మాయాపులి

క ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆయన చాలా మంచోడే కానీ పెద్ద మూర్ఖుడు. ముక్కు మీద కోపం ఉండేది. కోపం వచ్చిందంటే చాలు ముందూ వెనకా చూడడు. ఎవ్వరి మాటా వినడు. అస్సలు ఆలోచించడు. ఆయన ముందు నిలబడి సర్ది చెప్పే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు.

ఒకసారి పక్క ఊరి రాజు ఆ రాజ్యం మీదికి దండెత్తి వచ్చాడు. ప్రజలందరూ ప్రాణభయంతో పారిపోసాగారు. ఇలాగే చూస్తూవుంటే లాభం లేదనుకొని రాజే స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం చాలా భయంకరంగా జరగసాగింది. రాజు భార్య చాలా భయపడిపోయింది. తన భర్తకు ఏమీ కాకూడదని చెప్పి అమ్మవారి ముందు నిలబడి “తల్లీ… నువ్వే చల్లగా చూడాల” అంటూ పూజలో మునిగిపోయింది. అన్నం ముట్టలేదు. నీళ్లు తాగలేదు. మూడు రోజులు ఏకధాటిగా కంటిమీద రెప్ప వేయకుండా అలాగే ఉండిపోయింది. ఇక్కడ యుద్ధం భయంకరంగా సాగుతూనే ఉంది. చివరికి మూడవరోజు ఆ పక్క ఊరి రాజు ఓడిపోయి పారిపోయాడు.

ఆ విషయం తెలిసి రాజు భార్య ఉపవాసం చాలించి సంతోషంగా ఓ రెండు పళ్ళు తిని, కడుపునిండా నీళ్లు తాగింది. నిద్రను ఆపుకోలేక అక్కడికక్కడే అలాగే నేలమీద పడి నిద్రపోయింది. రాజు సంబరంగా విషయం చెబుదామని రాణి దగ్గరికి వచ్చాడు. వచ్చి చూస్తే ఇంకేముంది రాణి హాయిగా నిద్రపోతా ఉంది. అది చూస్తూనే రాజుకు ఎక్కడ లేని కోపం ముంచుకు వచ్చింది. జరిగిన విషయం తెలుసుకోకుండా “నేనింత కష్టపడి శత్రువుని ఓడించి వస్తే… ఎదురొచ్చి వీర తిలకం దిద్ది, పూలహారంతో స్వాగతం పలకకుండా, హాయిగా గురకలు కొడతా నిద్రపోతుంది కదా” అనుకున్నాడు.

అంతే… అతని కళ్ళు ఎర్రబడ్డాయి. నుదురు ముడిపడింది. కోపంతో బుసలుకొట్టాడు. సైన్యాధిపతిని పిలిచి “మొగుడంటే ప్రేమ లేని ఈ పాపిని తీసుకుపోయి ఏడు దేశాల అవతల వున్న అడవిలో వదిలిరండి. రేపు సూర్యోదయం లోపల ఇది జరిగి తీరాలి. ఎదురు చెప్పినా, ఎందుకని అడిగినా, చెప్పిన పని చేయకున్నా మీ మెడ మీద తలకాయ ఉండదు. జాగ్రత్త” అని హెచ్చరించాడు.

రాజు కోపం సంగతి వాళ్లకు తెలుసు కదా… దాంతో వెంటనే పడుకున్నదాన్ని పడుకున్నట్టే అలాగే తీసుకుపోయి రథంలో పెట్టుకొని వాయువేగాలతో దూసుకుపోయారు. ఆమె నిద్రలేచేసరికి అడవుల్లో ఉంది. సైన్యాధికారి జరిగిందంతా చెప్పి “అమ్మా… రాజు ఆజ్ఞ. నేను ఏమీ చేయలేను. నన్ను మన్నించు” అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

పాపం ఆమెకు అప్పటికి ఆరో నెల. ఆ అడవుల్లో ఏడుస్తూ తిరుగుతూ వుంటే ఒక ముని చూశాడు. ఆయనకు పిల్లలు లేరు. దాంతో ఆమెనే తన కూతురిగా భావించి ఆశ్రమానికి తీసుకుపోయాడు. కాలు కింద పెట్టనీయకుండా కన్నతండ్రిలా అపురూపంగా చూసుకోసాగాడు. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లోడిని చూసి అందరూ “అబ్బ… ఎంత ముచ్చటగా ఉన్నాడు. ఎర్రని దానిమ్మ గింజ లెక్క” అని సంబరపడ్డారు. ఆ పిల్లోనికి చిన్నప్పటినుంచి చదువు సందెలు నేర్పించడంతోపాటు, యుద్ధ విద్యలు కూడా నేర్పించారు. ఎగిరే పక్షినైనా, ఈదే చేపనైనా ఒకే ఒక్క దెబ్బతో కొట్టగలడు. ఎదురుగా ఏనుగు వచ్చినా సింహం వచ్చినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎదిరించి నిలబడగలడు.

ఒకసారి ఆ అడవిలోకి ఒక భయంకరమైన సింహం వచ్చింది. ఆశ్రమం దగ్గర ఆడుకుంటున్న ఒక పిల్లవాని మీద దాడి చేసింది. అది చూసిన యువకుడు అదిరిపడ్డాడు. ఆయుధం అందుకునేంత సమయం కూడా లేదు. ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఆ పిల్లవాని ప్రాణం దక్కదు. దాంతో ఏమాత్రం భయపడకుండా ఉత్త చేతులతోనే ఎగిరి దాని మీదకు దుంకాడు. దాని పదునైన కోరలకు, వాడి అయిన పంజాకు చిక్కకుండా మెరుపులా కదులుతూ పిడిగుద్దులు కురిపించాడు. కొడితే చెక్క ముక్కలు కూడా విరిగిపడే వాని దెబ్బలకు సింహం తట్టుకోలేక కిందపడిపోయింది. వెంటనే దాని మెడను దొరికించుకొని ఉడుంపట్టు పట్టాడు. ఆ పట్టు విడిపించుకోలేక సింహం గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచింది.

కొడుకు వీరత్వం చూసి తల్లి పొంగిపోయింది. “నీలాంటివాడు ఒక్కడుంటే చాలు అడవినే కాదు ఏకంగా ఈ దేశాన్నే గెలవవచ్చు. ఈ లోకంలో చాలామందికి బలం ఉంటే తెలివి ఉండదు. తెలివి ఉంటే బలం ఉండదు. కానీ నీకు ఏనుగులాంటి బలం, నక్క లాంటి తెలివి ఉన్నాయి. నిన్ను కొట్టేవాడు ఎవడూ లేడు” అని మెచ్చుకుంది.

ఇదే సమయం అనుకున్న కొడుకు “అమ్మా… ఎప్పుడు అడిగినా ఇది సమయం కాదంటూ నాన్న గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు మా నాన్న ఎవరు? మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం?” అన్నాడు. అప్పుడు ఆమె “కొడుకుకి చెప్పాల్సిన సమయం, అర్థం చేసుకునే వయసు వచ్చాయి” అనుకొని జరిగిందంతా నెమ్మదిగా పూసగుచ్చినట్టు వివరించింది.

అంతా విన్న ఆ యువకుడు “అమ్మా… నేను ఇప్పుడే నాయన దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి మరలా మీ ఇద్దరినీ ఒకటి చేస్తాను. సింహాసనంపై నిన్ను రాజమాతగా కూర్చోబెడతాను” అన్నాడు. దానికి ఆమె “వద్దు నాయనా… మీ నాయన గురించి నీకు తెలియదు. మహా మొండి. కోపిష్టి. ఎవరి మాట వినడు. పొరపాటున నిన్ను ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను” అంది. కానీ ఆ యువకుడు వెనక్కు తగ్గలేదు. “అమ్మా… నా గురించి దిగులు పడొద్దు. నా బలం మీద, తెలివితేటల మీద నమ్మకం ఉంచు. ప్రయత్నిస్తే పోయేదేం లేదు కదా” అంటూ అమ్మ దగ్గర అనుమతి తీసుకుని, సింహం తోలు తీసుకొని రాజుకు దానిని బహుమానంగా ఇవ్వడానికి బయలుదేరాడు. కొండలు దాటుతూ, నదులు దాటుతూ, రాజ్యాలు దాటుతూ… చివరికి వాళ్ళ నాన్న ఉన్న రాజ్యానికి చేరుకున్నాడు.

“సింహం చర్మం రాజుకు బహుమతిగా తెచ్చాను” అని చెప్పడంతో భటులు “ఇతను ఎవరో పెద్ద వీరుడే ఉన్నట్టున్నాడు” అనుకుని రాజు ముందు ప్రవేశపెట్టి విషయం చెప్పారు. రాజు ఆ యువకున్ని ఆశ్చర్యంగా చూస్తూ “నిన్ను చూస్తే చిన్నపిల్లోని మాదిరి ఉన్నావు. మూతి మీద మీసాలు కూడా ఇంకా సరిగ్గా రాలేదు. అలాంటిది నువ్వు ఇంత పెద్ద సింహాన్ని ఉత్త చేతులతో చంపావా” అన్నాడు ఆశ్చర్యంగా.

“నిజం మహారాజా… చేతిలో ఆయుధం పట్టుకోకుండానే దీనిని పరలోకం పంపించాను. ఈ చర్మాన్ని మీకు బహుమానంగా ఇచ్చి మా నాన్నను ఒకసారి చూసి పోదామని వచ్చాను” అన్నాడు.

“మీ నాన్ననా… ఎవరు? ఎక్కడుంటాడు? ఏమి చేస్తాడు?” అన్నాడు రాజు ఆసక్తిగా.

అప్పుడు ఆ యువకుడు “మహారాజా మీరే నాకు తండ్రి. మిమ్మల్ని చూడడానికే వచ్చాను. మీరు ఒప్పుకుంటే పోయి అమ్మని తెస్తాను” అంటూ అమ్మ ఎక్కడుందో చెప్పాడు.

కానీ రాజుకు ఆ యువకున్ని చూస్తావుంటే అదంతా నమ్మబుద్ధి కాలేదు. “వీడెవడో పెద్ద మాయగానిలా వున్నాడు. నన్ను మోసం చేసి నా రాజ్యాన్ని కొట్టేయాలి అనుకుంటూ ఉన్నాడు. ఎట్లాగైనా సరే వీని పీడ తొలగించుకోవాలి” అనుకొని “చూడు నాయనా… నువ్వు నిజంగా నా కుమారునివే అయితే, ఉత్త చేతులతో సింహాన్ని చంపిన వీరునివే అయితే, ఒక పని చెయ్. అప్పుడు నా కుమారునిగా స్వీకరిస్తా. ఇక్కడికి కుడివైపు ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక మాయాపులి వుంది. అది కంటికి కనిపించదు. ఎవరిని ఎప్పుడు చంపుతాదో తెలియదు. నీకు చేతనైతే దానిని చంపి తీసుకురా” అన్నాడు.

“సరే” అని ఆ యువకుడు ఆ భయంకరమైన అడవిలోకి అడుగుపెట్టాడు. ప్రతి చెట్టును, పుట్టను వెతికాడు. కనిపించిన వాళ్ళనందరిని అడిగాడు. కానీ ఎవరూ ఆ పులి ఎక్కడుందో చెప్పలేకపోయారు. చివరికి ఒక కట్టెలు కొట్టుకునే ముసలాయన “ఇక్కడికి పద్నాలుగు యోజనాల దూరంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఒక ముని ఆశ్రమం ఉంది. ఈ అడవిలో ఆయనకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. ఆయనకు చానా మహిమలు కూడా ఉన్నాయి. వెళ్లి వెంటనే కలువు” అంటూ ఎట్లా పోవాలో దారి చెప్పాడు. ఆ యువకుడు అలాగే వెతుక్కుంటా ముని ఆశ్రమానికి చేరుకున్నాడు.

ముని ఆ యువకున్ని చూడగానే ఒక్క మాటా మాట్లాడకుండా పక్కనే వున్న కట్టె తీసుకొని పశువును కొట్టినట్టు కొట్టసాగాడు. ముని ఎంత కొడతా వున్నా నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడలేదు. కోపంతో అక్కడినుంచి వెళ్లిపోనూ లేదు. మౌనంగా తలవంచి దెబ్బలు తినసాగాడు. కొట్టి… కొట్టి… అలసిపోయిన ముని కట్టె అవతలకు పారేసి “బాబూ ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు?” అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు జరిగిందంతా చెప్పి “స్వామీ… ఎలాగైనా సరే ఆ పులి ఎక్కడుందో చెప్పండి. దానిని పట్టుకోవాలి” అన్నాడు. దానికి ఆ ముని చిరునవ్వుతో “ఇంతవరకు ఆ పులిని చూసి ప్రాణాలతో బయటపడిన వారు ఎవరూ లేరు. కానీ నీవు సాధించగలవు. నీకున్న ఓర్పు చానా గొప్పది. అన్ని దెబ్బలు కొట్టినా పెదవులపై చిరునవ్వు చెక్కుచెదరకుండా, ఎదురు మాట్లాడకుండా నిలబడగలిగావు” అంటూ ఒక బంగారు బెత్తం వాని చేతిలో పెట్టి “ఇది మామూలు బెత్తం కాదు. ఒక్కొ దెబ్బ కొడితే చాలు వంద కొరడా దెబ్బలు కొట్టినట్లు వుంటుంది. భయంతో వణికిపోతారు” అంటూ ఆ పులిని ఎలా లొంగదీసుకోవాలో వివరించాడు. అంతేగాక పక్షి భాషను కూడా నేర్పించాడు.

ఆ యువకుడు ముని చెప్పిన దారిలో మూడు పగల్లు మూడు రాత్రులు ప్రయాణించాడు. చివరికి చందనపు చెట్లతో నిండిన ఒక పెద్ద తోట కనపడింది. ఆ తోట మధ్యలో ఒక చెరువు ఉంది. నీళ్లు అద్దంలా స్వచ్ఛంగా తలతలా మెరిసిపోతా ఉన్నాయి. ఆ చెరువు పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కి కొమ్మల మధ్యన దాచిపెట్టుకున్నాడు. మాయాపులి కోసం ఎదురుచూడసాగాడు. సాయంకాలం అవుతావుంది. అంతలో చెట్ల మీద పక్షులు ఒక్కసారిగా అటూయిటూ కిలకిలమంటూ బెదురుబెదురుగా ఎగరసాగాయి. చిన్న చిన్న జంతువులు పరుగులు తీయసాగాయి. ఆ యువకుడు అప్రమత్తమయ్యాడు. అంతలో ఒక పులి… ఏనుగంత పెద్దగా ఉంది. కోరలు పిడిబాకుల్లా కొశ్శగా ఉన్నాయి. ఒంటిమీద బంగారు రంగు చారలు తలతలా మెరుస్తా వున్నాయి. హుందాగా, గంభీరంగా, భయంకరంగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడికి వచ్చి చెరువులో నీళ్లు తాగసాగింది.

అంత పెద్ద పులిని చూడగానే ఎవరికైనా సరే పైప్రాణాలు పైనే పోతాయి. కానీ ఆ యువకుడు భయపడితేనా… ఉత్త చేతులతో సింహాన్ని చంపిన మొనగాడు కదా వాడు. చేతిలో బంగారు బెత్తం పట్టుకొని చెట్టు మీద నుంచి ఎగిరి ఒక్కసారిగా దాని మీదకు దుంకాడు. పులి అదిరిపోయింది. వాన్ని కింద పారేయాలి అని చూసింది. కానీ ఎంత ప్రయత్నించినా వాడు దాని పంజా దెబ్బకు చిక్కలేదు. చేతిలోని బంగారు బెత్తం తీసుకొని పులిని కొట్టిన చోట కొట్టకుండా టపటపటప నాలుగు పీకాడు. అంతే ఆ దెబ్బలకు పులి అదిరిపోయింది. ఒక్కొక్క దెబ్బ పడతా ఉంటే ఒకేసారి వంద కొరడాలతో ఈడ్చి కొట్టినట్లు అనిపించసాగింది. దాంతో భయంతో వణికిపోతూ “ఓ మహావీరా… నా ప్రాణాలు కాపాడు. ఈరోజు నుంచి నేను నీకు బానిసను. నీవు బెత్తం గాలిలో ఆడించిన మరుక్షణం ఎక్కడున్నా సరే నీ ముందు ప్రత్యక్షమవుతా. నా మాట నమ్ము. నేను పుట్టిన తల్లిదండ్రుల మీద ఒట్టు” అంది. దాంతో యువకుడు సరేనని దాన్ని వదిలిపెట్టాడు.

తిరిగి మరలా రాజు దగ్గరికి వచ్చి “రాజా… నీవు చెప్పినట్టే ఆ మాయాపులిని పట్టుకున్నాను” అన్నాడు. ఉత్త చేతులతో వచ్చిన వాడిని చూసి రాజు ఎగతాళిగా నవ్వుతూ “అలాగా… ఏదీ ఆ పులి. నిజంగా పట్టుకున్నావా లేక కలగన్నావా” అన్నాడు. దానికి యువకుడు “మహారాజా… చంపి కాదు.  ఏకంగా లొంగదీసుకుని వచ్చాను. చూడండి” అంటూ ఆ బంగారు బెత్తం గాల్లో ఆడించాడు. అంతే సభ మధ్యలో ఆ మాయాపులి గాండ్రుమంటూ ప్రత్యక్షమైంది. ఏనుగంత పెద్దగా భయంకరంగా వున్న ఆ పులిని చూడగానే సభలో అందరూ వణికిపోయారు. ఎందుకైనా మంచిదని ఎక్కడివాళ్ళు అక్కడ పారిపోవడానికి సిద్ధమయ్యారు.

రాజుకు నుదుటిమీద చెమటలు పట్టాయి. వణుకుతున్న గొంతుతో “నిజమే నువ్వు వీరునివే… నా కుమారునివే… ఒప్పుకుంటాను. ముందు దీన్ని ఇక్కడి నుంచి పంపించేయి” అన్నాడు భయంగా. ఆ యువకుడు బెత్తం గాల్లో ఆడించగానే అది అక్కడి నుంచి మాయమైంది. రాజు కాసేపు ఆలోచించి ఎలాగైనా సరే ఆ యువకుని బారినుంచి తప్పించుకోవాలని “ఓ వీరుడా… ఉత్తరం వైపు ఉన్న అడవిలో ఒక రాక్షసుడున్నాడు. వానికో అందమైన కూతురు ఉంది. అలాంటి అందగత్తె ఏడేడు పద్నాలుగు లోకాల్లోనూ ఎక్కడా ఉండదు. నువ్వు ఎలాగైనా సరే ఆ రాక్షసున్ని చంపి ఆ పాపను నా కోడలుగా తీసుకురా. ఆ పాప పొరపాటున రాక్షస వంశంలో పుట్టింది కానీ అన్నీ దేవతల బుద్ధులే. తండ్రి చేస్తున్న తప్పుల్ని ఎదిరించడంతో ఆమెను బందీ చేశాడు” అని చెప్పాడు.

‘సరే’ అని ఆ యువకుడు ఆ రాక్షసుని కోసం బయలుదేరాడు. అలా అడవిలో వెతుకుతూ పోతూవుంటే ఒక పెద్ద చెరువు అడ్డం వచ్చింది. అప్పుడే అక్కడికి ఒక ఆరడుగుల స్త్రీ వచ్చింది. ఆమె చెరువులోని నీటిని నోటితో సరసర పీల్చడం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఐదు నిమిషాల్లో సగం చెరువు తాగేసింది. అది చూసి ఆ యువకుడు ఆశ్చర్యపోయి ఆమె దగ్గరికి పోయి “అమ్మా… నీవెవరో గానీ ఐదు నిమిషాల్లో సగం చెరువు ఖాళీ చేశావు. నీ అంత గొప్పదాన్ని ఈ భూమ్మీద ఎప్పుడూ ఎక్కడా చూడలేదు” అన్నాడు. దానికామె “నేనేం గొప్ప. ఈ మధ్యన ఒక యువకుడు ఎవరికీ లొంగని మహా భయంకరమైన మాయాపులినే లొంగదీసుకుని ఆటాడిస్తున్నాడంట. గొప్పతనం అంటే అతనిదే కానీ నాది కాదు” అంది.

ఆ మాటలకు ఆ యువకుడు చిరునవ్వు నవ్వి “తల్లీ… ఆ వీరుడు ఎవరో కాదు. నేనే” అన్నాడు.

ఆమె వాన్ని కిందికీ మీదికీ చూస్తూ “నీ ఆకారం చూస్తావుంటే నీ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగా నువ్వే అయితే మాయాపులిని చూపించు. జీవితాంతం నీకు దాసిగా ఉంటూ నువ్వు ఏం చెబితే అది చేస్తా’ అంది. యువకుడు బంగారు బెత్తం తీసి గాల్లో అటూ ఇటూ ఆడించాడు. అంతే మరుక్షణంలో మాయాపులి భయంకరంగా గర్జిస్తూ అక్కడ ప్రత్యక్షమై ఆమె మీదికి పోబోయింది. అది చూసి ఆమె వణికిపోతూ “ఓ వీరుడా… పొరపాటయింది. మాట జారింటే మన్నించు. ఈరోజు నుంచీ నేను నీ దాసురాలిని. నన్ను వదిలేయ్” అంది. దాంతో వాడు ఆ మాయాపులిని మాయం చేశాడు.

ఆ తరువాత ఇద్దరూ కలసి ఆ రాక్షసున్ని వెతుకుతా బయలుదేరారు. అట్లా పోతావుంటే వాళ్లకు దారిలో ఒక మహాకాయడు కనిపించాడు. రెండు భుజాలపై రెండు కొండల్ని మోసుకుని పోతూ ఉన్నాడు. ఆ యువకుడు ఆ మహాకాయున్ని చూసి “ఓ వీరుడా… నీవెవరో గానీ ఒకేసారి రెండు కొండల్ని అవలీలగా ఎత్తుకొని పోతావున్నావు. నీ అంత బలవంతున్ని ఈ లోకంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదు” అన్నాడు. దానికి ఆ మహాకాయడు “నేనేం గొప్ప. ఈ మధ్యన ఒక యువకుడు ఎవరికీ లొంగని మాయాపులినే అవలీలగా లొంగదీసుకొని ఆటాడిస్తున్నాడంట. గొప్పతనం అంటే అతనిదే కానీ నాది కాదు” అన్నాడు. దానికా యువకుడు చిరునవ్వు నవ్వి “ఆ వీరుడు ఎవరో కాదు. నేనే” అన్నాడు.

“నువ్వా చూస్తే చిన్నపిల్లోని మాదిరి ఉన్నావ్. మాటలేమో కోటలు దాటుతున్నాయి. నిజంగా నువ్వే అని నిరూపిస్తే నువ్వేం చేయమంటే అది చేస్తా” అన్నాడు. ఆ యువకుడు చిరునవ్వు నవ్వి “ఆకారాన్ని చూసి అంచనా వేయకూడదు మిత్రమా” అంటూ బంగారు బెత్తం తీసి గాల్లో ఆడించాడు. అంతే భయంకరంగా గర్జిస్తూ మాయాపులి ప్రత్యక్షమై ఎగిరి ఆ మహాకాయుని మీదికి దుంకింది. అంతే అతడు భయంతో వణికిపోతూ “ఓ వీరుడా… నీ గురించి తక్కువగా అంచనా వేశా. మాట జారింటే మన్నించి నన్ను కాపాడు. జీవితాంతం నీకు సేవకునిగా ఉంటా” అన్నాడు. ఆ యువకుడు చిరునవ్వుతో దాన్ని మరలా మాయం చేశాడు.

ముగ్గురూ కలసి ఆ రాక్షసున్ని వెతుకుతా బయలుదేరారు. అలా పోతావుంటే వాళ్లకి ఒక ధనస్సు చేత పట్టుకున్న వీరుడు కనిపించాడు. అతడు వేగంగా బాణం మీద బాణం వేస్తూ ఆకాశంలో వరుసగా మెట్లు కడుతూ వాటి మీద ఎక్కి పైకి పోతూ కనిపించాడు. అది చూసి ఆ యువకుడు “ఆహా ఏమీ ఈ అద్భుతం. బాణాలతోనే ఆకాశంలో మెట్లు కట్టేస్తున్నావు. నీయంత వీరున్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు” అన్నాడు. దానికి ఆ బాణాలవీరుడు చిరునవ్వు నవ్వి “నాదేం గొప్ప. ఈ మధ్యనే ఒక యువకుడు అత్యంత భయంకరమైన మాయాపులినే అవలీలగా లొంగదీసుకొని ఆట ఆడిస్తున్నాడంట. గొప్పతనం అంటే అతనిదే కానీ నాది కాదు” అన్నాడు.

ఆ మాటలకు ఆ యువకుడు చిరునవ్వు నవ్వి “ఆ వీరున్ని నేనే” అన్నాడు. ఆ మాటలకు బాణాల వీరుడు యువకున్ని కిందికీ మీదికీ చూస్తూ “అబద్ధాలు ఆడితే అతికినట్లు ఉండాల. లొంగదీసుకోవడం సంగతి దేవునికెరుక. కనీసం పులినైనా ఎప్పుడన్నా చూశావా” అన్నాడు నవ్వుతూ.

యువకుడు మారుమాట్లాడకుండా బంగారుబెత్తం గాల్లో ఊపాడు. అంతే మరుక్షణంలో మాయాపులి అక్కడ గాండ్రిస్తూ ప్రత్యక్షమైంది. భయంకరంగా మీదికి వస్తావున్న దాన్ని చూడగానే ఆ బాణాల వీరుడు భయపడిపోయి “ఓ వీరుడా… ఏదో పొరపాటున నోరు జారాను. నన్ను మన్నించి కాపాడు. నీవు ఏది చెబితే అది మారు మాట్లాడకుండా చేస్తా” అన్నాడు. ఆ యువకుడు గాల్లో బెత్తం ఆడించగానే ఆ మాయాపులి మాయమైపోయింది.

మరలా నలుగురూ కలసి ఆ రాక్షసున్ని వెతుకుతా అడవిలో పోసాగారు. అట్లా వెతికీ వెతికీ చివరికి ఆ రాక్షసుడు వుండే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ అడవి మధ్యలో అద్భుతమైన ఏడు అంతస్తుల మేడ కనబడింది. దాని చుట్టూ ఏడు బొంగుల లోతైన ఒక పెద్ద కందకముంది. దాని నిండా నీళ్లు ఉన్నాయి. అందులో దిగి ఈత కొట్టుకుంటూ కోట దగ్గరికి చేరడం చాలా కష్టం. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ వుంటే వాళ్లతో పాటు ఉన్న ఆరడుగుల స్త్రీ ముందుకు వచ్చి “నేనున్నానుగా… భయమెందుకు…” అంటూ ఆ కందకంలోని నీటిని దోసిలి పట్టి సర్రున పీల్చడం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఐదు నిమిషాల్లో చెరువులో ఒక్క చుక్క నీరు లేదు. దాంతో రాక్షసుని మేడ మీదికి పోవడానికి దారి ఏర్పడింది. “శభాష్ తల్లీ… సరైన సమయంలో సహాయం చేశావు” అంటూ ఆమెను మెచ్చుకొని సంబరంగా అందరితో కలసి మేడ వద్దకు బయలుదేరాడు.

మేడ మీది నుంచి రాక్షసుడు వీళ్లను చూశాడు. వీళ్ళు ఎవరో మామూలు అల్లాటప్పా వ్యక్తులు కాదనుకున్నాడు. వెంటనే పోయి పెద్ద పెద్ద బండరాళ్ళను తీసుకొని వచ్చి వాళ్ళమీదికి విసరసాగాడు. అది గమనించగానే పర్వతాల వీరుడు పరుగు పరుగున పోయి వాళ్ళ ముందు నిలబడ్డాడు. ఆ బండరాళ్ళను గాల్లోనే బంతులు పట్టుకున్నట్లు పట్టుకొని తిరిగి ఆ రాక్షసుని మీదకు అంతకన్నా వేగంగా విసరసాగాడు. రాక్షసుడు అదిరిపడి ఆకాశంలో అందనంత పైకి ఎగిరాడు. వెంటనే బాణాల వీరుడు ముందుకు వచ్చి బాణం మీద బాణం అత్యంత వేగంగా వేస్తూ ఆ రాక్షసుని వైపుకు ఆకాశంలో మెట్లు కట్టసాగాడు. వెంటనే ఆ యువకుడు ఆ మెట్లను ఎక్కుతూ రాక్షసుని వద్దకు దూసుకుపోయాడు. రాక్షసుడు కోపంతో గట్టిగా అరుస్తూ చేతిలోని గదను పైకి ఎత్తాడు. వెంటనే ఆ యువకుడు బంగారుబెత్తాన్ని బయటికి తీసి గాల్లో ఆడించాడు. అంతే మరుక్షణం మాయాపులి ప్రత్యక్షమైంది. ఆ యువకుడు సైగ చేయగానే ఎగిరి రాక్షసుని మీదకు దుంకింది. కన్నుమూసి తెరిచేలోగా వాని మెడ నోట కరుచుకుంది. అంతే వాడు గిలగిలా కొట్టుకుంటూ దాని నుంచి తప్పించుకోలేక అక్కడికక్కడే చచ్చిపోయాడు.

అప్పటికే బాగా చీకటి పడింది. ఆ రాత్రి సమయంలో మేడ లోపలికి పోవడం ప్రమాదకరం అనుకొని అందరూ బయటనే ఒక మర్రిచెట్టు కింద హాయిగా విశ్రాంతి తీసుకోసాగారు. కాసేపటికి ఆ యువకుడు తప్ప అందరూ అలసి నిద్రపోయారు. కొత్తచోటులో ఒళ్ళు తెలియకుండా పడుకోవడం ప్రమాదకరం కాబట్టి ఆ యువకుడు మాత్రం నడుం వాల్చినా నిద్రపోలేదు. అప్రమత్తంగా ఉన్నాడు. అర్థరాత్రి ఏదో అలికిడి వినిపించింది. చూస్తే చెట్ల పైన రెండు పక్షులు వచ్చి వాలాయి. ఆ యువకునికి పక్షి భాష వచ్చు కదా… దాంతో చప్పుడు చేయకుండా ‘అవి ఏం మాట్లాడుకుంటున్నాయా’ అని వినసాగాడు.

“మొత్తానికి రాక్షసుని పీడ విరగడయింది. కానీ ఈ యువకుడు మేడలోని రాక్షసుని కూతురిని ఎలా గుర్తుపడతాడో ఏమో” అంది మగ పక్షి.

“ఏం సమస్య” అడిగింది ఆడ పక్షి.
“లోపల వందమంది మాయా సుందరీమణులు అచ్చం రాక్షసుని కూతురి లాగే ఒకే రూపంలో ఉంటారు. వాళ్లలో రాక్షసుని కూతుర్ని తప్ప ఎవరిని తాకినా అక్కడికక్కడే రాయిగా మారిపోతారు. అదీ సమస్య” అంది మగ పక్షి .

“ఈ యువకుని సంగతి వదిలేయ్. నువ్వు గుర్తుపడతావా ఆ రాక్షసుని కూతురిని” ఆసక్తిగా అడిగింది ఆడ పక్షి.
“ఆ… చాలా సులభంగా. ఎందుకంటే ఆమె తలకు ధరించే పాపిడి బిళ్ళలో ఎర్రని రంగు రత్నం నక్షత్రంలా తలతలా మెరుస్తూ ఉంటుంది” అంది మగ పక్షి.

ఆ మాటలు వింటూ హాయిగా చిన్న కునుకు తీశాడు ఆ యువకుడు. తర్వాతరోజు పొద్దున్నే మిత్రులందరితో కలసి హుషారుగా ఏడంతస్తుల మేడలోకి అడుగు పెట్టాడు. అతనికి ఎదురుగా అనేకమంది సుందరీమణులు వచ్చారు. అందరూ ఆకాశం నుంచి దిగివచ్చిన దేవకన్యల్లా ఉన్నారు. వేసుకున్న బట్టలు గానీ, ధరించిన ఆభరణాలు గానీ కొంచెం కూడా తేడా లేవు. ఒకేసారి వందమంది కవల పిల్లలు కలసి పుట్టినట్లు అందరి ముక్కు ముఖం ఒకేలా ఉన్నాయి.

ఆ యువకుడు మిత్రులందరినీ ఆపాడు. “మీరెవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి. ఎవరినీ  తాకకండి. పొరపాటున తాకితే అక్కడికక్కడే శిలలుగా మారిపోతారు జాగ్రత్త” అని హెచ్చరించాడు. ఆ యువకుడు ఆ సుందరీమణులను అందరినీ గమనించాడు. ఒక చెట్టు కింద ఎర్రని నక్షత్రంలా మెరిసిపోతున్న రత్నాన్ని పాపిడి బిళ్ళలో ధరించిన స్త్రీ కనబడింది. వెంటనే బంగారు బెత్తాన్ని గాల్లో ఆడించాడు. అంతే… మరుక్షణంలో భయంకరంగా గాండ్రిస్తూ మాయాపులి అక్కడ ప్రత్యక్షమైంది. వెంటనే గుర్రంలాగా ఎగిరి దాని మీద కూర్చున్నాడు. ఛళ్ అంటూ అదిలించాడు. అంతే… ఆ పులి గాల్లో ఎగిరి రాజకుమారి ముందు ఆగింది. ఆ యువకుడు ఆమె చేయి పట్టుకోగానే అక్కడున్న రాక్షస స్త్రీలందరూ మాయమయ్యారు. యువకుడు ఆ రాక్షస కన్యను, మిగతా మిత్రులను మాయాపులి మీదకు ఎక్కించుకున్నాడు. అంతే… అరగంటలో వాళ్ళు రాజుముందు నిలిచారు.

రాజుకు వచ్చినవాడు సామాన్యుడు కాడని అర్థమైంది. దాంతో అతన్ని తన కొడుకుగా స్వీకరించాడు. వెంటనే యువకుడు పల్లకీ పంపించి రాచ మర్యాదలతో తన తల్లిని అంతఃపురానికి రప్పించాడు. ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్టుగా రాజుకు వివరించింది. కోపంతో, మూర్ఖపు పట్టుదలతో, ఏం జరిగిందో తెలుసుకోకుండా రాణిని అడవికి పంపించినందుకు మహారాజు చాలా బాధపడ్డాడు. తనను క్షమించమని కన్నీరు పెట్టుకున్నాడు. ఆ యువకున్ని తన కన్న కొడుకుగా అందరి ముందు ప్రకటించి యువరాజుగా సింహాసనం పై కూర్చోబెట్టాడు. రాక్షసకన్య అనుమతితో అంగరంగ వైభవంగా వాళ్ళకు వివాహం జరిపించాడు.

*

ఎం.హరి కిషన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భలే ఉంది. చిన్నప్పుడు చదివిన చందమామ, బాలమిత్ర కథలు గుర్తుకు తెచ్చారు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు