జాగృత స్వప్నం కవర్ పేజీ నుంచే మన్నొక స్వప్నావస్థ లోకి తీసుకెళ్ళి పోతుంది. ఆ తర్వాత పతంజలి శాస్త్రి గారు, ఎలనాగ గారి రివ్యూస్ చదివాక కొద్దిగా భయంవేసింది, ఈ కథలను నేను అర్థం చేసుకోగలిగినంత అనుభవం, తెలివి నాకు ఉందా అని. ఒక్కొక్క కథ చదువుతూ పోతుంటే కొంత అర్థం అయ్యీ కాక మళ్లీ మళ్లీ ముందుకి వెనక్కి వెళుతూ, పర్వాలేదు అర్థం చేసుకున్నా అని అనుకున్నాను. ఏ ఒక్క వాక్యం కూడా అనవసరమైనదిగా లేకుండా ముఖ్యపాత్రల జీవితాల్లోని క్లిష్ట పరిస్థితుల్లో ప్రశ్నలకి, సమాధానాలకి, పాఠకుల ప్రశ్నలకి కూడా అందులోనే సమాధానాలు వెతుక్కోవచ్చు, వెతుక్కోవాలి. ప్రతి వాక్యం ఏదో ఒక క్లూ, ఏదో ఒక దారి చూపే వాక్యమే. ముగింపు ఏమిటి ఎందుకు అలా ఉంది అన్న సందేహం కలిగితే మళ్లీ ఒకసారి చదివి మీ పఠనానుభవాన్ని పరీక్షించుకోవాలి.
జాగృత స్వప్నం లోని కథలన్నీ ముఖ్యంగా మనిషి చేయాల్సిన ప్రకృతి పరిరక్షణ గురించి, మనిషి యొక్క ప్రవృత్తి ప్రక్షాళన గురించి ఉంటాయి. ఇంకొకటి సునిశితంగా చూస్తే – అర్థమయ్యేది పాత్రలన్నిటికీ, ముఖ్యంగా ముఖ్య పాత్రలకి తమ లోపలికి చూసుకునే అలవాటు. దానికోసం కలల మీద, వైల్డ్ ఇమాజినేషన్ మీద డిపెండ్ అవుతూ సమాధానాలు వెతుక్కుని కొంతమంది మనుషులతో, ప్రకృతితో సంబంధం పెంచుకుంటూ మరికొంత మంది మనుషులతో తుంచుకుంటూ సాగుతాయి. పాత్రలకే క్లారిటీ లేని mystic, miraculous, surrealistic experiences అన్ని కథల్లోనే చూడొచ్చు. ఇందులో నిజానికి ప్రతీకాత్మకంగా వాడిన జంతువులు ఏవీ చెడ్డవి కావు గ్రే ఉల్ఫ్ తో సహా. అడవిలో ఉండేవన్నీ అడవి రక్షణ కోసమే. అందుకే మనుషులంతా అడవిలోకి పారిపోతూ ఉంటారు. అడవిలోకి పారిపోయి మనిషిలాగ అయితే బతికి బయటపడలేడు. ఎందుకంటే మనిషి తన సహజమైన స్వార్థపూరితమైన ఆలోచనా ధోరణితో సమస్త జీవజాలాన్ని, భూమండలాన్ని నాశనం చేయగల శక్తి ఉన్నవాడు. కాబట్టి అడవిలోకి వెళ్లిపోయినప్పుడు అతనికి నాలుగు కాళ్లు వస్తాయి వీపు మీద జుట్టు మొలుస్తుంది. వేగంగా పరిగెడుతూ జంతువుల్లాగా అడవిలోకి దూసుకుపోతాడు.
సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ ప్రకారం మనుషులకు వచ్చే కలలు conscious and subconscious mind కి ఒక Bridge లాంటివి. This subconscious mind guides conscious mind through dreams partly in sleep and partly in awaken states of mind. According to him, subconscious intelligence does not pertain to just an individual based on his experiences alone, but pertains to the collective subconscious intelligence of the whole humanity in the process of its evolution. A person uses this collective subconscious intelligence to solve the problems in his conscious life to be a better version of himself or herself. ఈ సూత్రం అంచున సుధా గారు తన కథలను తాడు మీద కర్ర పట్టుకుని నడిచినంత జాగ్రత్తగా, ఒడుపుగా నడిపించారు. ఈ భూమి మీద మనుషులందరి ఎమోషన్స్ కి, బాధలకి, భయాలకి, ఇన్ సెక్యూరిటీస్ కి ఎటువంటి తేడాలు ఉండవని మనుషులందరి ప్రవర్తన ఒకే రకమైన basic instincts and vulnerabilities మీదే ఆధారపడి ఉంటుందిని, విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల స్నేహాలు విదేశీయులతో, అక్కడి నేటివ్స్ తోటి ఇంటరాక్షన్స్ ద్వారా మనుషులందరి మూల జీవన సూత్రాలు ఒకటే అని చెప్పినట్టు అనిపిస్తుంది.
జరిగిపోయిన గతం, మరీ ముఖ్యంగా చిన్నతనం ఓ కల. భవిష్యత్తు మనం ఈరోజు కనే కల. నిన్నా, నేడూ, రేపూ అంతా కలే అయినపుడు, reality అనేది ఈ ఒక్క క్షణకాలం మాత్రమే కదా. ఆ ఒక్క క్షణంకాలపు బ్రతుకులో ఎన్ని ప్రశ్నలు, సందేహాలు, సందిగ్ధాలో కదా మనిషికి. ఇంకో విషయం గమనిస్తే కథలన్నిటిలో చిన్నతనం ప్రతి ముఖ్య పాత్రకి గుర్తొస్తుంది చిన్నతనంలో జరిగిన ఏదో ఒక విషయం ప్రస్తుతానికి ముడిపడి ఉంటుంది. వర్తమానంలో కనిపించే ఎదురయ్యే సంఘటనలకు వ్యక్తులకు ముడిపడి ఉంటుంది. ఒక జంతువు ఒక మనిషిని ప్రేమించిందంటే ఆ మనిషిని సుధా గారి ముఖ్యపాత్ర నమ్ముతుంది, ప్రేమిస్తుంది. నిజానికి ప్రేమా, ద్వేషం ఇవన్నీ మన ఇమాజినేషన్ నుంచి పుట్టినవే. మనం ఏర్పరచుకున్న మన ఇమేజ్ కి దగ్గరగా ఉండే వాళ్ళని మనం ప్రేమిస్తాం ఇష్టపడతాం ఆ ఇమేజ్కి దూరంగా ఉండే వాళ్లని, ఎంత మాత్రం సరిపడని వాళ్ళని మనం ద్వేషిస్తాం, దూరం పెడతాం, దూరంగా పారిపోతాం. ప్రేమ ద్వేషంగా, ద్వేషం ప్రేమగా మారాలంటే, మనం మన లోపలి ఇమేజిని సరి చేసుకోవాలి కొన్ని సార్లు. దీనికీ అతీతులైన మనుషుల్ని వాళ్ల పాటికి వాళ్లను వదిలివేయడమే. దీన్ని ముఖ్యంగా అన్ని కథల్లోనూ గమనించవచ్చు
అలాగే చాలా కథల్లో రకరకాల మానవ ఉద్వేగాల్ని స్పృశిస్తూ కథ అల్లుతారు సుధాగారు. కజిక కథలో యాక్సిడెంటల్ గా ఒక గ్రేవుల్ఫ్ మీంచి కారు వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ గాయపడ్డ ఆ ఉల్ఫ్ వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతుంది. ఆ చూపుల్లో కనిపించే, గాయం తాలూకా బాధ, నిస్సహాయత ఒకపక్క, ఎంత గాయపడిందోనన్న జాలి ఇంకోపక్క ఆమెను వెంటాడుతుందంటే, ఆ గిల్టనే ఇమోషన్ తోటి ఇదమిత్థంగా ఆ కారణం వల్ల ఇంత అలజడి అని తెలియక లోపల నలిగిపోతూ సతమవుతూంటుంది. అలాంటి సందర్భంలోనే తారసపడ్డ హోటల్ సర్వర్ చూపు ఎందుకో ఆ గ్రే ఉల్ఫ్ ని గుర్తుకు తెచ్చి ఏదో తెలియని కోపం. ఆ గిల్టు, కోపంతోటే ఆ వెయిటర్ ని కూడా అనవసరంగా తిడుతుంది. అప్పుడు అతను చూసిన చూపు అంతే నిస్సహాయంగా, గాయపడ్డ ఆ గ్రే ఉల్ఫ్ చూపులాగా అనిపిస్తుంది. ఇటువంటి గిల్టు మరింత బాధిస్తుంది, specially when the harm done is totally unintentional. అయితే ఆమె ఆ గిల్టు నుంచి ఎలా బయటపడుతుంది అంటే అదొక వాస్తవం లాంటి కలలో. ఆ కలలో ముగ్గురూ కలిసి ఆడుకుంటారు, నవ్వుకుంటారు. తర్వాత ఆమెను ఆమె ఇంటి దగ్గర దింపి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె లిబరేట్ అవుతుంది ఆ గిల్టు నుంచి. ఆమె క్షమించబడింది. క్షమ ఆ ముగ్గురినీ బాధ నుంచీ విముక్తి చేసింది. ఇటువంటి సున్నితమైన బాధల్ని, బెంగల్ని కధ రూపంలో ఇంత పకడ్బందీగా ఇంత క్లుప్తంగా హ్యాండిల్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు.
“గోల్డెన్ టస్క్” కథలో ముఖ్యపాత్ర గురించిన వివరణ ఏమీ ఉండదు కానీ అతనికి జీవితంలో సంతోషాన్ని వెతుక్కునే క్రమంలో అవలంబించిన మార్గాల వల్లే వెన్నాడే అశాంతి కలిగిందేమో అని అర్థమవుతుంది. జీవితంలో సంతోషం దుఃఖం, రెండు కావలసినవే. ఏదో ఒకటే కావాలనుకునే ఛాయిస్ మనుషులకి లేదు. దుఃఖాన్ని సొంతం చేసుకున్నప్పుడే శాశ్వతమైన సంతోషం. అతన్ని హత్తుకుంది ఈ రియలైజేషన్.
“విభాజకం” కథలో రవణది కండిష్నల్ ప్రేమ. ఆమె ఆశించిన ప్రయోజకత్వం పొందే ప్రయత్నమే చేయని అతన్ని ఆమె ద్వేషిస్తుంది. అయినా అతను ఆమె ప్రేమని ద్వేషాన్ని రెండిటిని ప్రేమిస్తాడు. అందుకే ఆమె వెళ్ళిపోతాను అంటే ఆపడు. ఈ కథలో మొదటి పేరాల్లోనే క్లూ ఉంటుంది కాకి ముక్కునుండి జారిపడ్డ మాంసం ముక్కను కింద నుంచి ఎలక ఒకటి ఎత్తుకుపోతుంది. ఆ ఎలుక ఎవరో చివర్లో మీకర్థం అవుతుంది.
“మూడు పిల్లులు” కథలో శాండ్రా యిల్లు లీల పేరు మీదికి వచ్చిన తర్వాత మచ్చలపిల్లి ఎందుకు వెళ్ళిపోతుంది, మళ్లీ తిరిగి ఎందుకు వస్తుంది, లీలలో పుట్టిన దురాశ శాండ్రా మనవడికి ఎలా తెలుస్తుంది , మూడో పిల్లి ఎవరు తెలుసుకోవాలంటే చదవాల్సిందే.
“బ్లూ ఫిన్” కథ లో ఒక వాక్యం నన్ను చాలా ఆకర్షించింది. “ఒక చోట స్థిరంగా ఉండడం మనుషుల కోసం దుఃఖించడం ప్రేమించడం ఇదంతా నాకు నచ్చదు. మనుషులు వాళ్ళ జీవితాల్లో ఖాళీతనాన్ని మోసుకోలేక పూరించుకోలేక దాన్ని ఈ ప్రేమలతో దుఃఖాలతో, బాధలతో నింపుకుంటారు అనిపిస్తుంది” అని ముఖ్యపాత్ర అంటుంది. ఆ పెనుగులాటే కదా ఈ కథలన్నిటికీ మూలం.
“ఇమేజెస్ ఆఫ్ సబు” కథలో డబ్బు మీద ప్రేమ లేని హ్యరి కి ఆ వెర్రి దాహం ఎందుకు. ఏమో మరి, విడీవిడని పజిల్ అంతే. “ఫ్రాంక్ ది పెయింటర్లో” అతని చుట్టూ తిరిగే పిల్లి ‘జె’ ఎవరు? అలాగే అతను ఆ పెయింటింగ్ ఫినిష్ చేస్తాడా అనే ప్రశ్న తోటే కథ ముగించారు. ఎందుకు అతను సగం జంతువు సగం మనిషిగా మారి కనపడకుండా పోయాడు? “పెయింటింగ్ లో పెయింటర్ ఉండడా అని ఎందుకు ఆమె ఫ్రాంక్ ని అడుగుతుంది” ఆలోచించండి.
ఇంకా ఎంతో చెప్పాలని ఉంది అన్ని కథల గురించి, కానీ అంతా చెప్పేస్తే మీకు సస్పెన్స్ ఉండదని వదిలేస్తున్నాను.
సాధారణ పదజాలంతో అసాధారణమైన అభివ్యక్తి, కవిత్వం అయినా కథలైనా సుధాగారి స్వంతం. ఆమె కవిత్వం చదువుతుంటే ఒక సాంత్వన, కథలు చదువుతుంటే ఎంతో జీవితానుభవాన్ని పోగేసుకుంటున్న భావన. ఎంత తక్కువ చెబితే అంత ఎక్కువ, ఎంత చెప్పలేకపోయిన నిస్సహాయత కనిపిస్తే, అనిపిస్తే, అంత ఎక్కువ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ కథలన్నీ పాఠకుల మేధస్సుకి పరీక్షలే ఒకటి అరా తప్పించి. ఎందుకో మరి పాఠకులపై జాలిపడి వదిలేసినవే అనుకుంటా. మిగిలిన కథలన్నీ కూడా మళ్లీ మళ్లీ వెనక్కి వెళ్లి చదువుకుంటేనే కానీ ఎంతో ఆలోచిస్తేనే గాని, మనం ఆమె ఆలోచనల పాదరక్షల్లో మన ఆలోచనల పాదాల్ని జార విడిచి మాత్రమే ఈ ” జాగ్రత్త స్వప్న జగతి” లోకి అడుగేయగలం. ఆమెది ఖచ్చితంగా సాహసమే.
కలలోకి చనిపోయిన వారు వచ్చినట్టే నిజ జీవితంలో కూడా చనిపోయిన వారు వస్తారు. వారు బ్రతికున్నట్టుగా ఉంటూ ప్రేమించిన వారి కోసం అవసరమైనవన్నీ చేస్తారు. ఏమో మనకి అత్యవసరమైనప్పుడు ఎక్కడో అక్కడి నుంచి ఊడిపడే మనుషులు, తృటిలో తప్పించుకున్న కొన్ని గండాలు, మనం “serendipity” అనుకున్న కొన్ని అనుభవాలు అలాంటివేనేమో.
ఈ కథలు మొదలు పెడితే వదిలిపెట్టలేరు అలాగే పూర్తి చేశాక అవి మిమ్మల్ని వదిలిపెట్టవు. ఎన్నిసార్లు చదివినా ఏదో కొత్తదనం ప్రతి వాక్యం, ప్రతి మొదలు, ప్రతి అంతం కథకి సంబంధించిన అంశాన్ని, ముఖ్యపాత్రల మారిన అవగాహనని పాఠకులకు చేరవేసే ఒక తెలివైన ఎత్తు. అర్థవంతంగానో, అర్ధాంతరంగానో కథ ముగించి పాఠకులను పజిల్ చేయడం ఒక ఎత్తు అయితే మేధోపరంగా కథని అల్లి పాఠకుల మేధస్సుకి పరీక్ష పెట్టడం, పదును పెట్టడం “a totally different ball game altogether”.
ఈ కథలతో సుధా గారు కథా సాహిత్యాన్ని ఎంత ఎత్తున నిలబెట్టారంటే అది అందుకోవడం చాలా మందికి ఒక జాగృత స్వప్నమేమో.
*
Add comment