మరోసారి మరో చిగురాశ!

ఇదిగో ఇది మార్చి నెల! ఇదిగో ఇది మా నిర్ణయం! కొత్త శీర్షికలతో ముఖ్యంగా మీడియాని సమర్ధంగా నిపుణంగా ఉపయోగించుకోవాలన్న తపనతో మళ్ళీ మీ ముందుకు- కాకపొతే, ఇప్పుడు పక్ష పత్రిక!

మొదట మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు!

ఉగాది అంటే పచ్చదనం. మావి చిగురు. కోయిల పాట. ఆ రెండీటిలో ఏది ముందు ఏది వెనక అన్న అందమైన సంశయమూ! చలిని పొడుస్తూ వెచ్చగా పరచుకునే సూర్యుడు. సూర్యుణ్ణి వోడించేయాలని ఆరాటపడే చలి. వొక కొత్తదనమేదో ఇంటింటా అందరినీ పలకరిస్తూ వుంటుంది. జీవితం కొత్త రంగుతోనో, కొత్త శబ్దంతోనో పల్లవించే వేళా విశేషం ఉగాది.

వీటన్నిటికీ ఇప్పుడు మరోసారి సారంగ తోడురాగమవుతోంది. ఏ ప్రారంభమైనా ఆశల చిగురాకులా మిలమిల మెరుస్తుంది. ఆ చిగురాకు  నిండా కలల మెరుపే వుంటుంది. ఆ చిగురుని చూసే కళ్ళల్లో కూడా కొత్త కాంతులీనుతూ వుంటాయి. అది సహజమే! అసలే  కలలూ కనలేకపోవడం కంటే పెద్ద శాపం ఇంకోటేదీ లేదు. కల నిజమవుతుందా లేదా అన్నది తరవాతి సంగతి. ముందు ఆ కలని యెవరూ దోచుకోకుండా కాపాడుకోవాలి. అట్లాంటి సందేశమిచ్చేది అది ఉగాది అయినా పర్లేదు, చిన్న మార్పేదో అయినా పర్లేదు. మార్పు కోసమే ఉగాది. మార్పు కోసమే  ఇప్పుడు ఈ సారంగ !

పోయిన ఏడాది జనవరి మధ్యలో సారంగ  ఇక సెలవు అని ప్రకటించినప్పుడు అది యెవరికీ నచ్చలేదు. చాలా మంది ఇప్పటికీ కోప్పడుతూనే వున్నారు. కొన్ని పత్రికల సాహిత్య పేజీలు సారంగ  మూతని వార్తగా ప్రకటించేంత సంచలనమూ అయింది. గత ఏడాది కాలంగా యెందరో యెన్నో విధాలుగా సారంగ మళ్ళీ మొదలవ్వాలని గట్టిగానే వొత్తిడి చేస్తూ వచ్చారు. కొంత మంది ఆర్థికంగా సాయపడడానికి కూడా ముందుకు వచ్చారు. ఇంకా కొంత మంది మా రెండు చేతులూ  అందిస్తామని సంతోషంగా ముందుకొచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సందర్భం వచ్చినప్పుడు మీ సహకారం తప్పక తీసుకుంటాం.

ఈ ఏడాది పాటు నిశ్శబ్దం వల్ల సారంగ లేని లోటుని అందరూ మాట్లాడుతూనే వున్నారు. వేదికల మీద చెప్తూనే వున్నారు. ప్రతి గురువారం క్రమం తప్పక సారంగ విడుదల అవడాన్ని చూస్తూ వచ్చిన మీకు చాలా విషయాలు తెలుసు. సారంగ క్రమ వికాసమూ వాస్తవాలూ కలలూ అన్నీ! మేం ఇంట్లో వున్నా, విదేశాల్లో తిరుగుతూ వున్నా, ప్రతి గురువారం సారంగ మాత్రం మీ ముందు సాక్షరమై నిలిచేది.  అట్లా వారం వారం పత్రిక రావడానికి వెనక యెన్ని చేతుల యెన్నేసి గంటల శ్రమ వుందో మీకు తెలియంది కాదు. ఇవాళ మళ్ళీ సారంగ ని మీ ముందుకు ఇలా తీసుకువస్తున్నామంటే అవన్నీ గుర్తుంచుకునే మొదలు పెడ్తున్నాం. పత్రికా నిర్వహణ  చిన్న బాధ్యత కాదు. కేవలం అయిదారు రచనలు పెట్టి చేతులు తుడుచుకునే వ్యవహారమూ కాదు. ఇదొక ప్రయాణం. ఈ ప్రయాణంలో గతంలోకి తోసేసే గాయపరిచే రాళ్ళూ, పద ముందుకు అని నడిపించే మైలు రాళ్ళూ వుంటాయి. తొవ్వ సరిగా నలగక, శరీరాన్ని సలిపే ముళ్ళూ వుంటాయి. ఆహ్లాదం నింపే పూలూ వుంటాయి. అవన్నీ మేం అనుభవించాం ఖాయంగా! ఇప్పుడు అలాంటి అనుభవం కూడా తోడై, అన్నీ తెలిసే ఈ కొత్త మొదలు!

ఫోటోలు: ప్రవీణా కొల్లి

పోయిన ఏడాది జనవరి పదిహేడున సెలవు ప్రకటించినప్పుడు ఇంకో మాట కూడా అన్నాం. “వచ్చే మార్చి నెలకి మా నిర్ణయం తెలియ జేస్తాం” అని!

ఇదిగో ఇది మార్చి నెల! ఇదిగో ఇది మా నిర్ణయం! కొత్త శీర్షికలతో ముఖ్యంగా మీడియాని సమర్ధంగా నిపుణంగా ఉపయోగించుకోవాలన్న తపనతో మళ్ళీ మీ ముందుకు- కాకపొతే, ఇప్పుడు పక్ష పత్రిక! ఈ మార్పు  కేవలం మా సమయం వెసులుబాటు కోసం! నాలుగు కాలాలు నిలకడగా సారంగ ని మీ ముందుకు తీసుకు రావడం కోసం!

ప్రయోగాత్మకంగా ఇంగ్లీషు సారంగ ని కూడా ఇక  ప్రతి పక్షం రోజులకి ఒక సారి అందిస్తున్నాం. ఇది మా చదువరులకు విశేష కానుక. తెలుగు నుంచి ఇంగ్లీషులోకి విస్తృతంగా అనువాదాలు వెళ్ళాలని, అనువాదాలు లేకపోవడం వల్లనే మన తెలుగు సాహిత్యం వెనకబడి వుందని మనం చాలాకాలంగా బాధపడుతూనే వున్నాం. కాని, అనువాదకులని ఒక వేదిక మీదికి తీసుకువచ్చి, వాళ్ళ మధ్య సంభాషణ మొదలు పెడితే తప్ప అనువాద కృషికి తగినంత బలం దక్కదు. సారంగ ఇంగ్లీషు విభాగం ఈ దిశగా యే కాస్త వుపయోగపడినా అది మాకు కొండంత వెలుగు.

ఇవాళ మీడియా అంటే కేవలం అచ్చు అక్షరమే కాదు, విన్పించే మాట. కన్పించే దృశ్యం కూడా! కాని, సాహిత్యం ఇప్పటికీ అచ్చు అక్షరాలకే పరిమితమై వుండడం వల్ల కొత్త తరానికి అది అంతగా అందడం లేదు. ఇవాళ్టి “చదువరులు” కేవలం “చదువు”కోవడంతోనే తృప్తి పడడం లేదు. దృశ్య శ్రవణ రూపాల్లో కూడా సాహిత్యం వుండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా చాలా కృషి జరగాల్సి వుందని మేం నమ్ముతున్నాం. సారంగ ద్వారా అది ఎంతమేరకు చేయగలమో ఇంకా ఒక స్పష్టత లేదు. ఈ సంచికతో ఛాయ సాహిత్య సంస్థ సహకారంతో అందిస్తున్న వీడియో ఇంటర్వ్యూ అటువైపుగా ఒక అడుగు మాత్రమే. మీ నుంచి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆ దృశ్య శ్రవణ విభాగాన్ని మరింత మెరుగుపరుస్తాం.

అతితక్కువ వ్యవధిలో అడిగినా తక్షణమే స్పందించి, ఈ సంచికకు రచనలు పంపించిన రచయితలందరికీ, ముఖ్యంగా కాలమిష్టులకు, బొమ్మ సాయం చేసిన చిత్రకారులకు సారంగ కృతజ్ఞతలు. వందల సంఖ్యలో కవితలు పంపిన కవులకు మా ధన్యవాదాలు. అయితే, సారంగ పక్షపత్రిక స్థల కాల పరిమితులని దృష్టిలో వుంచుకొని మాతో సహకరించవలసిందిగా వారికి ప్రత్యేకంగా విన్నపం.

ఈ ఉగాది రోజు మీ ముందుకు వచ్చిన సారంగ ని పది ఉగాది కాలాలపాటు నిలబెట్టుకునే బాధ్యత మీదే ఇక! సారంగ ప్రస్తుతానికి ఇలా వుంది. ఇక ముందు యెలా వుంటే బాగుంటుందో మీ సూచనలు ఎప్పటికప్పుడు చెప్తూ వుండండి.

సారంగ  మీ పత్రిక, మీ వేదిక.

సారంగ మీ గొంతుక, మీ వాహిక!

మీరు తోడై నిలబడితేనే  సారంగ !

*

ఎడిటర్

25 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సారంగకు ఉగాది శుభాకాంక్షలు. స్వాగతం.

  • సారంగ ఆగిపోయినప్పుడు బాధ కలిగింది. ఇప్పుడు మళ్ళీ మొదలైనందుకు సంతోషంగా ఉంది. ఈ మేలుకలయకలకి వేదిక, సారంగ. శుభాకాంక్షలు.

  • చిగురులు తొడిగిన సారంగకి సాదరంగా స్వాగతం – శుభాభినందనలు !

  • రచనలన్నీ చాలా బావున్నాయి సర్. ధన్యవాదాలు

  • సారంగ సారధులకు, చదువరులకు ఉగాది శుభాకాంక్షలు . సారంగని మళ్ళీ తీసుకురావాలన్న తపన , దానివెనుక మీ కృషి ప్రశంసనీయం , ధన్యవాదాలు .
    ఈ సంచికతో దృశ్యశ్రవణ రీతిలో సాహిత్యాన్ని అందించాలనే నిర్ణయం , యువతరానికి సాహిత్యాన్ని పరిచయం చేయడంలో ఒక మంచిప్రయత్నం , అలాగే ఇంగ్లీష్ సంచిక . పక్షపత్రిక చేయడంవలన మీ పైన ఒత్తిడి తగ్గి సారంగ నిరంతరాయంగా పదికాలాలపాటు సాహితీ ప్రియుల్ని అలరించాలని ఆశిస్తూ

  • సారంగ పక్ష పత్రిక కు స్వాగతం సార్. సారంగ నిరంతరం జీవ నది కావాలని కోరుకుంటున్నాను సార్.

  • సారంగకు తిరిగి స్వాగతం.
    కొత్త ఆశలను, కొత్త కలలను సరికొత్త స్పూర్తితో అందించాలని ఆశిస్తున్నాను.
    వందనాలు..

  • శుభాకాంక్షలు —
    —- Greet Yourself
    In your thousand other forms
    As you mount the hidden tide and travel
    Back home.—
    —Like a welcomed season
    Onto the meadow and shores and hills.–
    –Hafiz

  • ఈ పునరాగమనం చాలా బాగుంది. సారంగ టీం కి అభినందనలు. All the best.

  • సారంగ ని చూడగానే ఏదో పోగొట్టుకున్నదే దొరికినంత ఆనందం వేసింది. చిన్నపాటి అక్న్తే చాల చాల కొద్దిగా గర్వం నే ను కూడా సారంగ కుటుంబం లో ఉన్నాను కదా అని ఎప్పటిలాగే మన సారంగ అంటే అదే ఉత్సహం,అదే సంతోషం. wishing you all the very best

  • Good to greet సారంగ. రిచ్ ఇన్ texture and production. Great beginning in the 2nd innings. A memoir-like write-up by K.Srinivas in a possibly chatty infomal way can certainly offer a desirable readability. Siva reddy ,as usual, is more fully at home in the heart of the present than in the ooze of the past though apparently it seems so. All other features are finely crafted if not so well conceived.All the best.

  • బజార్ వెళ్ళ వలసిన బాధ లేదు.కొనే ఖర్చూలేదు వారం వారం ఈ మెయిల్ కి వస్తున్న పత్రిక శుక్ర వారం పైపై చూసేసి శని ఆదివారాలు నింపాదిగా ఆస్వాదిస్తూ ఒక రొటీన్ కి అలవాటు పడినాక హఠాత్తుగా ఆగిపోతే అలవాటైన ప్రాణం ఇబ్బంది కలిగింది.
    అప్పుడే అనుకున్నా వాళ్ళు ఉండలేరని.ఈ మార్చే సాక్ష్యం.
    నేనయితే చాలామంది యువ పాఠకులచేత చదివించాను
    ప్రతిది ఆర్థికంగానో మరో రకంగానో ప్రయోజనాన్ని ఆశించటం సహజంకదా ! కొందరుంటారు.
    సాహిత్యం మీద ఎంత ప్రేమతోనో ప్రతి అక్షరాన్ని తరచి చూస్తారు వాళ్ళు.మరింత అమృతమద్ది చదివినవాళ్ళను అజరామరులు చేస్తారు వాళ్ళు.
    వాళ్ళే ఈ త్రయం. వాళ్ళకి నమస్కరిస్తూ..మరోసారి బిజీబిజీ చేసే వసంత సారంగానికి స్వాగతం
    డా. పిబిడివిప్రసాద్
    .

  • “సారంగ” మళ్ళీ నవ్వింది. సంవత్సరం పాటు నిశ్శబ్దంగా వున్న “సారంగ” మళ్ళీ పలకరించింది. తెలుగులో మంచి కవిత్వానికి, విమర్శకి, కథలకీ, విశ్లేషణలకి, వ్యాఖ్యానాలకి, సామాజిక పరిశీలనలకి, చర్చలకి, ఇంకా అనేక శీర్షికలతో వివిధ సాహితీ ప్రక్రియలకి చిరునామాగా నిలిచిన సారంగ మొన్న ఉగాది నాడు మళ్ళీ వచ్చి మనసు నిమిరింది. కంప్యూటర్తో పరిచయం వుండి సాహితీ పిపాసులైన తెలుగు పాఠకుల ఆత్మీయ అంతర్జాల సాహితీ నేస్తం సారంగ ఈ సారి మరిన్ని హంగులతో మన ముందుకొచ్చింది. “సారంగ ఛానెల్” “ఇంగ్లీష్ సెక్షన్” నిజంగా సర్ప్రైజ్ పాకేజీనే. సారంగ బృందానికి ధన్యవాదాలు చెబుతూ “సారంగ”ని రెండు చేతులతో ఆహ్వానిద్దాం.

  • చాలా సంతోషంగా ఉంది.
    పోయింది అనుకున్న విలువైన వస్తువు దొరికినట్లు.
    మాకు నమ్మకం ,మునుపటి కంటే మిన్న గా తీర్చిదిద్దుతారని.
    ఉగాది కానుక తెలుగు జనులందరికీ.

  • సారంగ కు స్వాగతం
    కొత్త సంవత్సరం కొత్తగా వచ్చినందుకు చాలా సంతోషం.
    మంచి కథలు ,శీర్షికల కోసం ఎదురు చూస్తున్నాము.

  • ప్రారంభ సంచిక ప్రామిసింగ్ గా వుంది.

    శుభాకాంక్షలతో

    శ్యామ్

  • ఒక పత్రిక ఆగిపోయినపుడు వందలాది మంది దిగులు పడటం నాకు ఊహ తెలిసాక అత్యంత అరుదు …అది తిరిగి మొదలయినపుడు వేలాది మంది సంబరపడటమూ అరుదే

    సారంగా ఒక సాంస్కృతిక అవసరం…ఇది అవిచ్ఛన్నం గా సాగిపోవాలని korutunnaa

  • స్వాగతం. ఒక సంవత్సరం పాటు ఏదో తెలియని వెలత. ఎప్పుడైనా ఎడిటర్లు తమ నిర్ణయం మార్చుకుంటారేమోనని ప్రతి వారం సారంగ ఒపెన్ చేయడం. చివరికి ఇవాళ చూసాను. చాల ఆనందంగా ఉంది. మళ్ళీ కల్లూరి భాస్కరం గారి వ్యాసాలు, మైథిలి అబ్బురాజు గారి అనువాద నవలలూ చదవచ్చు. పాత వెబ్సైట్ కూడా లింకు గా ఇవ్వడం వలన ఇంకా హేపీగా ఉంది. ఈ సారంగ మేగజైన్ లో పాల్గొన్న పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాభినందనలు.