మనోమేచకం

శోక్ నగర్ లో సీగాన పెసూనాంబకి చటుక్కున మెలుకువ వచ్చి చుట్టూ చూసింది. తనకేసి కుతూహలంగా చూసే పదిమంది కనిపించేరు. “నేనిక్కడకి ఎలా వచ్చేను. ఇదేం దేశం? మీరు చూడబోతే వేరే దేశస్థుల్లా ఉన్నట్టున్నారు?” అడిగింది లేచి నించుంటూ.

“మేము రావ్ గారి సేవకులం, ఇది లంకాపూర్ దేశం. మేము మీలాగే కనిపించినా మేము మీరు కాదు,” ఎవరో ఒకావిడ చెప్పింది, “మిమ్మల్ని మా రావ్ సీక్రెట్ గా ఎత్తుకొచ్చాడు రెండు రోజుల క్రితం; ఏమి కావాల్సి వచ్చినా చూడమని చెప్పాడు. మీరు ఆర్డర్ వెయ్యాలే గానీ ఏదైనా తీసుకొచ్చి ఇవ్వడానికి రడీ.”

“ముందు బాత్రూం ఎక్కడ చూపించు, నేను మొహం కడుక్కుని స్నానం చేసి వచ్చేలోపుల రెండు మసాలా దోశలు, వేడిగా మంచి ఫిల్టర్ కాఫీ సిద్ధంగా ఉండాలి. ఇంతకీ మీ రావ్ ఎవరు, ఎక్కడుంటాడు? వాడితో మాట్లాడ్డం ఎలా?”

“మీరు సిద్ధమవగానే కబురు చేస్తే ఆయనే ఇక్కడకి వస్తాడు. మీకు బాత్రూం ఈవిడ చూపిస్తుంది,” మరో ఆవిడని చూపించి చెప్పింది మొదటావిడ.

“ఓ, ఇంతకీ నా ఫోన్ ఏదీ?”

“మీ ఫోన్ మా రావ్ గారి దగ్గిర ఉంది. అది ఈ దేశం లో పనిచేయదు. దాని సిమ్ కార్డు మార్చి ఇస్తారేమో ఆయన్నే అడగాలి. మీరు స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి వస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు.”

***********

మసాలా దోశలు తిని న్యూస్ పేపర్ చదువుతూ ఫిల్టర్ కాఫీ తాగుతుంటే వచ్చే రావ్ కనిపించేడు సీగాన పెసూనాంబకి కి. కుతూహలంగా చూసింది వాడికేసి.

రావ్ వస్తూనే సీగాన పెసూనాంబకి కన్ను కొడుతూ చెప్పేడు, “సీగాన్, నేను నిన్ను దొంగతనంగా ఎత్తుకొచ్చాను రెండ్రోజుల క్రితం, నీ సాఫ్ట్ వేర్ స్కిల్ సెట్ గురించి తెలుసుకున్నాక. నేను ఇక్కడ లంకాపూర్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాను. దాంట్లో నువ్వు టీం లీడ్ గా చేయాలి. నిన్ను ఎత్తుకొచ్చాక నీకు నాకూ మంచి జోడీ అనిపిస్తోంది నిన్ను చూస్తే. మా కంపెనీ….”

“ఆగాగు, నేను టీం లీడ్ గా పనిచేసినది కొన్నేళ్ళ క్రితం ఏదో కంపెనీలో. అది ఇప్పటి నా ఉద్యోగానికంటే చిన్నది కనక నేను నీ దగ్గిర టీం లీడ్ గా పనిచేసే ప్రశ్నే లేదు. నీ దగ్గిర నేను పనిచేయాలంటే నువ్విచ్చే ఉద్యోగం కనీసం ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయి ఉండాలి.  జీతం, బోనస్, స్టాక్ ఆప్షన్స్, అలా అన్ని విషయాలు మాట్లాడేవరకు పనిచేస్తానో లేదో అనే సంగతి చెప్పలేను.  రెండోది, నా అనుమతి లేకుండా నన్ను ఎత్తుకొచ్చావు దొంగతనంగా. అలా పిరికి పని చేసినందుకు నీకు సిగ్గూ ఎగ్గూ లేనట్టు నీ మొహం చెప్తోంది. నాకు గుర్తున్నంతలో నేను ఆఫీసులో ఒక్కత్తినీ పనిచేస్తున్నప్పుడు ఎవరో ఇంజెక్షన్ లాంటిది గుచ్చారు చేతిమీద. తెలివి వచ్చేసరికి ఇక్కడ ఉన్నాను. మూడోది నాకూ నీకూ జోడీ అనే సంగతి. నాకు ఇప్పటికే పెళ్ళైపోయింది. మా ఆయన పేరు రామన్, ఆయన, నేనూ ప్రోజక్ట్ పనిమీద ఇలా ఒరిస్సా వచ్చాం….”

రావ్ చిరునవ్వు నవ్వేడు, “ఆ మాత్రం తెల్సు సీగాన్, ముందే అన్నీ కనుక్కున్నాను నీ గురించి. జీతం, స్టాక్ ఆప్షన్స్ అనేవి నువ్వు ఎలా చెప్తే అలా. సి.టి.ఓ కావాలనుకున్నా ఏమీ అభ్యంతరం లేదు. ఈ మధ్యనే మా కంపెనీ పబ్లిక్ ఆఫరింగ్ కి వెళ్ళినపుడు  కనక వర్షం కురిసింది. మా కంపెనీ డైరక్టర్లు కూడా నిన్ను  దొంగతనంగా ఎత్తుకు రావడానికి వప్పుకున్నారు. మన జోడి సంగతి చెప్తాను విను. ఆ రామన్ ని మర్చిపో, ఆయన నీతో పనిచేసే మామూలు మనిషి. నీకూ ఆయనకీ పెళ్ళైందా లేదా, అనేవి మీ దేశంలో పనిచేసే రూల్స్ మాత్రమే. మాకు అలాంటివేం లేవు. ఈ దేశంలో ఒక్కొక్కడు ఎంతమందినైనా పెళ్ళాడవచ్చు. అలా చట్టం తెచ్చింది మా దేశమే. అంతెందుకు నాకే ఇప్పటికే పాతిక మంది పెళ్ళాలున్నారు. మన జోడీ కుదిరితే నీకు రెండు విధాలా లాభం. కంపెనీ లో సిటిఓ, నా ఇంట్లో సిడబ్యుఓ. ఇది నాకూ నీకూ లాభించేది కనక విన్-విన్ అనుకో.”

“సిడబ్యుఓ అంటే?” సీగాన పెసూనాంబ అనుమానంగా అడిగింది.

“ఛీప్ ఉమన్ ఆఫీసర్,” అది నీకు నచ్చకపోతే మరో పేరు ఏదైనా చూడు. నీ ఇష్టం వచ్చినట్టూ మార్చుకోవచ్చు. ఎవరైనా అభ్యంతరం పెడితే నాతో చెప్పు. నువ్వు రిపోర్ట్ చేసేది డైరక్ట్ గా నాకే. మధ్యవర్తులెవరూ లేరు.”

“ఇదంతా అలా సాదా సీదాగా కాఫీ తాగుతూ చెప్పేసేది కాదు కానీ, ఇంతకీ నా ఫోన్ ఏమైంది?”

“ఇదిగో నీ ఫోన్, అది ఇక్కడ పనిచేయకుండా చేసాం. ఇది మరో కొత్త ఫోన్. దీంట్లో ఈ దేశంలో పనిచేసే సిమ్ కార్డు పెట్టాం. కొత్త ఫోన్ లో ఫేసుబుక్కూ, ఇన్ స్టాగ్రాం, ఎక్స్ లేదా ట్విట్టరూ, వగైరాలు పనిచేయవు. నీ పాత ఫోన్ బేకప్ తీసి పూర్తిగా చెరిపేసాం. ఆ బేకప్ కాపీ నా దగ్గిర ఉంది.  సో, పాత ఫోన్ లో ఏ నెంబర్లు వెతికినా ఉండవు. కొత్త ఫోన్ తో నువ్వు రామన్ కి కానీ మీ దేశంలో అమ్మా, నాన్నా, మామా, అత్తగారు, మరదలూ అలా ఎవరికైనా  ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే పనిచేయకుండా బ్లాక్ పెట్టాం. అందువల్ల ఉత్తినే టైమ్ వేస్ట్ చేసుకోకు. కొత్తఫోన్ లో నా నెంబర్ మొదటిది. ఎప్పుడు ఏమి కావాల్సి వచ్చినా కాల్ చేయి లేదా మెసేజ్ పంపించు. ఈ మధ్యాహ్నం హెచ్ ఆర్ ఆఫీసర్ వచ్చి నీకు ఓరియెంటేషన్ ఇచ్చి మా సాఫ్ట్ వేర్ కంపెనీ చూపిస్తుంది. ఆ తర్వాత రాత్రి పొద్దుపోయేవరకూ లంకాపూర్ చూడ్డానికి, పడవ మీద కేండిల్ లైట్ డిన్నర్ పార్టీకీ సిద్ధంగా ఉండు,”  రావ్ లేచి చెప్పేడు.

***********

“సీగాన్ ని వెతకడానికి బయల్దేరదామా?” లఖన్ అడిగేడు, బాగా డీలా పడిన రామన్ ని.

“ఎందుకు బ్రో, మారీచ్ అనేది వైరస్; ఓపెన్ చేయను మొర్రో అంటూంటే ఓపెన్ చేయమంది.  సీగాన్ ని  ఎత్తుకుపోయింది ఏ రాన్ సంవేర్ హేకర్ వాడో అయితే మిలియన్ డాలర్లు ఇస్తే తప్ప వదలను అంటాడు. అంత డబ్బు మనకెక్కడిది?”

“మిలియనీర్ కంపెనీ ఓనర్ సుగ్రీవన్ గాణ్ణి అడుగుదాం. ఓ సారి సీగాన్ వెనక్కి వచ్చాక అందరం కలిసి డబ్బులు పోగుచేసి ఏదో విధంగా సుగ్రీవన్ ఇచ్చిన అప్పు తీర్చేయవచ్చు.”

“సుగ్రీవన్ ఇవ్వనంటే?”

“డూడ్, అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు; ముందు సీగాన్ ని విడిపించుకు రావడం ముఖ్యం కదా?”

“సరే సుగ్రీవన్ దగ్గిరకి పోయి అడిగి చూద్దాం.”

రామన్, లఖన్ కంపెనీ ఓనర్ సుగ్రీవన్ ఆఫీసుకొచ్చాక రామన్ అడిగాడు, “ఎవరు సీగాన్ ఎత్తుకుపోయారో తెలియదు. కనుక్కోవాలంటే ముందు ఒక మాంఛి ఐబిఎం డీప్ బ్లూ లాంటి కంప్యూటర్ ఉండాలి. రాన్ సంవేర్ హేకర్ అయితే డబ్బులు అడుగుతారు కనక మీరు ఏమైనా డబ్బులు సర్దగలరా? సీగాన పెసూనాంబ వెనక్కి వచ్చేసాక మా ప్రోజెక్ట్ అయిన వెంఠనే ఇంటికెళ్ళి ఎవరి కాళ్ళో చేతులో పట్టుకుని ఎలాగోలాగ మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం.”

కాసేపు మౌనం తర్వాత గంభీరంగా చెప్పేడు సుగ్రీవన్, “నీకు కలిగిన నష్టం/కష్టానికి సారీ కానీ డబ్బులు సర్దమంటే కష్టం. నేను ఈ కంపెనీ కొనక ముందు పాత ఓనర్ దాదాపు ప్రతీనెలా ఏదో దేశానికి వెళ్లడం మందీ మార్బలంతో, అక్కడ ఇష్టం వచ్చినట్టూ డబ్బులు తగలేయడం చేసాడు. ఆయన ప్రయాణం, మిగతా వాటికీ కట్టాక ఇప్పుడు బేంక్ లో పైసా లేదు. నెల నెలా వచ్చే డబ్బులు జీతాలకే సరిపోతున్నాయి కటాకటీగా.  మార్కెట్ లో మన స్టాక్ గురించి చెప్పేదేముంది? ఓనర్ గా నేను కొత్త. కొత్త ఖర్చులు తట్టుకోలేం, అయితే మన కంపెనీలో పాత ఓనర్ పెట్టించిన ఐబిఎం డీప్ బ్లూ కి కనక్షన్, రెండేళ్ల కంట్రాక్ట్ ఉన్నాయి . అది వాడుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు. అది వాడి సీగాన పెసూనాంబ ఎక్కడుందో తెలుసుకుందాం ముందు. అంతవరకూ నేను సహాయం చేయగలను కానీ డబ్బుల విషయం చాలా కష్టం, కుదరదు.”

“ఈ డీప్ బ్లూ వాడడం తెల్సినవారు ఎంతమంది ఉన్నారు మీ దగ్గిర?”

“హను తప్ప ఎవరూ లేరు. హను కూడా దాన్ని వాడి కొంతకాలం అయింది; కానీ హను తప్పకుండా చేసిపెట్టగలడు. కొంచెం సమయం పట్టినా.”

“హను ని ఎక్కడ కలుసుకోవచ్చు?”

“ఇక్కడే ఉన్నాడు పిలుద్దాం; ఇప్పుడే కలుసుకోవచ్చు.”

తన దగ్గిరకొచ్చిన హను తో  చెప్పాడు రామన్, “నా వేలి వుంగరం ఫోటో నీ దగ్గిర ఉన్న స్మార్ట్ ఫోన్ తో తీసుకో. డీప్ బ్లూ లో వెదికినప్పుడు ఈ వుంగరం ఇమేజ్ తో కూడా వెతికితే సీగాన పెసూనాంబ జాడ తెలియవచ్చు. కొత్తగా వచ్చిన  ఎ.ఐ టెక్నాలజీ తో  కూడా వెతకడం మర్చిపోకు సుమా?”

హను  తన స్మార్ట్ ఫోన్ లో రామన్ వుంగరం ఫోటో తీసి బయల్దేరాడు. కూడా వచ్చే అంగదన్ అడిగేడు, హను ని జనాంతికంగా, “రామన్ ప్రోజక్ట్ లో ఇక్కడకి వచ్చి ఏళ్ళూ పూళ్ళూ అయింది కదా ఈయనకి కొత్త ఏ.ఐ టెక్నాలజీ గురించి ఎలా తెల్సిందంటావ్?”

“ఇంటర్నెట్ మహిమ బాస్, అసలే ఆయన పనిచేసేది సాఫ్ట్ వేర్ లో. ఇంటర్నెట్ రాక ముందు ఏదైనా మనకి తెలియడానికి  చాలా రోజులు పట్టేదేమో కానీ ప్రస్తుతం రెండే రెండు నిముషాల్లో తెలిసి పోతోంది అందరికీ ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల ద్వారా,” హను చెప్పేడు సమాధానం.

***********

నాలుగు రోజులు పోయాక రావ్  సీగాన్ ని  మరోసారి చూడ్డానికి వచ్చేసరికి ఆవిడ కోపంగా కస్సుబుస్సులాడడం కనిపించింది.  ఎదురుగా కూర్చోగానే ఆవిడ చెప్పింది, “మొన్న వచ్చినప్పుడు నీకేం కావాలన్నా ఇస్తారు ఇక్కడ, ఇది అంతా నీకూ నాకూ విన్ విన్ అని ఏడిసావు కదా? ఇప్పుడు ఏమైందో తెలిసిందా?”

“సారీ ఏమైంది? నిజంగా నాకు తెలియదు,” నిజాయితీగా తప్పు ఒప్పుకుంటూ చెప్పేడు రావ్.

“నీ కంపెనీ చూడ్డానికి వెళ్ళాను. అక్కడ ఉద్యోగం చేయడం బానే ఉండొచ్చు కానీ సాయంత్రం లంకా నగరం ట్రిప్పూ, డిన్నర్ పార్టీ అంటూ ఏడిసారు. ఆ పార్టీలో నేను తినేది ఏమీ లేదు. ఏవేవో కొత్త వంటకాలు ఉన్నాయి. అవి దేంతో చేసారు అని అడిగితే సరైన సమాధానం లేదు. పొటాటో చిప్సూ, కోకోకోలా మాత్రం ఉన్నై అంతే. ఇదేనా విన్-విన్? బుద్ధుండాలి మాట్లాడే ముందు. నన్ను ఇంతదూరం ఎత్తుకొచ్చి ఇదా నువ్వు చేసే పని. నీ మొహం తగలయ్య…”

కాళ్ల బేరానికి వచ్చిన రావ్ చెప్పేడు, “క్షమించాలి ఈ ఒక్కసారికీ. నీ ఆహారపు అలవాట్లు తెలియక అలా అయింది. మరోసారి ఇలా అవదని నా ప్రామిస్. ఈ సారి నుంచి ముందు నీకు చెప్పకుండా ఏమీ చేయం. సరేనా?”

“సరే ఏదో ఒకటిలే. ఈ రోజు కూడా పొద్దున్నే టిఫెన్ మసాలా దోశ పెట్టారు. రోజూ అదే? కనీసం నన్ను అడగొద్దా? మొదటి రోజు మసాలా దోశ అన్నానని రోజూ అదే ఏడిస్తే ఎలా?”

“అది కాదు సీగాన్ అసలు విషయం. రోజూ పాయసం లాంటిది తింటే డయాబెటిస్ రావొచ్చు అని మసాలాదోశ పెట్టమని నేనే చెప్పాను. నాలుగు రోజులకే అంత కోపమా? నీకేం కావాలో చెప్తే…”

“అలా వదిలేయి రేపట్నుంచి ఏం కావాలో చెప్తాను. ఈ మాట చెప్పాలి నీతో, నీ కంపెనీ ఉద్యోగంలో జేరడానికీ, నీతో జోడీకి కొన్ని షరతులున్నై. మొదటి షరతు అమల్లో పెడితే మిగతా …”

“ఆ షరతులు ఎటువంటివైనా వప్పుకోవడానికి సిద్ధం. ఏమీ అనుమానం పెట్టుకోకు,” రావ్ చెప్పేసేడు సీగాన పెసూనాంబ చెప్పే మిగతా మాట పూర్తిగా వినకుండా.

***********

సీగాన్ ని వెతకడానికి డీప్ బ్లూ వాడి వెనక్కి వచ్చిన హను చెప్పాడు రామన్ తో, “సీగాన్ లంకా పూర్ లో ఉందని డీప్ బ్లూ ద్వారా తెల్సింది.”

“ఎలా కనిపెట్టావు దానిమీద? నా వుంగరం ఫోటో ఏమైనా సహకరించిందా?”

డీప్ బ్లూ అంటే సముద్రం అంతటి లోతైంది. అందులో మైనాక్ అనే మరో సాఫ్ట్ వేర్ టూల్  సహాయం చేస్తానంది. అదేమిటో మనకి సరిగ్గా తెలియదు, తెలియకుండా పూర్తి వివరాలు చెప్పడం మంచిది కాదు కదా? ఎందుకులే అని వద్దన్నాను. ఆ తర్వాత మొదటగా సింహి అనే ఫైర్ వాల్, దాన్ని హాక్ చేసి ముందుకి వెళ్ళి వెతుకుతుంటే లంకా పూర్ లో సీగాన పెసూనాంబ ఉంటుంది అని మరో లింక్ వల్ల తెల్సింది. అక్కడో డిమిలిట్రైజెడ్ జోన్ మీద మరో డిఫెండర్. వాటిని డిసేబుల్ చేసి లోపలకెళ్ళాక అక్కడ కంపెనీ కంప్యూటర్లలో అనానిమస్ గా లాగ్ ఇన్ అయి ఇమేజ్ లు అన్నీ వెతుకుతూంటే సీగాన పెసూనాంబ ఫోటో కనిపించింది. వెంఠనే అశోక్ నగర్ అనే చోట మరో కంప్యూటర్ని హాక్ చేసి అందులో లాగిన్ అయ్యాను. లక్కీగా అందులోనే సీగాన్ లాగిన్ అయి ఉంది. చాట్ చేసి మీ వుంగరం ఇమేజ్ చూపించేను. అంతే. ఆవిడ విషయాలు తెల్సిపోయాయి. అయితే వెంఠనే నా డిటైల్స్ అన్నీ ఆ కంపెనీ వాళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత తెల్సిందే కదా, నా ఐ.పి ఎడ్రస్, లాగిన్ డిటైల్స్ అన్నీ తీసేసి నన్ను బ్లాక్ చేసారు. అందువల్ల మరో సారి లాగిన్ అవడం అంత సులభం కాదు. మరో మారు పేరూ, స్పూఫ్ చేసిన ఐ.పి అన్నీ క్రియేట్ చేసి మరో సారి చాట్ చేయడానికి ప్రయత్నించాలి. అదైనా మీకు కావాలిస్తే సుమా?”

“ఇంతకీ సీగాన్ తో చాట్ మీద ఏమి మాట్లాడేవు? ఆవిడ ఎలా ఉంది, ఏ ప్రాజక్ట్ లో పనిచేస్తోంది?”

“రావ్ సీగాన్ కి సిటిఓ ఉద్యోగం ఇస్తానని చెప్పేట్ట. ఏదో సాఫ్ట్ వేర్ చేయించాలి ఆవిడచేత. అది చేసేలోపు రోజూ ఆవిడతో జోడీ కావాలని వేధిస్తున్నాడు – అక్కడే ఉంచేయడానికి. లేకపోతే అందరి సాఫ్ట్ వేర్ జనాల లాగానే ప్రోజెక్ట్ అయిపోగానే వేరే దేశంలో మరో కంపెనీకి వెళ్ళిపోతుందని భయం.  నెలలోపుల ఏదో ఒకటి తేల్చుకోలేకపోతే కష్టం. ఈ లోపులే ఏమి చేయాలో నిర్ణయించుకోవాలి అంది.”

“రామన్ నీ గురించే కలవరిస్తున్నాడు. నువ్వెళ్ళిపోయాక ప్రోజక్ట్ కుంటుపడింది, ఏమి చేయాలో తెలియడం లేదు. వెంఠనే నీ గురించి వెతుకుతూ నన్ను పంపించాడు అని నువ్వు చెప్పలేదా?”

“ఎందుకు చెప్పలేదు? చెప్పాను. రామన్ ని కంగారు పడవద్దని చెప్పు. నేను నెలరోజుల లోపులే వస్తాను, అదీ రావ్  చేతులు కట్టుకుని నన్ను మీ దగ్గిరకి తీసుకొస్తాడు. ఏమీ భయం లేదు అని చెప్పమంది.”

“అయితే వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లేదా? రాన్ సంవేర్ సంగతి ఏమీ చెప్పలేదా?”

“లేదు, అసలు ఆ సంగతే మాట్లాడలేదు. నువ్వూ లఖన్ మాత్రం ప్రోజక్ట్ ఆగిపోకుండా పనిచేయాలి, తాను వచ్చేసరికి; నేను లేను కదా అని ఏ మాత్రం అలక్ష్యం చేయవద్దు అని చెప్పమంది. నెలలోపుల ఖచ్చితంగా వెనక్కి వస్తాను. ఏమీ కంగారు వద్దు అని మరీ మరీ చెప్పింది.”

“సరిపోయింది; మనం ఓ నెల రోజులు చూద్దాం అయితే. ఈ లోపుల ఈ ప్రోజెక్ట్ ఏదో విధంగా అయ్యేటట్టు నేనూ లఖన్ కష్టపడతాం. వీలుంటే మిగతావారందరూ తలో చేయి వేద్దురుగాని.”

ఇదంతా విన్నాక ఏ కష్టాలూ లేకుండా తమ ప్రోజక్ట్ ముందుకి నడుస్తుందని సుగ్రీవన్ ఊపిరి పీల్చుకున్నాడు.

***********

మరోసారి రావ్ తన దగ్గిరకొచ్చినప్పుడు చెప్పింది సీగాన పెసూనాంబ “నేను చెప్పిన షరతులన్నీ ఒప్పుకుంటానన్నావు కనక మొదటి షరతు ఇది, “కంపెనీలో నేను సిటిఓ అయ్యాక నాకు కావాల్సింది ఓ ప్రైవేట్ జెట్ విమానం, కంపెనీలో లక్ష షేర్లు. అవి ఎప్పుడైనా నేను నా ఇష్ట ప్రకారం అమ్ముకోవడానికీ, వేరే వారికి మార్చుకోవడానికీ సులభంగా ఉండాలి….”

“గ్రాంటెడ్, ప్రైవేట్ విమానం పుష్పక్ సిద్ధంగా ఉంది. నువ్వు అడగాలి కానీ ఎన్ని షేర్లు కావాలిస్తే అన్నీ నీవే కంపెనీలో. ఉద్యోగం సంగతి, షేర్ల సంగతీ చెప్పావు కానీ సిడబ్లూ ఓ సంగతి చెప్పావు కాదు,” రావణుడు వెకిలి నవ్వుతో, నాలిక తడుపుకుంటూ అన్నాడు.

“నేను సి డబ్ల్యూఓ  కావడానికి పదిహేనురోజుల ముందే మొత్తం మీ కంపెనీలో, ఇంట్లో ఆడా మొగా అందరికీ పేర్లు నా పేరుతో మొదలయ్యేలా మార్చాలి.”

“అంటే?” అర్ధం కాని రావ్ అడిగేడు.

“అది కూడా నేనే చెప్పాలన్నమాట, ఖర్మ కాకపోతే. నీ దగ్గిరపనిచేసే వాళ్ళపేర్లు కొన్ని చెప్పు.”

“ధరన్, దుర్ధరన్, ప్రహస్తన్, పార్శ్వన్, వీరపార్శ్వన్, మహాపార్శ్వన్, కుంభన్, నికుంభన్, ముష్టిన్, వీరముష్టిన్, అతిముష్టిన్, వజ్రముష్ఙిన్, అక్షన్, అక్షయకుమారన్, రూపాక్షన్, విరూపాక్షన్, స్వరూపాక్షన్, ముఖన్, దుర్ముఖన్, మత్తన్, ఉన్మత్తన్ ఇలా చాలామంది ఉన్నారు.”

“వీళ్ల పేర్లు ఇలా మారతాయి అయితే, సీగాన్ ధరన్, సీగాన్ హస్తన్, సీగాన్ పార్శ్వన్, సీగాన్ ముష్టిన్, సీగానాక్షన్ , సీగాన్ కుమారన్, వగైరా ఇప్పుడు అర్ధమైందా? పేర్ల బట్టి వారు చేసే ఉద్యోగాలూ మారాలి.”

“మరి నా పేరు, మా ఆవిడ, తమ్ముళ్ల పేర్లు కూడానా?” అనుమానంగా అడిగేడు రావ్.

“ఔను, ఇప్పట్నుంచి నువ్వు సీగాన్ రావ్, తమ్ముళ్ళు సీగానాషణ్, సీగాకర్ణన్ అవుతారు. మీ ఆవిడ కొత్తపేరు సీగాన్ ధర. నీ చెల్లిపేరు సీగాన్ నఖ. ఎవరి పేరుకైనా ఉత్తి ‘సీ’ అని తగిలించి సీరూపాక్ష, సీవిరూపాక్ష, సీముష్టి అని పెట్టడం కుదరదు, మొత్తం ‘సీగాన్’ అనే పేరు ఉండవల్సిందే మొదట్లో. సీగాన పెసూనాంబ పేరు తగిలించాక మీ పేర్లలో పెసూనాంబ అనేది  కత్తిరించుకోదలిస్తే సరే కానీ సీగాన్ అనేది మాత్రం ప్రతీ ఒక్కరికీ మొదట్లో ఉండి తీరాలి.”

“ఇలా పేర్లు మార్చడం వల్ల నీకు ఏమిటి ఉపయోగం?”

“నువ్వు నన్ను సి డబ్ల్యూఓ  చేయడానికి ఏం చెప్పినా చేస్తానన్నావుగా? కళ్ళు మూసుకుపోయి నన్ను ఎత్తుకొచ్చావు దొంగతనంగా, నీ మనోమేచకం తగలెయ్య!” కోపంగా అంది సీత.

“ఏమిటి మేక కుచమా? అది కూడా మార్చాలా?”

“ఓరి దరిద్రుడా, మనో మేచకం, మేక కుచం కాదు.”

“అంటే ఏమిటి?”

“ఓరి పిచ్చి వెధవా, ఏమి ఊడబొడుద్దామని నన్ను తీసుకొచ్చావ్? నేను మాట్లాడేదే నీకు అర్ధం కాదు. ఆ మాత్రం బుర్రలేని నువ్వూ ఓ కంపెనీ ఓనరు వే ?”

“మనో మేచకం అంటే అర్ధం కాలేదు. సారీ, నేను మేక అనే వైరస్ గురించి ఇంటర్నెట్ మీద చూసి వస్తున్నాను. అందువల్ల మేక మనసులో మెదుల్తూంటే అలా అన్నాను. నువ్వు చెప్పిన పేర్లు మార్చడానికి ఓ వారం పదిరోజులు పడుతుంది. ఫర్వాలేదా?”

“ఎవరికి ఫర్వా? నన్ను ఎత్తుకొచ్చింది నువ్వేకదా?”

“ఈ పేర్ల మార్పిడిలో కొంచెం గొడవలు రావొచ్చు; అది ఎలాగో లొసుగులు లేకుండా సాధించాలి కానీ నువ్వే చెప్పు ఇదంతా ఎలా చేయాలో, రాజ్యంలో గొడవలు రాకుండా.”

“మనో మేచకం అంటే ఏవిటీ, పేర్లు మారిస్తే ఎలా అంటూ అన్నీ నేనే చెప్తే ఇంక నువ్వు చేసేదేవిటి? నువ్వేం చేతకాని దద్దమ్మవి? నాకూ నీకూ జోడీ ఏవిటి? ఫో అవతలకి.”

***********

అన్న సీగాన్ రావ్ ని చూడ్డానికి వచ్చిన సీగాన్ షణ్ చెప్పాడు, “అన్నా కొంపలు మునుగుతున్నై నువ్వు చేసిన ఈ పేర్ల మార్పిడి ఆర్డర్ కి. దీన్ని వెంటనే ఉపసంహరించండి.”

“ఏమైంది? నేను కంపెనీలో నా ఇష్టం వచ్చినట్టూ చేయగలను. ఎవరి కొంపలు ఎలా పోతే నాకేం? నేను సీగాన్ ని పెళ్ళి చేసుకోవడానికి, సాఫ్ట్ వేర్ తయారీకి రహస్యంగా ఎత్తుకొచ్చి తెచ్చుకున్నాను. నా ఇంట్లో సిడబ్ల్యుఓ కావడానికి సీగాన పెసూనాంబ ఇచ్చిన ఆర్డర్ అది. దాన్ని ఉపసంహరించడం కల్ల.”

“రాజ్యంలో జరుగుతున్న అల్లకల్లోలం నీకు తెలిసినట్టు లేదు కనక చూచాయగా జరుగుతున్నది చెప్తాను విను. మేఘనాధ్ అనే పేరు సీగాన్ నాధ్  అయింది. సీగాన్ నాధ్ అనేవాడు లంకాపూర్ – అదే సీగాన్ పూర్ లో లేనేలేడు. అందువల్ల సీగాన్ నాధుడెవరా అని పోస్ట్ ఆఫీసువాళ్ళు ఎ.ఐ లో వెతికితే సీగాన్ నాధుడంటే రామన్ అని వచ్చింది. అది పట్టుకుని మన మేఘనాధ్ ఇంటికెళ్లవల్సిన గవర్నమెంట్ సీక్రెట్ డాక్యుమెంట్లూ, వాళ్ళావిడ రాసిన లవ్వు లెటర్లూ రామన్ కి పంపేసారు. మన రహస్యాలన్నీ ఇప్పుడు రామన్ దగ్గిర ఉన్నై….”

“ఆగాగు ఈ పోస్ట్ ఆఫీసుకి బుద్ధీ జ్ఞానం లేదా? ఎ. ఐ చూడ్డం దేనికీ?”

“యధా రాజా తధా ప్రజా అని కదా నానుడి? నువ్వే బుర్రలేని ఐడియాలు వేస్తూంటే ప్రజలు అదే దారిలో పోతున్నారు. అయినా రూల్స్ ప్రకారం సీగాన్ నాధ్ అంటే రామన్, సీగాన్ ని ఎత్తుకొచ్చాక నువ్వు రామన్ కి ఏవో ముఖ్యమైన కాయితాలు  పంపుతున్నావు అనుకున్నారు పోస్టాఫీసు వాళ్ళు. తప్పు వాళ్ళది కాదు ఆలోచించు.”

“ఇంకా ఏమిటి కొంపలు ములిగే గొడవలు?”

“లంకాపూర్ లో రిటైరైన ఉద్యోగుల పేర్లు కలగా పులగం అయిపోయి ఇద్దరు సీగాన్ కేతన్ లూ, ఇద్దరు సీగాన్ మాలిలూ తయారయ్యారు. వీళ్ళకి పెన్షన్ చెక్కులు పంపినప్పుడు ఒకరివి మరొకరికి పోయి ఇలా ఒకరికి ఎక్కువా ఒకరికి తక్కువా రిటైర్మెంట్ డబ్బులు పంపుతున్నావని తెలిసి కంగాళీ అయింది. మన రిటైమెంట్ ఉద్యోగులు ఇది చూసి నీమీద గుర్రుగా ఉన్నారు. అది చాలదా?”

సీగాన్ రావ్ కొంచెం కంగారు పడ్డా తమాయించుకుని అడిగాడు, “ఇంకా ఏమైనా గొడవలు అవుతున్నాయా?”

“వాట్సాప్ లో ఒకరి పేరు మరొకరికీ ఇద్దరు లేదా ముగ్గురికీ ఒకే పేరు రావడం, ఫోన్ నెంబర్లు కలిసిపోవడం, ఎవరు ఎవరితో మట్లాడుతున్నారో తెలియక ఒకరి రహస్యాలు మరొకరికి తెల్సిపోతున్నై. సీగాన్ పార్శ్వన్ అనేవాడికి మెసేజ్ పంపించేసరికి అది సీగాన్ వీరపార్శ్వన్, సీగాన్ మహాపార్శ్వన్ అనే అందరికీ జేరిపోతోంది. అలాగే కుంభన్, నికుంభన్ అనే ఇద్దరికీ తేడా తెలియడం లేదు.  ఇదే అన్నిచోటా జరుగుతోంది – ఫేసుబుక్కూ, ఇన్ స్టాగ్రాం, ఎక్స్ లేదా ట్విట్టర్ అనే మాధ్యమాల్లో.”

“అదేమిటి ఫోన్ కంపెనీలన్నీ ఏం జేస్తున్నాయి? పేరు కాదు కానీ ఫోన్ నెంబర్ తో కదా వాట్సాప్ పనిచేసేది?”

“అవును కానీ ఒకేసారి అందరికీ పేర్లు మారేసరికి ఫోన్ కంపెనీల సాఫ్ట్ వేర్ క్రాష్ అయిందిట. అది బాగుచేయడానికి కనీసం రెండు నెలలు పడుతుంది. నువ్వేమో ఇదంతా పదిరోజుల్లో అవ్వాలని ఆర్డర్ వేసావు కదా?”

“రాజ్యంలో మహిళలకేం ప్రమాదం జరగలేదు కదా?” నీరసంగా అడిగేడు సీగాన్ రావ్.

“నువ్వు అడక్కేం? సఖి, వీరసఖి అనేవాళ్ళు ఇప్పుడు సీగాన్ సఖులయ్యారు. పేర్ల ప్రకారం వాళ్ళు సీగాన్ కి స్నేహితులుట. అందువల్ల వాళ్ళు సీగాన పెసూనాంబ దగ్గిరకివెళ్ళి పోయి ఆవిడకి అంత:పుర రహస్యాలన్నీ చెప్పేస్తూ కులుకుతున్నారు.  సీగాన్ జట అనేఆవిడ సీగాన్ కి రోజూ తలంటు పోసి జడ వేస్తోంది. మన చెల్లెలు సీగాన్ నఖ ఇంకా దారుణం. పేరు మారాక ఇప్పుడు సీగాన పెసూనాంబ కాలిగోర్లకి సంరక్షణ చేస్తోంది. సీగాన్ ముఖి అనే మన మహిళకి సీగాన పెసూనాంబ మొహానికి మేకప్ వేయడానికే సమయం చాలడం లేదు. సీగాన్ కర్ణ గాఢ నిద్రలో ఉన్నాడు కనక వాడికివేమీ తెలియవు కానీ లేకపోతే లేచి మన రహస్యాలన్నీ సీగాన పెసూనాంబ చెవిలో చెప్పేసేవాడు. ఇంక మిగతావి చెప్పడం ఎందుకులే, కడుపుచించుకుంటే కాళ్లమీద పడుతుంది.”

“ఇవన్నీ ఎలాగో ఒకలాగ సర్దుకోవూ?”

“అన్నా సర్దుకోవడానికి రెండు నుంచి ఆరు నెలలు పట్టొచ్చు. కానీ నువ్వు సీగాన్ ని నెలలోపులే జోడీగా చేసుకోవాలి అని పెట్టావుట కదా రూల్స్? అన్నింటికన్నా దారుణం నా స్నేహితుల్లో ఒకరైన సంపత్ అనేవాడికే జరిగింది. వాడి పేరు సీగాన్ పత్ అయిపోయి ‘నా పేరు ప్రకారం సీగాన పెసూనాంబ నాది, సీగాన్ రావ్ ఎవడు నా భార్యని ఎత్తుకుపోవడానికి?’ అంటున్నాడు. దీనికేం చెప్తావ్? మన రాజ్యం పేరు కూడా సీగాన్ పూర్  అయిపోయి వచ్చే పోయే ఇంటర్నేషనల్ మెయిల్ అంతా బ్లాక్ అయి ఉంది. పేరు మార్పిడితో అంతా గజిబిజి అయిపోయి సీలంక, సీగా లంక, సీగాన్ లంక, పెసూన్ లంకా, అని కొంతమంది రాస్తూంటే ఆ మెయిల్ వేరే దేశానిది అనుకుని మనకి పంపడం లేదు.  ఇదంతా పీకలమీదకి వచ్చి నువ్వూ నేనూ కూడా మిగలం మూడునెలల్లో; సర్దుకోవడం సంగతి తర్వాత చూద్దాం. నువ్వు చేసే ఈ తిక్క పనులు చూసి ప్రజలు ఈయన మన అసలు రావ్ గారేనా అంటున్నారు.”

“అయితే ఏం చేద్దాం సీగాన్ షణ్?”

“ఆవిడని రామన్ దగ్గిర దింపేసిరా. నీతో జోడీ కాకుండానే నిన్నూ నన్నూ మన కంపెనీని ముప్పుతిప్పలు పెడుతోంది ఒకే ఒక షరతుతో, ఈవిడని జోడీగా చేసుకుంటే ఏమౌతుందో ఆలోచించు.””

***********

ఉరుకులు పరుగులతో తన దగ్గిరకి వచ్చిన రావ్ ని చూసి అడిగింది సీగాన్, “ఏం సంగతి?”

“అమ్మా తల్లీ బుద్ధి తక్కువై నిన్ను ఇక్కడకి తెచ్చాను. నువ్వు చెప్పిన మొదటి షరతు పనిచేయడం లేదు. నేనూ నా కంపెనీ నాశనం ఐపోయేలా ఉన్నాం నువ్వు చెప్పిన పేరు మార్పుతోనే. సామాను సర్దుకో, నిన్ను రామన్ దగ్గిర దింపేసి వస్తా.”

“ఆ మాత్రం చిన్న మార్పు చేయలేనివాడివి నువ్వు ఏమన్న కంపెనీ ఓనర్ వి? మనుషులు ఒకరికొకరు విడివిడిగా తెలియాలంటే ఆధార్ కార్డో, సోషల్ సెక్యూరిటీ కార్డో లేదా మీ రాజ్యంలో?”

“తల్లీ నీకూ నీ ఐడియాలకీ ఓ నమస్కారం. ఆధార్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ కార్డ్ అనేవి ఏమిటి అని అడిగితే నన్ను తిడతావు మరోసారి. రెండు గంటల్లో మనం బయల్దేరుతున్నాం రామన్ దగ్గిరకి. అక్కడకెళ్ళాక ఈ ఆధార్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ కార్డ్ అనే విషయాలు చెప్దువు గాని.” వచ్చినవాడు వచ్చినట్టే కంగారుగా వెళ్ళబోయేడు రావ్.

“నా పాత ఫోన్ బేకప్ రిస్టోర్ చేసి, సిమ్ కార్డు పెట్టి పనిచేసేలా చూసి పట్టుకురా వెళ్ళేముందు, లేకపోతే చూస్కో మరి” చూపుడు వేలితో సీగాన పెసూనాంబ వార్నింగ్ ఇస్తూ వెనకనుంచి అరిచింది.

***********

ఫలానా సమయానికి తాను వెనక్కి వస్తున్నట్టు సీగాన పెసూనాంబ వాట్సాప్ మెసేజ్ పంపగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది, హనుకి తప్ప. హను చెప్పాడు, ‘నేను ముందే చెప్పాను కదా, సీగాన పెసూనాంబ రావ్ దగ్గిర్నుంచి నెలలోపు వచ్చేస్తుందని? నాకు తెలిసినంతలో ఆవిడ తనని తన కూడా పనిచేసేవాళ్లనీ, ఎంత కష్టమైనా  సరే తాను చేసే ప్రోజక్ట్ నీ ఖరాబు కాకుండా రక్షించుకోగలదు.”

విమానం దిగి వస్తున్న సీగాన పెసూనాంబని  రామన్, లఖన్, సుగ్రీవన్, హను స్వాగతించారు. వారి వెనకనే అంగదన్  జాంబవన్ లు చిరునవ్వుతో. సీగాన పెసూనాంబ వెనకే వచ్చిన రావ్ మొహం వాడిపోయి ఉంది. ఆయన తమ్ముడు మాత్రం విమానం దిగిన ప్రెసిడెంట్ వెనక వచ్చే అందరి గవర్నమెంట్ మంత్రు లలాగానే గంభీరంగా ఉన్నాడు – మొహంలో నవ్వూ లేదు, దరహాసమూ లేదు.

రామన్ కి షేక్ హేండ్ ఇచ్చాక రావ్ చెప్పాడు, సీగాన్ ని సాఫ్ట్ వేర్ కంపెనీ కోసం ఎందుకు తీసుకెళ్ళాడో, ఆవిడని తన జోడీ చేసుకుంటానంటే ఆవిడ పెట్టిన షరతులూ, ఆ షరతు ప్రకారం తన కంపెనీ అల్లకల్లోలం అవుతూంటే తమ్ముడి సలహా ప్రకారం సీగాన్ ని వెనక్కి తీసుకురావడం అవీ. అన్నీ చెప్పి అన్నాడు, “సారీ రామన్, నేను సీగాన్ ఒక్కసారి కూడా చేత్తో ముట్టుకోలేదు. ఈవిడ చెప్పే షరతులకే నా రాజ్యం పోయినంత పనైంది. ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే, మీరిద్దరూ ఇక్కడ మీ ప్రోజక్ట్ అయిపోయాక మా రాజ్యానికొచ్చి ఈ ఆధార్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ కార్డ్ అనేవి ఏమిటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తే ఆ ప్రోజక్ట్ మీకు వచ్చేలా చూస్తాను.ఈ సారికి నన్ను వదిలేయండి.”

రామన్ కోపంగా ఏదో అనబోయేడు కానీ సుగ్రీవన్  వారించాడు, “మనకి ముందు ముందు ప్రోజక్ట్ ఇస్తానంటున్నాడు కదా, వదిలేద్దాం. అలా వదిలేస్తే రేప్పొద్దున్న మనకొచ్చే ప్రోజక్ట్ లో ఏమైన అవకతవకలు వస్తే ఈయనో కాపు కాస్తాడు మనల్ని.  సీగాన పెసూనాంబ చూసావా సులభంగా ఈ రావ్ ని ముక్కుతాడు కట్టి ఎలా వెనక్కి ఈడ్చుకొచ్చిందో? సీగాన్ లాంటి బ్రిలియంట్ సిటిఓ ఉన్నంతకాలం మనకేమీ ఢోకా లేదు.”

హను, అంగదన్ చెప్పారు ఒకే కంఠంతో, “అయితే శుభం కార్డు పడినట్టే, సర్వేజనాః సుఖినోభవంతు. ఈ రాత్రికి రావ్ ని మనకి గెస్ట్ గా ఉండి రేపు వెళ్ళమంటే బాగుంటుందేమో?”

“వద్దు వద్దు మేము వెళ్ళాలి. సీగాన పెసూనాంబ పెట్టిన షరతుతో సృష్టించిన గందరగోళం సరిదిద్దాలి,” రావ్ చెప్పాడు కంగారుగా.

సీగాన్ షణ్ మొహంలో ఈసారి చిరునవ్వు అరక్షణం కదలాడ్డం గమనించి సీగాన పెసూనాంబ అంది “సరే అయితే వెళ్ళిరండి. ఆధార్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ కార్డ్ గురించి డిటైల్స్ ఎప్పుడు కావాలో చెప్తే …”

దీనికి సీగాన్ షణ్ చేతులు జోడించి చెప్పాడు, “తల్లీ ఇప్పుడు కాదు, ముందు లంకాపూర్ లో జరిగిన కంగాళీ అంతా సరిదిద్దాక మరోసారి వస్తాం. ఇప్పటికి ఇంక మమ్మల్ని వదిలేయ్!”

“సరే అయితే ఎప్పుడు సాఫ్ట్ వేర్ సహాయం కావాలన్నా రామన్ వాట్సాప్ కి ఓ మెసేజ్ పంపించు, హావ్ ఎ గుడ్ వన్ అండ్ టేక్ కేర్.’

మిగతావారు వెనగ్గా ఆగి ఉండగా విమానం ఎక్కడానికి వెళ్ళిపోయే రావ్ కూడా రామన్ ముందుకి నడిచాడు వాళ్ళని సాగనంపడానికి. విమానం ఎక్కే ముందు రావ్, రామన్ భుజమ్మీద చెయ్యేసి పక్కకి తీసుకెళ్ళి చిన్న గొంతుతో అన్నాడు, “రామన్, ఏమనుకోకపోతే ఓ మాట చెప్తాను విను. సీగాన పెసూనాంబ మీ ఆవిడ కదా అని ఏమి అడిగినా వెంఠనే సరే అనేయకు. పీకలమీదకి రావొచ్చు.”

రామన్ చిరునవ్వు నవ్వి చెప్పేడు, “పెళ్ళయ్యాక ఆ మాత్రం తెలిసిందిలే, మీ కంపెనీ నుంచి ముందు మారీచ్ అనే వైరస్  వచ్చినప్పుడు ‘అది వైరస్, అసలు ముట్టుకోవద్దు మొర్రో’ అని ఎంత చెప్పినా వినక ఆ వైరస్ డాక్యుమెంట్ ఓపెన్ చేయమంది. సరే పోయేదేముంది సిటిఓ చెప్తోంది కదా అని ఓపెన్ చేసాను. ఆ తర్వాత జరిగింది నీకు తెల్సినదే. నా కంప్యూటర్ ఖరాబు అయిపోయింది. దాన్ని క్లీన్ చేయించడానికి బయట షాపుకి వెళ్ళినప్పుడు సీగాన పెసూనాంబ ఆఫీసులో ఒక్కత్తీ ఉంటే నువ్వొచ్చి ఆవిడకి మత్తుమందు ఇచ్చి తీసుకెళ్ళావు. ఆ తర్వాత ఆవిడ పెట్టిన షరతులు ఒప్పుకుంటే నీకూ పీకలమీదకి వచ్చింది కదా? మనం ఇద్దరం సరైన పాఠం నేర్చుకున్నాం.”

**********

విమానం గాల్లోకి లేచాక, రావ్ అన్నాడు సీగాన్ షణ్ తో, “ఈ సీగాన్, రామన్ ల కి ఈ ఆధార్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ కార్డ్ అనే కొత్త ప్రోజక్ట్ ఇవ్వాలి కదా దీని సంగతి ఆలోచించి నాకు చెప్పు రెండురోజుల్లో.”

“ఈ ఆధార్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ కార్డ్ అనేవి ఆయా దేశాలకి సంబంధించిన పదాలు. వాటిని వాడితే నమోగారు, బైడెన్ గారూ మన మీద గుర్రుగా కాపీరైట్ కేసులు వేస్తారేమో తెలీదు. అసలే కమలం పార్టీ ఇండియాలోనూ, ఎరుపు రంగు పార్టీ అమెరికాలోనూ బాగా పుంజుకుంటున్నై. ఇలా సీగాన్ రామన్ లకి ప్రోజక్ట్ ఇచ్చేద్దాం అనుకోవడం అంత ఈజీవీజీ కాదు. ఆలోచిద్దాం. ముందు మనం వెళ్ళాక చేతికి అంటుకున్న బురద – అదే నువ్వు అందరికీ అంటించిన బురద, కడిగి జీవితాలు దార్లో పెట్టాలి. మిగతావి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో.”

సీగాన్ రావ్, సీగాన్ షణ్ కేసి గుర్రుగా చూసి, సీటు బెల్టు వదులుచేసుకుని నిద్రకి ఉపక్రమించాడు.

సీగాన్ రావ్ నిద్రపోయినట్టు నిర్ధారించుకున్నాక సీగాన్ షణ్ ని ఆయన చిన్న మంత్రి అడిగేడు, “గండం గడిచినట్టేనా?”

“ఆ, ప్రస్తుతానికి గడిచినట్టే కానీ మనం పడగ నీడన బతుకుతున్నాం కనక ఈ పెద్దాయన ఎప్పుడు ఏది పీకలమీదకి తీసుకొస్తాడో చెప్పలేం. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే.” సీగాన్ షణ్ నవ్వుతూ నిద్రపోవడానికి కళ్ళుమూసుకున్నాడు.

తాజాకలం: ఈ కధ పూర్తిగా నా రాక్షస, స్వకపోల, మనోమేచక కల్పన. ఇందులో వాడిన పేర్లు పూర్తిగా కల్పన మాత్రమే. ఇది చదివాక మనో వికాసం(రం), కళ్ళు తెరుచుకోవడం, నవ్వు, ఏడుపూ, కోపతాపాలు రావడం జరిగితే ఈ మంత్రం చదువుకోండి – రామ రామ, రామ రామ రాక్షసాంతకం.

*

ఆర్ శర్మ దంతుర్తి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రామకథలో ఏదో గొప్పమహత్తు ఉంది. ఆ మహత్తు ఆరాముడిదా లేదా ఆయన కథదా అన్నది ఆలోచనీయం.రెండున్నూ అనుకుంటే సరిపోతుంది, బుర్ర బ్రద్దలుకొట్టుకోవటం అనవసరం.

    రాముడంటే ప్రాణం అనేవారూ రాము డస్సలు నచ్చడనేవారూ కూడా ఆరామప్రభావంలో అనండి, ఆరామకథాప్రభావంలో అనండి పడిపోయి మునిగితేలుతూనే ఉంటారు.

    అందుచేత ఉభయపక్షాలలో ఉండే కవులూ కూడా రాముడి గురించి వ్రాయకుండా ఉండలేరు గాక ఉండలేరు.

    ఈవిధంగా రాముడి కున్న వీరభక్తులూ వైరభక్తులూ కూడా ఆయన యశస్సును నిత్యం మరింతగా దిగంతవ్యాప్తం చేస్తూనే ఉన్నారు.

    సరే ఈకథ విషయానికి వద్దాం.

    రామాయణేతివృత్తంపైన ఇటువంటి పేరడీలు కొత్తవి కావు.

    సాధారణంగా మనకు ఏదైనా కథలో, కథ నచ్చి కథలోని ఏవో కొన్ని కల్పనలు నచ్చకపోవటం కద్దు. నాకైతే ఈకథలో కల్పన నచ్చి కథమాత్రం నచ్చలేదు! ఈకథలో ఉన్న గర్భదోషం ఏమిటంటే రాముడి పాత్ర ఉత్త డమ్మీ ఐపోవటం.

    పోనివ్వండి. నాకు బాగానచ్చిన సంగతి చెబుతాను. కథ చివరి వాక్యం మాత్రం బాగానచ్చింది “రామ రామ, రామ రామ రాక్షసాంతకం” అన్నది.

    శుభం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు