మరోసారి దొస్తొయేవ్‌స్కీ!

దోస్తోయేవస్కి’ ఈ పేరు వినగానే ఒక తరం వారికి ఆయన చిట్టి నవలలు ‘పేదజనం’ ‘శ్వేత రాత్రులు’ గుర్తుకొస్తాయి. ‘ ‘నేరము-శిక్ష’ గుర్తుకొస్తుంది. సోవియట్ యూనియన్ ప్రచురణలు ఆగిపోయాక అవి గుడా అదృశ్యమయ్యాయి. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకు దోస్తోయేవస్కి నవలలన్నిటినీ తెలుగు లోకి అనువాదం చేయించి ‘సాహితి’ ప్రచురణ సంస్థ ద్వారా ముద్రించే బాధ్యతను తలకెత్తుకున్నారు కుమార్ కూనప రాజు గారు.

దోస్తో యేవస్కి గురించి తెలుగు పాఠకులకు కొత్తగా చెప్పేదేముంటుంది, ఆయన తన రచనల ద్వారా జీవిత తాత్వికతలను, సంగాతాసంగత జీవన వైరుధ్యాలను, చివర గా కనబడే బజారు దృశ్యాన్ని కూడా నవలగా మలచగల నేర్పరి. సాహిత్యాన్ని ఒక తత్వ సంగీతం గా ఆలపించాడు. ఆయన చెక్కిన ఆధో జగత్తు సోదరుల ఆయా పాత్రలు వాటి జీవితం లోని అసాధారణ సంఘటనలను ఎదుర్కునే తీరులో కనబడే తాత్విక వైవిధ్య సంగీతం అపూర్వం. అధో జగత్తు సోదరుల సామూహిక స్వతంత్ర తాత్విక రాగాలను భిన్న స్వరాలతో ఆలపించే గమకాలుగా మలచిన ఆయన నైపుణ్యం అసాధారణం. అవి పాశ్చాత్య వైయక్తిక సాంప్రదాయ ఆలోచనకు అందవు అవి మతం, తత్వం, సాహిత్యం లను అధిక్షేపించే వాస్తవ ఆలోచనాధారలు. వాటిని ప్రచురిస్తున్న కుమార్ కూనప రాజు గారి తో ఒక మాట ముచ్చట

మహారచయిత దొస్తొయేవ్‌స్కీ రచనలు  మీకు ఎలా పరిచయం అయ్యాయి?

అదో పెద్ద కథ. బహుశా ఎనిమిదో, తొమ్మిదో క్లాసు చదువుతున్న రోజుల్లో మావూరు పెదనిండ్రకొలను (ప.గో. జిల్లా)లో  మా యింటి వెనక రోడ్డులో విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌వారి ఎర్ర రంగు పుస్తకాల వ్యాన్‌ వచ్చేది. ఇంట్లో పిల్లలందరూ ఆ బస్సు దగ్గరకు పరుగు తీసేవాళ్ళం. అందులో పెద్దసైజు రష్యన్‌ పిల్లల  పుస్తకాలు వుండేవి. ఎక్కువగా తెలుగు అనువాదాలు. అక్కడే టాల్‌స్టాయ్‌ సేకరించిన పిల్లల పుస్తకాలు, తక్కువ ధరకు, రంగుల్లో దొరికాయి. ఇలా ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లయినా ఆ వ్యాన్‌ వచ్చేది. పిల్లల పుస్తకాలు అయ్యిపోయాక, నవలలు కథల పుస్తకాలు కొనేవాళ్ళం. నెమ్మదిగా అవికూడా నచ్చేవి. అవి ప్రపంచ సాహిత్యంలోనే పేరొందినవి, అని అప్పుడు మాకు తెలియదు. దొస్తొయేవ్‌స్కీ పుస్తకం ‘పేద జనం  శ్వేత రాత్రులు బహుశా ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో చూసినట్లు గుర్తు. అప్పట్లో అంతగా ఈ పుస్తకాన్ని ఇష్టపడలేదు. తరువాత ‘‘నేరము  శిక్ష’’ కూడా దొరికింది. ఆ పుస్తకం నచ్చేసింది. తరువాత కాలంలో ఆయన రచనలు  చదివాను, నాకు అవి బాగా నచ్చేవి.

 దొస్తొయేవ్‌స్కీ రచనలు  ప్రచురించాలని మీకు ఎందుకు అనిపించింది?

మూడు సంవత్సరాల క్రితం నలుగురు మిత్రులు (మీతోసహా) అనుకోకుండా రష్యా టూర్‌ వేశాం. మాస్కో, పీటర్స్‌బర్గ్‌ నగరాలు చూసాము. రష్యన్‌ సాహిత్యంతో, చరిత్రతో బాగా పరిచయం వుండటం వల్ల, ఈ టూర్‌ అంతా ఉత్సాహంగా  అనిపించింది. అన్నిటికంటే అనాటి రచయితల స్మారక మందిరాలు, శిల్పాలు, గ్రేవ్‌యాడ్స్‌లోని వారి గుర్తులు చూసిన తరువాత మనస్సు పరిపరివిధాల మారిపోయింది. టాల్‌స్టాయ్‌ మాస్కోలోని ఇల్లు మ్యూజియంగా మార్చారు. దొస్తొయేవ్‌స్కీకి పెద్ద శిలా విగ్రహం, క్రిమిలిన్‌ దగ్గర ఉన్న ప్రభుత్వ లైబ్రరీ ఎదురుగా చూసాము. సెయింట్‌ పీటర్‌ కోటలో దొస్తొయేవ్‌స్కీలను బంధించిన జైల్‌ చూసాను. ఓ మెట్రోస్టేషన్‌కు ‘దొస్తొయేవ్‌స్కీయా’ అని పేరు పెట్టారు. టూర్‌ అయిన తరువాత తిరిగి వచ్చాక ఏదో చేయాలనే కాంక్ష పెరిగిపోయింది.

మొదట విజయవాడలోని సాహితీ ప్రచురణ సంస్థలో ‘లక్ష్మి’గార్ని అడిగా ‘‘టాల్‌స్టాయ్‌ అనువాదాలు ఇప్పుడు ఏమీ దొరకడం లేదు, మీరు ప్రచురిస్తే బాగుంటుంది’’ అన్నాను. ఆవిడ వెంటనే ‘‘రెడీ’’ అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. వారికి గిట్టుబాటు అవుతుందో లేదో నాకు తెలియదుకానీ, అందుబాటులో వున్న పాత అనువాదాలను తొమ్మిది పుస్తకాలుగా వేసాము. టాల్‌స్టాయ్‌ నూటతొంభైయవ పుట్టిన రోజు సందర్భంగా విడుదల  చేసాం. ఇవి మొత్తం నాలుగు వేల పేజీలుపైగా వున్నాయి. విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో  సభలుకూడా పెట్టాము. మంచి ఆదరణ వచ్చింది. ప్రధానమైన పుస్తకాలు వేయగలిగామనే తృప్తి కలిగింది. కానీ, చాలా కాం క్రితం చేసిన అనువాదాలు కావడం వల్ల పాఠకులు చదవడానికి ఇబ్బందిపడ్డారని తెలిసింది. ఈ అనుభవంతో దొస్తొయేవ్‌స్కీ అనువాదాలు తేవాలనే ఆలోచన వచ్చింది. కానీ మూడు పుస్తకాలే అనువాదాలు వచ్చాయి. ‘‘కార్మజోవ్‌ సోదరులు’’, ‘‘ఇడియట్‌’’ వంటి ప్రధాన పుస్తకాలు  కూడా తెలుగులో రాలేదు. ఈసారి కొత్తగా  అనువాదాలు చేయించి ప్రచురించాలని అనిపించింది. దీనికి కూడా సాహితీ లక్ష్మిగారు ‘రెడీ’ అన్నారు. దానితో ఈ ప్రాజెక్టు కూడా ప్రారంభం అయ్యింది.

  దాదాపు వంద సంవత్సరాలు పైబడిన రచలను ఇప్పటి తరం స్వీకరిస్తుందనుకొంటున్నారా?

అప్పటి జారిష్ట్‌ రష్యాలో చదువుకొన్న మధ్యతరగతి యువతరంపై, అప్పటికే జరిగి వందేళ్ళైన ఫ్రెంచ్‌ విప్లవ ప్రభావంపడింది. రాచరికం పోవాలని, స్వేచ్ఛ కావాలని, రష్యాలో జార్జికి వ్యతిరేకంగా డిశంబరిస్ట్‌ తిరుగుబాటు జరిగింది. అప్పటి వారిని చాలా మంది ఉరి తీసారు దీని ప్రభావంతో సాహిత్య వెల్లువెత్తింది. దోస్తొయేవ్‌స్కీ కూడా ఈ ప్రభావానికిలోనై రచనలు  చేసారు. తరువాత కాలంలో వాటి ప్రభావం, ప్రపంచం నలుమూలలా విస్తరించింది. ఇప్పటికీ యూరప్‌, అమెరికాలలో ఆయన రచనలు, అనేకసార్లు ముద్రిస్తున్నారు. మన భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగు వారు కూడా ఆదరిస్తారని నమ్మకం వుంది. సాధారణంగా వాడుక భాషలో అనువాదాలు వుంటే తప్పక చదువుతారు. చదివే అలవాటు పెరగాలంటే మంచి పుస్తకాలు అందుబాటులో  వుండాలి కదా! ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

దొస్తొయేవ్‌స్కీ కాలానికి ఇప్పటికీ ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. మరి ఆ రచనలు కాలం చెల్లినవి కాదా!

మానవ హృదయవేదనకు కాలపు హద్దు వుండవు. ఎవరైతే ఈ వేదనను అందంగా మలచగలుగుతారో, వారి రచను చాలాకాలం నిలుస్తాయి. ఉదాహరణకు షేక్‌స్పియర్‌, టాల్‌స్టాయ్‌, దొస్తొయేవ్‌స్కీ, చెహోన్‌, వారందరూ చాలా కాలం నిలిచిపోతారు. ఇప్పటి ‘బెస్ట్‌ సెల్లర్’ పుస్తకాలు కొంతకాలానికి మరల కనిపించవు.

ఒకదశలో సస్పెన్స్‌ థిర్లర్ నవలు ఆదరించిన తెలుగు సమాజం దొస్తొయేవ్‌స్కీ నవలను ఎలా అర్థం చేసుకొంటారు?

దొస్తొయేవ్‌స్కీ నవలలోకూడా సస్పెన్స్‌ వుంది. కానీ, అంతిమంగా మానవ అంత:ఘర్షణ కనిపిస్తుంది. మానవుని మానసిక విశ్లేషణలను లోతుగా చూపించిన ఆయన రచను తరువాత డా॥ ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన మనస్తత్వ శాస్త్ర అభివృద్ధికి, కలల విశ్లేషణకూ, సైకో అనాలసిస్‌కూ ఉపయోగపడిరది. కొత్తగా ‘సైంటిఫిక్‌ సైక్రియాటీ’ ఆవిర్భావానికి పునాది వేసింది. లైట్‌గా తీసుకొనే యువతరంతోపాటు కొద్ది మంది సమాజాన్ని సీరియస్‌గా అర్థం చేసుకునేవారు కూడా వుంటారు. ఆ కొద్ది మందికి ఈ రచన చేరాలనే మా కోరిక.

  చివరిగా తెలుగు నేర్చుకోవడం తగ్గిపోతున్న ఈ కాలంలో, ఇలాంటి రచనలు  ప్రచురించడం వల్ల మీకు నష్టంరాదా?

తెలుగు సాహిత్య పుస్తకాలు చదవడం తగ్గిపోతోంది. కానీ జనాభా పెరుగుతోంది. చదువుకున్నవారు కూడా పెరుగుతున్నారు. సాహిత్యం చదవడం తగ్గిపోతోంది. కానీ చదవడం ఓ ఉద్యమంగా సాగితే, చదివే వారి సంఖ్య పెరుగుతుంది. మాకు అత్యాశ లేదు. రెండు, మూడువేల పుస్తకాలు అమ్ముడైతే మేం విజయం సాధించినట్లే! కొంచెం నష్టం వచ్చినా అది మా సామాజిక బాధ్యత అనుకొంటాం. ఈ విషయంలో లాభాపేక్ష లేదు. ఈ సాహిత్యం ఆధారంగా, ఆడియో సీడీలు, సినిమాలు, షార్ట్‌ఫిలిమ్స్‌ ఇతర మీడియాలకు కంటెంట్‌గా కూడా ఉపయోగపడుతుంది. మంచి మానవత్వ భావాలను విత్తనాలుగా నాటితే, అవి కొంతకాలానికి, మొక్కలై, వృక్షాలై పూలుపూస్తాయి.

మీరు నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు గురించి వివరించండి.

‘తెలుగులో దొస్తొయేవ్‌స్కీ’ ఈ ప్రాజెక్టుపేరు. గత సంవత్సరం, ఇలాంటి భావాలు ఉన్న మిత్రులతో  కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి చర్చించాం. ఇంగ్లీషులో అందుబాటులోవున్న అన్ని పుస్తకాలను తెలుగులోకి తీసుకురావాలని  కోరిక. ఇప్పటికే రెండు పుస్తకాలు మార్కెట్టులో వున్నాయి. మరో పద్నాలుగు పుస్తకాలు అనువాదాలు చేయించాలి. ఆ పని ప్రారంభం అయ్యింది. మిత్రులు అందరూ తలోపుస్తకం అనువాదం చేస్తున్నారు. మొత్తం నాలుగు, అయిదు వేల పేజీలు రావొచ్చు. ఈ సంవత్సరం 2021 నవంబర్‌ 11వ తేదీ దొస్తొయేవ్‌స్కీ ద్విశతజయంతి సంవత్సరం ఆ రోజున హైదరాబాద్‌లో జరిగే సభలో ఈ పుస్తకాలను ఆవిష్కరించాలని అనుకొన్నాం. అలాగే విజయవాడ, విశాఖ, వరంగల్‌, తిరుపతిలో సభలు జరిపి ఈ సాహిత్యాన్ని పరిచయం చేయాలని కోరిక. ఈ లోపు ‘పేద జనం  శ్వేత రాత్రులు’ నవలకు పునర్‌ముద్రణ జరిగింది. ఈ పుస్తకాన్ని మే 9వ తేదీ వెబ్‌ మీటింగ్‌లో ఆవిష్కరించబోతున్నాము. ఈ ప్రాజెక్టుకు అందరి సహకారం కోరుతున్నాను.

*

వేణు గోపాల్ రెడ్డి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అందుకోండి అభినందనల చందనాలు. ప్రచురణల కోసం ఎదురు చూస్తూ.

  • ప్రచురణ కోసం ఎదురుచూస్తున్నాం మీ/మా ప్రాజెక్ట్ కు అభినందనలు…sir💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు