మల్లెలు పూసే, వెన్నెల కాసే, ఈ రేయి సాక్షిగా…

రాజన్ స్మృతిలో…

“యే…జీవన్ హై..ఇస్ జీవన్ కా”, “రజనీగంధా ఫూల్ తుమ్హారే…”, “జానేమన్, జానేమన్, తేరే దో నయన్”, “తుమ్ కో దేఖా..తొ యే ఖయాల్ ఆయా”, “ఎ తేరా ఘర్..ఎ మేరా ఘర్” లాంటి హిందీ పాటలు విన్నప్పుడల్లా, నాకు వాటన్నిటిలో ఒక కామన్ థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది. చక్కటి “మధ్యతరగతి మెలోడీ!” ఉన్న వర్గీకరణలతోటే తికమకగా ఉంటే, మళ్ళీ ఇదొకటేమిటనుకుంటున్నారా? అంత కంటే అతికే పదబంధం నాకు దొరకలేదు మరి. కళ్ళు మూసుకొని కనక ఈ పాటలు వింటుంటే, అందమైన మెలోడీ తో పాటు ఎవరో మధ్యతరగతి ప్రేయసీప్రియులు పాటలాడుకొనేటటువంటి దృశ్యాలు కళ్ళ ముందు కదలాడతాయి!

అసలీ కన్నడ శీర్షికేమిటీ, హిందీ పాటల గోలేమిటి, దేని గురించి ఈ వ్యాసం, అని అనుకుంటున్నారు కదూ? అక్కడికే వస్తున్నా. ఈ పాటలన్నీ కూడా డెభ్భైల్లో వచ్చినవే. తెలుగులో కూడా, ఈ తరహాలో, పాటలు అదే సమయంలో వచ్చాయా అని చూసుకుంటే, కొన్ని అద్భుతమైన మెలోడీలు తగిలాయి. వాటిల్లో చాలా వాటికి స్వరకర్తలు రాజన్-నాగేంద్ర సోదరద్వయమే! వారి “మధ్యతరగతి మెలోడీ” పాటల గురించే ఈ సారి కమామీషంతా.

మీకు వికీని గూగ్లించే శ్రమ లేకుండా, వారి పూర్వాపరాల గురించి టూకీగా చెప్పేసుకుంటే, తర్వాత వారి స్వరధారల్లో తడిసి ఆటలాడేసుకోవచ్చు. చిన్నప్పుడే, కర్ణాటక రాష్ట్రంలో సంగీత కాలేజిలో విద్యనభ్యసించిన  ఈ ఇరువురు సోదరులూ, 1953 లో కన్నడ సినిమా రంగంలోనూ,  1960 లో తెలుగు సినిమా రంగంలోనూ, జానపద బ్రహ్మ విఠలాచార్య సినిమాల ద్వారా రంగప్రవేశం చేశారు. కన్నడ సినిమా రంగంలో అగ్రతారలైనటువంటి రాజ్ కుమార్, విష్ణువర్ధన్ సినిమాలకి సంగీతాన్ని అందిస్తూ ఆ రంగంలో బిజీగా ఉన్న వీరికి, తెలుగులో అడపాదడపా తప్ప ఎక్కువగా అవకాశాలు రాలేదు. 1975 లో కన్నడ సినిమా “ಎರಡು ಕನಸು” తెలుగు రీమేక్ “పూజ” ద్వారా వీరి పునఃప్రవేశం జరిగింది. ఆ తర్వాత జరిగినది, “హిస్టరీ” అని చెప్పేసి సులువుగా తప్పుకొనే అవకాశం లేదిక్కడ. కలకాలం గుర్తుండి పోయే మేలోడీలు అందించిన వీళ్ళు, ఆ తరువాత సంగీతం అందించిన తెలుగు చిత్రాల సంఖ్య ఇరవైకి మించదు!

“పూజ” చిత్రం నుంచే  “పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను..తియ్యరా తలుపులనూ రామా..” అంటూ మృదుమధురంగా వాణీజయరాం గళంనించి జాలువారిన ఈ గీతాన్ని, ఇప్పటికీ ఎంతో మంది గాయకురాళ్లు పాటల పోటీలలో పాడుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. “ఎన్నెన్నో జన్మల బంధం..నీది నాది”, ఎవరగ్రీన్ పాట. దాదాపు ఒక పదిహేడేళ్ళ తరవాత హిందీలో, ఆనంద్ మిలింద్, ఎక్కువ మొహమాట పడకుండా, అదే ట్యూన్ ని, “జాన్ సే ప్యారా” అనే సినిమాలో మక్కీకి మక్కీ దించేశారు. మూడు భాషలలోనూ యీ సతతహరిత పాటని ఇక్కడ చూడచ్చు!

 

కన్నడ: http://www.youtube.com/watch?v=TwKVyj9hf7k

తెలుగు: http://www.youtube.com/watch?v=GfCnYnXhyIw

హిందీ: http://www.youtube.com/watch?v=knPnX5G3PAU

1977: తెలుగు సినీ రంగం ఎన్నో మలుపులు తిరిగిన సంవత్సరం. అడవిరాముడు తో అన్నగారు తన మాస్ ఇమేజ్ ని సోషల్ సినిమాలలో సుస్థాపితం చేసుకుంటే, వేటూరి ఒక ప్రభంజనం లా చెలరేగి, “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ…”, “అమ్మ తోడు, అబ్బ తోడు, నీ తోడు, నా తోడు…” లాంటి లిరిక్స్ తో, ఒక కొత్త మాస్ తెలుగు పాటకి శ్రీకారం చుడితే, తన లేత గళంతో అప్పటికే అందరినీ అలరిస్తున్న బాలూ, తన స్వరవైవిధ్యంతో అన్ని వర్గాల శ్రోతల గుండెల్లో తిష్ఠ వేసుకున్న సంవత్సరం. అదే సంవత్సరంలో నవతా వారు నిర్మించిన “పంతులమ్మ” చిత్రం లోని పాటలు, అటు సాహిత్యపరం గానూ, ఇటు సంగీత పరంగానూ అనేక ప్రశంశలందుకున్నాయి.

రాజన్-నాగేంద్రలకు ఉత్తమ సంగీత దర్శకులుగా నంది పురస్కారం తో పాటు, వేటూరి “మానస వీణా….” మధుగీతానికి కూడా ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాన్ని అందించాయి ఈ సినిమా పాటలు. యాధృచ్చికమో, సాంగత్య బలమో తెలియదు కానీ, రాజన్-నాగేంద్రలు స్వరపరచిన మెలోడీలకి, వేటూరి పేర్చిన మాటలతో మరపురాని మధురగీతాల్లా రూపు దిద్దుకొని, ఒకరినొకరు మరింత ప్రకాశింపజేసేందుకు పూనుకున్నారా అనిపించక తప్పదు.

“ఎరిగిన వారికి ఎదలో ఉన్నాదు..

ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు…

శబరీ ఎంగిలి గంగ తానమాడిన పేరు…

హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు..

మనసెరిగిన వాడు మా దేవుడు .. శ్రీ రాముడు

మధుర మధుర తర శుభ నాముడు … గుణ ధాముడు “

త్యాగయ్య తరవాత రామభక్తిని అంత అందంగా, అంత సరళంగా వర్ణించటం, వేటూరి వారికే సాధ్యమేమో అనిపిస్తుంది ఈ పాట వింటుంటే. ఎప్పటిలా కన్నడ పాటనుండి కాకుండా, నేరుగా తెలుగు పాటకే బాణీ కట్టారనుకుంటా, అద్భుత:!

“ఏ రాగమో ఏమో మన అనురాగం..వలపు వసంతాన హృదయ పరాగం..

ఎద లోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం

శతవసంతాల దశదిశంతాల సుమ సుగంధాల…భ్రమరనాదాల కుసుమించు నీ అందమే

విరిసింది అరవిందమై..కురిసింది మకరందమై..

మానసవీణా మధుగీతం…మన సంసారం సంగీతం”

మన సంసారాలలో ఉన్న సంగీతసారాన్ని ఇంత అందంగా ఆవిష్కరించిన వేటూరి, రాజన్-నాగేంద్రలకు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవలసిందే!

 

http://www.youtube.com/watch?v=5HPwgaRoV8w

 

ఇక్కడ మన గాన గాంధర్వుడి గురించి కూడా కొంత చెప్పుకోవాలి. “ఏ దివిలో విరిసిన పారిజాతమో” లాంటి మంచి మెలోడీ పాటలు అప్పటికే ఒకటీ అరా పాడి ఉన్నా, ఇంకా తన ప్రతిభకు తగ్గ గుర్తింపు అతడికి దక్కలేదు. రాజన్-నాగేంద్రలు కట్టిన బాణీలతో పాడిన బాలూ పాటలకు అవార్డులు రాకపోయినా, చిరకాలం మన మదిలో నిలచిపోయే మంచి మెలోడీ పాటలుగా మాత్రం అతడి ఖాతాలో జమైపోయాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని, బాలూ పాడిన అన్ని వేల పాటలలో, మంచి మెలోడీ పాటలు, గబుక్కున గుర్తుకొచ్చేవాటిల్లో చాలా వరకూ డెభ్భైల్లో వచ్చినవే. బాలూ-వేటూరి-రాజన్-నాగేంద్ర కాంబో పాటలు, ఈ కోవలో కొచ్చేవే.

“సిరిమల్లె నీవే, విరిజల్లు కావే, వరదల్లె రావే, వలపంటే నీవే, ఎన్నెల్లు తేవే, ఎద మీటి పోవే…”

ఇది మొదట కన్నడలో కట్టిన బాణీనే. కన్నడలో య.స్.జానకి పాడిన పాటని తెలుగులో బాలూ చేత పాడించటం ఒక విశేషం. అప్పటికి, అనుభవంలో చిన్నవాడైనా, బాలూ అంత చక్కగానూ తెలుగులో పాడారు.

 

కన్నడ: http://www.youtube.com/watch?v=R58a5Ht4-Ok

తెలుగు: http://www.youtube.com/watch?v=RxF-jon6LNg

 

“మల్లెలు పూసే, వెన్నెల కాసే, ఈ రేయి సాక్షిగా” – ఇంకొక “మధ్యతరగతి మెలోడీ”, కన్నడ, తెలుగు భాషలలో బాలునే పాడారు.

 

“మల్లె తీగ వాడి పోగా, మరల పూలు పూయునా?” – ఈ పాటని కన్నడలో పి.బి.శ్రీనివాస్ పాడితే, తెలుగులో బాలునే. పెద్దాయనకి క్షమాపణలతో, నాకు బాలూ వర్షన్ ఈ రెంటిలోను బాగుందనిపిస్తుంది.

 

“వీణ వేణువైన మధురిమ కన్నావా…” హిందోళంలో ఇంత మెలోడీ ఉన్న డ్యూయెట్ దీని తరవాత మరొకటి రాలేదేమో! కన్నడలో మొదట వచ్చిన ఈ పాట, తరువాత తెలుగులోనూ, తమిళంలో కూడా వచ్చి, అందరినీ డోలలూగించింది. ఇంత హాయిగా సాగిపోయే ఈ మెలోడీని ఇప్పటికి కూడా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంతలా స్వరపరిచారు ఈ సంగీత ద్వయం! డ్యూయెట్ గా సాగే ఈ పాట తమిళం లో మాత్రం సోలోగా జానకి గారి చేతే పాడించారు.

 

కన్నడ: http://www.youtube.com/watch?v=qyDb7bag9YI

తెలుగు: http://www.youtube.com/watch?v=QebPpYEBJ-w

తమిళం: http://www.youtube.com/watch?v=hd5NfjYfD1Y

ఆ తరువాత వచ్చిన “నాగమల్లివో…తీగ మల్లివో” అనే మరో అందమైన మెలోడీతో ఎనభైల్లోకి అడుగు పెట్టారు రాజన్-నాగేంద్రలు. “ఆకాశం నీ హద్దు రా…అవకాశం వదలద్దురా” అంటూ బీట్ పాట ఇచ్చినా, అందులో కూడా, తమ బ్రాండు మెలోడీని జొప్పించి, తమ ముద్ర మాత్రం మిస్ అవ్వకుండా చూసుకున్నారు వీరు.

వరుసగా ఇన్ని పాటల గురించి చెప్పుకున్నాం కదా అని, ఆ సినిమాలు వెళ్ళ మీద లెక్కెట్టుకుంటే, ఒక్క చెయ్యి సరిపోతుంది. పూజ, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది, నాగమల్లి, ఇంతే!

 

అంత తక్కువగా అవకాశాలు లభించినా వీరి పాటలు ఇలా గుర్తుండి పోవటానికి కారణం, అది వారి పాటల్లో స్వరస్వరానా ఇంకిపోయున్న మెలోడీనే. అలా అని, వీరు అన్నీ గుర్తుండిపోయే పాటలే చేసారని కాదు. వీరు వందకు పైబడి కన్నడ చిత్రాలకి సంగీతాన్ని సమకూర్చారు. కానీ మన తెలుగు సినిమాల వద్దకు వచ్చేసరికి, వారి వంద చిత్రాల సంగీత సారాన్ని ఈ అరడజను చిత్రాలలో పొందుపరిచి ఇచ్చేశారని అనిపిస్తుంది! వీటికి తోడు, వేటూరి వారి సినీప్రస్థానప్రారంభం, బాలూ పతాకస్థాయిని చేర్కొనే దిశలో ఉండటం కూడా వారి పాటలను అజరామరంగా ఉండటానికి దోహద పడ్డాయనిపిస్తుంది.

 

ఎనభైలలో కూడా వీరు జంధ్యాల వారికీ, మరి కొద్ది దర్శకుల సినిమాలకీ సంగీతాన్ని అందించారు. “నాలుగు స్తంభాలాట” చిత్రం లోని ఈ సెన్సేషనల్ పాట రెండు సార్లు తెలుగులో రావటమే కాకుండా, హిందీలో కూడా ఒక పదేళ్ళ తరవాత స్వేచ్ఛగా వాడుకున్నారు. “బయలు దారి” అనే 1978 లో విడుదలైన కన్నడ చిత్రానికి కట్టిన ఈ బాణీ, “కనసలూ నీనె…మనసులూ నీనె” అనే పల్లవితో మొదలవుతుంది. దీని తెలుగు అనువాదం “కలలో నీవె..మనసులో నీవే” అని. ఐదేళ్ళ తరవాత 1982 లో,  జంధ్యాల గారి చిత్రం “నాలుగు స్థంభాలాట”కి, వేటూరి ఆ బాణీ విని వ్రాసిన పాట ఇది!

 

“చినుకులా రాలి

నదులుగా సాగి

వరదలై పోయి

కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ

నీ పేరే నా ప్రేమ

నదివి నీవు కడలి నేను

మరచి పోబోకుమా మమత నీవే సుమా!”

 

ఈ పాట వింటున్నప్పుడల్లా ఎదో ఒక ప్రవాహంలో కొట్టుకు పోతున్నటువంటి అనుభూతి కలుగుతుంది నాకు. ఆ పాట ఎంత “ఎవరగ్రీన్” అంటే, దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత అదే లిరిక్స్ తో “అహ నా పెళ్ళంట” అనే సినిమాకి రఘు కుంచె దానిని రీమిక్స్ చేసి మన కందించారు. హిందీలో మెలోడీ కింగ్స్ నదీం-శ్రావణ్ లు కూడా ఇదే బాణీని యధాతధంగా “ఐసి దీవానగీ…దేఖి నహీ కహీ” అని వాడుకున్నారు.

కన్నడ: http://www.youtube.com/watch?v=y1ntRcP_et4

తెలుగు: http://www.youtube.com/watch?v=2Tw7v5R2700

హిందీ: http://www.youtube.com/watch?v=m-vIYe_KY34

తెలుగు2: http://www.youtube.com/watch?v=_wbYsNwR4IU

 

ఈ సంగీత సోదరుల్లో చిన్నవాడైన నాగేంద్రగారు 2000 సంవత్సరంలో పరమపదించారు. వారి పాటలు మాత్రం మరెన్నో తరాల నోళ్ళలో నానుతూ ఉంటాయన్నది మాత్రం చాలా ఈజీ ప్రెడిక్షన్! కన్నడ సినీ రంగంలో అగ్ర సంగీత దర్శకులుగా తమ పేరును సుస్థిరపరుచుకున్న వీరు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పైన చిత్రీకరించిన “గంధద గుడి” అనే చిత్రం లోని ఈ టైటిల్ సాంగ్ ను గుర్తుకుచేసుకుంటూ ముగిస్తున్నాను.

http://www.youtube.com/watch?v=d4vqbRonJgU

 

*

యాజి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)