పెద్ద నాన్న మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి కి నేను ఏడు పదులు క్రితం పరిచయం అయ్యాను. 1952 జనవరి 13.
బహుశా తమ్ముడికి కొడుకు పుట్టాడని సంబరపడి చేతిలోకి తీసుకొని వుంటారు. ఆయన నాకు పరిచయం అయింది 1972 అని చెప్పొచ్చు. పెద్ద నాన్న గారితో కొన్ని చిన్నప్పటి జ్ఞాపకాలు ఉన్నాయి.
మా తాత గారు జీవించి ఉన్నంత కాలం వారు పాఠశాల వేసవి సెలవులు ఇవ్వగానే పల్లి పాలెం వచ్చేవారు.తిరిగి జూన్ పన్నెండు బడి తీయడానికి ముందు రోజు రాజమండ్రి వెళ్లి పోయేవారు.మా దొడ్డ, ఇద్దరు అన్నయ్య లు ,అక్కా పల్లి పాలెం మా ఇంటి కి నూత్న శోభ తెచ్చే వారు.
నగర వాసం తాలూకు నాజూకుతనం ఏదో వారిలో కనబడేది.
పెద్ద నాన్న ఉదయాన్నే తన కాలకృత్యాలు తీర్చుకుని, సంధ్యావందనం పూర్తిచేసుకుని పెరటి వైపు మా వ్యవసాయ క్షేత్రం ఆనుకుని ఉన్న ఒక పెద్ద బంగినపల్లి మామిడి చెట్టు నీడ కు చేరి, అక్కడ చదువు కోవడమో రాసుకోవడమో చేసేవారు.
ఆరోజుల్లో రెండోపంట లేని కారణంగా మేం అంటే నేను, నా తమ్ముడు, పెద్ద నాన్న గారి పెద్దవాడు చలపతి, రెండో వాడు రామం పొలాల వెంబడి తిరిగే వారం.
మా పాలేరు కొడవలితో వచ్చి తాటిచెట్టు ఎక్కి ముంజి కాయలు దింపేవాడు అవి తిని మామిడి కాయలు తినే వారం. ముంజికాయలకు మామిడి విరుగుడు అనేది ఒక నమ్మకం.
ఇలా పొలాల వెంట తిరుగుతున్న మమ్మల్ని అదుపు లో పెట్టడానికి మాకు సంస్కృతపరిచయం చేయదలచి శబ్దమంజరి, అమరకోశం, శబ్దమంజరి చివరన గల బాల రామాయణం నేర్పడం మొదలు పెట్టారు.
శబ్దమంజరి చదవడం ఉత్సాహంగా వుండేది.ఆ శబ్దాలు పలకడంలో ఉండే వైవిధ్యం నన్ను ఆకర్షించింది. జలముక్ జలముచౌ జలముచః అనే శబ్దం తమాషాగా తోచేది.
అలాగే అమరకోశం లో ముంజకేశుడు అనేది మా ముంజికాయలకు దగ్గరగా వుండడం తో సరదా వేసేది.
ఇలా ఆ నెలా పదిహేను రోజులు నిముషాల లా గడిచిపోయేవి.
ఇంటికి దక్షిణం వైపు ఒక సావిడి ఉండేది.దాంట్లో మా పెదనాన్న పుస్తకాలు,మా తండ్రిగారి పుస్తకాలు ఉండేవి.
అవి అద్దాల బీరువాలు. ఆ బీరువాల అద్దాల మీద సంస్కృతం కావ్య నాటకాలు, ఆయుర్వేదం , తెలుగు భారత,భాగవత,రామాయణాలు,ఆంధ్రి పత్రికలు, ఛందస్సు, వ్యాకరణాలు అని రాసి వుండేవి.
అది మా తండ్రి, పెదతండ్రి గార్ల ఉమ్మడి గ్రంథాలయం. మూడు బీరువాలు.
నాకు కాస్త జ్ఞానం వచ్చే సరికి ఇదీ ఇంటి వాతావరణం. వేసవి కాగానే రాజమండ్రి వెళ్లిపోయే వారు పెద్ద నాన్న. కానీ తిరిగి వచ్చే వేసవి వరకు ఈ ముచ్చట్లు కొనసాగించేవారు మా తండ్రిగారు.
అమరం, శబ్దమంజరి మరచి పోకుండా వల్లే వేయించే వారు. తన అన్నగారంటే ఎంతో ప్రేమ, ఆరాధన మా తండ్రిగారికి ఉండేది.కథలు కథలుగా ఆ విశేషాలు చెప్పేవారు. ఆంధ్రపురాణం అవతారిక అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.
అందులో మా తాత గారి తో తనకు గల అనుబంధాన్ని, తమ్ముడి పట్ల గల ప్రేమ కొన్ని పద్యాల్లో ప్రకటించారు.
మధునాపంతుల తన తండ్రి గారిని తలుచుకుని రాసిన ఈ గీత పద్యం చూడండి ఎంత సరళంగా వుందో, తండ్రి కి బిడ్డకు గల సంబంధం ఎంత సుందరంగా చెప్పారో! అసలు తండ్రి కొడుకుల అనుబంధం, చదువు చెప్పే క్రమం సులువుగా అర్థం అయ్యేలా…
గీ.
మరల నాతోడ బసియీడు తిరుగ దోడి
యాడె జతగూడె నక్షరాభ్యసన మెనసె
శబ్దమంజరి వట్టె శాస్త్రమ్ము ముట్టె
గవిగ దీవించి దన గొంతు కలిపి పంచె.
తన బిడ్డ చదువుకోసం తనూ చిన్న వాడైపోయాడు, తనతో ఆడాడు, స్నేహం చేసాడు, అక్షరాభ్యాసం పొందారు, శబ్దమంజరి లో శబ్దాలు చదివారు, శాస్త్రాలు స్ప్రుశించారు, కవివి కమ్మని దీవించారు తన గొంతు కలిపి పంచిపెట్టారు. ఈ చిన్న పద్యంలో పాఠ్య ప్రణాళిక, తండ్రి బిడ్డల అనుబంధాన్ని వివరించిన విధం నాకు నచ్చిన అంశం. ఆంధ్రపురాణం ఒక ఎత్తు అయితే అవతారిక ఒక ఎత్తు.
2
నాకు జ్ఞానం వచ్చేసరికే మాతా మహుడు చలపతి రావు గారు వెళ్లి పోయారు.మా పితామహుడు సత్యనారాయణ మూర్తి గారు నేను పి.యు.సి లో చేరిన ఏడాదే తాత గారు వెళ్లి పోయారు.
ఆయన, అమ్మ, నాన్న గారు పిఠాపురం విశేషాలు చెప్పేవారు.
సత్యం మావయ్య వచ్చినప్పుడు విధిగా పిఠాపురం ట్రిప్ వుండేది.అక్కడ మనకి సంబంధించిన వ్యవస్థ, వ్యక్తులు లేక పోయినా ఒక రౌండ్ చుట్టి వచ్చేవాళ్ళం.కోట చుట్టూ తిరిగేవాళ్ళం. నాకు పిఠాపురం వైభవాన్ని,వెలుగును చెప్పిన వాళ్ళ లో ఇందిర గారు, సావిత్రి గారు, వెంకాయమ్మ గారు మొదలైన వారు.
దసరా ఉత్సవాలు కోటలో అద్భుతం గా జరుపుకుంటారు .రాణీ గారి దగ్గర నుండి కవి గారి భార్య అంటే రత్నం గారి నీ ఇతరులను తీసుకుని రమ్మని కబురు వచ్చింది.
మా అమ్మ చిన్న పిల్ల,తాతమ్మ కి కోటలో అడుగు పెట్టాలంటే బెరుకు.మొత్తానికి ఇద్దరు కోటలో అడుగు పెట్టారు.
రాణీ గారి పరాచారిక ఎదురు వచ్చింది.వెంటనే వీరు చేతులు జోడించడం గమనించిన ఆమె రాణీ వారు వస్తున్నారు! అమ్మా! మీరు కూర్చోండి! అని ఆసనం చూపించారు.
అనంతరం రాణీ వచ్చి మా అమ్మను ఎత్తుకుని ఆడించారుట.
ముత్తాత గారి కోసం రెండు గుఱ్ఱాల సార్ట్ వచ్చేదట.ఆయన తెమిలే లోపల వీధంతా పిల్లలను తిప్పి వచ్చేదట.
జంటకవుల లో వెంకట రామశాస్త్రి గారి కి ప్రత్యేక స్థానం వుండేది.యువరాజా వారి గురువు, రెండోది రాజా వారి ఆంతరంగికుడు.సభలో చెప్పలేని అంశాలు చెవిలో చెప్పేవారు.అన్ని మందిరాల లోకి నిరభ్యంతరంగా అనుమతి వుండేది.
పిఠాపురం రాజా వారు కుటుంబం తో ఇంగ్లాండ్ వెళ్లి వచ్చారు.వారి అమ్మాయి లు హెయిర్ కటింగ్ (బాబ్డ్ కట్) చేయించుకుని వచ్చారు.అప్పుడు పీఠికాపుర సామ్రాజ్య లక్ష్మి ఇంక వుండదు ! అని దుఃఖ పడ్డారు.
3
రాజు గారి కోటలో దసరా ఉత్సవాలు అద్భుతం గా జరిగేవి.ఆ ఉత్సవాలలో జరిగిన అష్టావధాన వర్ణన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తన అనుభవాలు… జ్ఞాపకాలు లో చేసారు.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి అవధానం చేయడానికి గురువులు గా వేంకట రామశాస్త్రి గారి ని ఎంచుకున్నారు. దానికి వారు చెప్పిన కారణం తమాషా గా వుంటుంది.
చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు వైదిక బ్రాహ్మణుడిలాగా, వేంకట రామశాస్త్రి గారు ఒక జమీందారు లాగా కనపడ్డారుట.వీభూది, కుంకుమ బొట్టు తో బక్కపలుచని రూపం వేంకట శాస్త్రి గారి ది ,రామశాస్త్రి గారు లాంగ్ కోటు జేబు గడియారం,కాళ్ళకు చడావులు ధరించి జమీందారు లాగ వున్నారు.గురువు అంటే ఇలా! ఉండాలి అని పిఠాపురం వచ్చి, శిష్యరికం చేసారు.
వేంకట రామశాస్త్రి గారు రెండు మూడు అవధానాలు దగ్గర వుండి,చూడమనీ ఈలోగా ఆశు కవిత్వం సాధన చేయమనీ చెప్పాగా శ్రీపాద అలా చేసారు.
పద్యరచన శ్రీపాద వారి ది అందంగా లేదు.దాంతో నువ్వు పద్య రచన కు పనికిరావు.వచన రచన బాగా చెయ్యగలవు అని దిశానిర్దేశం చేసారు.
ఆ దిశగా ప్రయత్నాలు చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన కథల ద్వారా విశేషమైన కీర్తి గడించారు.ఇప్పటికీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ని అగ్రశ్రేణి కథకుడు గా సాహిత్య లోకం గౌరవిస్తోంది.
*
చిత్రం: పై ఫోటో లో మా తండ్రి సూరయ్య శాస్త్రి గారు, అమ్మ రత్న కళిక, చిన్న తమ్ముడు కామేశ్, మధునాపంతుల వారు, నేను.
ఎంతటి సుసంపన్నమైన వారసత్వం…ఈ ప్రాంత సత్వం! ఆహా…ధన్యులం.ఇంకా వ్రాయండి.
సారంగ సంపాదకులకు నమస్సులు..చక్కటి జ్ఞాపకాలు అందించిన మూర్తి గారికి ధన్యవాదములు