కథలంటే మనందరికీ ఎందుకంత ప్రేమ? బహుశా అవి మనం అనబడే మనుషుల జీవితాలకి, అక్షరాలనబడే అద్దాలు కనుకనేమో! ఎంత ప్రేమగా చదివితే, కథ అంత బాగా అర్థమవుతుంది. అంత బాగా నచ్చుతుంది. మరి అటువంటప్పుడు, కథ రాయాలంటే ఇంకెంత ప్రేమ కావాలి? కథ మీదే కాదు, మనుషుల మీదా, జీవితం మీదా, ప్రకృతి మీదా, అసలు మన చుట్టూ ఉన్న ప్రతీ వస్తువు మీదా కూడా.
అమరావతి కథలంటే,పేరులో కథలుంచుకున్న అచ్చమైన జీవితాలు. మనకే తెలియకుండా మన చుట్టూ ప్రవహించే ప్రేమ నదులు. నిలబడి చూస్తే మీకూ, నాకూ అందరికీ కనిపిస్తాయి. అలాగే చూసారు, రచయిత శంకరమంచి సత్యం గారు, మనుషుల్నీ, వారి మనసుల్నీ కూడా. చూసి వదిలేయలేదు, ఆ ప్రవాహంలోకి దూకేసారు. అనుభూతులన్నీ మనసు నిండా నింపుకుని, ఇదిగో… ఇలా కథల్లా రాసి మన దాకా చేర్చారు. ఒక్కో కథా ఒక్కో సజీవ శిల్పం. ఎప్పుడో మనమెక్కడో చూసి మరిచిపోయిన అపరచితల్లాంటి కథలు. ఇక్కడే మన పక్కనే నిలబడి మనల్నే గమనిస్తున్న చిరపరిచితుల్లాంటి కథలు. ఏ కథ ఎవరిదైనా, ఏం చెబుతున్నా, ఏదీ శ్రద్ధగా గమనించకుండా చదివేసినా సరే, ఒక్క అనుభవం మాత్రం ఈ కథలు చదివినవారంతా అనుభవించి తీరాల్సిందే. ప్రతీ కథలోనూ, ఎక్కడో, ఏదో సందర్భంలో, మన కన్ను ఆనందాన్నో, దుఃఖాన్నో చెమర్చి తీరుతుంది. లేదూ, ఏడవటం నాకలవాటు లేదంటే, గుండె బరువైనా ఎక్కిపోతుంది. అమరావతి కథల గురించి ఎవరెన్నైనా చెప్పనీ, నే చెప్పేది మాత్రం ఒక్కటే. ఈ కథలు చదివితే, అలలు అలలుగా మనసు చెదిరిపోవాల్సిందే. ఎంత బండరాయివంటి హృదయపు స్వంతదారైనా, తానూ మనిషినేనన్న విషయాన్నోసారి గుర్తు చేసుకోవాల్సిందే. అందుకే శంకరమంచి సత్యం గారు 1975-77ల మధ్య కాలంలో రాసిన ఈ కథల్ని, ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రచురించినా, శ్యామ్ బెనగల్ వీటిని ధారావాహికగా చిత్రీకరించినా, అవి వరుసగా దూరదర్శన్ లో ప్రసారమైనా (1994-95), రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డును అందించినా (1979) పెద్ద విచిత్రమేమీ కాదు.
ఇక ఈ కథల్లో వాడిన భాష గురించి ఏం చెప్పాలి! కష్టపడి అర్థం చేసుకోవాల్సిన కవిత్వం కాదు, అతి సామాన్యంగా సాగిపోయే వచనమూ కాదు. ఎండా వానా లేని ఓ చల్లని సాయంత్రం, నావలో కూర్చుని నదిలో విహరిస్తున్న అనుభూతి. ఓ అద్భుతమైన శిల్పాన్ని చూస్తూ, శిల్పి పడిన కష్టమెంతోనన్న ఆలోచన కూడా చేయనంతటి మైమరపు, చందమామేదో, వెన్నెలేదో మరిచిపోయి, ఆ తెల్లని చల్లదనంలో మునిగి తేలిపోయేలాంటి పారవశ్యం. గిల్లితే పాలుగారిపోయేంత లేతదనంతో, ముద్దుల మూటలుగట్టే పసిపాపలవంటి వాక్యాలు శంకరమంచి గారివి.
తర్వాత, కథలకు బాపూ గారు వేసిన బొమ్మల గురించి తప్పని సరిగా చెప్పాలి. ఒక్కో కథా చదివే ముందో సారి, చదివేసాకింకోసారీ ఆ కథకు వేసిన బొమ్మను చూడాలి. అక్షరాల్లా మారిపోతున్న గీతల్ని చూడాలి. బొమ్మలుగా నిలబడిపోయిన కథల్ని చూడాలి. అన్నీ తెల్లని కాగితాల మీద నల్లని సిరా గుర్తులే. కొన్నేం చదివిస్తున్నాయీ, కొన్నేం చూపిస్తున్నాయీ అని ఆశ్చర్యపోవాలి. ఇవన్నీ చేసాకా, ఆ కళాకారుడికీ, ఆయనలోని సృజనాత్మకతకూ కోటి కోటి వందనాలు సమర్పించుకోవలసిందే. ఆయన ఈ పుస్తకానికి వేసిన ముఖచిత్రం చాలా అందంగా, అర్థవంతంగా ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు అర్థ నిమీలిత నేత్రాలతో, తన్మయంగా చూస్తూ, సత్యం గారు చెబుతున్న కథలు వింటున్నట్టుగా ఉండే ఈ రంగురంగుల ముఖ చిత్రం, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
పేరుకు తగ్గట్టే ఈ పుస్తకంలోని కథలన్నీ అమరావతిలోనే పుడతాయి. ఈ కథల గుండా కృష్ణమ్మ బిరబిరా ప్రవహిస్తుంటుంది. అమరేశ్వరుడు తరచుగా ఎదురుపడుతుంటాడు. సరిగ్గా వంద కథలతో చేసిన ముత్యాల హారం – ఈ అమరావతి కథల పుస్తకం. కథలన్నీ నలభై ఏళ్ల క్రిందటి అమరావతి గ్రామాన్ని వేదికగా చేసుకుని నడిచేవే. పుస్తకంలోని మొట్టమొదటి కథ ‘వరద’ లోని మొట్టమొదటి పేరాలో, అమరావతి ఎలా ఉంటుందో రమణీయంగా వర్ణిస్తారు రచయిత. తూర్పున వైకుంఠపు కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్తూపాలూ, పడమటన దిబ్బగా మారిన ఒకప్పటి ధాన్య కటకం, ఉత్తరం నుండి ఊరిని చుట్టుకుంటూ వడ్డాణంలా పారే కృష్ణా నది. ఊరికి అందమైన అలంకారంలాంటి కృష్ణమ్మ పొంగి పొరలి ఉగ్రరూపం దాలిస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ ‘వరద’ కథ. ఆపద సమయాల్లో మనుషులంతా తమ, పర బేధాల్ని మరిచిపోయినట్టే కనిపించినా, నిజంగా మరిచిపోరనీ, ఎప్పటికీ మారరనీ రచయిత తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరిచారు ఈ కథలో. అది మొదలు, ఎందరో మనుషులు, వారి మనస్తత్వాలు, జీవితాలూ, జీవన విధానాలూ, వారి కష్టాలూ, సంతోషాలూ మన ముందుకు రావడం మొదలుపెడతాయి . వీటితోపాటుగా మధ్య మధ్యలో అమరావతీ నగర చరిత్రకు సంబంధించి, ప్రచారంలో ఉన్న కథలూ, రచయిత, తన ఊహాశక్తితో సృష్టించిన కథలూ కూడా మనల్ని పలకరిస్తాయి.
ముందుగా ప్రేమ కథల గురించి చెప్పుకుంటే, ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు, నిలువెల్లా తనని తడిపిన వర్షం మీద ప్రేమ పోగొట్టుకోలేని, ఓ తాతగారు చెప్పే కథ ‘రెండు గంగలు’. ఈ కథకు బాపూ గారు గీసిన, ‘పైనా క్రిందా ఎదురెదురు ముఖాలతో చూసుకుంటూ ఉండే ఇద్దరు స్త్రీ మూర్తుల బొమ్మ’ చూడముచ్చటగా ఉంటుంది.
ఇక ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న చాకలి వాళ్ళ జంట, ఊహించని కారణాల కారణంగా కలిసిపోయే కథ ‘ఆరేసిన చీర’.
మనసిచ్చినవాడు కట్నంకోసం వేరే మనువు చేసుకుంటే, మోడులా మిగిలిపోయిన లచ్చి కథ ‘పచ్చగడ్డి భగ్గుమంది’.
నావలో తిరిగే చింతాలు మావనే కాదు, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని కూడా ప్రేమించే జువ్వి కథ ‘కాకితో కబురు’.
పెళ్లి చేసుకున్నా సంసారం మీద మనసుపడని పరమ భక్తుడు రామశాస్త్రి, రేవులో స్నానం చేస్తున్న నల్లపిల్లను చూసాకా, ఆకర్షణకు అర్థం తెలుసుకుని, భార్యతో కాపురానికి సిద్ధపడే కథ ‘ఎంగిలా?’.
తొలి ప్రేమలోని అమాయకత్వాన్ని అతి సరళంగా చెప్పే కథ ‘వయసొచ్చింది’.
అట్లతద్దెనాడే అయినవాడ్నిపోగొట్టుకుని, మనసు ముక్కలు చేసుకున్న మూగ గౌరి కథ ‘ఆగని ఉయ్యాల’.
ఈ ప్రేమ కథల్లోని తీవ్రమైన ప్రేమా, ఆరాధనా మనల్ని పట్టి కుదుపుతాయి. ‘ప్రేమంటే ఇలా ఉండాలి సుమా’ అనిపించే కథలే అన్నీ.
ఇంకా, అధికారపు ఉక్కు పాదాల క్రింద నలిగిపోయే అభాగ్యుల కథలు కొన్ని; తోటి మనుషుల స్వార్థపు రథ చక్రాల క్రింద నలిగిపోయే అమాయకుల కథలు కొన్ని; వయసు మీద పడీ, వృత్తులు మూల పడీ బాధపడేవారి కథలు కొన్ని; తిండి పుష్టి ఎక్కువై, కండ పుష్టి ఎక్కువై ఇబ్బంది పడేవారి కథలు కొన్ని; అయినవారిని కోల్పోయి అతలాకుతలమైపోయేవారి కథలు కొన్ని…ఇలా చదువుకుంటూ పొతే, ఎన్నెన్నో భిన్నమైన అంశాలకు చెందిన కథలు మనల్ని పలకరిస్తూ వస్తుంటాయి .
పిల్లలకి పాఠాలు చెప్పందే కడుపు నిండని సుబ్బయ్య మేస్టారు, అందరూ కడుపు నిండా తింటే గానీ తృప్తి చెందని పూర్ణయ్య బావగాడు, స్వామీజీ అవతరమెత్తి కుటుంబాన్ని పోషించే సూరయ్య స్వాములవారు, ఏమీ చెయ్యకుండానే, ఏమీ సాధించకుండానే జీవితమంతా గడిపేసిన పిచ్చయ్య గారు, స్వామి ప్రసాదం తప్ప మరేదీ ముట్టని గంగన్న, ‘అంటూ, మడీ’ అనుకుంటూ, తన చుట్టూ తనే గోడలు కట్టుకున్న సుబ్బమ్మ గారు, పెంచుకున్న కోతి చచ్చిపోతే తానే కోతిలా ఆడే ముసలి సత్తెయ్య… ఇలా ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు మన కళ్ల ముందరి నుండి కృష్ణా ప్రవాహంలా కదిలిపోతాయి.
అయితే మన అనుభవాలతో మమైకమై, మరుగున పడిపోయిన మన జ్ఞాపకాలను వెలికి తీసుకొచ్చే కథల్ని మనం మరింతగా ఇష్టపడతాం. అలా నాకు బాగా నచ్చిన కథే ‘అంపకం’. గుండెలమీదికెత్తుకు ఆడించి, అరచేతుల్లో పెట్టుకు నడిపించిన బంగారు తల్లిని అత్తవారింటికి పంపాలంటే ఏ తండ్రికి బాధగా ఉండదు? అటువంటి తండ్రి కథే ఇది. పిల్ల, అత్తవారింటికి వెళుతుంటే తట్టుకోలేక తల్లడిల్లిపోయిన ఆ పిచ్చి తండ్రి, దారిలో పల్లకీ ఆపి, అల్లుడికి పెట్టే అంపకం చదివితే, మనిషన్నవాడెవడికైనా కళ్లు చెమర్చక మానవు.
అంతే ఆర్ద్రంగా మనసుని పట్టుకు పిండేసే మరో కథ ‘నిండు కుండ బొమ్మ’. ఐదేళ్ల తన చిన్నారి పాప, నీళ్ల తొట్టెలో పడి ప్రాణాలు కోల్పోతే, ఆ తండ్రి బాధను ఏ మాటల్లో వివరించగలం! అటువంటిదే మరో కథ ‘నాన్న-నది’. ఏ చిన్న విషయాన్నైనా తండ్రితో పంచుకుంటే గానీ తోచనంత అలవాటు సీతయ్యకి తండ్రితో. అటువంటిది, తండ్రి తనని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే, ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోతాడు. చివరికి, తన తండ్రి తనకెలాగో, తన పిల్లలకీ తనలాగేనని అర్థం చేసుకుని తెలివి తెచ్చుకుంటాడు. అలానే హృదయాన్ని మెలితిప్పే మరో కథ ‘ఏడుపెరగనివాడు’. నిత్యమూ చావుల్నే తప్ప మరోటి చూడనివాడు కాటికాపరి ఏసోబు. తండ్రీ, భార్యా వెళ్ళిపోయినప్పుడు కూడా దుఃఖించకుండా, ‘రాతిగుండె రాక్షసుడ’ని పేరు తెచ్చుకున్నవాడు. అటువంటి ఏడుపెరగనివాడు, తన కడుపున పుట్టినవాడు కాలం చేసినప్పుడు మాత్రం, కృష్ణ కదిలిపోయేట్టు, నేలపగిలిపోయేట్టు, ఆకాశం చిరిగిపోయేట్టు ఏడుస్తాడు.
ఈ పుస్తకానికి, ముళ్ళపూడి వెంకటరమణ గారు, ‘అమరావతి కథలు – అపురూప శిల్పాలు’ అనే పేరుతో అద్భుతమైన ముందుమాటను రాసారు. అక్కడ ఆయన ఈ కథల్ని, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహానుభావుల రచనల సరసన చేర్చ దగ్గ కథలుగా వర్ణించారు. చాలా కథలకూ, వాటికి బాపూ గారు వేసిన బొమ్మలకూ కూడా చక్కని వివరణను అందించారు.
ఇందులో కొన్ని కథలు, కథల్లా ఉంటే, మరికొన్ని అచ్చం నిజాల్లా ఉంటాయి. మరికొన్నైతే మనలో మనం చెప్పుకునే కబుర్లలానూ, మరికొన్ని, భావోద్వేగపు తీవ్రతలో కలిగే ఆలోచనల పరంపరల్లానూ అనిపిస్తాయి. ఈ పుస్తకాన్ని చదవడం పూర్తిచేసి మూసేసాకా, ఓ సారి తలెత్తి చూసి, అప్పటివరకూ అదృశ్యంగా మన చుట్టూ తిరుగాడుతున్న కథలెన్నెన్నో గమనించి అబ్బురపడగలిగేతే చాలు, ఈ అపురూపమైన ‘అమరావతి కథల్ని’ మనం సరిగా చదివినట్టే, అర్థం చేసుకున్నట్టే.
బావుంది భవానీ, మంచి పరిచయం. ఈ తరం పాఠకులు తప్పకుండా చదవవలసిన పుస్తకం. అభినందనలు
అవును రాధ గారూ, మీకు పరిచయం నచ్చినందుకు హ్యాపీ. ధన్యవాదాలు