మాయవ్వ మాటల్లో బతుకు

నేను, చిన్నెమ్మి, మట్టెక్క, గులబది, సీరావులు, కడగోటోడు సిన్నోడు.. మేవందురం గలిసి మాయమ్మకి ఆరుగురం పిలకాయిలం. అంతమందిని యాడ సాకతారో? కూడు యాడద్యావోళ్లక్యా! సచ్చేది కూటికి.

అప్పుడు మాయబ్బ దగదర్తి ఊళ్లో మాలపాటి నాయుళ్లకాడా సేద్యానికుండేది. దినవంతా కూలి జేస్తే గిద్దడు వొడ్లు నాలి కింద దెచ్చేది. వొస్తావొస్తా కాలవ కట్ట కింద ఈతకల్లు తాగేది. ఆవాటాన దెంగి తాగి ఇంటికొచ్చి మాయమ్మతో యేజ్యం బెట్టుకొనేది.

మాయబ్బ ఆ దినాల్లోనే పెద్దబాలసిచ్చ సదివినాడంట. అందుకేనేవో తీరికుంటే ఇసికిలో మాకు అచ్చిరాలు దిద్దతా నేర్పిచ్చేది. మాయబ్బ రావాయణం, బోగాతం గూడా సదివినాడంట. మాయబ్బ తమ్ముడు బుచ్చెయ్య సంతు సుబ్బక్క, సీరావుడు, నాగడు, ఎంగటసావి, బత్తాసుగోడు, కోటడు, సత్తి.. వోళ్లు మొత్తం ఏడుగురు. వోళ్లు గూడా కూటికి ఆవురోమనేది. మాయమ్మ కూలికి బొయ్యినప్పుడు మాయబ్బ శాటనిండా వొడ్లు ముంచి మా బుచ్చి సిన్నాయినకి ఇచ్చేది‌‌. అయ్యి తిని మా సిన్నాయిన పిలకాయిలు ఉగ్గబట్టుకోనుండేది.

మాదిగాడకి తూరుప్పక్క కాలవ గట్టున గుడ్డగట్టి సిలుమాలు ఆడిచ్చేది. మాదిగాడ పిల్లాజెల్లా ముసిలీముతకా పొగులు పొద్దస్తం కూలిజేసి, సందికాడ సిలిమాకి లగిచ్చేది.

పాతూర్లో పీర్లపండగ జేసేది. దాన్ని జూసేదానికి ఊరూమాలాడ మొత్తం పొయ్యేది. ముందు గుండాం యేసేది. దాని సుట్టూ డమీ డిమీమని అరస్తా తురకోళ్లు సిందుదొక్కేది. ఆ తురకోళ్లు మాబోటి సూసేదానికి పొయ్యినోళ్లందురికీ నేతి తిరగమాత కూడు పెట్టేది. బూందీ, గెందం, కలకండ పెసాదాలు ఇచ్చేది. అక్కడ బెక్తులకి మస్తానుసావి పూనేది.

మా బావ జోమోడు తప్పిట్లు గొట్టేవోళ్లల్లో వొకడు. ఆయిన తప్పిటి తిరగేసి, తుండుగుడ్డ బరిసి దాంట్లో తిరగమాత కూడు, పొట్టేలు కూరాకు, కలకండ, ఎండు గొబ్బిరి, కజ్జూరం అన్నీ మూటగట్టుకోని వొచ్చేది. వోటితోగూడా ఏలిడంత అత్తరుబుడ్డి వోళ్లే ఇచ్చంపేది.

నేనూ మాయమ్మ పనికిపొయ్యొచ్చేతలికి మట్టెక్క కూడూ కూరాకూ వొండి ఇల్లూవాకిలి మట్టుగా బెట్టుకునేది. గులబది మాత్రం, ‘సిన్నోడు యాడస్తుండాడు ఎత్తుకోమే’ అంటే ఇల్లూవాకిలి పట్టిచ్చుకోకుండా మాదిగాడ మిందకి మాతాలా ఊర్యేగతా పొయ్యేది. మా యబ్బ గులబదాన్ని కొట్టినా, తిట్టినా మాటినేది గాదు.

మాయమ్మోళ్లు అడివిలో నానేసిన తంగేడు సెక్క మెట్టేసేది. సాయిబులు అనాసంద్రంపేట నుంచొచ్చి ఆ నానేసిన సెక్కని రూపాయికి(అప్పుల్లో రూపాయంటే బంగారం) కొనక్కపొయ్యేది. ఆ డబ్బుతో మాయబ్బ సెట్టంగట్లో కూరానారా, నూనీ, ఎర్రబియ్యిం కొనక్కొచ్చేది.

ఆ సెక్క కొనేదానికొచ్చిన సాయిబులు వొక్కోతూరి రూపాయితో గూడా కజ్జోరవో, తిరగమాత కూడో, పొడుగు సొక్కాయో ఇచ్చిపొయ్యేది.

మాయవ్వ, గులబది, సిన్నెమ్మి, నేను మెట్టకి పొయ్యి కట్టిపుల్లలు కొట్టుకొనేది. ఆ పుల్లలమ్మితే మాకు దాహం దొరికేది.

ఈవాటాన కూటికి దినమ్మూ ఎంబలే!

మాయమ్మ నాయుళ్ల కల్లాల్లోకి కూలికి బొయ్యేది. ముంతడు వొడ్లతో మా బలగానికి రొండు పూటలు కడుపు నిండేది.

నా పెళ్లి ఏ వాటాన జరిగినదో దెలుసునా?

నేను నాయిడు సేలో కూలికి బొయ్యుండా. మాయబ్బ వొకడ్ని తీసకొచ్చి నా ఎనికాల గెనింమింద నిల్సుకోనుండాడు. నేనేంటికో తలదిప్పితే మాయబ్బతో గూడా నిలబడుండేటోడు నన్ను జూసి నవ్వినాడు. వోళ్లిద్దురి ఎనకాల మా మాదిగాడ పిలకాయిలు కుక్కలోడు లుంగీ ఎంకచ్చి పోలి తోలుమొడ్డోడు నిలబడుండారు. మాయబ్బ నన్ను జూసి ‘ఏంమే! పెద్దమ్మ్యా! ఎట్టుండాడా నీ మొగుడా.. సూస్కో బాగా’ అన్నాడు. ఆవాటాన సేలోనే నాకు మనువు కాయిం అయ్యింది.

నా మనువుకి మాలో ఎవురికీ కొత్త గుడ్డల్లేవు. మాయబ్బైతే తడువుపాత మిందనే నిలబడుణ్యాడు. పెళ్లైనానక మాయబ్బ రొండ్రూపాయిలు బస్సు శార్జీలకి నా సేత బెట్నాడు. నేను తీసుకోకుండా మాయబ్బకే తిరిగిచ్చేసినా. మాయబ్బ ‘ఉండిచ్చుకోమ్మా, తోవలో మిటాయి కొనుక్కో’ అన్నాడు. అయినా నేను తీసుకోలా!

ఆవాటాన నేను పుట్టిన దగదర్తి నుంచి నెల్లూరు రాజుపళ్యానికి కాపురానికి వొస్తావొస్తా నా ఇద్దురు తమ్ముళ్లని గూడా నాతో తీసకొచ్చుకున్నా. ఏంటికంటే, దగదర్తిలో వాన కురిస్తేనే సేను బండేది, ల్యాకుంటే కూటికి అల్లాడేది. నా ఇద్దురు తమ్ముళ్లల్లో పెద్దోడ్ని గొల్లోళ్ల ఇంట్లో సేద్యానికి జేర్చినాం. సిన్న తమ్ముడ్ని మా ఇంట్లోనే పాలికి బెట్టుకున్నాం.

వొకనాడు తూర్పుకయ్యల్లో బరిగొడ్లు మేపతుండే నా సిన్న తమ్ముడ్ని నా మరిది కొట్నాడంట. దాంతో నా సిన్న తమ్ముడు యాడస్తా ఇంటికొచ్చి నేను ఎల్లిపొతానెకా అంటా యేడ్సినాడు. ‘మనూర్లో కూడుంటే నేనేంటికి మిమ్మల్ని ఈడకి తీసకొస్తాన్రా? మీ బావకి జెప్పి ఎవురోకరికాడ సేద్యానికి జేరస్తా ఉండ్రా’ అని ఎంత బతివిలాడినా వోడు ఉండకుండా దగదర్తికి ఎల్లిపొయ్నాడు. అట్టా పొయ్యిన రొండు మాసాలకి జరం వొస్తే పట్టిచ్చుకోకుండా ఎర్రటి ఎండన కట్లు కొట్టకొచ్చినాడంట. ఇంటికొచ్చి పొణుకోని ఆ రేత్రి మంచం మిందనే సచ్చిపొయ్నాడు. పసికిర్లు ముదిరి పొయ్నాడన్నారు. దాంతో నాకు బయివేసి గొల్లోళ్లింటో సేదిగానికి పెట్టుండిన పెద్దతమ్ముడ్ని మా ఇంటికే తీసుకొచ్చి పాలిటి బెట్టేసినా.

పెద్ద తమ్ముడు పనీపాటా జాస్తుండాడు గానీ కూడు దింటంల్యా. ‘యేందిరా? అమ్మానాయినా గెవణానికి వొచ్చినారా?’ అనడిగినా. వోడు గమ్మునే ఉణ్యాడు. నేనే కూడు గలిపి ముద్దజేసి నోరుదెరవరా అంటే కళ్లనీళ్లు బెట్టుకున్నాడు. ‘యేందిరా నీ మందల’ అని కసిర్నా. వోడు నోరు దెరిసి సూపిచ్చినాడు. నాలికి, పెదివి కాలి ఉండాయి. ‘నోరేంటికి కాలిందిరా?’ అనడిగితే ‘పాప తాత(మా మావ, నా మొగుడి నాయిన) సుట్ట తాగతా పిలకాయిల నోట్లో గూడా బెడతా, నన్ను బిలిసి నా నోట్లో మాత్రం తిరగేసి పెట్నాడుకా’ అని యేడ్సినాడు.

నేను గూడా యేడ్సుకోని నా తమ్ముడి నాలిక్కీ, పెదాలకీ ఎన్నపూస రాసినా. నా పెత్తమ్ముడు బండకస్టం జాస్తాడు‌. అట్టాంటోడు కూటికాడ గూసుంటే మాయత్త అప్పుడే క్యాకరిచ్చి క్యాకరిచ్చి ఊస్తుండేటిది. నా తమ్ముడు త్యారకి తింటుండాడని పాడిపోసేది.

ఇయ్యన్నీ జూసి నేను నా మొగుడితో మాట్లాడి నా తమ్ముడ్ని బలిజోళ్ల ఇంట్లో సేదిగానికి సేర్సేసినా. ఆడ సేర్సినకాడ నుంచి నా తమ్ముడు మొకాన సిమితం గనబడేది.

ఆవాటాన కొట్టుకోని మిట్టుకోని బతికినాం మేం. ఆ ఉండీలేని బతుకుల్లోనే బిడ్డాబిడుసుని సాకి సంతరిచ్చినాం.

నేను కాపరానికొచ్చిన రాసపాళ్యాన అంతోఇంతో కూడు దొరుకుతుండాదని దేలిసి మా బిచ్చి సిన్నాయిన పిలకాయిలందురూ ఏదో వొక పనెతుక్కుంటా ‘పెద్దక్కా’ అంటా నా దగ్గిరికే రాజాగినారు. వోళ్లందురికీ ఎవురికి తగిన పని వోళ్లకి సూపిచ్చినా. ఆవాటాన పదిమందివి అన్నదమ్ములు అక్కసెల్లెళ్లం రాజుపాళ్యాన తేలినాం. అందురం కస్టంజేస్తే ఈనాడు మా బిడ్డాపాపలు కయ్యాగాలవా కలిగినోళ్లైనారు.

ఇప్పుడోటికి యేం దెలుసు ఇయ్యన్నీ? ముసిలోళ్లం మేం కంటికే ఆనడంల్యా. నా పెద్దకొడుకు ఈనాటికీ ‘మాయమ్మ దగదర్తి నుంచి మాదిగాడనంతా రాజుపాళ్యానికి తోలకొచ్చి మా ఆస్తులన్నీ పుట్టింటోళ్లకే దెంగబెట్టింది’ అంటుంటాడు. అంతకస్టం జేసిన వోళ్లని మీ వోళ్లు గెతిలేనోళ్లు, అడక్కదెంగేవోళ్లు, ఊళ్లు దిరిగేవోళ్లు అని వోడు అగుమోనంగా మాట్లడగతాడు.

ఇదిరా నాయినా మీయవ్వ బతుకు!

***

అర్థాలు:

గిద్దడు – సుమారు పావుకిలో

నాలి – కూలి అంటే డబ్బు, నాలి అంటే ధాన్యం

తిరగమాత కూడు – సాదా బిర్యానీ

మట్టుగా – శుభ్రంగా

మెట్టకి – అడవికి

దాహం – కూడు

తడువుపాత – గోచి

***

మా మాటల్లోనే మరిన్ని కథలు రాయాలని వుంది 

  • హాయ్ నవీన్! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది నెల్లూరు జిల్లా నెల్లూరు మండలం నెల్లూరు రాజుపాలెం. డిగ్రీ దాకా నెల్లూరులో చదువుకున్నాను. ఆ తర్వాత కొన్నేళ్లు చెన్నైలో ఉద్యోగం చేశాను. ఆపైన కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేశాను. కొన్ని రోజులు హైదరాబాదులో జాబ్ చేశాను. ప్రస్తుతం మా ఊళ్లోనే ఉంటూ పొలం పనుల్లో మా నాన్నకు సాయంగా ఉంటున్నాను.

  • జర్నలిజంలో మీకున్న అనుభవాలేమిటి?

డిగ్రీ చదివేటప్పుడు మా తెలుగు లెక్చరర్ వచ్చి జర్నలిజం గురించి చాలా గొప్పగా చెప్పారు. జర్నలిజంలో చేరితే సమాజానికి చాలా చెయ్యొచ్చని అన్నారు. ఆ మాటలు విని నాకు ఆసక్తి కలిగింది. చెన్నైలో చేస్తున్న ఉద్యోగం మానేసి జర్నలిజంలో చేరాను. పీజీ పూర్తి చేశాక కొన్ని చోట్ల ఉద్యోగం కోసం ప్రయత్నించాను. కానీ చాలా చోట్ల ఎక్స్‌పీరియెన్స్ కావాలన్న సమాధానం వచ్చింది. ప్రస్తుతం మా ఊళ్లో ఉంటున్నాను. త్వరలో హైదరాబాద్ వచ్చి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలని అనుకుంటున్నాను.

  • కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

నేను చదివిన పుస్తకాలు చాలా తక్కువ. కొలకలూరి ఇనాక్ గారి ‘కన్నీటి గొంతుక’, సొలమోన్ విజయ్‌కుమార్ ‘మునికాంతపల్లి కతలు’.. అలా ఓ నాలుగైదు ఉంటాయంతే! రచయితల పేర్లు కూడా పెద్దగా తెలియదు. ‘మునికాంతపల్లి కతలు’ పుస్తకంలో కథలు రాశాక నాకూ రాయాలన్న ఆలోచన వచ్చింది. మేం మాట్లాడుకునే మాటల్లోనే ఓ కథ రాసి సొలమోన్ అన్నకు పంపాను. ఆ చదివి బాగుందని మెచ్చుకున్నారు. నన్ను కథలు రాయమని ప్రోత్సహించారు.

  • ఇది మీ మొదటి కథ కదా! దీని నేపథ్యం ఏమిటి?

ఇది మా అమ్మమ్మ కథ. ఇందులో ఏదీ కల్పితం లేదు. అన్నీ యథాతథంగా జరిగాయి. మా అమ్మమ్మకు ఇప్పుడు 87 ఏళ్లు. ఆమె తన బతుకు గురించి చెప్పిన కథను అలాగే రాశాను. ఇవాళ మనం వేసుకున్న చొక్కాకు చిన్న చిరుగు ఉంటేనే బయటికి వెళ్లడానికి సిగ్గుపడతాం. కానీ 75 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ పెళ్ళి సమయంలో వాళ్ల నాన్న గోచీతోనే నిలబడ్డాడు. ఆ విషయం విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కూతుర్ని అత్తారింటికి పంపేటప్పుడు చేతిలో రెండు రూపాయలు పెట్టే ఆ అమాయకపు ప్రేమ విని అబ్బురంగా తోచింది. ఆ రోజుల్లో ఆయనే కాదు, ఆ ఊళ్లో ఉండేవాళ్లంతా ఒంటి మీద సరైన బట్టలు లేకుండా అలాగే ఉండేవారని మా అమ్మమ్మ చెప్పింది. ఈ కథ ఆమెకు చదివి వినిపించాను. మొత్తం విని సంతోషపడింది.

  • ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

కథలు రాయాలన్న ఆలోచనైతే ఉంది. నాకు కథలు రాయడంలో అనుభవం లేదు. మా ఇంట్లో మేం మాట్లాడుకునే మాటల్లోనే ఈ కథ రాశాను. ఇక ముందు కూడా మా మాటల్లోనే మరిన్ని కథలు రాయాలని ఉంది.

*

దూరు నవీన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మొదటి కథే చాలా బాగా రాసారు. మీ అమ్మమ్మ గారికి ఇది tribute.
    Wishing you all the best

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు