మరచిపోలేని మహానటి కృష్ణవేణి

ఈనెల 16 న కన్నుమూసిన తొలితరం తెలుగు సినీ నాయిక, తొలి మహిళా నిర్మాత, గాయని, మీర్జాపురం రాణి.. సి కృష్ణవేణి  

వరసాలను అలవోకగా ముఖంలో పలికించగలిగిన అలనాటి మేటి నటీమణి చిత్తజల్లు కృష్ణవేణి పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న జన్మించారు. తండ్రి కృష్ణారావు గారు వృత్తికి వైద్యులు. పాఠశాలలో వున్నప్పుడే ఆమె  నాటకాల్లో ప్రహ్లాదుడు, ధృవుడు వంటి పాత్రలు ధరించి ఎన్నో బహుమతులు అందుకున్నారు. ఆమెకి పదేళ్ల వయసులో  సి.పుల్లయ్య గారు పిల్లలతో ఒక సినిమా తీయాలని బాలనటులని వెతుక్కుంటూ రాజమండ్రి వచ్చినప్పుడు ‘తులాభారం’ నాటకంలో కృష్ణవేణిని చూసి ఎంపిక చేశారు. అలా 1936లో విడుదలైన ‘సతీ అనసూయ’ సినిమాలో అనసూయగా నటించి ఆమె బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు.

కొంతకాలానికి సి.ఎస్.ఆర్ ఆంజనేయులుగారి ‘తుకారం’ సినిమాలో నటించడానికి కృష్ణవేణి మద్రాసు వచ్చారు. తర్వాత ఆమె హీరోయిన్‌గా నటించిన తొలిచిత్రం ‘కచదేవయాని’ 1938లో విడుదలై ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె తండ్రి మరణానంతరం అమ్మమ్మ బాబాయిల సంరక్షణలో మద్రాసులో స్థిరపడ్డారు. 1939లో జయా పిక్చర్స్ ( తర్వాతి కాలంలో శోభనాచల స్టూడియోస్) నిర్వాహకులైన మీర్జాపురం జమీందార్‌ మేకా రంగయ్యగారితో ఆమె వివాహం జరిగింది. తర్వాత సంవత్సరమే వారి సొంత సంస్థ నిర్మాణంలో ‘భోజ కాళిదాసు’ చిత్రంలో అప్పటి హేమాహేమీలైన కన్నాంబ, అద్దంకి శ్రీరామ్మూర్తి మొదలైనవారి సరసన నటించి భళి అనిపించుకున్నారు కృష్ణవేణి.

ఆపై శోభనాచల వారి తొలి సాంఘిక చిత్రం ‘జీవనజ్యోతి’లో కథానాయకగా నటించి అందరి మెప్పు పొందారు. అప్పటి ప్రముఖ హీరో సిహెచ్ నారాయణరావుగారికి అదే మొదటి చిత్రం. తరువాత 1941లో ‘దక్షయజ్ఞం’ 1944లో ‘భీష్మ’ చిత్రాల్లో నటించారు. కానీ ఆమెకు విస్తృతంగా పేరు తెచ్చిపెట్టిన చిత్రాలు 1947లో ‘గొల్లభామ’ 1949లో ‘మనదేశం’ 1950లో ‘లక్ష్మమ్మ’.  ఆ రోజుల్లో అందరికన్నా ఎక్కువ పారితోషికం (45 వేలు) తీసుకున్న హీరోయిన్‌గా తన ప్రత్యేకత చాటుకున్నారామె. సంప్రదాయబద్ధంగా  పతివ్రతాశిరోమణిగా కనిపించే పాత్రలలో ఆమె ముఖంలో స్వచ్ఛత పవిత్రత వెల్లివిరిసేవి. ‘మనదేశం’ వంటి సినిమాలలో ఆధునిక మహిళగా కనిపించే పాత్రలలో ఆయా పాత్రలకు తగినట్లుగా చిలిపితనం ధైర్యం చలాకితనం, అవసరమైనచోట నిర్వేదం కూడా సహజంగా సమయోచితంగా ప్రదర్శించారు కృష్ణవేణి. 1950లో వచ్చిన ‘తిరుగుబాటు’ అనే చిత్రంలో వ్యాంప్ పాత్ర కూడా వేశారామె. ‘ధర్మాంగద’, ‘పేరంటాలు’ మొదలైన మరికొన్ని ఆణిముత్యాలతో కలుపుకొని తెలుగు, తమిళ, కన్నడలో కథానాయికగా 15కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె హీరోయిన్‌గా నటించిన ఆఖరి చిత్రం ‘సావాసం’ (1952). ఇందులో మహారాష్ట్ర గవర్నర్‌గా చేసిన కోన ప్రభాకరరావు హీరోగా నటించడం విశేషం.

గాయనిగా..

కృష్ణవేణి  ఒక ఇంటర్వ్యూలో “తను ప్రత్యేకించి చిన్నప్పుడు సంగీతం ఏమీ నేర్చుకోలేదని అయినా అన్ని సినిమాలలోనూ తన పాటలు తానే పాడుకున్నానని, కొన్ని మెళకువలు సంగీత దర్శకులు దినకరరావుగారి వద్ద నేర్చుకున్నానని ఒక సందర్భంలో చెప్పారు.  “డూడూ బసవన్న” వంటి ’మనదేశం’ పాటలతో సహా ‘కచదేవయాని’లో “ప్రేమ మహిమ గన”; ‘గొల్లభామ’లో “భూపతి జంపితిన్” ఉత్పలమాల పద్యం; ‘అనసూయ’ సినిమాలో “జో అచ్యుతానంద”  వంటి పాటలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టడమే కాక నేటికీ వినపడుతూనే ఉన్నాయి.  తన పాత్రలకు పాడుకోవడమే కాకుండా అంజలీదేవికి ఆమె తొలిచిత్రమైన ‘కీలుగుర్రం’ ‘గొల్లభామ’ సినిమాలలో ప్లే బ్యాక్ పాటలు కూడా పాడారు. ‘బాలమిత్రుల కథ’ చిత్రంలో కూడా ఆమె  గాత్రం వినిపిస్తుంది.

నిర్మాతగా..

1942లో కృష్ణవేణికి కుమార్తె రాజ్యలక్ష్మి అనూరాధ జన్మించడం, భర్త సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో ఆమెకు స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సివచ్చేది. కుమార్తె పేరుపై ‘ఎం.ఆర్‌.ఏ’ ప్రోడక్షన్‌ స్థాపించి ‘మనదేశం’ సినిమా నిర్మించి తెలుగు చిత్రసీమలో తొలి మహిళా నిర్మాతగా తనదైన స్థానాన్ని స్థిరపరచుకున్నారు కృష్ణవేణి.  తర్వాత 1950లో  ‘లక్మమ్మ’  వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆమె నిర్మించిన ‘గుడ్‌ ఈవెనింగ్, ‘లేడీ డాక్టర్‌’ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం, ‘కుమ్మరి మొల్ల’ వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో కాస్త అసంతృప్తికి గురైనా, 1957లో తీసిన ‘దాంపత్యం’ సినిమా వరకు నిర్మాతగా కొనసాగారు. ఈ సినిమాలోనే రమేష్ నాయుడుని సంగీత దర్శకునిగా విజయకుమార్‌ను హీరోగా చిత్రసీమకు పరిచయం చేశారు.

‘మనదేశం’

1949లో భారత జాతీయోద్యమ ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన తొలి సినిమా ‘మనదేశం’. ‘విప్రదాసు’ అనే ఒక బెంగాలీ నవలకు తెలుగు అనువాద గ్రంథ ఆధారంగా సముద్రాలగారిచే రచింపబడిన కథతో ఎల్వీ ప్రసాద్ దర్శకునిగా కృష్ణవేణి నిర్మాణసారథ్యంలో వచ్చిన సంచలనాత్మక చిత్రం ఇది. ఈ సినిమాలోని  “తెల్లదొర వెడలిపో” “భారత యువకా” “జయ జనని పరమ పావని” “వైష్ణవ జనతో” వంటి పాటలు ఆ రోజుల్లో ప్రజల నరనరాల దేశభక్తిని నింపాయి. ఈ సినిమాలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వేషానికి కొత్త నటుడుని వెతుకుతూ 250 రూపాయలు పారితోషికానికి ప్రఖ్యాత నందమూరి తారక రామారావుగారికి తొలి అవకాశం ఇచ్చారు కృష్ణవేణి. ఆమె హస్తవాసి ఎటువంటిదో చెప్పడానికి ఆమె ద్వారా సినీరంగానికి పరిచయమైన ఇంకా చాలామంది మహామహుల గూర్చి చెప్పుకోవచ్చు. ‘కీలుగుర్రం’ ‘మనదేశం’ ‘లక్మమ్మ’ సినిమాలకు వరుసగా సంగీతదర్శకునిగా అవకాశాలు పొంది తన ప్రజ్ఞను స్థిరపరచుకున్న అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుగారు. తన తొలిచిత్రం ‘వరూధుని’ తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వీ రంగారావుగారిని పిలిపించి, ‘మనదేశం’లో మళ్ళీ అవకాశం కల్పించినది కృష్ణవేణిగారే. అలనాటి ప్రముఖ గాయని పీ.లీల తెలుగువారికి పరిచయమైనది కూడా ‘మనదేశం’ సినిమాతోనే. విలక్షణ గాయనిగా జిక్కి కృష్ణవేణి పేరుగాంచినది ఈ సినిమాలోని “పోలీసెంకటసామి” పాటతోనే.

కృష్ణవేణి  అసమాన ప్రతిభకుగాను 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. 101 సంవత్సరాల నిండుమనిషి కృష్ణవేణి 2025 ఫిబ్రవరి 16వ తేదీన ఫిలింనగర్లోని స్వగృహంలో శివైక్యం చెందారు. అయినా ఆమె చిరునవ్వు మాత్రం అలనాటి సినీ ప్రేమికుల మనసులో  ఎన్నటికి మెరుస్తూనే ఉంటుంది. ఆమె గళం మనదేశపు గుండెల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.

*

YouTube

రాధిక మంగిపూడి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు