మహిమల మేష్టారు పలకరింపు

నాలుగురోజుల కిందట ఒక చిత్రమైన ఫోన్ కాల్. ఒకాయన స్కూల్ టీచరు, అమ్మా కాస్త సమయం చేసుకుని వినండి అంటూ మొదలుపెట్టాడు. ఆయన దగ్గర మహిమలున్నాయట. ఆయన ఏమంటే అది జరుగుతుందట. ప్రజలంతా చుట్టూ మూగుతారట. మంత్రులతో సహా అందరూ ఆయనను సలహాసహాయాలు కోరతారట. ఎన్నో సన్మానాలు చేసారట.
ఇక ఆ తర్వాత నాకు వాట్సాప్ లో ఫోటోలు వీడియోలు మొదలయ్యాయి. చుట్టుపక్కల పామరజనాలను పోగుచేసి తీసుకున్న సెల్ఫీ వీడియోలు లాంటి దుమ్మూ దూగరా ను.
ఇంకా వస్తూనే ఉన్నాయి. నాకు మాటల ద్వారా కొంత తెలిసినా వీడియోలు స్పష్టంగా చెప్పేయి.
సమాజం మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ మరీ చెద పట్టిపోయింది. మహిమలూ అతీతశక్తులు చేసేవాళ్లూ, వాటిని నమ్మి విపరీతంగా వెంటతిరిగే వాళ్లూ కందుకూరి వీరేశలింగం గారు ఇంకా మరీ పాతబడకుండానే మొదలైపోయారు
ఈ టీచర్ ది అమాయకత్వమో మూర్ఖత్వమో అర్ధంకాలేదు. ఎందుకంటే మొహాన పెద్ద పెద్ద బొట్లు, వేషధారణ భయపడేలాగేఉన్నాయి. ఈయనను విద్యార్ధులు ఎలా స్వీకరిస్తారో అర్ధం కాలేదు
వీరేశలింగం గారి రాజశేఖరచరిత్ర నవల అంతా వీటిమీద సహేతుక ఖండనే కదా. రాజశేఖరుడి ఆస్థంతా ఇలాంటివారి వల్లే పోగొట్టుకున్నాడని కదా తేల్చారు.
దేవతల పేరుచెప్పి చేసే మహిమలు ఉన్నాయా లేదా పక్కనపెడితే వాటి పేరుతో తాము నమ్మో నమ్మకో మోసగించేవాళ్లు మాత్రం ప్రతీ వందకీ ఒకరు కనిపిస్తున్నారు. అదీ దౌర్భాగ్యం
నాకు వెంటనే శ్యామ్ బెనగళ్ తీసిన అనుగ్రహం సినిమా గుర్తొచ్చింది. చింతామణి త్రియంబక్ ఖానోల్కర్ అనే రచయిత రాసిన ‘కొండూర’ అనే మరాఠీ నవల  ఆధారంగా అదే పేరుతో వేరే భాషల్లో కూడ తీశాడు. 1976 లో దీన్ని విడుదల చేసినప్పుడు  ఎవరూ సరిగా రివ్యూ రాయలేకపోయారు. అతి కొద్ది మంది మాత్రమే పట్టుకున్నారు.
అతీతశక్తులు ఉన్నాయా లేవా అన్నదానికంటే ఒకవేళ ఏదైనా శక్తి ఎవరివల్లనేనా వస్తే వాళ్లు మూర్ఖులు మొండివాళ్లూ ఐతే వాళ్ల జీవితం ఎంతగా అతలాకుతలం అవుతుందో ఆ సినిమా లో చెప్పేడు, అతని పద్ధతిలో.
తీసుకున్న కథాంశమే ఒక పట్టాన అవగాహనకు కష్టం. అలాంటిది దాన్ని మరింత సంక్లిష్టంగా చెప్పడం వల్ల సినిమా పూర్తయ్యాక కూడా ఏమంటున్నాడో అర్ధం కాదు.
అందుకే అప్పట్లో ఎవరూ సరిగా రివ్యూలు చెయ్యలేక పోయుంటారు. మళ్లీ చూద్దామనిపించింది ఈ మహిమల మేష్టారు పలకరింపు తర్వాత.
విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతపు నేపధ్యంలో కథ మొదలవుతుంది. అక్కడి గుహలలో చిరంజీవిగా ఇప్పటికీ ఉండే అప్పికొండస్వామి అనే సిద్ధుడి కారణంగా జీవితాన్ని సంక్షుభితం చేసుకుని భయభ్రాంతుడిగా పలాయితుడైన పరశురాముడనే బ్రాహ్మణ గృహస్థు కథ.
అప్పికొండస్వామి కోటికొక్కరికి కనిపిస్తాడని, ఏదో ఒక వరం ఇస్తూ కఠిననియమాలు విధిస్తాడని దాన్లో కూరుకుపోకుండా సురక్షితంగా బయటపడడం వారి వివేకం మీద ఆధారపడి ఉంటుందని ముందే దర్శకుడు చెప్తాడు.
అసలు ఉన్నాడా అనే సందేహం కూడా వెలిబుచ్చుతాడు.
పరశురాముడు భార్యతో ఉమ్మడికుటుంబంలో ఉంటున్నాడు. కానీ బాధ్యతల పట్ల కొంత నిర్లక్ష్యం తో ఉండడం, అన్నగారితో గొడవ పడడమూ వల్ల ఇల్లు వదిలి ఆగ్రహంతో నడుచుకుంటూ, తనలో తను మాటాడుకుంటూ పోతూండగా అప్పికొండస్వామి ప్రత్యక్షమై ఒక చెట్టు బెరడు ఇచ్చి” నిన్ను అనుగ్రహిస్తున్నాను” అన్నాడు.
“ఇది అరగదీసి నీళ్లలో కలిపి ఇస్తే గర్భవిచ్ఛిత్తి అయి పాపం నశిస్తుంది. కానీ ఇది పని చెయ్యాలంటే కఠినబ్రహ్మచర్యం పాటించాలి” అని చెప్పి మాయమైపోతాడు
సహజంగా అందరిలాగే పరశురాముడు విభ్రాంతి కి లోనయి ఇంటికొచ్చి తల్లిని అడుగుతాడు అప్పికొండస్వామి ఉన్నాడా అని. ఆమె లెంపలేసుకుని ఆయన గొప్ప సిద్ధుడు అంటుంది. “మన ఊరి గొల్లడికి కలలో కనిపించి జలగ్రహణ విద్య అనుగ్రహించేరు. వాడికి భూమిలో జల ఎక్కడ ఉందో తెలుస్తుంది. ప్రజలు వాడిని తీసుకెళ్లి చూపించిన చోటే నుయ్యి తవ్వించుకుంటారు” అంటుంది
 పరశురాముడు గొల్లడిని రప్పించి పరీక్షస్తే తమ ఇంటి సమీపంలో జల పడింది. నిజానికి పడకుండా ఉండాలని, అప్పికొండస్వామి మహిమ ఋజువు కాకూడదని పరశురాముడు కోరుతున్నాడు.
అది ఋజువయ్యేసరికి అతని లో భ్రాంతులు ప్రవేశించేయి. అప్పటికే బ్రహ్మచర్యం మొదలు పెట్టిన అతనికి దేవాలయపు గంటలు వినిపించడం మొదలయింది. వెళ్లి ఆ పాడుపడిన దేవాలయం చూస్తే గంటలు నిశ్చలంగా ఉండేవి మోతవినపడుతూ ఉండేది. క్రమంగా భార్య రూపంలో అమ్మవారు కనిపించడం మొదలయింది.
ఆమె దేవాలయం బాగుచేయించమంది.
ఆ ఊరి కామందు భైరవమూర్తి దగ్గిరికి వెళ్లి అడిగాడు.
ఆ పెద్ద లోగిలిలో పిల్లలు లేని ఖామందు భైరవమూర్తి అన్నగారి కొడుకు, కోడలు, భార్యలతో ఉంటున్నాడు. అన్నకొడుకు వాసు అవిటి వాడు. కోడలు అద్భుత సౌందర్యవతి. కామందు వ్యసనపరుడు, స్త్రీలోలుడు.
ఊళ్లో పాపాలు పెరుగుతున్నాయని గుడికట్టించమని అమ్మవారు చెప్పిందని డబ్బు కావాలని చెప్తే ఎందుకో భైరవమూర్తి సరేనని ఒప్పుకొన్నాడు
గుడిపని మొదలయింది. పరశురాముడి పట్ల ప్రజల్లో భక్తి కూడా మొదలయింది. అప్పటికే మొండితనమూ మూర్కత్వమూ ఉన్న పరశురాముడిలోఆధ్యాత్మిక అహంకారం మొదలయింది.
ప్రజలమూర్ఖత్వానికి గుడ్డినమ్మకానికీ సహజంగా కుదిరే సంఘటనలు యాదృచ్చికంగా జరుగుతాయి. చివరకు అన్నగారు వదినా తల్లీ కూడా భక్తులైపోతారు. పరశురామ్ లో ఇప్పుడు మరో సంఘర్షణ. గుడి పూర్తయినా ఊళ్లో పాపాలు పెరుగుతున్నాయని భార్యరూపంలో అమ్మవారు చెప్తున్నట్టే భ్రాంతి. పాపాలు వెతికే పనిలో భైరవమూర్తి మీద దృష్టి పడుతుంది. కోడలితో సంబంధం ఉందని నమ్ముతాడు
ఇంతలో ఆమె గర్భవతి అని తెలుస్తుంది. అవిటి వాడైన వాసు వల్లకాదు, భైరవమూర్తి వల్లే అని భ్రమించిన పరశురామ్ ఆ పాప ప్రక్షాళన తన బాధ్యత అని నమ్మి అప్పికొండస్వామి ఇచ్చిన వరం ఇందుకోసం అని ఆత్రత పడతాడు.
ఆయన ఇచ్చిన బెరడు అరగదీసి నీళ్లలో కలిపి ఆమె చేత తాగించబోతాడు
పేదఇంటినుంచి వచ్చిన పిల్లయినా ఆమె ఆ ఊరి బడిపంతులు చెప్పే వీరేశలింగం గారి సంఘసంస్కరణ మాటలవల్ల ప్రభావితం అవుతూ ఉంటుంది
ఆమెకు ఇతని మహిమలపట్ల నమ్మకం లేదు. వద్దని తిరస్కరిస్తుంది. కాదు మీ ఇద్దరిమంచికోసమే అని
భార్యాభర్తలని ఒప్పించి తీర్థం ఇచ్చేస్తాడు గర్భవిచ్చిత్తి కోసం. ఇదంతా అయ్యాక వెళ్లేముందు భైరవమూర్తి పరశురామ్ ని ఆపి కాగలకార్యం గంధర్వులు నెరవేర్చేరని, తనకు కోడలికీ ఏసంబధమూ లేదని కానీ పిల్లలు లేని తన అస్తి అన్నవారసుడికి వెళ్లకుండా బాగా చేసేవని వెక్కరింపుగా నవ్వుతాడు
పరశురామ్ కి పిచ్చెక్కినంత పనైంది. గంటలు వినిపించడం మానేసాయి. భార్యను బతిమాలుతాడు అమ్మవారిని రప్పించమని. ఆమెకు కన్నీళ్లు తప్ప మరోటి తెలియదు.
చివరకు విరుగుడు భార్యకు చెప్పి ఆమెను బలాత్కరిస్తాడు. బ్రహ్మచర్యం మీరితే తీర్థం పనిచయ్యదు కదా అని.
కానీ అప్పటికే అత్తగారితో సహా అందరూ ఆమెను హెచ్చరిస్తుంటారు. అతను అతీంద్రియపురుషుడు జాగ్రత్తగా దూరంగా ఉండు అని. అతని బ్రహ్మచర్యాన్ని కాపాడే బాధ్యత నీమీదే ఉందనీనూ.
తెల్లవారేసరికి ఆమె (రాయిపడి పేల్చేక జల ఊరినా మధ్యలో ఆగిపోయిన) నూతిలో రాయిమీదపడి మరణించిఉంటుంది.
పరశురామ్ ఉన్మాదిలా అప్పికొండస్వామి కోసం అరుస్తూ అడ్డంగా పరిగెడతాడు
ఈ సినిమా రివ్యూలలో బలాత్కారం సీన్ లో వాణిశ్రీ నటనను అద్భుతమని పొగిడాయి తప్ప ఇంకేమీ చెప్పినట్టు లేదు.
ఎప్పటిలాగే గోవిందనిహలానీ ఫోటోగ్రఫీ, వనరాజ్ భాటియా సంగీతమూ బావున్నా మూడ్ కోసం రాసినపాటలు చాలా అడ్డుగా ఉన్నాయి. తెలుగుసినిమా ముద్రనుంచి తప్పించలేకపోయాయి.
శ్యామ్ బెనగల్ ఇందులో మహిమలు అనేవి ఉన్నాయా లేవా అన్న దానిగురించి మాటాడలేదు.మనం కూడా వెతకవలసినది అవికాదు అనే అతని ఉద్దేశం.
 చివరిసీన్ లో భైరవమూర్తి ఇంట్లోంచి పనమ్మాయి చంటిపిల్లాడికి ఎత్తుకుని బయటకు వచ్చి తిరుగుతుంది. అంటే గర్భం విచ్ఛిన్నం కాలేదని.
మంత్రాలూ, మహిమలు ఉండొచ్చు కానీ వాటికన్న మనిషికి తన మామూలు జీవితం ముఖ్యం. అందుకే గొల్లడి ప్రసంగం తెచ్చాడు రచయిత. అప్పికొండస్వామి అతనికీ ఒక వరం ఇచ్చాడు. కానీ అతడు ఎవరేనా అడిగితే తప్ప ఆ ధ్యాస లో లేడు. కానీ పరశురామ్ తాను అసాధారణ వ్యక్తినని నమ్మి మిగిలిన జీవితాన్ని వదిలేశాడు. అహంభావిగా మారి అతీతశక్తి నని అనుకున్నాడు.
ఫలానా వారు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు అనగానే ప్రజలు మహిమలేమైనా ఉన్నాయా అడుగుతారు. మహిమలు ఉంటేనే గొప్ప అని నమ్ముతారనమాట.
రాత్రంతా పుష్కలావర్తకమేఘాలు ఘీంకరించినా, కుండల పోత గా వృష్టి కురిసినా తెల్లవారేసరికి పూలు వికసిస్తాయి. అంతకన్నా మహిమ ఏం కావాలి. మనకంటే ముందే నిత్యమూ లోకాన్ని వెలిగించే అద్భుతశక్తి ఒక్కరోజు కూడా మానకుండా సప్తాశ్వాలతో ప్రత్యక్షం కావడం కన్న మహిమ ఏముంది. శిశిరంలో ఆకురాల్చి తిరిగి వసంతారంభానికే నిలువెల్లా చిగిర్చే వృక్షసందోహాలను చూపించే పృధ్వి చేసే మహిమ సామాన్యమా!!
పూలకంచాలలో రోలంబములకు రేపటిభోజనము సిద్ధపరచినావు అంటాడు కరుణశ్రీ.తుమ్మెదలకు తెల్లవారేసరికి పూలకంచాలలో రాత్రికి రాత్రే భోజనం సిద్ధం చేసే వాడి మహిమ కన్న  వేరే  మాయ ఏముంది
కబీర్ “పరిహరవచన కఠోర్” అంటాడు అదే వశీకరణ విద్య అని.
మామూలు జీవితాన్ని హుందాగా జీవించడంకోసం సాధన చెయ్యడమే గొప్పవిద్య అనీ
అదిచేసే వారే యోగులనీ మీరు మహిమల మాయ మాని మీ విద్యార్ధులకు శ్రద్ధగా పాఠాలు చెప్పండనీ సదరు మహిమల మాష్టారికి చెప్పడం ఎలా?!!!
“దెయ్యములను గూర్చి మీకు సందేహజ్ఞానము గాని నాకు నిశ్చయజ్ఞానము” అంటాడు సాక్షి వ్యాసాలలో జంఘాలశాస్త్రి. ఆ నిశ్చయ జ్ఞానం అవి లేవు అనే విషయంలో అని చివరకు తేలుస్తాడు.  ఎందుకో తరచు ఇలాంటివారిని చూసినప్పుడు ఆమాట గుర్తొస్తూఉంటుంది.

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మహిమలు, మాస్టర్ కి,మీరే గట్టిగా, class చెప్పండి.మేడం..!మహిమలు ఉంటే, చుట్టూరా,,ఈ సమాజములో ఉన్న,లోపాలను, మనుషుల,వేదనలు నుతొలిగించమన డి.కొన్ని సమస్యలు అయిన. పరిస్కారం అవుతాయి.,అంతేకదా, మేడం!

  • చాలా బాగా రాశారు వీరలక్ష్మి గారు . ధన్యవాదాలు మీకు.

    • థాంక్యూ వెరీమచ్ సుబ్రహ్మణ్యం గారూ

  • లక్ష్మి! ఫోను మరియు WhatsApp messages, Videos ,సినిమాలు , పుస్తకాలు గుర్తుచేసి, మంచి ఆర్టికల్ వచ్చింది, మంచి కథ ! ఈ మద్యనచూస్తూంటె ఏమనిపిస్తుంది అంటే మారని వ్యవస్థ! ఎంత వైజ్ఞానికంగా అభివృద్ధి చెందినా మనిషి మనస్సు సంకుచించిపోతూంది. ఎంతమంది వీటికి బలిఅయిపోతున్నారు!! చాలా బాగా రాశారండి. ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం

  • కాకినాడ అక్కయ్య గారూ!

    శ్యామ్ బెనగళ్ “అనుగ్రహం” సినిమా ప్రస్థావన, వాణిశ్రీ అద్భుత నటన అంటూ గొరుసన్న పొడిపొడి మాటలు ( సారీ రాతలు ) లే తప్ప ఇంతగా వివరాలు ఇప్పటిదాకా తెలుసుకోలేదు.

    “ మనకంటే ముందే నిత్యమూ లోకాన్ని వెలిగించే అద్భుతశక్తి ఒక్కరోజు కూడా మానకుండా సప్తాశ్వాలతో ప్రత్యక్షం కావడం కన్న మహిమ ఏముంది. శిశిరంలో ఆకురాల్చి తిరిగి వసంతారంభానికే నిలువెల్లా చిగిర్చే వృక్షసందోహాలను చూపించే పృధ్వి చేసే మహిమ సామాన్యమా!! “

    “ మామూలు జీవితాన్ని హుందాగా జీవించడంకోసం సాధన చెయ్యడమే గొప్పవిద్య… అదిచేసే వారే యోగులనీ “

    అన్న అక్కయ్య గారికి శిరసు వంచి పాదాభివందనం చెయ్యాలని ఉన్నా నాకా అర్హత ఉన్నదా అని సందేహము.

    • థాంక్యూ రామయ్య గారూ పాదాభివందనానికి శిరసు వంచఖ్కరలేదు. అయినా మనకవన్నీఎందుకు? స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం

  • ఎందరి అనుభవాలను అతిదగ్గరగా చూసినా సరే ,తన దాకా వచ్చేసరికి మనిషి ఈ మూఢనమ్మకాలకి బలి అయిపోతుంటాడు అనుకుంటా.మళ్లీ మళ్లీ అలాంటి మోసాల కథలే వినిపిస్తుంటాయి .చాలా బాగా చెప్పారు.

  • గమనించారా ,కథలు ,సినిమాలు ఎంత అర్థవంతంగా హేతువాదంతో చూపినా ,జనం దృష్టి ఆ మూడనమ్మకాల పైనే వుంటుంది .మంచి థీమ్ .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు