‘మందులోడా, ఓరి మాయలోడా’ అని మైకులో అల్లరి చిల్లరగా వచ్చే పాటని వినని వారుండరు. సంచార జాతుల్లో ఒకటైన ‘మందుల’ జాతి గురించి బయట జనాల్లో ఉండే ఒక చులకన భావం ఈ పాటలో వ్యక్తమవుతుంది. నిజానికి మందులోళ్ళు ఏ మాయ, మర్మం తెలియని వాళ్ళు, సమాజం చేత తిరస్కరించబడిన వారు. ఆంధ్రప్రదేశ్ లోని ఒకటీ రెండు జిల్లాలలో తప్ప దాదాపు అన్ని జిల్లాలలో నివసించే వీరు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. రాయలసీమలో అరుదుగా ఉంటారు. వీరి జనాభా సుమారు యాభై వేలు దాకా ఉండొచ్చని ఒక అంచనా. జంతు, వృక్ష పదార్ధాలతో మందులు తయారు చేసి అమ్మడం వీరి కుల వృత్తి కనుక వీరికి ‘మందులోళ్ళు’ అనే పేరు వొచ్చింది. అయితే పూర్వం వీరు రాజులకు మందులిచ్చి వారి మన్నన పొందినదానికి గుర్తుగా ‘రామజోిగీలు’ అనే గౌరవప్రదమైన పేరు తమ కులానికి పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో ఉండే ‘రామజోగి’ అనే కులంవారు క్షత్రియులుగా గుర్తించబడతారు. వీరి మూల పురుషుడు ‘గుండా బుచ్చిగాడు’ అనే పెద్ద మనిషి ఉన్నాడని చెబుతారు గానీ అతని తాలూకు వివరాలు ఈ తరంవారికి అంతగా తెలీదు. అయితే మందుల పురుషులు ఒకప్పుడు సీతాదేవిని మోహించి ఆమె వెంటబడి వేధిస్తే ఆమె ఆగ్రహించి వారికి ఎప్పటికీ ఇల్లూ, వాకిలీ లేకుండా దేశదిమ్మరులుగా బతుకుతారని ఆమె శపించడం వల్లనే వారు సంచార జీవనం గడుపుతున్నారాని ఒక కధనం.
వెనుకబడిన కులాల జాబితాలో చేర్చబడ్డ మందులవారు B.C-A కేటగరీ కిందకు వస్తారు. వీరిలో అక్షరాస్యత దాదాపు సూన్యం. ఒక శాతం కంటే తక్కువ అని ఒక అంచనా. ఇప్పటివరకు ఆ కులంలో ఇద్దరే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది, వారిలో ఒకరు రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్, మరొకరు పోలీసు కానిస్టేబుల్ తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారు లేకపోవడం గమనార్హం. మందుల కులస్తులు వేసవి కాలంలో అడవుల్లో తిరిగి వన మూలికలను సేకరిస్తారు. చెట్ల ఆకులు, బెరడులతో పాటు జంతువుల కళేబరాల నుంచి కూడా నూనెలు, కొవ్వుతోబాటు జంతువుల్లో అడవి పంది, జింక వంటి జంతువుల చేదు కట్టు, మాంసం వంటివి సేకరించి వాటితో మందులు తయారు చేసి అమ్ముతారు.పక్షుల మాంసం కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. కాకి మాంసం తింటే మూర్చ వ్యాధి, అడవి పంది, ఊరపంది కొవ్వుతో తయారుచేసిన మందుతో పిల్లల్లో వచ్చే కోరింత దగ్గు తగ్గుతాయని అంటారు. గతంలో వీరు అమ్మే మందులకు గిరాకీ ఎక్కువ. రాజులకు, జమీందారులకు కూడా వీరి మందుల మీద గురి ఉండేది. స్త్రీ, పురుషులిద్దరికీ మందు మొక్కలను గుర్తించడంలో ప్రావీణ్యం ఉంటుంది. బాలింతలకు, పసిపిల్లలకు వచ్చే జబ్బులకు వీరిచ్చే మందులు బాగా పనిచేస్తాయని తెలుస్తుంది. చెట్ల బెరడు నుంచి వీరు తయారు చేసే ‘కస్తూరి మాత్రలు’ జలుబు, దగ్గు, రొంప వంటి జబ్బులను నయం చేస్తాయని నమ్మకం. పాముకాటు, తేలుకాటు వల్ల ఎక్కే విషం వీరిచ్చే ‘తెల్ల ఉసిరి’ ఆకు పసరుతో విరుగుతుందని అంటారు. ఆయుర్వేద వైద్య విధానానికి వీరి వైద్యం దగ్గరగా ఉంటుంది. అయితే వీరు నేల ఉసిరి ఆకు, కొండ ముసరాకు (touch me not), కోడిగుడ్డు సొనతో కలిపిన మిశ్రమంతో వశీకరణ మందులు కూడా ఇస్తారని, వారిచ్చే మందును ప్రయోగించి తమకు కావల్సిన వారిని వశ పరుచుకోవచ్చనే అభిప్రాయం చాలాకాలం వరకూ గ్రామీణ సమాజంలో ఉంది. అయితే ఇంగ్లిష్ వైద్యం వ్యాప్తిచెంది, వైద్య విజ్ఞాన ఫలితాలు ప్రజలకు ముఖ్యంగా గ్రామీణులకు కూడా అందుబాటులోకి వచ్చాక అటువంటి మూఢనమ్మకాలతో పాటు వీరి మందులకు కూడా గిరాకీ తగ్గింది.
మందులోళ్ళు తయారు చేసి అమ్మే మందులకు గిరాకీ తగ్గినాక పూర్తిగా మందుల అమ్మకంతో బతకడం కష్టంగా భావించి వారు ఇతర వృత్తులైన పందుల పెంపకం, చిల్లర వ్యాపారాలు చెయ్యడం, పొలంలో ఎలుకలు పట్టడం, భిక్షాటన వంటి వృత్తులను చెయ్యడం మొదలెట్టారు. పందుల పెంపకం వారికి కొంత లాభసాటిగా ఉన్నప్పటికీ క్రమంగా పంది మాంసం తింటే మెదడువాపు వ్యాధి వస్తుందనే ప్రచారం ఎక్కువ అవ్వడంతో వారి జీవనోపాధికి మళ్ళీ గండి పడింది. అయితే పందులను మేపుతూ, వాటి మాంసం తింటూ వాటితో సహజీవనం చేసే ఎవరికీ మెదడు వాపు వ్యాధి రాలేదని ఇదంతా కార్పోరేట్ వ్యాపార కుట్రలో భాగమని అధ్యయనాలు చెబుతున్నాయి.
మందులోళ్ళు చేసే వృత్తుల్లో చిల్లర వ్యాపారం ఇతర సంచార జాతుల వారిలాగే తమ తమ కులవ్రుత్తులపై ఆధారపడి బతకడం కష్టం అయ్యాక చేపట్టినదే అని తెలుస్తుంది. స్త్రీలు బుట్టల్లో పెట్టుకుని అమ్మే అద్దాలు, దువ్వెనలు, సూదులు, పిన్నీసులు, తిలకం, మొలతాళ్ళు, బూరలు వంటి వస్తువులు వారు తయారు చేసినవి కావు, మారు బేరానికి అమ్మేవే. కొందరు ఒక వెదురు కర్రకు ఆ వస్తువులను కట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముతారు. స్త్రీలు ఎక్కువగా ఈ చిరు వ్యాపారం చేసి కుటుంబాలను సాకుతారు. ఆపని కూడా చెయ్యలేని పరిస్తితిలో గత్యంతరం లేక ఇంటింటికీ తిరిగి అడుక్కుంటారు. పురుషులు మందులు తయారు చెయ్యడంతో పాటు వేటాడడం, పందుల్ని పెంచడం, ఎలుక బుట్టలు పెట్టడం వంటి పనులు చేస్తారు. ఇప్పుడు వారి మందులు కొనేవారులేక, పందుల పెంపకం లాభసాటిగా లేక, వేరేపని చెయ్యడం అలవాటు లేక పురుషులు దాదాపు సోమరిపోతుల్లాగా స్త్రీల సంపాదన మీదే ఆధారపడుతున్నారు.
మందుల వారిలో స్త్రీలు కష్టజీవులు, వారు అమ్మే వస్తువుల బుట్ట నెత్తిన పెట్టుకుని రోజంతా తిరుగుతూనే ఉంటారు. చంటి పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేసి వెళ్లి, వస్తువులు కొనే వారు తినడానికి ఏదన్నా ఇస్తే దానితోనే సరిపుచ్చుకుంటారు. ఒక్కోసారి పాలుతాగే చిన్నపిల్లలకు ఏడవకుండా నిద్రపోవడానికి కల్లు తాగించి వెళ్తారు. ఆ పిల్లలు మత్తులో రోజంతా నిద్రపోయి సాయంత్రం ఎప్పుడో తల్లి వచ్చి లేపి పాలు ఇస్తే తాగుతారు. ఇటువంటి దయనీయమైన బతుకు ఆ స్త్రీలది. పెళ్ళి చేసుకోడానికి ఆమె ఇల్లిల్లూ తిరిగి మందులు అమ్మగలదా ? పందులు పెంచగలుగుతుందా? భిక్షాటన చెయ్యగలదా అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆడపిల్లకు రజస్వల కాకముందే పెళ్లి చేసి తర్వాత కాపురానికి పంపుతారు. వారిలో ‘ఓలి’ ఆచారం ఉంది. వివాహానికి ముందు అమ్మాయికి వరుడి తల్లిదండ్రులు ఆరు రూపాయల ఓలి ఇచ్చి తమ మనిషి అనిపించుకుంటారు. ఓలి ఇచ్చి పసుపు, కుంకుమ పెట్టడాన్ని ‘పతాణమ్’ (ప్రదానం)అంటారు. ఆ తర్వాత పెళ్లి సమయంలో వరుడు ఆమె తల్లిదండ్రులకు పన్నెండు వందల రూపాయలు ఇచ్చి ఆమెని కొనుక్కుంటాడు. స్త్రీకి స్వేచ్చ తక్కువే. వారి కుల పంచాయితీ కూడా పురుష ప్రధానంగానే ఉంటుంది. స్త్రీలు తప్పు చేస్తే ఒక శిక్ష, పురుషులు చేస్తే మరొక శిక్ష అమలుచేస్తారు. ఇతర పురుషులతో స్నేహం చేసినా, వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నా ఆ స్త్రీని కుల బహిష్కరణకు గురిచేస్తారు, లేదా ఆమె చేతులు సలసల కాగిన నూనెలో పెట్టిస్తారు. పురుషుడు మాత్రం బహు భార్యలను కలిగి ఉండొచ్చు. ఓలి ఆచారం మాత్రుస్వామ్యాన్ని సూచిస్తున్నప్పటికీ మందుల వారి స్త్రీకి వారి కుటుంబాలలో నిర్ణయాధికారం ఉండదు. బహుశా, ఈ రకమైన పురుషాధిపత్యాన్ని రాను రాను వారు ఇతరుల నుంచి అలవరుచుకుని ఉంటారు.
మందులవారి మతాచారాలు హిందూ ఆచారాలవలే ఉంటాయి. అయితే బ్రాహ్మణేతర సంప్రదాయంలో వలే వారి కులదైవాలు స్త్రీలే. సుబ్బమ్మ తల్లి, వెంకమ్మ తల్లి, సత్తెమ్మ తల్లి, పెద్దింటమ్మ తల్లి అనే దేవతలను వీరు పూజిస్తారు, వారికి జాతరలు చేస్తారు. ప్రతి వేసవి కాలంలో మూడు రోజులపాటు బంధువులను పిలిచి పందులను కోసి, కల్లు, సారాతో విందు చేస్తారు. స్త్రీ, పురుషులిద్దరూ మద్యం సేవిస్తారు. అయితే క్రమంగా వారిలో కొందరు క్రైస్తవ మతం పుచ్చుకున్నాక అటువంటి జాతరలు, మందు తాగడం, మూడనమ్మకాలు వదిలేశారు.
మందులవారి పెళ్లి తంతు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి మూడు రోజులపాటు వధువు ఇంటివద్ద ఆమె ఊరిలో చేస్తారు. మూడు రోజులూ రోజుకొక పందిని కోసి విందు చేస్తారు, అయితే ఆ కోసే పందిని వరుడు స్వయంగా గునపంతో పొడిచి చంపవల్సి ఉంటుంది. ఆ తర్వాతే దాన్ని కత్తులతో కోస్తారు. పెళ్లి సందర్భంగా జరిగే వేడుకలలో భాగంగా వారు రెండువైపులవారు ఒక తాడును చెరో వైపు నుంచి లాగుతారు. ఆ తాడుని ‘వోలివి’ తాడు అంటారు. అలాగే ఈతాకుల చాపని కూడా చెరొక పక్క నుంచి లాక్కుంటారు.
స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు పత్యం భోజనంలో ఉడుము, తాబేలు, బావురుపిల్లి, నక్క మాంసం మాత్రమే పెడతారు. ప్రసవం అయ్యాక కాకి మాంసంతో పత్యం భోజనం పెట్టి నాటుసారా తాగిస్తారు. బిడ్డ పుట్టినప్పుడు కూడా మందులవారి ఆచారాలు ఇతరులకంటే భిన్నంగా ఉంటాయి. కానుపుకి స్త్రీని పుట్టింటికి పంపకుండా అత్తగారింటి వద్దే జరుపుతారు. ప్రసవం అయ్యాక పదకొండు రోజులకు స్నానం చేయించి మొగపిల్లాడు పుడితే మగ కుక్కని, ఆడపిల్ల పుడితే ఆడకుక్కని తీసుకొచ్చి వాటికి భోజనం పెట్టి, పసుపు రాసి వాటి మెడలో వేపాకు దండలు వేసి, సాంబ్రాణి వేసి వేడుక చేస్తారు. ప్రసవించిన స్త్రీకి చెవిలో దూది పెట్టడం, నడుముకి గుడ్డ కట్టడం వంటివి చెయ్యరు. ప్రసవం తర్వాత నాలుగో రోజు నుంచి ఆమె జీవనోపాధి కోసం బైట పనులకు వెళ్ళాల్సిందే. ఇటీవలి కాలం వరకూ ప్రసవం అనేది మంత్రసానులే చేస్తారు, మంత్రసానులు అదే కులంలో లేకపోతే ఎరుకల కులం వారిలో ఉండే మంత్రసానులను ఆశ్రయిస్తారు. అలాగే వారు చావు సందర్భంగా జరిపే తతంగం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వారికి అంత్యక్రియల్లో జంగమయ్య శంఖం ఊది, గంట మోగించి పౌరోహిత్యం చేస్తాడు. లోతైన సొరంగం తవ్వి శవాన్ని అందులో కూర్చోబెట్టి పూడుస్తారు. పదకొండవ రోజు దినం చేస్తారు. ఆ సందర్చంగా చనిపోయిన వ్యక్తి స్త్రీ అయితే ఆడ మేకను, పురుషుడైతే మేక పోతునూ బలి ఇస్తారు. ఆ మేకపోతుకి బలి ఇచ్చే ముందు దానికి చనిపోయినవారి సంతానం దాని నోట్లో సారా పోసి ‘మే’ అని అరిచేదాకా సాంబ్రాణి పొగ వేసి వారికి మేనమామ లేక బావ వరసయ్యేవారు ఆ మేకను కత్తితో నరుకుతారు. బలి ఇచ్చిన మేక చెవులను ఉడికించి దాచి పెట్టి ఉంచి మూడో రోజు సద్ది గంజి నీరులో మేక చెవుల ముక్కలు, అరటి పండు ముక్కలు కలిపి ముంచి కుటుంబ సభ్యులు నోట్లో వేసుకుని మూడుసార్లు ఊస్తారు. ఆ ముక్కలు, గంజి ఎగిరి దూరంగా పడితే వాటిని ఇతరులు తింటారు. దీనితో చనిపోయినవారి ఋణం తీరిపోతుందని నమ్ముతారు. మేకలో చనిపోయినవారి ఆత్మ ఉంటుందని నమ్మే వీరు వారి సంతానంలో ఎవరు సాంబ్రాణి వేస్తే మేక అరుస్తుందో వారిమీద చనిపోయిన వ్యక్తికి ఎక్కువ ప్రేమ ఉందని భావిస్తారు. అలాగే కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు జగిగే కర్మ రోజు యుక్త వయసులో ఉన్న స్త్రీలు తప్ప మిగిలిన వారందరూ గుండు చేయించుకోవల్సిందే, లేకపోతే వారింట్లో కీడు, అంటు అలాగే ఉంటాయని నమ్ముతారు. కర్మ రోజు జంగమయ్య చేత బుర్రకధ చెప్పిస్తారు. మందుల వాళ్ళు శకునం, సోది అనేవాటి మీద ఎక్కువగా ఆధారపడతారు. శకునం చెప్పించుకోడానికి వీరు ఎరుకల వారి దగ్గరకు వెళ్లి చెప్పించుకుంటారు.
మందుల కులం వారికి తమదైన లిపిలేని భాష ఉంది. సంచార జీవనం వలన అది వివిధ భాషల సముదాయం వలే వుంటుంది. వారి భాషలో ‘పరదేశి’ అంటే తమ కులానికి చెందినవారని, అబ్బాయిని ‘పింగాడు’, అమ్మాయిని ‘పింకి’, డబ్బుని ‘కంచిగాడు, ‘డుక్కులు’, అన్నాన్ని ‘సోరి’, పెద్ద ఆడమనిషిని ‘మొసికోటి’ అని, పెద్దాయన్ని ‘మొంకోడు’ అని, కుక్కని ’కైక’ అని, పందిని ‘మండిగం’అని, అమ్మని ‘అమ్మ’, నాన్నని ‘అబ్బ’ అంటారు. పెండ్ర, వాడపల్లి, ఆసనాల, సేరాపు, చుండూరి, గూడేల్ల, చప్పిడి, అమర్త మొదలైనవి మందులవారి ఇంటిపేర్లు. వీరు ఎక్కువగా కుక్కల్ని పెంచుతారు ప్రతి ఇంటికి ఒక కుక్కైనా ఉంటుంది. కుక్కని వేటలో సాయంగా తీసుకెళతారు. అలాగే గాడిదలను, పందులను పెంచుతారు. గాడిదలను ప్రయాణ సాధనంగా వస్తువులను మోయ్యడానికి ఉపయోస్తారు. సంచార జీవనంలో గాడిద పాత్ర ఎక్కువ. వారి వద్ద కత్తులు, బరిసెలు, వలలు ఉంటాయి. వారి జీవనంలో నాదస్వరం బూర ప్రధానమైనది. దానిని అడుక్కోవడం నుంచి చాలా సందర్భాలలో ఊదుతారు.
మందులవారు జీవనోపాధిని వెదుక్కుంటూ తరచూ ఒకచోట నుంచి మరొక చోటకు మారుతూ గ్రామాల్లో ఇతర కులాలకు దూరంగా జీవిస్తారు. అందువల్ల వారిని ఇతరులు తమలో భాగం అనుకోరు, వస్తువులు అమ్ముకోడానికి, అడుక్కోడానికి వెళ్తే తప్ప వారు ఇతరులతో కలిసే సందర్భం ఉండదు. వారికి రేపటి గురించిన బెంగ ఉండదు. స్త్రీలు కష్ట జీవులు, ఎక్కువగా కుటుంబ భారాన్ని స్త్రీలే వహిస్తారు. అయితే ఇతర సంచార జాతులైన గంగిరెద్దుల వారిని, పరిక ముగ్గులవారినీ, మొండి బండోల్లని ‘అన్న’, ‘అక్క’ అని సాదరం గా పిలుస్తారు. వారిని తమ వారని భావిస్తారు. తెలియక కొంత మూఢ నమ్మకాలు జతచేసినప్పటికీ ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో లేనప్పుడు ప్రకృతిలో దొరికే జంతు, వృక్ష పదార్ధాలతో వీరు తయారుచేసిన మందులు చాలావరకు ప్రజల్ని రోగాల బారినుంచి కాపాడాయి అనవచ్చు. ఆధునిక వైద్య విధానంతో వారి మందులకు విలువలేక వారి జీవనోపాధికి దెబ్బతగిలి వారు ఇతర సంచార జాతులవలె పందుల పెంపకం, చిల్లర వ్యాపారాలు, ఎలుకలు పట్టడం, యాచించడం వంటి సమాజంలో గౌరవం లేని వృత్తులు చెయ్యవలసి వచ్చింది. అయినప్పటికీ వారు దొంగతనాలకు పాల్పడడం, నేర స్వభావాన్ని అలవరచుకోవడం వంటివి చెయ్యకపోవడం గమనార్హం. సమాజంలో మనుషుల రోగాలకు మందులే ఇచ్చారు గానీ మందుల వారు ఎవరినీ మాయబుచ్చి మోసం చెయ్యలేదు.
*ఈ వ్యాసానికి అవసరమైన సమాచారాన్ని అందించిన సంచార జాతుల ఉద్యమకారుడు, మందుల కులస్తుడు పెండ్ర వీరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు
Excellent
Manchi parichayam
Thank you Sir
very interesting information. thank you mam
Thank you Sir
కొత్త విషయాలు తెలిపారు, ధన్యవాదాలు.
రాజేశ్వరి.
Thank you Madam
సమాజానికి వెలుపల ఉన్న ఈ సంచార తెగ గురించి చాలా విషయాలు చెప్పారు. మంచి పరిచయం…
Thank you
Thanq swaroopaji
Gd evng medam it is good information ma
Thank you sir