మార్పు కోసం ఏకలవ్య పోరాటం!

“రచయిత అన్నవాడు తన జాతి జీవితాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి”

“నేను రాయకపోతే నా జాతి జీవితం బయటికి రాదు అన్న బాధ్యతను గుర్తించి తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది ” అంటారు కొ.కు ఒకచోట.

నిజాయితీతో ఆ బాధ్యతను గుర్తించి, తన ఎరుకల జాతి జీవితాన్ని చాలా సూక్ష్మ స్థాయిలోకి వెళ్లి, వివిధ కోణాల నుండి కథలు, కథలుగా మనకి విప్పి చెప్పిన పలమనేరు బాలాజీ ఎంతైనా అభినందనీయుడు.

కథా,నవలా రచయిత, కవి, వ్యాసకర్త అయిన పలమనేరు బాలాజీ కొత్త కథల సంపుటి “ఏకలవ్య కాలనీ” ఎరుకల జీవన గాధల్ని మనకి విప్పి చెప్తుంది. సామాజిక మార్పు కోసం ప్రయత్నించే పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్ వారి 74వ ప్రచురణగా 18 కథలతో ఈ పుస్తకం మన ముందుకు వచ్చింది.

నిండా కనికరం కలిగిన తన తల్లిదండ్రుల జీవితాన్ని వాచ్యంగా చిత్రిస్తూ, మనని ఆ కొత్త ప్రపంచంలోకి ప్రవేశపెడతాడు రచయిత. ఆ ఇంట్లో ఇప్పుడు నాయన లేడు జయమ్మా లేదు.. అయితే ఇప్పటికీ ఆ ఇంట్లో ముఖ్యంగా వంటింట్లో ప్రతిధ్వనించే మాట.

“మే జయా టీ పెట్టు ముందు ..స్ట్రాంగ్ గా పెట్టు మే ,”

మీరు ఎప్పుడైనా పలమనేరు వెళ్తే తప్పకుండా ఆలకించండి!

పని స్థలం నుండి బస్సులో కాకుండా లారీలో వచ్చి డబ్బులు మిగిల్చుకొని పిల్లలకు బొమ్మల పుస్తకాలు, ఆపిల్ పండ్లు తెచ్చే ఆ తండ్రి…. తన కుటుంబ బాధలే కాకుండా చుట్టుపక్కల ఎవరికీ ఏ చిన్న సమస్య వచ్చినా తానే ముందుండే మదర్ తెరిసా ఆ తల్లి.

ఆ కుటుంబాలలో, భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాల రూపంలో… మొత్తం కుటుంబ పరిస్థితుల నంతా విశద పరుస్తూ, బాధ్యతాయుతమైన వారి కుటుంబ, సామాజిక సంబంధాలను గురించి లోతుగా అర్థం చేయిస్తాడు రచయిత.

ఎప్పుడో, ఎక్కడో, ఏదో జరిగిందని, ఒక జాతి జాతినంతా దొంగలుగా ముద్ర వేసి, నేర చరిత్రను నెత్తిన మోపి(క్రిమినల్ ట్రైబల్ యాక్ట్)… ప్రతి చిన్న దానికి ఎరుకల వారిని లోపల వేయడమనే సమాజ దుర్నీతిని ప్రశ్నిస్తూ పలుచోట్ల విశ్లేషణకు పెడతాడు రచయిత.

ఆ క్రమంలో, పోలీసుల దాడులను పదేపదే తట్టుకోలేక, చివరికి ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయిన అశోక్ కోసం “అశోకా” “అశోకా” అంటూ కలవరించి పలవరించి, అలమటించి పోయిన ముసలి తండ్రి… ఎంత కాదనుకున్నా మనల్ని కంటతడి పెట్టిస్తాడు.

ఏకలవ్యఎస్టీ కాలనీ మొగదల ఉన్న దుర్గమ్మ గుడి పక్కకు తిరిగి వింటే ఇప్పటికీ “అశోకా అశోకా” అన్న ఒంటికన్ను నారాయణప్ప గొంతు హృదయ విదారకంగా వినిపిస్తూనే ఉంటుంది.

ఈ పుస్తకం చదివాక, మనకి గొప్ప ఆనందం లభించదు .

తీవ్రమైన తుఫాను తాకిడికి గురైన తర్వాత చిందరవందరయిన పరిస్థితుల్లా ,మనసంతా అల్లకల్లోలం అయిపోతుంది.

మనుషుల్ని ప్రేమించడం తప్ప, మరో పార్శ్వం తెలియని కాంతమ్మత్త …జాతికి గొప్ప వ్యక్తిత్వ పాఠాలను, విలువలను బోధిస్తుంది.

మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనలోని పొరపాట్లను లోలోపలే సమీక్షించుకోమని సూచన చేస్తుంది, ధైర్యం ఒక్కటే సత్యం నిండిన శాంతివనానికి దారి చూపగలదని నేర్పిస్తుంది.

అంతేనా? కులమేదైనా సరే స్త్రీలు పురుషులకంటే ఎంత మాత్రమూ తక్కువ వారు కాదని వాదిస్తుంది.. కాంతమ్మ వంటి ప్రత్యేకమైన వ్యక్తులు, వెన్నెముక కలిగిన బలమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీలు జాతి దీపధారులుగా ఈ కథల నిండా మనకి కనిపిస్తారు.

మగపిల్లలు కూడా ఇంటి పనులన్నీ తప్పనిసరిగా నామోషీ లేకుండా చేయగలిగితే… ఆడవాళ్ళ జీవితాలు బాగుపడతాయన్న సూత్రాన్ని మనుషుల మనసుల్లో నాటడం మరో విశేషం. ఈ ఆలోచన ఈ మార్పు సమాజంలో సర్వత్రా ఆచరణలోకి రావాల్సిన అవసరం ఉంది.

ఒక మనిషి చిరకాలం మనుషుల మాటల్లో, మనసుల్లో, జ్ఞాపకాల్లో బతికి ఉండడమే అమరత్వం అనుకుంటే ఇవాల్టి కీ ఎస్టీకాలనీలో, మంచొచ్చినా చెడు కలిగినా ఎస్టీ కాలనీ మనుషులందరి మనసుల్లో మెదిలే ,మాటల్లో జ్ఞాపకాల్లో మెరిసే మదర్ తెరిసా జయమ్మ, మంచి మనిషి కాంతమ్మ అమరులే మరి.

కులాన్ని మించిన మంచి గుణం, మంచితనం, మనిషితనం కలిగి ఉండడమే కదా అమరత్వం.

“ముందు మనం ఒకటే నేర్చుకోవల్ల. ఏదైనా సాధించాలి అనుకుంటే ఎరుకల జీవితంలో అస్సలు భయం ఉండకూడదు,.. ముందు మనిషనే వాడు భయాన్ని నరికెయ్యల్ల… ఏదైనా కల కనాలంటే ముందు దేనికీ భయపడొద్దు” అంటూ తన జాతి కుర్రాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసే పోలీసు మునిరత్నం… జాతికే ఒక దిక్సూచి. ఇలాంటి దక్షితులు ఈ కథల నిండా కనిపిస్తారు వాళ్లు కేవలం పురుషులు మాత్రమే కాదు బలమైన నిటారు అయిన వ్యక్తిత్వం కలిగిన విద్యావంతులైన స్త్రీలు కూడా కావటం విశేషం. ఒక స్త్రీ చదువుకోగలిగితే తన కుటుంబం ఎంతగా మారుతుందో ఎంతగా అభివృద్ధి సాధించగలుగుతుందో ఆదివాసి గిరిజన కుటుంబాలలో విద్యావంతులైన స్త్రీల జీవితాలను ఈ కథలలో చదివినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం.

ఈ కథ “దేనికీ భయపడొద్దు” చక్కటి శిల్పంతో, తగిన కథానికా నిర్మాణ పద్ధతులు కలిగి ఉండి ముందు వరుసలో నిలబడిన కథ.

అడిగినోళ్ళకి, అడగనోళ్ళకీ అందరికీ అన్నీ చేసి పెట్టే ఉడుకోడు…. తనకోసం ఎవరినీ, ఎప్పుడూ ఒక్క చిన్న సాయం కూడా అడగని ఉడుకోడు మరణించినా- మనుషుల హృదయాల్లో ఆలోచనల్లో మాటల్లో స్పందనల్లో ఎప్పటికీ మరణించని అతడి సాహసోపేతమైన జీవితాన్ని కళ్లకు కట్టినట్టుగా రచయిత ఈ కథలో చూపిస్తాడు.

ఎక్కడా, ఎవరి వద్దా, తలవంచకుండా జీవిత కాలం తన జాతిలో వెలుగులు నింపడం కోసం ఉడుకుడుగ్గా బతికిన ఉడుకోడి కధ  – ఊరినంతా ఉత్తేజితం చేసిన కథ.

ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవని అర్జీలు రాసి ప్రజలతో పాటు ఎమ్మార్వో ఆఫీస్ కి కాళ్లు అరిగేలా తిరిగిన ఉడుకోడు, అహర్నిశలూ ప్రయత్నించి ఇండ్లు మంజూరు చేయించిన ఉడుకోడు… పిడుగు పడి మండిపేటలో గొర్రెలు చనిపోయినా ముందుగా కదిలేది ఉడుకోడే.. కరెంటు షాక్ కొట్టి ఎరుకల వెంకట్రాముడికి కాళ్లు చేతులు కాలిపోయినా ఆదుకోవడానికి ముందుకు వచ్చి సరుకులు తెప్పించి ఇప్పించేదీ ఆయనే.

అంతెందుకు?….ఆడోళ్ళు డ్వాక్రా గ్రూపుల్లో కరెక్ట్ గా లోన్లు కట్టకుండా ఉంటే బ్యాంకు వాళ్లు వచ్చి అడిగేది కూడా ఈ పెద్ద మనిషినే నచ్చచెప్తాడు. భయపెడతాడు. అధికారుల వల్ల కానిది, నాయకుల వల్ల కానిది ఉడుకోడు చేసి చూపిస్తాడు.

“మనం బతకాలంటే కరువూ మొండి మేఘాలతోనే కాదు, మొండి మనుషులతో పెద్ద కులమోల్లతో పోరాటం చేయడం నేర్చుకోవల్ల . మన నెత్తురు ఎప్పుడూ ఉడుగ్గానే ఉండల్ల ” అంటాడు.

మంచోళ్ళ మంచితనం ఏపాటిదో వాళ్ల మరణంలో చూడాలంటారు… అడిగిన వాళ్ళకీ, అడగనోళ్ళకీ అందరికీ అన్నీ చేసే ఉడుకోడు ,తన కోసం ఎవరినీ, ఎప్పుడూ ఒక్క చిన్ని సాయం కూడా అడగని ఉడుకోడి జీవితాన్ని మరణంలో చూపిస్తాడు రచయిత.

ఉడుకోడి అంత్యక్రియలప్పుడు పలక కొట్టే వాళ్ళు దుడ్లు వద్దనేసిరి.  గుంత తవ్వినోళ్లు దుడ్లువద్దు అనేసిరి… సావు సరుకుల కోసం పోతే ఉడుకాయప్ప కే కదా అని ఫ్రీగా ఇచ్చిరి… కొత్త పంచ, టవల్ కూడా ఫ్రీ నే…..ఊరంతా తెలిసిపోయింది కదా చావు ఎవరిది అని ..?

*
ఈ కథల్లో కథానాయకుడు, ప్రతి నాయకుడు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు.  రకరకాల బలహీనతలు, బలాలూ కలిగిన మామూలు మనుషులుంటారు. అమాయకులు, నిజాయితీపరులూ ఉంటారు.

ఈ కాలాన కూడా “మునిదేవర” వంటి వేడుకలు అవసరమా అని పైకి అనిపిస్తుంది కానీ, “ముని దేవర” అంటే ఎక్కడెక్కడి వాళ్ళూ వచ్చి కలవడం ఉంటుంది. పుట్టుకకీ, చావుకీ, పెళ్లికీ కూడా రాని వాళ్ళు “మునిదేవర” అంటే తప్పకుండా హాజరవుతారు.

ఆర్థిక అసమానతల్ని దాటి, మునీశ్వరుడు అంటే ఉండే భయం వల్లో, భక్తివల్లో బంధువుల సమూహాలు మిళితం కావడం…. ఆ కోలాహలం నిజంగా ఒక అబ్బుర సన్నివేశం.

ఒకప్పుడు అడవుల్లోని ఆకులు, అలములు జీవికగా కడుపాత్రం తీర్చుకున్న ఎరుకలు, ఇప్పుడు అడవిలోకి పోకూడదు, వెదుర్లు కొట్టకూడదు, చెట్లు నరకకూడదు అంటూ వారిని అడవుల నుండి, సేద్యం నుండి ఇంకా బతుకుల నుండి తరిమివేయడం…..గురించి చెప్తూ ఒకచోట “వాళ్ళిద్దరూ మోకాళ్ళ పైన గడ్డం ఆన్చి, నేలపైనే భయం భయంగా కూర్చుని ఉన్నారు. వాళ్లలో ఒకాయన మా చిన్నాయన ,ఇంకొక ఆయన వాళ్ళ అన్న. వాళ్ళ ఒంటినిండా రక్త గాయాలు… అడవిలోకి వెళ్లినందుకు అధికారుల జరిమానా అది.. ఆ దెబ్బలతో మూడు రోజుల తర్వాత ఉచ్చ పోసుకుని చనిపోయారు వాళ్ళు”…అంటాడు

గుండె కదలబారకుండా ఉంటుందా? కన్నీళ్లు రాలకుండా ఉంటాయా?

ఆ చేతులు, బండబారిన మొరటు చేతులు , ఎరుకల చేతులు ఇంకెట్లా ఉంటాయి? వెదురు దెబ్బలు చీల్చిన చేతులు, వెదురు బుట్టలు, తట్టలు అల్లిన చేతులు, గాడిదల్ని చాకిన చేతులు, పందుల్ని మేపిన చేతులు, ముగ్గుపిండి, ఎర్రమన్ను ఇల్లిల్లు తిరిగి, తిరిగి అమ్మిన చేతులు… కొండల్లో, గుట్టల్లో బండరాళ్లు కొట్టి కొండని తొలచి, ముండ్ల చెట్లను పెకలించి, చెమటతో, రక్తంతో పంటలు పండించిన ఎరుకల తాతలు అవ్వల చేతులు అవి… కరువు కాలంలో గెనుసు గడ్డల కోసం నేలను తవ్విన చేతులు… గంజి మాత్రమే దొరికిన రోజుల్లో తాతలు, అవ్వలు ..అమ్మలు, నాన్నలు తాగకుండా వాళ్ళ వాటా కూడా ఇచ్చేస్తే ఆకలి తట్టుకోలేక ఆవురావరుమని వాళ్ళ గంజి కూడా తాగి ప్రాణాలు నిలుపుకున్న. ఎరుకుల పిల్లల చేతులు…. కులవృత్తులు చేయడం పిల్లలకు నామోషి అని సొంత జీవనోపాదల్ని ,మూలాల్ని వదిలి ఇంటి పని, పాచిపని, తోట పని చేసిన ఎందరో అమ్మల చేతులు…..ఆ మొరటు అరచేతి రేఖలలో ఎన్నెన్నో దు:ఖిత దృశ్యాలు.

ఆ బండ బారిన మొరటు అరచేతుల జాతి, ఇప్పుడిప్పుడే చదువు బాట పట్టి, పోలీసులు గాను, టీచర్లు గానూ, ఆఫీసర్లుగానూ స్థిరపడుతూన్నప్పటికీ, అది చాలా తక్కువ శాతం మాత్రమే.

ఇప్పటికీ ఆధార్ కార్డుల కోసం రేషన్ కార్డుల కోసం ఎన్నికల గుర్తింపు కార్డుల కోసం జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురుచూస్తున్న గిరిజనుల గురించి “ఏకలవ్య కాలనీ ” కథలు చెపుతాయి. ఏకలవ్య కాలనీ పుస్తకానికి సంపాదకుడుగా వ్యవహరించిన ఎ.కె. ప్రభాకర్ చెప్పినట్టుగా ఈ కథలు బాలాజీ స్వీయ చరిత్రాత్మకమైన ఆత్మాశ్రయ కథనాలు.రచయిత తన జాతిలో ధైర్యాన్ని నింపడమే ధ్యేయంగా ఈ కథలు రాసినట్లు మనకు తెలుస్తుంది.

“మారల్ల — మార్చల్ల”

తన జాతి విముక్తి కోసం బాలాజీ పొందుపరిచిన సూత్రీకరణ ఇదే.  అంకురప్రాయంగా మొదలైన ఈ చైతన్యం,ఈ సూత్రీకరణను ముందుకు తీసుకెళ్లే మోటివేటర్లు ,సామాజికాచరణ దిశగా నడిపించే రచయితలు… తమ జాతి నుండి మరింత మంది రావాలని బాలాజీ అభిలషిస్తున్నాడు. అతడి ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిద్దాం.

*

ప్రతిమ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏకలవ్య ఎరుకుల కథలు ప్రతిమా మేడం గారు చాలా బాగా పరిచయం చేశారు. రచయిత యొక్క భావాలను చాలా బాగా విశదీకరించారు
    ధన్యవాదములు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు