ఇది నీలిమ మొదటి కవిత్వ పుస్తకమని ఇట్టే తెలిసిపోవడానికి కారణం; ఇందులోని అత్యంత పసితనం ఉట్టిపడే వాక్యాలు. లేదంటే అక్కడక్కడా కనిపించే చిత్రమైన తద్విరుద్ధ భావసంచలనాలు. రెండింటిలోనూ అస్సలు దాపరికం లేకపోవడం ఇంకొక సొగసరితనం. కఠిన వర్తమానం గుండా మరొక ఆశావహ భవిష్యత్తు కోసం ఒక స్త్రీవాద కవయిత్రి చేసే ప్రయాణమే ఈ పుస్తకంలో కనిపిస్తుంది. నీలిమయే కాదు ఎవరు తాపత్రయపడ్డా ఇలాంటి వస్తువుల అంతరంగాల్లో ఇదే దేవులాట ఉంటుందేమో ! ఇదంతా ఎక్కువగా స్త్రీ చుట్టూ తిరిగిన కవిత్వమే. ‘మనుస్మృతి కాదు, స్త్రీ స్మృతి కావాలి’ అంటుంది. అలా అనుకోవడం కలకాకుండా ఉంటే ఎంత బాగుంటుందీ అనుకుంటుంది. ఏం చూడాలీ రెంటిమధ్యా మనం? ఒక స్థిరత్వంలో మరొక సంశయం.
‘టుబీ ఆర్ నాట్ టు బీ’ కవితా అలాంటిదే. వెళ్ళనా వద్దా అంటూ ప్రశ్నిస్తూనే స్త్రీ జీవితమెంత సందేహాస్పదమూ, సందిగ్ధతల నడుమ కొట్టుమిట్టాడుతోందో చెబుతుంది. ఇలా రాస్తున్నప్పుడు నీలిమ ఏం ఆలోచిస్తో ఈ వాక్యాలను ముగించిందో ఆ భావనలు చెప్పకుండానే చెప్పినట్టుంటాయి. ఈ పుస్తకంలో కొన్ని చోట్ల స్త్రీపురుష సంబంధాల గురించి నీలిమ చాలా నిరుత్సాహ, నిస్తేజపూర్వక వ్యక్తీకరణలు చేయడానికి వెనకాళ్ళేదు. ఎందుకంటే ఆమె దేన్నీ కప్పి చెప్పే ప్రయాస పళ్ళేదు. అదీ తనకి తెలియకుండానే జరిగిపోయిన విషయంగా వ్యక్తంకావడమే ఈ కవిత్వ విశేషం. ‘నువ్వొచ్చాక’ లో నువ్వొచ్చాకే నేను అదృశ్యం అయ్యి నీడగా మిగలడమంటే తెలిసింది. అంటుంది. ఆక్రమణ కవితలో – భాషే నాది, భావం నీదే, మేనే నాది, ఏలేది నీవే లాంటి వాక్యాలు ఊపిరాడనివ్వవు. తల్లి మరణించాక తన తండ్రి పరిస్తితి గురించి రాసిన ‘అమ్మ లేని నాన్న’ స్త్రీకి స్వాతంత్ర్యం కావాలని చెప్పే ‘లెట్ హర్’ కవితలు చాలా స్పూర్తివంతమైన వాస్తవికతను ప్రతిబింబిస్తాయి.
‘నువ్వూ-నేను’ కవితలో కూడా, నీది ఆగ్రహం, నాది అనుగ్రహం, నీది ఆరోహణ, నాది అవరోహణ, వెరసి నువ్వో ఆధిపత్యం, నేనో అధీనత్వం అంటుంది. సరే, నీలిమలో సంప్రదాయ సారస్వితం లేదనే అనుకుందాం, మరేమున్నట్టు ? మృగభూమి కవితలోలా, ‘ఇది నా మాతృభూమి కాదు, మగభూమి, మృగభూమి’ అంటున్నప్పుడున్న స్పష్టత బాగుంది. ‘బతకడానికి ఒక జననం సరిపోదు, రోజూ సరికొత్తగా కాస్త మరణం కూడా కావాలి’ అనేంత జ్ఞాన దరహాసం బాగుంది. ఇంకా మాట్లాడితే ‘మాకొక ఆయుధం కావాలి, గర్భ శోకం తెలిసిన ఆయుధమొకటి కావాలి. గుండె దు:ఖాన్ని తీర్చే తక్షణ ఆయుధమొకటి కావాలి’ అన్నప్పుడు అందులోని ఖచ్చితత్వం భలే భలే ఉంది. వెరసి ఈ పుస్తకమ్మొత్తమూ పాఠకులకి ‘టీచరమ్మ ఇచ్చిన సరికొత్త హోంవర్క్’ లా అనిపిస్తుంది. నీలిమ ఆ పని చెయ్యడంలో తనేమీ ప్రయోగాన్నాశించలేదు. స్పుటమైన విశ్వాసం కలిగిన కవయిత్రిగానే ప్రవర్తించింది. అందుకే నేనూ ఇందులో విరోధాభాస ఉన్నది, స్త్రీవాద విమర్శకు కొత్త సమాధానాలున్నయనలేదు. నీలిమ తెలిసో తెలియకో ఉన్నదున్నట్టు చెప్పింది. కొంత చమత్కారంగా (స్త్రీల చరిత్రలు) చెప్పింది, మరికొంత చాదస్తంగానూ చెప్పింది. కానీ నీలిమకు ప్రతిదానికీ ఓ కారణమూ, విశ్లేషణా ఉంది. లేకపోతే ‘నేను స్వరూపాన్ని తెలుసుకున్నదీ నేనే, నేనుని వదిలించుకున్నదీ నేనే’ అనదు. ఆగ్రహి అని పేరు పెట్టుకున్న పుస్తకంలోనే ‘వినమ్ర నీలిమను నేను’ అనదు. ఈ పుస్తకం కొంత మన మనశ్శాంతిని అన్నిరకాలుగా భగ్నం చేస్తుంది. ఎందుకంటే కొన్ని స్త్రీత్వపు ఆనంద విషాదాల్ని మనకు చేర్చడంలో కవయిత్రి సఫలమవుతుంది కనుక.
ఇందులో ఎంత ఉద్వేగభరితమైన వాక్యనిర్మాణం ఉందో అంత నిలకడగల, పరిణితిగల మామూలు స్త్రీ స్వరం ఉంది. ఇదొకింత ఆశ్చర్యచకితం చేసే విషయమే. ఒక ఆత్మ రెండు దేహాలు లాంటి కవితల్లోని భావ స్థిరత్వం చూస్తే హిందూ ముస్లిం జీవితాల మమేకతలోని అంతిమత్వం చెప్పగలిగిన అవగాహన ఉందా ఈ కవిలో ? అనిపిస్తుంది. ‘వెలి ప్రేమ’ ‘లవ్ @2080’ లాంటి కవితలూ అంతే. ఇందుకు చాలా విశాల దృక్పధం అవసరం. మరి మిగతావాటికో ? తతిమ్మా వన్నీ, ఆమె అనుభవంలోనివి. ఏం తలత్, బిస్మిల్లాహ్ ఖాన్లను మాత్రం తన అనుభవం కాదనగలనా ? లేకపోతే ఈ కవయిత్రి ప్రదర్శించిన బొమ్మా బొరుసులు కవిత్వ విలువను మరింత ఎలా పెంచాయి? తన తెగువను చూసి తానే మురిసిపోతుంది, లేదా అంతలో తనే భయపడిపోతుంది. బేలగా మారిపోతుంది. వాస్తవాన్ని తెలియజెప్పే పద్దతిలో కొంత మాయ అవసరం. కల్పనలో ఉండే ఆనందం ప్రోత్సహించి, ధైర్యమిచ్చి ఓదారుస్తుందంటాడు చలం. నీలిమ కవిత్వంలో కల్పన ఒక నిజాన్ని చెప్పేందుకు ఆలాంటి ప్రయత్నమే చేసింది. అందుకే ఆగ్రహి కవిత్వ సంపుటి ప్రశంసార్హమైనది.
చివరాఖరున ఆ పుస్తకం టైటిల్ కరెక్టా కాదా ? అది సంస్కృతమా తెలుగా ? అని నన్నడగవద్దు. ఖమ్మం వాళ్ళనేమన్నా అనాలంటే చాల ధైర్యమన్నా ఉండాలి లేదా పుట్టకతో వాళ్ళకబ్బే సృజనాత్మకతైనా మనకీ ఉండితీరాలి.
పాఠకులు మీ విశ్లేషణాత్మక దరహాసాన్ని ఆస్వాదిస్తూ అక్కడక్కడే తిరుగాడుతూ ఉంటారు ఆగ్రహిలోని ద్విపార్శ్వాలను తెలియజేసిన తీరు బాగుంది ..నీలిమ గారికి మీకు అభినందనలు
శ్రీరాం గారూ… మొదటిసారి ఏ విమర్శా లేని మీ వ్యాసం చదివాను…( చివరి లో సరదాగా రాసిన రెండు వాక్యాలు తప్ప). మీ మెప్పు ఇంతగా పొందిన “ఆగ్రహి” లో ఖచ్చితంగా ప్రత్యేకత ఉండాలి!! నీలిమ గారికి అభినందనలు.చదవాలి చదవాలి అనుకుంటూ దాటేస్తున్న పుస్తకాన్ని వెంటనే చదవాలనే ఊరట కలిగించినందుకు శ్రీరాం గారికి కృతజ్ఞతలు!!
నీలిమ గారి అగ్రహి కి …నీలిమ గారికి అభినందనలు…💐
మీ విశ్లేషణకు నో కామెంట్ సార్ …ఎప్పటిలాగే 👌👌
మంచి పారదర్శకమైన విశ్లేషణను అందించారు.కవిత్వం లోని అంశాలను ప్రశంసిస్తూ తగుమాత్రంలో సూచనలు చేస్తూ భవిష్యత్ కాలానికి దిశా నిర్దేశం శ్రీరామ్ గారు. కవయిత్రి నీలిమకు అభినందనలు.
మంచి విశ్లేషణ అభినందనలు
The brevity article which depicts the essence of the poetry of her
మంచి విమర్శ చేస్తున్నారు. సూటిగా ఉన్నదున్నట్లు గా
Excellent review on what appears to be an excellent book.
Sensible review.
నాలాంటి సామాన్య పాఠకులకు అర్థమయే విధంగా భావంలో,వాక్యనిర్మాణంలో సంక్లిష్టత లేకుండా విమర్శావ్యాసాలు సరళంగా, సూటిగా ఉంటే బాగుంటది.
ఎన్నో మనువు స్మృతి? ఎప్పటి మనుస్మృతి? అదేమన్న ప్రస్తుతం అమలు పరుస్తున్న రాజ్యాంగమా?
పురుషాధిక్యతను విమర్శిస్తూనే తన పేరు పక్కన పురుషుని పేరా?
Super review on the book ‘Aagrahi.’