నిజాం కాలేజ్ మైదానంలో ‘ అమర వీరుల తల్లుల కడుపుకోత సభ ‘ మధ్యాహ్నం ఒంటిగంట దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందరో వక్తలు మహావేశంతో ప్రత్యేక తెలంగాణా సాధించడంకోసం 2001 లో కెసీఅర్ తో స్థాపించబడ్ద ‘ తెలంగాణ ప్రజా సమితి .. టి ఆర్ ఎస్ ‘ నాయకత్వంలో జరుగుతున్న మహోధృత అవిశ్రాంత ఉద్యమం నిరంతరం ఒక అగ్ని జ్వాలవలె రగులుతూ ప్రజలను నిత్య సమర శీలురను చేస్తున్నా ఇక్కడ ఈ తెలుగు నేలపై ఉన్న ఇతర రాజకీయ పార్టీలన్నీ .. ఇక్కడి ఇంటిదొంగ బానిస రాజకీయ నాయకుల కుతంత్రాలతో, ద్రోహ చర్యలతో ఎప్పటికప్పుడు ఎట్లా జన్మాష్టమి సమయంలో గ్రీస్ పూసిన స్థంభం పైకి ఎక్కలేక పదే పదే జారిపడ్తూ.. మళ్ళీ మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తున్న వైనాన్ని వక్తలందరూ సవివరంగా చెప్తున్నప్పుడు సుభద్ర హృదయం ద్రవించిపోయింది. ఆమెకు అర్థమైనంతవరకు బ్రిటిష్ వాడు మన దేశాన్ని ఆక్రమించి వందల ఏండ్లు కోట్లమంది భారత ప్రజలను బానిసలను చేసుకోడానికీ, దోచుకోడానికీ.. ఇప్పుడు ఈ మహోగ్ర తెలంగాణ మలిదశ ఉద్యమానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీరుగార్చడానికీ కారకులు ఇక్కడి మన ఇంటిదొంగలేననీ.. కోవర్ట్ లేననీ.. ఈశ్వరుడైనా పట్టలేని ఇంటిదొంగలతోనే ఈ పుణ్యభూమికి తరతాలుగా ద్రోహం జరుగుతోందనీ బోధపడ్తోంది.
మొగిలి చెప్పినట్టు ‘ చదువు ‘ వల్లనే ఈ తన చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణమూ, కుట్ర రాజకీయాల స్పృహా కలుగుతోంది తనకు. మనిషి తన చుట్టూ ఉన్న పరిసరాలనూ, పరిస్థితులనూ తెలుసుకోవడమే మనిషి వృద్ధి చెందడానికి ఉపకరించే ప్రధాన ఆయుధమనికూడా సుభద్ర గ్రహిస్తోంది ఇప్పుడిప్పుడే. ‘ చదువు ‘ ను ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధంగా తెలుసుకుంటోంది.
ఆమె ఆలోచనల్తో సుడిగాలిలో కాగితం ముక్కలా కొట్టుమిట్టాడ్తున్న ఆ క్షణంలోనే ఎవరో నిర్వాహకుడు మైక్ లో పిలిచాడు ” ఇప్పుడు అమరుల మాతృ మూర్తుల్లో ఒక వీరమాతగా శ్రీమతి సుభద్ర గారు రెండు నిముషాలు మాట్లాడ్తారు ” అని.
సుభద్ర కలవరపడింది.. అనుకోకుండా వచ్చిన ఆ పిలుపుకు. వెంటనే తనకు లభిస్తున్న ఆ ‘ వీరమాత ‘ గౌరవానికి కారకుడైన కొడుకు మొగిలి చటుక్కున కళ్లముందు కదిలి ఉప్పెనై ఎగసిన దుఃఖంతో ప్రకంపించిపోతూ భారంగా లేచి మైక్ ముందుకు వచ్చింది ఒక విషాదదేవతవలె.
తీరా తేరిపార చూస్తే విశాలమైన నిజాం కాలేజ్ మైదానం నిండా క్రిక్కిరిసిన జనం. అవి తెలంగాణ నేల నలు చెరగులా కేవలం ఉద్యమ జ్వాలలు ఎగసిపడ్తున్న రోజులు.
ఆమె మనసులో ఎప్పటినుండో మరుగుతున్న ప్రశ్న. . అనేకసార్లు పదే పదే ఎన్నో వేదికలమీద చెప్పిందే .. అమాయకంగా అడిగిందే.. మళ్ళీ అడుగాలనిపించిందామెకు.
” అయ్యా.. నాకు చదువు ఎక్కువ రాదు. నాదగ్గర ఒక తల్లి హృదయం తప్పితే ఇంకేమీ లేదు. బీదదాన్ని. రెక్కాడితేగాని డొక్కాడని ఒక మామూలు బీడీ కార్మికురాలిని. నా ఒక్కగా ఒక్క కొడుకు మొగిలి.. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు పంద్రా ఆగస్ట్ రోజున .. బి.టెక్ మూడవ సంవత్సరం చదువుతున్న నా బిడ్ద.. ఈ మన తెలంగాణ కోసం.. ఈ ఆంధ్ర ద్రోహుల నుండి ఈ మన తల్లి భూదేవిని విడుదల చేయడంకోసం .. మహా వేగంతో ఉరికొస్తున్న రైలుకు ఎదురుగా పరిగెత్తి.. ‘ జై తెలంగాణా ‘ అన్న నినాదాలతో క్షణాల్లో శరీరం ముక్కలుముక్కలై ఈ నేలతల్లికోసం ప్రాణాలను విడిచిండు. ఒట్టి మాంసపు ముద్దలుగా.. రక్తపు మడుగుగా మారి నాకు జీవితాంత కడుపుకోతను మిగిల్చిండు. అంతకుముందు రెండు రోజుల ముందే ఆదివారం ఇంటికొచ్చిన నా కొడుకు ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ ఇస్తనని టి.వి లల్ల చెప్పి మల్ల మాటతప్పితే.. ఢిల్లీల యాదిరెడ్ది ఆత్మహత్య చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించిన సంగతీ.. అది విని బెల్లంపల్లి శ్రీకాంత్ చెట్టుకు ఉరేసుకున్న విషయమూ.. అది చూచి ఇంకో ఇంజనీరింగ్ విద్యార్థి డి. శ్రీకాంత్ తనూ పురుగుల మందు తాగి చచ్చిపోవడమూ.. ఇవన్నీ చెప్పిండు పదే పదే. బాగ మనాది పడ్డడు బిడ్డ.
అప్పుడు నేనడిగిన వాణ్ణి ఈ చచ్చిపోతున్న వయసు పోరగాండ్లందరూ ఎవలురా.. వాళ్ళ కుటుంబాల సంగతేంటిదీ అని. నాకొడుకు చెప్పిండు.. ‘ అమ్మా.. వాళ్ళందరూ.. కటిక బీదోళ్ళమ్మా. ఒకని తండ్రి ఆటో నడుపుతడు. ఒకని తల్లి కూలికి పోతది. ఒకాయన తండ్రి హోటల్ వర్కర్.. అట్లా ‘ అని. అప్పుడు నేను నా కొడుకును ఒక ప్రశ్న అడిగిన.. అయ్యల్లారా.. అదే ప్రశ్నను ఈ సభల మీ అందర్నీ అడుగుతాన.. పెద్దలు.. బాగ చదువుకున్నోళ్ళు.. ఆలోచించగల మేధావులు.. జవాబు చెప్పుండ్లి.. ” అని కాస్సేపు ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఎక్కిక్కిపడి శోకిస్తూ.,
” నా కొడుకు చెప్పినట్టు ఇప్పటిదాకా తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన దాదాపు నాలుగు వందల డెబ్భై మంది .. అందరూ పేదలు.. దిక్కు మొక్కు లేనోళ్ళు.. చేతుల కష్టం చేసుకోని బతికేటోళ్ళు.. అందరూ వెనుకబడ్డ కులాలోళ్ళు, దళిత కుటుంబాలోళ్ళు.. గిరిజనులు.. అందరూ వీళ్లే. ఐతే.. ధనవంతులూ. పట్నాలల్ల ఉండేటోళ్ళూ.. పెద్ద కులాలలోళ్ళు.. ఒక్కరుకూడా అమరుడు కాలేదు.. ఎందుకు. వాళ్ళెవరికీ మన ప్రత్యేక తెలంగాణ మనకు కావాలని వీళ్లకున్నంత బలమైన కోరిక లేదా. ఉద్యమంపట్ల బాధ్యత లేదా. కేవలం ఈ బీద, వెనుకబడ్ద వర్గాలల్లోనే ఈ భూమి పట్ల ప్రేమ ఎందుకున్నది.. పల్లకి మోసేదీ.. ముం దుండి .. జెండా మోసేదీ ఈ బీదజనమేనా ఎప్పటికీ. ” అని ఇక మాట్లాడలేక గొంతు పెగలని ఏడుపుతో మైక్ ముందే కుప్పకూలిపోయింది సుభద్ర.
చుట్టూ వేలాది జనం, వేదికపైనున్న వక్తలూ ఆమె వేసిన కీలకమైన ప్రశ్నకు జవాబు వెదుక్కుంటున్నట్టు.,
అంతా గడ్డకట్టిన నిశ్శబ్దం.
కొద్దిసేపటి తర్వాత ఎవరో యువ కార్యకర్త ఒక నీళ్లు నిండిన గ్లాసుతో వచ్చి.. సుభద్రను పొదివిపట్టుకుని గుక్కెడు మంచినీళ్లు త్రాగించి.. మెల్లగా వెంట నడిపించుకుంటూ వెళ్తూంటే.. వేదికపైనున్న ఉద్యమకారులు గద్దర్, ఘంటా చక్రపాణి, వి.ప్రకాశ్, మంద కృష్ణ మాదిగ, దేవీప్రసాద్, శ్రీనివాస గౌడ్, కోదండరాం ఇంకెవరెవరో.. తదితరులందరూ ఆత్రుతగా ఆమె చుట్టూ చేరారు.
నిజమేకదా.. ఆమె చెప్పింది.. నిధులూ, నీళ్ళూ, నియామకాలలో దశాబ్దాలుగా వలసాంధ్రుల పాలనలో మోసపోతున్న బానిస తెలంగాణ నుండి స్వతంత్ర , అస్తిత్వంగల ప్రత్యేక జన , సామాజిక తెలంగాణ కేవలం నిమ్న, బడుగు, పేద , బహుజన, దళిత, ఆదివాసులవంటి అణగారిన వర్గాల ఆకాంక్షేనా.? ఇక్కడి ధనిక, సంపన్న వర్గాల్లో ఈ కోరిక బీద జనానికున్నంత బలంగా లేదా. గణాంకాలరీత్యా ఇప్పుడీ సుభద్ర చెప్పిందే నిజo కదా.
ఇంతవరకు వివిధ సందర్భాలలో, వివిధ ఉద్వేగభరిత కారణాలవల్ల ఆత్మహత్యలు చేసుకుని అమరులైన నాలుగువందల యాభై కి పైగా యువతీయువకుల్లో సంపన్న వర్గాలకు చెందిన వ్యక్తి ఒక్కరుకూడా లేరు.
లోతుగా ఆలోచించదగ్గ అంశమే ఇది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ ఆకాంక్ష ఏ వర్గానికి, ఏ ఆర్థిక స్థితిగతులు గల కుటుంబాలనుండి ఆకలికేకలై ఆవిర్భవిస్తోంది. ఎవరు ఉద్యమ పిలుపునందుకుని పుట్లు పుట్లుగా రోడ్ల పైకొచ్చి పాలకులు భయభ్రాంతులకు లోనయ్యేట్లు గర్జిస్తున్నారో.. వాళ్ళంతా ఈ నిమ్న కుల వర్గ తెగలకూ జాతులకూ చెందినవాళ్ళేకదా.
ఈ పీడిత వర్గాల యువజనులే ఎందుకు ఆత్మత్యాగాలకు పాల్పడుతున్నారు.?
కొద్దిసేపటికి సుభద్ర మామూలు మనిషై.. వేదికపై తన కుర్చీలో ఒద్దికగా సర్దుకుని కూర్చుంది. ఆమెది దుఃఖ విహ్వలత.
సుభద్ర ప్రక్కన వెనుక సీట్లలో దాదాపు మూడు వందలకు పైగా అమరుల తల్లులున్నారు శోకమూర్తులై. అందరిలోనూ మూర్తీభవించిన దుఃఖం.
ఆమె పూర్తిగా కోలుకునేసరికి వేదికపై గద్దర్ గారు.. తన ఉద్వేగపూరిత ఉద్యమ గీతం ‘ పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా ‘ ను పాడుతున్నాడు ఉద్యమ తన్మయత్మంతో.. ఉగ్రతతో.. ఊగిపోతూ.
అప్పటికే బాగా పొద్దుపోతోందన్న స్పృహతో కొందరు కార్యకర్తలు మైక్ లో ఒక్కో మాతృమూర్తికి పదివేల రూపాయల నగదూ, ఒక శాలువా ఇచ్చి ఆదుకుంటున్నట్టు ప్రకటించి.. కార్యకర్తలు ఐదారుగురు వేదిక వెనుకవైపు కూర్చున్న తల్లుల వరుసకొక్కరు చొప్పున వచ్చి ఒక కవరూ, శాలువా అందివ్వడం ప్రారంభించిండ్లు.
ఒక పావుగంటలో ఆ వితరణ ముగిసింది.
సందర్భం విషాదకరమైంది కాబట్టి.. నినాదాలు ఎక్కువగా లేవు.
అప్పుడే దేశపతి శ్రీనివాస్ వేదికపై నందిని సిద్ధారెడ్ది రాసిన మహోజ్జ్వల అమరులకు నివాళిగీతం పాడడం ప్రారంభించిండు ఎలుగెత్తి.. ఉచ్ఛై స్వరంతో.. వినేవాళ్ల రోమాలు నిక్కబొడుచుకునేట్టు.
సుభద్ర మెల్లగా, భారంగా లేచి నిలబడి వేదికను దిగుతూండగా.,
దేశపతి పాడుతున్న గీతం చరణాలు సూటిగా వచ్చి ఆమె గుండెల్లో నాటుకున్నాయి శూలాలవలె.
‘ జోహారులూ.. జోహారులూ
అమరులకూ జోహార్.. వీరులకూ జోహార్
…………………….
మావుళ్ళా రేవుళ్ళా
మట్టీ పొత్తిళ్ళల్లా
తొవ్వా పువ్వుల తీరూ
అమరులుంటారు.. అమరులుంటారు ‘
పాట ఒక నిర్మల వాయు వీచికలా.. కొనసాగుతోంది హృదయాలను కరిగిస్తూ.
ఎందుకో మొగిలి రూపు కళ్ళనిండా కదిలి ఏడుపు ముంచుకొస్తూండగా.. చెక్కమెట్లపైనుండి కిందికి దిగిందామె. చేతిలో కొడుకు ఫోటో.. నుదుట ఎర్రగా కుంకుమ బొట్టు.
నడుస్తోందామె బోసిపాదాలతో. చెప్పులు వేసుకోవడం మరిచిపోయింది. అరికాళ్ళను తాకుతున్న మట్టి .. సిధారెడ్డి చెప్పినట్టు.. ‘ మట్టి పొత్తిళ్ళ ‘ వలె అనిపిస్తూ.,
సుభద్ర కళ్లనిండా నీళ్ళు., ———( 1)
Add comment