అద్దేపల్లి ప్రభు కవిత్వాన్నీ, కధనీ రెండు ప్రక్రియల్నీ సంపద్వంతం చేస్తున్న సృజనశీలి. జనవరి 5 న అనంతపురంలో అతని “సీమేన్” కధా సంపుటికి విమలా శాంతి రజనీకాంత్ స్మారక పురస్కారాన్ని అందుకోబోతున్నారు. మార్క్సిస్టు తాత్వికతని అతని రచనల్లో ఎక్కువగా ప్రతిఫలింపజేసే ప్రభుతో శ్రీరాం మాట్లాడిన నాలుగు మాటలు సారంగ పాఠకుల కోసం –
1. ఆవాహన – విప్లవం; పారిపోలేం – ప్రపంచీకరణ; పిట్టలేనిలోకం – పర్యావరణం. మరి దుక్ఖపు ఎరుక మిమ్మల్నెక్కడికి చేర్చింది ?
జ. ప్రపంచీకరణ, పర్యావరణ విధ్వంసం ఈవేళ మానవ దుఃఖానికి కారణం అవుతున్నాయి. ప్రపంచీకరణ కీ, పర్యావరణ విధ్వంసానికి అవినాభావ సంబంధం ఉంది.మనలాంటి దేశాల్లో ఏది పోయినా పరవాలేదు అభివృద్ధి జరగాలి అనుకుంటాం. కానీ దానివల్ల కుబేరుడు పెరుగుతున్నాడు.ప్రజలు, ప్రకృతి నాశనమౌతున్నారు. ఈ దుఃఖపు ఎరుకని ఇంకా దేవులాడుతూనే ఉన్నాం. ప్రపంచపు బాధ అంతా మన బాధే కదా…
2. అద్దేపల్లి రామ్మోహన రావుకీ, అద్దేపల్లి ప్రభూ కి జీవన సాహిత్యాల మధ్యనున్న వైరుధ్యమేమిటి ?
జ.అద్దేపల్లి రామ్మోహనరావు పూర్తిగా సాహితీవేత్త.ప్రభు సాహిత్యం నుంచి రాజకీయాలకి వెళ్లి మళ్లీ సాహిత్యం లోకి వచ్చిన వాడు.
3. కవిత్వంలోంచి కధలోకి ; మళ్ళీ కధలోంచి కవిత్వంలోకి — ఎన్ని దారుల్లోంచి, ఎన్ని దారుల్లోకి ? అసలెందుకిలా జరుగుతోంది ?
జ. మనిషికీ ప్రకృతి కీ మధ్య ఉండేది కూడా మానవ సంబంధమే. మానవ సంబంధాలే కవితకైనా,కథకైనా మూలం. వ్యక్తపరుచుకోవడానికి ఒక్కోసారి ఒక్కో చోట కవిత్వం, ఒక్కో చోట కథా అవసరమౌతుంటాయేమో. వీటిని దారులు అనే కన్నా రూపాలు అనుకోవచ్చు.
4.మీ కవిత్వంలోని మార్క్సిస్టు వాస్తవికత మరింత సౌందర్యాత్మకం కావడానికి కారణాలేమన్నా ఉన్నాయా ?
జ.మార్క్సిస్టు స్పృహ ఉండడం వల్లే కళాత్మకత పెరుగుతుంది. దాని తాత్త్వికతని లోతుగా అధ్యయనం చేసినా చేయకపోయినా రచయిత అనే వాడు జీవితానికి ఉండే చలనశీలతని పసిగట్టకుండా రచన చేయలేడు.ఈ చలనశీలతని నిజాయితీ గా పసిగట్టిన వారికి ప్రగతిశీలత సహజంగా అబ్బుతుంది.అదే కళని పెంచుతుంది.సౌందర్యంతో కూడిన జ్ఞానమే కళ అనుకుంటాను.జ్ఞానం అటు దుఃఖాన్నీ,ఇటు ఆనందాన్నీ కూడా ఇస్తుంది.అంతేకాదు అది చైతన్యాన్ని కూడా ఇస్తుంది. మన చైతన్యం పెరిగిన కొద్దీ కళాత్మక అభివ్యక్తి పెరుగుతూ ఉంటుంది.
5.- మీకు అమితంగా సంతృప్తినిచ్చేది కధా ? కవితా ? ఏది ? ఎందుకు ?
జ. నిజానికి కథా,కవితా రెండూ సంతృప్తి గానే ఉంటాయి.కథ రాసినప్పుడు కొంత ఘర్షణ ఎక్కువ వుంటుంది.కవిత్వం మనం ఎలా రాయాలనుకుంటామో అలా రాస్తాం.మెరుగులు దిద్దుకుంటాం.అది పూర్తిగా వైయుక్తికంగా ఉంటుంది.కానీ కథ అలా కాదు.అది మనం అనుకున్నట్టుగా నడవదు.సంఘటన అయినా పాత్ర అయినా మనని కాదని మారిపోతుంటాయి. ఒక్కో సారి మనం ఊహించలేని విధంగా పోతాయి.నేను కొన్ని కథలు ముగించడానికి చాలా ఘర్షణ పడతాను.కథ రచయితని చాలా ఎడ్యుకేట్ చేస్తుంది.కవిత్వం సౌందర్య స్పృహ ని చైతన్యవంతం చేస్తుంది.
6.మీ నాన్న గారిపేరిట కవిత్వ విమర్శ అవార్డు నెలకొల్పారు. విమర్శే నిఖర్సైన ప్రమాణాల్ని కోల్పోతున్న కాలంలో మీ సాహసానికి తగ్గ స్పందన, కార్యాచరణ ఎలా ఉన్నాయి ?
జ.అద్దేపల్లి పేరిట అవార్డు ఇవ్వాలి అనుకున్నప్పుడు కవిత్వానికి ఇద్దామని మా అన్నదమ్ములం అనుకున్నాం.అయితే కవిత్వానికి అవార్డులు ప్రకటించే సాహిత్య సంస్థలు తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ చాలా ఉన్నాయి.అద్దేపల్లి కవిత్వం, విమర్శ రెంటిలోనూ కృషి చేశారు.కాబట్టి విమర్శ కే ఇవ్వడం బాగుంటుందనుకున్నాం. కవిత్వవిమర్శకి ఇవ్వడం ద్వారా రెండు ఆశయాలు పెట్టుకున్నాం.ఒకటి విమర్శ పట్ల అవగాహన పెంచడం, రెండోది విమర్శ ను ప్రోత్సహించడం. అందుకే దాదాపు పాఠం లా అవార్డు గ్రహీత పూర్తిగా మాట్లాడాలని కార్యక్రమంలో పెట్టుకున్నాం.మా అవార్డు స్వీకరించిన రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కడియాల రామమోహనరాయ్, కాత్యాయని విద్మహే లు అద్భుత ప్రసంగాలతో ఉత్తేజాన్ని కలిగించారు.
7.విమలాశాంతి రజనీకాంత్ పురస్కారం పట్ల మీ అభిప్రాయమేమిటి ?
జ.మంచి రచనలకి విమలాశాంతి పురస్కారం లభిస్తుందనే అభిప్రాయం మొదటి నుంచి ఉంది. నాకథలకి ఇది ప్రకటించగానే చాలా గొప్పగా అనిపించింది. నా కథలు కూడా మంచి కథలు అనే విశ్వాసం పెరిగింది.
Good write-up
“రిబక్కమ్మ”, “అతడు మనిషి” కధల అద్దేపల్లి ప్రభుకి …
త్రిపుర గారి ఆప్త మిత్ర, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారికి నచ్చిన కధా రచయిత అద్దేపల్లి ప్రభుకి …
ప్రజా కవి, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు, 1970లలో శివసాగర్, చెరబండరాజు మరియు నగ్నముని వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చిన అద్దేపల్లి రామమోహన రావు ( 1936 – 2016 ) గారి కుమారుడు, వారసుడు అద్దేపల్లి ప్రభుకి . . .
“సీమేన్” కధా సంపుటికి విమలా శాంతి రజనీకాంత్ స్మారక పురస్కారం అందుకుంటున్న సందర్భంగా అద్దేపల్లి ప్రభుకి అభినందనలు