ఒక జమీందారు తోటలో ఒక యువకుడు పనిచేస్తూ ఉండేవాడు. ఆ యువకుడు చాలా మంచివాడు. నిజాయితీపరుడు. ఏదీ ఆశించకుండానే ఇతరులకు సాయం చేసేవాడు. వాళ్ళ ఇల్లు సముద్ర తీరానికి దగ్గరలో ఉండేది.
ఒకరోజు తోటలో పని పూర్తికాగానే ఎప్పటిలాగే సముద్రం పక్కన నడుచుకుంటూ పోసాగాడు. అంతలో ఒక పెద్దచేప మరొక చిన్నచేపను తరుముకుంటూ రావడం కనబడింది. చిన్నచేప భయంతో వేగంగా తీరం వైపు రాసాగింది. ఆ చేప బంగారు రంగులో తళతళా మెరుస్తా ముద్దుగా ఉంది. వెంటనే ఆ యువకుడు అక్కడున్న ఒక పెద్ద రాయి తీసుకొని బలమంతా ఉపయోగించి ఆ పెద్దచేప మూతి మీద ఈడ్చి ఒక్కటి కొట్టాడు. అంతే… ఆ దెబ్బకు అది విలవిలలాడుతూ భయంతో వెనక్కి తిరిగింది. పోతూ పోతూ తన తోకతో చిన్నచేపను బలంగా ఒక్కటి కొట్టింది. ఆ దెబ్బకు ఆ చేప ఎగిరి సముద్రానికి దూరంగా ఒడ్డున పడింది. అక్కడినుంచి తిరిగి నీళ్ళలోకి వెళ్లలేక గిలగిలా కొట్టుకోసాగింది. ఆ యువకుడు అది చూశాడు. ‘పాపం… ఇంకొక నిమిషం ఇక్కడే ఉంటే నీళ్లు లేక చచ్చినా చస్తుంది’ అనుకుంటూ దాన్ని తీసుకొని వేగంగా ఉరుక్కుంటా పోయి సముద్రంలో వదిలాడు.
అలా వదిలి సంతోషంతో తిరిగి పోతూవుంటే “ఓ సోదరా కొంచెం ఆగు” అని వినబడింది. “ఎవరబ్బా పిలుస్తా ఉంది” అని వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది ఆ బంగారు చేప స్థానంలో ఒక చిన్న పాప కనపడింది. “నేను సముద్రరాజు ఒక్కగానొక్క ముద్దుల కూతురిని. సముద్ర గర్భంలోనే మా రాజ్యం. పొరపాటున ఒక్కదాన్ని పైకి వచ్చి సరదాగా ఈత కొడతా వుంటే ఈ రాక్షసచేప వెంటపడింది. సమయానికి నువ్వు వచ్చి కాపాడకపోతే ఒక్క క్షణంలో దానికి ఆహారం అయ్యేదాన్ని. నాతోపాటు మా రాజ్యానికి రా. మా నాన్న నిన్ను చూసి చాలా సంబరపడతాడు” అంది.
ఆ మాటలకు ఆ యువకుడు “పాపా… నేను ఏదో చిన్న చిన్న కాలువలు, చెరువులు, నదుల్లో ఈత కొట్టగలనేమో గానీ ఇంత పెద్ద సముద్రంలో కొట్టలేను. నావల్ల కాదు” అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి “అయితే ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. చిటికెలో పోయి చిటికెలో వస్తా” అని అక్కడినుంచి సర్రున నీళ్లలోకి దూసుకుపోయింది.
కాసేపటికి ఒక పెద్దచేప మీద ఎక్కి అక్కడికి వచ్చింది. “సోదరా రా. నాతోపాటు ఈ చేప మీద ఎక్కి కూర్చో. కళ్ళు మూసి తెరిచేలోగా కనువిందు చేసే మా రాజ్యానికి చేరుకుందాం” అంది. ఆ యువకుడు సరేనంటూ సంబరంగా పోయి ఆ చేప మీద కూర్చున్నాడు. అంతే అది మెరుపు వేగంతో తీసుకుపోయి సముద్రరాజు ముందు వదిలింది.
ఆ చిన్నారి ఉరుక్కుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి పోయి జరిగిందంతా వివరించింది. ఆ మాటలు వినగానే సముద్రరాజు గబగబా తన సింహాసనం దిగి వేగంగా వచ్చి ఆ యువకుని చేతులు గట్టిగా పట్టుకొని “బాబూ… ఈ పాప నాకు లేక లేక కలిగిన ఒకే ఒక కూతురు. ఆ పాపకు ఏమన్నా అయితే నేను బ్రతికినా చచ్చినట్టే. నా ప్రాణాన్ని కాపాడావు. దానికి బదులుగా నీకు ఏమిచ్చినా తక్కువే. నా సంతోషం కోసం ఏదైనా ఒక బహుమతి కోరుకో. అడిగిన అరక్షణంలో నీ చేతిలో పెడతా. మాట తప్పను” అన్నాడు.
ఆ యువకుడు చిరునవ్వు నవ్వి “రాజా… నేను మీ పాపను కాపాడింది ఏ బహుమతి కోసమో ఆశపడి కాదు. అక్కడ మీ కూతురు ఉన్నా మరొక పేద అమ్మాయి ఉన్నా నేను అలాగే కాపాడేవాన్ని. నాకు ఏ బహుమతి వద్దు. మీ పాప మొహంలో మెరిసే ఆ చిన్న చిరునవ్వు చాలు” అన్నాడు.
కానీ సముద్రరాజు, చిన్నారి అతన్ని వదల్లేదు. “నీ అంతట నీవు అడిగితే అది తప్పుగానీ మేము సంతోషంగా ఇస్తున్నప్పుడు తీసుకోవడం తప్పుకాదు. మా గుర్తుగా కోరుకో. చెప్పు ఏం కావాలి” అన్నారు పట్టు వదలకుండా మొహమాటపెడుతూ. ఆ యువకునికి అలా తీసుకోవడం కష్టం అస్సలు ఇష్టం లేదు. వీళ్ళేమో వదలడం లేదు. దాంతో ‘ఏం అడుగుదామబ్బా’ అని చుట్టూ చూశాడు.
ఖరీదైన వజ్ర వైఢూర్యాలు, ధగధగా మెరిసిపోతావున్న బంగారు హారాలు, అత్యంత విలువైన రకరకాల రంగుల వస్తువులు ఎన్నో కళ్ళముందు కనపడుతున్నాయి. వాటి మధ్య ఏమాత్రం విలువలేని ఒక తెల్లని శంఖం కనపడింది. దాంతో “మహారాజా ఆ శంఖం ఇవ్వండి చాలు. మీ గుర్తుగా ఇంట్లో అలంకరణగా పెట్టుకుంటాను. అంతకుమించి ఇంకేమీ వద్దు” అన్నాడు.
ఆ మాట వినగానే సముద్రరాజు అదిరిపడ్డాడు. నోట మాట రాలేదు. “బాబూ… నీవు అనుకున్నట్టుగా అది మామూలు శంఖం కాదు. మాయా శంఖం. దానిని పొరపాటున కూడా ఇంతవరకు ఎవరి చేతిలోనూ పెట్టలేదు. కానీ నా కూతురికన్నా ఈ లోకంలో నాకు ఏదీ ఎక్కువ కాదు. మా ఇంటి దీపాన్ని కాపాడి నా కుటుంబంలో వెలుగులు నింపావు. కాబట్టి తీసుకో” అంటూ ఆ మాయా శంఖాన్ని అతని చేతిలో పెట్టి “చూడు ఈ శంఖం నీ చెవి దగ్గర పెట్టుకుంటే నీ చుట్టూ ఉండే పక్షులు, జంతువులు ఏమి మాట్లాడుతున్నాయో నీకు స్పష్టంగా అర్థం అవుతుంది. దీని మహిమ గురించి ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తగా మంచి పనులకు ఉపయోగించుకో” అన్నాడు.
ఆ యువకుడు ఆ రోజు వాళ్ళ అతిథ్యం స్వీకరించి తర్వాతరోజు పొద్దున్నే శంఖంతో తిరిగి సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు. ఇంటికి వెళుతూ దారిలో ఒక తోటలో ఒక బండరాయి మీద అలసట తీరడం కోసం కూర్చున్నాడు. చెట్టు పైన రామచిలుకల కిలకిలలు వినబడ్డాయి. ఆ శంఖం మహిమ ఎలా ఉంటుందో తెలుసుకుందామని దాన్ని తీసుకొని చెవుల దగ్గర పెట్టుకున్నాడు. అంతే… ఆ రామచిలుకల మాటలు అతనికి చక్కగా వినిపించసాగాయి. మగచిలుక ఆడచిలుకతో “ఈ మానవులు తాము చానా తెలివైన వాళ్ళమని, తమకు అన్నీ తెలుసని విర్రవీగుతూ ఉంటారు. కానీ వాళ్లకు ఏమీ తెలియదు. ఈ చెట్టు కింద ఒక మనిషి కూర్చున్నాడు కదా… ఆ మనిషి కాళ్ళ కింద ఒక రాయి ఉంది చూడు… నిజానికి అది అలాంటిలాంటి మామూలు రాయి కాదు. అత్యంత విలువైన పెద్ద వజ్రం. దానిని అమ్మితే ఏకంగా ఒక ఊరినే కొనేయవచ్చు” అని చెప్పింది. యువకుడు ఆశ్చర్యంగా కిందికి చూశాడు. కాళ్ళ దగ్గర మట్టి కొట్టుకుపోయిన ఒక లావు రాయి కనపడింది. దాన్ని తీసుకుపోయి అక్కడున్న నీటిలో శుభ్రంగా కడగసాగాడు. మట్టి పోతున్నకొద్దీ అది ధగధగా మెరిసిపోతూ అత్యంత ఖరీదైన వజ్రం బయటపడింది. దానిని జాగ్రత్తగా అంగీ లోపల దాచిపెట్టుకున్నాడు. సంతోషంగా ఇంటికి బయలుదేరాడు.
అలా వెలుతూవుంటే దారిలో ఒక దండోరా వినపడింది. “మన జమీందారు కూతురికి అంతుచిక్కని రోగం వచ్చింది. అన్నం తినడం లేదు. నీళ్లు ముట్టడం లేదు. ఎవరైతే ఆ వ్యాధిని నయం చేస్తారో వారికి కోరుకున్న బహుమతి ఇస్తాం” అని. ఆ యువకుడు జమీందారు కూతురిని అనేకసార్లు తోటలో చూశాడు. తనకన్నా రెండేళ్లు చిన్న. అచ్చం అప్పుడే పూసిన పువ్వు లెక్క కళకళలాడుతూ ఉంటుంది. నవ్వుతూ వుంటే పూలవాన కురిసినట్టుగా ఉంటుంది. ‘అబ్బ ఎంత ముచ్చటగా ఉందీ పిల్ల. ఎవరింటిలో కాలు పెట్టి జీవితాలను బంగారంగా మారుస్తాదో” అనుకునేవాడు. ఆ పాప బాధలో ఉంది అని తెలిసేసరికి ‘ఎలాగైనా సరే ఆమెను కాపాడాలి’ అనుకున్నాడు.
జమీందారు ఇంటి చుట్టుపక్కల మాయాశంఖం తీసుకుని తిరగసాగాడు. ఎక్కడ పక్షులు కనపడినా, ఎక్కడ జంతువులు కనపడినా అవి ఏమన్నా జమీందారు కూతురుకి వచ్చిన రోగం గురించి మాట్లాడుకుంటున్నాయేమో అని శంఖం పెట్టుకొని వినసాగాడు. అట్లా తిరుగుతావుంటే ఆరోజు అర్ధరాత్రి ఒక చెట్టు పైన రెండు గుడ్లగూబలు మాట్లాడుకుంటా కనపడ్డాయి. రహస్యంగా అక్కడికి చేరుకొని వాటి మాటలను వినసాగాడు. “పాపం… జమీందారు కూతురు ఎప్పుడూ గలగలగల నవ్వుకుంటా అందరినీ హాయిగా పలకరిస్తా తిరుగుతా ఉండేది. వారం రోజులుగా నోట మాట లేదు. ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయో లేవో” అంది ఒక గుడ్లగూబ. ఆ మాటలకు ఇంకొక గుడ్లగూబ “వాళ్ళ నాయన ఇంటికి పైన కొత్త కప్పు వారం కిందట వేయించాడు. అందులో పొరపాటున ఒక చిన్న ఉడతపిల్ల ఇరుక్కుపోయింది. బయటకు రాలేక, లోపల ఉండలేక అల్లాడిపోతావుంది. కప్పు మీద దాని అమ్మానాన్నలు ఆ పిల్లను ఎలా కాపాడుకోవాలో తెలియక నిద్రాహారాలు మాని ఒకటే ఏడుస్తా ఉన్నాయి. ఏమీ చేయలేని ఆ నిస్సహాయుల ఏడుపు ప్రభావం ఆ పాప మీద పడింది. ఆ ఉడత పిల్లను కాపాడితే గానీ ఆ పాప వాళ్లకు దక్కదు” అంది.
ఆ మాటలు విన్న యువకుడు తర్వాతరోజు పొద్దున్నే జమీందారు ఇంటిలో అడుగుపెట్టాడు. “జమీందారు కూతురికి వచ్చిన రోగాన్ని తగ్గిస్తాను” అన్నాడు. ఆ మాటలకు అక్కడున్న వైద్యులందరూ నవ్వేశారు.
“ఎన్నెన్నో మూలికలు వాడాం. ఎక్కడెక్కడనుంచో వైద్యులను పిలిపించాం. కానీ రోజురోజుకీ మొహంలో కళ తగ్గిపోతావుందేగానీ ఒక్క రవ్వ కూడా వెలుగు పెరగలేదు. ప్రాణాలు పోసే వైద్యులం మాతోనేకానిది, మొక్కలకు నీళ్లుపోసే నీతో ఏమవుతుంది” అన్నారు. అంతలో జమీందారు అక్కడికి వచ్చి “ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ప్రయత్నిస్తే పోయేదేముంది. చెప్పు ఏం చేయమంటావో” అన్నాడు.
అప్పుడు ఆ యువకుడు జరిగిందంతా చెప్పాడు. వెంటనే జమీందారు పనివాళ్ళని పిలిపించాడు. వాళ్లు పైకి ఎక్కి జాగ్రత్తగా ఒక్కొక్క పెంకునే ఊడదీయసాగారు. అలా ఊడదీస్తా వుంటే ఒకచోట పెంకుల మధ్య వారం రోజులుగా అన్నం, నీళ్లు లేక నీరసంగా పడిపోయిన ఉడతపిల్ల కనబడింది. వెంటనే జాగ్రత్తగా దానిని కిందికి తెచ్చారు. వెచ్చని గడ్డి మీద పడుకోబెట్టి నోటికి చుక్క చుక్క పాలు అందించసాగారు. జమీందారు కన్న కూతురు లెక్క జాగ్రత్తగా చూసుకోసాగాడు. సాయంకాలానికంతా ఆ ఉడతపిల్ల నెమ్మదిగా లేచి నిలబడింది.
ఇక్కడ జమీందారు కూతురు మొహంలోనూ నెమ్మదిగా వెలుగు పరుచుకో సాగింది. తర్వాతరోజు ఉదయంకంతా ఉడతపిల్ల అటూయిటూ తిరుగుతూ నెమ్మదిగా గంతులేయసాగింది. దానిని జాగ్రత్తగా తీసుకపోయి దాని తల్లిదండ్రులు ఉన్న చెట్టు కింద వదిలిపెట్టారు. అమ్మానాన్నలను చూడగానే అది సంబరంగా ఎగిరి గంతులు వేసింది. అవి పిల్లను కళ్ళనీళ్ళతో దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకున్నాయి. ఎప్పుడైతే ఆ పిల్ల తల్లిదండ్రులను చేరిందో మరుక్షణం ఇక్కడ జమీందారు కూతురు లేచి చిరునవ్వు నవ్వింది. తర్వాతరోజుకల్లా జింకపిల్లలా ఎగిరి గంతులు వేస్తూ సందడి సందడి చేయసాగింది.
అది చూసి జమీందారు సంతోషపడి ఆ యువకున్ని పిలిపించాడు. “చెప్పు… నీకు ఏం బహుమతి కావాలో. ఏది కోరుకుంటే అది అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా అందిస్తాను” అన్నాడు.
ఆ యువకుడు నెమ్మదిగా “నీ కూతురు నా ఇంటిలో దీపం వెలిగించి రోజూ నా ఇంటి ముందు ముగ్గేయాలి. నా ఇంటిపేరు తన ఇంటిపేరుగా మార్చుకొని మా వంశాన్ని నిలబెట్టాలి” అన్నాడు. ఆ మాటలకు జమీందారు ఆలోచనలో పడ్డాడు. “నా కూతురిని చిన్నప్పటినుంచీ కాలు కిందపెట్టనీయకుండా అడిగినవన్నీ అరక్షణంలో అందిస్తూ, కంట కన్నీరు రాకుండా, పట్టుపరుపులపై ప్రేమగా పెంచాను. కానీ నిన్ను చూస్తే ఏ రోజుకు ఆరోజు పూట గెలవడమే కష్టంగా కనపడుతుంది. మరి నా కూతురిని నాలా ఎలా చూసుకోగలవు. ఈ కోరిక కోరడం న్యాయమేనా. నువ్వే ఆలోచించు” అన్నాడు.
దానికి ఆ యువకుడు చిరునవ్వుతో అంగీలోంచి అపురూపమైన వజ్రాన్ని తీసి జమీందారు చేతిలో పెట్టాడు. “ఇది చాలనుకుంటా నీ కూతురుని నీలా చూసుకోవడానికి. ఏడు తరాలు కాలుమీద కాలేసుకుని తిన్నా తరగనంత సంపద వస్తుంది దీన్ని అమ్ముతే” అన్నాడు. జమీందారు సరేనంటూ సంతోషంతో తన కూతురిని ఆ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు.
ఆ తరువాత ఆ యువకుడు సముద్ర తీరం వద్దకు పోయి “ఇక ఈ మాయా శంఖంతో నాకు ఎటువంటి పనీ లేదు. దీనికన్నా విలువైన భార్య నాకు బహుమతిగా లభించింది” అని సముద్రరాజును పిలిచి దానిని తిరిగి అప్పజెప్పాడు.
*
చక్కని కథ.
హరికిషన్ గారి కథలు అన్నింటినీ తప్పకుండా చదివేవాళ్లలో నేనూ ఒకడిని.
Very nice story. The climax is nice.
కథ చాలా బాగుంది సార్. ఇలాంటి కథలు ఇంకా చాలా మీ ద్వారా రావాలి అని కోరుకుంటున్నాను.
మనం మంచి చేస్తే తిరిగి మనకు మంచే జరుగుతుంది అనే సందేశం ఈ కథలో ఇమిడి ఉంది. మంచి కథను అందించినందుకు ధన్యవాదములు.
కథ చాలా బాగుంది సార్
కథ చాలా బావుంది. నీతి పరంగానూ ఉంది. 5 *