మరో వైపు నుంచి కూడా ఆలోచించాలి!

మరో వైపు నుంచి కూడా ఆలోచించాలి!

పాలస్తీనా ప్రజల సమస్యలో ఒక న్యాయం ఉంది. ధర్మమైన వ్యాకులత  ఉంది. యూదులు చరిత్రలో అతిహీనంగా ట్రీట్ చేయబడ్డ ఒకే ఒక జాతి అయి ఉండవచ్చు…. రోమన్స్ పాలన నుండీ, ఒటోమన్ పరిపాలన నుండి మొదలుకుని హిట్లర్  పరిపాలన వరకు వర్ణనాతీతమైన అభద్రత కు గురయ్యారు. అయితే అది చరిత్రనే కాని ప్రస్తుత పరిస్థితి కాదు.

1948 లో 5-6 లక్షల యూదుల జనాభాతో ఏర్పడిన ఇజ్రాయెల్ పై ఆరు కోట్ల జనాభా ఉన్న అరబ్ దేశాలు చుట్టు ముట్టీ దాడి చేసాయి. అయితే అవన్ని చిత్తుగా ఓడిపోయాయి. ఈ సమస్యకు యుద్ధం సమాధానం అని మొదలు పెట్టింది అరబ్ దేశాలు. అది కాక, ఇది పాలస్తీన సమస్య అయితే ఇందులో లెబనాన్, జోర్డాన్, టర్కీ తదితర దేశాలు కేవలం మత ప్రాతిపదిక మీద మాత్రమే కలుగజేసుకుని యుద్ధం మొదలు పెట్టాయి. అంతేకాని పాలస్తీనా తో ఏవన్నా వాళ్ళ దేశాల సంక్షేమం ముడి వడీ ఉండి అని కాదు. లేదా అదో  ప్రజాస్వామిక ఆకాంక్ష అనో కాదు.  ఇదిలా ఉంటే – బిగ్ బ్రదర్ గా అమెరికా పాత్ర శ్లాఘనీయం ఏమీ కాదు. అమెరికా తన మిలిటరీ బేస్ వ్యూహాత్మకంగా పటిష్టం చేసుకుంటూ వస్తుంది. దానితో పాటు అటు అమెరికా ప్రజల క్రిస్టియన్, యూదుల వోట్ బేంక్ కోసం ఇస్లామో ఫోబియాను వాడుకుంటూ ఉంది.

యాసర్ అరాఫత్ చొరవతో  1990 లలో శాంతి చర్చలు నడిచి ఓస్లో అకార్డ్ రెండు దేశాలు సంతకం చేసాయి. అయితే – రెండు దేశాల్లోని రైట్ వింగ్ ఫండమెంటలిస్టులకు ఈ అగ్రిమెంట్ సమ్మతించక అది ఫెయిల్ అవ్వడం , ఆ తర్వాత అనుమాన స్పద పరిస్థితుల్లో యాసర్ అరాఫత్ చనిపోవడం, అలాగే శాంతి వేపు అతని ఆలోచనలకు దగ్గరగా వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి రేబిన్ చంపబడ్డం జరిగింది. ఆ తర్వాత ఓస్లో అకార్డ్ తుంగలో తొక్కాక, రెండు దేశాల మధ్య భయానకమైన యుద్ధ వాతావరణం నెలకొంది.

అలాగే హమాస్ విముక్తి పోరాట సంస్థ కాదు. అది ఒక ఫండమెంటలిస్ట్ సంస్థ. పాలస్తీన ప్రజలకు ఏదో అద్భుత సమాజాన్ని ప్రామిస్ చేసి పోరాటం చేయటం లేదు. అటు తిరిగి ఇటు తిరిగి అదే దిక్కు మాలిన  ఈశీశ్ నినాదం ” ముస్లిం బ్రదర్ హుడ్ ” అనే సిద్ధాంతం మీద ఆధారపడి ఇజ్రాయల్ తో కొట్లాడుతుంది తప్ప “పాలాస్తీనా స్వాధికారత ” అంటే ఏంటో ఇదేమీ స్పష్టత ఉన్న సంస్థ కాదు. 14 ఏళ్ళ అమ్మాయిని హిజాబ్ పేరుతొ చంపి ఆ తర్వాత ఉద్యమించిన వందల మందిని పొట్టనపెట్టుకున్న ఒక అప్రజాస్వామిక  నిరంకుశ ఇరాన్ లాంటి దేశాల లిస్టులో పక్కన చేరడమే దీని ప్రధాన లక్ష్యం తప్ప వేరే ఏమీ కాదు.ఎప్పుడైతే వెతికి వెతికి చిన్న చిన్న పిల్లలని, అమాయకులను ఏరి ఏరి చంపిందో అది పాలస్తీనా సమస్య యుద్ధం తో సాల్వ్ అవ్వచ్చు అనే సాధారణ ప్రజానీకాల మనోభావాన్ని, వ్యక్తి గత ద్వేషం దాటి హేట్ క్రైమ్ స్థాయికి తీసుకెళ్లి పాలస్తీనా సమస్యను ‘అప్రస్తుతం ‘  గా మార్చింది. వీళ్ళ అప్రోచ్ ఎలా ఉందంటే స్త్రీ విముక్తి అంటే స్త్రీ విచ్చలవిడిగా బతకడం అనే మరో అసమానత్వ పరిష్కారం కల్పించడం లా ఉంది ఇంచుమించుగా. ఇజ్రాయెల్ తప్పును ఎత్తి చూపడానికి హమాస్ చేస్తున్న తీవ్రవాదాన్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇలాగే అమెరికా తప్పులు ఎత్తి చూపడానికి సద్దాం ను హీరోగా ప్రకటించి ఈ సో కాల్డ్ ప్రగతివాద లోకం తప్పు చేసింది.

అమాయకులు పిల్లలు ప్రతి యుద్ధం లో collateral damage  గా ఉంటారు అది అమెరికా చేసినా… ఇండియా చేసినా…. ఇజ్రాయల్ చేసినా అంతే! కానీ పాలస్తీన చేసిన దాడిలో అమాయకులు పిల్లలు ప్రత్యక్షమైన, personalised attack ను చూసారు. వెతికి వెతికి తరిమి తరిమి చంపబడ్డారు. ఇది యుద్ధం కాదు. Ethnic cleansing లో ఒక రూపం. హమాస్, పాలస్తీన సమస్య తీవ్రతను తిరుగుబాటు అవసరాన్ని ఒక ఆరాచక హేట్ క్రైమ్ లా ట్రీట్  చేసింది. ఎప్పుడైతే ఒక సీరియస్ జాతి సమస్యను ఆధిపత్య వాదుల మీద పోరాటం కాక అమాయకుల ఊచకోత ద్వారా సాధిస్తా మని ప్రకటించిందో అప్పుడు నైతికత లేని సమస్యగా తీర్చి దిద్దిందీ. అప్రోచ్ లో ఓసామా బిన్ లేడన్ కు హమాస్ కు తేడా ఏమీ లేదు.  ముస్లిం సమాజానికి ఓసామా  బిన్ లేడన్ లు సమాధానం ఎప్పటికీ కాలేరు. ఏదేమైనా, ఎన్ని ప్రొవొకేషన్స్ పాలస్తీనా మత ఛాంద్దస వాదులు చేసినా దానిని ప్రతీకార మార్గం లోనో, కలెక్టివ్ ఈగో ప్రతి చర్యగానో కాక పట్టువిడుపుగా వ్యవహరించాల్సిన బాధ్యత బలమైన దేశం అయిన ఇజ్రాయెల్ మీదనే ఉంది. అది వదిలేసి ఇజ్రాయెల్ అమానవీయత ను ప్రొమోట్ చేయడం లో హమాస్ తో పోటీ పడుతుంది. నిజానికి ఇజ్రాయెల్ అడిగిన ప్రత్యేక దేశం కన్నా ఇప్పుడు ఎక్కువే సంపాయించుకుంది. అది తనపై యుద్ధం ప్రకటించిన ప్రతి సారి, డిఫెన్స్ తో మొదలై అఫెన్స్ గీతలను దాటి పాలస్తీనా భూభాగాలను ఆక్రమించింది.

ఇజ్రాయల్ చర్యను ఎలా కొంత మంది యూదు ప్రగతి వాదులు వ్యతిరేకిస్తున్నారో, అలాగే హమాస్ కు పాలస్తీనీయుల లో వ్యతిరేకత ఉన్న శ్రేణులూ వున్నాయి.  ఇది ప్రత్యర్థి పార్టీ అయిన ‘ ఫతా ‘  ఉన్నప్పటి నుండి అలాగే కొనసాగుతూ వుంది.  ఈ హింస లో రెండు పక్కలా పోటీ పడి నకిలీ సమాచారాన్ని  వ్యాపిస్తారు.  పోలరైజ్ అవుతున్న ప్రపంచం లో మీడియా కూడా ఆయా దేశాల్లో ఎవరికి వర్తించే న్యూస్ వాస్తవాలు, అవాస్తవాలు కలగలిపి వాళ్ళకు ప్రచారం చేస్తున్నారు.

ఈ హమాస్ లాంటి చాందసవాద సంస్థల నుండి , ప్రతి హమాస్ ఆరాచకానికి disproportionate యుద్దాన్ని ఆశ్రయించి దేశాన్ని ఆక్రమించే ఇజ్రాయల్  నుండి, పాలాస్తీనా ప్రజలకు శాంతి కావాలి.  సమాధానం కావాలి. వాళ్ళు ప్రాధమిక పౌరులుగా  బతికే ఒక దేశం కావాలి.

*

 

విక్టర్ విజయ్ కుమార్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పూర్తిగా ఏకీభవిస్తున్నాను

  • In an internecine war,no one is a Victor or a vanquished.The vast ocean of tears shed by the ill-fated people breeds only retaliation and revenge.The truth forgotten by the blind armies is human life is precious

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు