నా చిన్నప్పుడు మంత్రం జాగ్రత్తగా ఉచ్చరించాలనీ, తప్పుగా పలికితే మంచి జరగటం అటుంచి హాని జరుగుతుందనీ విన్నాను. మంత్రాలజోలికెళ్లటం మంచిది కాదులే అనుకుని వాటికి దూరంగా ఉండేవాణ్ణి. అయితే మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని ఈసడించే వాళ్ళుకూడా ఉండేవాళ్ళు. చింతకాయలు రాలవు కాబట్టి వీళ్ళ అభిప్రాయమే సరైందని అనుకునే వాణ్ని. కానీ వీళ్ళమీద పూర్తిగా నమ్మకం ఉండేదికాదు. ఏ పుట్టలో ఏపాముందో? చింతకాయలు రాలగొట్టే మంత్రాలున్నాయేమో? ఈ మధ్య అలాంటి సందేహాలు పూర్తిగా పోయాయి. కారణం – తెల్ల దొరలు అసలు మంత్రాన్నే ‘మంట్రా’ అంటున్నారు. వాళ్లకు ఎలాంటి హాని జరగటం లేదు. అంతే
కాదు. బుద్ధదేవుణ్ణి ‘బుడా’ అంటున్నారు. అయినా దేవుడేమీ పట్టనట్లు ఉంటున్నాడు. దీన్నిబట్టి నాకనిపిస్తోందేంటంటే, తొందరలోనే తెలుగు ప్రాంతాల్లో దేవాలయాల్లో పూజారులు మంట్రాలు చదువుతారు. పెళ్ళిళ్ళకూ, శ్రాద్ధాలకూ మంట్రాలే ఇక.
మీరు నవ్వుతున్నారు. మీకు నా మాటల మీద నమ్మకం కలగటం లేదు. తెల్లవాళ్లు అలా అంటే మాత్రం మనవాళ్ళు అలా ఎందుకంటారు? అనరు, అని మీ నమ్మకం. అవునా, సరే, చదవండి.
తెల్ల దొరలు విశాఖపట్నం వచ్చారు. వైజాగ్ అన్నారు. అలాగే దొరా అన్నారు నల్ల దొరలు. అంతే కాదు. దొరకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని వాళ్ళు కూడా వైజాగ్ అనటం మొదలుపెట్టారు.
విజయవాడను బెజ్వాడ అన్నారు నల్లదొరలు.
అక్కడతో ఆగలేదు.
నాపేరు కృష్ణమూర్తి కాదు దొరా, క్రిష్ అన్నాడు నల్లదొర. తెల్ల దొర సంతోషించాడు. వీడు పైకొస్తాడు అన్నాడు. నల్ల దొరకు ఎంత సంతోషమో!
వెంకటేశ్వరరావు వెన్ అయిపోయాడు.
మాధవరావు Mad అయిపోయాడు.
తెలుగు గుళ్ళలో పూజారులు మంట్రాలు చదివే రోజులొస్తాయి. మీ కింకా నమ్మకం కలగటం లేదా?
పందెం? పది డాలర్లు వేసుకుందామా?
*
ఈ తెల్ల దొరల సేవ మనమాటలకు మాత్రమే పరిమితం కాదు.
దొర నంది అంటే అది నందే. పంది అంటే పందే.
ఆ మధ్య నేనొక వ్యాసం రాశాను – లియో టాల్స్టాయ్ గురించి – కళల గురించి ఆయనకు ఉండిన అభిప్రాయాల గురించి.
లియో టాల్స్టాయ్ ఇంగ్లీషు వాడుకాదు.
రష్యా దేశస్థుడు. లెవ్ తాల్స్తోయ్.
ఆ పేరు పలకడం రాని ఇంగ్లీషు వాడు లెవ్ తాల్స్తోయ్ ని లియో టాల్స్టాయ్ చేశాడు.
సరే, తెలియని రోజుల్లో నేను కూడా లియో టాల్స్టాయ్ అన్నాను.
కానీ ఇప్పుడు తెలుసు కదా. ఇక లియో టాల్స్టాయ్ అనను.
ఈ మధ్య ఒక ఒక తెలుగు పత్రికలో పాశ్చర్ అన్న మాట కనిపించింది.
Pasture అంటే గొడ్లమేతకు వదిలేసిన పచ్చిక బీడు.
కానీ పత్రిక రాసింది ఆ pasture గురించి కాదు.
Louis Pasteur గురించి.
ఆయన ఇంగ్లీషు వాడు కాదు.
ఫ్రాన్స్ దేశస్థుడు.
మొట్ట మొదటి వాక్సిన్ తయారు చేసిన వాడు.
ఇంటిపేరు పాస్తొయిర్. పాశ్చర్ కాదు.
ఇవన్నీ నీకెలా తెలుసు అనుకుంటున్నారు కదూ? ఈ రోజుల్లో Google, Wikipedia సహాయంతో ఎవరు ఏదేశస్థులో, వారి పేరు వాళ్ళ దేశంలో ఎలా పలుకుతారో రెండు నిమిషాల్లో తెలుసుకోవచ్చు.
*
ఇంతకీ నాగొడవేంటంటే ఏ దేశం వారినయినా మనం వారి పేరుతోనే వారిని పిలవాలి. ఏ మాటనైనా స్థానిక ఉచ్చారణతో పలకాలి.
ఇంగ్లీషు వాడి తోకలాగా ప్రవర్తించడం మానుకోవాలి.
*
బుజ్జి మాటల్లో ఎంత చక్కగా చెప్పరో… తెలుగువాడి ఆంగ్ల దాస్యం గురించి. అది కూడా కొత్తగా…
తెలుగువాడి దాస్యం తెల్లదొరతోనే ఆగిపోలేదు.
ముందు ఆ దాస్యం సంస్కృతంతో మొదలయింది, ఆంగ్లముతో ముడివడింది, ఇప్పుడు హిందీతోనూ చెట్టాపట్టాలెసుకొని సాగుతోంది.
మొన్నడిదాకా మన తెలుగు పత్రికలు “మోది” పేరును “మోడి” అనే రాసేవి. మనం ఇంగ్లీషులో చదువుతాం గనక అది తప్పనే అనుమానమే రాదు. అనుమానమే రానప్పుడు గూగుల్ చేయాలన్న వూహే రాదు.
చదువులన్నీ అయిపోయి హైద్రాబాదులో వుద్యోగం వెతుకులాటలో వున్నదాకా Question ను “క్వశ్చన్” అనేవాన్ని.. బహుశా స్పష్టంగా పలకడం కోసం “శ్చ” మరింత వత్తి పలికేవాన్ని. “పాశ్చర్” పాశ్చర్ కాదేమోనన్న అనుమానమే రానప్పుడు ఎన్ని గూగుల్లు వుంటే ఏమి లాభం? 🙂
అవును. తెలుగు మాటలను సరిగ్గా పలకటం ఎంత ముఖ్యమో,
ఇంగ్లీషు మాటలను సరిగ్గా పలకటం కూడా అంతే ముఖ్యం.
Corona ను కరోనా అంటున్నారు మనవాళ్ళు. చదువున్న
వారు కూడా.