గుర్రం జాషువా (1895-1971) చాలా రచనలు చేశాడు. ఈ కవి పేరు చెబితే జ్ఞాపకమొచ్చేది “గబ్బిలం”. అందులో “కసరి బుసకొట్టు నాతని గాలి సోఁక / నాల్గు పడగల హైందవ నాగరాజు” అన్న మాటలు తెలుగునాట ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. (చిన్నప్పుడు నా డైరీలో ఇవి రాసుకున్నాను). “అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్” లాటి prophetic వాక్యం గబ్బిలంలోనే చెప్పాడు. జాషువా పద్యాలు ప్రసాదగుణ సంపన్నాలు, సరళమైనవి. ఒకట్రెండు మాటలు మినహా (బహుశా అవి proper nouns) నాకర్థం కాని మాటలేవీ ఆయన ప్రయోగించలేదు. రచనల్లో ఒకట్రెండు చిన్న చిన్న కవి పొరపాట్లు దొర్లాయి(*).
గుర్రం జాషువా పద్యాల్లో పూర్వకవుల (నేను చదివిన మేరకు) ప్రభావంకానీ చొచ్చుబాటుగానీ లేవు. నన్నయ “ప్రసన్నకథాకలితార్థయుక్తి”ని జాషువా ఆదరించాడనవచ్చు. ఒకేఒక పద్యం (“వాని మృదూక్తి నైపుణియు వాని వినమ్రవిధేయభావమున్…”) మాత్రం నన్నయ పద్యాన్ని గుర్తు తెచ్చేదే. ఇంతకు మించి ఏ పూర్వకవినీ ఈయన అనుసరించలేదు. ఆయన కవిత్వశయ్య ఆయనిదే. ఫిరదౌసి మనసు చెదిరిన సందర్భంలో మాత్రం ఆదికవి వాల్మీకికి tribute ఇస్తూ, “గండు చేఁప దాఁకు కమలమయ్యె”నన్నాడు, జాషువా.
ఈయన కంఠంలో ఏ వీణాతంత్రులున్నాయో గానీ ఆయన క్రోధంగా అరిచినా, బాధగా కుమిలినా, యుద్ధగుంజన్మృదంగాలను వినిపించే సందర్భమైనా ఏదో మధురసంగీతమే హృదయానికి వినబడుతుంది. యుద్ధాన్ని గూర్చీ “ఉక్కు పుప్పొడి రాలు యుద్ధభూమి” అంటూ మూడు మాటల్లో చెవిని దాటుతూ తిన్నగా మనసును చేరుకున్నాడు. “పచ్చిపసుపు ముద్ద వంటి దేహచ్ఛాయ” అని ఇంకోచోట పారసీక వ్యక్తి వర్ణన ఉంది. పద్యాలన్నీ శరజ్జ్యోత్స్నాప్రసరాలు. జాషువా కవి పక్షపాతి (“సత్కవి ధరింపరాని వేషములు గలవె? / తమ్మిచూలి కేలుఁదమ్మినిఁ గల నేర్పు కవికలంబునందుఁ గలదు గాన / కవినిఁ గన్న తల్లి గర్భంబు ధన్యంబు”).
ఆంధ్రాభిమాని. రచనాసందర్భం ఏ మాత్రం అనుకూలించినా తెలుగు రాజుల చరిత్రలనూ, తెలుగు ప్రాంతాల గతవైభవాన్నీ, తెలుగు కవుల కావ్యపరిమళాలనూ కొనియాడకుండా ఉండలేకపోయాడు. “ఫిరదౌసి”లోనూ గజనీ సుల్తాను తన చరిత్ర రాయమని కోరుతూ కవికి “కర్పూరతాంబూలమే” ఇచ్చాడు. ఫిరదౌసి షాహనామాను “తెలుఁగుఁగవిత్వంపుంజిగి” పొసిగేలా రాశాడు. రాజు తనను వధించమని ఆజ్ఞ ఇస్తూ సైనికులను పంపాడన్న వార్త విని పారిపోతూ అడవిని ప్రవేశించినప్పుడు చేసిన “చకచకితవికచకవితాప్రకాశవాగ్గుంభనా”ల్లో, “మలయానిలమే చల్లగా వీచింది”, “ఈ విశ్వంభర భగవదనుగ్రహములో హిందోళం” పాడుకుంది, “పర్వతపుటంచున పెద్ద చెరువు దగ్గర చల్ది భుజించడం”, “చెంచుల గూడెం” ఉండడం, ఇవన్నీ ఎన్నదగ్గవి.
ఫిరదౌసి కావ్యానికి ముందుమాటలోనే కావ్యార్థమై కొన్ని కల్పనలు జోడించిన సంగతి కవే చెప్పుకున్నాడు. ఈయన్ను తెలుగు కావ్యసంప్రదాయం చిన్నప్పుడే పెనవేసుకుంది. కులరక్కసి ఎంత గాయపరచినా బాధపడ్డాడు, ఆక్రోశించాడు గానీ సంప్రదాయన్ని విడనాడలేదు. గబ్బిలంలో పక్షి గమనపథమంతా తెలుగు మయం, బొబ్బిలి దాటిన తరువాత మాత్రం “పలుచఁ బడిపోవు మన జిల్గు తెల్గుశోభ / తావులెగజిమ్ము నోఢ్ర వాతావరణము” అని చిన్నగా నిట్టూర్చాడు. చిలికా సరస్సును తెలుగు భాషతో పోల్చాడు. “పూజారి లేని వేళ”నెంచుకొమ్మనే పక్షికి చెప్పాడు గానీ పరమశివుడ్ని అనుమానించలేదు. పురుష సూక్తంలో ఉన్న వర్ణాల ప్రసక్తి వల్లనేమో (?) నారాయణుడిని (విరాట్పురుషుడు నారాయణుడే) కాదని శివుణ్ణి ఎంచుకున్నాడు, కవి. భోళా శంకరుడు భక్తసులభుడు. జాషువా conformist కవి.
జాషువా సహజాతంగా నిజాయితీ కలిగిన సగటు పౌరుడు. “నేను” అనే ఖండికలో తన గురించి తను చెప్పిన సంగతి చూడండి.
” నివసించుటకు చిన్న నిలయ మొక్కటి దక్క గడన సేయుట కాసపడను నేను
ఆలుబిడ్డలకునై యాస్తిపస్తులు గూర్ప పెడత్రోవలో పాదమిడను నేను
నేనాచరించని నీతులు బోధించి రానిరాగము తీయలేను నేను
సంసారయాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డిగవ్వయు గోరుకొనను నేను
కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు, విశ్వనరుడ నేను ”
ఈ cosmopolitan tone కవి అణగారిన వర్గానికి చెందినవాడవడంవల్లనే వచ్చింది. కవి ఎన్నో బాధలూ అవమానాలూ దిగమ్రింగినవాడవడంవల్లనే ఇక్కడ సంకుచితమయిన ఎల్లలన్నీ దాటి ఎగిరాడు (A cage went in search of a bird” అని కాఫ్కా). కవిత్వంలో మాత్రం ముందు వినుకొండనూ గుంటూరు సీమనూ “గెలిచి”, సగమారిన తెలుగు గతవైభవదీప్తుల్ని మళ్ళీ వెలిగించి తెలుగు వీరులను కొనియాడి తాజ్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న తెలుగునాటి శిల్పుల్ని తలచి గర్వించి ముందు తెలుగువాడిగా భారతీయుడిగానే అగుపిస్తాడు, కవి.
1. ఫిరదౌసి
ఇది కవి ఫిరదౌసి కథ. గజనీ సులతాను ఫిరదౌసిని ఒడ్డోలగానికి పిలిపించి తన వంశచరితను (షాహనామా) రాయమని పద్యానికొక బంగారు నాణెం ఇస్తానని మాట ఇచ్చి, ముప్ఫయ్యేళ్ళు ఫిరదౌసి శ్రమించి అరవైవేల పద్యాలతో “దిరిసెనపుంబూవు కరణి ముద్దులు గారు శయ్యావిలాసంబు సంతరించి” చరిత్ర రాయగా రాజు కృతి విని ఆనక అస్థానవిద్వాంసులు ఏంచెప్పారో ఏమోగానీ కవికి వెండినాణేలను పంపాడు. అలా మాట తప్పాడు రాజు. మోసపోయిన కవి ఫిరదౌసి రాజుని నిందిస్తూ లేఖ రాశాడు. మసీదు గోడపై ఓ పద్యం రాశాడు. లేఖ చదివి ఉగ్రుడైన రాజు కవిని వధించమని సైనికుల్ని పంపాడు. ఆ వార్త కవికి ముందే అందించాడొక పుణ్యాత్ముడు. కవి పారసీక దేశానికి భార్యా కూతుర్లతో పారిపోయాడు. రాజు తన తప్పు తెలుసుకొని మనసు మార్చుకొన్న సమయానికి కాలాతీతమయింది. ఫిరదౌసి మరణించాడు. అతని కూతురు ధనాన్ని తిరస్కరించింది. పశ్చాత్తప్తుడై రాజు అక్కడ ఒక సత్రవు కట్టించాడు. అయినా “కృతినిఁ జెందువాడు మృతుఁడు గాఁడు” అన్న రాజు మృతుడై ఆనక అపశయం పాలయ్యాడు. ఇదీ కథ.
భారతావనిపై పద్ధెనిమిది సార్లు దండెత్తిన గజనీ సుల్తాను ఏం చేశాడో కవి ఇలా చెప్పాడు.
పదియు నెనిమిది విజయరంభల వరించి
గాంగజలమున నెత్తుటి కత్తి గడిగి
సర్వము హరించి హిందూదేశంబు విడిచి
గజనిమామూదు గజనీకిఁ గదలిపోయె
భారతక్షోణిఁ గల్గు దేవస్థలములు
చెదరి గజనీపురాన మసీదులయ్యె;
నిప్పటి మసీదులే రూప మెత్తఁగలవొ
కాల మెఱుఁగును ధారుణీగర్భమెఱుఁగు
ఈ ప్రార్థనాస్థలాలను ధ్వంసం చేయడం చరిత్రలో ఉన్నదే. అన్నీ ధరణిగర్భంలో నిలిచి ఉంటాయంటాడు కవి. ఇది అనునయించే మాట.
గజనీ సుల్తాను ఫిరదౌసిని షానామా రాయమంటూ చేసిన వాగ్దానం:
ఒక్కొక పద్దియంబున
కొక్కొక బంగారురూక యొసఁగెదను కవీ
మక్కామసీదుతోడని
వక్కాణించెన్ మహాసభామధ్యమునన్
మోసపోయిన ఫిరదౌసి రాజుని లేఖలో నిలదీసి ప్రశ్నించిన పద్యం:
ఒక్కొక పద్దియంబునకు నొక్కొక నెత్తురుబొట్టు మేనిలోఁ
దక్కువగా రచించితి వృథాశ్రమ యయ్యెఁ గులీనుఁడైన రా
జిక్కరణిన్ మృషల్వల్కునే? కవితాఋణమీయకుండునే?
నిక్కమెరుంగనైతి గజనీసులతాను మహమ్మదగ్రణీ
ఇది చదవగానే రాజు “మక్కామసీదు తోడుగా” వక్కాణించిన మాట తలపుకొస్తుంది. మోసపోయినతరువాతనే మనిషికి అసలు కష్టం తెలుస్తుంది. “కృతి యొక బెబ్బులింబలె శరీర పటుత్వమునాహరించె…” అని తరువాత అన్నాడు. ఈ integrity జాషువా పద్యాల్లో కనిపించే సుగుణం.
అఱువదివేల దిన్హరములస్త్రములై తుదకిట్లు కుత్తుకన్
దరుగుటకుద్యమించిన విధానము సర్వము నాలకింపఁగా
పిరదవుసీముఖాబ్జమునఁ బిన్నని నవ్వుదయించె మింట నీ
శ్వరుఁడు కలండొ లేఁడొ యను సంశయముందళుకొత్తె నెమ్మదిన్
ఈ సంశయం జాషువానూ జీవితంలో పీడించింది. కవిత్వంలో ఆత్మచరిత్రాత్మకత?
పారసీకుల శ్మశానక్షోణులూ, మర్త్యుల అస్థిపంజరపు గుట్టలు, మాంసదుర్గంధమూ. ఇదీ కల్పనే. ఇస్లామ్‌లో ఖననం చేస్తారు, దహనం చెయ్యరు. “కృతికన్యక బంగారంబు మణులు గురిసెడు క్ష్మారాజ్యవధూటికన్నన్ జక్కనిది కదా” అన్నప్పుడు జాషువా ఏ పక్షం వాడో నిర్ద్వంద్వంగా తేలిపోతుంది.
2. గబ్బిలం
హైందవ నాగరాజుకి నాల్గు పడగలు. నాలుగు కులాలవారిచేతా అవమానాలెదుర్కొనే దళితులకు, తమ బాధనూ ఆక్రోశాన్నీ వ్యక్తం చెయ్యడానికి దీన్ని మించిన image దొరకదు. అయితే, స్కూల్‌లో చేరిననాటినుంచే అవమానాలెదుర్కున్న జాషువా తొలి రచన ఇది కాదు. “భరతోర్వర కడగొట్టు బిడ్డడు” ఎక్కడివాడో చెబుతూ, కవి
పూప వయస్సులో వలస పోయిన చక్కని తెలుగు కైతకున్
బ్రాపకమిచ్చు రఘునాథనృపాలకుఁడేలియున్న తం
జాపురి మండలంబునకుఁ జక్కగ దక్షిణ భాగ భూములన్
కాపురముండె..
ఈ భాగాన్నే కవి కథానాయకుని నివాసంగా ఎంచుకోవడానికి కారణం తరువాత బోధపడుతుంది. గబ్బిలం హిమాలయాలకు ఆంధ్రభూమిమీదుగా ఎగురుతూ వెళుతుంది. తెలుగు రాజుల చరిత్రా, తెలుగు పద్యాల సొబగులూ తలచుకోకుండా ఈ కవి ఏమీ రాయలేదు. దీని తరువాత నాలుగు పద్యాల్లోను తన ఆక్రోశం వినిపించాడు. భరతావని ఇతనికి అప్పుపడ్డదని, ఇతని పాపకారణమేమో ఇతని కెరుక లేదనీ అన్నాడు. పగలంతా శ్రమించి రాత్రి గంజి తాగి దళితుడు నిద్రించే ముందు “ముక్కు మొగమున్న చీకటి ముద్ద వోలె” ఒక గబ్బిలం అతనింట దూరింది. “పులుఁగుం బుట్రలుఁగాఁకఁ బేదలకు నాప్తుల్ జుట్టపక్కంబులున్ గలరే!” అనుకొని అతిథినాహ్వానించాడు.
ఆ యభాగ్యుని రక్తము నాహరించి
యినుపగజ్జెలతల్లి జీవనముసేయుఁ
గసరి బుసకొట్టు నాతని గాలి సోఁక
నాల్గు పడగల హైందవ నాగరాజు
[ఆహరించు = గ్రహించు/పీల్చు]
గాఢనిద్రావలంబియై కన్నుమూసి
క్ష్మాతలము మేను మఱచిన కాళరాత్రి
నా గృహంబున వెదకుచున్నావదేమి
దొరకదిచ్చట నానంద కిరణ లవము
అర్ధరాత్రి. అతనింట్లో ఆనంద “కిరణ” లవమూ లేదు. గబ్బిలం పక్షానిలాన (రెక్కల గాలికి) దీపం అప్పటికే ఆరిపోయింది. కవి ఎరుక ఎన్నదగ్గది.
ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
ఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీ భరతమేదిని ముప్పదిమూడూ కోట్ల దే
వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే?
ముందు అమృతాంధసులన్న కవే ఇక్కద క్రోధంగా “దేవతలెగవడ్డ” అని తన కోపమూ దుఃఖమూ వెలిబుచ్చాడు. దళితుడుంటే ధర్మదేవతకూ వెరపే. అస్పృశ్యతాజాడ్యానికి ఔషధంలేదని వాపోతూ మొర పెట్టుకోను మొదలిడినాడు.
ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకుఁ గొంత చేరువగనుండు
మౌని ఖగరాజ్ఞి! పూజారి లేని వేళ
విన్నవింపుము నాదు జీవిత చరిత్ర
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడని సామెత. “వెఱవనేల నీకు విశ్వనాథుని మ్రోల/సృష్టికర్త తాను సృష్టివీవు” ఇది కవి ధైర్యం. ఇప్పటికి విన్నవించే ధైర్యమొచ్చింది. పరోపకారిణి అయిన గబ్బిలానికి “ఒకపూట యానం”. ధైర్యం హెచ్చింది. “నీకున్ చత్వారంబేర్పడి దారి తప్పెదవు గాదా భానుండేతెంచినన్”, గబ్బిలానిది overnight journey. పక్షిని సాగనంపడం మొదలయింది. తంజావూరు దాటుతూ వేంకటకవిని, మువ్వగోపాలుని, ముద్దు పళనిని, తలచుకొని ఉత్తరదిసగా వెళ్ళి తెలుగు భూమిని చేరమన్నాడు. ముందు తిక్కనకు నెలవైన నెల్లూరికి నతులర్పించి పెన్నలో స్నానం చేసి, హంపిని చూసిపోవాలి. హంపీక్షేత్రవర్ణన:
హంపీక్షేత్రముఁ జూచి పోవలయునమ్మా తెల్గు రాజ్యంపు నై
లింప శ్రీలకొకానొకప్పుడది కేళీ రంగ మేతద్రమా
శంపావల్లరులాఱిపోయిన ప్రదేశంబందు నీ బందుగుల్
కొంపల్గట్టి నివాసముండెదరు నీకుంగూర్తురానందమున్
“నా పని చెయ్యి, అందులో నీకూ లాభముంది” అనడం. చాలా సహజం.
ప్రాచీన నగరమైన ఢిల్లీకి అప్రతిహతమైన చరిత్ర ఉంది, ఆ నగరం నిత్యయౌవన అని ఇలా వర్ణించాడు:
యుగయుగాల కథల నుదరాన జీర్ణించి
రాజరక్తనిర్ఝరములఁ దేలి
నవ్వుచున్న ఢిల్లి నగరంబు నందంబు
తరుగలేదు శిరము నెరియలేదు
గబ్బిలాన్ని సాగనంపి దీనుడై “భరతోర్వర కడగొట్టు బిడ్డడు” “వేయి చేతుల పెనుకాపు వేగిరింపఁ / గచ్చ బిగియించె నప్పేద కార్మికుండు”. మళ్ళీ అదే జీవితంలోకి అడుగుపెట్టాడు. కచ్చ బిగించడం ఇక్కడ దృఢచిత్తాన్ని సూచిస్తోంది. అదే ధృతితో కవికూడా తన జీవన పయనం సాగించాడు.
గబ్బిలం రెండో భాగానికొచ్చినప్పటికి జాషువాపై స్వాతంత్ర్యపోరాటపు గాలులు ప్రసరించాయి. బహుశా, నిరాశానిస్పృహలతోకూడిన నాస్తికత్వపు ఛాయలు కమ్ముకున్నాయి. దైవాన్ని పూర్తిగా తిరస్కరించలేదు గానీ దైవసాన్నిధ్యాన్ని పెద్దగా కోరుకున్న జాడలిందులోలేవు.
మృత్యువుం గెలుచు శక్తు లొసంగని చుప్పనాతి వే
ల్పెచ్చట డాగినాఁ డతని కెందులకీ తెరచాటు మోసముల్?
నీతో నాకేం పనిలేదు అన్నాడు దేవునితో:
ధర్మసంస్థాపనార్థంబు ధరణిమీద
నవతరించెదననె నబ్జభవునితండ్రి
మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు
నేడు జన్మింపకున్న మున్గినది లేదు
నిమ్నజాతులవారి భాగం వారికి స్వాతంత్ర్యానంతరం ప్రాప్తిస్తుందనే కాస్త ఆశాభావమొకపక్కుండగా మరోపక్క నిరాశ వదల్లేదు. ఈ రెండో భాగంలో నా మొరనాలకించని దేవుని పరంధామపదం నాకెందుకన్నాడు. ఇవాళో రేపో స్వతంత్రం వస్తుందని తెలిసినవాడు:
“…….స్వతంత్ర భారత సువర్ణకిరీటము నేడు గాక రా
వచ్చు, మరొక్కనాడు నెలవాసిన తొయ్యలి తీర్థమాడదే?”
నిరాశానిస్పృహలకుదాహరణగా:
కని గంగార్పణమంచు ద్రోసిచనియెం గర్ణున్ బృథాదేవి యా
తని విద్యాకులరూప సంపదలు వ్యర్థంబై ప్రలాపింపవో
కనియెన్ భారతకుంతి మమ్ములనసంఖ్యాకంబుగా కర్ణులన్
మునిపక్షీ! యమనందనుల్ తెలియరిప్డున్ మాదు భ్రాతృత్వమున్
(ధర్మనందనులన్లేదు, యమనందనులన్నాడు!, కాస్త ఆగ్రహం ధ్వనిస్తోంది)
మునిపక్షి రాకపోకల
ఘనసందేశముల కతన ఖర్చయిపోయెన్
దనురక్తమా దరిద్రుఁడు
చనిపోవునొ? తత్ఫలంబు జవిజూచెడినో?
ఇలా uncertainగా గబ్బిలం – 2 పూర్తయింది.
3. కాందిశీకుఁడు
ఇది పూర్తిగా కల్పితకథ. బర్మా తెలుగు కాందిశీకుడొకడు కొండలూ కోనలూ దాటి ఆంధ్రదేశంలో అడుగిడి నల్లమల అడవిలో చిక్కుకొన్నప్పుడు అతని పాదమొక కపాలానికి తగులుతుంది. అదొక నూరు పుష్కరాల క్రితం గతించిన క్షపణకుని (బౌద్ధ సన్న్యాసి) కపాలం. ఆ కపాలానికి మానవస్పర్శతో ప్రాణం లేచొచ్చి ఆ కాందిశీకుడితో చేసే సంభాషణే ఈ కావ్యం. కాందిశీకుడూ దౌర్భాగ్యుడే. జాషువా ఆశోపహతుల కవి. చరిత్రన్నా, తాత్త్వికచింతన అన్నా జాషువాకున్న ఆసక్తి, కుతూహలమూ ఇందులోనూ తెలుస్తాయి. ఆధునిక నాగరికత మానవునికెన్ని సమకూర్చినా, యుద్ధభయంలో చిక్కుకున్నవాడు కనుక ఈ కాందిశీకునికీ పునుకకూ మధ్య సంభాషణ మనిషి గురించే, యుద్ధమూ శాంతి – వీటి గురించి. క్షపణకుడు కాందిశీకుని అడిగిన తొలిప్రశ్న పలనాటి యుద్ధం గురించి (జాషువా గుంటూరు జిల్లా కవి). ఇందులో జాషువాకున్న కుతూహలమెక్కువ కనిపిస్తుంది. కథనేది పెద్ద లేకున్నా కథనముంది. పద్యాలు చక్కగా ఉన్నాయి. కొన్ని aphorisms, నీతులూ, వ్యంగ్యం, వలసినంత sense of humour, వగైరా బాగుంటాయి. “ఆపదలలోన భక్తి రెండంతలగుట / వాస్తవముఁ జేసె ధృతిజారి బాటసారి”. “స్వర్గనరకాలు రెండు నీ జగతియంద / నరుడు సృష్టింపగలడని నమ్మగలను”.
4. క్రీస్తు చరిత్ర
జాషువా క్రీస్తు చరిత్రకు ముందుమాటలో తనే “బైబిల్ను ఛందోబద్ధం చేయడం కత్తిమీద సాము వంటిద”న్నాడు. ఇంకా, “తెలుగు బైబిలు భాషనీసడించు హైందవ మిత్రులకూ, కళాభిరుచిగల యాధునిక క్రైస్తవ లోకానికీ ఈ కావ్యం రుచిస్తుందనే దైర్యం నాకున్నది” అని కూడా అన్నాడు. Paradiseను పరదైసు అని తెలుగు చేశాడు. స్వర్గమనో ఇంకా దానికున్న ఇతరశబ్దాలో వాడలేదు. క్రిస్టియన్ Paradiseకీ, స్వర్గానికీ భేదాలున్నాయి. నమ్మేవారు (Believers) infinite lifeని నమ్ముతారు. జాషువా క్రీస్తుచరిత్ర అతని రచనల్లో అత్యంత విశేషమైందీ, తలమానికం వంటిదీనూ. ఒక్క మేరీమాత యేసుని శిలువ వేసిన సందర్భంలో రోదిస్తూ చెప్పిన మాటలు మినహా మిగతా అంతా బైబిల్‌లోని నలుగురు సువార్తాకారులు (Matthew, Mark, Luke and John) రాసిన ఏసుచరిత్రోదంతాలను ప్రోది చేసి రాసినదే. అక్కడక్కడా చిన్నచిన్న స్వేచ్ఛాయుత వర్ణనలు తప్పవు. పద్యాలు ఎంతో విశిష్టమైనవి. హాయిగా సాగుతాయి. ఇక్కడ నేను సువార్తలను యథాతథంగా రాయట్లేదు. జాషువా పద్యకావ్యంపైనే దృష్టి పెడుతున్నాను. ఈ కావ్యం, ఏసుప్రభువు శిలువపై దేహత్యాగం చేయడం, ఏసు పునరుత్థానం, Paradiseలో దేవుని దక్షిణభాగంపై ఏసు కొలువుదీరడంతో ముగుస్తుంది.
మొదటి పది పద్యాలూ సృష్టి క్రమాన్ని వివరించే పాత నిబంధన గ్రంథంలోని వివరాలు. ఆనక జకార్యా (Zachariah) ఎలిజబేతులకు కొడుకు (యోహాను అంటే John, the Baptist) పుడతాడని దేవుని మహిమాన్వితశుభవార్తను దైవదూత (Gabriel) ఆ వృద్ధదంపతికి చేరవేయడం. ఏసుజన్మవృత్తాంతాన్ని ఎంతో సరళంగా సున్నితంగా రాశాడు జాషువా.
ఘననక్షత్ర మహామణిన్ దలను శృంగారించె నాకాశ గే
హిని బంగారపు మెట్ల కిన్నరలు మ్రోయించె న్నిలింపాంగనా
జనమానంద పయోనిధి దేలె సకలాశల్, మేరి గర్భంబునన్
జననంబంది ప్రభుండు దీనుడయి కోష్ఠంబందు పన్నుండగన్
ఆకాశంలో కొత్తగా ఏర్పడిన నక్షత్రం తోవ చూపగా తూర్పునుంచి వచ్చిన జ్ఞానులు బాల ఏసుని చూసిన సంబరాన్ని అనన్యసామాన్యంగా రాశాడు జాషువా:
తెగదెంపులై చన్న దేవమానవమైత్రి కడగి క్రమ్మర మ్రొగ్గదొడిగె నేడు
ప్రథమ పాపమున దైవము నోట వెలువడ్డ పటుశాపశిఖి చల్లపడియె నేడు
చైతన్యవంతమై సర్వ సర్వంసహ ప్రతి రజఃకణము పెంపారె నేడు
కాయంబు పొంగి మోక్షద్వారమున నిల్చి ఘన యెహోవా నవ్వుకొనియె నేడు
తూర్పుదిశ వసించు దూరవాసుల మమ్ము
తారచేత రాయబారమంపి
దర్శనంబొసంగి తనియించితివి తండ్రి
మ్రొక్కులందుకొమ్ము బుజ్జిదేవ
“కాయంబు పొంగి..” అనడం కవి కల్పన, స్వేచ్ఛ. పశ్చిమాసియా మతాల్లో దేవుడు anthropomorphic దేవుడు కాడు. రూపం లేని దైవం, అనంత కాంతి.
ఏసు అంటే కవికి ఎంత భక్తో బాలయేసు అంటే అంత ముద్దు కూడా. ఏసు ముద్దులు కురుస్తూ పెరిగాడు. పన్నెండేళ్ళ వయసులోనే ఏసు యెరుషలేంలో యాజకులతో తర్కించి తనొక మెస్సియానని ప్రకటన చేశాడు. మేరీయోసేపులు ఏసుని వెతుక్కుంటూ యెరుషలేంలో చూసి “ఇంటికి రమ్మ”న్న ఘట్టం:
ఒంటిగ నేల నిల్చితి వయో! పసివాడవు రా కుమార ర
మ్మింటికటన్న యేసు హసియించి, అమాయకులార మంటికిన్
మింటికి కర్త నాదు పిత నేను తదాజ్ఞ తలన్ ధరించి యి
ప్పంటవలంతికిన్ దిగిన వాడ మనుష్య కుమార భూమికన్
ఇక్కడ ఔచిత్యం గమనించాలి. తలిదండ్రులు ముద్దుగా ఆప్యాయంగా పిలుస్తే, ఏసుప్రభువు తనొక లక్ష్యసిద్ధికై వెలసిన దైవకుమారుడినని నిష్కర్షగా చెప్పాడు, (“నాదు పిత”, “తదాజ్ఞ తలన్ ధరించి”). బైబిలు సువార్తలలో prophetic tone (**) ఎక్కువ వినబడితే, జాషువా క్రీస్తు చరిత్రలో సౌన్నిత్యం, మార్దవం ఎక్కువ వెల్లివిరిసాయి. ఉదాహరణకు మేరీ ఎలిజబేతును చూద్దామని వెళ్ళిన సందర్భంలో (Luke సువార్త) పద్యాలు చూడండి. పద్యంలో కవి ఏ భావాన్ని వ్యక్తీకరిస్తున్నా, పద్యం ఆ భావాన్ని సరిగా పలికించాలంటే శబ్దసంయమనం కవికి ముఖ్యం. Delivery vehicle తేలికపాటిది, payload మనసును తాకేది. మేరీ ఎలీసబేతును చూసినప్పటి సందర్భంలో ఒక Faithful and beautiful ఆణిముత్యంలాంటి పద్యం:
వందనమాచరించె నిజబందుగురాలికెలీసబేతు కా
నందముతో నెలీసబేతు నాతియు ప్రత్యభివాదమిచ్చె నా
సుందరి గర్భమందెదుగు సూనుడు గంతులువైచె బిట్టు టా
నందముతో మెసీయ జననంబును బిండమెటుల్ గ్రహించెనో!
ఏసుప్రభువు John the Baptistకన్నా నెలలు చిన్న.
సమరియా స్త్రీని ఏసు మంచినీళ్ళడిగిన ఘట్టంలోనూ జాషువా కాస్త స్వేచ్ఛతీసుకొని అస్పృశ్యతను నిరసిస్తూ రాశాడు.
జలముల్ వాయువు నగ్నియున్ బరమ రాజన్యుండు భూలోక వా
సులకుం బంచి యొసంగిపోయిన స్థిరాస్థుల్ స్పృశ్యతాస్పృశ్యతల్
కులగోత్రాలు ప్రపంచసభ్యతకు సిగ్గుంజేటు జుమ్మిమ్మహా
కలుషంబెల్ల మహా పదార్థములకు కల్పింతురల్పాశయుల్
క్రీస్తు చరిత్రలో Sermon on the Mount అనువాదమొక అద్భుతం. ఏసుప్రభువు చెప్పిన నీతులూ చేసిన ప్రవచనాలూ చిన్న చిన్న కంద పద్యాల్లో అమర్చి చెప్పాడు, జాషువా, తిక్కనను తలపిస్తూ.
జాషువా తెలుగు కవితను స్వానుభవాన్ని సరళంగా గుండెకు హత్తుకునేలాగున చెప్పిన కవి. కులపు నిచ్చెన మెట్ల సమాజంలో, అస్పృశ్యతనే సామాజిక రుగ్మత తనను బాధించగా నిజాయితీగా తన ఆక్రోశాన్ని వినిపించిన జాషువాలో వైయక్తికమూ సమష్టీ పడుగు పేకల్లా కలిసి ఏకతంత్రీస్వనాన్ని వినిపించాయి. భావ కవిత్వాన్ని చదివి మనం ఆకాశంలో విహరిస్తాం. విప్లవకవిత్వం చదివి ఉర్రూతలూగి ఎగిరి గంతులు వేస్తాం. సంప్రదాయ కవిత్వం చదివి భక్తితో పురాణేతిహాసకావ్యాదుల్లోంచి తొంగిచూసే జాతి మూలప్రతిమలపై (icons) గౌరవంతో గర్వంతో స్పందిస్తాం. జాషువా కవిత్వం చదివి మనలో మనం ప్రశ్నించుకొని మార్పుకు సిద్ధమౌతాం. జాషువా ఎన్నో సత్కారాలందుకున్న కవి. విశ్వనాథ ఈయనని ఎంత గుర్రుగా చూసినా (బహుశా అందువల్లనేనేమో), చెళ్ళపిళ్ళవారు జాషువాకి గండపేండేరం తొడిగి జాషువానే పైమెట్టుపై పెట్టారు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన సమ్మానం.
ఎలమిన్ మత్తమదేభవాహనములం దెక్కించి సన్మానముల్
సలిపెన్, బంగరు స్నానముల్ సలిపె కాలన్ గండపేండేరముల్
నిలిపెన్, నా కవితారసగ్రహణ కేళీలోలమై ఆంధ్రభూ
తల మస్మత్కవితాప్రరిశ్రమకృతార్థంబయ్యె దిక్పూజ్యమై
ధన్యుడు జాషువా.
(*)
మొదటిది గబ్బిలంలోనే పక్షి ఇంట్లోకి ప్రవేశించిన సందర్భంలో “గబ్బిలమొకండు” అన్న కవి తరువాత గబ్బిలాన్ని స్త్రీలింగ శబ్దాలతోనే (సహోదరీ, పక్షిణీ) సంబోధించాడు. రెండోది, ఫిరదౌసిలో రాజు హుక్కా తాగుతూ ఫిరదౌసి రాసిన లేఖను చదివాడని (“కనులన్ గెంపు నటింప మైమఱపు హుక్కా ద్రావు సుల్తాను….”) రాశాడు. ఇంకో సందర్భంలో “ఒక్క కవి మీచేఁగోరు ద్రవ్యంబు మీ హుక్కా ఖర్చుకు సాటిరాదుగద” అన్నాడు, అప్పటికి (11వ శతాబ్దం) హుక్కా ఉండెనా అని గూగులిస్తే హుక్కా 16వ శతాబ్దానిదని తెలిసింది.
(**)
నేను చదివినది KJV అని పేరుపడ్డ King James version బైబిలు.
‘సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’-అయితే అటువంటి సుకవిని హృదయం దాకా తీసుకువెళ్లాలి అంటే మీవంటి రసజ్ఞులు తప్పకుండా ఉండాలి.
ధన్యవాదాలు, చినవీరభద్రుడూ
-వాసు-
జాషువా కావ్యాల సమీక్ష హేతురంజకంగా సాగింది.తెలుగు పద్యపు సోయగం మిలమిలలాడింది. కవి ఎక్కడ ఆవేశపడాలో, ఎక్కడ సంయమనం పాటించాలో , ఎక్కడ గర్వం పాటించాలో , ఎక్కడ జన్మభూమిని స్మరించాలో ఈ వ్యాస సంపుటిలోని ఉదాహరణలు మార్గదర్శనం చేస్తాయి.
జాషువా పద్య ప్రక్రియను అధునోద్దీప్తం చేసి చూపాడనేది ఈ వ్యాసం ప్రస్ఫుటీకరిస్తుంది. పద్యకవులు పఠించదగిన రసపద్యవిద్య జాషువా పద్యకృతి సంచయం. కవి జీవనాడిని, స్వరద్యుతిని బాగా చూపించారు. మీకు అభినందనలు.
ధన్యవాదాలు, రామ్మోహన్గారూ
-వాసు-