మహేష్ వేల్పుల కవితలు రెండు

నేను మహేష్ వేల్పుల, తొండ తిరుమలగిరి సూర్యాపేట, ఇంజనీరింగ్  పూర్తి చేశాను, పట్నంలో ఉన్నా. పల్లె పై మనుసు గుంజుతూనే ఉంది. వాగుల్లో, వంకల్లో, డొంకల్లో తిరగాడినవాడిని. మట్టిని ఒంటికి పుసుకున్నవాడిని. అందుకే నేను కవిత్వం రాస్తున్న. గాయపడిన ప్రతిచోటా వాక్యమై హత్తుకోవాలనుకుంటాను, చెరువెనుక పొలం లెక్క పచ్చగా అందరి గుమ్మిలో వడ్ల రాశిగా నిలవాలనుకుంటాను. అందుకే కవిత్వం రాస్తున్న. ఇప్పుడు కవిత్వం నాలో భాగమైంది, కన్నీటిని తుడిచే చేయిగా, చీకట్లో జంటై నడిచే మిణుగురుగా, మబ్బులతో సహవాసం చేసే పక్షిగా బ్రతకాలనుకుంటాను, అందులో కవిత్వంగా నిలవాలనుకుంటున్నాను.

1.
 బిగి కౌగిటితో

ప్రియా
నాకిక్కడా ఇంకేం మిగల్లేదు
నీతో కలిసి బ్రతకాలనే ఆశ తప్ప

చివరిసారిగా చూడాలని వుంది
రాసుకున్న లేఖలన్ని
విద్వేషపు మంటల్లో బూడిదయ్యాయి
ఇప్పుడు
నీ కౌగిట్లో కొన్ని
ప్రేమ లేఖలు రాసుకోవాలనుంది
నీ కాటుకను సిరాగా  అందిస్తావు కదూ ?!

దేహాలు ఒక్కటైనా మనల్ని
దేశాలు వేరనే
విధ్వంసమొకటి ప్రబలుతోంది
మన ప్రేమతో పాటు
చిన్నారి తల్లుల్ని
గర్భాశయ కూనల్ని
కన్నీటి అలలపై విసిరేస్తోంది.బాంబు చప్పుళ్ల మధ్య
నీ నుదిటి పై
ఒక ముద్దుగా నిలవాలనుంది
ఆ ముద్దు దండోరాతో
ప్రపంచ తల్లికి ప్రేమనొకసారి
గుర్తుచేయాలనుంది.ఆ మధ్యదరా సముద్రం పై
ఆ వెస్టర్న్ వాల్ పై
నీ ఒళ్ళో తలవాల్చిన క్షణాలు
ప్రేమగా నిమిరిన దృశ్యాలు
ఇక జ్ఞాపకాలు అవుతాయంటే
నేనెట్టా గుండెలు బాదుకునేది?!సరిహద్దులు లేని ప్రేమకు
దేశ సరిహద్దులంటూ
నిన్నాపుతున్నారా?
నేనొస్తా
ఒళ్ళంతా గాయాలతోనైనా-
ప్రేమ గీతికను బహుమానంగా తెస్తా
కొన ఊపిరిగా ఉన్నా సరే!
రాకెట్లు విసరబడుతున్న చోట
కొన్ని నవ్వుల్ని చల్లుదాం
దిక్కులు కూలకుండా
ప్రేమను అడ్డుగా పెడదాంప్రియమైన నీకు బిగి కౌగిటితో…

2.
నవ్వుల్ని ఓడించగలవా !?

తూట్లు బడ్డ ఈ నేల నుండి
నెలవంకలు పుట్టుకువస్తాయి
నవ్వులై తూటాలను వెక్కిరిస్తాయి
ఈ బూడిదని పచ్చని పైరు చేస్తాయి..

కళ్ళ నిండా
కత్తులు నింపుకున్న నీవు
రెక్కల్ని కోస్తూ, కలల్ని ఖననం చేస్తూ,
శ్వాసని
సమాధి చేస్తున్నావనే భ్రమలో ఉన్నావ్..

హహహ
భూమిని ధ్వంసం చేస్తున్నట్టు
ఆకాశాన్ని
ధ్వంసం చేసినపుడే మేమోడిపోతాం

నీ పిచ్చి గానీ
హరివిల్లు నిండిన ఆకాశాన్ని
ధ్వంసం చేయగలవా
వసంతాన్ని రాకుండా
ఆపే టెక్నాలజీ నీ వద్ద వుందా !!?ఈ శిథిలాల కిందా
అలకబడుతున్న మా రక్తం
ఏరులై పారుతున్న కన్నీళ్లు,
నీ సామ్రాజ్యవాదం పై
ఉమ్మేస్తున్న దృశ్యాలు
నీ విధ్వంసపు మెదళ్ళను
కోసే నవ్వుల పంటలు..నేలను, జీవాన్ని
నిస్సారం చేసి, నిర్వీర్యం చేసి
విజయమంటూ గర్విస్తున్నామే
నా దేహం ఛిద్రమైనా !
పిడికిలింకా పొద్దును తాకుతునే వుంది
నా వెచ్చని ఊపిరింకా
ప్రపంచపు
మానవాళి గుండెను తాకుతునే వుంది !!
**
మా దేహాల్ని ఓడించినంత సులభంగా
మా నవ్వుల్ని ఓడించలేవు మిత్రమా !!..

*

మహేష్ వేల్పుల

నా పేరు మహేష్ వేల్పుల. తొండ, తిరుమలగిరి, సూర్యాపేట..ఎం. టెక్ పూర్తి చేశాను. కవితలు, కథలు రాస్తాను. 2021 లో రాసిన "వలస కూలీ" కథకు తెలంగాణ రాష్ట్ర యూనివర్శిటీ స్థాయిలో ఉత్తమ కథగా నిలిచి గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు