మా క్లాసులో ఇందిరాగాంధి

 “నిన్న మధ్యాహ్నము స్కూలుకి ఎవరెవరు రాలేదు!? వాళ్లు నిలబడండి” అన్నారు మాస్టారు .

ముందురోజు మధ్యాహ్నము క్లాసుకు హాజరుకాని  మేము ఐదారుగురము, అందరమూ నిలబడ్డాము.

“ఎందుకు రాలేదు!?.. ఎక్కడికి వెళ్లారు!?” అడిగారు

ఆ మాస్టారటే స్కూలిలో పిల్లలందరికీ భయము, భక్తి కూడా. స్కూలులో మాకు సైన్సు చెప్పేవారు.

పదవతరగతి పిల్లలకు ఇంటిదగ్గర ప్రైవేట్లు చెప్పేవారు. అక్కడ లెక్కలు చెప్పేవారు. ఆయన దగ్గర ప్రైవేటు చదివితే పదవతరగతి  పాసవ్వడం ఖాయం అనేది పిల్లలకే కాదు, తల్లిదండ్రులకు కూడా బాగా నమ్మకం.

ఇది నేను ఎనిమిదవతరగతి చదువుతున్నప్పటి సంగతి.

ఒకరోజు మధ్యాహ్నంపూట క్లాసు ఎగ్గొట్టి కొందరు విద్యార్ధులం కలసి బొబ్బిలి వెళ్లాము. మొత్తం ఒక ఐదారుగురము. అందరం మాక్లాసు వాళ్లమే.

అందులో ఇప్పటికీ నాకు జ్ఞాపకమున్న పేర్లు గుణుపూరు రామారావు, గుల్ల త్రినాధస్వామి .. మిగతా మరో ఇద్దరో ముగ్గురో వున్నారు. కానీ వాళ్లెవరన్నది జ్ఞాపకం లేదు.

ఎందుకు వెళ్లామంటే ఇందిరాగాంధీని చూడాలని.

1977 మార్చిలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల ప్రచారములో భాగంగా ఇందిరాగాంధీ బొబ్బిలి వస్తున్నారని విపరీతమైన ప్రచారము జరిగింది. అదితెలిసి వెళ్లాము.

నిజానికి మా బృందములో అలాంటి కోరిక ఎవరికీ లేదు నాకు తప్ప. నేనే మిగతా వారిని ప్రోత్సహించాను. ప్రోత్సహించాను అనేకంటే పురెక్కించాను లేదా రెచ్చగొట్టాను అనడం సరైనమాట అవుతుంది.

“మనం ఎప్పుడు చూస్తాము ఇందిరాగాంధిని.. ఇదే మంచి అవకాశం” అని చెపితే వాళ్లు కొందరు వచ్చారు.

అవి ఇందిరాగాంధి హవా బాగా నడుస్తున్న రోజులు.

ఇందిరాగాంధీని పొగిడేవాళ్లు ఉండేవారు.  తిట్టేవాళ్లూ ఉండేవారు. ఏదో విధంగా ఇందిరాగాంధి పేరు బాగా పాపులారిటీ పొందింది.

నేను 7వ తరగతినుండి తరచుగా ఈనాడు దినపత్రిక చదివేవాన్ని. మా ఊరి పంచాయితీ ఆఫీసులో గానీ, మా కూర్మినాయుడి గారి ఇంటిదగ్గర గానీ, కనుక నాలో కొంత రాజకీయ పరమైన ఆసక్తి ఉండేది.

కనుక ఇందిరాగాంధీ అంటే గొప్పనాయకురాలుగదా! అన్నది అప్పట్లో నా అభిప్రాయం. కనుక వెళ్లాము. ఈ విషయం పెద్దవాళ్లకు తెలిస్తే ఎవరైనా తిడతారు,వెళ్లనివ్వరు.వేసవి ఎండలు కూడా బాగా వున్నాయి .కనుక మేమెవరికి చెప్పలేదు.

మొత్తానికి వెళ్లడం జరిగింది.

బొబ్బిలి పట్టణము మాకు ఎనిమిది కిలోమీటర్ల దూరములో ఉంటుంది.మార్చి మొదటి వారము మిట్టమధ్యాహ్నం ఎండలో మా గ్రామం పిరిడి నుంచి పోలవాని చెరువు గట్టు మీంచి పొలాల్లోబడి అడ్డుదారిన నడుచుకుంటూ బొబ్బిలి వెళ్లాము.( ఎప్పుడు బొబ్బిలి నడిచి వెళ్లినా అలాగే వెళతాము) ఎందుకంటే రాజాకాలేజి గ్రవుండులో మూడు గంటలకు మీటింగు కాబట్టి.

మేము వెళ్లేసరికి చాలా జనం చేరిఉన్నారు. మేము చాలా ఆసక్తిగా.. కంగారు కంగారుగా వెళ్లాము. ఎంతవేగం ఇందిరమ్మను చూస్తామా అని. తీరావెళ్లాక సమయమైతే మూడు గంటలయింది, కానీ ఇందిరమ్మ  రాలేదన్నారు.

సాయంత్రం ఐదు గంటలకు వస్తాదన్నారు. “సరే..” అని ఉన్నాము. ఐదుకి రాలేదు. ఆరు..ఏడూ..ఎనిమిది.. మైకులో చెప్పడమే తప్ప ఆమె రాలేదు. చివరకు తొమ్మిది వరకూ చూసి బస్టాండుకు నడిచివచ్చి రాత్రి పదిగంటల బస్సుకు తిరిగి మావూరు వచ్చేశాము. మాకు అప్పుడు బస్సుకి అరటిక్కెట్టు పదిహేను పైసలు వసూలు చేసారు. అది ప్రైవేట్ బస్సు. అప్పటికింకా ఆర్టీసి బస్సులు లేవు. ఆర్టీసీయే లేదు

ఇదంతా ఒకెత్తు. అయితే తరువాత జరిగినది ఒకెత్తు.

మరుచటిరోజు ఎప్పటిలాగే యధావిధిగా స్కూలుకి వెళ్లాము. ఆరోజు స్కూలులో సైన్సు మాస్టారు క్లాసుకొచ్చి మమ్మల్ని నిలబెట్టి అడిగారు.

ఆ సంవత్సరం ఏడవతరగతి పబ్లిక్ పరీక్షలో చాలా తక్కువమందిమి పాసయ్యాము. కనుక ఎనిమదవతరగతి  క్లాసులో కేవలం ఇరవైమందిమే ఉండేవాళ్లము. అందులో ఐదారుగురు రాకపోయే సరికి సుళువుగా తెలిసిపోయింది.

మేము మౌనగా నిలబడి వున్నాము.

“చెప్పండి ఎక్కడీకి వెళ్లారు!?” మాస్టారు మళ్లీ అడిగారు.

“బొబ్బిలి వెళ్లాము సార్ ” చెప్పేము.

“మేట్నీ సినిమాకా!?”.. సందేహించారు

“కాదు..” తల అడ్డంగా ఊపేము.

“మరి దేనికి వెళ్లారు!?”

తల క్రిందికి దించి సిగ్గుపడుతూ చెప్పాము

“ ఇందిరాగాంధీని చూడాలని”

“ ఆయన పెదవి దాటని చిన్న చిరునవ్వు నవ్వేరు.

“మిమ్మల్ని ఎవరైనా వెళ్లమన్నారా!? మీకు మీరే వెళ్లారా!?”

సహజంగా మిగతా అందరూ నావైపే చూశారు.

నాకు చెప్పక తప్పలేదు.నేను చెప్పకపోయినా మిగతావారు నాపేరు చెప్పేస్తారు,కనుక నేనే చెప్పేసాను.

“నేనే వెళదామని అన్నాను సార్” అని చెప్పి, క్రింది చూపులు చూశాను.

అప్పుడు మమ్మల్ని కాస్తా వేళాకోళం చేసారు. క్లాసులు ఎగ్గొట్టి తిరుగుతారా! అని

వెంటనే మాకు ఒక పనిష్మెంటు ఇచ్చారు. అదేమిటంటే మేము స్కూలికి వెళ్లనప్పుడు ముందురోజు మధ్యాహ్నం ఆయన క్లాసులో చెప్పిన(డీక్టేట్ చేసిన) ప్రశ్నలు జవాబులు ఒక్కొక్కటి పాతిక సార్లు రాసుకు రమ్మ్మన్నారు. అవి ఆరు ప్రశ్నలు, ఆరు జవాబులున్నూ.. పెద్దపెద్ద జవాబులు కూడా .

మాస్టారి పనిష్మెట్సు ఎప్పుడూ అలాగే వుండేవి. ఎప్పుడైనా ఒక బిట్ తప్పు రాసినా దానిని తిరిగి వందసార్లు.. నూటయాభై సార్లు రాసుకు రమ్మనేవారు. ఎవరైనా చచ్చినట్టు రాసుకు రావలసిందే. ఆ మాస్టారంటే అంతభయం విద్యార్ధులందరికి కూడా.

ఆరోజు మమ్మల్ని ప్రశ్నలు జవాబులు రాయమన్నారు.

ఆ మరుచటి రోజుకి అలా రాసుకొచ్చి చూపించేము. అక్కడితో అది అయిపోయింది.

కానీ మాస్టారు  ఆవిషయాన్ని అంతటితో వదల్లేదు.

మరో పదిరోజులు వరకూ అదే పనిగా మమ్మల్ని వేళాకోళము చేసేరు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా, ఉదా: నోట్సులో చిన్న తప్పు దొరికినా, తను అడిగిన ప్రశ్నకి సరైన జవాబు చెప్పలేక పోయినా తిరిగి అదే వెటకారము.. వేళాకోళం.

“మీకెందుకు వోయ్ చదువు!? ఈసారి హైదరాబాదెలిపోండి వాయ్! అక్కడ ఎక్కువమంది నాయకులుంటారు” అని ఒకసారి, ఢిల్లీ అని మరొకసారి, అలాంటివే మరికొన్నిసార్లు అని మమ్మల్ని ఉడికించేవారు. మేము తలదించుకొని నిలుచుంటే, క్లాసులో మిగతా విద్యార్ధు లు నవ్వేవారు.

ఇలా ఉండగా అప్పటికి సుమారుగా ఒక పది.. పదిహేను రోజుల తరువాత బొబ్బిలి రాజుగారు చనిపోయారట. అప్పటికి మాకు ఆవిషయం తెలియదు.

మాస్టారు ఆరోజు క్లాసుకొచ్చి మొదటగా ఆవిషయమే చెప్పి మమ్మల్ని మళ్లీ వేళాకోళం చేశారు.

“ఏమి వోయ్…బొబ్బిలి రాజు.. ముసులిరాజు చనిపోయాడట, చూడ్డానికి వెళ్ళరా!?” అని వెక్కిరించారు. క్లాసులో అందరూ నవ్వేరు, ఆ మాస్టారితో సహా.

ముసిలిరాజు అనగా రాజా ఆర్.ఎస్.ఆర్.కె. రంగారావు గారు(ఈయనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో ముఖ్యమంత్రిగా పనిచేశారు.)

మేము కొంత సిగ్గు పడ్డాము.

మరోపది రోజులు గడిచాయి. ఆ విషయం దాదాపు మరిచిపోయాము. మాస్టారూ ఏమనలేదు.

ఒకరోజు క్లాసుకు వచ్చి, వచ్చీరాగానే  నావైపు చూసి

“ ఏమివాయ్!.. మీరింకా యిక్కడే ఉన్నారా!” అని గొప్ప ఆశ్చర్యం ప్రకటించేరు.

నాకేమి అర్ధం కాలేదు.

ఇక్కడ వుండక ఎక్కడికి వెళతాము. మాస్టారు దేనిగురించి మాట్లాడుతున్నారో తెలియ   లేదు.

అయోమయంగా చూశాను.

మాస్టారు నాతో  బొబ్బిలి వచ్చిన మిగతా విద్యార్ధులను పేరు పేరునా పిలిచారు. అందరూ నాలాగే నిలబడ్డారు. వాళ్లకి ఏమీ అర్ధం కాలేదు.

“ఏమి!?.. ఎవరూ వెళ్లలేదూ!? అందరూ మానేశారు! సరే,.. యిప్పుడైనా బయలుదేరండి వోయ్, అంది పోతారు” అన్నారు.

దేనికో!.. ఏమిటో!.. ఏమీ అర్ధం కావడం లేదు మాకు, మాస్టారు అసలు విషయం చెప్పడం లేదు. మాకు మాట్లాడే ధైర్యంచాలక అలాగే నిలుచున్నాము.

కాసేపు నిలబెట్టి.. నిలబెట్టి..చివరికి అప్పుడు

“ఈ రోజు  రాజుగారి దిన కార్యమటవోయ్ ! భోజనాలు పెడతారు, మీరు వెళ్లరా! ? మీరు వెళ్లకపోతే కుమార్ రాజుగారు బాధపడి కబురు పెడతారేమో..! ముందుగానే వెళిపోవడం మంచిది. వెళ్లండి వోయ్..సుబ్బరంగా  భోంచేసి రావచ్చూ.. రాజుల భోజనాలు కదా!  బాగా పెడతారు….”  చిన్న వెకిలి నవ్వు నవ్వుతూ అన్నారు.

అంతవరకూ ఆసక్తిగా చూస్తున్న క్లాసులో విద్యార్ధులందరూ ఒక్కసారి గొల్లున నవ్వేరు. ఎప్పటిలాగే సిగ్గు పడడం మావంతు అయ్యింది. అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. మరీ ముఖ్యంగా నాకు బాగా అవమానమనిపించింది.

ఒక విద్యార్ధి తప్పు చేశాడని టీచర్ భావిస్తే ఆ విద్యార్ధిని దండించటం సహజం. కానీ అదేపనిగా చిన్న బుచ్చటం లేదా చిన్న బుచ్చాలని ప్రయత్నించడం మాత్రం మంచి లక్షణం అనిపించుకోదు అని అనిపించింది.

ఒకసారి రెండుసార్లు అయితే అది సరదాగా ఏదో అన్నారులే అనుకోవచ్చు.

నిజానికి మేము చేసింది తప్పా!? ఒకరకంగా క్లాసు ఎగ్గొట్టటం తప్పే కావచ్చు. కానీ విద్యార్ధుల్లో ఉన్నఆసక్తిని  చైతన్యాన్ని గుర్తించాలి కదా!. అనుకున్నాను.

ఆనాటి జ్ఞాపకం నా మన్సులో ఇప్పటికీ ముళ్లులా గుచ్చుతూనే వుంటుంది.

 

 

ఉపాధ్యాయుడు మొదట విద్యార్ధుల భిన్నమైన ఆలోచనలను గమనించాలి. ఆపైన ఇంకా కావాలంటే సుతిమెత్తగా దండించవచ్చు. ఈ వయసులో మీకది అవసరం లేదు. రేపు పెద్దయ్యాక రాజకీయాల్లో చేరితే అప్పుడు ఇలాంటి వన్నీ చెయ్యొచ్చు అని మంద లించి  బుద్ధి చెప్పవచ్చు. లేదా పనిష్మెంటు ఇవ్వవచ్చు.

కానీ అదేపనిగా వెక్కిరించటం అయితే మంచి లక్షణం అనిపించుకోదు కదా!.

ఎవరిపైనైనా బాల్య దశలో పడ్డ ప్రభావాలు వారిపై చాలా బలంగా పనిచేస్తాయి.

నాకైతే ఆ రోజు మేము చేసినపని తప్పు అని పించలేదు. ఈ రోజుకీ అనిపించడం లేదు. కానీ ఆరోజు తిరిగి సమాధానము చెప్పలేని స్థితి వలన ఊరికే ఉన్నాము.

ఆ మాస్టారు అలా ఎందుకు చేశారు!? మానవ సహజమైన కుతూహలమేనా కారణం!?.

ఇప్పుడు ఆలోచించినప్పుడు నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

1.ఏవ్యక్తిలోనైనా మార్పు రావాలని కోరుకున్నప్పుడు వ్యంగ్యాన్ని ఉపయోగిస్తాము ఎవర మైనా. వెక్కిరింతా, వేళాకోళం అందులో భాగమే(అదికూడా ఆవ్యక్తి తరచూ తప్పు చేస్తున్న ప్పుడు)

ఆ వ్యంగ్యమ్మీద వ్యామోహము వలన (కంట్రోల్లేకపోవడం) ఒక్కోసారి అది అదుపు తప్పుతుంది.

వ్యంగ్య మెప్పుడూ సున్నితముగా వుండాలి ఒక పరిమితికి లోబడి ఉండాలి. అది చాలా పదునైన కత్తి. దానిని జాగ్రత్తగా వాడకపోతే వ్యతిరేక ఫలితాలే వస్తాయి.

  1. టీచరుకి సరైన అవగాహన లేకపోవడమూ కూడా ఒక కారణమై ఉండొచ్చు.

మనం టీచర్ అనగానే అన్నీ తెలిసిన వ్యక్తిగా భావిస్తాము విద్యార్ధి దశలో. అందుచేతే టీచరంటే భయమూ గౌరవము రెండూ వుంటాయి

టీచరుకి మంచి విషయపరిజ్ఞానము ఉండవచ్చు. కానీ ప్రాపంచిక జ్ఞానమూ అవసరమే . లేకుంటే సామాజిక చైతన్యము(సోషల్ అవేర్ నెస్స్ ) కొరవడుతుంది.

దానివలన వారి జ్ఞానానికి వ్యక్తిత్వానికి మధ్య అగాధం ఏర్పడుతుంది. దేని దారి దానిదే అవుతుంది. అలాంటపుడు పుస్తకేతర విషయాలలో ఆవ్యక్తి మనకి గొప్పగా కనిపించడు.

టీచరు క్లాసు రూములో చెప్పేదెంతో క్లాసు బయట చెప్పాల్సింది కూడా అంతే వుంటుం ది. ఎందుకంటే పిల్లలు తమటీచర్లను పరిశీలిస్తారు. అనుకరి స్తారు. అనుసరిస్తారు.

టీచింగ్ వృత్తిలో వున్నవారు తన విద్యార్ధుల దృష్టిలో ఎప్పటికీ టీచర్లు గానే మిగలాలి అని నేనైతే కోరుకుంటాను .

ఈ సంఘటననాకు ఒక టీచరుగా నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పింది.

*

రెడ్డి రామకృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు