కళ్ళతో మాట్లాడాలనుకుంటామా
కన్నీటి సంద్రంలో
విచ్చుకున్న ఎర్రతామరలైన కళ్ళు
తన చూపులచేతులతో
అనంత విశ్వంలోని సూర్యుడ్ని
ఒడిసిపట్టి సంద్రంలో ముంచి
రెప్పలకింద దాచుకునే పనిలో ఉన్నాయి
పెదాలతో మాట్లాడాలనుకుంటామా
ఏ చెట్టుమీద చిలకకో
తీయని పళ్ళని అందిస్తుందో ఏమో
చిలకపలుకులతో మిగల మగ్గిన వాసనను వీస్తూ
మనచుట్టూ గింజలుగా రాలుస్తున్నాయి
గుండెతో మాట్లాడాలనుకుంటామా
లబ్ డబ్ లతో చెవుల్ని మూసి
మనల్ని బతికిస్తుంది నేనేనంటూ
మన గొంతు కూడా మనకు వినబడనీకుండా
మనల్ని ధ్వనితో కమ్మేస్తోంది
ఇక
మనసుతోనైనా
మనసు విప్పి మాట్లాడాలనుకుంటామా
మనసు ఎక్కడుంది
రెక్కలు కట్టుకుని గతంలోకి
ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి
జంటమనసుతో కలిసి తిరిగి వచ్చి
మనచుట్టూ రంగులవలయాల్ని తీర్చుతూ
సీతాకోక చిలుకై మనచుట్టూనే తిరుగుతుంది
నేనే కాదు
మీరైనా మనమైనా ఎవరైనా
మాటల్ని మాట్లాడటం మర్చిపోతున్న వేళ
ఎవరితోనైనా ఎలా మాట్లాడాలి
ఇక పై మనం
మాట్లాడాలనుకున్న మాటలన్నీ
అక్షరాలుగా అంతర్జాలఆకాశంపైనో
హస్తభూషణమైన బుల్లియంత్రంలో
ఎమోజీలుగానో ఎగరేయాల్సిందే !!!
*
Add comment