అక్కయ్య గురించి ప్రపంచానికి చెప్పాలని చాలా రోజులుగా అనుకునే దాన్ని….చాల గొప్పవ్యక్తులు, పేరు ప్రఖ్యతులు వారి వెనకాల నీడలో వున్నప్పుడు unsung heroines లాగా వీరి జీవితాలు అలా నీడల్లోకి జారిపోతాయి…ఫలానా వారి భార్యలగానో. కూతుళ్ళు గానో బంధువులు గానో మాత్రమే faded photograph లాగా వీరు మిగిలి పోతారు…..కానీ ఆ అద్భుతమైన జీవితాల వెనకాల- బాధ్యతగా, రక్షణగా ఉండే ఆడవారు …బయటి ప్రపంచానికి చాలా strong గా కనబడి వాళ్ళకు మాత్రమే తెలిసిన బలహీనతలున్న మొగవారిని ఎవరికీ EXPOSE కానీయ కుండా కాపాడే – జ్ఞానవంతులైన ఆడవారు ఆ కాలంలో ఎంతమంది వున్నారో చెప్పలేము…ఒక సుబ్రహ్మణ్య భారతి వెనకాల, ఒక పెరియారు వెనకాల,ఒక గాంధీ గారి వెనకాల, ఒక రవీంద్రుడి వెనకాల, గొప్ప సామాజిక వేత్తల వెనకాల……వారి కష్టాలు పంచుకుని వారి బాధల్ని అర్ధం చేసుకున్న స్త్రీ మూర్తులు ఎంత మందో….! ఎందుకో చరిత్ర పుటల్లో ఆ పేజెస్ ఖాళీగా ఉంటాయి……కానీ ఒకొక్కసారి….the untold stories aremore effective .
నా దృష్టిలో మా అక్కయ్య ఒక పెద్ద professor……నేను చాలా విషయాలు ….చాల సహించ వలసినవి,భరించ వలసినవి[ఒకొక్కసారి భరించలేనివి] ఎలా ఆలోచిస్తే సహించ గలమో నేర్పించింది……..సంసారమంటే మన క్షేమం కన్నా మంది క్షేమం ఆలోచించడము…..అన్న విషయము మా బామ్మల పెంపకము వల్ల నాకు బాగానే వంటబట్టింది….కానీ అసలు మన సంగతి ఏమిటి? అని నాలో లత గారి మేనకోడలు ప్రశ్నించేది…వ్యక్తిత్వం, స్వాభిమానం , సంస్కారం …..ఇత్యాది పదాలకు అర్ధం లేదా అని నా మనసు చాలా సార్లు దుఃఖపడింది….ఆ విషయమే చాల సార్లు అక్కయ్యతో వాపోయేదాన్ని….తులసి చెట్టుకు నీళ్ళు పోస్తూ…గోడ దగ్గర జరిగే మా ఇద్దరి సంభాషణ గురించి ఆ గోడకు నోరు ఉంటే ఎన్ని చెప్పెదో…..
“చూడు జిజ్జి….ఇక్కడ ఎవరి జ్ఞానం వాళ్ళదే….ఎవరి జన్మ వాళ్ళదే…..ఎవరి పుణ్య పాపాలు వాళ్ళవే……అనవసరంగా ప్రేమనో ఆరాధన అనో బాధ్యత అనో జాలి అనో ఎవరి కర్మల్లోను తల దూర్చకు…..ఎవరి ఖర్మలకు వాళ్ళే కర్తలు….మొగుడూ పెళ్లాల పుణ్యాలు ,పాపాలు ఒకరికి ఒకరు సంబంధము వున్నదని ఎవరైనా చెప్తే మనం నమ్మక్కర్లేదు….వాల్మీకి కధ గుర్తు లేదూ…. నారదుల వారు “నువ్వు చేసే జీవహింస పాపం నీ భార్య పిల్లలు పంచుకుంటారా?” అని అడిగి రమ్మంటే “మాకేమిటి సంబంధం?సంసారం పోషించడము అతడి బాధ్యత…సంసారం నడపడము నా బాధ్యత….నేను పాపం చెయ్యమని ప్రోత్సహిస్తే అది నా తప్పు…అది నేను చెయ్యనప్పుడు ఆ కర్మ నాకు అంటదు….” అన్న బోయవాడి భార్య తరవాత మనకు ఒక వాల్మీకిని ప్రసాదించింది…..ఆ పిల్లల్ని పోషించుకుంటానికి ఆ తరవాత ఆవిడ ఏమిటి చేసింది అని ఎవరు ఆలోచించరు….తప్పులు పట్టడానికి మాత్రం తగుదు నమ్మా అని వస్తారు…..ఎవరి గురించి తేలికగా మాట్లాడకు అమ్మాయీ….ఏది అయినా జరిగితే దాని వెనకాల బాధపడ్డ వాళ్ళు అది ఆడ అయినా మొగ అయినా వాళ్ళ గురించి ఆలోచించు….చేతనైతే వీలైనంత సహాయం చెయ్యి…లేదా వూరుకున్నంత ఉత్తమం లేదు… ..”
వ్యక్తిత్వాలు , వ్యక్తి వికాసాలు గురించి ,ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహాలు వగైరా గురించి మా అక్కయ్య అభిప్రాయాలూ మా అక్కయ్యకు ఉండేవి……. “పిచ్చిదానా …రాళ్ళలోనించి పూవులు పూయడం చూడలేదూ…గుప్పెడు వర్షం చినుకులు ,గాలి వెలుతురూ చాలు దానికి…..అడ్డమొచ్చేదేమిటో తెలుసా ?…బండరాయి…కానీ దాన్ని అపగలిగిందా?నువ్వు ఆగి పోవడానికి ఎవరినో కారణం చూపించకు….బద్ధకము, escapism….ఇవి అసలు కారణాలు ”
ఎమోషనల్ కారణాల గురించి చెప్తే అక్కయ్య నవ్వేది……. “నిన్ను బాధపెట్టె శక్తి నువ్వే ఇచ్చి నువ్వే కంప్లైంట్ చెయ్యకు….ఏడుపొస్తే ఏడ్చేసేయి….కానీ అన్నం మానేసి పబ్లిసిటీ స్టంట్ పెట్టకు…ఎవరికోసరమో చేసేవాటిల్లో నిజాయితీ కనబడదు….అది నీకే నష్టము….”
ఆధ్యాత్మికం గా కానీ, సంసారంలో కానీ ఎవరి జ్ఞానం వాళ్ళదే…భర్త వల్లో, భార్య వల్లో, మరొకరి వల్లో ప్రభావితం అవ్వచ్చు…కానీ నువ్వు చేసుకునేది నీకు రక్ష అవచ్చు , లేదా శిక్ష అవచ్చు…….
ఇవి నా భాషలో మా అక్కయ్య ఆలోచింప చేసిన కొన్ని విషయాలు….చాల సమస్యల మధ్య అక్కయ్య చిన్న చిన్న మాటల వల్ల చాలా ఆలోచింపచేసేది నన్ను….ఎమోషనల్ అయిపోకుండా నిలబడి నిదానంగా ఆలోచింప చేసేది…విశ్వనాధ్ బావగారి ఇంటి పక్కన ఇల్లు కట్టుకుని రావడానికి కారణం మా మాపెద్ద మావగారు అయిన శ్రీ కాశీనాధుని సుభ్రమణ్యం గారు….శంకరాభరణం శంకర శాస్త్రి గారి పాత్రకు సహం వారే ప్రేరణ అని మా అందరికీ అనిపించేది….వారి పద్ధతులు, ఆహార నియమాలు , శిక్షణ చాల పద్దతిగా వుండేవి…ఒక దగ్గు, ఒక చూపు, “అమ్మాయి….” అనే పిలుపు చాలు ఎవరి పాత్రల్లో వాళ్లము ఇమిడి పోయేవాళ్లము….మా బావగారికి వాళ్ళ నాన్న గారూ, మా పెద్దత్తగారు సరస్వతమ్మ గారూ అంటే చాలా ఇష్టము, గౌరవము….చిన్నప్పుడే పెళ్లై వచ్చిన ఈ బెజవాడ అమ్మాయి జయ లక్ష్మి గారికి వాళ్ళ అమ్మగారు బందా తులసమ్మ గారు అంటే చాల గౌరవము…ఆవిడ శిక్షణ మా అక్కకు చాలా ఉపయోగించింది అని చెప్పేది. అక్కయ్య నాన్న గారి పేరు బందా భీమ శంకరం గారు ……మనుషుల్ని వాళ్ళ గుణాలను బట్టి కాక స్థానాన్ని పట్టి గౌరవించడం అన్నది మా కాలంలో పద్ధతి..అదేమిటి అని ప్రశ్నించే అవకాశము ఉండేది కాదు.అవసరం వచ్చినా ప్రశ్నించలేని పరిస్థితి….అది తెలిసే ఈ పాత్ర వేషధారణకు ఒప్పుకున్నాము….ఇది నాకు చిన్నప్పటి నుంచే తెలిసిన విషయమే…అందుకే “సీత వేషం వేసి ద్రౌపతి డైలాగ్స్ చెప్పకూడదు” అని రాసాను ఒక కధలో…..మా అక్కయ్య ఈ విషయములో సుక్షితురాలు…అప్పట్లో ఒక పాతికేళ్ళ అమ్మాయి అయిన నేను “ఇదంతా మూర్ఖంగా వున్నది, తెలిసీ అన్యాయాలను సహించాలా ?” వగైరా మాట్లాడినప్పుడు….అక్కయ్య “అలా చెయ్యడము వల్ల జరిగే damage ఏమిటో ఒకసారి పేపర్ మీద రాసుకోoడి….మెల్లిగా చదువుకుని “ఫరవాలేదు, నేను తట్టుకోగలను” అనిపిస్తే అప్పుడు ఏమిటి చెయ్యాలో ఆలోచించoడి..ఈ పెళ్ళిలో సెక్యూరిటీ వున్నది, అనిపించక పోయినా, స్లేవరీ వున్నది అనిపించినా అది మీ ఇష్టం….” ఈ అర్ధం వచ్చేమాటలు చెప్పింది…..బావగారు తీసిన “మాంగల్యానికి మరో ముడి” సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ముగ్గురు పిల్లలతో వున్న ఒక అమ్మాయి తనకన్నా 10 ఏళ్ల చిన్నవాడితో వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. చాటలో బియ్యము పోసి రాళ్ళు ఏరుతూ, మధ్య, మధ్యలో పిచ్చుకలకు బియ్యం విసురుతూ పై మాటలు చెప్పేసింది ….నా స్నేహితురాలు 10 రోజుల తరవాత తన నిర్ణయం మార్చుకుంది….ఇప్పుడు 6౦ వ పడిలో “మా పెద్దాడు, మా చిన్నాడు” అని అమెరికాలో వున్న తన పిల్లల గురించి గర్వంగా చెప్తూ సంవత్సరంలో 2 సార్లు అమెరికా ట్రిప్ వేస్తూ ఉంటే నాకు అక్కయ్యే గుర్తుకు వస్తుంది….
మా అక్కయ్య బావగారు చాల అందంగా వుండేవాళ్ళు..చూడ ముచ్చటగా , సమానమైన ఒడ్డు పొడుగు తో ద్రిష్టి తగులుతుందా అనిపించేట్లు ఉండేవాళ్ళు …వాళ్ళ ఇద్దరి మధ్య ఇష్టం , అనురాగం బయటికి వ్యక్తం అయేది కాదు ..ఒకరోజు నేను అక్కయ్యను చూడడానికి వెళ్ళేటప్పటికి అక్కయ్య కళ్ళజోడు తోనే అలసిపోయి పడుకొని ఉన్నది , కింద ప్రొడక్షన్ బాయ్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పాను…గబాలున లేచి కళ్ళజోడు చూసుకొని మనోహరంగా నవ్వింది.. “నాకు బావగారికి ఒకటే కళ్ళజోడే జిజ్జి, నేను కళ్ళజోడు పెట్టుకొని అలసి పోయి పడుకున్నానని బావగారు కళ్ళజోడు తీసుకోకుండానే షూటింగ్ కి వెళ్ళిపోయారు , బహుశ క్రింద ఆ వ్యక్తి కళ్ళజోడు తీసుకు వెళ్ళడానికే వచ్చి ఉంటాడు” అని నవ్వుతూ కిందికి వచ్చింది . ఆవిడ ఊహ నిజమే, ఆశ్చర్యపోయాను నేను ….
అక్కయ్య నాకు తోడికోడలు కాకముందే తెలుసు,…వాళ్ళ పాప పద్మకో , బాబు రవికో ఒంట్లో బాగాలేకపోతే మా నాన్నగారు డాక్టరు గాలిబాలసుందర రావు గారి దగ్గరకు ట్రీట్మెంట్కు తీసుకు వచ్చేవారు. సన్నగా పొడుగ్గా, అందంగా, హాఫ్ వాయిలు చీరల్లో, ఆలోచించి మృదువుగా మాట్లాడే, మా అక్కయ్య తనకు ఏమి కావాలో చాల తక్కువ సార్లు చెప్పేది…కానీ.మనకు ..ఏది ఎలా అర్ధమవుతుందో, ఆ విషయాలు చాల సున్నితంగా, సూటిగా చెప్పేది….. “ఇది తప్పే….ఇది అధర్మమే…..కానీ నువ్వు సహిస్తున్నందుకు నీ కారణాలు నీకు వుండచ్చు….అవి నీకు సరి అనిపిస్తే ఇంక ఎవరి సలహా అడగవద్దు….ఆత్మస్తైర్యానికి, ధైర్యము ఎవరో చెప్పడానికి తేడా వున్నది…సలహాలు ఇచ్చేవారు ఎదురు తిరగమని చెప్పేవారు మన సమస్యలు తీర్చరు………ఎదురుతిరుగుతున్నాము…ఏమైనా సరే మేమే కరెక్ట్ …అని Insecurity తో ఉండేవాళ్ళు, పోరాడితే సుఖపడలేరు, సుఖ పెట్టలేరు….వాళ్ళ పని వాళ్ళు చేసుకు పోలేరు….ఇలా ఎంతమందిని చూసాము?” …….ఇలా చాల జీవితంలో practicality నేర్పించేది చాలామందికి మాఅక్కయ్య.
నేను కోడంబాకం ఇంటికి రాగానే నన్ను స్టడీ చేసింది…. “ఈ పిల్లకు పొగరు లేదు….చెప్పినా మాట వింటుంది” అన్న నమ్మకము వచ్చిన తరవాత తన వొడిలోకి తీసుకున్నది…అప్పటికి 27 సంవత్సరాలు టి.నగర్ లో ఉన్న నాకు కోడంబాకం ఒక పల్లెటూరు లాగా అనిపించింది…..అక్కయ్య నాకు కూరలవాళ్ళ psychology, ఎక్కడ ఆకు కూరలు చవగ్గా దొరుకుతాయి?అన్న విషయం దగ్గరనుంచి చాల నేర్పించింది…..మా అక్కయ్య మెలికల ముగ్గు పెడితే ఎంత నాజుగ్గా, ముద్దుగా వుండేదో! సన్నటి ముక్కు, మెరిసే చంపలు…వాకిట్లో కార్తీక దీపాలు పెట్టె అక్కయ్యను, అతి సున్నితంగా ప్రతి గిన్నే తుడుస్తూ సరదాగా, భక్తిగా వంటచేసే అక్కయ్యను చూస్తూ వుండడమే హాయిగా అనిపించేది.
” లేదు అనుకోకూడదు ఏదీ “
పాలు దొరక్కపోతే పెసరపప్పు పాయసం చేసి పెట్టేది కానీ లేదు కాబట్టి అన్న మాట complaint గా నేను ఎప్పుడూ ఆవిడ దగ్గరనుంచి వినలేదు…అక్కయ్య పొదుపు చూస్తే ముచ్చట వేసేది..ఒకసారి పాయసం చేస్తూ ఉంటే అక్కయ్య చేతులోనించి ఏలక్కాయ జారి గ్యాస్ కిందికి వెళ్లి పోయింది…ఆవిడ ఓపిగ్గా అది తీసింది… “ఎందుకక్కయ్యా ఆ శ్రమ” అంటే… “ఏలక్కాయ ఒక రూపాయి…ప్రతి వస్తువును తేలిగ్గా తీసి పారేయ్యకూడదు…విలువ ఇవ్వాలి, ఖరీదు తెలియాలి” అని చెప్పేది, అరవిందో ఆశ్రమంలో
‘మదర్ ‘ దగ్గర ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటుంది , గౌరవించాలి…..అని నేర్చుకున్న ఆవిడ శిష్యులు జీవితంలో ఆ విషయం ఎంత వరకు ఆచరించారో తెలియదు కానీ అవి ఏవీ ఎక్కువగా తెలియని మా అక్కయ్య దైనందిన జీవితంలో అలాగే వస్తువులను గౌరవించేది.
అక్కయ్యది ప్రకటిత భక్తి కాదు…హడావిడి లేదు….కానీ భగవంతున్ని తలుచుకుంటూ ఉండేది… లింగధారుల కోడలు కాబట్టి ప్రతిరోజూ తన మెడలో లింగానికి అభిషేకం , నైవేద్యం పెట్టనిదే భోజనం చేసేది కాదు, మద్రాస్ లో వడపళని సుబ్రహ్మణ్యుడికి అభిషేకాలు చేయించేది….అప్పట్లో ఆయన ఆవిడ ఇష్ట దైవము . ఆవిడ మొక్కులు భక్తీ ఏనాడు ఇంట్లో వాళ్లకు ఇబ్బంది కలిగించేది కాదు……..జయలక్ష్మి అక్కయ్య తులసీ పూజ చెయ్యడం ఒక చక్కటి దృశ్య కావ్యంలాగాఉండేది…… “నాకే వుండాలి అనుకోవడానికి, నాకు మాత్రమే వుండాలి అనుకోవడానికి – లోభత్వానికీ కక్కుర్తి కీ, మనను లేకివాళ్ళు అనుకుంటారని హెచ్చులకు పోయి ఖర్చు పెట్టడానికి మధ్య చాలా సున్నితమైన గీత వుంటుంది” ఇవి అక్కయ్య ఆలోచనలు …..ఈ విషయాలన్నీ నేను నేర్చుకోవడానికి చాల మంది గురువులు వున్నారు నాకు కానీ…వంటింటి లెవెల్ నుంచి నేర్చుకోవడం ప్రారంభించింది మాఅక్కయ్య దగ్గరే…….. “పనిమనిషి అవసరమే….అందుకని దాని తెoపరితనాన్ని భరించకు….నువ్వు చేసుకోలేని పని పెంచుకోకు…రెండు రోజులకు ఒకసారి ఇల్లు తుడవచ్చు…మన ఇల్లు అంత అశుభ్రంగా వుండదు….” ఇట్లా పని సులువులు నేర్పించేది అక్కయ్య ……శుభ్రము , సుళువు ఈ రెండు చాల కష్టమైన కాంబినేషన్….ఆవిడ అందులో Expert.
బావగారికి చాలా విశాలమైన గదులు ఉన్న పెద్ద ఇల్లు ఇష్టం…….పొద్దున్నే ప్ర్రారంభించిన పని మధ్యాన్నానికి కానీ పూర్తి అయ్యేది కాదు అక్కయ్యకు …కొంచము సేపు పడుకోవాలి అన్న అక్కయ్య కోరిక తరుచు తీరేది కాదు…కానీ ఆవిడ పని తీరుగా, చాల ప్లాన్డ్ గా వుండేది….మడి, ఆచారం, పధ్ధతి ,శుభ్రం,[మడి, ఆచారం వున్నా వాళ్ళంతా శుభ్రం గా బ్రతికారన్న రుజువులు లేవు..} ఆవిడ పనిలో reflect అయ్యేది,రెండు రోజులకు ఒకసారి మూడవ అంతస్తుకు వెళ్లి పరిశీలించి వచ్చేది, నెల మొదట్లో పప్పులు దినుసుల అలమర శుభ్రం చేసి, సీసాలు కడిగి అల్మారాలో పేపర్స్ మార్చి నీట్ గా ఉంచాలి అన్నది అక్కయ్య పద్దతి….సాధారణoగా వరలక్ష్మి వ్రతాలకు,ఏవో పండగలకు బాపురమణ గారింటికి, పద్మాక్షి గారింటికి, ఆదుర్తి సుబ్బారావు గారి ఇంటికి, ఇలా చుట్టూ పక్కల ఇళ్ళకు చాలా సార్లు నేను, సావిత్రి { s.p, బాల సుబ్రహ్మణ్యం గారి భార్య} జయలక్ష్మి అక్కయ్య వెళుతూ వుండే వాళ్లము…మా పిల్లల పుట్టిన రోజులకు అక్కయ్య, s.p.శైలజ బోలెడు ఆటలు ప్లాన్ చేసే వాళ్ళు.అప్పుడు మాత్రం అక్కయ్య చిన్న పిల్లలాగా అయిపోయేది…ఆవిడ ఉత్సాహం చూసి నేను సావిత్రి ఆశ్చర్య పోయే వాళ్లము…ఆవిడ లో creativity కూడా చాలా వుండేది…., చపాతీలు చేసినా, అప్పడం వత్తినా పర్ఫెక్ట్ గా వచ్చేవి .
మా బావగారు భోజన ప్రియులు….వంటకి శుచి , శుభ్రం , రూపం…..మూడూ వుండాలి .అక్కయ్య ఆయనకు ఎలా కావాలో అలా చేసేది….రాత్రి 9 దాటాక , “జయలక్ష్మీ , చపాతీలు చేసుకుందామా? “అనగానే సిద్దం అయ్యేది అక్కయ్య…….ఆయన కూరలు తరిగి ఒకొక్కసారి కూరలు చేసేవారు కూడా ….ఎదురుగా ఉంటే మేము రుచి కోసరం పరీక్షింప పడే వాళ్ళం….ఆయన వంట చేస్తే అక్కయ్యకు బాధ లేదు కానీ ఆ తరవాత సింకు నిండా గిన్నెలు, గరిటలు….అంట్లు తోముకోవడం….అది డబల్ పని అంతే…..అక్కయ్య వంట చేస్తే, వంట,సామాన్లు శుభ్రం, వంటిల్లు క్లీనింగ్ అంతా అయిపోయేది…బావగారు కొన్నాళ్ళు గురువారాలు ఉపోషం వుండే వారు…. “Restraining from what we like most gives strength to our mind” అన్నది ఆరోగ్య సూత్రం, మానసిక ఒడంబడిక, strenth for success కూడా….అసలే భోజన ప్రియులు అయిన బావగారు ఆ గురువారాలు మాత్రం చాల అసహనంగా వుండే వారు…అయన సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి స్నానం పూజ పూర్తి చేసేటప్పటికి అక్కయ్య రోట్లో పిండి రుబ్బి అప్పటికి అప్పుడు ఇడ్లి వేసి ఇచ్చేది…. కారణం బావగారికి పులిసిన ఇడ్లీలు నచ్చేవి కాదు….శనివారాలు …మడి కట్టుకుని పూజ చేసి నైవేద్యం పెట్టి, ఇడ్లీలు కారప్పొడి పచ్చడి ,అన్ని చేసేది అక్కయ్య…అప్పుడప్పుడు వచ్చిన చుట్టాల్లో కొందరు మడి అంటూ నే , ఎవరో తెచ్చి ఇచ్చిన హోటల్ సాంబార్ వేసుకునే వాళ్ళు….అది చుస్తే నాకు ఒళ్ళు మండిపోయేది ….. “ అదేమిటి అక్కయ్యా….” అంటే నవ్వేసేది… “నీకు కోపం రావడం లేదా?” అంటే….నవ్వేసి “కోపమెందుకు? చెప్పాల్సినంత చిన్న పిల్లలు కారుగా? వాళ్లకు తెలియదా వాళ్ళు ఏమి చేస్తున్నారో?వాళ్ళే మన దృష్టిలో వెలితి పడిపోతారు…అంతే…మనకు పోయేది ఏమి లేదు..” అనేది ……ఎన్ని పర్సనాలిటీ ట్రైనింగ్ పుస్తకాలు చదివితే ఈ ఆటిట్యూడ్ వస్తుంది?
విశ్వం బావగారి సినిమాలో పాత్ర చిత్రీకరణ మనుషులను పరీక్షగా పరిశీలించి కొన్ని లక్షణాలు, సంభాషణ, అలవాట్లు చూసి ఆ పాత్రను Celluloid మీద మలిచేవారు….సాధారణంగా అయన అక్కయ్యతో అవన్నీ చెప్పి, నవ్వుతూ, నవ్విస్తూ అప్పటికప్పుడే ఆయన బుర్రలో ఆ పాత్ర చిత్రీకరణ జరిగిపోయేది…..మేము ఎవరమన్నా అక్కడ ఉంటే మాటలతోనే సినిమా చూపించేసే వారు బావగారు….వాళ్ళ పెద్దమ్మ{చంద్రమోహన్ గారి అమ్మగారు} మాటలు, హావభావాలు, విసుక్కోవడాలు, ప్రేమ ఆప్యాయతలు , కరుణ అన్నీ రకరకాల పాత్రలలో చిత్రీకరించారు ఆయన …..శంకరభరణం లో కామేశ్వర రావు పాత్ర చంద్రమోహన్ గారు వేస్తే వాళ్ళ అమ్మగారి పాత్ర ను బామ్మగారి పాత్రలో దిoపేసారు బావగారు…..మాంగల్యానికి మరొక ముడి లో కాబోలు ఒక పాత్ర వుంటుంది….ఒక క్యారెక్టర్ వచ్చి ఏడుస్తూ ; “ఏముంది …మా ఆయన మళ్లీ కొట్టాడు” :అని కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ అంటుంది…ఆ పాత్ర మాకుతెలిసిన ఆవిడే…అదిరిపోయాము అక్కయ్య, నేను……అ తర్వాత ఆవిడను చూసినప్పుడల్లా, ఆవిడ కన్నీళ్లు తుడుచుకున్నప్పుడల్లా మేము నవ్వు దాచుకోలేక చచ్చిపోయేవాళ్ళం…అక్కయ్య సాహిత్యము చాల చదివేది…మేము ఇద్దరమూ చాల క్యారెక్టర్స్ గురించి చర్చించుకునేవాళ్ళం…. బాల చందర్ గారి “గుప్పెడు మనసు” సినిమా చూసి “నువ్వు సుజాత క్యారెక్టర్” అన్నది అక్కయ్య…నాకు ఆవిడ ఎందుకు అలా అన్నదో అర్ధమవడానికి చాల రోజులు పట్టింది.
జీవన జ్యోతి సినిమాలో వాణిశ్రీ పాత్ర మా బావగారు మా అక్కను చూసే మలిచారు అనిపిస్తుంది నాకు .ఆయన ఒప్పుకోరేమో….సినిమా పేరు గుర్తు లేదు కానీ బావగారు డైరెక్ట్ చేసిన ఒక సినిమాకు కథ అక్కయ్య పేరు టైటిల్స్ లో వేసారు… “నువ్వే రాసావా అక్కయ్యా” అంటే నవ్వేసింది…కానీ తను స్వయంగా రాయక పోయినా బావగారు కథ , స్క్రీన్ ప్లే అక్కయ్యతో చర్చించేవారు….చాలా కథ లు, పాత్ర చిత్రీకరణలో అక్కయ్య పాల్గోవడం తెలుసు నాకు….నాకు తెలిసి అక్కయ్యకు శ్రుతి లయలలో సత్యనారాయణ గారి పాత్ర k.r. విజయ గారి పాత్రను మైల పరచడము అస్సలు నచ్చలేదు.
కానీ అక్కయ్యలో భావుకురాలు బావగారి ఊహను ఎంతో బాగా అర్ధంచేసుకునేది…విమర్శకురాలుగా సున్నితంగా విషయం చెప్పేది..పిల్లల్ల్ని పెంచడములో కానీ, వాళ్ళకు పాజిటివ్ atitude నేర్పడము లో కానీ, అక్కయ్య మంచి తల్లి…మనుషులను బట్టి కాకుండా వాళ్ళ స్థానాన్ని బట్టి గౌరవించడం అన్న వ్యవస్థకు చెందిన ఆ తరం తల్లి….అప్పట్లో చాల సంసారాలలో, వృద్దులు ప్రశాంతంగా ఉండేవారు .ఆ వ్యవస్థ వల్ల కొన్ని అసౌకర్యాలు, young generation కు స్వతంత్రము లేక పోవడము అన్న complaints వుంటాయి .తప్పదు కానీ అట్లా జరిగిపోయిన తరానికి ప్రతినిధులు అక్కయ్య లాంటి వాళ్ళు. పెద్ద వయసులో ఉన్న ప్రతివాళ్ళనూ మన్నించి గౌరవించేది. శీతాకాలంలో మజ్జిగ లో పసుపు, కరివేపాకు వేసి వేడిచేసి వృద్దులకు ఇవ్వాలని అక్కయ్య దగ్గరే నేర్చుకున్నాను నేను.
ఒకసారి మా బంధువులు ఒకళ్ళ ఇంట్లో ఆ యజమాని తండ్రిగారు పోయారు అన్న వార్త వచ్చింది.నేను సావిత్రి అక్కయ్య ముగ్గురమూ వెళ్ళాము.ఆ యజమానికి కొంచము అయోమయం, అమాయకత్వం ఎక్కువట,భార్య కూడా అట్లాంటి మనిషే..ఆవిడ చూడడానికి చాల కళగా ఉండేది ….వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు…మేము వెళ్ళేటప్పటికి అంతా గందర గోళము, ఆ రోజు అక్కయ్య విశ్వరూపం నేను సావిత్రి చూసి నిర్ఘాంత పోయాము.శవ యాత్ర దాకా మామూలు ఇల్లాలుగా, పరామర్శకు రాలిగా, ఆత్మీయురాలిగా ఉన్నఅక్కయ్య వెంటనే అపర దుర్గ అవతారం ఎత్తేసింది.వంటిల్లు, హాలు బెడ్ రూమ్ దుమ్ము ,మట్టి గందర గోళంగా వున్నది.ఆ ఇల్లాలిని స్నానానికి వెళ్ళమని “సావిత్రి , జిజ్జి[నేను]ఇద్దరు తలో చీపురు తీసుకోండి. చక్కగా అమ్మవారిని తలుచుకుని ఇల్లు శుభ్రం చేద్దాము” అని చెప్పింది అలా మేము ముగ్గురము అరగంటలో ఆ ఇల్లంతా కడిగి తుడిచి అద్దంలాగా చేసాము.ముగ్గులు వేయకూడదు అని చెప్పేసింది అక్కయ్య. “ఇదు గో అమ్మాయి …లక్ష్మీ పార్వతి సరస్వతుల్లాగా వచ్చి మీ ఇల్లు శుభ్రం చేసాము.ఇంక మీకు ఐశ్వర్యం వస్తుంది.మడి ఆచారం కన్నా ముఖ్యం శుచి శుభ్రం. నేను ఎప్పుడు వచ్చి చూసినా ఇలా వుండాలి ఇల్లు” అని సలహా లాంటి వార్నింగ్ ఇచ్చేసింది.నేను సావిత్రి ఆ విషయము ఎప్పటికి మర్చి పోలేము.ఆవిడ ఎంత పవర్ఫుల్ ఆర్గనైజర్ అనేది ఆరోజు చూసాను నేను..ఒకళ్ళతో మాట్లాడుతూ అందర్నీ గమనించేది అక్కయ్య.సాధారణంగా insecurity వున్న వాళ్ళు ఒకరితో మాట్లాడుతూ మిగత అందర్నీ ఏమనుకుంటున్నారో అన్న కాంప్లెక్స్ తో చూస్తారు…కానీ అక్కయ్య ఎవరి భావాలు ఏమిటో చదవడానికి అలా గమనించేది.. “ అతడు ఎందుకో గిల్టీ గా వున్నాడు” , “యితడు తన పని ఎలా పూర్తి అవుతుందా అని ఆలోచిస్తున్నాడు”.ఆ వెనకాల అతను ఏదో భయపడుతున్నాడు”….ఇలా సైకాలజిస్ట్ లాగా చెప్పేది అక్కయ్య.కానీ ఎవర్నీ వెటకారం చెయ్యడము కానీ పరుష వాక్యము మాట్లాడడము కానీ చేసేది కాదు.పొరపాట్లు, తప్పులు క్షమించేది..కానీ పాపాలు జరుగుతాయి అన్నప్పుడు లక్ష్మణరేఖలు ఎలా వెయ్యాలో తెలిసిన వ్యక్తి.మాటల్లో , చేతల్లో వెకిలితనము భరించేది కాదు… అమాయకత్వాన్ని క్షమించేది, దగ్గరకు తీసుకునేది.మా చందమామ రామారావు గారి కి రాజ్యము అనిmentally challenged అమ్మాయి వుoడేది. ఆపిల్ల అందరికీ టెన్షన్ కలిగించినా అక్కయ్య దగ్గర ఆత్మీయత అనుభవించేది….అట్లాగే మా ఇళ్ళకి చాగంటి అనీ లింగధారి బ్రాహ్మడు వచ్చేవాడు.అతడి ప్రత్యేకత ఏమిటంటే సిరిపురం బ్రాహ్మడి లాగా 6 గురు తినే తిండి అతను ఒక్కడు తినేవాడు. అందుకని అతన్ని ఎవరు భోజనానికి పిలిచేవారు కారు.. “ఇవ్వాళ కార్తీక సోమవారము.నేను భోజనానికి వస్తున్నాను అని Self Declaration చేసేసేవాడు.చాలా మంది విసుక్కునే వారు.కానీ మా అక్కయ్య మాత్రము అతనికి తృప్తిగా , విసుక్కోకుండా భోజనము పెట్టేది.
“మనకు నచ్చినా నచ్చక పోయినా చాలా పనులు బంధువులని, బాధ్యతలు అని, ఇష్టాలు అని, తప్పని సరి అని -చెయ్యాల్సి వస్తుంది.చేస్తాము.కానీ మనకు ఆత్మ తృప్తి కలిగించే విషయాలు చాల తక్కువ వుంటాయి.అవి చేసేటప్పుడు హాయిగా చెయ్యాలి.భయము బాధ ఉంటే చెయ్యడము మానేస్తే మంచిది.మనను గిల్టీ గా ఫీల్ చేయించే అధికారము ఎవ్వరికీ ఇవ్వకూడదు”.అనేది అక్కయ్య.
ఆవిడలో ఇంత ఆలోచనా జ్ఞానం, కొన్ని విషయాల్లో గురుత్వము వున్నదని చాల మందికి తెలియదు.ఆమెలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయేమో కాని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
దాదాఫాల్కే అవార్డు గ్రహిత కళా తపస్వి శ్రీ కాశినాధుడి విశ్వనాద్ గారు అనే మహా వట వృక్ష ఛాయలో చూడాలనుకునే వారికి వెతికితే మెరుస్తూ కనిపించే అమృత లత మా జయలక్ష్మి అక్కయ్య.
*
so glad you started writing again andi. Your psyco analysis is very good and needed by our generation
జలంధర గారు
మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి చదవడం మాకు వ్యక్తిత్వ వికాస పాఠాలు. తెలుగు సాహిత్యం లో ద్రష్ట అని నాకు అనిపించే కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి మీ మాటల్లో చదవాలని ఉంది. ఈ కాలమ్ ను ఇలాగే కంటిన్యూ చెయ్యండి.
జలంధరమ్మా !
మీ జీవితంలో మీకెదురైన, మిమ్మల్ని తీర్చిదిద్దిన అద్భుతమైన వ్యక్తుల్లో కొందరిని … అప్పుడు జూలెమ్మని ఇప్పుడు జయలక్ష్మి అక్కయ్యని ( కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారి శ్రీమతిని ) అపురూపంగా ఆవిష్కరించి మాకు పరిచయం చేస్తున్నావు.
ఇంకా తనివి తీరలా… ఏ దిల్ మాంగే మోర్…
మా ఒంగోలు భానుమతి అమ్మ, మా తెనాలి కొ.కు. నాయన… ఇంకా శ్రీశ్రీ, ఆరుద్ర, మాలతి చందూర్ అలా ఇంకా ఇంకా కావాలి జలంధరమ్మా…
మీ నాన్నారు డా. గాలి బాలసుందరరావు గారు, మీ అత్తయ్య ( అత్త + అయ్య ) నే కానీ అత్తమ్మ కాదు అని మీరన్న ఆ తెన్నేటి హేమలత గార్ల గురించి… ఆ మోహన్ చంద్రుడు గురించీ ఎప్పుడమ్మా ?!
~ త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు ( aka కె.కె. రామయ్య, బెంగళూరు )
జలంధర గారు, మీరు మళ్ళీ వ్రాయటము మొదలుపెట్టినందుకు చాలా చాలా సంతోషం. మీరు కథలలాగా వ్రాసే విషయాలు గమనిస్తే మనచుట్టూ ఉండే మనుష్యులు, పరిస్థితులలో నుంచే ఎంతో నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. నాది అత్యాశ అనుకోకపోతే వారం వారం మీరు ఇలా వ్రాస్తూ వుంటే సంతోషించేవారిలో నేనూ ఉన్నాను. మళ్ళీ వ్రాయటం మొదలుపెట్టినందుకు చాలా కృతజ్ఞతలు.
జలంధరమ్మ తలపోత
” మా జయలక్ష్మి అక్కయ్యగారు ”
నిన్న వెళ్ళిపోయిన, కాశీనాథుని (విశ్వనాథ్ గారి భార్య )జయలక్ష్మి గారి గురించి. సారంగలో మూడేళ్ళ నాడు Jalandhara Chandramohan గారు వ్రాసినది. ఇప్పుడు తలచుకోవటం సమంజసమనిపించి షేర్ చేస్తున్నాను. ” ~Jalandhra Chandra Mohan garu