మాటల గుర్తులు

            అంతా చేసి మళ్లీ ఏ మాట దగ్గరో నీ దగ్గరికొచ్చి ఆగిపోతాను.

బేగంపేట్ ఫ్లై ఓవర్ దిగి, సోమాజీగూడ సర్కిల్‍ను చేరుతుంటే, రోడ్డుకు పక్కన్నే ఉండే పంజాగుట్ట ఫ్లై ఓవర్ గోడల మీద ఉన్న చిన్న చిన్న బాక్సుల్లాంటి డిజైన్లను బస్సులోంచి తల బయటికి పెట్టి చూస్తుంటాను. సిమ్మెట్రీ అంటారు తెలుసు కదా, సరిగ్గా అలాగే ఆ బాక్సుల్లో సూర్యరశ్మి పడుతూ ఉంటుంది. డయాగ్నల్‌గా సగం వెలుతురు, సగం చీకటి ఆ చిన్న బాక్సుల్లో.

నీకు చెప్పుకోవడానికి కాకపోతే, నువ్వనేదానివి అసలు పరిచయమే కాకుంటే నేనివన్నీ ఎందుకు చూసుండేవాడ్నని ఆలోచిస్తా.

ఈ దార్లో ఆఫీసుకు వెళ్తున్నప్పుడల్లా, బంజారాహిల్స్ పన్నెండో నెంబర్ రోడ్డు దార్లో ఉండే కొన్ని ఇళ్లను ప్రత్యేకించి చూస్తా. రాళ్లతో కట్టుకున్న కంపౌండ్ వాల్, చుట్టూ చెట్లు. ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలి.

ఆ ఇంట్లో నిన్నెదురుగా కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పాలి.

నీకు ఏం కబుర్లు చెప్పాలి? చిన్నప్పుడు ఇదే మార్చి నెలలో ఇచ్చే ఒక్కపూట బళ్ల గురించి చెప్తా. మధ్యాహ్నం పూట క్యారంబోర్డ్ ఆడుకున్నది, రేఖాగణితంలో మిగిలిపోయిన బొమ్మలు గీసుకున్నది, సాయంత్రాలు క్రికెట్ ఆడినదీ.. ఇవన్నీ చెప్తా. ఇంకో రోజు ఇంకేవో విషయాలు చెప్తా.

నేను ఆఫీసుకెళ్లే ప్రతిరోజూ, ఈ దార్లో, ప్రతిసారీ ఆ రాళ్లతో కట్టిన కంపౌండ్ వాల్ ఉన్న ఇళ్లను చూసినప్పుడల్లా నీకు ఏమేం విషయాలు చెప్పొచ్చా అని లెక్కలేసుకుంటూ ఉంటా.

ఇలాంటి విషయాలన్నీ నా ఆలోచనల్లో తిరుగుతూ ఉంటే, మధ్యాహ్నం పై ఫ్లోర్‍లోని క్యాంటీన్‍లో తినేసొచ్చి, కారిడార్ గోడకు నిలబడి దూరంగా ఉన్న రోడ్డును చూసి నిన్ను గుర్తు తెచ్చుకుంటా.

నవ్వులా కనిపించే ఏడుపొకటి ఏడుస్తా. వెనకనించి ఎవరో భుజం మీద చెయ్యేసి పలకరిస్తే, వెంటనే నవ్వి వాడితో మాట్లాడుకుంటూ కిందికి దిగేస్తా.

చాలా చిన్న మాటలు ఉంటాయి అవి. ఆ కొన్ని మాటలు మాట్లాడుకోకున్నా వచ్చే మార్పేమీ ఉండదు. అవి మాట్లాడుతున్నప్పుడు నీ గురించి ఆలోచిస్తా.

ఈ ప్రపంచంలో ప్రతిక్షణం ఎవరున్న కాల పరిస్థితుల్లో వాళ్లు ఎవరితోనే ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటారు. ప్రతిసారీ చాలా గొప్ప మాటలే మాట్లాడుకోవాల్సిన పనేం లేదు. “ఎండలు మండిపోతున్నయి అప్పుడే” లాంటి అతి సామాన్యమైన మాట కూడా కావొచ్చు అది. ఆ మాట మాట్లాడుతున్న సమయానికి ప్రతిసారీ గొప్ప ప్రదేశాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు.

ఎక్కడో పార్కులో కూర్చొని, ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం మనం. నేను నీ కళ్లలోకి చూసి, “యూ ఆర్ మై ఎవ్రీథింగ్” అంటాను.

నేను ఏ బస్సులోనో ఊరెళ్లిపోతూ ఉంటే, “నా శరీరమంతా నీ వాసనే ఉంది” అంటావు నువ్వు.

అదే ఊర్నించి తిరిగొచ్చిన ఏ సాయంత్రమో, “ఐ ఫీల్ యువర్ బాడీ ఇన్ మై హ్యాండ్స్” అంటాను నేను.

ఒక్కోసారి నీ నుంచి వచ్చే ఒక్కో చిన్న మాటను, ఒక్కోసారి నేను నీకోసం దాచిపెట్టుకున్న లెక్కలేనన్ని మాటలు గుర్తుతెచ్చుకుంటాను.

ఏదైనా మంచి పాట వింటాను. ఉగాదికి ముందొచ్చే పసుపు రంగు పూలని చూసి, నువ్వని చెప్పి ఫొటో తీస్తాను. ఫాల్గుణ మాసంలోని నిండు చందమామ నువ్వని చెప్పుకు తిరుగుతాను.

అంతా చేసి మళ్లీ ఏ మాట దగ్గరో నీ దగ్గరికొచ్చి ఆగిపోతాను.

లేదంటే మళ్లీ ఆఫీసుకే వెళ్తూ, ఆ రాళ్లతో కట్టిన కంపౌండ్ వాల్ ఉన్న ఇంటిని చూస్తూ నిన్ను ఆలోచనల్లోకి తెచ్చుకుంటాను.

రేపు ఎప్పుడో మెట్రో వచ్చాక, ఈ దారిని మర్చిపోతాను.

అలాంటప్పుడు తెలీకుండానే ఏదైనా సందర్భంలో పన్నెండో నెంబర్ రోడ్డు మీద తిరుగుతుంటే, నిన్ను గుర్తుచేసుకుంటాను కదా! ఆ రోజు ఈ దారిని మిస్సయ్యి నీకోసం గుబులు పడినట్టు, ఇవ్వాళ నువ్వు లేని ప్రతి నిమిషాన్ని బతికేస్తున్నా.

బేబీ! నువ్వే ఏదో ఒక దార్లో కనిపించి, ఇంకెప్పటికీ ఆగిపోకూడదూ!?

*

 

 

 

 

 

 

 

 

 

 

 

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు