మరో మరోసారి మహాస్వప్నం

(2004, ఆంధ్ర జ్యోతి)

చీకటి పడుతున్నది, మీరు చాలా దూరం పోవాలి కదా, బయలుదేర కూడదూ?- అన్నాడాయన ఎటో చూస్తూ. చాలా మృదువుగా చెబుతున్నాడు- గెట్‌ లాస్ట్‌ అని.

మిమ్మల్ని ఇంటర్వ్యూచేయడం లేదు. మిమ్మల్ని కలవడం గురించిన నా అనుభవం రాస్తాను, అంతే, అని వాగ్దానం చేశాను. నోట్‌పుస్తకంలో చకచకా కదులుతున్న నా కలం వైపు ఆయన అనుమానంగా, అపనమ్మకంగా చూశారు.

తెలుసు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నామని. ఎవరి ప్రైవసీనయినా భంగపరచడం ఏమి న్యాయం? మెయిన్‌స్ర్టీమ్‌ అనుకునే ప్రపంచం నుంచి దూరంగా ఆయన సొంత ప్రవాసంలో ఉంటున్నాడు. పదేపదే వెళ్లి మర్యాదస్తులం తపోభంగం చేయడం ఎందుకు?

…..

బయటి ప్రపంచం నుంచి వెళ్లి ఎవరో ఒకరు ఆయనను తరచు తడిమి వస్తున్నారు కానీ, నేనయితే పధ్నాలుగేళ్ల తరువాత మహాస్వప్నను చూశాను. నా జ్ఞాపకంలో ముద్రితమై ఉన్న ఆయన రూపానికి, ప్రస్తుత రూపానికి మధ్య కాలం తెచ్చిన వ్యత్యాసం నాకు తొందరగా జీర్ణం కాలేదు. మనిషి శిథిలమైపోయాడని అనలేను కానీ, కళ్లు ఇక కొత్త స్వప్నాలు కనలేవని మాత్రం అనిపించింది.

దిగంబరకవిత్వం మూడు సంపుటాల్లోనూ కలిపి ఆరు కవితలు మాత్రమే రాసిన కవి మహాస్వప్న. కమ్మిశెట్టి వెంకటేశ్వరరావుగా ఆయన 1960 ల ప్రారంభంలో ‘అగ్నిశిఖలు-మంచుజడులు’ రాశారు. ఆరుగురు దిగంబరుల్లోనూ విలక్షణంగా కనిపించే శైలి అతనిది. శక్తి, వేగం కలగలసిన భావుకత అతనిది.(టెర్రరిస్టు భావుకుడు అని పేరుపెట్టాను ఆయనకు!) తెలుగులో చాలా కొద్దిగా మాత్రమే రాసి ఎక్కువగా ఆకట్టుకున్న కవులు ఇంకా కొందరున్నారు కానీ, మహాస్వప్న మీది ఆకర్షణ అతను ‘నలుగురి’తో పాటు నడవకపోవడమే అనుకుంటాను. ఆయన విలక్షణత మీది అభిమానం తక్కిన దిగంబరుల మీద అసమ్మతి కానక్కరలేదు. నలుగురితో పాటు నడవకపోవడం ఆదర్శమూ కానక్కరలేదు. కాలం విసిరిన సవాళ్లకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తారు. నిలువనీయని వేగంతో వీచే ప్రభంజనాలకు పరవశించడంలోని మానవీయతకు ఎంతగా ముగ్ధులవుతామో, పరిమళాలకు కూడా ప్రాణాయామంతో స్పందించే స్వభావ వైచిత్రికి అంతగానే ముచ్చటపడతాము.

దిగంబర కవిత్వం అవతరించి పాతికేళ్లు అయిన సందర్భంగా 1990లో నాటి ‘ ఉదయం’ సాహిత్య పేజీ ‘వీక్షణం’ను కొన్ని వారాల పాటు ప్రత్యేకంగా తీర్చిదిద్దాలనుకున్నాం. సుమారు ఇరవయ్యేళ్ల నుంచి పత్రికాముఖంగా ఏ మాటా చెప్పని మహాస్వప్న ఇంటర్వ్యూతో ఆ పరంపరను ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది. ఎడిటర్‌ రామచంద్రమూర్తిగారు ఆ ఆలోచనను ప్రోత్సహించారు. ఒక సాహిత్యవ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసు ఖర్చులతో వెళ్లగలగడం అప్పట్లో నాకే విడ్డూరంగా అనిపించింది. అపడు విజయవాడ ఉదయంలో పనిచేస్తున్న త్రిపురనేని శ్రీనివాస్‌తో కలసి లింగసముద్రం వెళ్లి మహాస్వప్నను ఇంటర్వ్యూ చేశాను. మోహన్‌ వేసిన చక్కని బొమ్మలతో రెండు వారాల పాటు ‘వీక్షణం’ మహాస్వప్న స్పెషల్‌గా వచ్చి సంచలనం సృష్టించింది. తరువాత నగ్నముని ఇంటర్వ్యూ ప్రచురణ సగంలో ఉండగానే, చీఫ్‌ ఎడిటర్‌ గజ్జెల మల్లారెడ్డి గారి ఆదేశంతో దిగంబర కవుల ప్రాజెక్టు విరమించవలసి వచ్చింది. అదొక కవిత్వమా, దానికి రజతోత్సవం చేయాలా? అని ఆయన అభ్యంతర పెట్టారు.

నాటి ఇంటర్వ్యూలో మహాస్వప్న ఎక్కువగా పాత విషయాలే చెప్పారు, కొన్ని కామెంట్లు చేశారు. ఏమయితేనేం, అలవాటుగా వింటున్న మాటలు కాక, కొత్తవి వినగలగడం రిఫ్రెషింగ్‌గా అనిపించింది. అందుకని నాకు, త్రిపురనేని శ్రీనివాస్‌కూ మహాస్వప్న మనిషిగా నచ్చాడు, ఆయనతో ఇంటర్వ్యూ మంచి అనుభవం అనిపించింది. దాన్ని ఫస్ట్‌పర్సన్‌ నెరేషన్‌గా మలచి రాయడం కూడా మాకు సంతృప్తినిచ్చింది. త్రిపురనేని శ్రీనివాస్‌, నేను కలసి చేసిన ఉమ్మడి రచన కావడం వల్ల కూడా నాకు ఆ రచన, ఆ ప్రయత్నం అపురూపమైనవి.

పధ్నాలుగేళ్ల తరువాత మళ్లీ లింగసముద్రం వెళ్లడంలో ప్రధానమైన ఆసక్తి- రీవిజిట్‌ చేయడమే. జ్ఞాపకంగా ఇంకిపోయిన అప్పటి అనుభవంతో ఇప్పటి వాస్తవికతను పోల్చి చూడాలనే ఆసక్తి కొంత. ఆ మనిషి ఇంకా అక్కడే ఉండడంలోని ధిక్కారాన్ని గౌరవించాలని కొంత. నాలో నేను త్రిపురనేని శ్రీనివాస్‌ జ్ఞాపకంలో జీవించాలని మరికొంత.

……

 

ఆంధ్ర జ్యోతి ఎడిషన్‌ ప్రారంభం సందర్భంగా ఫిబ్రవరి మొదటివారంలో ఒంగోలు వెళ్లిన క్షణం నుంచి నన్ను లింగసముద్రం తీసుకువెళ్లగలిగే సాహితీమిత్రుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. రెండోరోజుకు కాట్రగడ్డ దయానంద్‌, శ్రీరామకవచం సాగర్‌ దొరికారు. సాగర్‌ మహాస్వప్న లింగసముద్రంలోనే ఉన్నారని, నన్ను తీసుకువెడతానని చెప్పారు. సాగర్‌, నేను, మరో మిత్రుడు హరిబాబు లింగసముద్రం ప్రయాణమయ్యాము. ప్రకాశం జిల్లాలో కందుకూరుకు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లింగసముద్రం. మండల కేంద్రం. చిన్న, సన్నరోడ్లు. సెల్‌ఫోన్‌ కవరేజ్‌ లేదు. ఏ రకంగానూ మహాస్వప్న మెయిన్‌స్ర్టీమ్‌ కాలేదు. మొండిగోడల మధ్య నులకమంచం మీద ‘సారాసముద్రాలు ఇంకిన కళ్లతో’ కనిపించిన మహాస్వప్నను మననం చేసుకుంటూ లింగసముద్రం బస్టాపు దగ్గరికి వచ్చేసరికి- ‘ ఆయన ఇక్కడే ఉన్నారు కదా!’ అని సాగర్‌ కారు ఆపించారు. అక్కడ బస్టాపు పక్కన టీబంకులో కూర్చుని పిచ్చాపాటీ చెపకుంటున్న ముగ్గురు గ్రామీణుల్లో మహాస్వప్నను నేను గుర్తించలేకపోయాను. ఆయన అంతట ఆయనే వచ్చి, సాగర్‌ను పలకరించారు. సాగర్‌ నన్ను పరిచయం చేశారు. గుర్తుపట్టీ, పట్టనట్టుగా ఆయన చూశారు. ‘ ఇటువైపు ఎటు వెడుతున్నారు?’ అని అడిగారు. ‘మీదగ్గరికే వచ్చాం’ అన్నారు సాగర్‌. ఆయన చాలా ఇబ్బందిగా ముఖం పెట్టారు. ‘మా పక్క ఇంట్లో పెండ్లి అవుతున్నది, వాళ్లు మా ఇల్లంతా వాడుకుంటున్నారు..’ అన్నారాయన. ఇక్కడే కూచుని మాట్లాడుకుందాం అన్నాము మేము.

ఆయనచేతిలో ఏదో పత్రిక ఆదివారం అనుబంధం ఉన్నది. పుస్తకసమీక్ష పేజీ దగ్గర మడిచి చేతిలో పట్టుకున్నాడాయన. అరవయ్యేళ్ల పైబడిన వయసు ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. మనిషి మాట తడబడుతూనే ఉంది. ఒకవైపు పండ్లు ఎక్కువగా ఊడిపోయి, నోరు బొక్కిగా తయారయింది. నల్లబడ్డాడు. వడలిపోయి ఉన్నాడు. తెల్లటి చొక్కా, లుంగీ. ఈయన తెలుగుసాహిత్యంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి అంటే ఎవరూ నమ్మలేరు.

ఆయన నన్ను గుర్తుపట్టారు. మీరు కొంతకాలం వార్తలో కూడా చేశారు కదా అని అడిగారు. మీ కాలమ్స్‌ చదివేవాడిని అని చెప్పారు. త్రిపురనేని శ్రీనివాస్‌ మరణం తనను ఎంతగా కలచివేసిందో చెప్పారు.

పక్కనే ఒక స్కూలు కాంపౌండు ఉన్నది. ఆయన పెద్దనాన్న పేరుతో ఉన్న స్కూలు అది. ఇపడు ప్రభుత్వం నడుపుతోంది. అక్కడికి వెళ్లి మాట్లాడుకుందామని కదిలాము. తాను చదువుతూ ఉన్న ఆధ్యాత్మిక పుస్తకాల గురించి మహాస్వప్న చాలా మాట్లాడారు. ఓషో బోధనలు, బౌద్ధంలోని ధ్యానపద్ధతులు, జెన్‌బౌద్దం- ఇవి ఆయనకు ఈ మధ్య కాలంలో ఆసక్తులుగా ఉన్నాయి. మనలోపల ఇంకో లోకం ఉంటుందని, దానిలోకి వెళ్లగలిగితే అంతా వెలుతురే అని ఓషో చెప్పినమాటలు ఆయన ప్రస్తావించారు. భైరవయ్య లాగా తాను శాక్తేయంలోకి వెళ్లలేదని చెప్పారు. బౌద్ధం కూడా తనకు మతం కాదని, ధర్మం అని అన్నారు. సమాజంలో ఏదో ఆధ్యాత్మికమైనమార్పు వస్తోందని, మంచి రోజులు వస్తాయని అన్నారు. ఉన్నట్టుండి ‘ అంతా భ్రాంతి’ అన్నారు. ఈ మాటలు రాసుకుంటుంటే, అసమ్మతిగా చూశారు.

‘మహాన్‌’పేరుతో ఆ మధ్య కొన్ని పత్రికల్లో కవిత్వం రాశానని చెప్పారు. సాహిత్యరంగంలోని పరిణామాలను స్థూలంగా గమనిస్తూనే ఉన్నారు. స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం- అన్నీ ఆయనకు పరిచయమే. ఇపడవన్నీ తగ్గుముఖం పట్టాయి కదా అన్నారు. ఈ స్తబ్ధత పెటేల్‌మని పగిలిపోతుంది అన్నారు. శివారెడ్డికి యాక్సిడెంట్‌ అయింది కదా కోలుకున్నారా అని అడిగారు. రామచంద్రమూర్తిగారు ‘వార్త’నుంచి వె ళ్లారట కదా- అని వాకబు చేశారు. ఏబీకే ఏమి చేస్తున్నారు అని అడిగారు. ఆ మధ్య పత్రికల్లో రివ్యూ వచ్చిన ‘లాస్ట్‌ బ్రాహ్మిన్‌’ అన్న పుస్తకం చదవాలని ఉంది, పంపించమని సాగర్‌ను కోరారు. ఆ రివ్యూలు చదివినపడు ఆ పుస్తకరచయిత రాణిశివశంకర్‌తో తనకేదో సహానుభూతి కలిగినట్టు అనిపించింది అన్నారు. ఏదైనా మార్పు కావాలని బలంగా అనిపించినపడు, ఆ మార్పును తేవడానికి ప్రయత్నించాలి కానీ, మార్పు కావాలని కవిత్వం రాయడమేంటి అని వ్యాఖ్యానించారు. వేగుంట మోహన్‌ప్రసాద్‌ ఇపడెక్కడ ఉంటున్నారు అని అడిగారు. చీకటిపడుతోంది కదా, ఒంగోలు వెళ్లాలి కదా అని ఇక ముగించమని సూచించారు.

చాలా సంకోచంతో ఒక పర్సనల్‌ ప్రశ్న అడుగుతానన్నాను. ఇంత జీవితం గడిచాక మీకేమైనా పశ్చాత్తాపం ఉందా, మరోరకంగా జీవించి ఉంటే బాగుండేది అనిపిస్తోందా? అని అడిగాను. ఆయన సాహిత్య ఏకాంతం, అవివాహ జీవితం-వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రశ్న అడిగాను. ‘‘జీవితం గురించి నాకే కోరికా లేదు. నేనేమీ కోరుకోలేదు. నేను కోరుకున్నదే నాకు లభ్యమైంది.మీజాజ్‌ లఖ్నవీ అనే ఉర్దూ కవి తాగి తాగి చనిపోయాడు. అతనిలాగా తాగితే అతనిలాగా కవిత్వం రాయగలననుకున్నాను. నేను ఎట్లా ఉండాలనుకున్నానో అట్లా ఉన్నాను, ఎందరు అట్లా ఉండగలరు?’’- అని ఆయన సమాధానం చెప్పారు. మీ ఆలోచనలను ఎవరితో పంచుకుంటారు? రోజూ మీతో మాట్లాడడానికి ఎవరు దొరుకుతారు, ఇంతకూ ఆ టీబంకులోని వాళ్లతో మీరేమి మాట్లాడుతున్నారు?- అని అడిగాను. వాళ్లతో మాట్లాడేవి వాళ్లతో మాట్లాడతాను- అన్నారాయన ముక్తసరిగా.

అలసత్వం, బద్ధకం, అనాసక్తి కూడా తన జీవితాన్ని ఎంతో కొంత ప్రభావితం చేశాయని ఆయన ఒపకున్నారు. చెలంగారి నుంచి ఎంతో ప్రభావితుడై కూడా, ఆయనతో నిత్యం లేఖాసంబంధంలో ఉండి కూడా ఆయనను ఒక్కసారి కూడా కలవలేకపోయానని విచారంగా చెప్పారు. ‘ ఏవో కుంటి సాకులు చెబుతావు కానీ, రావాలనుకుంటే ఒంగోలుకు తిరువణ్ణామలై ఎంత దూరమని, నీ కోరికలోనే తగినంత బలం లేదు, అందుకే రాలేకపోతున్నావు’ అని చెలంగారు ఒకసారి రాశారట.

పధ్నాలుగేళ్ల కిందటి లాగా, మహాస్వప్న ఇపడు బయటిప్రపంచంతో సంభాషించడానికి అంత ఉత్సాహంగా లేరు. చెలంగారిలాగా ‘సాటునుండే ఎంకిని సబకు రాజేశావ?’ అని మురిసిపోయే పరిస్థితి ఆయనకు లేదు. ఆయన మరో లో కంలోకి వెడుతున్నారు. ‘మళ్ళీవస్తాను జాగ్రత్త’ అని తెలుగు సాహిత్య సమాజాన్ని హెచ్చరించే ఉద్దేశ్యం ఇపడిక లేదు. ‘సెకండ్‌ కమింగ్‌’ లేదు. పునరుత్థానం అంతరంగలోకంలోనే.

…….

 

మా జిల్లాలో ఇంత పెద్ద కవి ఇట్లా మారుమూల ఉన్నాడంటే చూడాలని వస్తున్నా- అన్నాడు హరిబాబు. నెల్లూరు రహదారి నుంచి కందుకూరు వైపు మళ్లిన తరువాత దారి అంతా తెలంగాణ పల్లెసీమలాగానే అనిపించింది. ఆ ప్రాంత వెనుకబాటుతనం గురించి హరిబాబు వివరంగా చెబుతున్నాడు. మహాస్వప్నతో మాట్లాడి స్కూలు కాంపౌండు దాటి వస్తుంటే కుడివైపున తెలంగాణా బ్రాండు పోలీసు స్టేషన్‌ కనిపించింది. ‘ ఇక్కడ కూడా ఇటువంటి స్టేషన్‌ కట్టారే, నక్సలైట్లు ఇక్కడికి కూడా వచ్చారా?’ అని అడిగాను. ‘ ఇంకా వాళ్లకు భయంగానే ఉంది, పక్కన పొదలున్నాయి కదా, వాటిని కూడా నరికించాలని లేకపోతే సేఫ్టీ లేదని భయపడుతున్నారు’ అన్నాడు స్వప్న.

విప్లవోద్యమంలోకి దిగంబరకవిత్వాన్ని మళ్లించడాన్ని వ్యతిరేకించి లింగసముద్రంలో మిగిలిపోయిన మహాస్వప్న దగ్గరికి ఆ ఉద్యమమే రావడం విచిత్రంగా అనిపించింది!

మే 6, 1990

 

కె. శ్రీనివాస్

కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక పూర్వ సంపాదకులు.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మహా స్వప్న గురించి ఇన్ని విషయాలు, ఇట్లా తెలుసుకోవడం సంతోషం. శ్రీనివాస్ గారికి, ప్రచురించిన సారంగ పత్రికకి ధన్యవాదాలు.

    ఫాంట్ సమస్య వల్ల అనుకుంటా అక్షర దోషాలు కనపడుతున్నాయి. పేపర్ కటింగ్స్ పక్కన పొడవుగా గీతలాగా అక్షరాలు ఉన్నాయి. చదవడానికి అర్థం కావడం లేదు. ఒకసారి చూడగలరు.

  • మాకు అంతగా,తెలియని మహాస్వప్నగారి గురించినవివరాలు,మీ,వల్ల తెలిసినందుకు అభివందనలు మీకు!వారికి,నివాళి!త్రిశ్రీ,మరోసారి,గురుతుకు వచ్చారు!

  • Sir
    Mahaswapna gaari parichayam baavundi. 2004 tarwatha mallee aayananu interview cheyalekapovadam maadhyaamaallo kaanavasthunna pettubadi paatre kaaranam.
    Srinivas Garu thank you

  • చాల బాగుంది శ్రీనివాస్ గారూ. నేనప్పుడు ఆంధ్రజ్యోతి లో ఇది ప్రచురింపబడ్డప్పుడు మురిపంగా చదువుకుని దాచుకున్నా. గొప్ప జ్ఞాపకం. దిగంబర కవిత్వం లో మహాస్వప్న ఒక ప్రత్యేకమైన గొంతుక. దిగంబర కవిత్వం మేనిఫెస్టో కూడా రాసాడు కదా తన కవిత లో ‘రాత్రి ఉదయిస్తున్న రవిని’ అంటూ. ‘మేము మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు’ కూడా ఒక గొప్ప కవిత.

  • ‘‘కీర్తికాముకుల, నియంతల, అహంతల దౌర్జన్య బాహువుల దురాక్రమణలో
    దేశదేశాల సుఖవ్యాధి పుండ్లతో
    చీడపురుగులు నిండిన మేడిపండ్లతో
    భూమి వెలయాలై, పతితయై, భ్రష్ఠయై పుచ్చి గబ్బు
    కొడుతున్నప్పుడు
    నేను పుడుతున్నాను, దిగంబర కవిని’’ అన్న మహాస్వప్న

    గురించి అపురూపమైన, అమూల్యమైన, అరుదైన విషయాలతో కూడిన ” మరో మరోసారి మహాస్వప్నం ” ని ఇచ్చిన కె. శ్రీనివాస్, సారంగ సంపాదక వర్గానికి హౄదయపూర్వక కృతజ్నతలు.

    సాహసించి, శ్రమించి, ( నగ్నముని, నిఖిలేశ్వర్ లను వొప్పించి ), దిగంబర కవుల కవితా సంకలనం మలి ముద్రణ తీసుకొచ్చిన శ్రీశ్రీ ప్రచురణల ( సాహితీ మిత్రుల ) విశ్వేశ్వర రావు గారికీ కృతజ్నతలు.

    మళ్లీ వస్తాను జాగ్రత్త అన్న మహాస్వప్న; దిగంబర కవులు, చెరబండరాజు, నిఖిలేశ్వర్, శ్రీశ్రీ లను ఇష్టపడే త్రిపుర; విరసం విప్లవం మార్గం కాకుండా మరో మార్గం పట్టిన భైరవయ్య, మహాస్వప్న తలుచుకునే త్రిపుర; చిచ్చెర పిడుగు త్రిపురనేని శ్రీనివాస్, ఆంధ్ర జ్యోతి కె. శ్రీనివాస్, లాస్ట్ బ్రాహ్మిన్ రాణి శివశంకర శర్మ, ‘అగ్నిఖని’ నగ్నముని ని స్మరించిన డా. గుర్రం సీతారాములు … ఇంకా మరెందరో గుర్తుకు వస్తున్నారు యీ సందర్భం లో

    ” కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు ” : మహాస్వప్న

    1970లో దిగంబర కవులు ఇచ్చిన చార్జిషీట్‌కు మహాస్వప్న ఇచ్చిన సమాధానం సంక్షిప్త రూపం. మంగళవారం కన్నుమూసిన మహాస్వప్న స్మరణలో

    https://www.sakshi.com/news/guest-columns/tribute-digambara-poet-late-mahaswapna-1201662

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు