కొక్కుల సరసిజ అలియాస్ పెనుగొండ సరసిజ ‘కాగితాన్ని ముద్దాడిన కల’ (2018), కవిత్వ సంపుటితో తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించి, ‘ఇక మారాల్సింది నువ్వే'(2021) కవిత్వ సంపుటితో తన దృక్పథాన్ని పట్టి చూపించే, స్పష్టపరిచే స్త్రీ సంవేదనలని ప్రతిబింబించే వస్తు వైవిధ్యంతో తనదైన శైలిలో కవిత్వ సృజనను విస్తృత పరుస్తూ స్త్రీవాద కవిత్వ బ్యాడ్జ్ ధరించి ముందుకు కొనసాగుతున్నారు. వృత్తిరీత్యా న్యూస్ రీడర్. వీరు వరంగల్ లో పుట్టి పెరిగి కరీంనగర్లో సాహిత్య సేద్యం చేస్తున్నారు. ఇప్పుడు పెనుగొండ సరసిజ రాసిన “వట్టి హౌస్ వైఫ్” కవిత గురించి మాట్లాడుకుందాం.
*
ఒట్టి హౌస్ వైఫ్
~
ఆమెను అలా వాకిట్లో కూర్చోబెట్టా
అన్నం మూత నుండి రాలే ఆవిరి చుక్కల్లా
ఆమె నుదుటిపై చమటలు
కాసేపైనా ఖాళీగా ఉండవా ?అడిగా
అదేంటి? ఇప్పుడు ఏం చేస్తున్నానని? అంది చిన్నగా
ఏమీ చెయ్యట్లేదా?
ఖాళీయేగా!
నీ మెదడు మరి? అడిగాను నేను
మెదడు అన్నాక ఆలోచించదా? అంది ఆశ్చర్యంగా
నీ మెదట్లో నువ్వు ఉన్నావా?
నువ్వేంటి? నేనేంటి? నీతోపాటే నేనంది
అంతేగాని నువ్వంటూ మాత్రం..
అబ్బా అంటూ విసురుగా మళ్లీ వంటింట్లోకి!
కాసేపటికే కాఫీ కప్పుతో..
కాస్త విశ్రాంతి తీసుకో విసుక్కున్నాను
మీరూ శ్రమిస్తూనే ఉన్నారుగా!
నేను రిటైర్ అవుతానుగా! సెటైర్ వేసా!
ఆ తర్వాత బ్రతుకు మాత్రం
మీ కష్టం కాదూ కసరుకుంది
విహారయాత్రకు వెళ్దామా? విన్నవించుకున్నా
ఏమైనా ఫలహారాలు చెయ్యనా పిల్లలకి?
చెంగున గంతేసింది
అంతేకానీ గమ్మున ఉండనంటావు గద్దించాను
కళ్ళతో నవ్వి చల్లగా జారుకుని
చల్ల చెంబుతో వచ్చింది
ఏంటని సైగా చేశా!
వేడిగా ఉన్నారుగా!
చల్లబరుద్దామని చల్ల! చల్లగా చూసింది
నాకు గాబరాగా ఉందని నీకెలా..? అడిగేలోపే
గిరుక్కున తిరిగి వెళుతూ ఓ నవ్వుతో
నా మనసును మాయ చేసింది
చల్ల చెంబును చంకనెత్తుకున్నా
అందులో నా ఆకలి పేగును
హత్తుకెళ్తున్నట్లు అనిపించింది
కాసేపు కూర్చుంటావా? అరిచా
బోలెడు పనుందంటూ పారిపోయింది
అవును బోలెడు.. పనుంటుంది
పైసా సంపాదనలేని ఆమెకు
క్షణం తీరకుండా
పనికిమాలిన పనో
పనికొచ్చే పనో
పని మాత్రం ఉంటుంది
ఆమేం పని చేయదు.. ఇంట్లోనే ఉంటుంది
ఒట్టి హౌస్ వైఫ్..
కదా! ఒట్టి హౌస్ వైఫ్
ఎక్కడికెళ్ళినా వెళ్లకపోయినా ఇంటిని మాత్రం
ఒంటికి ఒంట పట్టించుకునే ఒట్టి హౌస్ వైఫ్
ఎప్పుడైనా ఆమె వదిలేస్తే
కుప్పకూలిన ఇల్లు
శిధిలమైన ఇల్లు
పునాదిలేని ఇల్లు
ఇదే కదూ! వాస్తవం
*
అసలు ఏముంది ఈ కవిత్వంలో? దాదాపుగా అన్ని సాధారణ వాక్యాల్లాగే కనిపిస్తున్నాయి కదా! అనిపిస్తుంది. ఎప్పుడూ కనిపించే వాక్యాల్లోని అర్థాలనే వెతుకుతూ ఉంటాం. కానీ వాక్యాల వెనుకనున్న అంతరార్ధాన్ని గ్రహించే ప్రయత్నం చేయం.
“ఆమేం పనిచేయదు.. ఇంట్లోనే ఉంటుంది/ఒట్టి హౌస్ వైఫ్”
‘వొట్టి’ అంటే ఉత్తది లేదా ఏ ప్రత్యేకత, విశిష్టత లేనిది అని అర్థం ధ్వనిస్తుంది. కొందరు ఈ వాక్యాన్ని సమర్థిస్తూ అవును నిజమే అనొచ్చు. మరికొందరు వ్యతిరేకించవచ్చు. అది చూసేవారి లేదా చదివే వారి దృష్టి కోణాన్ని (perception) బట్టి సమాధానం మారుతుంటుంది. మనుషులు కొన్ని విశ్వాసాల పట్ల, నమ్మకాల పట్ల మూఢంగా ఉంటారు. వాటిని ఈ సమాజమే తరతరాలుగా తమ వారసత్వంగా అందిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని విషయాల పట్ల, కొందరి వ్యక్తుల పట్ల కొన్ని స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అవి వైయక్తికంగానో లేదా సామాజికంగానో సంక్రమించినవై ఉంటాయి. స్త్రీల పట్ల కూడా సమాజపు వైఖరి ఒక పరంపరగా కొనసాగుతూ వస్తున్నదే అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఇందులో పురుషాధిక్యత సంభావ్యతే అధికం అవడం యాదృచ్ఛికం కాదు.
వైయక్తికంగా అది తప్పు, నేరం అని మనుషులకి అనిపించినప్పటికీ, అది తన చుట్టూ వున్న సమాజం అంగీకరించక పోతే ఇక అనివార్యంగా వ్యక్తిగతంగా దాన్ని ఒప్పుగానే స్వీకరిస్తారు, అలాగే కొనసాగిస్తారు, ముందు తరాలకు చేరవేస్తారు. ‘మహిళల శ్రమదోపిడి’ అందుకు సరైన ఉదాహరణగా ఉటంకించవచ్చు. స్థానభ్రంశం చెందుతున్న కొలదీ శ్రమదోపిడి తీవ్రతలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.
“కదా! వొట్టి హౌస్ వైఫ్” అని నొక్కి చెప్పడంలోనే ప్రదర్శితమవుతున్న ‘నిరసన’ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. “పైసా సంపాదన లేని ఆమెకు” అనడంలోనే ‘శ్రమదోపిడి’ తేటతెల్లం అవుతుంది. కవిత ఆసాంతం సంభాషణాత్మక శిల్పంతో కొనసాగుతుంది. రెండు పాత్రల (ఒక పార్శ్వం అవి స్త్రీ పురుష పాత్రలు అనుకుందాం) మధ్య సంభాషణను కొంచెం శ్రద్ధగా గమనిస్తే సన్నివేశం, వాతావరణ చిత్రణ దృశ్యరూపకమవుతుంది. ఇక్కడ విరోధాభాస ఏమిటంటే పురుష పాత్ర- స్త్రీ పాత్రకు కొద్ది సేపైనా విరామం ఇవ్వాలని తాపత్రయపడటం, స్త్రీ పాత్ర ఇదంతా తన కర్తవ్య నిర్వహణ లో భాగం అన్నట్లు, ఇదే జీవిత మని, ఇది తప్ప తనకు ఇంకే ప్రపంచం లేదన్నట్లు ప్రవర్తించడమే!
నెగటివ్ సెన్స్ లో చూసినప్పుడు – అస్సలు విస్మరించదగని విషయమేమిటంటే కవిత మొత్తం మేల్ వాయిస్(male voice)లో మాత్రమే వుంటుంది కనుక..పైకి స్త్రీని సమర్థించినట్టు, సహానుభూతిని వ్యక్తపరుస్తున్నట్టు – ఆమె లేకపోతే అంతా శూన్యమే – అనే వాస్తవాన్ని చెబుతున్నట్టు.. అంటే ఒక పావురాన్ని చేతితో పట్టుకుని, అది రెక్కలు టపటపా ఆడిస్తూ వుంటే – అగజూడు.. ఎంత స్వేచ్ఛగా ఎగురుతోంది – అని భ్రమింపజేయడం లాంటిది..ఇంకా పురుషత్వపు కన్నింగ్ నెస్ (cunning ness) అనేది కన్సర్న్ (concern) రూపంలో అంటే మేడిపండు తత్వంగా వ్యక్తమై వుంటుందని కూడా సాధారణీకరించవచ్చు.
అయితే ఈ కవిత అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత – అర్థమవుతుంది. కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తే పురుష పాత్ర ఆదర్శవంతంగా పోట్రేయిట్ (portrait) అయిన విధానం కనిపిస్తుంది. స్త్రీ పురుషుల(భార్యాభర్తల) మధ్య వున్న అన్యోన్యత, ప్రేమానురాగాలు అనేవి ఆకలి పేగును హత్తుకెళ్తున్నట్లు అనిపించడం, విశ్రాంతి తీసుకోమని విసుక్కోవడం, కాసేపైనా ఖాళీగా ఉండవా?, నీ మెదట్లో నువ్వున్నావా ? అని ప్రశ్నించడం మొ.న వాటిల్లో చాలా స్పష్టంగా ద్యోతకమవుతాయి.
ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది – ఆమెను వాకిట్లో కూర్చోబెట్టినా చెమటలు కక్కేంత ఉక్కపోతలో వుండటం, పురుష పాత్ర సంధించే ప్రశ్నల్లోనే స్త్రీ పాత్ర సమాధానం వెతుక్కుంటున్నట్టుండడం – ఇది ఒకరకంగా స్త్రీ క్రమక్రమంగా తన అస్తిత్వాన్ని కోల్పోతుండటమే అనిపిస్తుంది. ‘పావ్ లోవ్’ ప్రతిపాదించిన ‘శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం'(classical conditioning theory) కి లోబడి వున్నట్లనిపిస్తుంది. స్త్రీ సహజ ప్రతిస్పందనలన్నీ (unconditional responses) పురుషాధిక్య సమాజం నిర్దేశించినట్లు అసహజ ప్రతిస్పందనలు(conditional responses) గా మారిపోతుండటంగా గుర్తించవచ్చు.
*
ఒకవేళ నిజంగానే పాజిటివ్ గా, సమాజం మొత్తం అలా వుంటే హౌస్ వైఫ్ కి కాస్త ఊరట దొరికినట్లే! దాంతో పాటు కొంత పనిలో కూడా సాయపడితే మాటల్లో వున్న కన్సర్న్ చేతల్లో కనిపించి సమన్యాయ సూత్రం పాటించినట్లవుతుంది. మాటల వరకే పరిమితం అయితే మాత్రం నెగటివిటీకి ఆస్కారం ఇచ్చినట్లే.. మీరేమంటారు?
*
చాలా వివరణాత్మకంగ సాగినా మీ వ్యాసం బాగుందన్న
Thank u so much for this analysis Raj..you analysed both sides..such a different view ..thank u once again