ఈ మధ్య ఎక్కడో చదివాను. తెలుగు చచ్చిపోతే తెలుగు సంస్కృతి కూడా దాంతోనే పోతుంది అని. ఒకవేళ అది నిజమే అనుకున్నా, అయితే వచ్చే పెద్ద నష్టం ఏంటీ అనుకున్నాను. చంద్రబాబు నాయుడూ, జగన్మోహనరెడ్డి లాంటి నాయకుల్ని తయారుచేసిన సంస్కృతి పోతే వచ్చే నష్టం ఏంటీ అనిపించింది. కానీ వెంటనే జ్ఙానోదయం అయింది కూడా! డొనాల్డ్ ట్రంప్ నీ బోరిస్ జాన్సన్నీ తయారు చేసింది ఆంగ్ల సంస్కృతా? కాదు కదా. మరి తెలుగు సంస్కృతి మీద వ్యసనం ఎందుకులే అని ఆ ఆలోచనను వదిలేశాను.
*
అసలు విషయం ఏంటంటే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో చదువు తెలుగులో కాకుండా ఒకటో తరగతి నుంచే ఆంగ్లంలో చెప్తారని తెలిసింది.
ఎవరు చెప్తారు?
అదే, ఇంతకు ముందున్న పంతుళ్ళే చెప్తారు.
మరి వాళ్ళకు ఆంగ్లం రాదుకదా?
అయితే ఏంటీ. నాలుగు రోజులు ట్రెయినింగ్ ఇస్తే అదే వస్తుంది.
నిజమే కదా.
*
మనపంతుళ్ళు పిల్లలకు ఇంగ్లీషులో పాఠాలు చెప్తారు. పిల్లలకు వెంటనే అమెరికాలో ఉగ్యోగాలొస్తాయి. అమెరికాలో దిగినవాడొకడు బజార్లో ఎవడ్నో saar, post office which side to go? అని ఇంగ్లీషులో అడుగుతాడు. వాడికర్థంగాక వాడు ఎగాదిగా చూసి వెళ్ళిపోతాడు. ఇక వీడు ఎవడన్నా తెలుగోడు కనపడతాడేమోనని అటూ ఇటూ చూస్తాడు.
ఇండియన్ ఇంగ్లీషొకటుందని పండితులు అంటున్నారు. అదే, బజార్లో పక్కనున్న ఇంగ్లీషువాడికి అర్థం కాకుండా మనలో మనం రహస్యంగా మాట్లాడుకోవటానికి ఉపయోగపడే భాష.
*
ఎవరెవరుంటారు మీ ఇంట్లో అని అడగండి మనవాడ్ని. అదే, తెలుగులోనే.
జవాబు ఇంగ్లీషులోనే చెప్తాడు. I am having one wife and two children.
రాత్రికేం తింటావని కాదు నాన్నా అడిగింది, ఇంట్లో ఎవరున్నారని.
అయినా ఏమాటకామాటే చెప్పుకోవాలి. నాలుగు రోజుల ట్రెయినింగ్ తో పంతులుగారు ఈ మాత్రం ఇంగ్లీషు నేర్పాడంటే అది గొప్ప విషయమే.
*
అప్పుడెప్పుడో విన్నాను. కమ్యూనిజం మీద అసహ్యం కలగాలంటే చైనా వెళ్ళాలనీ, కేపిటలిజం మీద కోపం రావాలంటే అమెరికా వెళ్ళాలనీ. పిల్లలు తెలుగు మీడియం చదువుల్లో ఉపయోగిస్తున్న సైన్స్ పుస్తకం ఒకటి చదవండి. వెంటనే ఇంగ్లీషు మీడియం మీద ప్రేమ కలుగుతుంది.
*
చాలా సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయం – మాతృభాష నేర్చుకోవడం సులభం అని. అది బాగా వచ్చిన తర్వాత దాంట్లో ఇతర భాషలూ విషయాలు నేర్చుకోవడం సులభం అనీ. అలా కాకుండా, తెలివిమీరినవాడు ఇంగ్లీషులో మాతృభాష నేర్చుకున్నాడనుకోండి. వాడికదీ రాదు, ఇదీరాదు.
*
ప్రజలు ఈ ఫెస్బుక్ ప్రగాల్భాల తిట్ల ఉద్యమకారుల మేధావులకంటే తెలివైనవాళ్లు.
వాళ్లకేం కావాలో రెఫరెండం పెట్టి అడగాలి. లేదా రెండు మీడియంలలో చదువు అదుబాటులో ఉంచాలి.
ఉండాల్సింది ఎవరికి కావలసింది వాళ్ళు ఎంచుకొనే ఛాయిస్. పైనుంచి జరిగే రుద్దుడు కాదు.