మమేకం

చిరుగాలి స్పర్శను ఆస్వాదిస్తూ ఎదురుగా ఉన్న చిన్న చిన్న కొండలని, వాటి చుట్టూ ఉన్న నగరపు మెరుపులని చూస్తూ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయింది సారిక. ఇప్పుడిప్పుడే కమ్ముతున్న చీకట్లలో ఆ వెలుగులు ఆమెను బాగా ఆకర్షిస్తున్నాయి.

పొగలు కక్కుతున్న టీ కప్ వేడి భుజానికి తగిలేసరికి ఇటువైపు తిరిగి చూసింది. నవ్వుతూ కప్‌ని చేతిలోకి తీసుకుంది. సాత్విక్ టీ సిప్ చేస్తూ ఆమె పక్కనే కూర్చున్నాడు. 

“ఈ వాతావరణంలో గోరువెచ్చగా ఏది తగిలినా ఆ స్పర్శలో మంచి ఫీల్ ఉంటుంది కదా!” అంది సారిక.

“టీ కప్ టచ్ నచ్చిందా నీకు?” 

“ఊ..”

“నీకొక విషయం తెలుసా?”

“చెప్పు తెలుసుకుంటా”.

“నీ మెంటాలిటీ ఇంకా సెవెన్త్ స్టాండర్డ్‌లోనే ఉంది”.

“అంటే ఇంకా ఎదగాలంటావ ?”

“మినిమమ్ టెన్త్ లెవల్ ఫీలింగ్స్ అయినా ఉండాలి కద నాన్నా!” అన్నాడు.

“ఎదవా” అంటూ అతని మాడు మీద కొట్టింది. ఇద్దరూ నవ్వుకున్నారు.

“హేయ్! నిన్న మావోడు ఓ కామెడీ వీడియో సెండ్ చేసాడు. చూస్తావా?” అన్నాడు.

“చూద్దాం. ఓపెన్ చెయ్” అంది.

అతను వీడియో లింక్‌ ఓపెన్ చేసి, మొబైల్‌ని ఇద్దరికీ కనపడేలా తన మోకాలిపై పెట్టాడు. సారిక అతని భుజం మీద తలవాల్చి చూస్తోంది. ఆమె చెక్కిలి స్పర్షకి అతని దృష్టి మొబైల్ మీది నుండి సారికపైన తన భావాల మీదకి మళ్లింది. ఆలోచనల్లో పడ్డాడు. ఆమె కళ్ళవైపే చూస్తున్నాడు.

సారిక ఆ వీడియోలోని చూస్తూ నవ్వుతోంది. అలా నవ్వుకుంటూ అతనివైపు చూసింది. సాత్విక్ మనసులోని ఆలోచన క్షణంలోనే ఆమె మెదడును తాకింది. నవ్వు ఆగిపోయి, నిట్టూర్పుగా దూరం జరిగి మళ్ళీ మొట్టికాయ వేసింది.

“నువ్వు ఫిజికల్ గా ఎంత దూరం జరిగినా ఉపయోగం లేదు. ఎన్ని రకాలుగా చెప్పినా నీకు అర్థం కాదు.  వివరించినా కనీసం వినవు” అన్నాడు.

“వినటానికి ఏముంటుందిరా? అంతా పనికిమాలిన సుత్తి”.

సాత్విక్ ఫోన్ పక్కన పెట్టి “సారికా! నీతో కేవలం ఒక ఫ్రెండ్‌గా మాత్రమే మూవ్ అవ్వాలంటే నావల్ల కావటం లేదు. నీతో పద్దతిగా ఉంటున్నానని నువ్వనుకుంటున్నావ్ అంతే! నిజానికి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నటిస్తున్నాను. నీకు తెలియట్లేదే” ఆవేశంగా అన్నాడు.

ఇదివరకు ఎన్నోసార్లు జరిగిన చర్చే మళ్ళీ మొదలవటంతో విసుగుని దాచుకుంటూ “ఒరేయ్, నువ్వంటున్నది నీ క్యారెక్టర్ కాదు. నీకు నా మీద ఉన్నది చెడు ఉద్దేశం కూడా కాదు. ఈ ఆలోచనలన్నీ నీ వయసు ప్రభావం. అవన్నీ ఇగ్నోర్ చేసుకుంటూ నార్మల్ గా ఉండాలి. నీకు తెలియదు. అసలు టార్చర్ అంటే ఇది కాదు. అలవాటుపడిన భావనలు, అనుభూతులు దూరమైనప్పుడు కలిగే వేదన ఉంటుంది చూడు, అదీ నరకమంటే. బయటపడరు కానీ, మూడొంతుల జనాభా ఆ దుఃఖంలోనే బతుకీడుస్తుంది. అందులో నేను కూడా ఉన్నాను. ఇప్పుడిప్పుడే నీ స్నేహం వల్ల కాస్త ఊపిరి తీసుకుంటున్నాను. మనం ఇంతలో ఉంటేనే ఆనందంగా ఉండగలం. తర్వాతి స్టెప్ తీసుకుంటే ఇలా ఉండలేం” అంది.

“మనం ఫిజికల్ గా అటాచ్ అవ్వలేదు అంతే, కానీ ఇపుడు నెక్ట్స్ స్టెప్‌లోనే ఉన్నాం. అది నీకూ తెలుసు. ఇదంతా చర్చ అనవసరం. పెళ్ళి చేసుకుందాం. ప్లీజ్” అన్నాడు సాత్విక్.

“ఎన్నిసార్లు చెప్పాలిరా? ఏ ఇద్దరు మనుషులకైనా ఒకరి మీద ఒకరికి డెవలప్ అయిన అభిప్రాయాలు కలిసి ఒకేచోట జీవించేటపుడు పూర్తిగా ఆపోజిట్‌గా మారిపోతాయ్. ముందున్నంత సఖ్యత తర్వాత ఉండదు. అందులోనూ సంసార జీవితం మరింత నరకం. నా మాట విను” అంది.

“అది మనుషులను బట్టి ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరు. మన మధ్య కూడా అలాగే జరుగుతుందని నువ్వెలా అనుకుంటావ్? అయినా ఏం మారుతుంది లైఫ్‌లో? మహా అంటే నీ మెడలో ఓ తాళి పడుతుంది. అది కూడా నీకు ఇష్టం లేకపోతే నాకేమీ అభ్యంతరం లేదు. వేసుకోకు”.

“నీకు అర్థం కాదురా! అది జస్ట్ తాళి కాదు. ఎన్నో అజమాయిషీలతో ముడిపడే పలుపుతాడు. తెలుసా?”

“చెప్తే ఒప్పుకోవు కానీ, నీవన్నీ ఒకే కోణపు దృక్పథాలే!”

“సరే, నేను ఒప్పుకుంటున్నా. ఇక ఈ టాపిక్ ఆపేద్దాం”.

“ఇంకాసేపైతే నువ్వు వెళ్ళిపోతావ్. ఆ తర్వాత నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఎవరితోనూ మాట్లాడబుద్ది కాదు. ఒక్కణ్నే ఉండలేను. రేపు ఉదయం ఆఫీస్‌లో కలుస్తాం. అక్కడ నువ్వు టీం లీడర్. నేను లిమిట్స్‌లో ఉండి నిన్ను పలకరించాలి. వారం గడిస్తే కానీ మళ్ళీ ఈ గోల్డెన్ టైం రాదు. అదే పెళ్ళి చేసుకుంటే, రోజూ ఇలాగే ఆనందంగా ఉండొచ్చు కదా! మన ఇష్టం వచ్చినట్టు, నచ్చినట్టు బతుకుదాం. నీ హ్యాపీనెస్ తప్ప నాకేం ఫ్యాంటసీస్ లేవు. నీ నవ్వులో,  నీతో ఉండటంలోనే నాకు అన్నీ ఉన్నాయ్” అన్నాడు.

అతణ్ని గట్టిగా హత్తుకోవాలనిపించింది.  ఆ మాటలు ఆమెలో అలజడి నింపాయి. ఎమోషన్ అణచుకుని,  అతణ్ని దగ్గరికి తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని, వెంట్రుకలు నిమురుతూ “సాత్విక్! ఏవేవో ఆలోచిస్తూ మెదడు పాడు చేసుకుంటున్నావ్. మొన్న ఆంటీతో ఫోన్‌లో మాట్లాడాను. ఒక సంబంధం ఉందంట. అమ్మాయి కూడా చాలా బాగుందంట. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోడానికి అంకుల్ నన్ను కూడా రమ్మన్నారు. నేనూ సరే అన్నాను. నువ్వు వాళ్లకు ఒక్కగానొక్క కొడుకువి. ఇలా పిచ్చిపిచ్చిగా ఆలోచించి వాళ్ళని బాధపెట్టకు. పెళ్ళి చేసుకో. నీ భార్యను బాగా చూసుకో. అప్పుడు నువ్వూ సంతోషంగా ఉంటావ్. నేనే మీ ఇంటికి వచ్చినా కనీసం కలిసి కాఫీ తాగేంత తీరిక కూడా నీకుండదు. అంతగా మారిపోతావ్” అంది.

“అంటే ఇక నేను ఆనందంగా బతుకుతానంటావ్!”

“నీ లైఫ్ పార్ట్‌నర్ ఆలోచనలకి, అభిప్రాయాలకీ ప్రాధాన్యం ఇవ్వు. తనేమైనా చెప్పాలనుకుంటే శ్రద్ధగా విను. ఏవైనా సలహాలిస్తే తీసుకోకపోయినా సరే, దాని గురించి కనీసం ఆలోచించు. ఇంతే, ఇక తనకి నువ్వు తప్ప వేరే లోకమే ఉండదు. అనవసరమైన ఇగోలకి వెళ్ళకపోతే అంతకు మించిన ఆనందం ఇంకేమీ ఉండదు”.

“మరి ఇంతకుముందే కదా సంసారమంటే నరకం అన్నావ్? ఇపుడు ఇవన్నీ ఏంటి?” ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు.

“అబ్బా! పిచ్చా నీకు? చెప్పేది అర్థం కాదా? నేను నీకన్నా ఆరేళ్ళు పెద్దదాన్ని. ఇద్దరితో నిశ్చితార్థం జరిగి రెండుసార్లు క్యాన్సల్ అయింది. అందులో ఒకడితో రెండు నెలలు డేటింగ్ కూడా చేసా. ఇవన్నీ తెలిసి కూడా పెళ్ళి చేసుకునేంత పెద్ద మనసు నీకున్నా, నిన్ను ప్రశాంతంగా బతకనిచ్చేంత మెచ్యూరిటీ సొసైటీకి లేదు. మీ బంధువులంతా నిన్ను ఎగతాళి చేస్తుంటే ఆ హింస భరించలేవు. జీవితం నాశనమైపోయిందని బాధపడతావ్. నన్నేమీ అనలేక, ఎవరితోనూ చెప్పుకోలేక ఒక్కడివే ఏడుస్తావ్. అదంతా అవసరమా మనకు?” సీరియస్‌గా అంది.

“నాకు తెలిసినంతవరకూ పెళ్ళికి వర్జినిటీ అనేది ఫిట్‌నెస్ కాదు. వయసు అనే పరిధీ లేదు. నాకు ఆ రెండింటి మీదా పట్టింపు లేదు” గట్టిగా చెప్పాడు.

“కావచ్చు. కానీ మనం పెళ్ళి తర్వాత కచ్చితంగా ఇప్పుడున్నట్టు మాత్రం ఉండలేం. నీకు భర్త అనే హోదా వస్తుంది. ఆ ఫీలింగ్‌లో ఇపుడు నీకు అద్భుతాలుగా కనిపిస్తున్నవన్నీ అపార్థాలకి కారణాలవుతాయి. నా చుట్టూ రోజుకొక గీత గీయడమే పనిగా పెట్టుకుంటావ్. నా మైండ్‌ని రకరకాల తీగలతో కట్టి ఇంట్లోనే పడేయాలని చూస్తావ్. ఇంతగా ఇష్టపడే నిన్ను ఎపుడెప్పుడు వదిలించుకుందామా అని నేననుకునేలా నువ్వు మురిగిపోతావ్. అందుకోసం ఎంతకైనా తెగించే అసహనం నాలో పెంచుతావ్. అదంతా పెద్ద న్యూసెన్స్. గ్రహించేంత పరిజ్ఞానం నీకు లేదురా!”

“మన పరిచయం అయ్యి సంవత్సరం దాటింది కదా! ఎపుడైనా నాలో నీకంత మూర్ఖత్వం కనిపించిందా?”

“పెళ్ళి తర్వాత వస్తుందంటున్నా!”

“నువ్వు రానివ్వవు అని నేనంటున్నా!”

“నా వల్లే వస్తుంది అంటున్నా!”

“ఎలా?”

“సాత్విక్! ఇక నావల్ల కాదు. జరిగినవన్నీ నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అందరూ ఉన్న ఒంటరితనం కంటే అన్నిటినీ వదిలించుకున్న ఏకాంతమే బెటర్ అని నిర్ణయించుకున్నాను. మాటవరుసకు కూడా ఏ ఒక్కరి పెత్తనానికీ సమాధానాలు వెతుక్కునే ఖర్మ లేకుండా ఇలా ప్రశాంతంగా బతుకుతున్నాను. నేనింతే!”

“ప్రశాంతంగా బతుకుతున్నావని అనుకుంటున్నావ్. జస్ట్ అనుకుంటున్నావ్ అంతే! నీ జీవితంలో ప్రశాంతత లేనేలేదు. ఉండుంటే ఇంతగా నాకు దగ్గరయ్యేదానివే కాదు”.

“నిజమే కానీ, అది నువ్వనుకుంటున్నట్టుగా కాదు. స్నేహం. ఒక చిన్న ఆత్మీయత. అంతవరకే!” అంది.

“నువ్వు ఎన్ని చెప్పినా సరే, అందరూ సుశాంత్‌లాగే ఉండరు”.

“ఆ లక్షణం సుశాంత్‌ది కాదు. సొసైటీది. ఆడది ఇలాగే ఉండాలంటూ గీత గీసి, మగవాడు వాడు ఏవిధంగా ఉన్నా చెల్లుతుందనే ధైర్యాన్ని మెతుకుల్లో పెట్టి మేపుతుంది. అదంతా అనవసరం. వాడి విషయంలో ఆ టైంలో నాకేది కరెక్ట్ అనిపించిందో అదే చేశాను. అందరూ నన్నే అసహ్యించుకున్నారు. అందుకే టోటల్‌గా అందర్నీ అవాయిడ్ చేసేశాను. నువ్వెలా నా మైండ్‌లోకి ఇంతగా ఎడిక్ట్ అయ్యావో అర్థం కావటం లేదు”.

“నేను అలా కాదు సారికా! ప్లీజ్ నా మాట విను”.

 సారిక ఏమీ చెప్పలేక అతని కళ్ళలోకి చూసింది. 

“సరే! లేటవుతోంది. డ్రాప్ చేయనా?” అన్నాడు.

“సరే” అంది.

కార్ వేగంగా వెళ్తోంది. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. తన అపార్ట్‌మెంట్ వచ్చిన సంగతి అతను చెప్పేంతవరకూ తెలియనంతగా ఆలోచనల్లో మునిగిపోయింది సారిక. కార్ దిగగానే కనీసం ఆమె వైపు చూడకుండా వెళ్ళిపోయాడు. అర్థం కాని సందిగ్ధతలో సారిక చాలాసేపు అలాగే నిలబడిపోయింది. వాచ్‌మెన్ పలకరించేంత వరకూ లోపలికి వెళ్ళాలన్న ఆలోచనే రాలేదు. అడుగులో అడుగేసుకుంటూ ప్లాట్‌కి చేరుకుంది. 

ప్లాన్‌ ప్రకారం, రెస్టారెంట్‌కి వెళ్ళి తిన్నాకే ప్లాట్‌కి వెళ్ళాలి. కానీ ఇలా జరిగిపోయింది. సారికకి ఆకలిగా అనిపించడం లేదు. సాత్విక్ తిన్నాడో లేదో అనే ఆలోచన. కాల్ చేసింది. కనెక్ట్ అవలేదు. గొడవ జరిగిన ప్రతిసారీ అతను కోపంతో తన నెంబర్ బ్లాక్ చేయటం, రెండు మూడురోజుల తర్వాత మామూలైపోవడం ఇద్దరికీ అలవాటే! 

అటూఇటూ తిరుగుతూ ఆలోచిస్తోంది. ఇలాగే ఉంటే సాత్విక్ తన నుండి డైవర్ట్ అవలేడనిపిస్తోంది. అతనికి దూరం అవటమే బెటర్. బెంగళూర్ లేదా చెన్నై బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇక్కడుంటే అతణ్ని కలవకుండా ఉండగలదనే నమ్మకం తనకే లేదు. 

సోఫాలో కూర్చుని ఎపుడు నిద్రపోయిందో తనకే తెలియదు. ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. మొబైల్ తీసుకుని వాట్సప్ ఓపెన్ చేసింది. సాత్విక్ నుంచి మెసేజ్ లేదు. టైం చూస్తే రెండున్నర. తినకుండా పడుకోవటం వల్ల ఇప్పుడు ఆకలిగా అనిపిస్తోంది. ముఖం కడుక్కుని, కాఫీ కలుపుకుంది.

తను ఒంటరిగా ఉంది. తిన్నావా అని అడిగేవారు లేరు. తినేదాకా ఊరుకోనివాళ్లు కూడా లేరు. ఇదే మరోసారైతే, సాత్విక్ ఫోన్ చేసి గంటయినా మాట్లాడతాడు. ఏం తింది, ఎలా అనిపించింది మొత్తం చెప్పాలి. అందుకోసమైనా టైంకి తింటుంది.

వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన తర్వాత కొన్నాళ్ళకు ఓ రోజు అమ్మ ఫోన్ చేసింది. “ఎన్నాళ్ళలా ఉండిపోతావ్? ఎక్కడికెళ్ళినా నీ గురించే అడుగుతున్నారు” అని బాధపడింది. సారికకు ఈ చర్చే ఒక చిరాకు. ఆ ఇరిటేషన్‌లోనే ఉండిపోయింది. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది. అలవాటు ప్రకారం కాల్ చేసిన సాత్విక్ ఎంతసేపటికీ  ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో ప్లాట్‌కి వచ్చేశాడు. సారికకి ఆశ్చర్యంగా ఉంది. ఎపుడు కాఫీకి పిలిచినా రానివాడు ఇలా అకస్మాత్తుగా రావడం.

జరిగిన విషయం చెప్పింది. మనసులో బాధని, భయాల్ని వివరించింది. అతడు విన్నాడు. ఓదార్చాలో లేక నచ్చజెప్పాలో అర్థం కాని అతని స్థితి చూసి తనకే జాలేసి నవ్వుకుంది. ఆమెకెందుకు నవ్వొచ్చిందో అతనికి అర్థం కాలేదు. సాత్విక్‌తో తనకి ఇటువంటి అనుభవాలే ఉన్నాయి. అతనిలో ఆమెకు నచ్చేది కూడా ఇదే.  మిగతా వాళ్ళలాగా కృత్రిమంగా ప్రవర్తించలేడు. మెప్పు పొందేలా అప్పటికప్పుడు మాట్లాడి ఆకట్టుకోవటం అతను నేర్చుకోలేని విద్య.

వర్షం కారణంగా ఆ రాత్రి అతను అక్కడే ఉండిపోయాడు. సింపుల్‌గా ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు. సారికకి తినాలని లేదు. రెండు ముద్దలు తిని ప్లేట్ తీసింది. సాత్విక్ కూడా కొద్దిగానే తిన్నాడు.

ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అర్ధరాత్రి దాటిపోయింది. సాత్విక్‌తో ఉంటే టైం తెలియలేదు. అప్పటి నుంచే చనువు మరింత పెరిగింది. ఆ తర్వాత ఎపుడు ఇటువంటి పరిస్థితి వచ్చినా తను అన్నం మానేస్తుందని అతను ముందే ఊహించి, ఆరోజు తను తినేదాకా వదిలేవాడు కాదు. సారికకి ఆ కేరింగ్ ఎంతో నచ్చింది. మనుషుల్లో ఆత్మీయత కూడా ఉంటుందని నమ్మకం వచ్చింది.

సాత్విక్‌తో కలిసి బతకాలన్న కోరిక సారికకే ఎక్కువ. కానీ ఏదో భయం వెనకడుగు వేయిస్తుంది. మిగతా బంధువులు, ఫ్రెండ్స్ జీవితాల గురించి విని తను తీసుకున్న నిర్ణయమే మంచిదనే నిర్ధారణకి వచ్చింది. ఒకటైన తర్వాత తను భయపడినట్టుగానే గొడవలు వస్తే, సాత్విక్‌ను దూరం చేసుకోవటం వల్ల కలిగే బాధను ముందే ఊహించుకుని ఆ ఆలోచన మానుకుంది. ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్‌గానే తనతో ఉండాలని నిర్ణయించుకుంది.

ఈ నిర్ణయానికి కారణం తన జీవితంలో జరిగిన సంఘటనలే. మొదట ప్రణవ్‌తో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి తర్వాత తను ఉద్యోగం చేయడానికి ముందు ఒప్పుకున్నా, తర్వాత మరేదో కారణం చెప్పి జాబ్ మానేయాలన్నారు. అప్పటికప్పుడు మార్చిన నిర్ణయం అయినా ఆమె తల్లిదండ్రులు అందుకు ఒప్పుకున్నారు. కానీ ఆ నిలకడలేనితనం నచ్చక సారిక ఒప్పుకోలేదు. వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నారు. 

పెద్దలు చూసే సంబంధాలు ఇలాగే ఉంటాయని, తనకు కావాల్సినవాణ్ని తనే వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. అప్పుడే సుశాంత్ పరిచయమయ్యాడు. తనతో ఉన్నంతసేపు ఎంతో నమ్మకంగా భావించేది. అతని ప్రవర్తన అంత ప్రిపేర్డ్‌గా ఉండేది. దాంతో డేటింగ్‌కి కూడా ఒప్పుకుంది. పెళ్ళి తర్వాత జీవితం గురించి ఎన్నెన్నో ఉహలు. రెండు వైపులా అందరూ ఒప్పుకున్నారు. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేశారు. 

టీం లీడర్ ప్రమోషన్ రేసులో ఉన్న నలుగురిలో వీళ్లిద్దరూ కూడా ఉన్నారు. సారిక ప్రమోట్ అయింది. సుశాంత్‌కి నచ్చలేదు. జాబ్ మానేయమన్నాడు. ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా అతను ఒప్పుకోలేదు. పెళ్లి కన్నా తన భవిష్యత్తే ముఖ్యమనుకుంది. 

“ఒకడితో కలిసున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోడానికి ఎవరూ ముందుకు రారు. ఆలోచించుకో” అన్నాడతను ధీమాగా.

అప్పటికే ఒకసారి పెళ్ళి ఆగిపోయింది. రెండోసారి ఇంత నడిచాక మళ్ళీ అలాగే జరిగితే తన జీవితం నాశనమైనట్టే అన్న భయంతో చుట్టూ అందరూ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంత పట్టుతో ఉండటం కరెక్ట్ కాదని, సారికదే తప్పు అన్నట్టుగా మాట్లాడారు. తనకు ఇబ్బంది వస్తే ఈ నలుగురూ తోడుగా ఉండాలి కానీ, వీళ్ళే తన కాళ్ళు చేతులు కట్టేసి వాడి ముందు పడేయాలని చూస్తున్నారేంటి అనుకుంది. తనదే తప్పు అని మాట్లాడుతున్న అందరి మీదా అసహ్యం కలిగింది.

ఇటువంటివారి మధ్య ఉంటే సంతోషం నటనే అవుతుందనిపించి, ఒంటరిగానే ఉండిపోయింది. మళ్ళీ ఊర్లో తన ఇంటికి వెళ్ళలేదు. తల్లితో మాత్రం అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతుంది. చుట్టూ ఉన్నవాళ్లతో మాటలు మానేసింది. కొలీగ్స్‌తో కూడా వర్క్ గురించి తప్ప వేరే మాట కలిపేది కాదు. అందరి దృష్టిలో రూడ్ మెంటాలిటీగా మిగిలిపోయింది. 

రెండేళ్ళ తర్వాత ఆఫీస్‌లో కొత్త బ్యాచ్‌లో రిక్రూట్ అయ్యాడు సాత్విక్. కల్మషం లేని అతని నవ్వులో ఏదో ఆకర్షణ కనిపించింది. ఏదైనా చెప్తున్నప్పుడు ఆసక్తిగా వింటూ, పూర్తైన వెంటనే విన్నదంతా అర్థమైనట్టు చిక్కగా ఒక నవ్వు నవ్వుతాడు. అప్పుడతని ముఖంలో వెలుగు ఆమెను బాగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకే సాత్విక్ ఏదైనా అడిగినప్పుడు తనలో తనకే తెలియని ఒక ఉత్సాహం రావడం గమనించింది. 

ఒకరోజు కొత్త ప్రాజెక్ట్‌ వివరాలు చెప్తూ ఉంటే, మొత్తం విని “మ్యామ్.. చిన్న రిక్వెస్ట్” అన్నాడు. 

“ఏంటి?” అంది. 

“మీరు ఏం చెప్పినా మాకు బాగానే అర్థమవుతుంది. కానీ మీ ఫేస్ అంత సీరియస్ మోడ్‌లో చూడటం వల్ల మీరు చెప్పే సింపుల్ విషయాలు కూడా ఏదో పెద్ద సివియర్ ఆపరేషన్ గురించి వింటున్న ఫీలింగ్ వస్తుంది మాకు” అన్నాడు.

అది విని సారిక నవ్వుకుంది. 

“మ్యామ్! మీకు నవ్వటం వచ్చా? ఇంతకాలం మీరు హాస్యగ్రంథులు లేని మనిషేమో అనుకున్నా” అన్నాడు. ఈసారి పగలబడి నవ్వింది. సారిక నవ్వటం చూసి మిగిలిన స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు.

సాత్విక్‌తో ఉన్నపుడు సారికలో ఉత్తేజం వస్తుంది. డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళినా అతని గురించే ఆలోచనలు. ఫోన్‌లో కూడా టైం స్పెండ్ చేయటం మొదలైంది. అతనితో ఎక్కువగా మూవ్ అవుతున్నానా అని ఒక్కోసారి అనుకునేది. అయినా అతని గురించి ఆలోచించడం బాగుండేది. అతనితో కలిసి వీకెండ్స్‌కి బయటికి వెళ్ళటం, షాపింగ్‌కి వెళ్లడం మొదలైంది. ఎక్కడికి వెళ్లినా పక్కన సాత్విక్ ఉండాలి. తన గురించి ప్రతి విషయం అతనికి చెప్పుకోవాలనే ఆశ. తన బాధను అతను చూడాలి, తన ఆవేదన గ్రహించాలని అనిపించేది. కానీ తనను తాను అదుపులో ఉంచటానికే ప్రయత్నించేది. 

తనతో మాత్రమే ప్రత్యేకంగా ఉంటున్న సారిక మనస్తత్వం మీద సాత్విక్‌కి ఆసక్తి పెరిగింది. తను వేరేవాళ్లతో ఎక్కువసేపు మాట్లాడితే ఆమెలో కనిపించే అసహనం అతనికీ గుబులుగా అనిపించేది. ఇద్దరే ఉన్నపుడు మధ్యలో ఫోన్ మోగినా ఆమె ముఖం డల్ అవటం గమనించేవాడు. ఆమె అజమాయిషీ అతనికి బాగా ఇష్టం. “జీ హుజూర్” అనేవాడు సరదాగా.

***

టైం నాలుగైంది. నిద్ర పట్టడం లేదు. ఇంకో కాఫీ తాగింది. ఏవేవో జ్ఞాపకాలు మెదులుతున్నాయి. ఏవేవో గుర్తొస్తున్నాయి. ఒకసారి సాత్విక్, తనూ కలిసి హంపి ట్రిప్‌కి వెళ్ళారు. రెండు రోజులు ఆ కట్టడాలన్నీ చూస్తూ ఎంజాయ్ చేశారు. ముందు రోజే సన్‌రైస్ పాయింట్ చూసినా, బయలుదేరాల్సిన మూడోరోజు కూడా ఆ పాయింట్‌కి వెళదామని నాలుగింటికే నిద్రలేపి మరీ తీసుకెళ్ళాడు.

“మళ్ళీ ఎందుకురా? చూసిందే కదా?”  అని సారిక విసుక్కున్నా అతను వినలేదు. రద్దీగా ఉన్న చోట కాకుండా కాస్త దూరంగా నిలబడ్డారు.

సూర్యుడు మెల్లమెల్లగా పైకి తేలుతుంటే పరుచుకుంటున్న వెలుగుల్నిచూసేసరికి సారికకి మళ్ళీ ప్రాణం లేచొచ్చింది. అప్పుడే సాత్విక్ తన బ్యాగ్‌లోంచి రెడ్ రోజ్ తీసి, తన ముందు కూర్చుని “ఆహ్లాదమైన ఈ వేకువలాగే నువ్వు కూడా నా జీవితంలో ఉదయిస్తావా?” అని తను కష్టపడి  ప్రిపేర్ అయిన మాటలు చెప్పేశాడు.

తను ఉన్న ఆ మూడ్‌లో సాత్విక్ నుంచి ఆ మాట వినేసరికి కొన్ని క్షణాలపాటు ఏమీ అర్థం కాలేదు. కళ్ళలో నీరు నిండింది. ఎలా స్పందించాలో, ఏం చెప్పాలో తోచలేదు. కళ్ళు తుడుచుకుంది. అతణ్ని నిలబడమని సైగ చేసింది. అతణ్ని గట్టిగా హత్తుకుంది. కొంతసేపటి తర్వాత “ఇది అంగీకారం కాదు, నా ఎమోషన్ మాత్రమే. నాతో కలిసి బతకాలన్న ఆలోచన నీకు మంచిది కాదు. ఇపుడు నేనేమీ చెప్పలేను. తర్వాత మాట్లాడుకుందాం” అంటూ అక్కడి నుంచి బయలుదేరింది.

ప్రయాణంలోనూ ఏమీ మాట్లాడలేదు. హైదరాబాద్ చేరుకుని రెండు రోజులు గడిచినా ఇద్దరి మధ్యా మాటలు లేవు. అతనూ అడగలేకపోతున్నాడు. తను ఏమీ చెప్పలేకపోతుంది. అసలు విషయాన్ని ఎలా తేల్చుకోవాలనేది ఇద్దరికీ అర్థం కావటం లేదు. చివరకు తనే కుదరదని సున్నితంగా చెప్పేసింది.

ఆమె మనసు నిండా తనున్నానని సాత్విక్ మనసుకు అనిపిస్తుంది. ఆమె చూపుల్లో, మాటల్లో, ఆలోచనల్లో అతనికి తనే స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆ నమ్మకంతోనే ప్రపోస్ చేశాడు. కానీ ఈ రిప్లై ఊహించలేదు. ఆమె ఏ భయాలతో తనను వద్దనుకుంటుందో అతనికి తెలుసు. అవన్నీ పోగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆమె మనసు ఎంత కరుడుగట్టిందో ఊహించలేకపోయాడు.

ప్రేమను కాదన్నందుకు సాత్విక్ ఎంత బాధపడతాడో సారిక ఊహించింది. అతని మనసు మారేలా దూరంగా ఉండాలని భావించింది. కాస్త పరిధి గీసింది. కానీ కట్టుబడలేకపోయింది. సాత్విక్ కూడా ఆమెను ఓపికతో మార్చుకోవాలనుకున్నాడు. సంవత్సర కాలంలో ఎన్నోసార్లు ఈ విషయం చర్చకు వచ్చింది. ప్రతిసారీ ఇలాగే గొడవ జరుగుతుంది. 

ఆనాటి హంపీ సూర్యోదయం సారిక జీవితంలో ఒక అద్భుత జ్ఞాపకం. ఆమె మనసులో కళాత్మకంగా ముద్రపడిపోయిన క్షణం.

*** 

తెల్లవారింది. సారిక త్వరత్వరగా తయారై, సాత్విక్‌ని పిక్ అప్ చేసుకుని ఆఫీస్‌కి వెళ్ళాలనుకుంది. అతని సీరియస్ మూడ్‌ని ఫేస్ చేయడానికి ప్రిపేర్ అయింది. ఇద్దరికీ కలిపి టిఫిన్ రెడీ చేసింది. 

కానీ సాత్విక్ ప్లాట్‌లో లేడు. వెళ్ళిపోయి చాలాసేపయిందని వాచ్‌మెన్ అన్నాడు. ‘పరిస్థితి కొంచెం కఠినంగానే ఉన్నట్టుందే సారికా! ఎత్తుకుని ముద్దలు కలిపి తినబెట్టడానికైనా సరే రెడీగా ఉండు’ అని తనలో తనే అనుకుంది. ఇవాళ ఆఫీసులో చేయాల్సిన ముఖ్యమైన పనల్లా ఒకటే, తన ట్రాన్స్‌ఫర్ గురించే మాట్లాడాలి. కానీ తనకు తానుగా చేయించుకుంటున్నట్టు సాత్విక్‌కి తెలియకూడదు. కంపెనీ నిర్ణయంగానే ఉండాలి. మొత్తం మీద అతనికి దూరంగా వెళ్ళిపోవాలి. 

సారిక వెళ్ళి చూస్తే ఆఫీస్‌లో ఎవరూ లేరు. టైం అవలేదు కాబట్టి ఇంకా ఎవరూ రాలేదు. ఆలోపు తను అనుకున్న పనులకు సంబంధించి లెటర్స్ టైప్ చేసింది. పూర్తైన తర్వాత బయటికి వచ్చి చూస్తే మెల్లగా ఒక్కొక్కరూ వస్తున్నారు. పదకొండు దాటినా సాత్విక్ రాలేదు. అతని ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసింది. ఎక్కడా లేడు. ఊరికి వెళ్ళాడేమో అనుకుని ఆంటీకి కాల్ చేద్దామనుకుని, ఆగిపోయింది. అతను అక్కడికి వెళ్ళకపోయుంటే అనవసరంగా వాళ్ళని కంగారు పెట్టినట్టవుతుందని అనిపించింది. మధ్యాహ్నం వరకూ చూద్దామనుకుంది. రెగ్యులర్ వర్క్ ముందు పెట్టుకుంది. 

కాసేపటి తర్వాత మేనేజర్ శ్వేత నుండి ఛాంబర్‌కి రమ్మని కాల్ వచ్చింది. వెళ్లి చూస్తే ఛాంబర్‌లో మేనేజర్‌తోపాటు సాత్విక్ కూడా ఉన్నాడు. లోపలికి వెళ్తూనే “ఏమైంది ?” అన్నట్టు శ్వేత వైపు చూసింది. 

“బెంగళూర్ బ్రాంచ్‌కి ముగ్గుర్ని పంపమని లెటర్ వచ్చింది కదా! తను వెళ్తానంటున్నాడు” చెప్పింది శ్వేత. 

సాత్విక్ వైపు చూసింది. కానీ అతను సారిక వైపు చూడటం లేదు “మేం టీంలో డిస్కస్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తా” అంది సారిక. 

“డిస్కస్ చేయడానికి ఏమీ లేదు మ్యామ్. ఐ యామ్ రెడీ టు గో” అని శ్వేత వైపే చూస్తూ అన్నాడు సాత్విక్. 

అతనలా మాట్లాడటం శ్వేతకి ఆశ్చర్యంగా అనిపించింది. వస్తున్న కన్నీళ్లను సారిక కనురెప్పల లోపల ఆపుకుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో శ్వేతకి అర్థం కాలేదు. 

 సారిక ఆలోచించింది. తను వెళ్ళిపోదామనుకుంటే ఆ నిర్ణయం అతనే తీసుకున్నాడు. ఏదైతేనేం బెంగళూర్‌కి వెళ్తే కొత్త మనుషులు, వాతావరణం వల్ల అతనిలో మార్పు రావచ్చు. తనని మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి సాత్విక్ నిర్ణయమే కరెక్ట్ అనుకుంది. అప్రూవ్ చేయమని శ్వేతకి చెప్పింది. మాట పూర్తయ్యేలోపే అతను శ్వేతకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. 

సారిక అతను వెళ్లినవైపే చూస్తోంది. శ్వేత ఆవేశంగా “సారికా! ఇట్స్ ఎనఫ్. నువ్వు ఏడ్చేదే కాక వాణ్ని కూడా ఏడిపిస్తున్నావ్. నీ పిచ్చికి ట్రీట్‌మెంట్ లేదు. విడిపోతామనే భయంతో కలవకపోవటం ఎంత మూర్ఖత్వమో తెలుసా? మహా అంటే ఏమవుతుంది? మళ్లీ నువ్వు ఇలాగే మిగిలిపోతావ్. వాడు న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాడు. అంతే కదా!” అంది. 

“నా బాధ మీకెవరికీ అర్థం కాదు. తనని బెంగళూరుకి పంపించేసేయ్. మిగిలిన వర్క్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను” అంది సారిక.

“చేస్తాను. నువ్వు చెప్పావని కాదు, వాణ్నినీ పిచ్చి నుండి సేవ్ చేయడానికి” అంది శ్వేత. 

 బలవంతపు చిరునవ్వుతో “థ్యాంక్యూ” అని సారిక బయటకు వచ్చేసింది. 

అదే చివరగా సాత్విక్‌ని చూడటం. రోజులు గడిచిపోతున్నాయ్. సారిక జీవితంలో మళ్ళీ వేదన నిండింది. నిద్ర దూరమైంది. ముఖంలో వెలుగు పోయింది. పెదాలు నవ్వు మరచిపోతున్నాయ్. 

సాత్విక్ అపార్ట్‌మెంట్ వైపు వెళ్లి, ముందున్న పార్క్‌లో బెంచ్‌పైన కూర్చుని, అతని ప్లాట్ వైపు చూస్తూ కాసేపు గడుపుతుంది. ఇంత పెద్ద మహానగరంలో ఆమెకు వెళ్ళాలనిపించే చోటు అదొక్కటే. 

సారిక తన పద్దతి మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అందరితోనూ కలిసిపోతూ పాజిటివ్, నెగిటివ్ ఫేస్ చేస్తుంటేనే మళ్ళీ ఎవరికీ అడిక్ట్ అవకుండా ఉండొచ్చని అనుకుంది. తనకు అలవాటులేని కలుపుగోలుతనం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. అయినా అతని ప్రభావాన్ని దాటడం అంత సులువు కాదని అర్థమవుతూనే ఉంది. 

 ఆఫీసులో మరో కొత్త బ్యాచ్ చేరింది. అందులో హారిక, జ్యోత్స్న బాగా క్లోజ్ అయ్యారు. వారితో కలిసి పార్టీలకి కూడా వెళుతోంది. ఒకరోజు హారిక “మ్యామ్! మీరు నవ్వుతున్నపుడు ఎంతో అందంగా ఉంటారు. కానీ ఆర్టిఫీషియల్‌గానే అనిపిస్తారు. ఏదో బాధని హైడ్ చేయటానికి ట్రై చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ, మీరు నిజంగా జాయ్‌ఫుల్ పర్సన్ కాదు” అంది. 

ఏం మాట్లాడలేక తన రూంకి వచ్చి తనివితీరా ఏడ్చింది సారిక. అద్దంలో ముఖం చూసుకునే కొద్దీ ఏడుపు తన్నుకొస్తోంది. మంచంపైన పడుకొని దుప్పటి నిండుగా కప్పుకుంది. 

***

సంవత్సరం గడిచింది. ఎప్పటిలాగే పార్క్ బెంచ్ మీద వచ్చి కూర్చోబోతూ సాత్విక్ ప్లాట్ వైపు చూసింది. బాల్కనీలో బల్బ్ వెలుగుతోంది. వెళ్ళి వాచ్‌మెన్‌ని అడిగితే  సాత్విక్ వచ్చినట్టు చెప్పాడు. పరిగెత్తుకుంటూ ఫ్లాట్‌లోకి వెళ్ళింది. 

అతను బాల్కనీలో నిలబడి బెంచ్ వైపే చూస్తున్నాడు.  వెళ్ళి తన పక్కన నిలబడింది. బాగా పెరిగిన గడ్డం, వెలుగు లేని ముఖం, వేదనంతా గారకట్టినట్టు కళ్ళ చుట్టూ నల్లబడ్డ చర్మం. అతణ్నలా చూడలేకపోయింది. ఏమని పలకరించాలో అర్థం కాలేదు.

అలవాటుగా తన భుజం మీద చేయివేయాలనుకుని ఆగిపోయింది. అతను ఆ చేయి వైపు చూసి, ఆ తర్వాత ఆమె కళ్ళలోకి చూశాడు. ఉబికి వస్తున్న ఆమె కన్నీళ్లని బొటనవేలితో తుడిచి “ఈ రకంగానే నీ ఏడుపుని లోపల దాచేసి, ఆ బాధనంతా నా మీద కుమ్మరించేశావ్. మరి నేను లేకుండానైనా హ్యాపీగా ఉన్నావా?” అన్నాడు. 

“అవును! నువ్వు లేకుండా ఇంకా హ్యాపీగా ఉన్నాను” అంది ఎటో చూస్తూ. 

“అచ్చా! మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నావ్? ఎందుకు ఆ బెంచ్ మీద కూర్చుంటున్నావ్?” అన్నాడు.

“ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తిరిగినా నా ఆనందం కోసమే. నీ ఆలోచనలేం నాకు లేవు” అంది. 

“ఆలోచనల్లేవు. కానీ నేను బెంగళూర్‌లో ఉన్నపుడు మనోహర్ గాడి నుంచి నా డే టు డే అప్‌డేట్స్ అన్నీ ఉన్నాయ్. కదా?” సూటిగా అడిగాడు. 

“నువ్వు కూడా నా గురించి హారిక ద్వారా తెలుసుకుంటూనే ఉన్నావ్ కదా! తన ప్రతి మాటలో, కేరింగ్‌లో నువ్వే కనిపిస్తావ్”. 

“కానీ నా ఆవేదన మాత్రం కనిపించదు కదా?” అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.

“నువ్వు మారలేదు సరికదా, ఇంకా ముదిరిపోయావ్. ఇక్కడికి రావటం నా తప్పు. వెళ్తున్నా గుడ్ బై” అని వెళ్లబోయింది. అతను ఆమెను వెనక్కి లాగి హత్తుకుని ముద్దు పెట్టబోయాడు. వెనక్కి నెట్టింది. 

“జ్ఞాపకాల్లో బతకటానికి మించిన నరకం ఇంకోటి లేదు. ఇక నావల్ల కాదు” అంటూ ఆమె పెదాల మీద ముద్దుపెట్టాడు. ఒక్క క్షణం హడలిపోయింది. ఆ తర్వాత అతను తనలో నుండి కణాలుగా ఏదో లాగేసుకుంటున్న భావనలో మునిగిపోయి, కళ్లు మూసుకుంది.

కాసేపటికి భుజాలు కదిలించేసరికి తేరుకుని కళ్ళు తెరిచింది. అతడు అలాగే వెనక్కి రెండు అడుగులు వేశాడు. క్షణంలో జరిగిందంతా ఒక్కసారి గుర్తొచ్చి, తనది ఇంత బలహీనమైన హృదయమా అనుకుని సారిక ఏడ్చింది. సాత్విక్‌ని కాదని తను బతకలేదు. అతని ఆత్మీయత నుండి తను తప్పించుకోలేదని అర్థమైంది.

ఆమెకు దగ్గరగా జరిగి తల పైకెత్తి “నీకిలా ఏడ్చి ఏడ్చి, లోలోపలే నలిగిపోవటం ఇష్టమైతే సరే. అదేదో నాతోనే కలిసి ఏడువ్” అన్నాడు. 

అతనికి మరింత దగ్గరై నుదుటి మీద, చెంపల మీద ముద్దు పెట్టింది. ఇన్నాళ్ల నుంచి తన మనసులో దాచిపెట్టుకున్న ప్రేమ బయటపెట్టింది. “ఇక నుంచి పూర్తిగా నీతోనేరా! పెళ్ళయినా, లివ్ ఇన్ అయినా, ఏదైనా నీతోనే ఉంటాను” అంటూ అతని గుండెపై తలపెట్టింది. ఆ మాట విన్న సాత్విక్ ఆనందంలో తేలిపోతున్నాడు. 

గాలి కూడా చొరబడనంత గట్టిగా వారిద్దరూ ఒకరినొకరు హత్తుకున్నారు.

***

అనువాదాలే ఇష్టంగా చదువుతాను 

  • హాయ్ నందూ! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది నాగర్‌కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ. నేను పుట్టి, పెరిగింది అక్కడే. తెలుగులో ఎంఏ పూర్తి చేశాను.

  • కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. అందుకు కారణం చిన్నప్పుడు మాకు తెలుగు పాఠాలు చెప్పిన వరలక్ష్మి టీచర్. ఆమె కేవలం పాఠాలే కాకుండా, కథలు కూడా చెప్పేది. పుస్తకాలు చదివి కొత్త విషయాలు తెలుసుకోవాలని మరీ మరీ చెప్పేది. దాంతో లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు బాగా చదివేవాణ్ని. పిల్లల కోసం వచ్చే రకరకాల మ్యాగజైన్స్ చదివేవాణ్ని. ఆ తర్వాత తెలుగువెలుగు మాసపత్రిక చదివేదాకా వచ్చాను. అలా మెల్లగా సాహిత్యంపై ఇష్టం కలిగింది. 

చదివే అలవాటు వల్లే రాయాలన్న ఆలోచన కలిగింది. డిగ్రీ నుంచే రాయటం మొదలుపెట్టాను. కథలు, వ్యాసాలు రాసి పత్రికలకు పంపేవాణ్ని. ఏవో కారణాల వల్ల అవి సెలెక్ట్ అయ్యేవి కావు. మొదట ప్రచురితమైన కథ 2022లో ‘వెలుగు’ పత్రికలో వచ్చిన ‘పల్లవం’. అది నాకు రచయితగా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత నేటినిజం, వార్త పత్రికల్లో ఏడెనిమిది కథలు ప్రచురితమయ్యాయి. ప్రచురితం కానివి ఇంకా చాలా ఉన్నాయి. 

  • చాలా కథలు రాసినా కొన్నే ప్రచురితమయ్యాయెందుకు?

కథలు రాసి పత్రికలకు పంపితే రిజెక్ట్ చేసేవాళ్లు. కొన్నిసార్లు సమాధానం కూడా వచ్చేది కాదు. రెండు, మూడేళ్లు ప్రయత్నించాక ఇక నా కథలు ఎవరూ ప్రచురించరనే నిర్ణయానికి వచ్చి రాయడం మానేశాను. కరోనా తర్వాత తెలిసింది, ఫేస్‌బుక్‌లో కథలు రాయచ్చని. అక్కడ నా కథలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. పాఠకుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడానికి‌ అదొక మంచి వేదికలా మారింది.

  • రెండేళ్లలో రెండు పుస్తకాలు తీసుకొచ్చారు. వాటి గురించి చెప్పండి.

నేను రాసిన 28 కవితలతో ‘అంతర్వచనం’ కవిత్వ సంపుటి వచ్చింది. మనిషికీ, సమాజానికీ మధ్య జరిగే సంవాదం, ఒకరి ప్రభావం మరొకదానిపై ఎలా ఉందనే ఆలోచనతో రాసిన కవితలవి. 

రెండో ప్రచురణగా ‘ఆర్తి’ అనే నవల తీసుకొచ్చాను. ఒగ్గుకథ కళాకారుడి జీవనప్రస్థానమే ఆ నవలలోని కథాంశం. అనారోగ్యం కారణంగా ఒగ్గుకథ చెప్పలేని ఓ కళాకారుడి దగ్గరికి కొందరు విద్యార్థులు వచ్చి, ఆయనతో మాట్లాడి, ఒగ్గుకథ నేర్పించమని అడగటం, ఆయన వారికి నేర్పడం.. అదంతా కలిపి నవలగా రాశాను. 

  • పాఠకుడిగా ఎలాంటి రచనల్ని ఇష్టపడతారు?

నేను చదివే రచనల్లో ఎక్కువగా అనువాద సాహిత్యమే ఉంటుంది. మన రచయితలు తమ రచనల్లో చూపించే జీవితమంతా ఏదో ఒక రకంగా మనం చూసిందే. అయితే అనువాదాల్లో ఇతర భాషలు, మనకు తెలియని ప్రదేశాల్లోని సమాజం, మనుషుల ఆలోచనా తీరు, వాళ్ల జీవనసరళి, వారెలా ఆలోచిస్తారు, అక్కడి సంస్కృతి ఏమిటనేది తెలుస్తుంది. 

తెలుగులో వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ‘జైలు లోపల’ కథా సంపుటి చాలా ఇష్టం. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ కవిత్వం చాలా ఇష్టంగా చదువుతాను. అలాగే ముదిగొండ సుజాతరెడ్డి రాసిన ‘మలుపు తిప్పిన రథచక్రాలు’ నవల కూడా ఇష్టం. అనువాద సాహిత్యంలో ‘వనవాసి’, ‘అగ్నిసాక్షి’, ‘సూఫీ చెప్పిన కథ’ నవలు చాలా నచ్చాయి. వీటితోపాటు విమర్శనాత్మక వ్యాసాలు ఎక్కువగా చదువుతాను.

  • ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?

నేను మొదలుపెట్టిన చాలా రచనలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఓ నాలుగు నవలల్ని ఈ సంవత్సరం పూర్తి చేయాలని అనుకుంటున్నాను.

*

నందు కుషినేర్ల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు