ఈ అక్టోబర్ 29-30 తేదీలలో టెక్సస్ లోని డాలస్ నగరంలో ‘అమెరికా తెలుగు రచయితల సదస్సు’ విజయవంతంగా జరిగింది. దేశం నలుమూలల నుండీ వచ్చిన రచయితలూ, కవులూ, ప్రముఖ పత్రికా పాత్రికేయులూ, సాహితీ ప్రియులూ ఉత్సాహంగా వివిధ చర్చల్లో పాల్గొన్నారు.
ఈ సదస్సుకి ప్రణాళికా బృందంగా కల్పనా రెంటాల, అఫ్సర్, చంద్ర కన్నెగంటి, సాయి బ్రహ్మానందం గొర్తి వ్యవహరించారు. 2019 లో కాలిఫోర్నియాలో జరిగిన మొట్టమొదటి రచయితల సదస్సు తర్వాత కోవిడ్ వల్ల దీర్ఘ విరామం తీసుకున్నా, ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో, చక్కటి ప్లానింగ్ తో ముందుగానే ప్రణాళికను తయారుచేసిందీ బృందం. సదస్సుకి డాలస్ వాసులూ, సాహిత్యప్రియులైన చంద్రహాస్ మద్దుకూరి, అనంత్ మల్లవరపు, సురేష్ కాజ, చంద్ర కన్నెగంటి, ఇస్మాయిల్ పెనుకొండ కార్యవర్గ బృందంగా ఏర్పడి కావలసిన వసతులన్నీ ముందే సిద్ధం చేశారు.
అక్టోబర్ 28, సదస్సుకి ముందురోజు వర్షాల కారణంగా కొన్ని విమానాలు ఆలశ్యంగా నడిచి, కొన్ని రద్దు చేయబడి పలువురు ఇబ్బందిపడ్డా, ఎట్టకేలకు రాత్రికల్లా అనుకున్నవారందరూ డాలస్ నగరం చేరుకున్నారు. కార్యవర్గం శ్రమకోర్చి అర్థరాత్రి వరకూ ఎయిర్పోర్ట్ లకి తిరుగుతూ అందరినీ రిసీవ్ చేసుకుని తమ తమ వసతులకి చేర్చారు. ఆ రోజు ఉదయం కొంత ఒడిదుడుకులతో మొదలైనా, రాత్రి అనంత్ మల్లవరపు గారి ఇంట్లో అద్భుతమైన భోజనం, సాహితీ మిత్రుల పరిచయాలూ, సంభాషణలతో చాలా సరదాగా గడిచింది.
అక్టోబర్ 29, శనివారం ఉదయం 8:30 గంటలకి సదస్సు మొదలయ్యింది. ఒకటిన్నర రోజుల పాటు జరిగిన సదస్సుని కథనం, కథ, కవిత్వం, పత్రికలు – పుస్తక ప్రచురణలు, నవల, విమర్శ, అనువాదాలు అనే ఏడు అంశాలుగా విభజించారు. ఒక్కో అంశంపై చర్చించడానికి, కొంతమంది ప్యానెల్ మెంబర్స్ ని ముందే ఎన్నుకున్నారు. ప్రతి ప్యానెల్ కీ ఒక సమన్వయ కర్త (మోడరేటర్) ఉంటారు. ప్యానెల్ మెంబర్స్ కి ముందే ఇవ్వబడిన ప్రశ్నలని అడిగి, తర్వాత దాని మీద చర్చకీ, సభికుల ప్రశ్నలకీ సమయాన్ని కేటాయించారు.
‘కథనం’ మీద చర్చలో మాధవ్ మాచవరం, అఫ్సర్, చంద్ర కన్నెగంటి, నారాయణస్వామి శంకగిరి, శివకుమార శర్మ తాడికొండ, కొత్తావకాయ సుస్మిత పాల్గొన్నారు. చంద్రహాస్ మద్దుకూరి మోడరేటర్ గా వ్యవహరించారు. రచనా విధానంపై రచయితలకి సూచనలు, ఐదేళ్ళగా అమెరికా రచనల్లో వస్తున్న మార్పులు, మైక్రో ఫిక్షన్ కథాంశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, వివిధ దృక్కోణాలు – పాఠకులపై అవి చూపే ప్రభావం, టెంప్లెట్ కథల వల్ల నష్టాలు – వాటినుండి బైటపడే మార్గాలు అనే అంశాలమీద కూలంకషంగా చర్చ జరిగింది. చివరగా, భాషపై పట్టు రచనకి మూల సంపద అనీ, ప్రతి రచయితా తప్పకుండా ఒక మంచి పాఠకుడై ఉండాలనే అంశంపై మంచి ప్రతిస్పందన వచ్చింది.
‘కథ’ మీద తదనంతరం జరిగిన చర్చకి సురేష్ కాజ మోడరేటర్ గా వ్యవహరించారు. ప్యానెల్లో శివ సోమయాజుల, మధు పెమ్మరాజు, పాణిని జన్నాభట్ల, విజయ కర్రా, అపర్ణ గునుపూడి పాల్గొన్నారు. ‘భవిష్యత్తులో తెలుగు కథ’ అనే అంశంపై ఆసక్తికరమైన అంచనాలు జరిగాయి. పాఠకుల స్పందన వల్ల రచయితలు తీసుకునే జాగ్రత్తల మీదా, వివాదాస్పదమైన అంశాలమీద వ్రాయడానికి రచయిత్రులకీ, రచయితలకీ ఉండే భయాల మీదా మంచి ప్రశ్నలూ, సమాధానాలూ వచ్చాయి.
‘కవిత్వం’ మీద జరిగిన సెషన్లో, యదుకుల భూషణ్, అన్నపూర్ణ దేవరకొండ, మమత కొడిదెల, నారాయణస్వామి వెంకటయోగి, డా.కె.గీత, రవిశంకర్ విన్నకోట పాల్గొన్నారు. అనంత్ మల్లవరపు సమన్వయించారు. కవిత్వంపై అస్తిత్వ వాద ప్రభావం మీద వాదోపవాదాలతో, సభికుల ప్రశ్నలతో రసవత్తరంగా చర్చ జరిగింది. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న కవితల్లో మంచి కవిత్వాన్ని గుర్తించడం, పద్య కవిత్వంలో వచ్చిన మార్పుల మీదా సభికులు ఉత్సాహంగా స్పందించారు.
తరువాత ‘పత్రికలు – పుస్తక ప్రచురణలు’ అనే అంశాన్ని ఇస్మాయిల్ పెనుకొండ మోడరేట్ చేశారు. వంగూరి చిట్టెన్ రాజు, అఫ్సర్, కిరణ్ ప్రభ, మాధవ్ మాచవరం, రవి వీరెల్లి, శాయి రాచకొండ, డా.కె. గీత ప్యానెల్లో పాల్గొన్నారు. ప్రింట్ చేసిన పుస్తకాలని తర్వాతి తరాలకి అందేలా చేయడానికి సంకల్పించిన ‘బుక్ డిపాసిటరీ’ ప్రతిపాదనని సభికులు ఆహ్వానించారు. తెలుగుని కొత్త తరాలకి అందించడం మీద జరుగుతున్న మంచి ప్రయత్నాలు, ఆడియో కథల మార్గంలో తెలుగు పాఠకులకు దగ్గరయ్యే విధానాలు, ‘సెల్ఫ్ పబ్లిషింగ్’ కష్టనష్టాలు, కథల ఎంపికలో పాత్రికేయుల ఇబ్బందులు, ప్రత్యేక స్త్రీ వాద పత్రికల అవసరాలు అనే అంశాలపై అవగాహన పెంచేలా లోతుగా చర్చ జరిగింది.
‘నవల’ అంశం మీద జరిగిన చర్చలో తాడికొండ శివకుమార శర్మ, సాయి బ్రహ్మానందం గొర్తి, రవి వీరెల్లి, కొత్తావకాయ సుస్మిత, కల్పనా రెంటాల పాల్గొన్నారు. ప్రవాస జీవితం మీదా, వృత్తిపరమైన వస్తువులమీదా కొత్త ఇతివృత్తాలతో నవలలు తక్కువగా వస్తున్నాయనీ, వాటి మీదా దృష్టిపెడితే వైవిధ్యం కనపడే అవకాశం ఉందనీ వారు సూచించారు. చారిత్రాత్మక కాల్పనిక కథల్లో, నవలల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఆలోచింపజేశాయి. నవలా రచనకి ఎంచుకోవలసిన సబ్జెక్టులూ, వాడవలసిన టెక్నిక్ ల మీద చేసిన సూచనలు నవలా వ్యాసంగంలోకి కొత్తగా అడుగుపెట్టే వారికీ, వివిధ పోటీలకి తమ నవలల్ని పంపేవారికీ సూచనలుగా ఉపయోగపడతాయి.
అలా మొదటి రోజు క్షణం తీరిక లేకుండా జరిగిన సెషన్లన్నీ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కార్యవర్గం చక్కటి బ్రేక్ ఫాస్ట్, లంచ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. రచయితలూ, కవులూ తము ప్రచురించిన పుస్తకాలని ఇతరులతో పంచుకున్నారు. ఆ రోజు రాత్రి చంద్రహాస్ గారి ఇంట్లో వారిచ్చిన ఆప్యాయ ఆతిధ్యం, భోజనం, పాటలూ మరిచిపోలేనివి.
అక్టోబర్ 29, ఆదివారం రెండవరోజు చర్చల్లో భాగంగా, ‘విమర్శ’ అనే విభాగంలో, అచ్చుతప్పులూ, దృశ్యవర్ణన తదితర విషయాల్లో రచయితలు తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు చర్చించబడ్డాయి. అలానే విమర్శ – సమీక్ష ల మధ్య భేదాలూ, మంచి విమర్శకులు రావాలంటే తీసుకోవలసిన మార్గాలూ సూచించారు. గత ఇరవై ఏళ్ళగా తెలుగు సాహిత్యంలో వస్తున్న వైవిధ్యత మీద మంచి చర్చ జరిగింది. రచయితలు తమ రచనా ఉద్దేశ్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్న అంశం ఆలోచింపజేసింది. ఈ విభాగానికి చంద్ర కన్నెగంటి సమన్వయ కర్తగా వ్యవహరించారు. మాధవ్ మాచవరం, యదుకుల భూషణ్, నారాయణస్వామి శంకగిరి, గోపరాజు లక్ష్మి, మెడికో శ్యాం, జ్యోతిర్మయి, పద్మవల్లి చర్చలో పాల్గొన్నారు.
చివరగా జరిగిన ‘అనువాదాలు’ అనే సెషన్ని చంద్రహాస్ మోడరేట్ చేశారు. సురేష్ కొలిఛాల, రవి వీరెల్లి, యదుకుల భూషణ్, నారాయణ స్వామి వెంకటయోగి పాల్గొన్నారు. ఆంగ్లం నుండి కాకుండా ఇతర భారతీయ భాషల నుండి స్వయంగా అనువదిస్తే అనువాదాల స్థాయి బాగా పెంచగలమనే అంశంపై ఉదాహరణలతో సహా లోతైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనువాదాలకి సరిపడే కథలూ, కవితలూ ఎంపిక చేయడం మీదా, అనువాద ప్రక్రియ మీదా స్థూలంగా ఇవ్వబడిన సూచనలు కొత్తవారికి ఉపయోగపడేలా ఉన్నాయి.
రెండవరోజు మధ్యాహ్నంతో సదస్సు ముగిసింది. కొత్త కొత్త స్నేహాలతో, చర్చించబడిన అంశాలతో, డాలస్ కార్యవర్గం ఇచ్చిన ఆప్యాయ ఆతిధ్యంతో అమెరికా రచయితలందరికీ ఈ సదస్సు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
*
క్లుప్తంగా బాగుంది.
నిర్వాహకులు ఈ సమావేశాలను అందరికీ అందుబాటులో వుండేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
చక్కని విశ్లేషణ