మనిషి నిర్మలం, మనసు ఉద్యమం!

ఆయన దీక్షగా రాసే కార్డులు, ఇన్లాండ్ లెటర్లు రాస్తూ అనేకమంది యువ రచయితలు, ప్రసిద్ద రచయితలతో ఆయనకు స్నేహ సంబంధాలుండేవి అనేదానికి నిర్మలానందగారి నుండి మాకు కూడా వచ్చే కార్డులే తార్కాణం.

” జానపద కథలో వేణువూదుతూ పిల్లలను పోగేసుకొని సాగిపోయే మాంత్రికునివలె ఆయన సంపాదకుడుగా ‘ప్రజాసాహితి’ పత్రిక కోసం రచయితల సహకారాన్ని, పాఠకుల అభిమానాన్ని చాలా అపురూపంగా కూడగట్టారు.” అన్న బి. సూర్య సాగర్ గారి మాటలు అక్షరాలా నిజం.

ఎందుకంటే మా కుటుంబానికి పరిచయం అయిన దగ్గర నుండి అనే కంటే మా మనసుకు దగ్గర ఎలా దగ్గర అయ్యేరనేదే గుర్తుంచుకోవాల్సిన విషయం.

నా వివాహానంతరం భాగ్యనగరం వచ్చిన కొత్తలో వీర్రాజుగారు ఆఫీసు నుండి వస్తూ తనతోపాటూ వచ్చిన ఆయన్ని “సుభద్రా మీ విజయనగరం పక్కనే అనకాపల్లి ఈయనది . మనవాళ్ళే. బంధుత్వం కూడా వుంది పేరు ముప్పన మల్లేశ్వరరావు ప్రస్తుతం అయితే ఒరిస్సాలోని ఝార్సుగూడలో పని చేస్తున్నారు” అని పరిచయం చేసారు.

ముఖం అంతా నవ్వుతో నిండిన ఆయన్ని చూస్తూ నమస్కారం చేసాను. ఆయన చనువుగా ” మావూరు మీవూరు పక్కప్రక్కనే అమ్మాయ్ .మీ పెళ్ళికి కూడా వచ్చాను.గుర్తులేదేమో” అన్నారు.

ఎన్నాళ్ళుగానో తెలిసిన వారిలా ఆత్మీయంగా దగ్గరితనంతో మాట్లాడుతోన్న మల్లీశ్వరరావుగారిని చూస్తుంటే పరాయివారు అనిపించ లేదు. ఎక్కువగా చొచ్చుకుపోయే స్వభావం కాదు నాది.వీర్రాజుగారూ అంతే.కానీ మల్లేశ్వరరావుగారు ఇంట్లో మామనిషిలా మాట్లాడుతుంటే కొత్తగా అనిపించింది.

తర్వాత్తర్వాత ప్రజాసాహితీ సంపాదకుడుగానే కాక అనేక సాహిత్య కార్యక్రమాల సందర్భాలలో ఇటువైపు వచ్చినపుడు కలిసేవారు. అయితే నేను ఉమ్మడి కుటుంబబాధ్యతలలో కూరుకు పోయి శారీరకంగానే కాక మానసికంగా కుండా కొంత కుంగు బాటుకు లోనయ్యాను .అప్పట్లో నాకు మనశ్శాంతిని ఇచ్చేది పుస్తక పఠనమే .ఎప్పుడో కుదిరినప్పుడు రచనలు చేసేదాన్ని. ఒక పదేళ్ళ కాల పరిణామంతో మెల్ల మెల్లగా
రాస్తూ వచ్చిన కవితలు రెండు సంపుటాలుగా వచ్చాయి. కానీ ఎక్కువగా బయటకు రాకుండా నాలోకి నేను ముడుచుకు పోవటం వలన కావచ్చు కవయిత్రిగా పెద్దగా గుర్తింపురాలేదు అటువంటి సమయంలో నాకు ఒక పత్రిక అందులోనూ హిందీ పత్రిక పోష్టులో వచ్చింది. అందులో నా కవితని హిందీలోకి నిర్మలానంద వాత్సాయన్ గారు చేసిన అనువాద కవిత వుంది. ఎవరీ నిర్మలానంద వాత్సాయన్ అని ఆశ్చర్యపోయాను .వీర్రాజుగారు ఆఫీసునుండి వచ్చాక చూపించాను. అప్పుడు తెలిసింది ముప్పన మల్లేశ్వరావుగారే నిర్మలానంద వాత్సాయన్ అని.

శ్రీశ్రీ కవితలను హిందీలోకి అనువదించి వీర్రాజుగారితో ముఖాచిత్రం వేయించి శ్రీశ్రీ షష్ఠిపూర్తి మహాత్సవంలో కాళోజీచేత ఆవిష్కరింపజేసారు నిర్మలానంద. ఆ సందర్భంలో నిర్మలానందగారితో వీర్రాజుగారితో బాటూ మా కుటుంబానికీ స్నేహ సంబంధాలు మరింతగా పెరిగాయి.

సాహిత్యకారునిగా సుమారు చాలా కాలంపాటు అనేక ప్రాంతాల్లో సంచరించి ఆ ప్రాంత సాహితీవేత్తలతో సాహితీ సంబంధాలు నెలకొల్పుకున్న నిర్మలానంద, జనసాహితి పరిచయంతో 1980 నుండి స్పష్టమైన దిశని నిర్దేశించుకున్నారు. సంస్థలలో చేరితే సృజనాత్మకత తగ్గి ,ఒక పరిధిలో రాయాల్సి వస్తుంది. ఇతర సాహిత్య సృజనలకు అవకాశం వుండదు అనే దానికి జవాబుగా నిర్మలానంద ప్రజాసాహితితో పాటూ సాగించిన తదనంతర మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితం నిలిచిందనే చెప్పొచ్చు.తనకు నచ్చిన అనువాద ప్రక్రియ కొనసాగిస్తూనే విలువైన ప్రజా సాహితి ప్రత్యేక సంచికలు వెలువరించారు. అనంతరం కుందుర్తిగారి కవితలను “మేరే బినా” పేరుతో అనువదించారు – 1990లో ప్రజాసాహితి సంపాదక బాధ్యతలు వహించిన తర్వాత అనేక సందర్భాలలో వీర్రాజుగారితో సంప్రదింపులు జరిపేవారు. నిర్మలానంద గారికి జనసాహితి, ప్రజాసాహితులతో విడదీయలేని అనుబంధం కారణానే వీర్రాజుగారూ, నేనూ కూడా జనసాహితికి దగ్గరయ్యాము.

మా కుటుంబానికి గానీ,నిర్మలానంద గారికి గానీ మధ్య సంబంధం సాహిత్య బంధమే కానీ కులానికి సంబంధించినది కాదు.కలిసి మాట్లాడుకొనే సమయాల్లోనూ సాహిత్య సంభాషణలే తప్ప బంధుత్వానికి చెందినవేమీ వుండేవి కాదు.

మేము తర్వాత్తర్వాత ఆయన అసలు పేరు కూడా తలచుకోలేదు. నిర్మలానందగానే మనసులో నిలిచి పోయారు.

1990 తర్వాత జనసాహితికి పూర్తికాలం సభ్యుడిగా, ప్రజాసాహితి సంపాదకత్వం బాధ్యతల తో వాటి తరపున జరిగే ప్రతీ సమావేశానికి మా దంపతులకు ఆహ్వానం అందేది. అయితే నాకున్న ఉద్యోగ, కుటుంబ బాధ్యతల వలన నేను ఎక్కువగా హాజరు కాలేక పోయేదాన్ని.

కానీ జనసాహితి సభలకు వెళ్ళినప్పుడల్లా నిర్మలానందగారు సభలకు తరుచూ రావటానికి ప్రయత్నించమని ఎంతగానో ప్రోత్సహించే వారు.అక్కడకి వచ్చిన చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆయన కూడా పసిపిల్లాడైపోవటం చూస్తే అబ్బురమనిపించేది.

నిర్మలానందకు జనసాహితితో గల అనుబంధాన్ని మాకు తెలియచేయటమే కాకుండా మా దంపతుల చుట్టూ కూడా పెనవేసి జనసాహితితో మమేకంచేసారు..అయితే వీర్రాజుగారికి ఏ సంస్థలోను ప్రత్యక్ష సభ్యత్వం ఉండకూడదనే నిబంధనను తెలిసినందున మమ్మల్ని వత్తిడి చేయలేదు.కానీ నిర్మలానందగారి కారణం వలనే మేము ఆ నాటినుండి నేటివరకూ జనసాహితి,ప్రజాసాహితులకు పరోక్ష సభ్యులుగానే వున్నా ఆత్మీయంగా కొనసాగుతున్నాము.ప్రతి సందర్భంలోనూ వారితోనే ప్రయాణిస్తున్నాము.

ఆయన దీక్షగా రాసే కార్డులు, ఇన్లాండ్ లెటర్లు రాస్తూ అనేకమంది యువ రచయితలు, ప్రసిద్ద రచయితలతో ఆయనకు స్నేహ సంబంధాలుండేవి అనేదానికి నిర్మలానందగారి నుండి మాకు కూడా వచ్చే కార్డులే తార్కాణం.

1999 లో నా ” ఒప్పులకుప్ప”కవితా సంపుటి పుస్తకావిష్కరణ నిర్మలానందగారి అధ్యక్షతన జరిగింది.అప్పటినుండి ఆయన నా కవితల్ని చాలా వాటిని హిందీలోకి అనువదించారు. మా కవితల హిందీ అనువాదాలు ప్రచురితం అయిన పత్రికలు పోస్ట్ లో పంపేవారు.ఒక్కోసారి ఆ కవిత ప్రచురించిన పత్రికలే కాక అనువాదం చేసిన స్క్రిప్ట్ కాగితాలూ పంపేవారు. హైదరాబాదు వచ్చినపుడల్లా కలిసేవారు కవితల్నీ ప్రశంసించేవారు.

నేను రిటైర్ అయ్యాక నేనూ, వీర్రాజుగారూ, కలసి ప్రతి ఏడాది ఎవరిదైనా ఒక పుస్తకం మేమే ప్రచురించి ఆ కాపీలను ఆ రచయితకి అందజేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఆవిధంగా ఒక ఏడాది నిర్మలానందగారు తెలుగు లోకి అనువదించిన వివిధ భారతీయకవుల కవితలను “కలాలకవాతు (కవితాభారతీయం)” పేరిట పుస్తకంగా ప్రచురించాము.

వీర్రాజుగారి కవితలను హిందీలోకి అనువదించి “సాహిత్య- వివిధ సందర్భ్” పేరుతో 2010లో పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు నిర్మలానంద.

నేను రాసిన ‘యుద్ధం ఒక గుండె కోత’ దీర్ఘ కావ్యాన్ని చదివాక ఇది తప్పక అన్ని భాషల లోకి రావాల్సి
వుంది అని కలిసినపుడు పదేపదే చెప్పటమే కాక అనేక బాధ్యతల నడుమ వెంటనే చేయలేక పోయినా ఎట్టకేలకు వారే ” యుద్ధ్ ఏక్ దిల్ కి వ్యధ” పేరుతో అనువాదం చేసారు.

నిరంతరం పనిరాక్షసుడిలా సాహిత్య సృజన చేసే నిర్మలానందగారు మరి రాత్రంతా నిద్రపోకుండా అనువాద పనిలో నిమగ్నమయ్యే వారో ఏమో తెలీదు. తెల్లవారు జామునే ఫోన్ చేసి ఆ పుస్తకం లో తనకు వచ్చిన నందేహాలను తీర్చుకొనే వారు.అయితే ‘ యుద్ధ్ ఏక్ దిల్ కి వ్యథ’ పుస్తకం ప్రచురణ సమస్య అయ్యింది.వీర్రాజుగారి హిందీకవితలు నిర్మలానంద గారు దక్షిణ హిందీ ప్రచారసభ వారిని కొన్ని కాపీలు వారు కొనేలా సంప్రదించి ప్రచురించారు.నా పుస్తకం అనువాదం పూర్తిచేసే నాటికి వయస్సు రీత్యా ప్రచురణ చేయగలిగే స్థితిలో లేరు.ఎవరిని సంప్రదించాలో తెలియక మేము కొంతకాలం అశ్రద్ద చేసాము.

ఈ లోపున నిర్మలానందగారి శ్రీమతి రుక్మిణిగారు చనిపోవటం ఆయన తట్టుకోలేక పోయారు. ఆ ప్రభావం క్రమక్రమంగా ఆయన ఆరోగ్యంపై కూడా పడింది.

ఒకసారి ప్రముఖ హిందీ అనువాదకురాలు,కొడవంటిగంటి కుటుంబరావుగారి అమ్మాయి శాంతసుందరిగారు నా దీర్ఘ కవిత గురించి ఫోన్ చేసారు.అప్పుడు ఆమెతో ‘నిర్మలానంద గారు హిందీ లోకి అనువదించారనీ, ఎక్కడ ప్రచురణకి ఇవ్వాలో తెలియక ప్రచురించలేదని’ చెప్పాను.అప్పుడు ఆవిడే ‘యుద్ధ్ ఏక్ దిల్ కి వ్యధ’ గ్రంథానికి ఆత్మీయంగా ముందుమాట రాయటమే కాకుండా మిళిందిప్రకాశన్ వారితో మాట్లాడి ప్రచురణకు నిర్ణయించారు.ఆ విధంగా 2017లో నా దీర్ఘ కవిత హిందీ అనువాదగ్రంథం వెలువడింది.కానీ అప్పటికే నిర్మలానందగారు కొంత అనారోగ్యం పాలయ్యే వున్నారు.

వీర్రాజుగారి పెయింటింగ్స్ ని హైదరాబాద్ కళాభవన్ లోనే కాక, విజయవాడలో సైతం ప్రదర్శన
ఏర్పాటు చేయటంలో జనసాహితి మాకు పూర్తి సహకారం అందించటం వెనుక నిర్మలానందగారి స్నేహాభిమానాలు కారణం అని వీర్రాజుగారు తరుచూ అనేవారు.

వయసు సహకరించక పోయినా సరే జనసాహితి సమావేశాలకు శ్రద్ధగా రావటమే కాకుండా మమ్మల్ని అందర్నీ ప్రేమగా పలకరించి ప్రోత్సహిస్తుండే వారు.

“ఒక పువ్వు వికసించడానికి తోడ్పడినంత కాలం నేను ఎరువుగా ఉపయోగపడడానికి కూడా సంతోషంగా సిద్ధమవుతాను” అన్న చైనా రచయిత లూషన్ మాటలకు నిలువెత్తు నిదర్శనం నిర్మలానంద.
అందుకే నిర్మలానందని తెలుగు వారి లూషన్ అని కొత్తపల్లి రవిబాబుగారు ఆత్మీయంగా అంటారు
సాహిత్యోద్యమ కార్యకర్తగా భౌతికంగా శరీరం అనుకూలించకపోయినా,గ్రంథం పఠనం నిరంతరం చేస్తూ చివరి శ్వాసదాకా ఉద్యమ సాహిత్య కృషి సలుపుతూనే భౌతికంగా మనకు దూరమయ్యారు.కానీ ఆయన చేసిన నిర్విరామ సాహితీ సృజన ,నిబద్ధత మనల్ని కార్యరంగంలోకి వెళ్ళటానికి నిరంతరం ఉత్ప్రేరకంగా పని చేస్తూనేవుంటాయి.

మా కుటుంబానికి ఆత్మీయులైన నిర్మలానంద వాత్సాయన్ గారి 90 వ జయంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను.

*

చిత్రం: శీలా సుభద్రాదేవి గారి అయిదవ కవితాసంపుటి ‘ ఒప్పులకుప్ప'(1999) ఆవిష్కరణ సమావేశంలో అధ్యక్షుడిగా నిర్మలానంద గారు

శీలా సుభద్రాదేవి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు