మాతృత్వం గురించి కొత్త చైతన్యం

మాతృస్వామ్యం అనేది ఒక సామాజిక సంస్థ లేదా వ్యవస్థ  రూపం.

ఈ వ్యవస్థలో స్త్రీలు   ఆధిపత్యాన్ని, ప్రత్యేక హోదాలను కలిగి ఉంటారు. విస్తృత కోణంలో చూసినట్లైతే, అది ఒక సామాజిక నైతిక అధికారం. సామాజిక హక్కు,  ఆస్తి నియంత్రణకు కూడా ఈ పదం విస్తరించవచ్చు. మాతృ స్వామ్యాన్ని గైనర్కీ , గైనోర్కసి, గైనోసెంట్రిక్ సొసైటీ అని కూడా అంటారు. అయినప్పటికీ  ఈ పదాలు  ఎక్కడా మాతృత్వాన్ని నిర్వచించలేదనే చెప్పవచ్చు. కానీ మాతృస్వామిక వ్యవస్థలో స్త్రీలు, కుటుంబాలకు అధిపతులుగా వుండి, వారి సంతతి,  సంబంధాలు స్త్రీల రేఖల ద్వారా లెక్కించబడేవని చెప్పవచ్చు. స్త్రీల అధికారిక వ్యవస్థ ఉనికిని చాలామంది మేధావులు అంగీకరించడానికి ఇష్టపడక, శతాబ్దాలకు పూర్వంగానే పితృస్వామిక వ్యవస్థను రూపొందించుకోవడంగా చూస్తాం.

ఏ వ్యవస్థలోనైనా మనుషులకు కలిగిన అనుభూతులన్ని పీడకలల్లా, భయాందోళన కలిగించే స్వప్నాలే. ఈ కథలు చదువుతుంటే..వివిధ అనుభూతులు,  ఆత్మవిశ్వాసం తమ సామర్ధ్యం మీద నమ్మకం, సంబంధిత భావాలు  ఎవరికైనా సన్నగిల్లుతాయి.  ఈ కొత్త పుస్తకం  ‘యోధ’ మాతృత్వం –భిన్న కోణాలు ఇచ్చే అనుభూతి చాలా గొప్పవి! మాతృత్వం చాటున ఎంత హింసను స్త్రీలు తరతరాలుగా పడి ఉన్నారో కదా! అని.

కుటుంబ బాధ్యత/అధికారం/పాలనని మాతృస్వామ్య వ్యవస్థ నుంచి, లాక్కోబడిన పురుషాధిక్య ప్రపంచం కొన్ని శతాబ్దాలుగా ఆడవాళ్ళoటే కేవలం “పిల్లల్ని కనే యంత్రాలు”గా మార్చివేసిన స్థితిని, మననం చేసుకుంటే బాధేస్తుంది.  ఆధునికం అనుకుంటున్న నేటి పరిస్థితుల్లో కూడా అదే ఐడియాలజీ కొనసాగడం విషాదకరం. ఇంకా విచారించాల్సిన విషయం ఏoటంటే, సాటి ఆడవారే దీన్ని ముందుకు తీసుకుపోవడం. అయితే స్త్రీవాద స్పృహ వచ్చాక,  స్త్రీలు ప్రశ్నించడం మొదలుపెట్టినా, మార్పు పూర్తిగా రాలేదనే చెప్పవచ్చు …ఆ మార్పు దిశగా అడుగులేస్తూ ముందుకు సాగుతున్న మహిళా రచయితలు కొందరు ‘మాతృత్వం’ ఒక మిత్ అనే భావనను నమ్ముతూ..విజయ భండారు  సంపాదకీయంలో.. యాభై మూడు కథకులతో ‘యోధ’ మన ముందుకు వచ్చింది. ఈ కథలన్నింటిలో ‘మాతృత్వం’  ఏ విధంగా శిధిలమై, దుఃఖశకలమైందో తెలుస్తుంది.  ప్రతి కథలోని పాత్ర పురుషాధిక్యత ప్రభావంతో బాధలు పడిన పాత్రలే దర్శనమిస్తాయి. అయితే ప్రతీ బాధిత పాత్ర ఈ బాధల్ని భరించి, భరించి అంతిమంగా.. స్వతంత్రం, స్వేచ్ఛతో కూడిన ఒక ఎరుకలో బతకడానికి మొగ్గు చూపుతాయి.

“ఆడదానికి ఆడదే శత్రువు”అన్న నానుడి దశాబ్దాలుగా వస్తున్న ఒక పాత సామెతగా కొట్టిపడేస్తూ,  ఈ సoకలనంలో కొన్ని కథలు సాగుతాయి. కొన్ని కథలు అదే తోవను సమర్ధించినట్లుగా అనిపించినా,  లోపాయికారితనంగా వాళ్ళ ప్రవర్తనల వెనుక నున్న పితృస్వామిక భావజాల ఉనికిని ప్రతిబింబిస్తాయి.

‘శత్రువు’  అనే సంకలనంలోని మొదటి కథలో ఇద్దరు తల్లుల భావాలు విరుద్ధమైనవిగా వుంటాయి. తన కొడుకును ఇచ్చి పెళ్లి చేసిన “అత్తగారిని” కోడలు ఎంతగా ద్వేషిస్తూ.. కొడుకును,అతని పిల్లలను దూరం చేసినా, చిరునవ్వుతో సహిస్తూ, ప్రేమతో  కోడలు పెట్టె అవమానాలు భరించిన ఓ ‘పిచ్చితల్లి’ సహనానికి వందనం చెప్పి తీరాలి. ఈ కధలో వృద్ధాప్యం  మీద పడిన అత్తగారిని ఒక శత్రువుగా చూసి కోడలు తరిమేయడం పెద్ద  విషాదం. (కె.వరలక్ష్మి)

మాతృత్వానికి జెండర్ బయాస్ లుండవు. ట్రాన్స్ గా మారిన ‘గౌరీ అలియాస్ గణేష్’ కథలో ఒక ట్రాన్స్ విమెన్, అమ్మగా మారడానికి పడిన ఆరాటం, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల పట్ల ఈ సమాజం చూపిస్తున్న వివక్ష కన్నీళ్లను తెప్పిస్తాయి. తమకీ ఒక కుటుంబం కావాలని, సాటి ట్రాన్స్ పురుషుడిని  పెళ్లి చేసుకుని ఆ కలను సాకారం చేసుకుంటుంది ఈ కథలోని గౌరి పాత్ర.  నిజానికి బయట సమాజంలో చూసే ట్రాన్సజెండర్ లకి అవగాహన వచ్చి,  ఆ దారిలో వెళ్లే వారు ఎంతమందో చెక్ చేసుకోవాల్సిన కథ ఇది. ఎందుకంటే పట్టుదలతో ముందుకు సాగాలని అనుకున్న వారికి  కూడా ఎన్నో ఆర్ధిక అవరోధాలు వచ్చి, వారిని నడిరోడ్డుపై అడుక్కునేలా చేస్తాయి. ఏది, ఏమైనా “మాతృత్వానికి”  జెండర్ అడ్డు కాదని నిరూపించిన కథ కూడా ఇది.(వి.శాంతి ప్రబోధ)

తలపండిన గొడ్రాలు అనుభవాల్ని మాండలిక సొగసులో చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.  ప్రతి మహిళా అమ్మ కావాలి లేకుంటే గొడ్రాలు అనే ముద్ర వేసి దూరం పెడుతుంది ఈ సమాజం. గొడ్రాలు అనే నిందను  దూరం చేసుకోవడానికి పడే తపననే “తల పండిన గొడ్రాలు” కథ.(ఎండపల్లి భారతి)

ఒకే కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలలో, ఒకరిని తల్లికి తెలియకుండా ఆమె భర్త మోసం చేసి, తన   అన్నా, వదినలకు ఇవ్వడంతో, మోసపూరితం అని తెల్సి కూడా బిడ్డను దక్కించుకున్న మరో స్త్రీ, అమ్మ అవగలుగుతుంది గాని, బిడ్డను సముదాయించలేక సతమతమౌతుంది. సంధ్యలాంటి తల్లులు కాలేక పోయిన పాత్రల స్వార్ధాన్ని ప్రేమతో తిప్పికొట్టిన ‘నీలిమ’ లాంటి కన్నతల్లులు ఈ సమాజంలో కోకోల్లలు.  అమ్మ ప్రేమకి స్వచ్ఛమైన నిదర్శనం ‘అమ్మే కావాలి’లో చూస్తాం. (నండూరి సుందరీ నాగమణి)

నిరక్షరాస్యత, వ్యసనపరత్వం వలన పార్వతి తన ఇద్దరి బిడ్డలలో ఒక బిడ్డకి పెళ్లి చేస్తే, పోషకాహార లోపంతో ఆ  బిడ్డ మరో బిడ్డను కని, చచ్చిపోతుంది. ఇంట్లో వున్న చిన్నబిడ్డకు ఆ బిడ్డ బాధ్యతను అప్పచెప్పిన తల్లి.  చివరికి  తప్పనిసరి పరిస్థితుల్లో అల్లుడికి చిన్నబిడ్డను ఇచ్చి పెండ్లి చేయాలని చూస్తుంది. తల్లి అనాలోచిత ఆలోచనను తిప్పికొట్టి,  అక్క మొగుడికి రెండో భార్యగా వెళ్లనని చెప్పి, ఎలా జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటుందో చెప్పే స్ఫూర్తిదాయక కథనే ‘మోదుగుపూలు’. (సమ్మెట ఉమాదేవి)

మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పట్ల సమాజ ధోరణికి “రచన” ఓ ఉదాహరణ. . చిన్నప్పటినుంచి  ఆపిల్ల, తాము సమాజంలో ఎదుర్కొన్న వివక్షను  చూసి, చూసి ఆ తల్లి తీసుకున్న నిర్ణయం సరి అయినదే అనిపిస్తుంది.  disabled child పట్ల సమాజంలో మనుషుల వైఖరి మారాలి అని చెప్తుంది ‘వివక్ష’ కధ .(డా.చెంగల్వ రామలక్ష్మి)

ఒక్కోసారి యవ్వనంలో చేసిన తప్పుకి మాతృత్వం బలి కావాల్సి వస్తుంది .. ప్రేమించి మోసం చేసిన వాడు, కడుపు చేసి పారిపోతే. పుట్టిన బిడ్డని మరొకరికి దత్తత ఇస్తుంది ఓ (తల్లి ప్రోత్సాహంతో) మైనరు తల్లి.  సమాజంలో తిరిగి ఆమె తల ఎత్తుకుని బతకాలని తల్లిదండ్రులు నిర్ణయించినప్పుడు, జీవితంలో రాజీ తత్వాన్ని ఒంట పట్టించుకుని ముందుకు సాగిపోయే ‘లచ్చితల్లులెందరో’ఈ సమాజంలో? (రుక్మిణి దేవరకొండ).

మహిళలు కోరుకునేది సింపతీ  కాదు, ఎంపతీ  (తాదాత్మ్యం). ఆ  సహానుభూతి పురుషుల నుంచి ఎలాగూ రాదు.  కానీ  సమాజంలో సాటి మహిళలే సూటి, పోటీ మాటలతో బాధిత స్త్రీలను, బాధ పెడితే ఎలా? …పెళ్ళై పదేళ్లు అయినా పిల్లలు పుట్టని కారణంగా  తోబుట్టేవే  అక్కకు చేసిన  నమ్మక ద్రోహమే  “మెహర్ ” కథ  మర్చిపోలేం. (షేక్ నసీమా బేగం)

లెస్బియన్, స్వలింగ సంపర్కులు, బై సెక్సువల్స్, “గే” అనే పదాలు కూడా LGBT వర్గానికి చెందినవి.  సమాజంలో ఆ వర్గం వాళ్ళ గురించి మాట్లడుకోవడం చాలా సిగ్గుమాలిన విషయంగా మర్యాదస్తుల రూపంలో కొందరు భావిస్తారు. అలాంటిది నలుగురి స్నేహితులలో ఒక స్నేహితురాలి కొడుకుకు వచ్చిన సమస్యను ఆ నలుగురు స్నేహితులు కలిసి ఎలా పరిష్కరించుకున్నారు? ఒక  ట్రాన్స్ జెండర్ వారి   సమస్యను ఎలా మార్చగలిగింది?  స్వలింగ సంపర్కుడిగా మారిన కొడుకు జీవిత సమస్యను ఓ తల్లి ఎలా తీసుకుంటుంది? “మార్పు అనివార్యం” లో కనిపిస్తుంది. నిజానికి ఈ సబ్జెక్టు కధ మనకు రెండు విషయాల్ని తెలియజేస్తుంది. ఒకటి హార్మోన్ ఇంబాలెన్సు వలన ఆనంద్, అనామికగా మారిన తీరు. రెండోది మధు  ‘గే’ గా మారిన తీరు.

  ప్రతి మనిషి తనకు నచ్చినట్టుగా తాను జీవించే హక్కు కలిగి వుంటాడు. ఆ విషయంకు చట్ట బద్దమైన మద్దతు కూడా వుంటుంది. అయితే ఎల్‌జి‌బి‌టి వర్గంలో జీవించే పిల్లల తల్లులుగా ఈ కథలోని ఒక తల్లి, కొడుకు విషయంలో ముందు ఏడ్చినా, బాధ పడినా చివరికి ‘అనామిక’ చెప్పిన విధానానికి కన్విన్స్ అయి  ప్రశాంతంగా కొడుకు జెండర్ ను గుర్తిస్తుంది. ఇలాంటి  క్రిటికల్ సబ్జెక్టుతో ముడివడిన కథలో ఒక ‘పాజిటివ్ ఎండింగ్’ రచయిత ఇవ్వడం హైలెట్. ఆ మార్పుని మానం కూడా ఆహ్వానిద్దాం. (భండారు విజయ)

ఒక సిద్ధాంతం కోసం జీవితాంతం నిలిచినా విజయ తన దారి ఎప్పుడు తప్పు అనుకోదు. ప్రేమగా పెంచుకున్న బిడ్డ దూరం అయినా, ఉద్యమ మిత్రులు, రాజ్యం అణగదొక్కినప్పటికి, తన సంకల్పం మాత్రం చెక్కుచెదర నీయని “హృదయ జనని” లు  చాలా మండి తల్లులు వుంటారు ఈ సమాజంలో. “స్వచ్ఛమైన ప్రేమలో, అమ్మతనపు జీవం ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ అమ్మలే నాకు” అంటూ తన దృష్టిలో ‘బిడ్డను కంటేనే..తల్లి కాదు’ ప్రేమ చూపించే ప్రతి స్త్రీ ఒక  అమ్మనే అన్న సందేశాన్ని ‘హృదయ జనని’ కథ చెబుతుంది. (కాంతి నల్లూరి)

ఇప్పటి జనరేషన్ స్వతంత్రులు. వాళ్ళు ఎవరి జోక్యాన్ని సహించరు. అది వ్యక్తిగతం అయినా, వృత్తి పరంగా అయినా.  శ్రీజ తీసుకున్న నిర్ణయం ఆమే తల్లి తండ్రులకు ఎంతటి కల్లోలం రేపిందో?. పిల్లలు వద్దు అనుకున్న శ్రీజ దంపతులకి ఇరు వైపుల కుటుంబాల నుంచి ఎలాంటి ఒత్తిడులు ఎదురు అయ్యాయి.  చివరికి ఆ ఒత్తిడిలో హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చిన శ్రీజ ను చూసిన వాళ్ళు చివరికి, తమ పంతాలను పక్కకుపెట్టి, ‘పిల్లలు లేకపోయినా పర్లేదు, ‘బిడ్డ బ్రతికి వుంటే చాలు’ అని కోరుకోవడం తలల్లుల ప్రేమలోని  సహజత్వo రచయిత చక్కగా చెప్పారు. ఇది నాణేనికి ఒక కోణమే . రెండో కోణంలోకి  పాఠకుడు వెళ్ళి  ఆలోచిస్తే, అదీ వృద్ధాప్యంలో పిల్లలు లేని తల్లిదండ్రులు ఎదుర్కొనబోయే సమస్యల గురించి కూడా చెబితే బాగుండేది అని అనిపిoచవచ్చు. ఆ సమయంలో వారి ఒంటరితనం డిప్రెషన్ లో పడిపోదా అన్న అనుమానం వచ్చే అవకాశం సామాన్య పాఠకుడు బావించే ప్రమాదం ఉందేమోయని అనిపించింది. తాత్కాలిక మార్పు గొప్పగా ఉన్నప్పటికి, భవిష్యత్తు గురించి కూడా నాలుగు వాక్యాలు రాస్తే బాగుండేదని ‘నో రిగ్రట్స్’  కధ సందేహంలో పడేస్తుందేమో!…తెలియదు. (రెంటాల కల్పన)

చదువుకునే పిల్లలని ఒత్తిడి లేకుండా పెంచగలగాలి. లేకుంటే “కన్నా నీ చేతి గీత” మాదిరి గానే తయారు అవుతారు.. అటు టీచర్ల దెబ్బలు, ఇటు కన్నవాళ్ళు పట్టించుకోలేని అబాధ్యతాయుత కుటుంబం వలన పాఠశాల భీతి  ఒక పిల్లవాడికి school phobia ఏర్పడుతుంది. బడికి వెళ్ళాలి అంటే ఆకస్మిక, సహేతుక భయం అతనిలో చోటు చేసుకుంటుంది. పిల్లాడి ఆసక్తిని గమనించకుండా పెద్దల అహంకారం చివరికి కన్న కొడుకుని కోల్పోయేలా చేస్తుంది. అతను గీసిన గీతలని తల్లి తండ్రులు పట్టించుకోక పోవడం, టీచర్లు చదువు రాని పిల్లాడిగా చూస్తూ హింసించదాన్ని ఆ చిన్ని ప్రాణం తట్టుకోలేకపోతుంది. అందుకే ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నానని అదే చేతి రాతతో ఉత్తరం రాసి చనిపోతాడు. ఆ పిల్లాడి శవాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్ళే ముందు వాడు ఏదైతే సాదించాలని తపన పడ్డాడో ‘ముంబై ఆర్ట్స్ కళాశాల’ లో అడ్మిషన్ ఆ సమయంలో తల్లి ఆ లేఖను అందుకుంటుంది. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు దుఖ వేదన  హృదయ విదారకంగా వుంటుంది. (వంజారి రోహిణి).

ఈ సంకలనఁ లోని కథలన్నింటిలో ఎత్తుగడ  బాగుంటుంది. అన్ని కధల్లో ఇది ఏకబిగిన చదివించేలా ఉంటుంది. ఈ యాభైమూడు కథల్లో ఎక్కడా మీకు పాత్రలు కనిపించవు. కళ్ళ ముందు జరిగిన సంఘటనలు దృశ్యరూపంలో కనిపిస్తాయి.

అలంకారికత {figurative expression} పాఠకుల మనసులకి ఆహ్లాదం కలిగిస్తూ కావ్యానికి (రచనకి) అందాన్ని ఇచ్చేది …అయితే, ఇక్కడ మనకి ఆహ్లాదం కలిగించే సంఘటనలేవీ కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ బాధాసర్ప కథలు. పురుషాధిక్యత కలిగిన సమాజంలో పీడించబడ్డ పీడితుల కథలు కావడంతో సహజంగానే విషాద పాళ్ళు ఎక్కువగా కనబడ్తాయి. చాలా పాత్రలు అంతరంగ కథనాలతో  నడవటం చూడొచ్చు. దాదాపు అన్ని కథల్లో చాలావరకు  తరతరాలుగా మగాడు, మగడు, మొనగాడుగా పిలవబడే పురుషుడు.  స్త్రీ జనోద్దారకుడిగా సమాజం చేత ముద్ర వేయబడతాడు.  అధికారం, హోదా, కుటుంబ పెద్దగా ‘మాతృత్వం’ పేరుతో ఎలాంటి హింసని తనకు తెలిసి, తెలియకుండా కూడా ఎలా కుటుంబ వ్యవస్థలో పెత్తందారీతనం వహిస్తాడో తెలుస్తుంది. నేరస్థుల్లా కనబడే ప్రతి పురుషుడిలో అంతర్లీనంగా పితృస్వామిక భావజాల జాడ్యం  కనబడకనే కనబడుతుంది..

తమ సమస్యల పట్ల తమకే ప్రత్యక్ష అవగాహన లేనప్పుడు శత్రువు ఎక్కడినుంచో చొచ్చుకుని రాడు. అనేక రూపాలలో వాళ్ళు కొత్తకొత్తగా ట్యూన్ చెయ్యబడడం ఈ కథల్లో గమనించవచ్చు.  ఆ ఎరుకనే  ఈ కథలన్నీ  మనకు విప్పి చెబుతాయి.   కథనాత్మక రచన  అనేది ఒక సంఘటన  లేదా కొన్ని సంఘటనలని తీసుకొని కథా రూపంలో చెప్పడం అవి కల్పితమైనవిగాను, లేక నిజమైనవిగాను ఉండొచ్చు.

ప్రకృతిలో స్త్రీ,పురుషులిద్దరూ సమానం అనుకుంటాం. కానీ, సమాజంలో పురుషులు మేం స్త్రీల కన్నా ఇంకాస్త ఎక్కువ అనే అహంకార భావజాలం కలివుండడాన్ని శతాబ్దాలుగా చూస్తున్నాం. సామ్యవాద వాస్తవికతని అమలు చెయ్యగలిగితే  కాస్త మార్పు రావొచ్చు.  కానీ ఆ దిశగా శ్రీకారం చుట్టాల్సింది మళ్ళీ మహిళనే కావడం దురదృష్టకరం. తల్లి కావడం,పిల్లల్ని పెంచడం, వారు పెరిగి పెద్దయ్యాక వాళ్ళ పిల్లలకి కూడా సేవలు చేయవల్సి రావడం నిజంగా ఎంత దుఃఖదాయకం ?? ఈ  ప్రశ్నకి సమాధానం మన దగ్గర ఉందా?

ఈ భిన్న వ్యక్తీకరణలలో ఒక విషయం స్పష్టంగా ఆకట్టుకుంది. అది ఏంటి అంటే – ఆత్మాశ్రయ ధోరణి.  అవును ఇది ప్రతి మహిళా అంతరంగ ఘోష . వీళ్ళ మనసులో అంతర్గత ఐక్యత ఒక్కటే. అదే ‘మాతృత్వం’. పేరుతో స్త్రీల స్వేచ్ఛని , ఆలోచనలను, అనుభూతులను, కోరికలని, బలవంతంగా లాక్కున్న పురుషుల హస్తాల నుంచి విడివడి, స్వేచ్ఛగా, ఆంక్షలు లేని, ప్రపంచానికి తరలి వెళ్ళడం అన్న ఆలోచనలన.

జెండర్ బయాస్ లో “మాతృత్వం” ఎప్పుడూ ఎవరికైనా ఒకటే. అనాధని తెచ్చి పెంచుకున్నా, ఒక ట్రాన్స్ జెండర్ ఉమన్ తన కూతురి కోసం లోకం నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధపడిన ఆ అమ్మ కానీ అమ్మ త్యాగాన్ని ఎలా మరువగలం?  అమ్మ అంటే అమ్మనే! ..అది కన్న ప్రేమనా?పెంచుకున్న ప్రేమనా? ఎవరికైనా, బిడ్డ బిడ్డనే.. అని చెప్పే’పురస్కృత’ లు వున్నారంటే ఆ అమ్మలందరి కాళ్ళ ముందు ప్రతి పురుషుడు తల వంచి తీరాల్సిందే! ఈ కధల్లో నాకు చాలావరకు చారిత్రిక వాస్తవికత  కనబడింది.  జరిగిన ఘటనలని తీస్కొని ఉన్నదీ ఉన్నట్టుగా చెప్పడం కూడా కనబడింది. ‘మాతృత్వం’ పేరు మారి ఉండవచ్చేమో! కానీ,  అదే కండిషనింగ్, అదే దైవత్వాన్ని ఆపాదించడం బాగున్నట్లుగానే అనిపిస్తుంది. మిధ్య /మిత్ మాత్రమే అని తెగేసి చెప్పడానికి ఈ కధల్లోని ప్రతి పాత్ర చెప్పడానికి వెనుకాడక పోవడం గొప్ప పరిణామం(మోహన).

స్త్రీవాద విమర్శ  కొన్నిటి ని వ్యతిరేకిస్తుంది. సాహిత్యంలో స్త్రీలని చిత్రీకరించేప్పుడు ఆ ఛి౯త్రించేది సమానత్వ అనే కోణం నుంచి కాక పురుషుల ఆధిపత్యాన్ని తెలిసో /తెలియకో అంగీకరించే ద్రుష్టి లో రచనలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే ఇందులోని కథలన్నీ ఆ  కోవలోకి రావు. ‘మాతృత్వం’ పేరిట రుద్దుతున్న ఆధిపత్య భావజాలాన్ని యధాశక్తిగా తిప్పికొడతాయి. ఈ కథలన్నింటికి పఠనీయత (readability) ఉంది. ఎక్కడ కూడా పడికట్టు భావ వక్తీకరణ (Cliche)) కనిపించదు. చాలావరకు సాధారణoగా కథల్లో Utopia (ఊహాలోకం) నంచి పాత్రలు మాట్లాడుతూ మాతృత్వంలోని కుట్రను విచ్చిన్నం చెయ్యాలన్న గొంతుతోనే {ప్రతి పాత్ర} చెబుతుంది …అలాగే ఇవి నవ్య వాస్తవిక వాదం (neo-realism) కి చాలా దగ్గరగా ఉంటాయి. పేదరిక మహిళల మాతృత్వ జీవన విధానాల్లోన్ని హింసా జీవితాలను కూడా మనకు కొన్ని కథలు పరిచయం చేస్తాయి.

మాతృత్వం అనేది ఒక ‘బ్రమ’ మాత్రమే.  అది కేవలం ఒక మిథ్య. అనే వాదాలను విస్తృతం చేసుకుంటూ  ముందుకు వెళ్ళాలి అన్న సందేశంతో వచ్చిందే ఈ ‘మాతృత్వo-భిన్న వ్యక్తీకరణలు’.  విషయాలను పరిశీలించి గ్రహించడమే కాకుండా వాటిని సరళంగా అందరికి అర్ధం అయ్యేలా వివరించడం. మాతృత్వం పేరిట స్త్రీలు ఎన్ని హింసలకు లోనౌతున్నారో చెప్పడమే ఈ కథా సoనకలనం  ప్రధాన ఉద్దేశం.  మనసుని మెలిపెట్టే కథలు ఇవి.

*

పుష్యమీ సాగర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు