మహాశ్వేతా దేవి రిక్షావాలా – ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ రచయిత!

అతను ఒక తోటి ఖైదీ ప్రోత్సాహంతో – గోడలమీదా, నేలమీదా, మట్టితో, రాయితో, అక్షరాలు దిద్దుకుని కూడబలుక్కుంటూ చదువుకోడం నేర్చుకున్నాడు.

చేతిలో పుస్తకాన్ని ఒళ్లుమర్చి చదువుకుంటున్నాను, రిక్షాలైన్ లో నా వంతు వచ్చిందని తెలియనేలేదు. గభాలున మేలుకున్నా, తలెత్తి చూస్తే ఎదురుగా ఒకామె ఒక పాతికేళ్ల యువకునితో కలిసి రావడం కనిపించింది. టీచర్‌గా మాకందరికీ పరిచయమైన ముఖమే. మళ్లీ ఒకసారి నేను చదువుతున్న పుస్తకం పేజీలు వేళ్లతో తిరగేసాను. ఆరో ఏడో పేజీలు మిగిలేయంతే, ఏం చెయ్యాలో తోచలేదు, నావెనక నిలబడ్డ అతన్ని ఆసవారీ తీసుకోమని అడిగేను. నేను తర్వాత వచ్చేవాళ్లని ఎక్కించుకుంటానన్నాను.

“చాల్చాలు, తెలివి ఎక్కువౌతోందే, గుర్రం దిగింక” అని కోపంగా జవాబిచ్చాడు అతను. “ఇద్దరు పాసింజర్లు వచ్చారని తెలివిగా నామీద తోసేద్దామనుకుంటున్నావా, నీ వొంతిది, నీ కేది రాసి పెట్టుంటే అదొస్తుంది. నా వొంతొచ్చినప్పుడు నేను తీసుకుంటాను. నీలాగే అందరం ఎండలో మాడుతున్నాం, ఆ పుస్తకం పక్కన పడేసి సవారీ కట్టు – పో!” అని గసిరాడు.

నాకేది రాసిపెట్టుంటే అదొస్తుందని కదా అన్నాడు?  ఆమాట నిజం. లేకపోతే ఆమె నా రిక్షా లోకే ఎక్కడం ఎలా సంభవిస్తుంది?

సరే, ఇక చేసేదేం లేక అయిష్టంగానే లేచి పుస్తకాన్ని సీట్ కిందకి తోసేను. సూర్యుడు పడమటింటికి దిగుతున్నాడన్న మాటే గానీ, వేడి భరించలేకుండా ఉంది. నా ఒళ్లు చెమటతో తడిసి ముద్దై ఉంది.

రోడ్లు మామూలు కంటే ఎక్కువ రద్దీగా ఉన్నాయి. ఆరోజు శనివారం, స్కూళ్లు కాలేజీలూ వదిలే టైమయింది, ఇంటి మొహం పట్టిన స్టూడెంట్లతో వీధులు నిండి పోతున్నాయి. వచ్చి నాముందు నిలబడ్డ పెద్దావిడని చూసేను, నెరిసిన జుత్తూ, కళ్లద్దాలూ, పక్కగా వేలాడుతున్న సంచీ. ఆమె ముఖం సీరియస్ గా ఉంది, ఆమె ఎలాటి టీచరయ్యుంటుందో అలాగే కనిపించింది.

ఆమె జాదవ్ పూర్ వెళ్లాలట. రిక్షా సాగి పోతోంది. సగం దారిలో అనుకుంటా, ఒక పదం గుర్తొచ్చింది: జిజీవిష.  కొన్ని రోజుల క్రితం చాణక్యసేన్ పుస్తకం చదివినప్పుడు తగిలింది. ఆ మాటకి అర్ధం ఎవరూ చెప్పలేక పోయారు నాకు. అప్పటి నుంచీ తలలో అప్పుడప్పుడు మెదులుతూనే ఉంది. అందుకని ఆమెని అడిగాను .

“దీదీ, మీరేమనుకోనంటే ఒక మాటకి అర్ధం అడగొచ్చా, జిజీవిష అనే మాటకి అర్ధం ఏమిటమ్మా?”

నా ప్రశ్న ఆమెకి ఆశ్చర్య కలిగించిందనుకుంటా, ఆమె అంది: “జిజీవిష అంటే జీవించాలనే కోరిక. అది సరే గానీ ఆమాటని నువ్వెక్కడ విన్నావ్?”

“ఒక పుస్తకంలోనమ్మా,” అని జవాబిచ్చేను.

నిశ్శబ్దం. పాసింజర్ సీట్లో నావెనక కూర్చుంది. ఆమె ముఖం లోని భావాలు కదిలి ఉంటాయో నాకు చూసే అవకాశం కలగలేదు.

కాసేపటి తర్వాత ఆమే అడిగింది, “నువ్వెంత వరకూ చదువుకున్నావ్?”

“నాకు స్కూల్ కెళ్లి చదువుకోడం కుదరలేదమ్మా.”

“మరి చదవడం ఎలా వచ్చింది?”

“అంటే … నా అంతట నేనే కొద్ది కొద్దిగా… నేర్చుకున్నానమ్మా,” నేను చెప్పేను.

చక్రాలు గిర్రుగిర్రని తిరుగుతున్నాయి. మా గమ్యస్థానం దగ్గర పడింది.

అయితే తిరుగుతున్నవి నిజానికి ఏం చక్రాలు? అవి రిక్షా చక్రాలా లేక నా భాగ్య చక్రాలా? ముందుకుకదులుతున్నది ఏది? నా రిక్షానా లేక నేనా? అంధకారం, అవమానాలతో నిండిన అనామక జీవితం నుంచి గౌరవం, మర్యాద దొరికే జీవితంలోకి ప్రవేశించుతున్నానా?

అప్పుడు ఆమె ఇలా అంది, “నేనొక పత్రిక నడుపుతూ ఉంటాను, దానిలో నీలాటి శ్రమజీవులూ, కాయ కష్టం చేసేవారూ – రాస్తూ ఉంటారు. నాకోసం రాస్తావా? నువ్వు రాస్తానంటే, నేను ప్రచురిస్తాను.”

నేను? రాయడమా!
పుస్తకపు ముఖచిత్రాల మీద మెరిసే పేర్లూ, రేడియోలో వినపడే గొంతులూ, టీవీ స్క్రీన్ల మీద తేలుతూ కనపడే ముఖాలూ – కళ్ల ముందు తిరుగాడేయి. వారు మన నేల మీదే నడుస్తారని అప్పటి వరకూ అనుకోలేదు. ఎక్కడో వేరే గ్రహం మీద ఉండే మనుషులన్నట్టు నా భావం. మన లాగే తింటారనీ, పడుకుంటారనీ, బజారు కెళతారనీ, వీధుల్లో తిరుగుతారనీ – అసలు ఊహించనేలేను. ఏది ఏమైనా – వాళ్లెవరూ రిక్షా అయితే తొక్కుతారని ఒక్కనాటికీ అనుకోలేదు.

అలాటిది ఈ మహిళ మరి ఆ వరాన్ని ప్రసాదిస్తానంటుందేమటి?

“నేను రాసేది అచ్చు వేస్తారా?”

“ఔను, అదే అంటున్నాను. రాస్తావా మరి?”

“కానీ … నేను దేని గురించి రాయగలను?” అడిగాను.

“రిక్షావాలాగా నీ జీవితం గురించి చెప్పు,” ఆమె చెప్పింది. “నువ్వు ఈపనిలోకి ఎలా వచ్చావు, నువ్వు రోజుకెంత సంపాదిస్తావు, నీ కుటుంబానికి సరిపోతోందా – అవన్నీ రాయి, ఏం రాస్తావా?”

“నేనింతకు ముందెప్పుడూ రాసి ఎరగను,” సంకోచంతో చెప్పేను. “కానీ ప్రయత్నిస్తాను. రాయగలిగినట్టైతే, మీదగ్గరకి తెస్తాను. మీ అడ్రస్ ఇస్తారా?”

ఆపాటికి జాదవ్ పూర్ చేరుకున్నాం. ఆమె కాగితం, పెన్నూ బయటికి తీసింది. కాగితంమీద ఏదో రాసి, నాచేతికి అందించింది.

“ఇదిగో,” అంది.

కాగితం ముక్క మీద రాసి ఉన్నది చదివేను, నా చుట్టూ ఉన్న ప్రపంచం అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది.

“మీరా?!” ఆశ్యర్యాతిరేకంతో అరిచేను.

“నేనెవరో తెలుసా?”

నాకు నువ్వెవరో తెలియకపోవడమేమిటమ్మా, ఓ మహోత్కృష్ట అక్షరశిల్పీ! ఎటువంటి జ్ఞానమది? తిరుగుబాట్లూ, ప్రతిఘటనలూ, ఉద్యమాలూ, ఆక్రోశాలూ – వాటి లోంచి, ఆ స్వేదం, రక్తంలోంచి –  ఉత్పన్నమైంది. పీడితుల పక్షానా, నిస్సహాయుల పక్షానా నిలిచి – వారి కోసం – కలాన్ని ఖడ్గంగా ఝళిపించిన ఆగ్రహం అది. నీ ద్రౌపదిని చదివేక ఆ రేపిస్ట్ లని వెతికి వేటాడి చంపాలని ఊగిపోయానమ్మా! వారు కాకుంటే అలాటి దుర్మార్గులని కొందరినైనా శిక్షించాలనిపించిందమ్మా …

అయితే ఇదేదీ చెప్పలేదు. నా ఉధృత భావప్రవాహన్ని – భాషలోకి తేలేకపోయాను.

నేనన్నాను, “మీ పుస్తకాలు చదివేను. అగ్నిగర్భ ఇదిగో ఇక్కడే ఉంది.”

సీట్ పక్కకి జరిపి పుస్తకం బయటికి తీసేను.

ఆమె మనసులో ఏం ఆలోచనలు మెదిలాయో నాకు తెలియదు. నాకు మాత్రం ఒక అపురూపమైన సంతృప్తి ఆమె ముఖంమీద మెరిసిందని తోచింది. ఆమె ఏబడుగు జీవుల కోసం రచనలు చేస్తోందో, వారు ఆమె పుస్తకాలని గుర్తించారనీ, శ్రద్ధాసక్తులతో చదువుతున్నారనీ తెలియడం – ఆమెకి ఆనందం కలిగించి ఉంటుంది.

ఇక నా సంగతి చెప్పాలంటే, ఉద్వేగం పట్టలేక ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. శ్వాసతీసుకోడం కష్టమైపోతోంది. నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది, నా శరీరం వణుకుతోంది, మనసూ కంపిస్తోంది, నా జీవమే ఒక ప్రకంపనగా మారింది. నిటారుగా శరీరాన్ని నిలబడనంటోంది … తల ఎత్తి నిలబెట్టడం శక్యమవడం లేదు. నా శిరస్సు దానికదే వంగి పోయింది, ఆమె కాళ్ల ముందు సాగిలపడిపోయాను. తల ఎత్తి నిలబడే సందర్బాలు అనేకం ఉంటాయి మనిషికి. ఎవరికైనా శిరసు వంచి గౌరవం చూపగల అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. సరైన పాఠశాలగది మొహం చూడని ఒక పిల్లవాడు, కేవలం తల్లిపాలతోనే తన దాహాన్ని తీర్చుకున్న పసివాడు, ఇన్నేళ్ల  తర్వాత ఒక దేవత ముందు నిలుచున్నాడు. సాక్షాత్ హంసవాహిని సన్నిధి. ఔను, సరస్వతికి మరో పేరు మహా శ్వేత కదా?

మర్నాడు తనని వచ్చి కలవమని, తనతో కలిసి లంచ్ చెయ్యమని ఆమె ఆహ్వనించింది. ఈలోగా ఆమె ఎక్కాల్సిన బస్ వచ్చింది. బస్ ఎక్కుతూ ఆమె చెయ్యి ఊపింది – ఏదో దివ్యహస్తం ఆశీర్వదించినట్టు అనిపించింది.

మరుసటి రోజు ఉదయాన్నే ఏడు గంటలకల్లా, బాలీగంజ్ రోడ్లో ఉన్న ఆమె ఇల్లు చేరుకున్నాను. వంకర తిరిగి ఉన్న మెట్లు ఎక్కుతున్నాను, తలలో ముప్పిరిగొంటున్న భావాల సందోహం.

ఆ మెట్లు: పూలూ, పళ్లూ, కలుపు మెక్కలూ, పురుగులూ, క్రిమి కీటకాలూ పుష్కలంగా ఉన్న మట్టిలోకి  బలంగా పాదుకుని ఉన్న ఆమెట్లు, వాటి రెండో అంచు మాత్రం – అవధులు లేని సువిశాల స్థలంలోకి,  ఆశల దీపాలు వెలిగే ప్రాంగణం లోనికి, అప్పటికింకా రూపుకట్టని ఉజ్వల భవిష్యత్తు లోకి – తెరుచుకునే మెట్లు.

ఆమెట్ల మీద నడుస్తుంటే, నాకాలి ఒత్తిడికి జవాబుగా -వాటి భాషలో కిర్రుమంటూ స్వాగతం చెప్పేయి. మొదటి అంతస్థులోని ఆమె ఇంటి ముందు నిలుచునే సరికి, నా జీవితపు అత్యున్నత స్థానాన్ని చేరుకున్న భావం కలిగింది.

నేను బెరుకు బెరుకుగా తలుపు తట్టేను, ఆమె గొంతు జవాబిచ్చింది.

“తలుపు తెరిచే ఉంది, లోపలికి వచ్చి కూచో, మదన్.”

నన్ను చూడకుండానే నేనని గ్రహించింది. నిన్న కలిసిన పిచ్చివాడు, రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా ఉండి ఉంటాడు, పొద్దు పొడవగానే వచ్చేసి ఉంటాడని ఆమె ఊహించింది.

అది ఆమె కూచుని రచన సాగించే గది. చుట్టూ చూసాను. ఒక టేబులూ, కుర్చీ. టేబుల్ మీద పెన్నులూ, కాగితాలూ ఉన్నాయి. పది పన్నెండు నిమిషాల తర్వాత ఆమె వచ్చింది. ఆదివారం, సెలవు కావడంతో – పొద్దెక్కే కొద్దీ – చాలా మంది రావడం మొదలైంది. వారందరికీ నన్ను ఒక రచయితగా పరిచయం చేసింది.

“ఇదిగో ఈయన నా కొత్త రచయిత, మదన్.” రచయిత!

అలా నా జీవితంలోని అతి క్లిష్టమైన సమయం మొదలైంది. యుద్ధం చెసేవాడిని. తుపాకీ గొట్టాలూ, బాంబులతో చేసే దాని కన్నా కష్టతరమైన యుద్ధం. నాకు తెలిసి, అన్నిటి కంటే దుష్కరమైన పోరాటం.

ఒక వాక్యం మరో వాక్యంలోకి నా కన్నుగప్పి దూరిపోయేది. పెనుగులాడే వాడిని. పదాలు ఒక్కో చోట ఒక్కోలా ధ్వనించేవి. ఏది సరైనదో నాకెలా తెలియాలి? తల కొట్టుకునే వాడిని. ఏ పదాన్ని వాక్యంలో ఎక్కడ వాడితే – ఆవాక్యం అర్ధవంతంగానూ, వ్యాకరణబద్దంగానూ కూడా ఉండగలదు?అర్ధమయ్యేది కాదు.  కాగితాల మీద రాసే వాడిని, మళ్లీ  చించేసేవాడిని. రీముల కొద్దీ కాగితం, లీటర్ల కొద్దీ కిరోసిన్ ఖర్చయింది. కొన్నాళ్లు పనికి కూడా వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయేవాడిని. కొంతకాలానికి నేను రాసినదాని మీద కాస్తంత సంతృప్తి కలిగింది. ‘నేను రిక్షాలు తొక్కుతాను’  అనే పేరుతో బర్తిక 1981 జనవరి-మార్చి సంచికలో అది అచ్చైంది.

మహాశ్వేతా దేవి కేవలం రచయిత మాత్రమే కాదు. కవి మనీష్ ఘటక్ కూతురు, ఫిల్మ్ డైరెక్టర్ రిత్విక్ ఘటక్ మేనకోడలు, నాటకకర్త బిజన్ భట్టాచార్య స్నేహితురాలు – వీటన్నిటికీ మించి – ప్రతిఘటనా స్వరానికి బలమైన గొంతుగా నిలబడ్డ వ్యక్తి. ఆమె ఎడిట్ చేసే పత్రికలో నా పేరు కనబడ్డాక, జుగాంతర్ అనే వార్తాపత్రికలో ఒక సమీక్షకుడు నారచన గురించి రెండు మంచి మాటలు రాసాడు. తర్వాత  “ఎంతో దగ్గర అయినా మరెంతో దూరం”, అన్న పేరుతో రాసే తన ధారావాహికలో, మహాశ్వేతా దేవి నాపేరు ప్రస్తావించింది, “మదన్ గొప్ప వ్యక్తి. అతను రిక్షా నడుపుతాడు. అతను రాస్తాడూ… ” అంటూ ఆమె రాసింది. దానితో నేను నలుగురికీ పరిచయమయ్యాను, చాలా పత్రికలు నా రచనలు వేసుకుంటాం అన్నాయి. నాకు రిక్షావాలా రచయిత అని పేరు వచ్చింది. అది నాలో ఉత్సాహాన్ని నింపింది, నామీద నాకు నమ్మకాన్నిచ్చింది.

ఔను, నేను రాయగలిగేను.

ఛండాలుడిగా పుట్టిన నా ఇతివృత్తం’  అనే పేరున్న ఆయన ఆత్మకధ ‘Interrogating my Chandal life’గా ఇంగ్లీషులోకి తర్జుమా అయింది. (సిప్రా ముఖర్జీ అనువాదం). దానిలో ఈ అత్యద్భుత ఘటనని, అది తన జీవితాన్ని తిప్పిన మలుపునూ – మనోరంజన్ బ్యాపారి వివరించారు.

ఆయన చరిత్ర తెలుసుకోడం అంటే ఆయన విశిష్టత తెలుసుకోడమే :ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురణల్లో తన రచనకి స్థానం పొందిన  ఏకైక రిక్షావాలా – అలాటి వ్యక్తి  ప్రపంచంలోనే మరెవరూ లేరంటే అది అబద్ధం కాదు. పుట్టుకే – భయంకరమైన పేదరికం, అనిశ్చత వాతావరణంలోకి. పార్టిషన్ సమయంలో వెస్ట్ బెంగాల్లోని బంకురా జిల్లాలోని రెఫ్యూజీ కేంప్ – అతనికి పసితనం గుర్తుల్ని మిగిల్చింది. తర్వాత కొద్ది కాలానికే చెట్టు కొకరూ పుట్ట కొకరుగా అతని కుటుంబం చెదిరి పోయింది. ఎన్నో ఆటుపోట్లు.

ఎమర్జెన్సీ టైంలో అతన్ని ఆలీపూర్ జైల్లోనూ, తరవాత ప్రెసిడెన్సీ జైల్లోనూ పెట్టారు. అప్పుడే – ఒక తోటి ఖైదీ ప్రోత్సాహంతో – గోడలమీదా, నేలమీదా, మట్టితో, రాయితో, అక్షరాలు దిద్దుకుని కూడబలుక్కుంటూ చదువుకోడం నేర్చుకున్నాడు. జైలు లోంచి పుస్తకాల పురుగుగా మారి బయటకొచ్చాడు. ఈనాడు దళితసాహిత్యంలో అతని  అక్షరాలు నిజనిర్దేశాలుగా మారి వెలుగు పంచుతున్నాయి.

మూలం: మనోరంజన్ బ్యాపారి 

అనువాదం: ఎస్. జె. కళ్యాణి

*

ఎస్. జె. కళ్యాణి

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతం . తాను ఈ కధ FB లో పోస్ట్ చేసినప్పుడు, తెలుగులోకి చేయమని సలహా ఇచ్చినందుకు ఆనందపడుతున్నాను. చాలా చాలా గొప్పగా తెలుగులో రాసిన కల్యాణికి హర్ధిక అభినందనలు.

  • స్ఫూర్తి వంతమైన కథనానికి సజీవ అనువాదం. అనువాదం అని ఒక్క వాక్యంలో కూడా అనిపించలేదు. అభినందనలు.

  • ఉత్తేజితం. ఒక గొప్ప రచయిత రచనలు మరి కొంతమంది గొప్ప రచయితల్ని తయారు చేయగలవు. అనువాదంలా లేదు. చప్పట్లు.

  • చాలా మంచి సమాచారమందించారు. అంత గొప్ప రచయిత్రి ఒక రిక్షావాలా జిజ్ఞాసను గుర్తించి అతడి జీవితాన్ని, తన కంటే , అతడే రాసుకోవటంలోనే ఎక్కువ జీవముంటుందని గుర్తించి ప్రోత్సహించడంలోనే శ్వేతాదేవి గారి అసామాన్యత అర్ధమవుతుంది..

  • మా కన్నతల్లి, నేను మావా అని పిలుచుకునే కీశే పుట్రేవు జోగారావు పంతులు కుమార్తె చిసౌ కళ్యాణి ఈ రచనలో అనువాద లక్షణాలు ఏ కోశానా కనపడ లేదు. తెలుగు లో కూడా మంచి భవిష్యత్తు ఉన్న రచయిత్రి అవుతావన్నది సత్యం. సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు.

  • మహాశ్వేత దేవి ఒక్క మదన్ కే కాదు …పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడే, రాసే ప్రతీ రచయితకి ఆదర్శమే….మంచి పరిచయం… ఏ వర్గ ప్రజల కోసం రాస్తామో రచన ఆ వర్గ ప్రజల కు చేరడం అనేది రచయిత విజయానికి గుర్తు.పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఉద్యమం లో పాల్గొంటూ నేను రాసిన నేను పోలేపల్లి పీనుగ నీ మాట్లాడుతున్న ,,,ఆఖరి వడ్ల గింజలు రెండు కథలు పోలేపల్లి ప్రజలు చడివరన్నప్పుడు… నాకూ అంతే సంతృప్తి కలిగింది.వాళ్ల పోరాటం,వాళ్ల పాత్రలు కథల్లో రికార్డ్ అయ్యాయని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళూ అంతే ఆనంద పడ్డారు .కల్యాణి గారు ..మంచి పరిచయం ఇచ్చారు అభినందనలు.గీతాంజలి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు