మళ్ళీ ఒకసారి నీ జ్ఞాపకం

వీడ్కోలు చెప్పకనే

విడిపోయిన స్నేహపు కరచాలనం

మాట పెగలని మౌనంలో

వినిపించని విస్ఫోటనం

ఎపుడో మరిచిపోయినట్టు

ఎప్పటికీ మరువలేనట్టు

మళ్ళీ ఒకసారి నీ జ్ఞాపకం

 

వరుస దొంతరలన్నీ తొలగిస్తే

చిక్కని వెచ్చని నెత్తురు

ఒక్కొక్క అరనీ బలవంతంగా మూసేస్తే

వెంటాడే చెదిరిన స్వప్నం

ఒంటరి తీరం ముందు తచ్చాడే

విషాదపు కెరటాల సమూహం

మళ్ళీ ఒకసారి నీ జ్ఞాపకం

 

పాడలేని అమరుల పాట వలె

నిలిచిపోయిన నీడల వలె

వాన వెలిశాక కొమ్మల నుంచి

రాలిపడే చినుకుల వలె

జ్ఞాపకంగా తప్ప మిగలని క్షణాలు

కదలని కాలం..

మళ్ళీ ఒకసారి నీ జ్ఞాపకం…

*

పెయింటింగ్: సత్యా బిరుదరాజు 

సుధాకిరణ్

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. చదివిందీ, ప్రస్తుతం ఉద్యోగ రీత్యా వుండేదీ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్ధిక అంశాల పైన, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హృదయాన్ని కదిలించే కవిత. ఎన్నెన్నో జ్ఞాపకాలు ఎన్నెన్నో స్మృతులు – ఒక కల కోసం ఒక అద్భుతమైన సమాజం కోసం ఒక సుందరమైన రేపు కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి అర్ధాంతరంగా మనల్ని వదిలి వెళ్లి పోయిన వాళ్ళ కన్నీటి జ్ఞాపకాలు కలబోసుకున్న కవిత.

  • “పాడలేని అమరుల పాట వలె నిలిచిపోయిన నీడల వలె” బాగుంది చాలా .

  • చెన్నై వరదల మీద సుధా కిరణ్ గారి కవితొకటి నాకు చాలా గుర్తు….ఆ శైలీ విన్యాసమొక సులువైన మాయ. నమస్కారం సార్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు