్మం. లేవకపోతే నీ ఖర్మం అనుకుంటూ మళ్లీ పడుకోండి” అని ఆశుకవిత్వాలు చెప్పిన సుబ్బారావు పెద్దయ్యాక, ఏకసంథాగ్రాహి గా తనకి బాల్యం కంఠతా వచ్చిన, తనకి నచ్చిన ఎన్నో కవితలని అవసరానికి సరిపోయేట్టు ప్రస్తావిస్తూ అందర్నీ ఆనందంలో ముంచెత్తేవాడు. కవిత్వాన్ని శ్వాసిస్తూ, దాన్నే జీవితంగా బ్రతికిన వ్యక్తి. హైద్రాబాదు స్టేట్ పారిశ్రామిక వికాసంమీద ఒక పుస్తకం ఐ.సిఎస్ ఎస్. ఆర్ సౌజన్యంతో చేశాడు. విభాత సంధ్యలు లాంటి సామాజిక విశ్లేషణ పద్దతితో తెలుగు నవలా సాహిత్యంలో సమాజాన్ని గురించి ఒక విమర్శనాత్మక పద్దతిని ప్రతిపాదించాడు. ఎంత క్రియాశీల రాజకీయాలలో జీవించాడో అంతే బుద్దిజీవిననిపించుకున్న కొద్దిమంది మేధావులలో ఒకడు. గుర్తింపుకోసం ఏమీ చేయలేదు.
ఒక్క సుబ్బారావునే కాక ఇలా ఉద్యమరాజకీయాలలో జీవించిన ఎవర్ని గురించి ఆలోచించినా ఒక విషయం స్పష్టమవుతుంది. కుటుంబాలు చాలా మానసిక వేదనని అనుభవిస్తారు. సుబ్బరావులా ఒక్కడే కొడుకయితే తల్లిదండ్రులని తోడబుట్టిన వాళ్లని ఇందులోకి వెళ్లకుండా వుంటే ఇంకా ఎన్ని రోజులు ఆరోగ్యంగా వుండేవాడో అన్న ప్రశ్న వేధిస్తుంది. అతనికి తను అనుకున్న బాటలో ఆశయాలకనుగుణంగా నడుచుకున్న తృప్తి వుందనే భావించగలిగాం కాబట్టే కాస్త వూరట. ఎంతమంది చదువులు పూర్తిచెయ్యలేక సరి అయిన వుద్యోగాలు లేక బాధలు పడ్డారో ఏ రకమైన అధ్యయనాలు జరగలేదు. ఒక సమగ్రమైన అవగాహన ప్రజలకీ ఈ వుద్యమాలలో వుండేవాళ్లకి వుండడం అవసరమాఏమో అనిపిస్తుంది. వారి వారి సిద్దాంతాలతో రాజీ పడినా పడలేకపోయినా వారి పట్ల, వారి నిబద్దత నిజాయితీల పట్ల అవగాహన ఏర్పడటం అవసరం అనటంలో ఏమాత్రం సందేహం లేదు.
*
ఆశయాలకు జీవితాన్ని ఫణం పెట్టిన ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి గురుంచి తెలుసుకున్నాను. ధన్యవాదాలు. వ్యాసం ఆద్యంతం చదివేలా రాసారు.