మన కొయ్యబొమ్మలాటను కూడా వదులుకుందామా?!

ఇదే తెలుగునేల, ఇవే తెలుగునాడులు అని మనం గీసేసుకొన్న గిరులను దాటి, కాస్త ఆవైపూ ఈవెంపూ తిరిగొద్దాం రండి.

నుడుల పేరున నాడులు ఏర్పడినాక, తెలుగువాళ్లం కోలుపోయినది ఇంతా అంతా కాదు.

ఎనలేని ఎన్నలేనన్ని ఎన్నువ(కళ)లను ఎన్నింటినో పొరుగునుడులవారికి ఇచ్చేసినాం. ఉన్న కొన్నింటిని కూడా పట్టించుకోవడం మానేసినాం. మన లెక్కసేయమి(నిర్లక్షం)కి నిలువెత్తు ఆనవాళ్లు కోకొల్లలు. అందులో ఒకటి కొయ్యబొమ్మలాట. ఇదే తెలుగునేల, ఇవే తెలుగునాడులు అని మనం గీసేసుకొన్న గిరులను దాటి, కాస్త ఆవైపూ ఈవెంపూ తిరిగొద్దాం రండి.

అంతరవళ్ళి- ఇప్పటి కర్నాటకలో నట్టనడుమనున్న రాణీబెన్నూరు అనే పేటకు అల్లంత దవ్వున ఉండే పల్లె ఇది. కొయ్యబొమ్మలాటలకు వందలేళ్లుగా పేరు గడించిన  ఊరిది. మీకేమీ అరగలి (సందేహం) అక్కరలేదు. బొమ్మలాటలు ఇక్కడ కన్నడనుడిలోనే సాగుతాయి. ఊరంతా కన్నడనుడే వినిపిస్తుంటుంది. తెలుగును ఎరిగినవారూ ఎరుకపరచుకోగలిగినవారూ ఎవరూ దొరకరక్కడ. మరి ఇక్కడికెందుకు పిలుచుకొని వచ్చినానంటారా! అంతరవళ్ళి బొమ్మలాటల తెలుగుదనాన్ని తెలుసుకోవాలంటే, మనం కాస్త వెనక్కు నడవాలి. కాళ్లతో కాదు తలతో, అంటే తలపులతో. 

కొయ్యబొమ్మలాటను కన్నడంలో సూత్రదగొంబెయాటె అంటారు. అంతరవళ్ళి చిన్న పల్లెటూరు. ఇన్నూరో మున్నూరో ఉంటాయి ఆ ఊరిలో ఇళ్లు, ఆ పల్లెలో బొమ్మలాటవాళ్లను కనిపెట్టడం పెద్ద పనేమీ కాదు. ఆ ఇళ్లలోకి వెళ్లి, నోరారా కన్నడాన్ని నుడువుతూ అడిగితే, అప్పుడు చెబుతారు వారి వలస కతలను. వాళ్లంతా వందలేళ్ల కిందట శ్రీశైలం తావు నుండి నడి కన్నడనాడుకు వలసవచ్చిన వాళ్లమని చెబుతారు. ఆ వందలేళ్ల కిందట నుడినాడులు(బాషారాష్ట్రాలు) లేవు కదా, తెలుగువాళ్లు విందెమలలకు కింది తావునంతా పరచుకొని ఉండేవారు కదా, అందుకనే ఒక తెలుగు కళ ఇప్పటి రాయలసీమ తావునుండి ఇప్పటి కర్నాటకకు వచ్చి కుదురుకొనింది. తరి (కాలం) జరుగుతూ జరుగుతూ నుడినాడులు బిగుసుకొన్నాకఇది కన్నడకళగా మట్టుకే మిగిలిపోయింది. అవును డెబ్బైయేళ్ల కిందట కూడా తెలుగులో ఆట తెలిసినవారు ఉండేవారంట అంతరవళ్ళిలో. అన్నట్టు చెప్పడం మరచిపోయినాను. ఈ ఆటగాళ్లు పాకనాటికాపు కుదురుకు చెందినవారు. పాకనాడు అంటే ఇప్పటి నెల్లూరుజిల్లా అని తెలుసుకదా! 

కారవళ్ళి  ఇప్పటి తమిళనాడులో  సేలం అనే నగరం పేరును వినే ఉంటారు. ఆవూరి నిక్కపు (అసలు) పేరు చేలము. నేతపనికి పేరు గడిరచిన ఊరది. ఇప్పటికీ తెలుగు నేత కుదురు(కులం) వారే ఎక్కువక్కడ. ఆ చేలానికి పాతిక కిలోమీటర్ల దవ్వున ఉంటుంది కారవళ్ళి. పాతతరిలో ఈ తావును చేలనాడు అనేవారు. కొంగునాడుకు చెందిన ఇరవైనాలుగు చిరునాడులలో చేెలనాడుకూడా ఒకటి. కొంగునాడంతా తెలుగుమయం. బెదరిపోకండి, ఆ తెలుగునంతా ఇక్కడ ఏకరవు పెట్టను.

కొంగునాడులో తెక్కణపు(దక్షిణం) తావున కమ్మవారు ఎక్కువగా ఉంటే, వక్కణపు(ఉత్తరం) తావున బలిజవారు ఎక్కువ. ఇక్కడి బలిజవారిలో పలు చీలికలు ఉంటాయి. సెట్టి బలిజ, కన్నడి బలిజ, వన్నె బలిజ, పత్తి బలిజ, సుకమంచి బలిజ, ఉప్పర బలిజ, పప్పు బలిజ, పరంపర బలిజ, పూసల బలిజ, దాసరి బలిజ, కోట బలిజ… ఇట్లా ఉంటాయి ఇంకా కొన్ని, బలిజవారిని నమ్ముకొని ఆండివారు అని కుదురు ఒకటుంటుంది కొంగునాడులో. బలిజవారిలోని చీలికల కంటే  కాసిని ఎక్కువే ఉంటాయి ఆండివారి చీలికలు. ఆండివారిని  జంగాలు అని కూడా అంటారు. ఈ చీలికలలో ఆటాండివారు ఒకరు. ఆటజంగాలు అని కూడా అంటారు వీరిని. తెరువాటలనూ (వీది బాగవతాలు)తోలుబొమ్మలాటలనూ, కొయ్యబొమ్మలాటలనూ కనుబరచడం వీరి పని. వీరికి చెందినదే కారవళ్ళి కొయ్యబొమ్మలాట. ఈ తావున దీనిపేరు కట్టెబొమ్మలాటం. ఏబై అరవై ఏళ్ల కిందటి వరకూ ఆటజంగాల బొమ్మలాట తెలుగులో కూడా జరుగుతుండేది. నూరేళ్లకు వెనక్కు వెళితే తెలుగులో మట్టుకే జరుగుతుండేది. ఏబైయేళ్ల కిందట తమిళ కాపుకులానికి చెందిన వన్నియ గౌండర్లు, జంగాలవారి దగ్గర ఈ ఆటను నేర్చుకొన్నారు. మెల్లమెల్లగా ఆండివారి చేతులనుండి వన్నియర్ల చేతుల్లోకి వచ్చేసింది బొమ్మలాట. ఇప్పుడు బొమ్మలాటంఅనే పేరులో తప్ప ఆటలో తెలుగెక్కడా వినిపించదు. బలిజవారు పట్టించుకోక పోవడంతో ఆండివారు ఈ కళను వదిలేసి, పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస పోయినారు. 2008లో వెతకగా వెతకగా ఒక పల్లెలో తెలుగులో విరాటపర్వాన్ని ఆడించగలిగిన  ఆండి పెద్దాయన దొరికినాడు. ఆయన చేత తిరుచిరాపల్లిలో ఒక అరగంట కతను ఆడించగలిగినాము.

‘‘నా గోక(గొంతు)లా తెలుంగు పలికి ముప్పయి ఏండాదులు దాంటిపోడిసె. మల్లా విరాటపర్వము పలుకుతునని కలలానూ తలవలేదు సామీ నేను’’ అంటూ ఆట అయినాక, నా చేతులను పట్టుకొని బొట బొట కన్నీరు కారుస్తూ అన్నాడా కళాకారుడు. ఆయనపేరు మునిసామి. అప్పటికి ఎనబైయేళ్లు దాటినాయి ఆయనకు. ఇంకా ఉండి ఉంటారా?  

తమిళానికి మార్చుకొని తమ తలలకెత్తుకొన్న బొమ్మలాటను, పదుల పల్లెలకు పంచినారు వన్నియర్లు. ఇప్పుడు సేలంజిల్లాలో కొయ్యబొమ్మలాటలను పదికి మించిన పల్లెల కళాకారులు నూర్ల పల్లెల్లో ఆడుతున్నారు. 

తెలంగాణలోని అమ్మాపురం గురించి నాలుగే నుడుగులను నుడివి ముందుకు పోతాను. రామప్పగుడికి దగ్గరలోనే ఉంటుంది ఈ పల్లె.  ఇక్కడి బుడగజంగాలవారిలో ఒకటి రెండు కుటుంబాలలో కొయ్యబొమ్మలాట మిగిలి ఉంది ఇంకా. తెలంగాణ ఉనికి ఎసపు(ఉద్యమం) జరగకపోయుంటే ఈ కళ మిగిలి ఉండేది కాదేమో! మేమేమిటో మా ఉనికేమిటో చూపించుకోవాలని తపన కలిగిన తెలంగాణ నేల తెలివరులు మరలా వెలికి తెస్తున్న ఎన్నో పల్లెకళలలో అమ్మాపురం కొయ్యబొమ్మలాట కూడా ఒకటి.

సంత వేలూరు- ఒకప్పుడు కొయ్యబొమ్మలాటకు పేరు గడించిన  ఊరు. పంటనాడులో ఉంటుంది. పాత పంటనాడే ఇప్పటి కొత్త తిరుపతి జిల్లా. వందలేళ్లుగా పంట, పాకనాడుల్లో నిలువెత్తున నిలిచి వెలిగిన కళ ఇది. గాజులపెళ్లూరు శేషరాజు అనే కవి రాసిన లవకుశుల కతను, సంతవేలూరులోని మాలకులంవారు రామనాటకం పేరుతో కొయ్యబొమ్మలాటగా ఆడుతూ ఉండేవారు. నలబై ఏబై ఏళ్ల కిందట పంటనాడు పల్లెల్లో బతికినవారికి సంతవేలూరు రామనాటకం ఒక తీపితలపు.

పాతబొమ్మలు అటకలమీద చెదలు తిని పాడైపోతే, పాతికేళ్ల కిందట, సంతవేలూరులోని రాధాక్రిష్ణారెడ్డి అనే పెద్దాయన, మాదవమాల ఆచారులచేత బొమ్మలను చెక్కించి, రామనాటకాన్ని కొనసాగించాలని పూనుకొన్నారు. ఆయన పూనికకు తోడుపడినవారు తక్కువ. ఆంద్రప్రదేశంలోని ఏ దొరతనపు (ప్రభుత్వపు) కూటువా (సంస్థ) పట్టించుకోలేెదు.

కొయ్యబొమ్మలాట కనుబరుపు (ప్రదర్శన) చాలా గాసి (శ్రమ)తో కూడుకొన్నది. పాదాలూ చేతూలూ వేళ్లూ కళ్లూ నోరూ అన్నింటినీ వాడి ఆడిరచాలి. 2008లో తిరుచిరాపల్లిలో తెలుగువాణి అరణి (ట్రస్టు) జరిపిన తెలుగు పల్లెకళల పండుగలో కనుబరచినాక మరలా సంతవేలూరు బొమ్మలు అటకెక్కేసినాయి. రాదాక్రిష్ణారెడ్డిగారు కనుమూసినారు. బొమ్మలాటా పాటా, అంటే పాడుతూ బొమ్మలను ఆడించడం  తెలిసిన చివరి కళాకారుడు సంతవేలూరు మాలపల్లెలో నిట్టూరుస్తూ ఉన్నాడు. ఆయన పేరు మునిరామయ్యగారు. 

అంతరవళ్ళి కారవళ్ళి వంటిచోట్ల తెలుగుకళ కన్నడానికి తమిళానికి మారిపోయి నిలువెత్తున నిలచి ఉంది. అమ్మాపురంలో మినుకుమినుకుమని వెలుగుతూ ఉంది. సంతవేలూరులో కొనవూపిరితో కొట్టు కొంటూ ఉంది. ఆ కళను వదిలేద్దామా చెప్పండి. నిలబెట్టుకొందామంటే ఏం చేద్దామో కూడా చెప్పండి.

*

స వెం రమేశ్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • స.వెం.రమేష్ గారి వాక్యంలో భాష పారుతుంది.బతుకుతోంది.నా కనుల వెంట సంతోషపు కన్నీటి కాలువలు ….దండాలు తండ్రీ….

  • Dear Ramesh garu
    Your article is timely It seems to me you are well informed about the situation you can share your opinion and thoughts one idea is to collect seed money to the tune of minimum one crore rupees and use the interest money for appropriate families to continue this vanishing art
    Thanks

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు