మరుభూమిగా మారిన మాతృభూమీ!

శప్తభూమి!

Curse:(Pablo Neruda)

 

బొరియలు బొరియలై

మరుభూమిగా మారిన

మాతృభూమీ!

నమ్ము నా మాట:

నీ వెలిబూది లోంచి నీవు

నిరవధిక నీటిఊట మీది

*నిర్మరణ నీరజమై పైకి లేస్తావు.

ఎండి పిడచగట్టిన నీ నోరు

పాలరిక్కల రొట్టెముక్క;

వొలుకుతుంది

గాలిలోకి పునీత పుష్పదళమై.

నిందార్హులు వాళ్ళు;

 

** పరుశువునూ, పామునూ చేబూని

నీ పచ్చని నేల పైకి దిగివచ్చిన వాళ్ళు,

శాపార్హులు వాళ్ళు

అదను కోసం కాచుకొని

#దొంగచాటు హంతకులకు

సొంతింటి దొడ్డి ద్వారం తెరచిన వాళ్ళు.

 

ఓ బందిపోటు దొంగా

ఏదీ నీ లాంతరు?

అదుగో చూడు, తడిసిన నేలలో

ఆకలి గొన్న అగ్ని జ్వాలలు మిగిల్చిన

కారునల్లని దగ్ధాస్థికల ప్రోగును,

హతమార్చబడిన స్పెయినీయుల

మాడి మసిబొంతలైన చింపిదుస్తులను.

*

*flower of eternal water: 1936 స్పెయిన్ సివిల్ వార్ లో విధ్వంసమైన స్పెయిన్ దేశ నేపథ్యం. స్మశానభూమిగామారిన నేలలోంచి స్వచ్ఛమైన నీటి పుష్పమై స్పెయిన్ పునర్జన్మిస్తుందని కవి ఆశంస. పద్మం ప్రగతికిప్రతీక.

 

Eternal water:  నిరంతరంగా సాగే నీటి సరఫరా. ఈ అనంత నీటి ఊటలో పద్మం చిరంజీవి అని, ఇక, ఈదేశానికిమళ్ళీ ఇలాంటి దౌర్భాగ్యం సంభవించిందని సూచన.

** గొడ్డలి యుద్ధ భీభత్సానికి, పాము విషపూరిత వ్యూహానికి సంకేతం. ఆఫ్రికన్ సైనికుల కూటమితో మొరాక్సేనలు కాటు వేశాయని కవి ఆరోపణ.

# మొరాకన్ మూకలకు దేశం లోకి చొచ్చుకొచ్చే ఏర్పాటు చేసిన బిషప్పులు, ధనిక వర్తకులు.

 

 

 

 

 

Ramaswamy Nagaraju

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు