స్థూలంగా సాహిత్య విమర్శ అంటే అధ్యయనం, విశ్లేషణ, రచన అర్థాన్ని అంచనా వేసే అన్వయం, కళా సౌందర్య విశ్లేషణ, రచన ప్రత్యేకత గురించి చెప్పడం. విశ్లేషణ, అన్వయం ద్వారా సృజనాత్మక రచనల ప్రమాణాలపై, కళా విలువలపై తీర్పు చెప్పడం కూడా. ఈ విమర్శలో సృజనాత్మక రచయితల జీవితం కూడా ఉంటుంది గానీ కేవల జీవిత చరిత్ర విమర్శ కిందికి రాదు.
తెలుగులో సాహిత్య విమర్శ ప్రయాణం పెద్దదే. ప్రాచీన సంస్కృత అలంకారికుల కొలమానాలు ఆధునిక సాహిత్యానికి సరిపడవు. దాంతో ఆధునిక సాహిత్య విమర్శ తెలుగులో అవతరించింది. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ వీరేశలింగం పంతులుతో మొదలైనట్లు చెబుతున్నప్పటికీ కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వతత్త్వ విచారముతో దాని వికాసం ప్రారంభమైంది. మనకు తెలుగులో సాహిత్య విమర్శ వికాసంపై విస్తారంగా చర్చించిన గ్రంథాలు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి ` తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘తెలుగు సాహిత్య విమర్శ దర్శనం’, రెండోది ` యాకూబ్ వెలువరించిన ‘ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ’. అవి కూడా తెలుగు సాహిత్య విమర్శ ఖాళీలను పూర్తిగా చర్చించలేదు. ఖాళీలను చర్చించడానికి అవసరమైన ప్రతిపాదనలు యాకూబ్ గ్రంథంలో కనిపిస్తాయి.
దాదాపుగా ఆధునిక సాహిత్య విమర్శ విషయానికి వస్తే సైద్ధాంతిక నేపథ్యంలో వస్తు విశ్లేషణ కనిపిస్తుంది. దాన్ని వస్తుగత విమర్శగా చెప్పవచ్చు. మార్కిస్టు విమర్శ నుంచి ప్రారంభిస్తే ఇటీవలి తెలంగాణ ప్రాంతీయ విమర్శ దాకా ఆ ధోరణితోనే సాగింది. ఉద్యమాల నేపథ్యంలో వస్తువు ప్రగతిశీలమైందా కాదా అనేది ప్రధాన చర్చగా సాగింది. అయితే, స్త్రీ, దళిత, తెలంగాణ ప్రాంతీయ వాదాలు భాష మీద చర్చ చేశాయి.
తెలుగులో రూపవాద విమర్శ దాదాపుగా లేదనే చెప్పవచ్చు. వేల్చేరు నారాయణరావు ‘కవితా విప్లవాల స్వరూపాలు’లో రూపవాద విమర్శను చూస్తాం. అలాగే చేరాతలు కవిత్వాన్ని ఆ కోణంలో విశ్లేషించాయి.
మార్కిస్టు విమర్శ పూర్తిగా దాన్ని నిరసించింది. రూపవాద విమర్శలో శైలి, కథనం, ఇతర సాంకేతిక విషయాల విశ్లేషణ జరుగుతుంది. శైలి గురించి మాట్లాడితే దళిత వాదులు అగ్గి మీద గుగ్గిలం అవుతారు.
సృజనాత్మక ప్రక్రియను పాఠకులు ఆస్వాదించడానికి వీలుగా రూపొందించడమే శైలి. నిజానికి, స్త్రీ, దళిత, మైనారిటీ లేదా ముస్లిం వాదాలు ప్రారంభమైన తొలినాళ్లలో సృజనాత్మక రచనలకు శైలీరూపాలు అవసరం లేదు. వాళ్ల అనుభవాల వ్యక్తీకరణ సాహిత్యానికి వినూత్నమైనవి కాబట్టి ఈ వ్యక్తీరకణలే కొత్త అభివ్యక్తి రూపాలుగా ముందుకు వచ్చి పాఠకులను ఆకట్టుకుంటాయి. అనంతర కాలంలో ఆ సాహిత్య ధోరణులు అనివార్యంగా శైలి గురించి ఆలోచించాల్సిన అనివార్యతలో పడుతాయి. లేదంటే, ఆ సృజనాత్మక రచనలు పఠనయోగ్యతను కోల్పోతాయి.
ఇక తెలుగులో విమర్శ సిద్ధాంతాల చర్చ ఎక్కువే జరిగింది. అయితే ఆయా సిద్ధాంతాల వెలుగులో సృజనాత్మక సాహిత్యాన్ని సమగ్రంగా విశ్లేషించే పని తక్కువగా జరిగాయి. ఉదాహరణకు ఆధునికానంతర వాదంపై అఫ్సర్ (1991), తిరుపతి రావు (1999) వంటివాళ్లు చర్చ చేశారు. కానీ దాని భూమికగా సాహిత్యాన్ని విశ్లేషించిన సందర్భాలు చాలా అరుదు.
ప్రస్తుతం సాహిత్య విమర్శ కొడిగట్టిన దీపంలా తయారైంది.
అన్ని ఉద్యమాలు కూడా దాదాపుగా స్తబ్దతకు గురయ్యాయి. దాంతో ఆయా ఉద్యమాల నేపథ్యంలో వచ్చే సృజనాత్మక రచనలు కూడా తగ్గిపోయాయి. దాంతో సాహిత్య విమర్శ వెనకంజ వేసింది. సమీక్షలు, ప్రశంసలు కూడా సాహిత్య విమర్శగా చెలామణి కావడం చూస్తాం. సోషల్ మీడియా అందుకు పెద్ద యెత్తున సహకరిస్తున్నది. ప్రచురణ సంస్థలకు మార్కెట్‌ను సృష్టించే సమీక్షలు, ప్రశంసలు పెద్ద యెత్తున చెలామణిలోకి వస్తున్నాయి.
ఏమైనా తెలుగు సాహిత్య విమర్శ ఎదగాల్సినంతగా ఎదగలేదని మాత్రం రూఢీగా చెప్పవచ్చు. భవిష్యత్తు అందుకు తోడ్పడుతుందని ఆశిద్దాం.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం








రచయిత తో ఏకీభవిస్తున్నాను. సాహిత్య విమర్శ నేడు లేదు.