chanchayya

మాటలకందని  జ్వాల

భావజాలానికి అతీతమైన సాహిత్య చెలిమి చెంచయ్య  స్వభావం. ఎలాంటి  మినహాయింపులు లేవు. స్వచ్ఛమైన సాహిత్య ఆవరణను సైద్ధాంతికత ఆవల నుండి  చూశారు.

     ఆయన  కురుస్తున్న మేఘంలా కనబడతారు. అంతరంగంలో మాటలకందని  జ్వాల ఉంటుంది.  ఏభై ఏళ్ల సాహిత్య, ఉద్యమ జీవితం ఉంది.  నిరాడంబరతే తన  సాహిత్య సృజన. కావలి వంటి చిన్న పట్టణంలో జీవిస్తున్నారు.  జవహర్ భారతిలో పాఠాలు  చెప్పారు. కె .వి. రమణారెడ్డి సహచర్యం ఉండనే  ఉంది. సాహిత్య విమర్శనారంగంలో పనిచేసినవారు.  కవి, విమర్శకుడు, తాత్వికుడు, లోతైన సాహిత్య పరిశీలనా దృష్టి ఉన్న సాహిత్య జీవి.
ఇలా ఉన్నం చెంచయ్య గురించి ఎంత చెప్పినా చర్విత చరణం  కాదు. విప్లవ  రచయితల సంఘంలో సుదీర్ఘకాలం నాయకత్వ బాధ్యతలలో ఉన్నారు. అరుణతార సంపాదకుడు. అధ్యయన, సాహిత్య ఆచరణల మధ్య  రేఖ తెలిసినవారు.
      చెంచయ్య  కవిగా ప్రారంభమైనారు. ఏరచయిత కైనా కవిత్వ రచన ఒక పునాది. ఆ పునాది నుండి విస్తరిస్తారు. అనేక సాహిత్య రూపాలలో తమ మార్గాన్ని నిర్దేశించుకుంటారు. ఎక్కడో ఒకచోట కుదురుకుంటారు. రచయితకు తన శక్తి, సామర్థ్యాలపై సృజనాత్మ అంచనా ఉంటుంది. తన అస్తిత్వం  చుట్టూ ఉన్న జీవితం. ఆ విశాలత్వం. వీటన్నిటి నుండి గ్రహించే గ్రహణ శక్తి రచయితల అంతర్భాగంగా ఉంటుంది. తానేమి రాయాలనుకుంటున్నాడు అనేది తన  సాహిత్య కార్యాచరణలో భాగమవుతుంది .బహుశా ఈ అంచనా రచయితలను నిబద్ధత వైపు నిలబెడుతుంది. ఎక్కడా జారిపోకుండా రచనారంగంలో సుదీర్ఘకాల నిలబడిన వారు.  సాహిత్య అంచనా ముఖ్యం.  ఎక్కడో  ఒక చోట ఈ అంచనా నుండి వైదొలిగినవారు సాహిత్య కార్యక్షేత్రం నుండి నిష్క్రమిస్తారు. ఇక్కడే  చెంచయ్య సాహిత్య  జీవితాన్ని అంచనా వేయవచ్చు. ఈరెండిటి మధ్య ఉన్న అడ్డుకట్టల్ని  సమర్థవంతంగా దాటారు.
   సిద్ధాంతం- ఆచరణ పరిస్పర ప్రభావితాలు .ప్రపంచంలో  ఏ లోపం లేని వ్యక్తులు ఉండరు. ఉన్నవాళ్లతోనే సమాజాన్ని మార్చుకోవాలి. సమాజాన్ని మార్చుకోవడమనేది సరళరేఖలా సాగిపోయేది కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ వివేచన   చెంచయ్యను దృఢంగా నిలబెట్టింది. తన చుట్టూ ఉన్న వ్యక్తులు, సాహిత్యం  నిమగ్నతా స్వరాన్నిచ్చాయి. కాలంతో పాటు ప్రయాణం చేశారు . విరసం వంటి సంస్థకు నాయకత్వ స్థానంలో నిలబడి  ఆభావజాలాన్ని  నిలబెట్టడంలో చెంచయ్య  కృషి ఎన్నదగినది.  రాజకీయాలు, మతం మన రోజువారి వ్యవహార శైలిలో విడదీయరాని అంశాలు. మార్క్సిజం మన సమస్త భావనా ప్రపంచాన్ని ఉన్నతీకరిస్తుంది. ఈ వెలుగు నిరంతరమైనది.
     కామ్రేడ్ చెంచయ్య  1988లో విరసం కార్యదర్శి అయినారు. అదొక నిర్బంధ కాలం. ఆట, పాట బందనే ఎన్టీ రామారావు నిర్బంధకాలంలో సంస్థను, వ్యక్తులను విప్లవాచరణ వైపు నిలబెట్టడం సాహసికమైన చర్య. ఇక్కడే రెండు పని విధానాలు ఏకకాలంలో కొనసాగుతాయి.  ఈ మలుపు దగ్గర చెంచయ్య  నిలబడ్డారు.  రచన, కార్యకర్తత్వం ఈ రెండిటి మధ్య సంస్థను మరింత బలోపేతం చేశారు. చెంచయ్య నిశ్శబ్ద సాహిత్య సంచారి. పనిలో ఆడంబరతను ప్రదర్శించే వ్యక్తి కాదు. సౌమ్యత, సున్నితత్వం అతని అలంకారం . మృదువైన భావనా ప్రపంచం.  నేల విడిచిన సాము చెంచయ్యలో  లేదు.
     భాష, మాండలికాల పట్ల   ఆవగాహన ఉంది. భాషా శాస్త్రం  మిగిల్చిన వ్యక్తులలో ఒకరు. భాషను ప్రయోగించే సందర్భంలో రచన- ఉపన్యాస వ్యక్తీకరణలో తనదైన శైలి ఉంది. నిరాడంబరత ఉంది. రాజకీయ సాహిత్య విషయాలను సరళ రీతిలో చెప్పడం ఒక అభ్యాసం. విప్లవ రచనా క్రమంలో చెంచయ్య వంటి   వ్యక్తుల  ఒరవడి ప్రత్యేకమైనది. ఈ వైపుగా ఆయన  సాహిత్య, ఉద్యమ ప్రస్థానం కొనసాగింది.
    సాహిత్య విమర్శకునికి సాహిత్య పరిచయంతో పాటు సామాజిక పరిణామం పట్ల అవగాహన ఉండాలి. సాహిత్య విమర్శలో ఈ పరిణామానికి రాజకీయ చలనం ఒక కారణం కావచ్చు. రాజకీయాలు లేకుండా సాహిత్య రచనకు అర్థం లేదు. రాజకీయ పరిజ్ఞానం ఎక్కడ ఏమలుపు తీసుకుంటుందో రచయిత కూడా ఆ మలుపు దగ్గర నిలబడాలి. మానవ సంబంధాల చిత్రణలో కూడా వర్గస్వభావం ఉంటుంది.  ఈచలన స్థితి రచయితకు అర్థం కావాలి. విమర్శకునికి మరింత జాగరూకత అవసరం. ఇక్కడే చెంచయ్య విమర్శనా ప్రస్థానాన్ని అంచనా వేయవచ్చు. కవిత్వంలో నిత్య  ప్రయోగశీలిగా  ఉండే వేగుంటమోహన ప్రసాద్ మరణం తర్వాత   ‘మో ‘మొత్తం రచనా క్రమాన్ని విశ్లేషిస్తూ చెంచయ్య రాసిన విమర్శ  ప్రత్యేకమైనది. నిజానికి   ‘మో’   వంటి కవులపై సమగ్రమైన సాహిత్య విమర్శ  తెలుగులో రాలేదు  . ఇలాంటి కవుల పరంపరను విమర్శలోకి తీసుకొచ్చాడు. ఈ అంచనా తెలుగు సాహిత్య విమర్శకు ఒక చేర్పు.
     చెంచయ్య సాహిత్యజీవిగా ఉన్నారు. విరసంలో   క్రియాశీలంగా ఉన్నారు. సుదీర్ఘ కాలం సంస్థ నాయకత్వ బాధ్యతలను కొనసాగించారు .తన ముందటి సాహిత్య విమర్శకులు త్రిపురనేని మధుసూదన రావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, కె.వీ . ఆర్ సాహిత్య విమర్శనా పద్ధతులను కొనసాగింపుగా వున్నారు. కావలికి చెందిన భుజంగరాయ శర్మ వంటి కవుల సాన్నిహిత్యం చెంచయ్యకు ఉండనే ఉన్నది. భావజాలానికి అతీతమైన సాహిత్య చెలిమి చెంచయ్య  స్వభావం. ఎలాంటి  మినహాయింపులు లేవు. స్వచ్ఛమైన సాహిత్య ఆవరణను సైద్ధాంతికత ఆవల నుండి  చూశారు. భావ, భౌతిక వాద పునాది  చర్చ వచ్చినప్పుడు చెంచయ్య స్థిరంగా రాజకీయ విశ్వాసాల పక్షం .  తన చుట్టూ ఉన్న సామాజిక,   సాంస్కృతికావరణను  మార్క్సిజం అనే తాత్వికత నుండి అర్థం చేసుకొని సాహిత్య పరిశీలనలోని అంశాలను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.
       చెంచయ్య తెలుగు సాహిత్య విమర్శలో ఒక భాగం. మారుతున్న సాహిత్య ఆవరణను తనదైన దృష్టి కోణం నుండి విశ్లేషించారు. ప్రామాణికత అతని నిఘంటువు. విమర్శలో ఉండాల్సిన సున్నితత్వాన్ని దాటకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ‘విమర్శ కోసం విమర్శ ‘అనేది కాకుండా తెలుగు సాహిత్యాన్ని విమర్శ మరింత ఉన్నతీకరిస్తుందని నమ్మిన వ్యక్తులలో ఒకరు. రచయితగానే కాకుండా ఉద్యమ జీవితం కూడా చెంచయ్య ఆచరణ లో వుంది..   గుజరాత్ లో అరెస్టు  కాబడి  ఆరునెలలు  జైలులో ఉన్నారు. అనేక నిర్బంధాల మధ్య తన కార్యాచరణతో విరసంలో పనిచేశారు.  సామాజిక ,రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలలో చెంచయ్య క్రియాశీలంగా ఉన్నారు. అనేక ఒత్తిళ్ళ నుండి తనదైన సాహిత్య ఆవరణను విశాలం చేసుకున్నారు.
   భాష, భావ , వాక్య   వ్యక్తీ కరణ లో పొరపాట్లు ఉంటే ఎవరైనా యువరచయితలను  సరి చేసేవారు. వాక్య నిర్మాణం ఏ విధంగా ఉండాలో చెప్పేవారు. సాహిత్య ,ఉద్యమాల ఉపాధ్యాయుడు .నిత్య విద్యార్థి. విమర్శనారంగంలో జీవితకాల కృషి ఉన్నది. తెలుగు సాహిత్యంపై సమగ్రమైన అవగాహన ఉన్నది. పరిశోధన ఉన్నది. అనేక పుస్తకాలను ఆయన ప్రకటించారు.   ధారగా     సాహిత్య ప్రయాణం కొనసాగుతూ వుంది.
   సాహిత్యంలో చెప్పిన ప్రతి విషయం వాస్తవం అని చెప్పుకోవడానికి విమర్శకుడు అక్కరలేదు. సాహిత్యం అట్టడగు పొరలలో దాగివున్న చారిత్రకాం శాలను తవ్వి తీసే నైపుణ్యం విమర్శకుడికి అవసరం అనే దృక్పధం చెంచయ్యది. వర్తమాన    సాహిత్య విమర్శ ఏ విధంగా కొనసాగుతున్నది అన్నదానికి జవాబు చెంచయ్య మాటల్లో వ్యక్త మౌతుంది. నేటి సాహిత్య విమర్శ ఈ నమూనాతో కొనసాగితే సాహిత్య ప్రాసంగికతకి అదే పెద్ద కుదుపు.
*

అరసవిల్లి కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు